|
బుఱ్ఱకథ నాజరు చరితము |
చంపూ కావ్యము |
|
రచయిత: పొన్నెకంటి
సూర్యనారాయణ రావు |
|
|
శ్రీరస్తు! శ్రీ గురుభ్యో నమః శుభమస్తు!
ముందు మాట
‘‘సంగీతమపి సాహిత్యమ్
సరస్వత్యా: స్తన ద్వయమ్, ఏక మాపాత మధురం అన్య
దాలోచనామృతమ్’’. అట్టి ఆలోచనామృత కావ్య సృష్టి కి నన్ను ప్రేరేచిన సాహితీ ప్రియులు,
మాన్యులు పట్వర్ధన్ గారికి
హార్దిక ధన్యవాదములు. ముఖ పుస్తకము ద్వారా పరిచయమైన వారు నాకు స్వయముగా
ఫోన్ చేసి అందరును ఒక్కొక్క ప్రబంధము
వ్రాయ సంకల్పించిరి, మీరును తప్పక ఒక ప్రబంధము వ్రాయవలసినదని చనువుగా, స్నేహశీలియై ఆదేశించిరి. అంతే, నాకేమనుటకు తోచక, సాధ్యా
సాద్యాలాలోచింపక అంగీకరించితిని. దాని
ఫలితమే ఈ ‘‘ బుఱ్ఱ కథ నాజరు చరితము ’’ .
దృఢ సంకల్పమున్న భగవంతుడు సానుకూల పరిస్థితులు కల్పించునని నా ప్రగాఢ విశ్వాసము . దానిని రెండవపర్యాయము భగవంతుడు రుజువు చేసెను . నా దృఢసంకల్పబీజము వృక్షమగుటకెందరో పాదుచేసి, నీరుపోసి, ఎరువువేసి అద్వితీయ ఫలముల నందించారు. అందు బీజము వేసినది మాన్యులు, ఆచార్య పట్వర్ధన్ గారు. తదభివృద్ధి కి శ్రీయుతులు కిరణ్ ప్రభ (సుప్రసిద్ధుల జీవితచరిత్రలను టాక్ షోలుగా వెలయించిన విశ్వ సాహితీబందుగులు), శ్రీ జొన్నలగడ్డ జయరామ శర్మ, శ్రీయుతులు డా. అంగడాల వెంకట రమణ (నాజరు గారి జీవితముపై పరిశోధనా వ్యాసము సమర్పించినవారు), ‘‘పద్మశ్రీ’’ షేక్ నాజర్ గారి ద్వితీయపుత్రులు బాపూజీ గారలు కారకులైరి .
‘‘పద్మశ్రీ’’ షేక్ నాజరు గారి చరితే వ్రాయ సంకల్పించుటకు కారణము, మేమిరువురము అంతే వాసులము. ‘‘జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసీ’’ అనునట్లు నా జన్మ భూమి
ఋణము దీర్చుకొనుటకు వారి చరిత్ర వ్రాయుటే యుచితమనిపించినది. ఉదధిని ఉద్ధరిణె లో
బంధించినట్లైనది నాజరు గారిని ప్రబంధములో బంధించుట.
కారణము ప్రబంధము 300 పద్యములు దాటరాదను నియమమే. కాని దాటినవి. ప్రబంధ
లక్షణములకనుగుణముగా వ్రాసినను రస స్థాయి సహృదయ పాఠకుల మనస్సులను రంజింప జేసిన నాడే
దానికి సార్ధకత. అది లభించినదో లేదో పాఠకులే తెలుపవలెను.ఇది చంపూ కావ్యముగా పూర్తి అయినది.
ఇందుగల గుణములు నా గురుదేవుల ఆశీ:ప్రసాదములు, దోషములు నా యజ్ఞాన దుష్ఫలములు. బుధులు క్షీర నీర న్యాయ విదులు. కనుక క్షీరమునే గ్రహింప ప్రార్ధించుచున్నాను. దోషములను సూచించిన తప్పక సవరించుకొందును.
బుధజన విధేయుడు
పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
బుఱ్ఱకథ నాజరు చరితము - కథా సంగ్రహము
వర్షాధారిత ప్రాంతమగు "గుంటూరు" జిల్లాలోని "పొన్నెకల్లు" గ్రామములో అన్ని కులములతో బాటు దూదేకుల మహమ్మదీయకులమునకు జెందిన "షేక్ మస్తాన్",అతని అన్న "నాజర్" కుటుంబములుండెడివి. మస్తాను చెక్కభజన, నాజర్ షెహనాయి కళాకారులు. నాజర్ గొప్ప కళాకారుడిగా సుప్రసిద్ధుడు. దురదృష్టవశాత్తు ఒక కుమారుడు కలిగిన తదుపరి నాజరు మరణించెను. ఆ సమయముననే 5.02.1920 న మస్తాన్ కు కుమారుడు కలిగెను. తన అన్నగారంత గొప్ప కళాకారుడు కావలెనని కుమారునకు "నాజర్ వలి" అని పేరుపెట్టిరి. మస్తాన్ కుటుంబమంతయు కూలికి వెళ్ళినగాని జరుగుబాటులేనిస్థితి. వారు కుమారుని ఐదవ సంవత్సరమున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు బంపిరి. నాజర్ చిన్న నాటినుండి సమయస్ఫూర్తిగను, ఆశువుగను పాటలల్లి మధురముగ పాడెడువాడు. పాఠశాలలో చిన్నచిన్న నాటకములలో వేషములు వేసెడువాడు. ఇతని పెదనాన్న వారసత్వముగా వచ్చిన స్వరజ్ఞానమును, అభినయకౌశలమునుఇతని''కనకధార''నాటకపాత్రద్వారా గమనించిన హార్మోనియము కళాకారుడు"ఖాదర్ఖాన్"సంగీతమునేర్పించుటకు"తెనాలి"దగ్గఱ"పెదరావూరు"లోని"బాలరత్నసభ"లోచేర్పించెను. రెండు సంవత్సరముల తదుపరి ఖాదర్ ఖాన్, నాజరును సంగీతవిద్యలో పైస్థాయి కొఱకు "నరసరావుపేట"లో "మురుగుళ్ల సీతారామయ్య" గారి దగ్గఱ చేర్పించెను.
సీతారామయ్యగారు నాజర్ కు సంగీతము మాత్రమే నేర్పుచు భోజనసదుపాయములకు
వేశ్యావీధులలో వారములను చేయించెను. అచట నేర్చిన సంగీతపరిజ్ఞానమే"పద్మశ్రీ"పురస్కారముపొందుటకు,"బుఱ్ఱకథాపితామహుడగుటకు, వాగ్గేయకారుడగుటకు" తగు
స్థాయిని కల్పించినది.
"నరసరావుపేట" నుండి పొన్నెకల్లు వచ్చిన
తరువాత తండ్రి మరణము వలన కుటుంబ బాధ్యతలు నెరవేర్చుటకు కూలిపని,దర్జీపనిచేసెడివాడు. చెల్లిపెళ్ళికి తనకునాటక, పాటలపోటీలలో
వచ్చిన మొత్తము బంగారు, వెండి బహుమతులనమ్మెను. దర్జీపని
చేయుచు దర్జాగా పాటలుపాడుచుండగా చూచిన "కొమ్మినేనిబసవయ్యగారి" సహాయముతో
సంగీతోపాధ్యాయునిగా మారెను. ఆయనచే సంగీతపుఓనమాలు, సరిగమలు కుటుంబమంతయు
నేర్చుకొనినది. బసవయ్యగారి కుమారుడే చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రయోగములు చేసి
స్వరచక్రవర్తిగా, సంగీత దర్శకునిగా వెలిగిన (కొమ్మినేని అప్పారావు)"చక్రవర్తి." ఆ సమయములోనే కమ్యూనిస్టు వారు తమ సిద్ధాంతముల
ప్రచారముకొరకు ప్రజానాట్యమండలి స్థాపించి పాటలపోటీ పెట్టి గాయకులను ఎంచి, శిక్షణ నిచ్చి ముప్పది రెండు రూప్యములు నెలసరి జీతమిచ్చి పోషించిరి.
సమాజ చైతన్యము కొఱకు బుఱ్ఱకథ నేర్పిరి. నాజరు
జన్మతః కళాకారుడు కనుక గొప్పప్రజ్ఞ సంపాదించెను.
బాగుగా కథలు చెప్పుచున్న సమయములో ప్రభుత్వము కమ్యూనిస్ట్ పార్టీని, నాజరు బుఱ్ఱకథలను నిషేధించినది. పోలీసులు దాడులు చేయుట వలన కొంతకాలము
జైలుజీవితము గడపెను. మొదటి భార్య అనారోగ్యము కారణముగా ద్వితీయ వివాహము చేసికొనెను.
దురదృష్టవశాత్తు నిండుగర్భిణి యయిన రెండవభార్య బావిలోపడి మరణించెను. తృతీయ వివాహముగా
తన మరదలిని చేసికొనగ ఆమెకు ఐదుగురు
కుమార్తెలు, యిద్దరు కుమారులు కలిగిరి.
కొంత కాలమునకు కమ్యూనిస్టు పార్టీపై, నాజర్ బుఱ్ఱకథల పై నిషేధమును తొలగించిరి. నాటినుండి మరల కథలు చెప్పుచు
కొత్తకథలు వ్రాసిరి. బెంగాల్ చరిత్ర, పలనాటియుద్ధము, అల్లూరిసీతారామరాజు, బొబ్బిలియుద్ధము మొదలగునవి
స్వీయరచనలు. అగ్గిరాముడు, నిలువుదోపిడి, మున్నగు చిత్రాలలో నటించిరి. మహానటులు బళ్లారిరాఘవ, గోవిందరాజుల
సుబ్బారావు, నందమూరి తారకరామారావు, భానుమతి
వంటి వారి ప్రశంసలందుకొనిరి.
"భీమవరము"లో పెక్కురు పండితుల,సంగీతవేత్తల
సమక్షములో గండపెండేరసన్మానము, ''బుఱ్ఱకథాపితామహ'' బిరుదము, ఢిల్లీలో "పద్మశ్రీ" వంటి
సత్కారము పొందిరి. వంతలు తరచుగా మారుచున్న కారణముగా భార్యను, చిన్న కుమారుని
వంతలుగా పెట్టుకొని కథలుచెప్పిరి. వీరిని
గురించి పరిశోధనావ్యాసము వ్రాయుటకు
"శ్రీ అంగడాల వెంకటరమణమూర్తిగారు" స్వయముగా నాజరు గారిని కలసికొని
జీవితచరిత్రను, అనుభవాలను సేకరించిరి.
జీవిత చరమాంకములోను మంచములో కూర్చొని
" జాతి జీవితం - కళా పరిణామం " అను
గ్రంథమును తన కుమార్తెచేత వ్రాయించుచు దానిని నిర్దుష్టము జేయుచు 11-02-1997 అర్ధరాత్రి 12 గంటలకు స్వర్గస్తులైరి. నాజరుమహాశయుని
కంఠవీణాతంత్రులు మూగబోయినవి. స్వరము
సరస్వతీ పాదమంజీర సవ్వడులలో లీనమైనది. యుగకర్తగా వెలసిన నాజరు మృతజీవుడు.
ఆశ్వాసముల సంఖ్య - 5
విషయ సూచిక
ప్రథమాశ్వాసము
1. నాయక( నాజరు ) వర్ణనము
2. మస్తాన్, నాజరుల కుటుంబ
పరిస్థితులు
3. సూర్యాస్తమయ వర్ణనము
4. నాజరు జననము
5. బాల్యము - విద్యాభ్యాసము
6. నాటక ప్రదర్శనము - ఖాదర్ ఖాన్ చేయూత
ద్వితీయాశ్వాసము
1. బాలరత్న సభలో సంగీత విద్యాభ్యాసము
2. రేపల్లెలో నాటక ప్రదర్శనము
3. మురుగుళ్ళ వారి శిష్యరికము
4. వారములు చేసికొని విద్యనభ్యసించుట
5. పొన్నుకల్లు (బంగారు కొండ)వర్ణన, ఘనత
6. విద్యాభ్యాసానంతరము పొన్నెకల్లు జేరుట
7. కూలి పనులకు వెళ్ళుట, దర్జీగా పని చేయుట
8. నాజరునకు పితృ వియోగము
9. బహుమతులమ్మి చెల్లి పెండ్లి చేయుట
10. కొమ్మినేని బసవయ్యగారి పరిచయ భాగ్యము
తృతీయాశ్వాసము
1. నాజరు కుటుంబ పోషణము
2. సంగీతోపాధ్యాయునిగా బాధ్యతలు
3. నాజరు వివాహము
4. భారతీయ ధార్మిక వైవాహిక జీవనము
5. గ్రామస్థులకు నాటకములు నేర్పుట
6. తుళ్ళూరులో పాటల పోటీ - విజయము
7. ప్రప్రథమముగా ఈమనిలో బుఱ్ఱకథ
8. నాస్తికత్వ ప్రభావము
9. నాజరు ఆర్య సమాజము నవలంబించుట
10. నాజరు ప్రథాన కథకుడగుట
చతుర్థాశ్వాసము
1.
నాజరు దళము రాష్ట్రపరిధి కి ఎన్నికగుట
2.
నాజరు "మాభూమి"కి ప్రథమ బహుమతి
3.
నాజరు ద్వితీయ వివాహము చేసికొనుట
4.
నాజరు కవిగా మారుట
5.
"బెంగాలు" వరదలను గురించి బుఱ్ఱకథ వ్రాయుట
6.
నాజరును "పుచ్చలపల్లి సుందరయ్య"మెచ్చుకొనుట
7.
గూడవల్లి రామబ్రహ్మము గారి పరిచయము
8.
నాజరును "ఆంధ్ర అమర్ షేక్"గా పొగడుట
9.
కమ్యునిష్టులను, నాజరు బుఱ్ఱకథలను నిషేధించుట
10. నాజరునకు మోతడక ఆసామి చే చెంపదెబ్బ
11. ఆసామి క్షమాపణ
12. నాజరు రెండవ భార్య మరణించుట
13. నాజరు కొండలలోదాగుట
14. ఒక కాంగ్రెస్ కార్యకర్త భీకర శపధము
15. నాజరును విడుదల చేయుట
పంచమాశ్వాసము
1.
కమ్యూనిస్టులపై, నాజరు బుఱ్ఱకథలపై నిషేధము
2.
నాజరు పల్నాటికథను బుఱ్ఱకథగ వ్రాయుట
3.
నాజరు బుఱ్ఱకథకు ప్రాచుర్యము పెరుగుట
4.
ఆకాశవాణిలో నాజరు బుఱ్ఱకథ
5.
నాజరు చిత్రరంగ ప్రవేశము
6.
నాజరునకు వెన్నుపోటు పొడిచిన వంత
7.
నాజరునకు భార్య ప్రోత్సాహము
8.
నాజరును కలికితురాయి, బుఱ్ఱకథా సామ్రాట్
9.
వర్షర్తు వర్ణన
10. గృహ నిర్మాణము
11. నాజరు బొబ్బిలి కథ వ్రాయుట
12. పూలరథముపై ఊరేగింపు, గండపెండేరము, బుఱ్ఱకథా పితామహ
13. నాజరునకు పద్మశ్రీ
14. బాపూజీ, తండ్రి బుఱ్ఱకథావారసత్వము నిలుపుట
15. నాజరు గ్రంథరచన
16. పొన్నెకల్లు లో నాజరు శిలా విగ్రహము
ఇష్టదేవతా స్తుతి
ఉ: శ్రీహరి కోడలా! సుజన సేవిత ! వేద విహార రూపిణీ!
వాహనమైన హంసగుణ వారసు జేయుమ నన్ను
నిచ్చలున్
దేహము మానసంబులను దిన్నగ జూడు
కృపావలోకనన్
సాహసినై చరించెదను జక్కగ నీ పదమంటి
యుంటచే 1
ఉ: నాలుకవేదిక న్నిలిచి
నాట్యముజేయుచు రమ్యభావముల్
వేలకువేలనిచ్చి శరవేగమె పద్య ప్రబంధరాజమున్
మేలుగ గూర్చుమంచు వరమిచ్చిన వాణి
పదాలజంటపై
ఫాలమునుంచి మ్రొక్కెదను పాయని
భక్తిని జీవితాంతమున్ 2
ఉ: దివ్య మనోహరంబయి
సుదీపితవాఙ్మయ పూర్ఱసారమై
నవ్య పదాంచితంబయి మనంబుల
హత్తుకొనంగజాలు-మేల్
కావ్య మశేష ధీవరుల కంఠము లందున
మారుమ్రోగగా
భవ్య రసజ్ఞ రూపయయి పల్కగ జేయుమ
రాగభారతీ! 3
ఉ: ధర్మమె మారురూపమయి ధర్మమె
నిత్యము సాధనమ్ముగా
కర్మల నాచరింప ఘన కంటకదూషిత కాననంబుల
న్నిర్మలచిత్తుడై దిరిగి నీతివిదూరుల
నేలగూల్చి- యా
మర్మము విప్పిజెప్పు పరమాత్ముని
శ్రీరఘురాము గొల్చెదన్ 4
ఉ: లంకను జేరనీయనని లంకిణి
భీకర క్రూరవృత్తిమై
బింకముతోడ దేహమటు బెంచుచు దూకుచు
మ్రింగబోవ - ని
శ్శంకత సూక్ష్మరూపియయి చక్కగ నాస్యము
లోనికేగి - యా
వంకనె వచ్చినట్టి ఘన వానరవీరు నమస్కరించెదన్ 5
ఉ: బావిని నీవుగా వెలసి భక్త జనాళి
హృదంతరమ్ములన్
దావుల నింపినావుగద! ధన్యత గూర్చుచు
కాణిపాకము
న్బ్రోవర శ్రీగణాధిపుడ ! మోదకహస్తుడ
! విఘ్నవారణా!
భావన జేతు నిన్సతము పార్వతి పుత్రుడ
! యేకదంతుడా 6
ఉ: శ్రీపురవాసియై బరఁగి
చిన్మయ రూపగ కీర్తినందియున్
బాపురె భక్తకోటికిల బంగరుతల్లిగ
భద్రవల్లిగా
ప్రాపున జేరినన్ మరియు పాయనిగూర్మిని
చింతజేసిన
న్బాపములెల్ల ద్రుంచి నిరపాయము గూర్చెడి లక్ష్మిగొల్చెదన్ 7