చిత్రానికి భావన.సీ.. భూదేవిస్పర్శ చే మోదమానసుడయి
ఆది వరాహరూపమరె నిచట.
కౌమోదకీ గద ఘన సుదర్శనమది
పాంచజన్యంబులు పాణులమరె
పాతాళమందలి పన్నగంబుల జంట
పాదమ్ములందున వరలె చూడ
ఛత్రంబు శిరముపై చక్కగనుండెను
నెండతగులకుండ మెండుగాను.
తే.గీ: ప్రభలు విరజిమ్ము సర్వమ్ము ప్రముఖ శిల్ప
కళను చూచినంతనె మన కనులు చెదరు
విష్ణుమూర్తి యె యీరూపు వెలసెననగ
చెక్కె మేధావి రాతిని చేవదనర.ఫ
గోవులపై బాలగోపాలుడు.
సీ: దక్షిణ హస్తాన తనకిష్టమౌ లడ్డు
వామహస్తమునందు వరలెగోవు
పాదాబ్జముల చెంత పరమ హంసయొకండు
మోమున కస్తూరి మోదమలర
పీతాంబరంబును ప్రియమార ధరియించి
చిలిపి చూపుల నొప్పు చిన్ని కృష్ణ
కంఠాన మౌక్తిక కమనీయ హారాన
ముద్దుగొల్పుచునుండు మోహనుండు
ఆ.వె: శిరము పైన నుండి చిరునవ్వు తోడను
నీదు నాదు హృదిని నిండినాడు
మోక్షదాయి యతడు మోకరిల్లు సతము
దుష్టపాప చయము తొలగిపోవు.
పై చిత్రానికి నా స్పందన.( వానరము ...సింగము )
కఱ్ఱయొకటె కలదు బుర్రలేదెక్కడ
నిదురపోవు హరిని కదుపనేల?
కానిపనులు నిన్ను కష్టాలపాల్జేయు
వద్దు మాటవినుమ వానరంబ!..1.
నీదుబలముతెలిసి నేర్పునమెలగుమ
సాహసంబు వలదు శక్తిమించి
నిద్రపోవుహరిని నీవేల కొట్టెదు
కోతిపనులు సతము కొంపముంచు...2.
వానరంబు నీవు వన్యమునకురేడు
సింగమదియ నిన్ను చీల్చివేయు
కోతిపనులవేల?కుదురుగనుండక
హరిని జేరగలవు హరినిగొట్ట... 3.
శివునిపై సంపూర్ణ చంద్రబింబము.
పూర్ణచంద్రుండు శిరముపై పూవుకాగ
లీల మౌనముద్రితుడయి హేలనుండ
జగతి నోంకారశబ్దంబె శరణమనగ
నాసనాశీనుడైయున్న నాత్మభవుని
మసనమే నివాసంబుగ మసలువాని
తరలివచ్చిన గంగను దాచినట్టి
శక్తి హృదయ సంవర్తు నాసక్తితోడ
గొల్తు భూతిప్రసాదంబు కొఱకు నేను.
పై చిత్రమునకు..నా భావన.
ఎన్నిమారులు చెప్పను కన్ననీకు
బువ్వతినుమని హాయిగా బొజ్జనిండ
స్వచ్ఛ గోక్షీర శర్కర సారమిదియ
మాత గోరుముద్ద లెపుడు మధురతరము.
సైకిల్.. బామ్మ..చిత్రానికి నా స్పందన.
సీ: పదులారు నిండియు పచ్చికమోపుతో
సైకిలు నడిపించు జాణయీమె
భూమిని నమ్ముచు మోదానకృషిసల్పి
ముక్కారు పండించుముదితయీమె
కండ్లకు నొకజోడు కాళ్ళకు సరిజోడు
చీరసోకదిలేని నారియీమె
ఒంటరయ్యును మహోన్నత మూర్తియై తానె
యాదర్శముంజూపు నతివయీమె
ఆ.వె: పచ్చగడ్డిమోపు పరమాద్భుతంబుగ
వాహనంబు పైన సాహసాన
నుంచి నడపు బామ్మ యుండునాయెచటైన
భరతసీమగాక తరచిచూడ.
సమస్య....
ఒక్కరి లాస్యమంత్రము మరొక్కరి హాస్యము కొంటెచేష్టలున్
టక్కరిచూపులన్వలల ఠక్కునలాగెడు గోపికామణుల్
అక్కజమొందురీతి యమునమ్మయె మోదవినోదమందగా
చిక్కెను చిక్కెనో యనగ చిన్మయరూపుడు దక్కెవారికిన్.
ఒక్కరి లాస్యమంత్రము మరొక్కరి హాస్యము కొంటెచేష్టలున్
టక్కరిచూపులన్వలల ఠక్కునలాగెడు గోపికామణుల్
అక్కజమొందురీతి యమునమ్మయె మోదవినోదమందగా
చిక్కెను చిక్కెనో యనగ చిన్మయరూపుడు దక్కెవారికిన్.
బిరుదులు పొందువారె కడు విజ్ఞులు సత్కవులౌ తెనుంగునన్.
సరసత నుత్తమోత్తమ రసాంచిత భావవిశేష ప్రౌఢిమల్
వరమగుపద్యధారలును వాసిని బెంచునలంకృతుల్ విభా
సుర పదగుంభముల్ సుకవి శూరుల మెప్పుల సత్సభాళినిన్
బిరుదులు పొందువారె కడు విజ్ఞులు సత్కవులౌ తెనుంగునన్.
రైతు చిత్రం....స్పందన..
పారను చేతబట్టుకొని పైరుల నిత్యము సాగుచేసి-యొ
ప్పారెడు త్యాగజీవివయి పంటల నెప్పుడుపండజేయు-సం
స్కారపు ధన్యమూర్తి! భువి చక్కని భోజన మెక్కడోయి-శ్రీ
కారము దుక్కిదున్నకయు కల్పులు దీయక మిన్నకుండినన్.
రైతు.. బండి..చిత్రమునకు స్పందన.
ధాన్య లక్ష్మియు గృహలక్ష్మి దర్పమెలర
బండి నెక్కిరి సతతంబు భద్రమనుచు
పంట నింటికి జేరిచి ప్రాభవముగ
రహిని గల్గింతు ననియెను రైతుబిడ్డ.
"నిర్మలు"నగరు కళలకు నిలయమెపుడు
వడ్ల బస్తాలు మూటికి నెడ్లబండి
కట్టి సాగించు సతితోన కౌలురైతు
ముందు పగ్గాలు పట్టుచు మోదమలర.
స్వర్ణ పుష్పాలజెక్కెడు సౌరుగల్గు
హస్తకళలకు ప్రాభవమంతరింప
బ్రతుకు దెరువులు వేరుగ వెతుకలేక
"నిర్మలు"కళల రాజు కన్నీరుగార్చె.
పై చిత్రమునకు నా స్పందన.(పడవపై తండ్రి,కొడుకు)
గంగపుత్రుల జీవన గతులుజూడ
వనము బోటులు చేపల వలలతోనె
సాగుచుండును నెప్డు సంసారమందు
మీనసంపదె వారికి మేలుగూర్చు.
పైచిత్రానికి పద్యరూపం ..
చిత్రమునకు నా భావన.
ఏన్గు ముఖంబును నెంచక్క నతికించి
బ్రతికించియుంటను పరమతేజ!
నీరజములనిన నీరములన నీకు
నానందమొదవును నాఖువాహ!
నాకేమొ భయమయ్య నామీద చల్లకు
తొండంబు పూరించి స్థూలదేహ!
చిన్నవాడనునేను చేతులు జోడింతు
విడిచిపెట్టుమునన్ను విఘ్నరాజ!
పెద్దవాడవీవు ప్రియమైన యన్నవు
నాదు మాట వినుము నయముగాను
నాన్నకిష్టమయ్య నవ్యాభిషేకాలు
చేసికొందమనఘ!చిత్తమలర.
మామ..కరణం శేషగిరి రావు.
సీ : అమ్మ సృష్టివి నీవు - అయ్య పోలిక , గజ
ముఖ చర్మములు మీకు ముద్దుగొలుపు
అయ్య తేజము నేను - అమ్మ పోలిక, శక్తి
అయ్యది,యరుదగునమ్మ దీప్తి ;
ఆడుచున్నాము పెద్దమ్మ యొడిని జేరి
కడుచిత్రమౌ గాదె కననిది మరి !
ఆఖువాహనమును నద్భుత "శక్తి"యు
నాకులఁ దేలగా నందమదియు
తే.గీ : నెమలిపై నేను విహరింప నెమలి కన్ను
నీదు తలనెక్కి కూర్చుండె నెయ్యమునను
మన కుటుంబము ౙూచి యీ మానవులును
బ్రతుక గలిగిన భూమియే స్వర్గమగును..!
వినాయకుని వీడ్కోలు..స్పందన.
కనగ నెచటైన నాన్లైను క్లాసులుండు
వీడియోలనె పాఠాల వీక్షణంబు
నేను వత్తును తాతయ్య నీదువెంట
స్నేహమయ్యెను హాయిగా చిన్నియెలుక.
పై చిత్రమునకు నాస్పందన.
కాడి కవ్వము కదురులు కలసిమెలసి
పల్లెలందున సిరులను పంచెనాడు
నేటి జీవన సరళిని నెమకి చూడ..,
అర్ధమెరుగక నవియెల్ల వ్యర్ధమనును.
పై చిత్రమునకు ..(ఆవుదూడ...స్వరూపానంద)నాస్పందన.
వత్సమా! యిర్వురమొకటె వసుధయందు
పూర్వజన్మాన నేనును ముగ్ధమోహ
నాకృతిన్ గోవునైతి మహాత్ము కరుణ.
"ఆత్మ వత్సర్వ భూతాని" యనెడురీతి
హత్తుకొందును నామది హ్లాదమంద.
నీకు వలయును క్షీరంబు నిన్ననేడు
నాకువలయును లలితాంబ నవ్యభవ్య
దివ్య కరుణరసాంచిత దీవనలును
మాతృ కృపచేత మనకెప్డు మన్ననగును.
సింహమపై వెళ్ళు పార్వతి, చిత్రమునకు నా స్పందన...
సీ: అగ్రభాగమునందు నాఖువాహనుడుండ
కార్తికేయుడువెన్క కదలుచుండ
కేకి కొమ్మపయిన క్రిందమూషికరాజు
ఘూకంబునొకవైపు కొలువుదీర
కమలవాసిని చేత కమలంబు పైకెత్త
హంసవాహిని వీణ హాయిమ్రోయ
కనులవిందగుచుండ కైలాస గిరివైపు
కురులు విరబోసి కూరుచుండి
తే.గీ: సింహవాహిని జగదంబ చిద్విలాసి
భువనములనేలు ముక్కంటి ముద్దుగుమ్మ
సాగుచుండెను వనమున సంతసాన
మనల రక్షించు నిరతంబు మమతతోడ.!
చిన్ని పాప, చేట...చిత్రమునకు నా భావన..
చెరుగ బియ్యము కొన్నిటి చిట్టితల్లి
చిత్రము సగము మిగిలెను చేటయందు
పనిని జేసెడు యత్నంబు భావినీకు
యశము గూర్చును సతతంబు హ్లాదమిచ్చు.
పై శ్రీకృష్ణ చిత్రమునకు నా ఉత్పలమాల.
ఒక్కరి లాస్యమంత్రము మరొక్కరి హాస్యము కొంటెచేష్టలున్
టక్కరిచూపులన్వలల ఠక్కునలాగెడు గోపికామణుల్
అక్కజమొందురీతి యమునమ్మయె మోదవినోదమందగా
చిక్కెను చిక్కెనో యనగ చిన్మయరూపుడు దక్కెవారికిన్.
పై చిలిపి వలపు చిత్రానికి నా స్పందన.
మల్లె పూలతోడ మరులనుగొల్పుచు
పెదవి పంటనొక్కి ప్రేమజూపి
చిలిపి వలపు విసిర, చెంతచేరకయున్నె
షండుడైనగాని సంతసాన!
మల్లె పూలతోడ మరులనుగొల్పుచు
పెదవి పంటనొక్కి ప్రేమజూపి
చిలిపి వలపు విసిర, చెంతచేరకయున్నె
షండుడైనగాని సంతసాన!
పై శ్రీకృష్ణ చిత్రమునకు నా ఉత్పలమాల.
ఒక్కరి లాస్యమంత్రము మరొక్కరి హాస్యము కొంటెచేష్టలున్
టక్కరిచూపులన్వలల ఠక్కునలాగెడు గోపికామణుల్
అక్కజమొందురీతి యమునమ్మయె మోదవినోదమందగా
చిక్కెను చిక్కెనో యనగ చిన్మయరూపుడు దక్కెవారికిన్.
చిత్రమునకు స్పందన.
చిలిపి చూపుల చిన్నది చీరగట్టి
బుట్టనిండుగ మల్లియ పూలునింపి
ఎదురు చూపుల మున్గిన దెవరికొఱకొ?
కన్నెమనమును దోచిన కాముడెవడొ?
సమస్య: తద్దినమ్మన శుభమని తరుణి మురిసె.
పెండ్లి యైనట్టి క్రొత్తల ప్రేమతోడి
సరసవచనాల ఘటనల చనవుతోడ
గుర్తుచేయుచు నవ్వుచు భర్తపలుక
తద్దినమ్మన; శుభమని తరుణి మురిసె.
కృష్ణ స్వామి స్ గ్రామ చిత్రానికి స్పందన.
సీసము
తల్లారమందున తనలేత కిరణాల
కబురులాడగవచ్చు కర్మసాక్షి
పచ్చదనములిల పరచుచు గ్రామాన
నుత్సాహమందించునుద్భిజాళి
ఎటువైపుజూచిన నెఱ్ఱని మట్టితో
కనువిందు గలిగించు కాలిబాట
ఆలయంబులిచటహ్లాదంబు జేకూర్చ
ఆధ్యాత్మ శోభల నందగించె
తేటగీతి
ప్రకృతి సౌందర్య మిచ్చోట పరిఢవిల్ల
మీదు కుంచియ కదలాడె మించు గరిమ
కృష్ణసామిరో ! మనసున తృష్ణదీర
దెంత పొగడిన చిత్రంబు ధీవిశాలి !
---✍--పొన్నెకంటి సూర్యనారాయణరావు .
తేది -- 10 -- 12 --- 2017