భోగిశుభాకాంక్షలు.
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడమే మకర సంక్రమణము. సంక్రాంతి
నుండే ఉత్తరాయణ పుణ్యకాలం. ఇది 3రోజుల పండుగ. మొదటిరోజు భోగి,రెండవ రోజు మకరసంక్రాంతి,మూడవరోజు కనుము. భోగిపండుగ
ఎలాచేసుకుంటారు....ఉదయాన్నే లేచి భోగిమంటలు వేయడం, ముగ్గుల్లో గొబ్బెమ్మలం పెట్టడం, సాయంకాలం పిల్లలకు భోగిపళ్ళు పోయడం. భోగి కుండలు అమర్చుకోవడం. ఇలా ఎన్నో రకరకాలు చేసుకుంటాం. ఇవే విషయాలు చిన్న కవితలో చూద్దాం.
భోగిమంటలు వేసుకుందాం, భోగి పండగ చేసుకుందాం!
పనికిరాని చెత్తనంతా, పాత మాస్కుల కుప్పనంతా
పెరుగుతున్న క్రూరక్రిములను, పెచ్చరిల్లే వేరియంట్లను!!భోగిమంటలు!!
మంగళ స్నానాల్ మంచిగ చేసి, క్రొత్త బట్టలు ధారణచేసి
గుమ్మడిపూల గొబ్బిదేవతల పూజలు చేస్తు ముందుకు పోదాం
స్వాగతమిద్దాం సరదా భోగికి, సందడిచేద్దాం రారండోయ్ రారండోయ్!!భోగి!!
రేగు పండ్లతో దిష్టినితీస్తు తోయజాక్షులు
దీవనలిత్తురు.!భోగిమంటలు
పెద్దలు పిన్నలై దీవనలందిరి ఆనందంతో...
భోగి కుండల మోహనకాంతులు పూర్ణకుంభపు పుణ్యరాసులై
జీవన విధిలో సుఖములీనగా...భోగిమంటలు!!
మకర సంక్రాంతి.
ఈరోజే సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన మకర సంక్రాంతి.
విశేషాలు కవితలో
రైతు ఆశల పంట ఫలములు, ఇంట నిండుగ నిండగా
గుండె నిండిన సంబరాలె, గుర్తులై చిరునవ్వులు చిందగా
వచ్చిన మార్పే వరాల పండగ, సంబరాల సంక్రాంతి
గోమయపు ముద్దలే గోపికలై విరియగా, కన్నెలు పూజించు
క్రాంతి సంక్రాంతి.
క్రొత్త అల్లుళ్ళు,నవ వధువులేకమై,ఇంటింట చేసెడు ఆనందహేల
సూర్యున కిష్టమౌ క్రొత్తబియ్యపు పొంగళ్ళు, అమృతమధురిమలలీల
బంధుగణముల బహుముఖపాండిత్య,చమత్కారాల గోల
హరిదాసు గానాల ఆనంద భక్తితో పరవశమమందుచు
ధాన్యాల దానాల ధర్మంపు భావాలు.
బొమ్మల కొలువున అమ్మల ఆశలు,పిల్లలకెంతో ప్రేమదీవనలు
భోగిపళ్ళతో లోగిళ్ళన్నీ, ముద్దుగుమ్మల సంబరాలతో
ఆనందాలే హరివిల్లై నిండుగ నిండే పండగ సంక్రాంతి.
మరి కనుమ నాడో!!
పశువుల పూజకు ప్రాధాన్యంగా, త్యాగజీవులకు నిస్స్వార్ధంగా
మనస్ఫూర్తిగా గౌరవమిచ్చే, సంప్రదాయపు పండుగ కనుమ
గంగిరెద్దుల ఘన విన్యాసాలు, తెలుపును మనకు క్రమశిక్షణను
దారము ఆధారంగా నింగికి యెగసే పతంగులన్నీ
తెలుపును మనకు లక్ష్యసాధనను
కోడిపందెముల సంప్రదాయములు,తెలుపును మనదౌ పౌరుషాగ్నిని
కనుమా!కనుమను క్రాంతి దాతగా, మనుమా భావి సుఖప్రదాతగా!!
సంక్రాంతి కవితాభారతి. 28.12.22.
సీ: గృహముల ముంగిళ్ళ కేరింతసందళ్ళ
మోహనాంగులు దీర్చు మ్రుగ్గులలర
కపిల గోదుగ్ధముల్ కమ్మగ ద్రావుచు
లీల గెంతులిడెడు లేగలలర
పాడిపంటలునిండి పరవశంబందిన
కర్షకునేత్రాల కాంతులలర
హరిదాసు బృందాల " హారిలోహారం"చు
భక్తి మీరినహోరు రక్తిదనర
తే.గీ: కోడిపందాల పౌరుషాల్ , కోడెగిత్త
బండ లాగుళ్ళ సంబరాల్ పండుగనగ
వచ్చె సంక్రాంతి మాలక్ష్మి వైభవాన
భారతీయత పండిన పడతివోలె
పిన్నపెద్దల డెందాల ప్రేమ నింప.
భోగి శుభాకాంక్షలు.
సీ: పాడైన వస్తువుల్ పనికిమాలిన చెత్త
లోగిళ్ళ దహియింప భోగియనిరి
కన్యకామణులెల్ల ఘనరంగవల్లుల
లోగిళ్ళ రచియింప భోగియనిరి
పరుష సంభాషణల్ పాపచింతలెదల
లోగిళ్ళ గాల్చుట భోగియనిరి
కుంకుళ్ళరసముతో కూర్మికేశాఘముల్
పోగొట్ట ఘనమైన భోగియనిరి
గోమయపరికల్ప గొబ్బిళ్ళ సొబగులే
భూమినిండినవేళ భోగియనిరి
తే.గీ:ఇట్టి భోగాల నందు మహేంద్రరూపి
భారతీయుడొకండె సూ వేరులేడు
సంప్రదాయంపు సంపదల్ సవ్యరీతి
భద్రపరచిన మనకీర్తి భద్రమగును.
సీ: ఉత్తరాయణమందు నుత్తమ కార్యాలు
పుణ్యమిచ్చుననిరి మునులునాడు
మంచిగుమ్మడిపండు మహదాన మిచ్చిన
సత్ఫలంబులనిరి సకలమునులు
పోయిన నరులకు పుత్రతర్పణమున
నరకముండదనిరి నైష్ఠికాళి
మకరసంక్రమణంబు మహనీయ కాలమై
పుణ్యప్రదమనిరి మునులునాడు
ఆ.వె: మకరరాశియందు మాన్యుండు రవిజేర
ఉత్తరాయణమయి చిత్తమలరు
జీవనంబు మిగుల జేగీయమానమై
శుభములందు నరుడు శోభనముగ.
ఆ.వె. రేగి పండ్లు బోయ రేగిన జుత్తుతో
పాపలెల్ల విరియు పర్వ మిదియె
పాప దృష్టి తొలగి పదివేల కాలాలు
బ్రతుక గోరు క్రాంతి పధము లివియె.
కనుము.శుభాకాంక్షలు.
సీ: భారతదేశాన పాడిపంటలసిరుల్
బసవదేవుని కృపను వరలుచుండు
భారతీయుల జాతిపౌరుషంబును దెల్ప
కుక్కుటంబులబెంచు కూర్మిదెల్పు
సర్వపాపవిదారి చల్లని గోమాతృ
సేవయె దెల్పును శ్రీపథమ్ము
సకలజీవులప్రేమ సౌభాగ్యదమ్మని
కరుణజూపుటె మన కనుము కనుమ
తే.గీ: ప్రకృతి సర్వంబు ప్రేమైక భావనమున
పరిఢవిల్లిన తోడగు పరమశివుడు
విజయపథమిచ్చి కాచును నిజముగాను
భారతీయత లోనున్న పారమిదియె.