నిర్మల్ విహారయాత్రానుభవాలు. జలపాతాల దృశ్యానుభూతులు.
నిరంతరం శ్రమపడే మానవ మేథస్సునకు ప్రకృతి సందర్శనాన్ని మించిన ఆనందం ఉత్తేజం ఏముంటుంది చెప్పండి. అందుకే నిర్మల్ లోని హస్త కళా సౌందర్యాలు, సమీపంలోని జలపాతాల పరవళ్ళు, అందాలు ఆస్వాదించే కోరికతో ది.2.12.2017.న ఉ.7గం.లకు హైదరాబాద్ లో మా బావగారైన శ్రీ పులిజాల సత్యనారాయణ(రిటైర్డ్ ఆర్కియాలజీ సూపరింటెండెంట్) గారి ఆధ్వర్యంలో నేను( పొన్నెకంటి సూర్యనారాయణ రావు) నా శ్రీమతి ఇందిరాదేవి, పెద్దచెల్లి అరుణ, చిన్నచెల్లి పద్మ జారాణి, మేనకోడలు సంథ్యారాణి, పిల్లలు ఆదిత్య,లలిత, మిత్రుడు గోవింద్ తలిదండ్రులు బయలుదేరి(NH44) జాతీయ రహదారిలో 210 కి.మీ. దూరాన ఉన్న నిర్మల్ కు మధ్యాహ్నం చేరి, అచట హోటల్ లో విశ్రాంతి , భోజనానంతరం నిర్మల్ కు 38 కి.మీ. దూరంలో గల పొచ్చెర జలపాత సందర్శనానికి వెళ్ళాము.
ముందుగా నిర్మల్ బొమ్మలు..కళాకారుల.,తయారీ విషయాలు...
అత్యంత మృదువుగా, తేలికగా ఉండే "పునికి" కర్రతో చేయబడే ఈ బొమ్మలకు 400సంవత్సరాల చరిత్ర ఉంది. కళాకారులు "నకాషీ" కులానికి చెందిన కళాకారులు. వీరు "మరట్వాడ" ప్రాంతీయులు. నిర్మల్ సంస్థానాధిపతి "నిమ్మనాయుడు" దేశం నలుమూలలనుండి కళాకారులను రప్పించి హస్త కళలను పోషించి వృద్ధిచేశాడు.
తయారీ విధానం.
ముందుగా చేయదలచుకొన్న బొమ్మకు దగిన ఆకారపు ముక్కలు తీసికొని, చింతగింజలు నానబెట్టి జిగురువచ్చువరకు రుబ్బి పేస్ట్ చేసుకొని, దానిని కొయ్యపొడిలో కలిపి కావలసిన బొమ్మ చేసి దానిని ఎండబెట్టి నునుపు చేసి తగిన రంగులు వేస్తారు. ఆరంగుల తయారీలో చెట్ల ఆకురసాలు, పూల రసాలు వాడతారు. ఈ రంగులలో బంగారురంగు తయారీకి చాలా ఎక్కువసమయం శ్రమ పడుతుంది. ఈ రంగులు అత్యంత మనోహరంగా, మన్నికగా ఉంటాయి. బొమ్మలన్నీ సజీవకళతో ఉట్టిపడుతుంటాయి. ఈ బొమ్మల కళాకారుల సహకారసంఘం 1955 లో స్థాపించబడినది. ఈ నిర్మల్ పంచపాత్రలకును ప్రఖ్యాతి చెందినది.
సువర్ణ పుష్పాభిషేకంతో నిజాం నవాబు, అవాక్కు.
ఒకసారి నిజాం నవాబు నిర్మల్ పట్టణానికి వచ్చిన సందర్భంగా
వారికి ఇచటి కళాకారుల చేత బంగారు(చెక్క)పూలు చేయించి వాటితో సువర్ణ పుష్పాభిషేకం చేశారు. కొద్ది సేపటికి నిజం తెలుసుకొని నవాబు గారు అవాక్కయ్యారట. ఇది నిజమైన భగవద్దత్తకళ. శిల్పకళవంటిదే దారుకళ. దారువు అంటే కర్ర.
దారుకళాధురీణా!నిర్మలవాసా! దండంబులందుకోవయ్యా!
1. కడుపునిండిన నిండక కలతపడక
భరతజాతికి కీర్తికి బాటవేసి
నలువ రూపంబు ధరియించి నవ్యరూపు
సృష్టిచేసితివయ్యరో చెలువుమీర
2. నిర్మల వాసివౌ సత్కళా నిర్మ లాత్మ!
త్యాగపరిపూర్ణ సద్భావ యోగివర్య!
వందనంబులు నీకెపుడు వందవేలు
జాతి మరువదు నీదు విఖ్యాతి యెపుడు.
3. "పునికి" కర్రకు నిపుణత పురుడుబోసి
పూర్ణ రూపాలు సృష్టించు పుణ్యులార!
రంగురంగుల యందాలు రహినినిలుపు
మీకు శుభములుకలుగుత మిగులశోభ!
పొచ్చెర జలపాతం.
ఎక్కడో పుట్టిన అప్సరసల వంటి నదీ కన్నెలు తమ చెలికత్తెల వంటి ఉపనదులతో గూడి చిలిపి వలపులతో రసికులనూరిస్తూ, చిత్రకారుల కుంచెలకు పనిచెబుతు, కవుల మస్తిష్కాల ఊహలకు ఉయ్యాలలూపుతు, సంగీతజ్ఞుల సరిగమలకు సాయంపడుతూ తమ ప్రత్యేకతలను చాటుకుంటు భూమాతపాదకమలాలను స్పృశించాలని తపనపడేవే జలపాతాలు. మన పౌరాణిక ఆధారాన్ని అనుసరించి భగీరథుని దయ వలన భువికి దిగినదే గంగారూపి జలపాతం. ఇలా ఎన్నో నదులు ఎన్నో దేశాలలో జలపాతాలై మధుర మనోజ్ఞ దరహాస చంద్రికలను, రమణీయ కర్ణపేయ సంగీత నాదాలను వినిపిస్తు ప్రకృతి ప్రియులను అలరిస్తున్నాయి.
పొచ్చర జలపాతం నిర్మల్ కు 38 కి.మీ. దూరంలో ఉంది.
ఎన్నో ఓషథీ గుణాలను సంతరించుకొని అతి స్వచ్ఛమైన పరవళ్ళు త్రొక్కే నీటితో తన దరిజేరిన వారికి అమితానందాన్నిస్తుంది.
మేము ఆ ఆనందాన్ని ఎంత సేపు అనుభవించామో! రకరకాలుగా ఛాయాచిత్రాలు తీసుకొని పదిలపరచుకున్నాము. ఇచటికి మా బావగారు కూడ రాగలుగుతారనే ఉద్దేశంతో నే ముందుగా దీనికి వచ్చాము. ఇచటి అందాలను వృత్తిపరమైన ఛాయాగ్రాహకులైతే ఎంత ఒడుపుగా బంధిస్తారో! నాకు మదిలో అత్యుత్తమ ఛాయాగ్రాహకుడైన నా బావ మరది కీ.శే. గంగరాజు వాసుదేవమూర్తి మెదిలాడు.
పొచ్చెర జలపాతంబది
యచ్చెరువగుగాదె మనకు హ్లాదినియగుచున్
చెచ్చెరదూకగముందుకు
చిచ్చరపిడుగయ్యెమనకు సిరులనుగూర్చన్.
జలపాత దర్శనానంతరం నిర్మల్ బొమ్మల తయారీ, పూర్తిగా తయారయి అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి , ఆయిల్ పెయింటింగ్స్ చూచాము. అవి సజీవ దారు శిల్పాలు. మన భారతీయుల కీర్తి కిరీటాలు. స్వచ్ఛ విజృంభమాణసృజనలు. అభివృద్ధి వారి కళాకౌశలాలలో కనపడుతున్నదే కాని వారి జీవితాలలో కాదని ఆ కళాకారులను చూచినపుడు అవగతమౌతుంది. దానికి మనం స్పందించాల్సిన విధానం ఒక్కటే. వారి వస్తువులను మనం కొని ప్రోత్సహించటం. అందుకే మేము కొన్ని బొమ్మలను కొన్నాము.
ది.3.12.2017. న. కుంతాల జలపాతం.
ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలం "కుంటాల"గ్రామంలో ఉంది. దీని ఎత్తు 147అడుగులు. హైదరాబాద్ నుండి 237కి.మీ. నిర్మల్ నుండి షుమారు35 కి.మీ. వెళ్ళి నేరడిగొండ నుండి కుడివైపునకు తిరిగి 13కి.మీ వెళితే "కుంటాల" జలపాతం వస్తుంది. దుష్యంతుని భార్య శకుంతల ఇచటికి వచ్చి స్నానంచేసి వెళ్ళేదట. ఆమె పేరు మీద ఈ జలపాతానికి "కుంతల"జలపాతం అని పేరు వచ్చిందట. భూమట్టం నుండి క్రిందకు 408 మెట్లు ఉన్నాయి. కాని చాల విశాలంగా ఉండి ఎక్కువ శ్రమలేకుండ దిగి ఎక్కగలిగేలా ఉంటాయి. కొంత మధ్యలో విశ్రాంతి తీసుకుంటు వెళ్ళిరావటం శ్రేయస్కరం. అత్యంత మనోహరదృశ్యం. వర్ణనాతీతం. కాని నీరుపారే ప్రాంతమంతా పాచి ఉండి ప్రమాదానీకి హేతువౌతుంది. మిక్కిలి జాగ్రత్త అవసరం.
కుంతల జలపాతంబిది
ఎంతయు ఘనమైనలోతు ఏమామలుపుల్
వింతకు వింతై తోచు,శ
కుంతలపేరన్ బరగుచు కూర్మిన్ గూర్చున్.
ముఖ్య విషయం.
అచటికి వెళ్ళేముందే మనం దారిలో మనకోసం ఎంతో ప్రేమగా, ఆశగా ఎదురుచూచే వానరాల కొరకు కొన్ని ఫలాలను తీసికొని వెళ్ళటం మరచిపోరాదు. మనం తిన్నది మట్టిపాలు. పరులకు పెట్టేది పరమాత్మ పాలు. పరమాత్మ అనుగ్రహిస్తే వరాలు. ఆగ్రహిస్తే శాపాలు. మనం జీవకారుణ్యాన్ని పాటించుదాం, తోటివారికి సాయపడదాం. కళాకారుల జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి కార్యక్రమాలు అక్రమార్జనాపరులు చేస్తే వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అందుకే వారిందులోకి రారేమో! ప్రభుత్వాలు కూడ కుటీర పరిశ్రమలకు ఎక్కువ చేయూత నివ్వాలి. వారి జీవితాలలో కాంతులు నింపాలి.
మేరా భారత్ మహాన్. జై భారత్. జైజై భారత్.