శీర్షిక... శ్రీయశస్వినీ..పద్య దశకము.
మాతవు జీవకోటికిల మాతవు నీవు సురాసురాళికి
న్మాతవు సార వాజ్ఞ్మయ సమాశ్రిత వేదవిశాల రాశికిన్
మాతవు సర్వలోకమహిమాన్విత శక్తుల మూలశక్తికిన్
మాత!దయాంబురాశి!కనుమా మము ప్రేమను శ్రీయశస్వినీ!-1
మానవ జన్మమందు పరమార్ధమెఱుంగుచు ముక్తిమార్గముం
గానగ దైవతత్త్వపు వికాసము శోధనజేయగా సదా
మానితవైఖరిన్ గరిమ మౌనవిచార విభూతులెన్నియో
దానముజేసినావు వరదాయిని! శాంభవి! శ్రీయశస్వినీ!-2
కనులకు కానరానివగు కర్మల డుల్చి త్వదీయ నామముల్
మననము సేయగల్గు పరమాద్భుత నిశ్చలభక్తితత్త్వముల్
వినయ గుణంబులాదిగను వేగిరమిమ్ము దయాంతరంగవై
యనయము సంస్తుతింతునిను నాశ్రితవత్సల శ్రీయశస్వినీ!-3
వీచెడు వాయువీవె ధర వెల్గులనీనెడు కాంతివీవెగా
కాచుచు భారమెంచకను కాయము నిల్పెడు పృధ్వినీవెగా
భూచర ఖేచరాదులకు పూర్ణజలంబిడు వృత్రమీవెగా
గోచరమౌ ప్రభావయుతగోళము నీవట శ్రీయశస్వినీ!-4
వేలకొలందిదేవతలు విస్తృతభక్తి నిరంతరాయమున్
మూలవిరాట్టువంచు కడు మోదముతోడుత సంస్తుతింపగా
హేలగవారిగాచితివి శ్రీకర దివ్య విభావ మూర్తివై
జాలిదలంచి సన్మతిని సద్గతినీయవె శ్రీయశస్వినీ!-5
దనుజులు గూడతప్పరసి తావక పాదయుగంబునంటగా
వినయ సమార్చితంబయిన విజ్ఞతకెంతయు సంతసించుచున్
ఘనమగు సద్దయామయిగ కాచితివమ్మరొ మాతృప్రేమతో
ననయము రక్షసేయగదె యాత్మవినోదిని!శ్రీయశస్వినీ!-6
నిన్ను గనంగ గోరినను నేర్పగు మార్గము భక్తితత్త్వమే
చెన్నగు సేవలం జరిపి చిన్మయరూపు హృదంతరాళమున్
మన్ననగల్గురీతిగను మౌన విలాసపు రాగవర్తన
న్నన్నులమిన్నరో!కలుషహారిణి!శారద!శ్రీయశస్వినీ!-7
తీయని పల్కుబల్కగను తేనియలూరెడు పాటబాడగా
మాయను మీరియోచనలు మంగళమౌనటు లూహసేయగా
కాయము సార్ధకంబుగ సుకార్యము లెన్నియొ నిర్వహింపగా
మాయమ శారదాంబ! కనుమా శరణంటిని శ్రీయశస్వినీ!-8
నాదు మనంబు పీఠముగ నైష్ఠిక తత్త్వవిచారభావనే
నీదగు మంగళాకృతిగ నిల్పుచు నిర్మలభావసూనముల్
పాదయుగంపుబూజకయి భక్తిని నుంతు వినమ్రబుద్ధితో
వేదవినోదినీ!నిగమవేదిని! భారతి!శ్రీయశస్వినీ!-9
పంకములోనజిక్కి భవబంధములంబడి మోరకుండనై
సంకటముల్ దగుల్కొన నశక్తుడ నౌచును నిన్నువేడితిన్
శాంకరి!కావుమా సతము సత్కృపజూపి దయాంబురాశివై
కింకర భావమున్వదల గీష్పతిభామిని! శ్రీయశస్వినీ!-10