29, డిసెంబర్ 2018, శనివారం

షష్టి పూర్తులు , సహస్ర చంద్ర దర్శనశాంతి హోమాలు అవసరమా? ఆడంబరాలా ?





షష్టి పూర్తులు , సహస్ర చంద్రదర్శన శాంతిహోమాలు అవసరాలా ? ఆడంబరాలా ? 

   ప్రపంచ దేశాలు మన దేశానికి మోకరిల్లేది మన ఆర్ధిక సంపదను చూచి కాదు , ఆధ్యాత్మిక సంపద చూచే . అది మనకు వేద ప్రమాణమైనది. అనంతమైనది. మానవుని ఆనంద  జీవనమునకు రెండు మార్గములున్నవి.             1. సంసార రహితుడై ముని వృత్తి తో మోక్షమును వెదకుట.(ఇది అలౌకికా నందము ) 2. సంసారాపేక్షతో కన్యను వెదకి పాణిగ్రహణము చేసికొని సత్సంతానముతో ఆరారోగ్యభోగ భాగ్యములతోబాటు కష్టనష్టములను అనారోగ్యముల ననుభవించుచు పరమాత్ముని తలచుకొను జీవనము. (ఇదిలౌకికానందము) మనము ఆరోగ్య భోగభాగ్యాలతో నుండవలెనన్న తప్పక దైవబలము మనకు కావలసినదే. టానిక్కులు త్రాగి , వ్యాయామాలు చేస్తే సరిపోయేదానికి ఆ కనపడని దేవుని తో పనే ముంది ? అని అడిగే వారికి  నా శతకోటి నమస్సులు. ఈ చర్చ ప్రస్తుతమప్రస్తుతము. 
     కొందఱు మన సంప్రదాయాలను తక్కువగా చూచి హేళన చేస్తూ షష్టి పూర్తి, సహస్ర చంద్రదర్శన శాంతి హోమము మొదలగు క్రతువులు ఆడంబరమనే అనవచ్చును. కానీ నమ్మిన వారికి  నమ్మినంత మహాదేవ. వాని వలన తప్పక ప్రయోజనము కలదని నా విశ్వాసము . శాస్త్ర వచనము . మనిషి పుట్టినదాది మరణము వరకు తెలిసో , తెలియకో పాపపుణ్యములు చేస్తాడు . పుణ్య ఫలముగా సుఖములు , పాపఫలముగా కష్టముల ననుభవిస్తాడు . పుట్టిన సంవత్సరము  నుండి మరల అదే  సంవత్సరము వరకు 59 యేండ్లు నిండి 60 కి వస్తాడు . అప్పటికి జీవితాన  ఒక ఆవృత్తి పూర్తి  అవుతుంది.  దీనినే  ఉగ్రరథ శాంతి , లేక షష్టి పూర్తి  మహోత్సవమంటారు.  ఈ సమయంలోనే భగవంతునకు కృతఙ్ఞతలు చెప్పి మన పాపముల పరిహారము కొరకు చేసికొను విన్నపములే ఈ శాంతిహోమములు . క్రతువులు. ఈ క్రతువులే చేయనవసరం లేదు. ఏ అనాథ  శరణాలయాలకో , పేదవారిదగ్గర కో  కూడా వెళ్లి వారికి తగిన సహాయమందించినా  పాప పరిహారమే అవుతుంది. కాకుంటే బంధువర్గమంతా కలసియుండుటకు ఇదొక మార్గము.
    ఏకాదశ రుద్రులందరికి తెలిసిన వారే. వీరుకాక రుద్రులు శతాధికముగా ఉన్నారు. రుద్రుడు లయకారుడు. మన పాపములను లయము చేయుమని రుద్రుని కోరుతూ కార్తిక మాసములో ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేస్తాము.  రుద్రులలో కొందరు శాంత, మరి కొందఱు ఉగ్ర స్వభావాలతో ఉందురట. అట్టి వాడే ఉగ్రరథుడను రుద్రుడు. 60. ఏండ్లు నిండిన వారికి ప్రాణాపాయమో , అనారోగ్యమో కలిగించునట .దానికి పరిహారము గా  ఉగ్రరథ  శాంతి అవసరము. అట్లే 70. యేండ్లు నిండిన వారికి భీమరథ శాంతి , 78 ఏండ్లకు విజయరథ శాంతి , 83.యేండ్ల 4 నెలలకు .( 1000  పూర్ణిమలు ) సహస్ర చంద్ర దర్శనమహోత్సవము, 100 సంవత్సరములు నిండిన వారికి పూర్ణ శతాభిషేకము చేయించుకోవాలి. ఈ క్రతువులను కేవలము సంతామే చేయవలసిన అవసరము లేదని, స్వయముగా ఆ దంపతులే చేసికొన వచ్చునని విజ్ఞులు తెలియజేసారు. 
    మానవుడు  దైనందిన కార్యక్రమములలో మునిగి ఆలోచనలో ఉండి ఆచరించలేక పోయిన , దాన ధర్మాది కార్యములు , క్రతువులు ఈ సమయము లో బంధువుల ఆప్యాయతాను రాగముల మధ్యన చేసికొనిన పెద్దల , వేద విదుల, పండితుల దీవనలు లభించి ఆ దంపతులకు మెరుగైన ఆయురారోగ్యములు , భోగ భాగ్యములు చేకూరును. ఆధ్యాత్మిక భావనలు పెరిగి దైవకృప అధికమగును.  చరమాంకమున ఏ ప్రాణికైనను కావలసినది అదేకదా . 
      శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం ... అనగా శరీరమే అన్ని ధర్మ కార్యముల సాధనకు మూలమైనది . దానిని కాపాడుకొనుటకు జాగ్రత్తగా ఔషధ సేవ చేస్తూ తగిన వ్యాయామములు చేయవచ్చు ననుకొనిన, అవి మానవ ప్రయత్నాలే . ప్రతి మానవ ప్రయత్నానికి తప్పక దైవ సంకల్పం కావాలి. దైవిక కార్యక్రమములన్ని ఒక మహోన్నత లక్ష్యముతో ఏర్పాటు చేసినవే నిస్సందేహముగా. 
   ది . 27.12 2018. న నాకత్యంత ప్రియతమాగ్రజుడు , సాహితీప్రియుడు అయిన శ్రీయుతులు పొన్నెకంటి భవానీపతి రావు గారి సహస్ర చంద్ర దర్శన శాంతి హోమమునకు వెళ్ళుట జరిగినది . 84 యేండ్ల వయసులో కూడ ఏంతో  ఓపిక , సహనము, భక్తి భావనాపూరితమైన చిరునవ్వుతో అపర భవానీపతి లాగానే కనిపించాడు. ఇక మా వదిన గారు హనుమాయమ్మగారు. అపర సాహితీమూర్తి , అవ్యాజ ప్రేమమయి, బంధుప్రీతి కల యిల్లాలు. వారి అన్యోన్య జీవన విధానము ఆదర్శప్రాయము. ఆమె పలకరింపులోనే ప్రేమానురాగాలు  తొంగిచూస్తాయి . వారి ప్రథమ పుత్రుడే చిరంజీవి శివ ప్రసాద్. ఆతని సదాలోచనను ఆతని భార్య ,  సోదర సోదరీమణులు, కుటుంబ సభ్యులందరు కలసి ఆమోదించి  సహస్ర రజత కమలములతో వారికి పాద పూజ( రజతములే కాక మామూలు వానితో చేసినను ) చేయుట ఆ దంపతుల పూర్వజన్మ సుకృత ఫలమో, తలిదండ్రులు  శతాధిక వసంతాలు ఆయురారోగ్యాలతో నుండి తమకు వెన్నుదన్నుగా నుండవలెనని సదాశయమో , ఆస్తుల కొరకు కన్న తల్లిదండ్రులనే  కసాయిగా  కడతేర్చు ద్విపాద పశువులకు  కొంత ఆదర్శము గా నుండు కొరకో , తలిదండ్రులపై అవ్యాజ ప్రేమానులాగాలో నిర్ణయించుట కష్టమే. ఏది ఏమైనను భవానీ పతి రావు అన్నయ్య , వదిన గారి వలన సంతానము , సంతానము వలన వారు  ఎంతో అభినందనీయులు. సదాశయము, సత్కార్యాచరణ, భక్తి భావనలు, దానధర్మములొనర్చుట, ధార్మిక జీవనము, సాంఘిక బాధ్యతలు మానవుని మహోన్నతుని చేస్తాయనుటలో సందేహములేదు . మానవ జన్మ సార్ధకతకు ఇంతకన్నా కావలసిన దేముంది?  . ఈ కార్యక్రమ చిత్రములు పైన కలవు  , వీడియోలను తదుపరి  పొందుపరచగలను . శుభం భూయాత్ .         
       

      

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...