31, మే 2020, ఆదివారం

శివతాండవం.

పద్యాలతోరణం... నేటివర్ణనాంశం..శివతాండవం.
     ..31.05.2020.

    సీ: శిరసుపై గంగమ్మ గిరగిరా తిరుగంగ
                 జూటంబుకదలాడె చోద్యమలర
         ఆకాశమేతన హద్దంచు చెలరేగ
              ఆఢమరుకమనె "నయివుణంచు"
         నాట్యభంగిమలందు నవరసాలొలికింప
                  పట్టుదప్పుచునుండె పన్నగాళి
         తకిటతోం తకిటతోం తకటతద్థిమి యంచు
                   తనువెల్ల పులకించె తాళగతుల
          పదగతుల్ శ్రుతిమించి ప్రళయభావముగూర్ప
                    కైలాస గిరియెల్ల కంపమందె
          ఒకచెంప గణపయ్య యొకపజ్జ గౌరమ్మ
                     పరవశంబునుబొంది పైకి జూడ
         ఇంద్రాది సురలు మునీంద్రాది ముఖ్యులే
                    శివతాండవంబంచు శిరమువంచ
         పదునాల్గులోకాలు పారవశ్యమునంద
                      ఆత్మావలోకియై యాడెనమ్మ!
  తే.గీ:  ఆదివారము నట్టింట హర్షమొదవ
            తాండవంబును గాంచుట ధన్యతమము
            తోరణంబున కవివరుల్ తుష్టిజెంద
            పరమ మాహేశుడిచ్చుత!వరములెల్ల.
                      శుభంభూయాత్!!!

         శివ కేశముల చిత్రమునకు..నా స్పందన.

         స్వర్ణ మయమైన మకుటంబు సాధుసాధు
         జూటముండిన నదియును శుభముశుభము
         వేషములలోనె భేదాలు వింతలన్ని
         లోకశంకరులెకద ముల్లోకములకు.
         

16, మే 2020, శనివారం

నిషిద్ధాక్షరి..

     పద్యాలతోరణం... నిషిద్ధాక్షరములు.. ర,య,మ,న.
        సూర్యస్తుతి. 15.05.2020.

        పగటి దైవంబ! జీవుల వాంఛితాల
        గాంచి కాపాడుచుండెడో కాలవిదిత!
        పృధివి పులకించు జాడ, సంసృష్టి జూడ
        కాంతి దాతకే వీలగు  కచ్చితంబు.

       
            పద్యాలతోరణం..4.06.2020. మీపొన్నెకంటి.
            ప,వ,న,జ.అక్షరాలు నిషేధం.. ఆంజనేయస్తుతి.

            హృదయ కమలమందు శృంగారరాముడు
            కరుణ దాగియుంట, కలలు సత్య
            మౌచు,  సీత కాంచు మార్గంబుకుదిరెగా
            సూర్య శిష్య! కీశ!శుభ్రచరిత!
         
           లంకాభీకర కీశా!
           లంకిణి మదసం హరణ!విలక్షణశూరా!
           అంకిత శ్రీరామచరణ!
           సంకటముల దీర్చుమయ్య సద్గుణగణ్యా!

       పద్యాలతోరణం..8.6.2020.
      స,ర,ల,క...నిషేధం గా...లక్ష్మీ దేవి స్తుతి.

     శుచియందు గజమునందున
     వచియించెడు భాషయందు వైభవమందున్
     ఉచితజ్ఞునవ్వు నందున
     పిచుమందపుభూజమందు వెన్నుని యువిదే.

       గ,ణ,ప,త...నిషేధాక్షరాలు.. గణపతిస్తుతి..
     
       ఎలుకవాహనమెక్కి మమ్మేలు సామి
       కరిముఖుండ!విఘ్న హరుడ!కావుమయ్య!
       నీదు దీవన లేకుండ నీశుడైన
       విజయమందడు వెనకయ్య! వేదవేద్
   
     ప,ర,వ,త..నిషేధాక్షరాలు... పార్వతి స్తుతి.
        గణనాథుగన్న జననీ!
        గుణసంభాసీ!సదమల కోమలి యంబా!
        కణకణము జగము నిండిన
        ఫణిభూషణుసాముజాణ! ఫాలాక్షుసఖీ!

              ప,ర,మ,శ. నిషేధము....పరమేశ స్తుతి.
       
          అభవ! ఓలతాంతాయుధు హంత!నాగ
          భూష ణా!భూత నాధా!విభూతి నొసగి
          కావ దయసేయు సాధుసంకలిత భావ!
          భానుడ! సదయ! కాలాంత! భవ్యగుణుడ!

          హ,న,మ,త...నిషేధాక్షరాలు.. హనుమంతునిపై పద్యం.
           
         కపిపుంగవా!సరస వా
         గ్విపుల వచోవిభవ కీశా! వీరాధీరా!
         కృపజూచి కావరావా!
         అపురూప వరప్రభావ వ్యాఖ్యాలోలా!

       శ,ర,మ,త...అక్షరాల నిషేధంతో...రామునిపై పద్యం. 

    భానుకులజుని సుగుణుని పాదధూళి
    నావ సోకిన లలనయై పోవునంచు
    కాళ్ళు కడిగియె యెక్కించి కదలిపోయె
    గుహుడు యోచించె జ్ఞానియై గుట్టునెఱిగి.
ఆటవెలది..ప్రతి. పా. మొదట..రా..రావాలి. రామ పదం ఒకేసారి రావాలి. 
    రాగభావచయము రంజిల్లుమోముతో
    రాచఠీవి వరలు రమ్యగుణుడు
    రాక్షసాంతకుండు రంగైన దైవము
    రాము సుగుణధాము రసననిలుపు.
నిషిద్ధాక్షరి: త,ర,మ,స..లు లేకుండ. శ్రీహరి స్తుతి. 
  దీనావన గోపాలా!
  నేనెందున వెదకువాడ నిశ్చల బుద్ధిన్
  గానగ నుంటిని హృదినే
  గానవిలోలా! దయాళు! కనబడు దేవా!
నిషిద్ధాక్షరి: య,ర,ల,వ...నిషేధం..విష్ణుస్తుతి. 
   మాపతీ! మధు సూదనా!మదనజనక!
   ఖగపతీ!ముని జనగణ జ్ఞాన సింధు!
   మమ్ము సతతంబు కాపాడు మమతతోడ
   నిన్ను పూజింతు సద్భక్తి సన్నుతాంగ! 


   

     




      

12, మే 2020, మంగళవారం

అమ్మ..10.05.2020.

                     అంశం. "అమ్మ". 10.05.2020.
        అమ్మ పాదారవిందములకు ప్రణామములతో
         మాతృదినోత్సవము..సందర్భంగా..
                 
   సీ:జననంపు హేతువై జగమున యశమీను
                    మామంచి దేవత మాతృమూర్తి
      పేగునబంధించి ప్రియమార కాపాడు
                    మామంచి దేవత మాతృమూర్తి
      గుర్తుబట్టుటనేర్పి కోరినవ్వులబంచు
                    మామంచి దేవత మాతృమూర్తి
      నవ్వనేర్పునెపుడు నవ్వులపాల్గాక
                    మామంచి దేవత మాతృమూర్తి
      అత్తతాతనిపించి యడుగులువేయించు
                    మామంచి దేవత మాతృమూర్తి
      తొక్కుబల్కులనేర్పి తోడుగ రెట్టించు
                    మామంచి దేవత మాతృమూర్తి
       ఓంకారమునునేర్పి యుత్తమగురువైన
                     మామంచి దేవత మాతృమూర్తి
       సంస్కార సద్గుణ సౌమ్యత్వములనేర్పు
                     మామంచి దేవత మాతృమూర్తి.
 తే.గీ:మాతృదేవత మనకున్న మహిని సర్వ
        భోగభాగ్యాల దేలెడు పున్నెమబ్బు
        పరగ  మమతసమతలంద ప్రాప్తిగలుగు
        అమ్మలేదన్న మాటెప్డు నమ్మలేము.

        ఆ.వె:అమ్మతోడు!అమ్మ యండగనుండగ
                నన్ని యున్నయట్లు హాయిగొలుపు
                ఆమెలేక జగతి యంధకారమెగద
                అమ్మ పదమెమనకు నమృతమయము.
అంతర్జాతీయ మహిళా దినోత్సవము
సందర్భంగా మహిళామళులెల్లరకు
శుభాకాంక్షలు.. 

 స్త్రీ మూర్తి సృష్టి కర్తగు
 స్త్రీ మూర్తియె త్యాగవర్తి  శేముషిదాతౌ
 స్త్రీ మూర్తియౌను జగమది
 స్త్రీ మూర్తికి వందనాలు చేయుము నరుడా.


7, మే 2020, గురువారం

జయరాం..స్పందన.

జయరాం ఉత్పలమాలకు స్పందన.

  కమ్మని కంఠమందు కవిగాంచినభావమె ద్యోతకంబయెన్.

  రమ్మని తోరణంబునకు రాగసురాగసుధాంబుధిన్సదా
  మమ్ముల ముంచితేల్చుడని మానితరీతినిస్వాగతింపగా
  నెమ్మినిబల్కితిన్సురభినేస్తుని మాటను గౌరవించుచున్
  కమ్మని కంఠమందు కవిగాంచినభావమె ద్యోతకంబయెన్.

   పద్యంబల్లగ వాయువేగమున  నీ పజ్జన్సదాతిర్గుటే
   హృద్యంబౌ పదగుంభనమ్ము రసముల్శోభాయమానంపు,నై
   వేద్యంబై రసనాగ్రరాణిదయచే విద్వాంసులేమెచ్చగా
   చోద్యంబందగనబ్బెనాకు సఖుడా శుభ్రాంశుతేజోనిధీ.

    [08/05 7:59 pm] జె జె. యస్: స్పందన
        ~~~~~~~
పదము పదమున కవియొక్క భావనలను
కంటి ముందట చూపె నీ  గానసరళి
తెలుగు కవితల నున్నట్టి తీయదనము
కలము గళముల నింపుగా మిళితమయ్యె .
[08/05 8:47 pm] suryanarayana rao ponneka: భావస్వారస్యమున్నట్టి పదములెంచి
   రసముచిప్పిలురీతిని వ్రాయుచున్న
   నీదు పద్యాలపరిమళ మెట్టిదన్న
   వేల మల్లెలొకసారె విచ్చినట్లు.
 
       ఈనాటి నాదత్తపది పూరణపై..

     ఆంగ్లపదములగూర్ప నాయాస పడితి
     భావమందిన పొసగవు పదములన్ని
     పదము కుదిరిన స్వారస్య మదనుతప్పు
     ఎట్లొ కూర్చితి గణములనీశుకరుణ.
[08/05 8:49 pm] suryanarayana rao ponneka: వేలమల్లెలు గుంపుగా విచ్చినట్లు.

      పద్యాలతోరణం.. పై చిత్రమునకు (ఆవు ఒడిలో పులి)
     నా స్పందన..మీపొన్నెకంటి..22.05.2020.

  మునులున్ సిద్ధులు యోగులెల్లరును సమ్మోదంబులింపారగా
  మనముల్కల్మషదూరమై కరుణ సన్మార్గంబటంచున్సదా
  దినముల్గడ్పిన భారతావనిని సందేహంబులేలన్సఖా
  ఘనమౌ ధేనువు గుండెకద్దుకొనె వ్యాఘ్రంబున్ మహోత్సాహియై.

   పద్యాలతోరణం.. కన్నయ్య..లేగ.చిత్రమునకు
     నా స్పందనలు...మీపొన్నెకంటి.30.05.2020
 
    రంగు రంగులబుజ్జాయి రమ్యమైన
    నీలవర్ణుని యొడిలోన తేలిపోయె
    మోహనాంగుడ ద్దానిని ముద్దుజేసి
    అమ్మ తాననునట్లు సమ్మోదమొసగె.
 
    గోపకాంతలు నేనెప్డు గోలచేతు
    నంచు చాడీలు చెప్పుదురమ్మతోడ
    వారినిందలు సత్యమా ? పల్కుమనిన
    లేదులేదంచు తలద్రిప్పె లేగదూడ.

     పద్యాలతోరణం.. గాంధీజీ చిత్రమునకు
       నా స్పందన.మీపొన్నెకంటి.8.06.2020.

     శాంతిపథమది శస్త్రమై సాగిసాగి
     దేహమంతయు వ్యాపించె దివ్యమగుచు
     విశ్వమానవ శ్రేయమే వేడికొనుచు
     జాతిపితయయ్యె గాంధిజీ జయమునంది.

     శాంతికాంగ్ల పదము సర్వకాయమునిండె
    గాంధితాత జూడ కారునలుపు
    హింస మనకునెపుడు హేయంబటంచును
    పలికి గాంధి మిగుల ప్రగతిగూర్చె.

    లీలామోహను బంధము
     హేలగ నను జుట్టివేయ హృదయంబెల్లన్
     పాలనుగలసిన జలముగ
     లీలంగడు తెల్లనాయె లేదితరంబున్.

     నేటి తెలుగు కవిత ...ఒక యువకవి మానసిక స్థితి.
   సంధులనిన నేడు సదవగాహనలేదు
   ఏసమాసపటిమమేమిలేదు
   భావపుష్టి జూడ పరిమితంబౌనుసూ
   తెలుగు కవితలన్న దిగులుపుట్టు.
ముందునుయ్యి వెనుక గొయ్యి...ఈ పదాలు అలాగే ఉంచి 
భారతార్ధంలో ..ఆటవెలది.
కృష్ణ మానభంగ దృశ్యంబు గాంచుచు
రాజుకెదురు చెప్ప రవరవపడు
ద్రోణ భీష్మ కృపుల దుస్థితి గమనింప
వినుడు**ముందునుయ్యి వెనుకగొయ్యి**
స్పందన: కందమునుగూర్చి కందములో...
   పందిని బొడిచిన బంటగు
   కందము నందముగవ్రాయ కవిపుంగవుడౌ
   పందెముతో కందాలను
   వందలు వేల్జెప్పుకవికి వందనశతముల్.





     
    

4, మే 2020, సోమవారం

నవ్వుల దినోత్సవం.3.05.2020

నవ్వుల దినోత్సవం శుభసందర్భమున
         అందరికి నవ్వుల శుభాకాంక్షలు.03.05.2020
                            మీ పొన్నెకంటి.

     ఉ : కొందరు నవ్వినన్ జగతి కుక్కుటముల్ధర కేరినట్లగున్
           కొందరు నవ్వినన్ నిజము కుండలు బ్రద్దలె యైనశబ్దముల్
           కొందరు నవ్వినన్ పరమ గూఢనిగూఢప్రవృత్తి ద్యోతమౌ
           కొందరు నవ్వినన్ సరిగ గుర్తును బట్టగలేము నవ్వనిన్

           కొందరు నవ్వినన్ బహుళ గుంభనమై పరమార్ధమైచనున్
           కొందరు నవ్వినన్ చెలగి ఘోరవికారపు చేష్టదోచెడిన్
           కొందరు నవ్వినన్ ప్రబల కోపప్రకోపము గీతదాటెడున్
           కొందరు నవ్వినన్ సరస కోమలి వాలుగ చూచినట్లగున్

           కొందరు నవ్వినన్ గడుసు కోడలు భర్తను బిల్చినట్లగున్
           కొందరు నవ్వినన్ ముదురుగోపిక ముద్దులమూటలౌనుగా
           కొందరు నవ్వినన్ కఱకు కోరలుగల్గిన శేషుఫూత్కృల్
           కొందరు నవ్వినన్ మదిని  కోర్కులు తీరక నేడ్చినట్లగున్.

           కొందరు కొందరంచునటు కూరిమి చాలని నవ్వులేలకో
           అందరు నిర్మలాత్ములయి హ్లాదముగూర్చెడి భంగినవ్వరే
           మందగునయ్యదే పరమ మారినిసైతము పారద్రోలగన్
           విందగు జీవితాన కడు వేడుకగూర్చును మానవాళికిన్.

           నవ్వ నేర్చిన రోగముల్ నయము నయము
           సన్న నవ్వులు విసిరిన జయముజయము
           నవ్వగల్గిన జీవియే నరుడునరుడు
           జీవితాంతము సతతంబు చేయుమయ్య!
           

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...