2, డిసెంబర్ 2016, శుక్రవారం

సాహితీ స్రష్ట "సుచంద్ర"

సాహిత్యం అంటేనే హిత సహితం అని అర్థం. హితం ఎవరికి అని ప్రశ్న వేస్తే ..సర్వ జనాళికని చెప్పాలి. సాహిత్య ఆలోచనా లోచనం కలవారు ఒక్కొకరు ఒక్కొక రచనా పద్ధతిని అనుసరిస్తారు. ఛందోబద్ధ పద్య నిర్మాణం, స్వచ్ఛ, స్వేచ్ఛ ,  విశాల భావ వ్యక్తీకరణకనుకూలంగా ఉండే లలిత లలిత భావ నిర్భర పద జాలంతో మనోహర భావనా సాహితీ సామ్రాజ్యము నేర్పరచుకొని తద్ద్వారా రసిక జనులనాకర్షిస్తు, కవిలోక తల్లజునిగా పేరుగాంచుట ఒక వరం. అట్టి భగవద్దత్త వర ప్రసాది కీ.శే.(నమ్మ శక్యం కావటం లేదు.) "సుచంద్ర". సుసర్ల చంద్రశేఖర శాస్త్రి.(వచనమైతే భావ ప్రకటనకు ఎక్కువగా స్వేచ్ఛ ఉంటుంది అని వారు భావించేవారు.)వీరు ఖమ్మం జిల్లా కవులు, మొదలగు గ్రంథాలు, శతాధిక కవితలు, మనోహర వ్యాస విన్యాసాలు ప్రచురించిన కవిచంద్ర "సుచంద్ర".కవితామృతం, సేవించటం, సేవింపజేయటం అలవాటైతే చెప్పేదేముంది? ఆలోకమే వేరు. వేరొకరు తట్టి లేపాల్సిందే.అక్షరం ఉన్నంత కాలం అక్షరాలలో దాగి ఆయన ఉంటారు. కవికి, కవితకి మరణం లేదు.

           ఈయనకున్న లక్షణం తాను భావనా ప్రపంచంలో తేలటమే కాక కవితను, కవులను ప్రోత్సహించి, తనకు కావలసిన విషయాన్ని రాబట్టుకోవడంలో దిట్ట.

          నేను ధూళిపూడి లో పనిచేస్తున్న రోజులలో రక్తసంబంధీకమైన కుటుంబంగా మారింది "సుసర్ణ" వారి కుటుంబం. వారికి గ్రామదేవత తాళ్లమ్మ ఆరాధ్య దేవత, పర దేవత. నేను పాఠశాలలో కొలువు నుండి విరమించబోయే ముందే ఒక నిర్ణయం తీసికొన్నాను. అదే "ధూళిపూడి పూర్వా పర్వాలు.

              నన్ను "సుసర్ల" సోదరులందరు ఆప్యాయతానురాగాలతో, సొంత బావగారి వలెనే ఆదరించి గౌరవిస్తారు, వయోభేదం లేకుండా. ఒక రోజు "సుచంద్ర" గారి నుండి ఒక కోరిక. "బావగారు! నాకు మన గ్రామదేవత తాళ్లమ్మ ను స్తుతిస్తు శతకం కావాలి"అని. దానిని సుగ్రీవాజ్ఞగా భావించి 25 రోజులలో 108 పద్యాలు వ్రాసి చూపించాను. బావగారి కళ్లలో నేను ఆనాడు చూచిన ఆనందానికి అవధులు లేవు. "శహభాష్ బావగారు"అన్న పదం దశ దిశల ప్రతిధ్వనించింది. ఆనాటి నుండి కలిసినప్పుడెల్ల "బావగారు! ఏమైనా వ్రాస్తున్నారా? అనేదే ప్రథమ ప్రశ్న అయింది. ఆ ప్రోత్సాహం నాకొక మహత్తర శక్తిని, భావనా పటిమను ఇచ్చేది. ఏది యేమైనా బావగారు అని అనగనే .....తరువాత పదమైన ఏమైనా వ్రాస్తున్నారా? అని ఆయన అనక పోయినా నాకలా వినిపించేది. దాని ఫలితమే  "వాల్మీకి రామాయణము"నకు నా(తెలుగు సేత అయిన) "సూర్య శ్రీరామ"మేమో!!!

   2016 జూన్ లో జరిగిన ధూళిపూడి శతవసంత శోభలో పాల్గొని పూర్వ విద్యార్థిగా, అపూర్వ భావనిర్భర కవిగా ,విజృంభించారు, ఆరోగ్యం సహకరించకపోయినా.

       ఈ సాహితీ సింధువును  ఇంకా యెంతో తరచ వచ్చు. కాని ఒకే సారి నా వలన కావటం లేదు.
        అశ్రుతర్పణాలతో....అంజలులు సమర్పిస్తు......

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...