10, ఏప్రిల్ 2019, బుధవారం

జో అచ్యుతానంద జో జో ముకుందా . 10.04.19.

జో అచ్యుతానంద  జో జో  ముకుందా! 
అన్నమయ్య లాలి పాట. దాని భావము .
     ఈ రోజులలో పసిబిడ్డలు యిండ్లలో పడుకోవటానికి ఊయలలు లేవు. ఏడ్చే పాపల రోదన ఆపటానికి తల్లులకు లాలి పాటలు రావు. సెల్ యుగము కనుక పసివాడు ఏడుపు రాగం ఆలపించగానే , తల్లి ఏమాత్రం కంగారు తొట్రుపాటు లేకుండా సెల్ లో లాలిపాటల యు ట్యూబ్ ఆన్ చేస్తుంది . అన్నమయ్య లాలీ, జోల పాటలు ఆన్ చేసి వినిపిస్తే వినటానికి బాగానే ఉంటాయి. కానీ సంపూర్ణముగా అర్ధం అయ్యేది ఎందరికి.? ముఖ్యం గా ఈనాటి మేటి సెల్ ఫోన్ దేవతగా భావించే నవయుగ, నవ నాగరిక మాతృ మూర్తులకు చక్కగా అన్నమయ్య భావం అర్ధం కావాలనే సదుద్దేశం తో భావాలు వ్రాస్తున్నాను. ఆస్వాదించండి.  
ఒక తల్లి తన కుమారుని పరమాత్మునిగా (రామ, గోవింద ) గా నెంచి నిద్ర పుచ్చే ప్రయత్నం గా ఉయ్యాలను ఊపుతూ , పరమాత్మను ఆతడు ఏ రూపంలో   ఈ దేహం లో  ఉంటాడో , దేహ స్వభావము ఏమిటో? ఈ దేహం లో పరమాత్మ ఎలా ఉన్నాడో ? ఏమి చేస్తే ఈ జీవికి దర్శనమిస్తాడో? ఆధ్యాత్మిక తత్త్వాన్ని వివరిస్తూ అన్నమయ్య తాను గాంచిన (తన దేహం లోనే )పరమాత్మ స్వరూపం వివరించి సాధన మార్గాలను కూడా తల్లి పాత్ర ద్వారా చెప్పిస్తాడు. 
1. తొలుత బ్రహ్మాణ్డమ్ము   తొట్టి గావించి , నాలుగు వేదములు గొలుసు లమరించి !
   బలువైన ఫణి రాజు పాన్పు గావించి , చెలియ డోలికలోన చేర్చి లాలించి !!  జో , జో !  
  భావము : ఓ ! ఆనంద రూపియగు అచ్యుతా! ముకుందా! పరమానందా! జో జో అంటుందా అమ్మ. ముందుగా డోలిక (ఉయ్యేల ) వర్ణన .  ఊయేల తొట్టి బ్రహ్మాన్డము, 4 గొలుసులు  4 వేదాలు (1.ఋగ్ 2. యజుర్ 3.సామ. 4 అధర్వ ). పాన్పు (ప్రక్క) ఫణి రాజు . (ఆది శేషుడు) . ఇటువంటి  ఊయల  లో  3 లోకములనేలు మిమ్ములను ఉంచి  యూపుట  నా పూర్వ జన్మ పుణ్యమే.  
2. తొమ్మిది  వాకిళ్ళ దొడ్డి లోపాలను , క్రూరులగు ఆరుగురు, సాధులైదుగురు 
   అంతట ముగ్గురు మూర్తులున్నారు. తెలివి తెలిపేవాడు దేవుడున్నాడు  !! .   జో , జో ! 
  భావము : ఈ దేహము 9 వాకిళ్ళ దొడ్డి . అనగా ... తెరచిన నవ రంధ్రాలు ( నేత్రాలు 2, చెవులు 2. ముక్కు 2 నోరు 1 , మలము 1. మూత్రము 1.) దొడ్డి వాకిళ్లు  రక్షణ లేనివి . క్రూరులు 6 గురు . ( కామ , క్రోధ , లోభ , మోహ, మద , మత్సరములు) సాదు లైదుగురు . ( జ్ఞానేంద్రియములు . కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ) ముగ్గురు మూర్తులు ( సత్వ రజస్ తమో గుణాలు ) తెలివి తెలిపే దేవుడు అనగా జ్ఞానేంద్రియములను అదుపుచేయగల జ్ఞాని ఆయాత్మ శక్తి . ఒకడున్నాడు . 
 3. వీథినొక బాటలో విదితంబు చేయ , వేటలో భేరి మృదంగములు మ్రోయ 
     కోట కోటగాండ్రంత కోలాటమేయ, పేటలో లేని ప్రభువు దొరతనము  చేయ . జో జో !!
  భావము : వీధిలోని ఒక బాటలో ఒక శుభ వార్త వినిపింప , పేటలో భేరి మృదంగములు మ్రోగినవి . కోటలో అందరు కోలాటమాడగా పేటలో లేని ప్రభువు తన దొరతనం చూపాడట. ఈ శరీరమునకు ప్రభువైన ఆత్మ తన అధికారం చూపుతున్నాడని  భావము . ( ఈ భావము కొంత సందేహముగా ఉన్నది ) 
 4. పట్టవలె ఆరుగుర్ని పదిలంబుగాను , కట్టవలె ముగ్గుర్ని కదలకుండగను .
   ఉంచవలె ఒక్కర్ని హృత్కమలమందు , ఉండవలె పండువలె నిండుగాను. జో జో !!
భావము :  కామ క్రోధాది ఆరుగురు  దొంగలను స్వాధీనం చేసుకోవాలి . సత్వరజ స్తమో గుణములను వాటి స్థాయిలో ఉంచాలి . ఒక్క పరమాత్మనే హృదయ కమలంలో ఉంచితే నీవు పండువలె నిండుగా ఉంటావు.
 .5. నీ ముక్కు , నీ చెవ్వు, నీ కన్నుదాన్నే , ఏమి తెలిపారు ఒరే నీ వెవ్వరన్న ?
     ఏమయ్యి తిరిగేటి ఎరుక నెరుగవు , నీ కామ్యమైన దృశ్యము నీవు కనవు . 
భావము :నీవు ముక్కు కన్ను చెవులు ఉన్న దేహానివా? (ఆత్మవా?) లేక దేహములో దాగిన పరమాత్మవా?  ఏమై తిరుగుతున్నావో నీవెరుగవు . నీ కవసరమైన పరమాత్మను నీవు చూడవు . ( నీలోని దైవాన్ని చూడవు )
 6. షడా ధారములు దాటి శిశువును భేదించి , శాస్త్రార్థముల సద్గురువును పూజ చేసి 
    నేతి నేతి  వాక్యముల నేతి  గావించి, ఆతూర్య తుర్యముగ నీవు  వెల్గ .  
.భావము : షడా ధారములు (  మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, ఆహిత, విశుద్ధ, హంక్షములు (సహస్రారము ) అను షట్ చక్రములు దాటి  వీటి ఫలితమైన శిశువును (వేయి రేకుల మొగ్గను ) దాటి,శాస్త్రార్థముల సద్గురువు నుపాసించి (న +ఇతి =నేతి.. యిది కాదు  )  ఇది కాదు ఇది కాదు అనే తర్క వాక్యము ప్రకారము భగవంతుడు తప్ప వేరేదియు కాదు  అని నీవు ప్రకాశింపవలెను . 
7. ఏల యేడ్చెదవు నీకేమి కావలెనురా?, మేలైన గురుబోధ పాలు త్రాగరా 
    స్త్రీలలో చేరి దుర్బుద్ధి చెందకురా, ఆలించి ఆత్మలో అనుభవము కనరా! . 
భావము : నాయనా ఎందుకేడుస్తావు ? నీకేమి కావలె? మేలైన గురుబోధ అనే పాలు త్రాగు . స్త్రీలలో చేరి చెడుబుద్ధి అలవరచుకోవద్దు . నీ మనసు లగ్నం చేసి ఆత్మానుభూతిని పొందు . 
 8. అదిగో ఆకాశమే అడ్డ దూలంబు,కుదురైన కమలమే  గురు పీఠకంబు 
    పదునాల్గు స్తంభాల బంగారు చేర్లు, పరమాత్మ నిన్నిపుడు పట్టి యూచేరు . 
  భావము : పదునాల్గు స్తంభాల బంగారు చేరులు (త్రాళ్లు )కలిగిన నీ ఊయలకు ఆకాశమే అడ్డ దూలము. కుదురైన కమలమే నీకు గురు పీఠ . నిన్నెల్లప్పుడు  భగవంతుడే పట్టి  యూపుతుంటాడు . 

9.తన వాసన త్రయంబు తొట్టెగావించి , మనసునే దొడ్డ దూలమ్బవత బూని 
   పదునాల్గు స్తంభాల బంగారు మేడ ,పరమాత్మ నిన్నెపుడు పట్టి యూచెదరు .  
 భావము : వాసన త్రయము (లోక వాసన , శాస్త్ర వాసన, దేహ వాసన ) లను తొట్టిగా చేసి , మనసు అనే దూలము ఆధారముగా పదునాల్గు స్తంభాల మేడలో పరమాత్మ  నిన్నిపుడు ఊపుతున్నాడు .  
 10. యుక్తిచే ఎరుక మూర్తి గుర్తు పట్టి , ,సొక్కేటి  ఇంద్రియముల త్రొక్కి పట్టి 
      పట్టేటి తన సుఖము బాగుగా ఎత్తుకొని , ఆనంద భరితులైనారు . 
 భావము : పూర్వ జన్మ జ్ఞానమును(ఎరుక) యుక్తిగా గుర్తు పట్టి , ఎగిసి పడే ఇంద్రియములను త్రొక్కిపెట్టి ఎవడు ఉంటాడో వాడే సుఖము చెందును . ఆనంద భరితుడై ఉండును. 
 11. ఓంకారమను మేటి ఒక తొట్టిలోన , తత్త్వమసి మాట చలువలు గప్పి 
      ఎరుకలో పాపడిని ఏర్పాటు చేసి , ఏడు భువనముల వారు కలయ యూచెదరు. 
భావము : నాయనా గొప్ప ఓంకారమనే  ఉయ్యాల తొట్టి లో (తత్ = ఆ, త్వం = నీవే , అసి = నేనై  ఉన్నాను ) తత్వమసి = ఆ భగవంతుడే నేను . అనే మాటల వస్త్రము కప్పుకొని  ఆ జ్ఞానము లోనే పాపాయిని ఏర్పరచి , ఏడు లోకముల వారు  నిన్నే భగవంతుడని    యూపెదరు . 
 12. ఇడా పింగళ  గంగా యమునల నడుమ, తిరువేణి మద్యము తీరుగా కనుమా !
      పర పశ్యంతి అంతరంగమున , ప్రణవమే సుప్రకాశమై వెలుగుగా !
భావము : ఇడా ,పింగళ, సుషుమ్న  అనునవి మానవ దేహమున సంచరించు అత్యంత ప్రధాన నాడులు . ఇవి క్రింది నుండి మీదకు ప్రసరిస్తాయి.  ముక్కు ఎడమ వైపున ఉండునది ఇడా , కుడి వైపున ఉండునది పింగళ . కుడి ఎడమలకు మధ్యన ఉండి బ్రహ్మ రంధ్రమును ఆవరించి యుండునది సుషుమ్న నాడి . గంగ యమునల నడుమ పవిత్రమైన సరస్వతి నది ఉన్నట్లే ఇడా పింగళ నాడుల మధ్యన గల బ్రహ్మ రంధ్రమును కనుమా !అనగా పరమాత్మ స్థానమును కనుగొనుమని అర్ధము.  పర , పశ్యంతి, మధ్యమ, వైఖరి  అను 4 పదాలు పరబ్రహ్మ తత్త్వ విచారణలో వాడు పదములు. విత్త నము మొలకెత్తుటకు సిద్ధముగా నుండుట (పర ) మొలక కనబడుట (పశ్యంతి) ఎదిగి వృక్షమగుట  (మధ్యమ) పూలు కాయల నిచ్చుట (వైఖరి.) ఈవిధమైన మనసుతో ప్రణవము చక్కగా ప్రకాశిస్తూ వెలుగుతుంది . 
 13. కంటి మింటి ఏక సూత్రమైనావు , కంటి పాపాల నడుమ నంటి ఉన్నావు 
       అంటి అంటి నీ జీవములందు కొన్నావు , రెంటి జంటనే నడుమనే అంటి ఉన్నావు . 
భావము : నీ కంటికి ఆకాశానికి ఒకే సూత్రముగా ఉన్నావు. కంటి పాపాల మధ్యన అంటి ఉండి ప్రాణం పోసుకొన్నావు . (పూర్వ జన్మ, ఈ జన్మల నడుమ అంటి ఉన్నావు. )

 14. సజ్జనుల సంగతికి సాధువైనావు , దుర్జనులు సంగతికి దూరమైనావు 
      రణ విశ్వ కర్మాన ప్రణవమైనావు . గండు తుమ్మెద వోలె ఘనుడవైనావు . 

భావము : నీవు సజ్జనుల స్నేహముతో సాధువై , దుర్జనులకు దూరమై, బ్రహ్మ (విశ్వ కర్మ ) కార్యములలో ప్రణవమై గండు తుమ్మెదవై ఆనందంగా మధువును జుఱ్ఱు కొనుచు ఘనుడవైనావు. 





  

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...