అమ్మవారి చెట్టు శతజయంతి.
నూరువత్సరాలు నూత్నశోభలుపండ
నింబవృక్షమొకటి నెమ్మి"ధూళి
పూడి"మధ్య మందపూర్వ లక్ష్మి యనగ
వెలసి జనుల గాచె వివిధగతుల.
రండు నిండు మనసు రాగంబు రంజిల్ల
వేపచెట్టు కీర్తి విస్తరింప
పూజచేసి మనము ముక్తిత్రోవను బోవ
నూతి వంశభవులు పాతిరిచట.
పున్నెమబ్బునంచు ముత్తైదువులు జేరి
పసుపు కుంకుమలను భక్తితోడ
వేపచెట్టు మొదలు విస్తృతంబుగబూసి
పట్టుచీరగట్టి పరవశింత్రు.
అనుచు భక్తిభావ హ్లాదానుపూర్ణులౌ
ధౌతపురపు జనుల తలపుసాగ
అమ్మవారి కరుణ అద్వితీయత నిండ
దీవనాళి విరిసె దివ్యశోభ!
చదివెడు బాలురు స్మరియింపగలశక్తి
నిమ్మని కోరెద రమ్మనెపుడు
రైతులు తమపంట రత్నరాసులబోలి
ఇమ్మని కోరెద రమ్మనెపుడు
తరతమ భావాలు మరచిపోయెడు శక్తి
నిమ్మని కోరెద రమ్మనెపుడు
భక్తిహీనముగాని భవ్యమనంబుల
నిమ్మని కోరెద రమ్మనెపుడు
అట్టి అమ్మయె మాలక్ష్మి అమ్మవారు
ధౌతపురమున నెలకొన్న తల్లియామె
కరుణమూర్తీభవించిన కల్పవల్లి
అనుగు బిడ్డలగాచు ప్రహర్షవల్లి.
ధూళిపూడి లోని వఝవారి ఆంజనేయస్వామి స్తుతి.
వఝసద్వంశ శ్రీ వైభవోపేతులై
హనుమసేవలలోన నలరినారు
పూర్వదేవళ శోభ పుష్ఠియు గూర్పగా
చిన్మయ భావాలు చేర్చినారు
అందరిహృదయాల నాముష్మికంబును
ధౌతపురమ్మునన్ దనిపినారు
తాతలనాటిదౌ ధార్మికాలయమున
నిత్య దీపంబుల నిల్పినారు
వహ్వ!వఝవంశ వారసశ్రేష్ఠులార!
మీకు భక్తులకిడు మించుకరుణ
సూర్యశిష్యుడైన సుందరతేజుండు
రామప్రేరితమయి రమ్యగరిమ.
(17.05.2020)శ్రీ హనుమజ్జయంతి సందర్భముగా
శ్రీరామపాదపద్మము
నారామముసుంతలేక నర్చించుటనీ
ధారాళభక్తి తత్త్వము
పారావారంపు జేత పవనకుమారా!
సీతను గాంచినవీరా!
భూతలవిజ్ఞానవేత్త పూతచరిత్రా!
నేతగుసుగ్రీవుమదిని
ప్రాతస్మరణీయతేజ పవనకుమారా!
రామునికౌగిలి పొందిన
శ్రీమంతుడవీవెసుమ్ము చిన్మయరూపా!
భామంతులెందరున్నను
ప్రేమాదరరీతులందు పెన్నిధినీవే.