రచన .. పొన్నెకంటి సూర్య నారాయణ రావు. భాషాప్రవీణ, ఎం,ఏ. తెలుగు.
కాశీ విశ్వనాధుని యనుగ్రహము వలననే నా 75 వ జన్మ దినము వారి సన్నిధిలో అభిషేక సహితముగా జరిగినది. అది నా పూర్వ జన్మ సుకృతము గా భావిస్తాను.ది .23.03.22 న
ఉ.9.30 ని.లకు. వారణాసి - దానాపూర్ ఎక్స్ప్రెస్ సికిందరాబాద్ నుండి కదిలింది విశ్వేశ్వరుని స్మరణతో. సికింద్రాబాద్ నుండి వారణాసి కి 1611. కి. మీలు. స్టేషన్ల వరుసలో 24 వ ది వారణాసి జంక్షన్ . 24.03.22 మధ్యాహ్నం 2 గం. లకు వారణాసి చేరాము. వారణాసి కి రాను పోను రు.3500/-.వారణాసి, అలహాబాద్ , అయోధ్య, నైమిశారణ్యం లో ప్రయాణ సౌకర్యం, ఏ. సి. రూములు, భోజన వసతులు కలిగించే నిమిత్తం రు.12500/- అందులోని మా సభ్యులు. 1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు. 2. ఇందిరాదేవి. 3. దోవల భగవతి . 4. గంగరాజు విజయలక్ష్మి. 5. మోదుకూరు హేమలత. 6. వఝ బుచ్చిరాజు.7. వఝ రాణి. 8. గంగరాజు హేమాద్రి. 9. గంగరాజు రాజ్యలక్ష్మి. 10. ఐతరాజు రాజ్యలక్ష్మి. 11. అచ్యుతన సీతారామమ్మ. 12. మోహన్. 13. సరళా దేవి .
శ్లో : దర్శనాత్ అభ్రశదసి, జననాత్ కమలాలయే !
స్మరణాత్ అరుణాచలే, కాశ్యాంతు మరణాన్ ముక్తి : !!
భావము: ఒకప్పుడు మానవులకు 4 వరాలిచ్చాడట పరమ శివుడు. అవి 1. చిదంబరం లో పరమేశ్వరుని జ్ఞానంతో దర్శించుట 2. తిరువారూరు లో జన్మించుట(ఇది మనచేతిలో లేదు) 3. అరుణాచలేశుని స్మరించుట. 4. కాశీ లో మరణించుట (ఇది కూడా మన చేతిలో లేదు)
వారణాసి రైల్వే స్టేషన్ కి మాకు సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసే రాచకొండ వెంకటేశ్ 2 వాహనాలు పంపాడు. వానిలో హోటల్ డివైన్ కు చేరి భోజనం ముగించుకొని మా మా ఏ,సీ గదులలో విశ్రాంతి తీసికొన్నాము.
వారణాసి గురించి కొన్ని వివరాలు :
హిందువులకు ఉత్తర ప్రదేశ్ లోని అతి పవిత్రమైన స్థలం కాశీ. దీనినే వారణాసి అంటారు. వరుణ, అసి అను 2 నదులు గంగానది లో కలసి ప్రవహించుట వలన దీనికి ఆ పేరు వచ్చినది. బ్రిటీష్ కాలములో దీనినే బెనారస్ అనేవారు. కాశీలో మరణించిన జీవికి కుడి చెవిలో శివుడు రామ మంత్రమును చెబుతాదాట . ఇచటి విశ్వేశ్వర లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అత్యంత పురాతన నగరం. సమస్త వేద వేదాంగ సంస్కృత పండితుల కిది కాణాచి. హరిశ్చంద్ర, గౌతమబుద్ధ ,వేద వ్యాస, తులసీదాస, శంకరాచార్య , కబీర్ దాస్,ల వంటి మహాత్ములు నడయాడిన పవిత్ర భూమి.
చూడదగిన ఆలయాలు : విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షీ ఆలయం, వారాహీ ఆలయం, తులసీ మానస మందిరం, సంకట విమోచన హనుమాలయం, కాల భైరవాలయం , దుర్గామాత ఆలయం, డుంఢి గణపతి ఆలయం, చింతామణి గణపతి ఆలయం, కేదారనాథ్ ఆలయం, లోలార్కుడు, భరతమాత మందిరము. సారనాథ్ స్తూపం వంటివి ఎన్నో ఉన్నాయి.
మొత్తం 84 ఘాట్లలో దశాశ్వమేధ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా ఘాట్, వంటి 64 ఘాట్లు చాలా ప్రశస్తిని సంతరించుకొన్నాయి. సతీదేవి చెవి ఆభరణం (మణి కర్ణిక)పడిన ప్రదేశము కనుక దీనిని మణికర్ణిక ఘాట్ అంటారు. ఇచటికి పరమ శివుడు పదునాల్గు కోట్ల దేవతలతో స్నానానికి 12.గం.లకి వస్తాడని ప్రతీతి. కాశీ వెళ్ళిన వారందరు మధ్యాహ్నం స్నానానికే ప్రాధాన్యమిస్తారు. దీనికి ప్రక్కనే మణి కర్ణిక శ్మశానము ఉన్నది. అచట శవదహనాలు 24 గంటలు, 360 రోజులు నిరంతరాయం గా జరుగుతుంటాయి. అందువలన కాశీ నిత్యం వెలుగుతున్న దీపం. మనం నదీస్నానానికి పూర్వమే యింటి దగ్గర స్నానం చేసి తీరాలి. ఆ తరువాతే నదీస్నానం చేయాలి.
నదిలో ముందుగా 3 సార్లు మునిగి ఆ తరువాత సంకల్పం చెప్పుకోవాలి, లేక పురోహితునిచే చెప్పించుకోవాలి. ఆ సంకల్పం ఈ విధం గా ఉంటుంది.
**ఆచమ్య , ప్రాణానాయమ్యా , మమోపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య పరమేశ్వర ప్రీత్యర్ధం, శోభనే ముహూర్తే, కాశీ విశ్వేశ్వరఆజ్ఞ యా, ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహ కల్పే , వైవస్వత మన్వంతరే, అష్టావింశతి తమే, కలియుగే ప్రథమ పాదే , విక్రమ శకే , బౌద్ధావతార జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే , వింధ్యస్య ఉత్తర దిగ్ భాగే , ఆర్యావర్తక దేశే , అవిభక్త వారాణశీ క్షేత్రే , ఆశీవరణయోః మధ్యే , ఆనంద వనే, మహాశ్మశానే , గౌరీముఖే, త్రికంటక విరాజితే , ఉత్తర వాహిన్యాః , భాగీరధ్యాః పశ్చిమే తీరే , బ్రహ్మ నాలే , మహా మణికర్ణికా క్షేత్రే , శ్రీ విశ్వేశ్వరాది త్రయస్త్రిమ్ శత్కోటి పరివార దేవతా , గో బ్రాహ్మణ , హరి హర గురు చరణ సన్నిధౌ , బార్హ స్పత్య మానేన అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్ర మానేన ,శుభకృత్ నామ సంవత్సరే, వసంత రుతోః , చైత్రమాసే ,,,,,,శ్రీమాన్ శ్రీ వత్స గోత్రో ద్భవస్య సూర్యనారాయణ శర్మణః, సహ కుటుంబానాం, చతుర్విధ ఫల పురుషయార్ధం, ఆయురారోగ్య సౌభాగ్య సిధ్యర్ధం, గాఢ బద్ధ పాశ నివృత్తి ద్వారా, జ్ఞాన అజ్ఞాన కృత సర్వ దోష నివారణార్ధం , విశాలాక్షీ, అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవతా ప్రీత్యర్ధం , మహామణి కర్ణికా స్నానం అహం కరిష్యే . గంగే మాం పాహి .
ది . 25.03. 22.
తెల్లవారు జామున 5 గం. లకు లేచి సిద్ధమయి కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో నా 75 వ జన్మదిన సందర్భముగా అభిషేకము చేయించుకొన్నాను. అభిషేకమునకు రు.800/-.అన్నపూర్ణా దేవికి కుంకుమ పూజ కు,రు350/-. ఇది నా జీవితం లో మరపురాని సంఘటన . ఈ సందర్భమును పురస్కరించుకొని మిగిలిన అందరు కూడ అభిషేకం చేయించుకొన్నారు. అభిషేక జలము స్వామివారి కి అర్పించి , దర్శనము చేసికొని, అన్నపూర్ణా దేవి చెంత (శ్రీచక్రము వద్ద ) కుంకుమార్చన చేసుకున్నాము. అన్నపూర్ణమ్మ ప్రసాదంగా కొన్ని బియ్యం యిస్తారు. అవి మన యింటిలోని బియ్యపు డబ్బాలో కలుపుకుంటే అన్నానికి లోటు కలుగదని నమ్మకము. అచ్చటే కుబేర బియ్యం కూడ యిస్తారు . వానిని మనం డబ్బులు దాచుకొనే బీరువాలో పెట్టుకోవాలి. నేను ఆ రెండిటిని తీసికొన్నాను . ఆ తరువాత విశాలాక్షీ అమ్మవారు (శక్తి పీఠం ). ముందుగా కనబడే అమ్మ వారు అర్చామూర్తి . లోపల ఉన్న అమ్మవారు స్వయం భువు.
తరువాత వారాహీ దేవి దర్శనం చేసుకొన్నాము, దొడ్డిదోవన ఒక్కొకరికి రు.200/-ధర్మ దర్శనం అసాధ్యం. ఈమె అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. సప్త మాతృకలలో ఒకరుగా, దశ మహా విద్యలలో ఒక శక్తిగా కొలుస్తారు. వరాహ ముఖము కలిగి ఉంటుంది. ఈమె లక్ష్మీ రూపం . విష్ణువు వరాహ రూప మెత్తినపుడు ఆయన భార్య గా వారాహి అయినది. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఎక్కువ తాంత్రిక పూజలు చేస్తారు.ఈమెయే కాశీకి గ్రామ దేవతకూడ . అందు వలన తెల్లవారు జామున 4 గం.ల నుండి. 9 గం.ల వరకు అమ్మవారు గ్రామ దర్శనానికి వెళుతుందట. ఆ సమయమే మనకు దర్శన సమయం. మాకు దర్శనం అయేటప్పటికి సుమారు 11 గం. అయినది. మరల హోటల్ డివైన్ కు వెళ్ళి , బట్టలు మార్చుకొని 12.30 లకు చింతామణి గణపతి, కేదారనాథ్, ఆలయముల దర్శనం చేసికొని మణికర్ణిక ఘాట్ లో స్నానానికి బోటులో బయలు దేరాము . మేమందరం గుడికి, స్నానానికి కదా వెళుతున్నాము, చెప్పులు అవసరం లేదనుకొని వేసికొని వెళ్లలేదు. వెళ్లేటప్పుడు బాగానే ఉన్నది. కానీ వచ్చేటప్పుడు 3మధ్యాహ్నం 1గం. కు అచటి మెట్లు నిప్పుల కుంపటి లాగా మండుతున్నాయి. అప్పుడు సాగింది నిజమైన మా భగవన్నామ స్మరణ. మనం హాయిగా చెప్పులు వేసికొని వెళ్ళి ఆ బోటులో విడిచి స్నానం తరువాత వేసికొన వచ్చును. ఈ పొరపాటు ఎవరును చేయవద్దు.
మణికర్ణిక ఘాట్ .. స్నానం. మేము ఒక పురోహితుని చేత సంకల్పం చెప్పించుకొని స్నానం చేశాము. ఆయన సంకల్పం చెప్పినందుకు ఒక్కొకరికి రు . 30/-లు చెల్లించుకొన్నాము. దేవతలతో సహా పరమశివుడు స్నానంచేసిన చోట స్నానం చేస్తే మనకు పునర్జన్మ ఉండదట. ప్రక్కనే 10 అడుగుల దూరం లో మణికర్ణిక దహన సంస్కార ఘాట్ ఉన్నది. నిరంతరం శవాలు శివ సాయుజ్యం పొందుతూ ఉంటాయి. కాశీ లో మాత్రం శవ దహనానికి సమయ నియమం లేదట. అందు వలననే నిత్యాగ్ని హోత్రాలతో వెలుగుతు ఉంటుంది కాశీ. మన స్నానం కూడా శవాల బూది నిమజ్జనమైన గంగా జలంలోనే.
గంగా హారతి : ప్రతిరోజు శీతాకాలంలో సాయంత్రం.7గం .లకు, వేసవికాలంలో ప్రతిరోజు సా. 6. గం .లకు గంగా హారతి ఉంటుంది. జీవితంలో ఒకసారి చూడదగినది. హరిద్వార్ తరహాలో రిషికేశ్, వారణాసి, ప్రజ్ఞా, చిత్రకూటం లలో గంగాహారతి నిర్వహిస్తారు. వారణాసిలో 1991 నుండి ప్రారంభించారు. కార్తిక పూర్ణిమ సందర్భంగా జరిగే హారతి చాలా ప్రత్యేకము. హారతి చూచుటకు మనం యింటి దగ్గర ఖచ్చితంగా సా.4 .గం .లకే బయలు దేరాలి. గంగానది హారతి కాంతులతో వెలిగిపోయే మనోహర దృశ్యం. గంగా హారతి నిచ్చే పూజారులకు ప్రత్యేక వస్త్రధారణ ఉంటుంది. ధోతి, కుర్తా, పొడవైన గాంచా (తువ్వాలు) ధరిస్తారు. 5 ఎత్తైన పలకలతో కూడిన ఒక యిత్తడి దీపం, గంగాదేవి విగ్రహం, పూలు, ధూపం యితర ఆచార సామగ్రిని హారతి కొరకు సిద్ధం చేస్తారు . ఉపనిషత్తులు నేర్చిన 7 గురు పండితులు మాత్రమే హారతి ప్రదర్శనలో పాల్గొంటారు. వారికి గంగోత్రి సేవా సమితి పూజారి నేతృత్వం వహిస్తారు . హారతికి ముందు శంఖనాదం చేసి మంత్రాలతో కర్పూరంతో రకరకాల హారతులిస్తారు. బోటులో నుండే గంగాహారతి చూచి, ఆడవారందరు దీపం జ్యోతి పర బ్రహ్మం అంటూ ప్రమిదలలో దీపాలు వదిలారు. దశాశ్వమేధ ఘాట్ లోనే కాక ప్రక్క ఘాట్ లో కూడా ఆడపిల్లలు హారతి యివ్వటం చూచాము. తరువాత అన్ని64 ఘాట్లు చూచాము. సుమారు 9 గం లకు హోటల్ డివైన్ కు చేరాము.
26.03.22.
సారనాథ్ : సారనాథ్ అనునది ఆంగ్ల పదము. మృగదవ, వింగదాయ, ఋషిపట్టణ, ఇస్ఫి తాన, అని కూడ అంటారు. మృగదవ అనగా జింకల వనం . ఇచట గౌతమ బుద్ధుడు తన మొదటి ధర్మ ఉపదేశాన్నిచ్చాడు . ఇచ్చటే బౌద్ధ సంఘాలు ఏర్పడ్డాయి . ఇది వారణాసి కి ఈశాన్యం లో 13. కి. మీ. లలో ఉన్నది. సారనాథ్ కాక కుశీనగరం, బోధిగయ, లుంబిని కూడ బౌద్ధమత భక్తులకు పుణ్య స్థలాలు . బుద్ధుడు తనకు జ్ఞానోదయం అయిన తరువాత తన సహచరులైన 5 గురు పంచ వాగ్గీయ సాధువులు బుద్దుని వదలి ఉసీ పట్టణం వెళ్లారు. వారికి జ్ఞానోపదేశం చేయుటకు గంగానదిపై గాలిలో నడచుకుంటు వెళ్లాడట. ఇది విన్న మౌర్య రాజు బింబిసారుడు సన్యాసులకు శుల్కాన్ని రద్దు చేశాడట. ఇలా ఎన్నో విశేషాలున్నాయి .
27.03.22.
(24,25,26) 3 రోజుల అనంతరం కాశీ వదల బోయే ముందు విశ్వేశ్వరుని, అన్నపూర్ణా దేవిని పునర్దర్శించుకొని భక్తుల భోజన సౌకర్యం నిమిత్తం అమ్మకు నావి, భక్తులయివి కలిపి రు .1400/- సమర్పించికొన్నాను. ఉ.8.గం.లకు బయల్దేరి మధ్యాహ్నం 1.30. లకు త్రివేణీసంగమం (అలహాబాద్) (ప్రయాగ రాజ్) చేరాము. కాశీ నుండి అలహాబాద్ కు 120. 9 కి. మీ లు.ప్రయాణ సమయం 2.30. ని. లు.
ఈ కార్యక్రమం తరువాత అందరం ఎవరి పితృ దేవతలకు వారలము పితృ తర్పణాలు (32) మంత్ర పూర్వకముగా వదిలాము . భోజనానంతరము సుమారు 3. గం. బయలుదేరి రాత్రి 9. గం.లకి అయోధ్య చేరాము . త్రివేణి సంగమం నుండి అయోధ్యకు సుమారు 167.9 కి. మీ. లు .ప్రయాణ సమయం . గం .3.54 లు .
[12/05, 9:21 am] జె జె. యస్: కాశీ కి వెళితే...
కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు....
అందులో మర్మమేమిటి అసలు శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పలేదు..శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చు కున్నారు. కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే...
కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి "కాయా పేక్ష మరియు ఫలా పేక్ష" ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.
ఇక్కడ కాయాపేక్షా,ఫలాపేక్ష అన్నారు...అంటే...ఈ కాయము పై (శరీరము పై అపేక్షని ) ,ఫలా పేక్షా (కర్మ ఫలము పై అపేక్ష ని)పూర్తిగా వదులు కొని...
కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. కాలక్రమేణా...అది కాస్తా కాయ, పండు గా మారి పోయింది.
అంతే కానీ... కాశీ వెళ్లి ఇష్టమైన కాయ గూరలు,తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే...మనకు వచ్చు భక్తి కానీ,అందులో నిజమైన పుణ్యం ఎం ఉంటుంది. కనుక.... శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని... ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే..నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది...
అంతే కాని మామిడి పండుని, వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. కనుక...ఈసారి మీరు కాశీ వెళితే....మనకి శత్రువులు అయిన ఈ శరీరం పై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని....ఆ విశ్వనాథ దర్శనం చేసి,
నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్దిదాం.
[12/05, 10:17 am] P.Suryanarayana Rao: ఇది బాగున్నది. కాని ఇష్టమైన కాయను పండును వదలటం కూడ ఒక రకంగా సమర్ధనీయమేనేమో! మనంతట మనం ఏ కోరికలను చంపుకోలేము. ఏదో ఒక కారణం కావాలి. కాశీలో వదలటం అంటే కాయలు పండ్లను గంగలో కలపటం కాదు. త్యాగ గుణమును, పెంచుకొనుచు మమకారములను ఒకొక్కదానిని వదలుకోవటం. ప్రతి వ్యక్తికి కాయము, ఫలితము మీద ఎంతో కోరిక. ఆ కోరికను వదలుకోటానికిది బహుశః సోపానమౌతుందనుకుంటాను. ఎన్ని మారులు కాశీ వెళ్ళి వచ్చినా త్యాగ గుణం అలవాటు కాకపోతే చార్జీలు ఎనర్జీ దండుగే. అందులో ఈ వదలివేయుమని చెప్పే ఘటన మనం పితృకార్యాలు చేసేటప్పుడు వస్తుంది. నిజంగా మనం అచట పితృకార్యాలు చేయించే పండాలను , వారి వాచకమును, కొందరి దౌర్జన్యాలను సహించలేము. అచటి స్థలప్రాధాన్యతను దృష్టిలో నుంచుకొని మాత్రమే భరిస్తాము. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నీతో పంచుకోవాలని పంచుకుంటున్నాను. మొన్నటి కాశీ యాత్రలో త్రివేణీ సంగమ తీరంలో జరిగిన "వేణీ దానం" ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించినది. మరొకటి నా వృద్ధ స్నేహితుని భార్యకు నేను (రిక్థిన్..ఋణదాతకు తర్పణము వదలుట, కులభేద రహితముగా) తర్పణము వదలుట జరిగింది. "ఇది మీకు అయాచితముగా లభించిన పుణ్య విశేషమని"అచటి కార్యక్రమాలు చేయించే పండితులు చెప్పారు. చాల ఆనందం కలిగినది. మనం పితృ ఋణం తీర్చుకొనుట బాధ్యత, అనివార్య కర్తవ్యం. కాని ఇతరులకు చేయుటే పుణ్యమని భావించాను. నా వృద్ధ స్నేహితుని(గతంలో మాతో కాశీయాత్రకు వచ్చిన నాయీబ్రాహ్మణ పండితుడు, పండితాభిమాని)కోరిక మేరకు కాశీయాత్రా విశేషాలు ప్రింట్ తీయించి పంపాను. గుర్తుకు వచ్చిన అంశాలన్నీ నీతో ఆనందంగా పంచుకొన్నాను. 🙏🌹🙏
అయోధ్య. : 27 రాత్రికి అయోధ్య చేరాము. 28.03.22 అయోధ్య లో ..
దీనికి సాకేత పురం అని కూడా పేరు ఉన్నది. ఇది ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాను ఆనుకొని 6. కి. మీ . దూరం లో సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది కోసల రాజ్యానికి రాజధాని . మనువు ఈ నగరాన్ని స్థాపించినట్లు తెలుస్తున్నది. అధర్వణ వేదం ఈ నగరాన్ని దేవ నిర్మిత స్వర్గ మని పేర్కొన్నది. తమిళ కవి కంబర్ తన కమ్బ రామాయణం లో, తులసీదాస్ తన రామ చరిత మానస లో , తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు తమ రచనలలో అయోధ్యను మనోరంజకముగా శ్లాఘించారు. యోధులకు లొంగనిదే అయోధ్య . టిఫిన్ చేసి మాకు కేటాయించిన హోటల్ గదులలో ఆ రాత్రికి విశ్రాంతి తీసికొని 28.03.22 ఉ. 5 గం.లకు లేచి స్నానంచేసి, సరయూ నదికి స్నానానికి వెళ్ళాము. ఈ నది ఉత్తరాఖండ్ లో పుట్టి ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహించే నది. గంగానదికి,శారదానదికి ఉపనది. దీనిని గోగ్రా నది అని కూడా అంటారు. వేదాలలో, రామాయణంలో ఈ నది ప్రస్తావన ఉన్నది. అయోధ్యా పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామ లక్ష్మణులు మునిగి అవతారాలు చాలించారని నమ్ముతారు. ఇది బీహార్ లోనే రావెల్గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. అయోధ్యా నగరం లో రోడ్లు తప్ప మిగిలిన ప్రదేశమంతా భక్తుల పట్ల కరుణా సముద్రుడైన రామహృదయము వలె మెత్తని యిసుక కనబడినది. ఇత: పూర్వము నేనిలాంటి యిసుక ఎక్కడను చూడలేదు . సరయూ నది స్నానా నంతరము రామ మందిర నిర్మాణమునకు సన్నాహం చేస్తున్న, డిజైన్లు చెక్కబడిన , రామ నామం వివిధ భాషలలో వ్రాయబడిన శిలలు చూచాము. అవి చూస్తున్నంత సేపు మా మనసులు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. తప్పక సంపూర్ణముగా రామ మందిరం పూర్తి అయిన తరువాత తప్పక వచ్చి చూడాలని . అయోధ్య రాముడు పుట్టిన ప్రదేశం కనుక నిరంతరం రామనామమ్ మన మనసులను ఆవరించి మరొక ఆలోచన రానీయదు. ఎందుకంటే రామ శబ్దం లోనే ఆ గొప్పతనం ఉన్నది. రమయతే యితి రామః అనగా అందరి(శత్రువుల) మనములను రమించువాడే రాముడు . పెద్ద హనుమాన్ ఆలయము చూచాము . అందులో రామ కృష్ణ , అవతారాల విశేషాలు యానిమేషన్ తో ఉన్నాయి. కొండపైన ఉన్న మరొక పెద్ద హనుమాన్ ని కూడా చూచాము . చివరకు ఎన్నో సంవత్సరాలుగా రామ భక్తులు పోరాడి గెలిచిన స్థలం, రామ బాలాలయం , దర్శించాము . మహమ్మదీయుల పాలనలో హిందూ దేవాలయాలు సర్వ నాశనం చేయబడ్డాయి. మతమ్ అంటే అందరికీ సమ్మతం గా ఉండాలి . పరమత విద్వేషం కూడని పని. మన ఖర్మ కొద్ది మహమ్మదీయుల పాలన , అందులో కొందరు ఉత్తములున్న , మరి కొందరు మత పిచ్చి తో పరమత సంప్రదాయాలను చులకనగా చూచుట, మాట్లాడుట చేస్తారు. అందులో ముఖ్యం గా ముందు వరుసలో ఉండేది మహమ్మదీయులు, క్రైస్తవులు . మన రామాలయమును పడగొట్టి నామ రూపాయలు పైకి కనబడనీయకుండా బాబరు తన పరి పాలనలో మసీదు కట్టించాడు . మసీదు క్రింద రామాలయం ఉన్నది అని తెలిసిన రామ భక్తులు మసీదు దగ్గరే కొంత భాగం లో రామ పూజలు చేసేవారట. కాలక్రమం లో రామ మందిరం మా దేనని వివాదం పెరిగి ఒక సుముహూర్తమున మసీదును కూల్చివేశారు . ఆ స్థలమును ప్రభుత్వ పురాతత్వ శాఖ వారు త్రవ్వి అచ్చట దొరికిన హిందూ దేవతల శిలా శకలాలు, శాసనాలు నిశితముగా పరిశీలించి యిచట రామ మందిరం ఉన్నదని నిర్ధారణ చేశారు. హిందువులు అది మాదే కనుక మాకు యివ్వ వలసినదని సుప్రీం కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. చిట్ట చివరకు ఒక అంధుడు , వేద వేదాంగ పారీణుడు సరయూ నది కి యిన్ని కిలోమీటర్ల దూరం లో రామ మందిరం ఉన్నది అన్న సంగతి ఫలానా ఉపనిషత్తులలో ఉన్నదని చెప్పగా , దానిని జడ్జీ గారు తెప్పించుకొని విషయము గ్రహించి , యిచ్చట రామ మందిరం ఉన్నదని , ఈ ప్రదేశం 2.77 సెంట్లు హిందువులకి చెల్లుతుందని, మహమ్మదీయులు వేరొక చోట మసీదు కట్టుకోవాలని 5. ఎకరాల భూమిని వారికి కేటాయించారు, నవంబరు 9 , 2019 లో . దానితో సమస్య కొంతవరకు పరిష్కారమైనట్లే అని భావించ వచ్చును. ఆ ప్రదేశం లోనే ఈనాడు రాముని బాలాలయం ఏర్పాటు చేశారు. భీకరమైన మిలటరీ బందోబస్తు ఉన్నది అడుగడుగునా. సీ. సీ . కెమెరాలు ఉన్నవి . మనం ఆలయం చూడటానికి వెళ్లాలంటే ఆధార్ కార్డ్, తప్పక చూపాలి. డబ్బులు, ఏ, టి, యం. కార్డులు, తీసికొని వెళ్ళవచ్చు. కలము , పుస్తకాలు,మందులు , మంచినీరు వంటివి తీసికొని వెళ్లరాదు. పొరపాటున తీసికొని వెళ్ళిన సెక్యూరిటీ దగ్గర పడవేయాల్సిందే. చెప్పులతో లోనికి వెళ్ళ వచ్చును . ఆలయ పరిసర ప్రాంతమంతా ..
అంతా రామమయం , యీజగమంతా రామమయం, అంతరంగమున ఆత్మారాముడు , అనంత రూపముల వింతలు సలుపగ, సోమ సూర్యులును సురలు తారలు ను, ఆ మహాంబుధులు అవనీజంబులు , అండామ్డంబులు పిండామ్డంబులు, బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ. నదులు వనమ్బులు, నానా మృగములు, విహిత కర్మములు వేద శాస్త్రములు, అంతా రామమయం ఈ జగమంతా రామమయం గా కనబడుతుంది. రామ భక్తులకు .
అయోధ్య లోని ప్రత్యణువు శ్రీ రామ పాద స్పర్శతో పునీతమైనది. నామ స్మరణతో ప్రతి జీవి పులకరించినది. రామో విగ్రహవాన్ ధర్మః , సత్య పరాక్రమః అనునట్లు మూర్తీభవించిన సత్య స్వరూపుడు పాలించిన పుణ్య స్థలం . సామాన్య మానవావతారం లో కష్ట సుఖములు సమానముగా ననుభవించిన ఆదర్శమూర్తి . లక్ష్మీదేవి సామాన్య స్త్రీ మూర్తి వలె అనేక కష్ట సుఖముల ననుభవించిన పతివ్రతా లాలామ. సమస్త కుటుంబ బంధాలకు ఆలవాలమైనది రామ పరివారం. సీతా రాముల అన్యోన్య దాంపత్యం ఎంతో ఆదర్శ ప్రాయమైనది. రామాలయ దర్శనానంతరం వాల్మీకి, కుశలవుల ఆలయము చూచిన తరువాత టిఫిన్ చేసి హోటల్ రూమ్స్ కి వెళ్ళి మధ్యాహ్న భోజనం చేసి సుమారు 2 గం. లకు బయల్దేరి అయోధ్యా పునర్దర్శన ప్రాప్తి రస్తూ ! అనుకొంటూ 28.03.22 రాత్రికి సుమారు 8 గం . ల కు నైమిశారణ్యం లోని సాయి బాబా ఆశ్రమం చేరాము.
29.03.22. నైమిశారణ్యం :
నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని లక్నో కు 94 కి. మీ దూరం లో ఉంది. గోమతీ నదీ ప్రాంతం లో వేలాది సాధువులు తపమాచరించారు. ఇక్కడే వేదవ్యాసుడు మహాభారత రచన చేశాడట. . సూతుడు శౌనకాది మహర్షులకు అష్టా దశ పురాణాలు వినిపించాడట. మునుల కోరిక మేరకు బ్రహ్మ ఒక పవిత్ర ప్రదేశమును నిర్ణయించదలచి దర్భ చక్రమును విడచి అది విరిగి ఎచ్చట పడునో అదే మీ తపోభూమి అని సెలవిచ్చెను. ఆ చక్రము పడినదే నైమిశారణ్యము. నిమి అనగా బండి చక్రపు కమ్మి, నేమి పేరుతో ఆచటి అరణ్యము నైమిశారణ్యం అయినది. చక్రం పడి విరిగిపోయిన చోట జాలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి పొరలుతుంది. మహా శక్తి ఆ ప్రవాహాన్ని ఆపుతుంది. ఆ పవిత్ర ప్రాంతం శక్తి పీఠం గా రూపొంది లింగధారిణి శక్తి రూపం అయిన లలితాదేవి ఆలయం గా పేరొందింది . చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థం అయినది . వరాహ పురాణ ప్రకారం .. శ్రీ మహా విష్ణువు నిమి కాలం లో అనగా లిప్త (కన్ను మూసి తెరిచే) కాలంలో రాక్షస సంహారం చేశాడు ఈ అరణ్యం లో . అందువలన ఈ పేరు వచ్చిందంటారు. 9 తపోవనాలలో నిది ఒకటి ప్రసిద్ధి చెందినది . ఇక్కడకు 9 కి. మీ దూరంలో దధీచి కుండం ఉన్నది. శ్రీరాముడు అశ్వమేథ యాగం చేసి లవ కుశులను కలసికొన్నది యిచటనే . సీతాదేవి పేర రాముడు దానం చేసిన గ్రామమే సీతాపురం .
30.03.22.
ట్రైన్ ( గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ ) మధ్యాహ్నం 1.40. సరైన సమయం . కానీ ఆ రోజు గం 5.30. లు ఆలస్యం గా నడిచింది. మేము ఆ రోజు రాత్రి 9. గం .లకు కాచిగూడ చేరుకున్నాము. ఇవి నా అనుభవాలు . కాశీ యాత్ర సుఖాంతం. పునర్ దర్శన ప్రాప్తి రస్తు !
మేము యాత్ర ముగించుకొని వచ్చిన తరువాత గంగాపూజ.నిరంతరం శ్రమపడే మానవ మేథస్సునకు ప్రకృతి సందర్శనాన్ని మించిన ఆనందం ఉత్తేజం ఏముంటుంది చెప్పండి. అందుకే నిర్మల్ లోని హస్త కళా సౌందర్యాలు, సమీపంలోని జలపాతాల పరవళ్ళు, అందాలు ఆస్వాదించే కోరికతో ది.2.12.2017.న ఉ.7గం.లకు హైదరాబాద్ లో మా బావగారైన శ్రీ పులిజాల సత్యనారాయణ(రిటైర్డ్ ఆర్కియాలజీ సూపరింటెండెంట్) గారి ఆధ్వర్యంలో నేను( పొన్నెకంటి సూర్యనారాయణ రావు) నా శ్రీమతి ఇందిరాదేవి, పెద్దచెల్లి అరుణ, చిన్నచెల్లి పద్మ జారాణి, మేనకోడలు సంథ్యారాణి, పిల్లలు ఆదిత్య,లలిత, మిత్రుడు గోవింద్ తలిదండ్రులు బయలుదేరి(NH44) జాతీయ రహదారిలో 210 కి.మీ. దూరాన ఉన్న నిర్మల్ కు మధ్యాహ్నం చేరి, అచట హోటల్ లో విశ్రాంతి , భోజనానంతరం నిర్మల్ కు 38 కి.మీ. దూరంలో గల పొచ్చెర జలపాత సందర్శనానికి వెళ్ళాము.
ముందుగా నిర్మల్ బొమ్మలు..కళాకారుల.,తయారీ విషయాలు...
అత్యంత మృదువుగా, తేలికగా ఉండే "పునికి" కర్రతో చేయబడే ఈ బొమ్మలకు 400సంవత్సరాల చరిత్ర ఉంది. కళాకారులు "నకాషీ" కులానికి చెందిన కళాకారులు. వీరు "మరట్వాడ" ప్రాంతీయులు. నిర్మల్ సంస్థానాధిపతి "నిమ్మనాయుడు" దేశం నలుమూలలనుండి కళాకారులను రప్పించి హస్త కళలను పోషించి వృద్ధిచేశాడు.
తయారీ విధానం.
ముందుగా చేయదలచుకొన్న బొమ్మకు దగిన ఆకారపు ముక్కలు తీసికొని, చింతగింజలు నానబెట్టి జిగురువచ్చువరకు రుబ్బి పేస్ట్ చేసుకొని, దానిని కొయ్యపొడిలో కలిపి కావలసిన బొమ్మ చేసి దానిని ఎండబెట్టి నునుపు చేసి తగిన రంగులు వేస్తారు. ఆరంగుల తయారీలో చెట్ల ఆకురసాలు, పూల రసాలు వాడతారు. ఈ రంగులలో బంగారురంగు తయారీకి చాలా ఎక్కువసమయం శ్రమ పడుతుంది. ఈ రంగులు అత్యంత మనోహరంగా, మన్నికగా ఉంటాయి. బొమ్మలన్నీ సజీవకళతో ఉట్టిపడుతుంటాయి. ఈ బొమ్మల కళాకారుల సహకారసంఘం 1955 లో స్థాపించబడినది. ఈ నిర్మల్ పంచపాత్రలకును ప్రఖ్యాతి చెందినది.
సువర్ణ పుష్పాభిషేకంతో నిజాం నవాబు, అవాక్కు.
ఒకసారి నిజాం నవాబు నిర్మల్ పట్టణానికి వచ్చిన సందర్భంగా
వారికి ఇచటి కళాకారుల చేత బంగారు(చెక్క)పూలు చేయించి వాటితో సువర్ణ పుష్పాభిషేకం చేశారు. కొద్ది సేపటికి నిజం తెలుసుకొని నవాబు గారు అవాక్కయ్యారట. ఇది నిజమైన భగవద్దత్తకళ. శిల్పకళవంటిదే దారుకళ. దారువు అంటే కర్ర.
దారుకళాధురీణా!నిర్మలవాసా! దండంబులందుకోవయ్యా!
1. కడుపునిండిన నిండక కలతపడక
భరతజాతికి కీర్తికి బాటవేసి
నలువ రూపంబు ధరియించి నవ్యరూపు
సృష్టిచేసితివయ్యరో చెలువుమీర
2. నిర్మల వాసివౌ సత్కళా నిర్మ లాత్మ!
త్యాగపరిపూర్ణ సద్భావ యోగివర్య!
వందనంబులు నీకెపుడు వందవేలు
జాతి మరువదు నీదు విఖ్యాతి యెపుడు.
3. "పునికి" కర్రకు నిపుణత పురుడుబోసి
పూర్ణ రూపాలు సృష్టించు పుణ్యులార!
రంగురంగుల యందాలు రహినినిలుపు
మీకు శుభములుకలుగుత మిగులశోభ!
పొచ్చెర జలపాతం.
ఎక్కడో పుట్టిన అప్సరసల వంటి నదీ కన్నెలు తమ చెలికత్తెల వంటి ఉపనదులతో గూడి చిలిపి వలపులతో రసికులనూరిస్తూ, చిత్రకారుల కుంచెలకు పనిచెబుతు, కవుల మస్తిష్కాల ఊహలకు ఉయ్యాలలూపుతు, సంగీతజ్ఞుల సరిగమలకు సాయంపడుతూ తమ ప్రత్యేకతలను చాటుకుంటు భూమాతపాదకమలాలను స్పృశించాలని తపనపడేవే జలపాతాలు. మన పౌరాణిక ఆధారాన్ని అనుసరించి భగీరథుని దయ వలన భువికి దిగినదే గంగారూపి జలపాతం. ఇలా ఎన్నో నదులు ఎన్నో దేశాలలో జలపాతాలై మధుర మనోజ్ఞ దరహాస చంద్రికలను, రమణీయ కర్ణపేయ సంగీత నాదాలను వినిపిస్తు ప్రకృతి ప్రియులను అలరిస్తున్నాయి.
పొచ్చర జలపాతం నిర్మల్ కు 38 కి.మీ. దూరంలో ఉంది.
ఎన్నో ఓషథీ గుణాలను సంతరించుకొని అతి స్వచ్ఛమైన పరవళ్ళు త్రొక్కే నీటితో తన దరిజేరిన వారికి అమితానందాన్నిస్తుంది.
మేము ఆ ఆనందాన్ని ఎంత సేపు అనుభవించామో! రకరకాలుగా ఛాయాచిత్రాలు తీసుకొని పదిలపరచుకున్నాము. ఇచటికి మా బావగారు కూడ రాగలుగుతారనే ఉద్దేశంతో నే ముందుగా దీనికి వచ్చాము. ఇచటి అందాలను వృత్తిపరమైన ఛాయాగ్రాహకులైతే ఎంత ఒడుపుగా బంధిస్తారో! నాకు మదిలో అత్యుత్తమ ఛాయాగ్రాహకుడైన నా బావ మరది కీ.శే. గంగరాజు వాసుదేవమూర్తి మెదిలాడు.
పొచ్చెర జలపాతంబది
యచ్చెరువగుగాదె మనకు హ్లాదినియగుచున్
చెచ్చెరదూకగముందుకు
చిచ్చరపిడుగయ్యెమనకు సిరులనుగూర్చన్.
జలపాత దర్శనానంతరం నిర్మల్ బొమ్మల తయారీ, పూర్తిగా తయారయి అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి , ఆయిల్ పెయింటింగ్స్ చూచాము. అవి సజీవ దారు శిల్పాలు. మన భారతీయుల కీర్తి కిరీటాలు. స్వచ్ఛ విజృంభమాణసృజనలు. అభివృద్ధి వారి కళాకౌశలాలలో కనపడుతున్నదే కాని వారి జీవితాలలో కాదని ఆ కళాకారులను చూచినపుడు అవగతమౌతుంది. దానికి మనం స్పందించాల్సిన విధానం ఒక్కటే. వారి వస్తువులను మనం కొని ప్రోత్సహించటం. అందుకే మేము కొన్ని బొమ్మలను కొన్నాము.
ది.3.12.2017. న. కుంతాల జలపాతం.
ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలం "కుంటాల"గ్రామంలో ఉంది. దీని ఎత్తు 147అడుగులు. హైదరాబాద్ నుండి 237కి.మీ. నిర్మల్ నుండి షుమారు35 కి.మీ. వెళ్ళి నేరడిగొండ నుండి కుడివైపునకు తిరిగి 13కి.మీ వెళితే "కుంటాల" జలపాతం వస్తుంది. దుష్యంతుని భార్య శకుంతల ఇచటికి వచ్చి స్నానంచేసి వెళ్ళేదట. ఆమె పేరు మీద ఈ జలపాతానికి "కుంతల"జలపాతం అని పేరు వచ్చిందట. భూమట్టం నుండి క్రిందకు 408 మెట్లు ఉన్నాయి. కాని చాల విశాలంగా ఉండి ఎక్కువ శ్రమలేకుండ దిగి ఎక్కగలిగేలా ఉంటాయి. కొంత మధ్యలో విశ్రాంతి తీసుకుంటు వెళ్ళిరావటం శ్రేయస్కరం. అత్యంత మనోహరదృశ్యం. వర్ణనాతీతం. కాని నీరుపారే ప్రాంతమంతా పాచి ఉండి ప్రమాదానీకి హేతువౌతుంది. మిక్కిలి జాగ్రత్త అవసరం.
కుంతల జలపాతంబిది
ఎంతయు ఘనమైనలోతు ఏమామలుపుల్
వింతకు వింతై తోచు,శ
కుంతలపేరన్ బరగుచు కూర్మిన్ గూర్చున్.
ముఖ్య విషయం.
అచటికి వెళ్ళేముందే మనం దారిలో మనకోసం ఎంతో ప్రేమగా, ఆశగా ఎదురుచూచే వానరాల కొరకు కొన్ని ఫలాలను తీసికొని వెళ్ళటం మరచిపోరాదు. మనం తిన్నది మట్టిపాలు. పరులకు పెట్టేది పరమాత్మ పాలు. పరమాత్మ అనుగ్రహిస్తే వరాలు. ఆగ్రహిస్తే శాపాలు. మనం జీవకారుణ్యాన్ని పాటించుదాం, తోటివారికి సాయపడదాం. కళాకారుల జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి కార్యక్రమాలు అక్రమార్జనాపరులు చేస్తే వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అందుకే వారిందులోకి రారేమో! ప్రభుత్వాలు కూడ కుటీర పరిశ్రమలకు ఎక్కువ చేయూత నివ్వాలి. వారి జీవితాలలో కాంతులు నింపాలి.