31, ఆగస్టు 2015, సోమవారం

చింతా రామ కృష్ణా రావు సహోదరునకు ముందుగ అభినన్దనలు

చింతా రామ కృష్ణా రావు  సహోదరునకు ముందుగ అభినన్దనలు. ( తెలుగు భాషా దినోత్సవము సందర్భముగా )
29..08. 2015 
కమ్మని పద్యమాలికలు కాంచన గర్భుని రాణి పాదమున్ 
చెన్నగు రీతులన్నిలిపి  చిత్తము రంజిల నాలపిమ్పగాన్ 
మన్నన నొందినట్టి కడు మాన్యుడ వీవయ రామ కృష్ణ రో 
ఎన్నగ పూర్వపుణ్య మది యెట్లు స్తుతిమ్పగ సాధ్యమయ్యెడున్. 

అమ్మను గొల్చు భాగ్యమును హ్లాదము గూర్పగ నందినావ హో 
తమ్ముడ రామ కృష్ణ కడు తన్మయ మొందితి మన్మ నోమ్బుదిన్ 
సొమ్ములుగాగ పద్దెముల సోయగముల్ పరి కల్పనంబు తో 
వమ్ములు గావు సేవలటు వాణికి జేసిన సత్ఫలంబులౌ 

29, ఆగస్టు 2015, శనివారం

ఆంద్ర భాషామ తల్లికి కట్టాలి రక్షా బంధనం . 29.08.2015

 ఆంద్ర భాషామ తల్లికి కట్టాలి రక్షా బంధనం . 29.08.2015
కీ. శే . గిడుగు రామమూర్తి పంతులుగారి జయంతి సందర్భముగ
  శ్రావణ పున్నమికే  రక్షా బంధనం చేసుకోవటం ఒక సంప్రదాయం గ వస్తున్నది .సొదరీ సోదరులు పరస్పరం రక్షణ కోరుతూ  చేతికి కట్టే సూత్రమే ,యిది. ప్రేమ మనిషిని మనీషిగా చేస్తుంది . దానిని పెంచి, పంచాలి. అలాగే మాతృ భాషామతల్లికి కూడా మనమందరం  రక్షా బంధన చేయవలసిన దుస్తితి వచ్చింది . ఋణం తీర్చుకోవాలంటే కట్టక తప్పదు. అంటే ఏదో అద్భుతం చేయనవసరం లేదు . వీలైనంత తెలుగులో మాట్లాడితే చాలు  సంతోషిస్తుంది మన ఆంద్ర మాత.
      తెలుగు మాటలు నాలుగు పలుకు గలను
      తెలుగు స్వారస్య మెంతైనా తెలుప గలను
      తెలుగు తనమును భావాల నిలుప గలను
      తెలుగు  కవి వారసుండనై వెలుగ గలను.
      అమ్మ నీపాద పద్మంబు నహరహంబు
      కొలుచు చున్దును సదమల కూర్మి తోడ
      ఆంద్ర భాషామ తల్లికి హారతిచ్చి ,  
     రక్ష బంధన గూర్తును రమ్య గరిమ .    అని అంటీ చాలు మన భాషామతల్లి పొంగి పొతున్ది.
     

23, ఆగస్టు 2015, ఆదివారం

అమ్మ పిలిచింది భయం లేదు రారా యని. 23.08.2015.



                         అమ్మ పిలిచింది భయం లేదు రారా యని.
                           23.08.2015.

నేనే స్వయముగా కారు నడుపుకొంటూ వెళ్లి బెంగుళూరు లోని వైష్ణవీ మాతని దర్శించుకోవాలని నాకు ఉబలాటం . వెళ్ల లేనేమో నని భయం. నిత్యం భయానికి, ధైర్యానికి మధ్య .పోరాటం జరుగుతూనే ఉంటుంది .ఏది ఎక్కువ శాతం ఉంటే అదే జరుగుతున్ది. మన భయమేమిటంటే , అపజయం పొందుతామేమో అని ..అపజయము, విజయము అమ్మ స్తన్యం త్రాగే టప్పటి నుండే మొదలు. అమ్మ ఆశీస్సులే విజయానికి మూలమ్.అపజాలే విజయాలకు సోపానాలు . అందుకే ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు పెద్దలు. అమ్మ వైష్ణవి ని కొంచెం ధైర్యం ప్రసాదించమని అడిగాను, ఆమెని దర్శిం చుకోవటాని కే. ధైర్యం యిచ్చింది అమ్మని దర్శించి క్షేమం గా వచ్చాను.
                ధైర్య మన్నది సతతంబు కార్య విజయ ,
                హేతు వగునోయి మిత్రమ సేతు లంఘ
                నంబు నవలీల గావించె హనుమ నాడు .
                పిరికి తనమును మదినుండి పెరుక వలయు .

4, ఆగస్టు 2015, మంగళవారం

అబ్దుల్ కలామ్.

                                               అనన్వయ అబ్దుల్ కలామ్.
అనన్వయము నూరు అలంకారములలో నొకటి. అన్వయము  అంటే సాదృశ్యము, పోలిక, ఒక వ్యక్తి గాని, వస్తువు గాని , వేరొక దానిలా ఉంటే ఆ యిద్దరు వ్యక్తులనో, వస్తువులనో పోల్చవచ్చు . ఆ మనీషిని గురించి పోలిక చెప్పాలంటే ఎక్కడా దొరకక పొతే వారిని అనన్వయ వ్యక్తులుగా చెప్పవచ్చు. సాగరం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే  ఇలానే సమాధానం చెబుతారు. అందుకే సాహితీ వేత్తలు, సాగరః సాగరోపమా  అన్నారు రామ  రావణ యోర్యుద్ధం రామ రావణ వత్. అటువంటి పోలిక లేనందు వలన అలా అన్నారు.
            ఆ కోవకు చెందిన ఒక మహోన్నత వ్యక్తి , జాతి రత్నం రాలిపోయింది భారతావనినే కాక సర్వ ప్రపంచాన్ని కన్నీటి లో ముంచి. అనిర్వచనీయ ప్రతిభాశాలి , సుగుణ శీలి , సమున్నత మానవీయ సత్కార్యాచరణ సుమములను , యువకుల హృదయ మధు వనంలో పూయించు తోట మాలి. నింగి దురాన్ని చెరిపి, మనం శాస్త్ర విజ్ఞానం తో దానిని సులువుగా తొంగి చూడవచ్చునని నిరూపించిన సాంకేతిక శాస్త్ర విజ్ఞాని , కీర్తి శేషులు అబ్దుల్ కలాం  గారు.
            ఆలోచన, ఆచరణ , ఆత్మీయత, ఆరాధనా భావం, అంకిత భావం, అందరిని అలరించే అమృత హృదయం , సేవాతత్వం, బంధు ప్రీతి , మా తృ ప్రేమ , భ్రా  తృ ప్రేమ , చిరు నవ్వు చెరగని మోము , పని చేయుటలో ఆనందాన్ని అనుభవించటం , యెంత ఎదిగిన ఒదిగి ఉండటం , ధనార్జన పట్ల నిరాదరణ , విజ్ఞాన ధనార్జన పట్ల మిక్కిలి ఆసక్తి, ఇటువంటి కోట్ల గుణములు రాసి పోస్తే ఒక అబ్దుల్ కలామ్.
   
పదవులకు మనిషి వలన గౌరవం రావటం , తేవటం కొందరి వలననే జరుగుతుంది . రాష్ట్ర పతి పదవికి అందాన్ని , హుందా తనాన్ని , తెచ్చిన మహనీయులలో అబ్దుల్ కలాం ఒకరు .
         సమాజంలో ఏ క్రొత్త మార్పు రావాలన్నా , అది తప్పక బాలలనుంది, యువకుల నుండి వస్తుందని నమ్మి వారిని నిరంతరం , తన మృదు మధుర భావ గంగా జాలం తో తడిపి వారి మనసులను , ఆలోచనలను , పరమ పవిత్రం జేసి ఆచరణ వైపు అడుగులు వేయించిన స్పూర్తి దాత అబ్దుల్ కలామ్.

        సాగర తీరం లో జన్మించి    విద్యా విజ్ఞాన సాగరం మధించి, అందు అమృతాన్ని సాధించి , దానిలో రామ ఈశ్వర తత్వాన్ని రంగరించి, రస రమ్యం చేసి , ఆ అమృతాన్ని సర్వ ప్రపంచానికి పంచి న మోహనాకారుడు కలాం ;దైవం ఎక్కడో లేడని, పసి హృదయాలలో , వారి బోసి నవ్వులలో , ఉన్నాడని నమ్మిన మానవతావాది , మా  నవతా వాది, కలాం . హిందూ మతమైన , మహమ్మదీయ మతమైన , మరే మతమైన , సర్వ జన సమ్మత మైనదే మతమని నమ్మి మానవ శ్రేయస్సుకు  మకుటాయమానం గా నిల్చిన మానవతావాది కలాం. తన దేశం ఆధ్యాత్మికం గానే కాకుండా , వైజ్ఞానికంగా కుడా , హిమోన్నత శిఖరాలను , దేశాంతరాలను దాటాలని , కలలు కని, ఆ కలలను సాకారం చేసి , పృథ్వి , అగ్ని, వంటి క్షిపణుల ద్వారా , నిరూపించిన స్రష్ట కలామ్.
        మనం కలలు కనటం గురించి చెబుతూ  ఒక ఉన్నత లక్ష్యాన్ని కలగా కని, దానిని  నిజం చేసుకోవటానికి , అహోరాత్రులు కృషి చేయుమని, కలలు కల్లలు కాకుండా ,నిజాలు కావాలనే తపస్సు , చేయుమని తపన బడ్డాడు కలాం . త్యాగానికి మరో రూపు ఆయన . ఇన్ని సుగుణాల కలబోత , కలనేత, కలల నేత , మన డాక్టర్ అబ్దుల్ కలాం గారు కాక మరెవరు ఉంటారు చెప్పన్ది. మనం వారి ఆశయాలకు రూపు దిద్దుదాం .
    కలలు కనుమన్న మాన్యుండు ఘను డె వండు
     నింగి దూరియు కనిపించు భ్రుంగి ఎవడు
    భారత రత్నంబు నాబడు భవ్యు డె వడు
    అతడె అబ్దుల్ కలాము విఖ్యాత యశుడు.  
    జలధి మించిన విజ్ఞాన శాస్త్రమున్న
       వినయము చిరునవ్వు వెలయు వేత్తయగుచు
        బాలబాలుర హృదయాల పరమగురువు
       ఆకలామును మించిన యమరుడెవడు?

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...