29, ఏప్రిల్ 2018, ఆదివారం

పంచమాశ్వాసము. 28.04.18.

                 పంచమాశ్వాసము. 
 
1. కం :    శ్రీవత్సగోత్ర శేఖర!
                కావుమ నీ గ్రామజనుల కలతలుదీరన్
                తావక సద్గుణ జాలము
               ధీవర! యందించుమయ్య తేజంబలరన్.

 2. వ.     కమ్యునిష్టులపై, నాజరు బుఱ్ఱకథపై నిషేధము తొలగించుట. రామకోటి ప్రోత్సాహము.

3.తే.గీ: "చండ్ర రాజేశ్వరాఖ్యు"ని  శాసనాన
              మార్పులెన్నియో పార్టీన మసలసాగె
              వాని గమనించి నాజరు హాని యనుచు
              స్వస్తిజెప్పెను "చండ్ర"కు సాదరాన. 
4. కం:   కమిటీ పేరున సభ్యుల 
              సమయించుట ఘోరమౌను శాపంబౌగా
              సమధర్మ హీనమౌటను 
              విమలాత్ముడు "రామకోటి" భేదించె సుమా!
5. ఉ:   ఉత్తమ సాహితీ విలువ లున్నత భావ వికాస రీతులన్
            గ్రొత్త విధాన సత్కథగ గూరిచి బుర్రకథాంశమై చనన్
            జిత్తము రంజిలం బలుకు శ్రేష్ఠుల పార్టికి వేరుజేయుటల్
            మెత్తని ఖడ్గమూని శిరమెల్లను ద్రుంచుటె నిశ్చయంబుగా.
6.ఆ.వె: ననుచు రామకోటి యాలోచనల్ జేసి
             "నాజరు దళమ"నెడు నవ్య దివ్య
              నామము ప్రతిపాదనంజేసి హితునకున్
              జాబు వ్రాసి పంపె జతను దెల్పి. 
7. కం:   నాజరు సంతోషమ్మని 
             సాజముగా నాదరించి సమ్మతి దెలుపన్
             భోజన వేళకు వచ్చెను
            తేజఃపుంజంబు కోటిధీరతవెలయన్.
8.కం:   నాజరు దళమను పేరున
             యోజనముల దూరమేగి యుత్సాహమునన్
             రాజుల గాథల జెప్పుచు
             రాజసమగు కీర్తి  గాంచె రసమయ జగతిన్. 
9.తే.గీ: ధనిక రైతు బిడ్డలనెల్ల త్యాగమూర్తు
             లనుచు, మధ్యతరగతి వారంత కష్ట
             జీవులుగనెంచి  కథలను జెప్పినారు
             సాంఘికాభ్యుదయంబును సలుపు కొరకు. 
10. శా : ఏ వేదంబుల కావ్య శాస్త్రములలో నేపారు తత్త్వమ్ములే
             భావావేశపు భోగభాగ్యరతులున్ భవ్య ప్రబోధమ్ములే
             లేవాయెన్నిరుపేద కష్టసుఖముల్ లేవొక్క గ్రంథమ్మునన్
             కావన్ రావలె సాంఘికాభ్యుదయ సత్కావ్యంపువైవిధ్యముల్.
11. మ: అని భావించిన"నాజరాఖ్యు"నకు ధీరాత్ముండు, సద్భావరూ    
              పి, నవాభ్యున్నతి నాయకాగ్రణియు, ధీ ప్రేమాస్పదుండై మహా
             ఘనుడౌ "బ్రహ్మన"చాపకూడదియె సాక్ష్యంబౌ వికాసాని కిం
             ధనమై భాసిలె నిమ్నజాతులకిదే సద్ధర్మ సంపూర్ణమై. 

 12.      నాజరు "పల్నాటికథను"బుఱ్ఱకథగ వ్రాయుట.

 13.      పంచచామరము : 
             "ప్రయాగరామశాస్త్రి"గారి పాదసేవజేయుటన్
             ప్రయోగముల్విశేషరీతి పాదుకొల్పె నాజరే
             స్వయాన వీర ధీర గాథ పల్కె నాటి సత్కథన్
             భయంబు సుంతలేక వ్రాసె భాష తందనానగా.
14. కం: వ్రాసిన పల్నాటి కథను
             వాసిగ నెచ్చోటనైన వచియింప మది
             న్నాసగ జూచు దళమునకు
             నా సమయమె కోరి వచ్చె నద్భుత సభయై.
15. ఉ : మంతెన వంశ శ్రేష్ఠులును, మాన్యులు వేంకటరామయాఖ్యులున్
            చింతనజేసి తత్కథను శీఘ్రము జెప్పగ నాజ్ఞనిచ్చుటల్
            అంతయు కాంగిరేసు ధన హార్దిక సాయమటంచు నాజరే
            చెంతకు జేరి వారికటు చెప్పె కృతజ్ఞతలన్ విధేయుడై.
16. తే.గీ:అచటి ప్రజలెల్ల దుర్విధి; హంత! యనుచు
             జానపద కథకుండును  జాణయైన
             నాజరాఖ్యుని దలచుచు సాజరీతి
             పలికిరిట్టుల ప్రేమమై ప్రజలు నాడు.
17.కం: చక్కని కథకుడు నాజరు
             చిక్కెను  పోలీసువారి చేతులలోనన్
             అక్కట!మరణము చెందెను
             దక్కిన రత్నంబు తిరిగి ధరణింగలసెన్.
18. ఉ : నాజరుకాక యెవ్వడొ యనామకుడా "పలనాటియుద్ధమున్"
             తేజము గోల్పడన్ కథను తేలికగా వచియించె నక్కటా! 
            "నాజరె యున్నచో వివిధ నాట్య విశేషములన్ వినూత్నతన్
             సాజముగాగ జూపి కడు సందడిజేసెడు వాడె ధీరుడై.

19. వ : నాజరు మరణించెనని భావించి ప్రజలు మొదటి బుఱ్ఱకథకు రాలేదు. వచ్చిన వారతనిని  గుర్తించలేదు.  తద్విషయమును గ్రహించిన నాజరు "కథకుడు నాజరు, హాస్య వంత రామకోటి, రాజకీయవంత లక్ష్మీ నరసయ్య"లని 3రోజులకు పూర్వమే కరపత్రములు వేయించి, "కష్టజీవి" కథను జెప్పెను.  ఆ కథకు చుట్టుపక్కల నున్న ప్రజలందరును నాజరు బ్రతికి యుండెనని విని అన్నపు మూటలు పెట్టుకొని, బండ్లను గట్టుకొని, కొందరు నడచి "ఇసుకవేసిన రాలనంతగా" వచ్చిరి.  కాంగ్రేస్ కార్యకర్తలు "నాజరు కాంగ్రెసు ఊసే ఎత్తలేదు.  కనుక తంబుర పైనున్న సుత్తి కొడవలి, తలపైనున్న యంత్ర చిహ్నము తీయించి"కాంగ్రెస్ కు జై"అని  అనిపించవలెనని పట్టుబట్టిరి.  ఆలపాటి వెంకట రామయ్య, మంతెన వెంకట్రాజు గారలు "ఎవరిష్టము వారిది. మీరు,   నక్షత్రాలు కొడవలికి బదులుగా  గాంధీ బొమ్మను వెండితో చేయించి నాజరు తంబురకు పెట్టింంచుడు. కాదనిన మేము మాట్లాడెదమ"నిరట. ఆనాటి నాయకులెంతయో  ఉన్నతముగా పార్టీకి అతీతముగా నాలోచించి సమున్నతముగా ప్రవర్తించిరి.  సాహిత్యమునకు కళలకు రాజకీయ సంబంధము లుండరాదు.  స్వచ్ఛత, సమానత్వములెంతో వన్నె తెచ్చును.   

20. వ.    నాజరు బుఱ్ఱకథకు ప్రాముఖ్యము పెరుగుట.

21. సీ : కాంగ్రేసు సభలలో కథలుజెప్పుట మొదల్
                                        ఖాకీల వేటలు కనగరావు
             కార్యకర్తలె నాడు కథకైదు వందల
                                    నేర్పాటుజేసిరి యింపుగాను
             గుంటూరు కృష్ణల గుమిగూడి ప్రజలెల్ల
                                  "తడికలగది"యైన తరలినారు
             ధనలక్ష్మి కరుణింప దండ(డా)లరూపాన 
                                      ధనగౌరవాదులు తామెవచ్చె
    తే.గీ : రంగు తుడవకమున్నె యా రమ్యమైన 
              సభల మీదకు వచ్చుచు సంతసాన
              కౌగిలింతలు సంస్తుతుల్  కార్యవర్గ
              సభ్యులెల్లరు మితిమీరి సలిపినారు.  
 22 .తే.గీ : పార్టి సంబంధమేదియు పట్టకుండ
               వేదికలనెక్కి దరిజేరి ప్రేమమీర
               కథలు చెప్పగ ప్రజలెల్ల కలసి వచ్చి
               ధనము సత్కీర్తులిడినారు దళమునకును.
23. తే.గీ : రాజకీయాలు కథలను రంగరించి
                కరుణ బీభత్స రౌద్రాల కలుపుచుండి
                వీరరసమును జొప్పించి విస్తువోవ
                "బుఱ్ఱకథ"లను జెప్పు టామోదమాయె.
24. చం : గురువులు సత్ప్రజల్ కథకు; కూరిమి పత్నియు, రామకోటియున్
              తిరమగు న్యాయమూర్తులిల; ధీ మధురానుభవంబులే సదా
              కరమరుదౌ ప్రభావిత సుకాంక్షిత సారస హావభావముల్
              వరమయి యొప్పె నా దళము వర్ధిల బుఱ్ఱకథా స్వరూపమై.
25.ఆ.వె : అద్భుతంపు రీతి హాస్యంబు సృష్టించి
               రామకోటి కథకు  రక్తి బెంచ
               బుఱ్ఱకథల తోడ మూఢవిశ్వాసాలు
               చెరపివేయునటుల జెప్పినారు.
26. సీ :  హాస్య రసస్ఫూర్తి యందరి హృదయాల 
                                పరిమళించు నటుల బలికినారు
             పిట్టలదొరవోలె పేకాట క్లబ్బుల 
                                గర్హించుచున్నెండగట్టినారు
             కోర్టుల లాయర్ల క్రుళ్ళును కడుగంగ
                                సద్విమర్శలనెల్ల సలిపినారు
            సోదులు మంత్రాలు సుఖదము కావంచు
                                 సర్వత్ర కథలను చాటినారు 
 తే.గీ :  చెనటి దౌర్జన్య చేష్టల జీల్చివేయ
            పూనుకొనిరటు వారలు బుఱ్ఱకథనె
            ఆయుధంబుగ జేయుచు నహరహమ్ము
            సంఘశ్రేయమ్ము మదినెంచి సాగినారు.

 27. వ.    విజయవాడ "ఆకాశవాణి"లో నాజరు బుఱ్ఱకథ.

28.ఆ.వె :నవరసాలు జూపి నటనను పండించి
                నాజరు దళమపుడు నవ్యరీతి
                సంఘమందు మార్పు సమకూర్ప యత్నించి
                సఫలమైరి వారి సతులవలన.
29. సీ :   భక్తప్రహ్లాదయన్ భవ్య చరితమును
                             ఆకాశవాణిలో నమరునటుల
              గాంధి నెహ్రులవంటి ఘనుల సత్కథలెల్ల
                                ఆకాశవాణిలో హర్షమొదవ
              అల్లూరి బోలిన యసమానవీరుల
                                దేదీప్యమానంపు ధీరతలను
              స్వారాజ్య సాధనన్ సాహసోపేతమౌ
                                  భారతసేనల పౌరుషాలు
 తే.గీ :   కలముఝళిపించి నాజరు గళమువిప్పి
             పాడి వినిపింప "స్వాతంత్ర్య భారతముగ"
             బుఱ్ఱకథవిన్న జనులెల్ల మురిసిపోవ
             విజయవాడ కు విఖ్యాతి విస్తరిల్లె.

   30.     నాజరు చిత్రరంగప్రవేశము.

31. సీ : "పుట్టిల్లు" చిత్రాన బుఱ్ఱకథను వ్రాయ
                          రాణి రుద్రమ కథ రక్తియనుచు
              "సుంకర" సత్కవి శోభాయమానమౌ
                               రచనను సాగించి రాణకెక్కె
               నర్సయ్య బృందంబు నాట్యంబు సమకూర్చి
                                 హావభావంబుల నమరజేసె
               రామకోటి మరియు లక్ష్మి నారాయణ
                                 నటులుగ మారిరి నవ్యమనుచు
 తే.గీ :   చిత్రసంగీత దర్శక శేఖరుండు
             ఘనుడు "సాలూరి " సద్వంశ గాయకుండు
             మెచ్చి నాజరు గాత్రంబు మేలటంచు
             ఐదువందల జీతంబు నాసజూపె.
32. సుగంథి వృత్తము :
           "పుట్టినిల్లు" చిత్రమందపూర్వ గాత్ర మాధురిన్
             కట్టివేసినట్టి గాయకాగ్రగణ్య మూర్తిగా
             పట్టుబట్టి నాజరాఖ్యు పాటగాని యర్హతన్
             కట్టబెట్టజూచె దర్శకాళి ముఖ్యుడత్తఱిన్.
33. ఉ : "వాహిని"సంస్థలో నయిదు వందలు వేతనమిత్తునంచు నా
             స్నేహమయుండు ప్రేమగను జీరిన నాజరు కాదటంచు దా
             సాహసియై మహాత్ముడగు "సాలురి గాయకవర్యు"తో ననెన్
             "మీ హవమున్ వినమ్రముగ మీరిన మమ్ము క్షమింపుడో సఖా!"

 34 : వ. ఈ విధముగా నాజరు చిత్రసీమలో పనుల వలనను, "ఆసామి" యను నాటక రచనలో మునిగి యుండుట వలనను, తన కుటుంబ విషయమే మరచి యుండగా, భార్యయే పసిబిడ్డనెత్తుకొని తన బావ కొడుకును తోడుతీసికొని విజయవాడకు వచ్చినది. అంతట నాజరు భార్యకు పరిస్థితులను వివరించి ఒక అద్దెయింట కాపురము ప్రారంభించెను. 

35. తే.గీ : నవ్య రీతుల "ఆసామి"నాటకంబు
                "ఆంధ్ర ఆర్టు ధియేటర్"సహాయమునను
                పూర్తి యైనది నాజరు పుణ్యమెంతొ
                సఫలమైనట్లు భావించె చక్కగాను.
36. ఆ.వె : ఆంధ్ర నాటకముల "ఆసామి"మెరుగని
                 ప్రథమ బహుమతినిడె "బందరందు" 
                తిరిగి దాని దళము "తిరువూరు"నందున
                వేయలేక మానివేసినారు.    
37. చం : ప్రియమగు రామకోటి తన వీలును సౌఖ్యము జూచుకొంచునున్
               రయమున వెళ్ళిపోయె "మదరాసు"కు బుఱ్ఱకథల్ త్యజించుచున్
               అయనము చక్కజేయుటకు హాస్యపు పాత్రకు "రామకృష్ణు'నిన్
               భయమదిలేని వ్యాఖ్యలకు వంతగ క్రైస్తవు దెచ్చె నాజరే.

 38 : వ.  మద్రాసు వెళ్ళిన రామకోటి "అగ్గిరాముడు చలనచిత్రంలో "ఆచార్య ఆత్రేయ"గారి సలహాలతో బుఱ్ఱకథ వ్రాసి నటించే అవకాశము మనకు వచ్చినది.  వెంటనే రావలసినదని నాజరుకు కబురు పంపగా "లక్ష్మీ నరసయ్య"తోడుగా  మద్రాసు చేరెను. 

39. సీ :   రామకోటి తనను రమ్మని పిలువంగ
                             నరసయ్య తోడుగ నాజరరిగె
              రైలు దిగినదాది రాచమర్యాదలై
                        "ఆచార్య ఆత్రేయ"ననుసరించె
            "ఉడ్లాండ్స్ హోటలు"నునికిగా మార్చిరి
                       శీతలత్వమె బహుశ్రేయమనుచు
             కూరగాయలు,పండ్లు, గుంటూరు గోంగూర
                             చప్పని తిండిచే జలుబుజేయ
 తే.గీ :  దీన గతిజూచి "ఆత్రేయ""దేవి"యనెడు
            బసకు బంపెను, భోజన వసతి కొఱకు
            గ్రుడ్లు చేపలు తినగను కోర్కెదీర
            కుదిరె రోగంబు,  భోగంబు కూడి వచ్చె.

40 : వ. ఆత్మానందపరవశుడైన నాజరు చలనచిత్ర పరిశ్రమౌన్నత్యమును గూర్చి ఈరీతిగా ప్రశంసింపసాగెను. 

41. సీ : అంకితభావంబు లాత్మ ధైర్యములున్న
                                శిఖరాలకెక్కించు చిత్రసీమ!
            పేదవానిని గూడ పెద్దవానిని జేసి
                           సిరులొల్క జేయును చిత్రసీమ!
            మోమునన్ కళయున్న మోదాన దరిజేర్చి
                            చేతనత్వము బెంచు చిత్రసీమ!
             కళలకు నెలవైన కౌగిలినిచ్చుచు
                         చిఱునవ్వు చిందించు చిత్రసీమ! 
           సంగీత సాహిత్య సత్కళామూర్తుల
                           శిరమున దాల్చును చిత్రసీమ! 
           అర్వది నాలుగు హైందవ కళలను 
                            చిగురింపజేయును చిత్రసీమ!
            జాతి గర్వము బెంచు చరితల జూపించి 
                             శిరము పైకెత్తు నా చిత్రసీమ! 
             ధనమద గర్వముల్ దౌష్ట్యంపు చేష్టల
                            చీల్చి చెండాడు నా చిత్రసీమ! 
 తే.గీ :  సంఘసేవకు సరియైన సాక్షి యనగ
             నిండు కళలకు నిలువెత్తు పండువనగ
            జ్ఞాన విజ్ఞాన గ్రంథాల స్థానమనగ
            మనకు లభియించె చిత్రాలు మణులవోలె.

42. వ : "అగ్గిరాముడు"చిత్రంబునకు ఏ బుఱ్ఱకథ బాగుండునని చిత్రదర్శకులైన "శ్రీరాములు నాయుడుగారు"నాజరు నడుగగా "అల్లూరి సీతారామరాజు"అని చెప్పి కథను పది నిమిషములకు 
సరిపోవునటుల, పదునైదు రోజుల లో వ్రాసి యిచ్చి అభ్యాసంబు చేయుచుండ "రష్యా సాంస్కృతిక బృందంబు నందలి గాయకుడు నాజరును "అబ్బా!సూటిగ నాటెను తుపాకిగుండు రాజు గుండెలోన అయ్యో!" అనునది పై స్థాయిలో ననిపించెను. కథ ఎత్తుగడ రౌద్రములో "ఆ వార్తయే రాజుకొచ్చెరా సై!,  అగ్గిరాముడై లేచెరా సై!" అనే ఘట్టము పాడి చివరకు విషాదరాగము"అయ్యో!"అని పై స్థాయిలో ఆలపించెను. ఆ స్థాయిలోనే రామకోటి నాజరును కూడ     అనిపించినాజరు పాడినదే బాగున్నదనెను. ఆ సమయములో నచటనే యున్న,  నందమూరి తారక రామారావు, భానుమతి, నాయుడు గారు, ప్రేక్షకులు కంట తడిబెట్టిరి. "అబ్బ" అనుచోట పదమూడు సార్లు రష్యా గాయకుడు పలికించగా   భానుమతి గారు"ఆయనను శ్రమపెట్టవలదు. ఒక్క కెమేరాతో అంతకు మించిరాదు."అని చెప్పి ఒప్పించిరి. అంతియగాక" నాజరుగారి దగ్గర ఇంత కళ ఉన్నదని, బుఱ్ఱకథకింత ఆదరణ ఉన్నదని ఊహించలేదు" అని ప్రశంసించిరి. "అగ్గిరాముడు"చిత్రము తరువాత నాయుడు గారు ఒప్పుకొనిన దానికన్నను అదనముగా సహస్ర  రూప్యములు, బుఱ్ఱకథ కనుకూలమైన దుస్తులు, కథ రికార్డు ఇచ్చి పంపిరి. నాజరు మరల విజయవాడ చేరి  లక్ష్మీ నరసయ్య, వెంకటేశ్వరరావు లతో కథలు చెప్పనారంభించెను.

43. తే.గీ : చిత్రమది"బలేబావ"విచిత్ర మయ్యె
                బుఱ్ఱకథ వ్రాయ జనులకు మోదమొదవె
               "జానకీ వనవాసమె"చరితకెక్కె
                రామకోటియు నరసయ్య రహిని జేర.
44. తే.గీ : క్రొత్తపోకడలన్నియు గూర్చిపేర్చి
                బుఱ్ఱకథను నవ‌రసాల ముంచివైచి
                ఆ"బ.లేబావ"చిత్రాన నాడిపాడి
                విజయవాడకు నాజరు వెళ్ళెనపుడు.
45. ఉ :   జానపదంపు సత్కళకు చక్కని జీవముబోసె నాజరే
               తానుగ సర్వమయ్యెనని ధాటిగవ్రాసిరి"ఆంధ్రదర్శినిన్"
               కానగ నా జరాఖ్యు "యుగకర్త"గ జెప్పెను "శ్రీనివాసుడే"(శ్రీనివాస చక్రవర్తి)
               మానితమూర్తి యాతనికి మంగళహారతులిచ్చిరందరున్.

46.వ :   ప్రభుత్వ సంగీత, నాటక సంస్థ ఆధ్వర్యమున మరొకమారు "కలకత్తా"నుండి బుఱ్ఱకథ జెప్పుటకు నాజరున కాహ్వానము వచ్చెను. ఆ సమయముననే వంత లక్ష్మీ నరసయ్య "ప్రయాగ నరసింహశాస్త్రి" తో కలసి వెన్నుపోటు పొడుచెను.

47. సీ :   కలకత్త సంస్థయే కబురంపె ప్రియమార
                        నాజరు బృందమున్ మోజుపడుచు
              శ్రీలక్ష్మి నరసయ్య చింతన దుష్టమై
                               నరసింహశాస్త్రితో నడపె కథను
              పాటపాడుటరాని పరమమాయికుడైన
                               నరసయ్య చెలిమిని నలిపివేసి
             మాదె నాజరు దళమనుచు నమ్మబలికి
                                బుఱ్ఱకథను జెప్పి మోసగించె
 తే.గీ :  వాణి"పత్రిక చిత్రాల వరుసలోన 
            లక్ష్మి నరసయ్యయు ప్రయాగ"ల కలయికను
            చిత్రములజూచి కుఱ్ఱడు చిన్నవోయి
            నాజరెచ్చట గలడని నవ్వుకొనెను"
48. ఆ.వె :"చల్లపల్లి"లోన జరిగిన ఘటనకు 
                గుండెపగిలి రగిలి గొంతు మూగ
                వోయె, కథనుజెప్పబోవ మనసురాక
                నాజరయ్య మిగుల నలిగినాడు.
49. సీ : నరసయ్య బాకీని పరువుగా భావించి 
                                        దళము తీర్చెను దాని తక్షణంబె
             "ఆదంబి"నగలమ్మి ఆ "జక్కమ పురా"న (జక్కంపూడి)
                                       మాగాణి కొనుమన్న మాయజేసి
             తనపేర యాస్తిని దక్కించుకొనినాడు
                                       ద్రోహచింతన గల్గు ధూర్తుడగుచు
             "బలెబావ"చిత్రంపు బహుమతి ధనముతో
                                        కొనెను నాజరు పేర కొంతపొలము
  తే.గీ : ఎన్ని తికమక చర్య లెన్నెన్ని కీడు
            తలపులవి మది దలచిన కలతమిగులు
            ననుచు నాజరు జార్చెను అశ్రువులను
            మిత్రతత్త్వంబు నటియించు మ్లేచ్ఛుజూచి                                     
50. ఉ  : పొమ్మని జెప్పలేకతని , పోయెద నేన"నె నాజరత్తఱిన్
             ఇమ్మహి స్నేహబంధములవేవియు చక్కగ సాగవెందుకో 
             నెమ్మది చీలిపోయి కడు  నీచపు నైజము వెల్వరించు, లే
             లెమ్మని భార్యబిల్చి కదిలెన్ తన వాసము పొన్నెకల్లు గా.
51. తే.గీ: బుఱ్ఱకథలె యుపాధిగ ముందుకేగు 
               దళము సభ్యుల మార్గాలు దశలు మార
               విధియె వికటించి యీరీతి వెక్కిరించ
               తలచె నిట్టులు నాజరు ధైర్యముడిగి.
52 . మ : "నరసయ్యే నను ముంచిపోయెగద యన్యాయంపుటాలోచనన్
                తెరువే చిక్కగ రామకోటి పరమోద్దీప్తాంతరంగంబుతోన్
                తెరపై జేరెను హాస్యపాత్రలకు చింతేలేని మాన్యుండుగా
                ధరలో నాజరె యొంటరయ్యెనకటా! దారిద్ర్యమే తోడుగా"

                      నాజరునకు భార్య ప్రోత్సాహము.

53. తే.గీ : అనుచు దుఃఖించి దుఃఖించి యలసిసొలసి
                పగటి నిద్రకు బూనిన పతిని జూచి
                మోము గప్పిన వస్త్రంబు ముడిచివైచి
                 కారణమరయగోరె నా కాంతయపుడు.
54 . కం : ఏకాకినైతి నేనిటు 
               చీకాకులు చుట్టుముట్టె చిత్తములోనన్
               నాకొడుకు చిన్నవాడయె
               ఏ కథలను జెప్పగలను నెవ్వరు లేకన్?

 55. వ : అని నాజరు వ్యధజెందుచు "వెంకటేశ్వరరావు వంతగా సగము క్రొత్త.   చిన్న కుమారుడు "బాపూజీ"పూర్తిగా ఢక్కీ వరుసలు కొట్టజాలడు.  ఇక నేనెటులు   కథలు సాగింతు"నన, భార్య ఆదంబీ"మీరు దిగులు పడుటయేమి? ప్రజలు నవ్వుదురని,  తానును నవ్వి,  ఎటులైనను కష్టపడి వారిరువురకు నేర్పి, కథలు చెప్పవలసినద"ని ధైర్యము చెప్ప నత్యంత కష్టము మీద సంగీత, రాజకీయ, సాంఘికములను మేళవించి, అంతయు తానై, తానే అంతయునై కథలు చెప్పనారంభించెను. 

  56. వ. నాజరునకు "కల్కితురాయి"సన్మానము."బుఱ్ఱకథా సామ్రాట్" బిరుదము లభించుట.

57. ఉ : తంబురతీగలం గలిపి తన్మయ భావము లేర్చికూర్చి,యా
           "తుంబురు"వోలె,బుఱ్ఱకథ తోషణమొప్పగ"కాకినాడ"లో
             నంబరమంటు రీతిగ మహాద్భుత "కల్కితురాయి"భూషచే
            పంబిన గౌరవంబునను పందెముతోడను బొందె నాజరే.
58. ఉ : వంతలు క్రొత్తవారయిన వారలు నాజరు శిక్షణంబునన్
            వింతగ జ్ఞాన వంతులయి వేదికలందనుకూల రాగముల్
            చింతన జేయుటం గథకు శ్రేయము గల్గుచు రక్తిగట్టెగా
            "పంతము మానవాళినిల ప్రాజ్ఞుల జేయు నజేయశక్తియై." 
59. సీ : కారున నూరేగి "కల్కితురాయి"ని
                              పొందంగ నాదంబి పుణ్యఫలము
            బుధులెల్ల దరిజేరి "బుఱ్ఱకథకులందు
                               సామ్రాట్టు"నీవన సతికి జెందు
            కాకినాడ జనులు కమనీయ రాగముల్
                               కురియింప నిల్లాలి కోర్కె బలము
            ఇన్ని సన్మానంబు లిన్ని ఘనతలకు
                              "నాదంబి"ధైర్యంబె యమితవరము
  తే.గీ : అర్థనారీశు తత్త్వంబు నమలు పఱచి
            శక్తి రూపంబు తానెయై సాగుచుండి
            నన్ను ముందుకు నడిపించె వెన్నుదట్టి
            యనుచు నాజరు పులకించె నహరహమ్ము.      

  వ :    నాజరు సన్మానము నకు బులకించి వర్షకాలమేతెంచెను.

  60 .సీ : కారుమబ్బులనింగి  గటికచీకటి గ్రమ్మి
                                        విద్యుల్లతాళికి వేదికైన
              నెండినబీడుల కెదలెల్ల బులకింప
                                 వానజల్లుల నేల పరవశింప
              శ్రావణమాసాన చానల నోముల
                                 పండింప కన్నులపండువైన
              పల్లెసీమలలోన పంటలకూపిరై
                       పచ్చదనము నింపు వర్ష ఋతువు
  తే.గీ : కాలవశమున  భేకాల గళ రవములు
           మారుమ్రోగగ, తూనీగ మధుపతతులు
           రెక్కలల్లార్చు శబ్దాలు రిక్కలంట
           కాగితపు పడవల కళ కళలు మెరసె.

                        గృహ నిర్మాణము.

  61. తే.గీ : గోడలే లేని మహలున గుట్టుగాను
                గండుచీమల మధ్యన కలసి మెలసి
                బ్రతుకు కాలాన "నీదుల" వంశజుండు
                బుఱ్ఱకథలను జెప్పించు మోజుతోడ
                వచ్చె నాజరు కడకు దైవంబు భాతి.
62. తే.గీ : ఇట్టి దుస్థితి నున్నట్టి యిల్లు జూచి
                కథలకేర్పాటు జేసియు "కంభమం"దు
                కలప సామాను, సున్నంబు వలసినంత
                సాయమందించె నాతడు సౌమ్యుడగుచు.
63. ఉత్సాహ వృత్తము:
                పంచభూత నిలయమైన భాగ్యహీన భూమి, యా
                మంచి డెందమున్న "రెడ్డి " మహిత దాతృ శోభచే 
                నంచవంటి స్వచ్ఛమైన "యక్షగాన నిలయ"మై
                కాంచగల్గె నాజరంత కామితార్ధ సిద్ధుడై.

   వ.         నాజరు "బొబ్బిలి కథ" వ్రాసి గొప్ప సన్మానము నందుట.


64.ఉ :"బొబ్బిలి గాథ"వ్రాయుమన పూజ్యులు జ్ఞానులు భాస్కరార్యులే;
             ప్రబ్బిన మానసంబునను ప్రాజ్ఞుల నాజరు సంప్రదించుచున్
             అబ్బిన సాహితీ పటిమ, నంకితభావము, పౌరుషాదులన్
             ఉబ్బిన నుత్సుకత్వమున నోహొయనంగను గానరూపుడై.
65. తే.గీ : యక్షగానంబు, రగడల యందుజేర్చి
                ద్విపద తాళగతులనెల్ల వీర రౌద్ర
                రసములను, నడకలను, సారతర రీతి
                నడపి కథనుజెప్పె, విజయ నగరమందు.
67. శా :  చాలుంజాలనె ప్రేక్షకాళి మొదలే శాసించుచున్నందరున్
              శీలంబుల్, ఘన పౌరుషాలు, ప్రభుతల్ చిత్తాలు వర్ణింపగా,
              మేలౌ నాకథ పూర్తిగా వినినచో మీదెట్టులో మీరలే
              గోలంజేయకనుందురన్న జనముల్ కూర్చుండిరేకాగ్రతన్.  
 67. తే.గీ : విజయనగరంపు సంస్థాన వీరవరుల
                సుతులు"బొబ్బిలి చరిత"కు చోద్యమంది
                నీవు చెప్పిన విషయాలు నిక్కమనుచు
                నుడివి "సింహతలాటమున్"దొడిగినారు.

వ.           పూలరథముపై ఊరేగింపు, "గండపెండేరము" "బుఱ్ఱకథ పితామహ" బిరుదు.


68. సీ : "భీమవరం"బెంత ప్రియమార నిల్చెనో
                       "గండపెండేరమ్ము" గాంచుకొఱకు
            "గన్నబత్తుల"వారి ఘనతెంత  గొప్పదో      (గన్నాబత్తుల రంగరాయ సోదరులు)
                                బుఱ్ఱకథకునిల ప్రోత్సహించె
            "జవ్వాజి నాయుడి"జాణతనంబేమొ          (జవ్వాది లక్ష్మీ నాయుడు)
                                సంధాన కర్తగా సాగెనచట
            రథముబూన్చిన  నెడ్ల రాశిఫలంబేమొ
                       పూలరథము లాగ మోరలెత్తె
             స్వరకళాధిష్ఠుల  సంబరమెట్టిదో
                          నాదంబుజేయుచు నడచె వారు
             సుప్రజాళికి నెంత సోదర భావమో
                          "నాజరు జూడంగ నగుచుజనిరి
            "శ్రీ మహావాది"కి, "శ్రీ సూరి"గార్లకు.           (మహావాది వెంకటప్పయ్య శాస్త్రి)
                           నెంతవాత్సల్యమో  యేరికెఱుక
             "కాల్జాచి సభయందు కథజెప్ప నాజరే
                      ప్రథముడ"టంచును బల్కుమనిరి
   తే.గీ : "నిడదవోలు"ను "నార్ల"యు నిలిచియుండ    (నిడదవోలు వెంకట్రావు)
              "గండపెండేర "సత్కార మండనమున
             "బుఱ్ఱకథపితామహుడ"యె మోదమలర.
               నాజరాఖ్యుండసామాన్య నవ్యగుణుడు.
 69.  సీ : ఎచ్చోట బాడుచు నేకథ జెప్పినన్
                       బంగారు బహుమతుల్వడసెనతడు
             ఎచ్చోట నాడుచు నేరీతి నిల్చినన్
                            ముత్యాల హారాల మునిగిపోవు
             ఎచ్చోట హాస్యంబు నింపుగా గల్పింప
                          వింత కేయూరాలు సొంతమగును
             ఎచ్చోట భావాల నేలీల పచరింప
                          బిరుదు గారవముల పేర్మిబొందు
  తే.గీ : ఆతడాతడె నాజరాత్మాభిమాని
           ప్రజల గుండెల నిండిన ప్రాజ్ఞతముడు
          "బుఱ్ఱకథ కళావిభవ సంపూర్ణుడతడు
           ఎన్ని జన్మల పుణ్యమో యేమి వరమొ!

వ.        నాజరునకు కేంద్రప్రభుత్వము "పద్మశ్రీ"ప్రకటించుట.

70. సీ . జిల్లా కలెక్టరు సిన్మహాలుకు వచ్చి
                                     చిరునవ్వుతోడను చెప్పెనిట్లు
             ‘‘ కేంద్ర ప్రభుత్వంపు సాంద్ర పద్మశ్రీయె
                                     బహుమతి రూపాన  వలచె నిన్ను
              బుఱ్ఱకథలకు నుప్పొంగి మేను మరచి,
                                      వల్లె యనుటయె నీ వంత’’నంగ
              కాదన్న తనకిక ఖైదని భయపడి
                                       ఒప్పుకోలును జెప్పె నుత్తముండు
  తే.గీ, నాజరాఖ్యుడానాడు విజ్ఞానియౌచు
            తనను ప్రేమగ జూచిన తల్లి వాణి
           పాద పద్మాల విడువక ప్రణతులిడుచు 
           గర్తపురికి, భారతికిని ఖ్యాతిదెచ్చె. 
 71. చం :‘‘స్థితులిల దారితప్పి  పలు తీరుల వంతలు మారిరెందరో
               అతుకులబొంతయయ్యెగద యద్భుత బుఱ్ఱకథా విధానమే,
               అతివను, నా కుమారునిల హాయిగ వంతలు జేయమేలగున్
               వెతలిక దూరమౌన’’ నుచు వేదికలెక్కెను నాజరత్తఱిన్.

  వ.        నాజరు పొందిన బహుమానములు, సన్మానములు.

72 .వ. ప్రథమ శిష్యులు ‘‘ విఠల్ బ్రదర్స్’’ చే పాలకొల్లులో వెండినటరాజును, బొబ్బిలి దొరవారి కోట ముందు  ‘‘ పెట్టల నరసింహారావు’’ చేత బంగారు సింహతలాటమును, సినీ దర్శకులు ‘‘ తాతినేని సుబ్బారావు’’ చేత రజత పానపాత్రలు, వేయి నూట పదునారు రూప్యములును, ‘‘ఘంటసాల వెంకటేశ్వరరావు’’ నుండి వేయి నూట పదునారు రూప్యములును,  ‘ బుఱ్ఱకథోద్ధరణకు జన్మించిన వాడ’’ ను ప్రశంస, ‘‘ లాంఫారం’’ లో ఘంటా కంకణమును, గుంటూరులో  ముత్యాల హారమును, దుగ్గిరాలలో ‘‘ నవరత్న హారము’’ను, విజయనగరంలో ‘‘బంగారు కేయూరము’’ను  తంజావూరు, తిరుచునాపల్లి  తెలుగు సంఘాల వారినుండి ‘‘ నటరాజ విగ్రహాలు, రజత పతకాల’’ను 1978 లో రంగస్థల వృత్తి కళాకారుల మహాసభలో తన శిష్యురాలైన శ్రీమతి జమున చేత నూట పదునారు రూప్యములు, 1982లో ‘‘ హైదరాబాద్ రవీంద్ర భారతి’’ లో శ్రీమతి జమున చేత విశిష్ఠ సభ్యత్వము, ఐదువేల రూప్యములను, ఈ రీతిగా లెక్కకు మిక్కిలి పురస్కారములు తమకు తాముగా వరించినవి.

73. ఆ.వె.  ముఖ్యమంత్రులెల్ల మోదంబు దెల్పిరి
                  బుఱ్ఱకథను నేర్ప బూను కొఱకు
                 పదియువేల ధనము పండిత శాలువా
                 పిల్చి యిచ్చిరపుడు ప్రేమమీర. 
       
వ.           ద్వితీయ పుత్రుడు  "బాపూజీ" అద్వితీయముగా బుఱ్ఱకథా వారసత్వము నిలుపుట.

 74. ఉత్సాహ వృత్తము : 
                 ఆదిభట్ల హరికథాళి,  అన్నమయ్య కీర్తనల్
                 ప్రోదిసేసి పెట్టినట్టి పుణ్యసాహితీ సుధల్
                 వేదికలను బంచలేదు వీరి సంతు వింతగా
                 వాదమేల "బాపుజీ"ని వారసత్వమంచు నా
                 మోదమంది  మోసె భారవాహకుండునైకథల్
                 సేదదీరి నాజరంత స్వేచ్ఛ యనుభవించెగా.
75. ఉ :    వాసిగలట్టి నాజరును బాధను బెట్టగ మూత్ర రోగమే
                తోసుకురాగ భీతిలుచు దొల్తగ గర్తపురిన్  ప్రసిద్ధులౌ
              "కాసరనేనివారి"మము గావుమటంచును నార్తి గోరగా
               భాసుర దైవమై నిలచి భద్రముగా ఘన రక్షకుండయెన్ . 

 వ.          నాజరు గ్రంథరచనాభిలాష.

76. ఉ : మంచము పట్టియుండినను మానక గ్రంథము వ్రాయనెంచుచున్
             సంచిత పుణ్యకార్యమన చక్కని చిక్కని "జాతి జీవితం"
            బంచిత రీతి పొత్తముగ బంచెను స్వానుభవంబులెన్నియో
            ఎంచగ నాజరాఖ్యుడిల నేరుగ వచ్చెను వాణితేజమై.

 77.       మంగళమహాశ్రీ వృత్తము :  
             తక్కువ కులంబునను దా ఘనుడనంచు నల ఖ్యాతి గనె "బుఱ్ఱకథ"లోనన్
             మక్కువ స్వరాశ్రయ సమాశ్రిత విధంబలరె "తంబుర"ను మీటు గతిచేతన్
             అక్కమల గర్భుసతి హాస విలసత్ప్రభల గెల్చె జనమాన్యులను "నాజర్"
            అక్కజము వాని పరమాద్భుత, సుసంగతులు, సౌరులిక నేమి నుతియింతున్!
 78.ఉ : జీవితమంత సత్కళల సేవకు, వృద్ధికి ధారవోసి, యా
            భావితరాల శ్రేయమును, భాగ్య సుసాహితి వృద్ధి మార్గముల్
            కావగ నిల్చినావు గద కారణజన్ముడ! నాజరాఖ్యుడా!
            తావుల జిమ్మినావు రస ధారల, పుట్టుక సార్థకమ్ముగన్.
79. ఉ : వ్రాసిన గ్రంథమిచ్చి, విధివ్రాతకు నీ తలయొగ్గి,లోకముం
            బాసిన నాజరాఖ్య!నిజ ప్రాణసమంబగు కీర్తికాంతయే
            వాసిగజేరి నిల్చినది పాయని ప్రేమను శాశ్వతమ్ముగన్ 
            నీ సములెవ్వరిచ్చట? వినీత చరిత్రుడ! వందనాలివే.

 80. వ: నాజరు నిరుపేద కుటుంబమున జన్మించియు  పట్టుదలతో సంగీత నృత్యాభినయ కళలలో నారితేరి "బళ్ళారి రాఘవ"వంటి మహోన్నత మూర్తుల ప్రశంసలంది, ఎందరో గాయకులకు, నటులకు గురువై , ఆదర్శాభినయ పాత్రుండై దేశ విదేశీయుల మన్నన లందిన  మహోత్కృష్ట  జానపద కళాకారుడు. అతడు పొందిన సన్మాన, సత్కార, బహుమానములే అందుకు  నిదర్శనము. సాంఘిక సమానత్వమును, పేదల అభ్యున్నతిని తన బుఱ్ఱకథా కళారూపమున ప్రచారము చేసిన త్యాగమూర్తి, తుది శ్వాస వరకు సారస్వత సేవ గ్రంథరచన జేసి  భావితరాలకపురూప కళామృత భాండము నిచ్చిన కళా తపస్వి. నాజరు పేరుతో "పోష్టలు స్టాంప్ " వచ్చుట, ఎందరో యువ కళాకారులకు బుఱ్ఱకథలు నేర్పుట, మధురగాయకుడు, గానగంధర్వుడు ఘంటసాల వారికి బుఱ్ఱకథా కథన విధానమును సూచించుట, నందమూరి తారకరామారావు, అంజయ్య వంటిముఖ్యమంత్రు లెందరి చేతనో శ్లాఘింపబడి  సన్మానముల నందుకొనుట ఆయనకే చెల్లినది.  
          నాజరునకు ప్రతి రూపమైన "బాపూజీ" తండ్రి వారసత్వమును పోనీయక , కథాకథన రహస్యములను తండ్రి వలన గ్రహించి "పుత్రా దిచ్ఛేత్ పరాజయమ్" అను నానుడిని రుజువు చేయుచు ఆదర్శముగా నుండుట ముదావహమే."జాతస్యహి ధృవో మృత్యుః " అనునట్లు మానవజన్మకు మరణము తప్పదు.  కుటుంబము తననెంత జాగ్రత్తగా చూచుకొన్నను, శారీరక రుగ్మత, వయో భారము వలనను  ఇరువురు భార్యలను, ఐదుగురు కుమార్తెలను, ఇరువురు కుమారులను వదలి 78 సంవత్సరాల వయసులో 1997 పిబ్రవరి 21వ తేదీన పరమపదమందెను. 

 వ. జన్మభూమి యైన "పొన్నెకల్లు"లో నాజరు "శిలావిగ్రహము."

 "సుకవి జీవించు ప్రజల నాలుకలయందు" అని జాషువా గారనినట్లు  నాజరు చిరంజీవియే. తన జన్మస్థలమైన"పొన్నెకల్లు"లో శిలారూపియైయున్నాడు. 

 81. మాలిని : 
             ఘనతర సుర సుశ్లోకా ! వినీతాత్మ భాసా! 
             జనగణమన సంకాశా ! ప్రశాంతా ! సుహాసా!
             ధనమదగణ విచ్ఛేదా ! వికాసా ! సుతేజా ! 
             వినయసుగుణ మేధావీ ! విలాసా ! మహేశా ! 
 62. కం : సుమధుర దయాలవాలా! 
              కమనీయ నిజాంతరంగ!  కామిత వరదా! 
              మముగాచు శేఖరార్యా!
              తమకంబుల బాపుమయ్య ధారుణిలోనన్.

63.  వ :  ఇది శ్రీరామ పదారవింద మకరందపానమత్త తుందిలుండును, సుజన 
సంస్తుత్యమాన మానసుండును, బంధువత్సలుండును, శ్రీవత్సగోత్రజుండైన   
పొన్నెకంటిపూర్ణచంద్రశేఖర వరప్రసాదరాయాఖ్య తనూజుండనైన,
సుజనవిధేయ సూర్యనారాయణరాయ నామధేయ ప్రణీతంబైన 
"బుఱ్ఱకథనాజరుచరిత" మందలి  పంచమాశ్వాసంబు.  
                       

    
                                                        మంగళమ్ మహత్...

                       


             






పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...