చి.ల.సౌ.ఇందిరకు సూర్యనారాయణ రావు
శుభాశీస్సులు. (రామేశ్వరం)
జీవనంబున నాకిల చిత్రగతుల
చేతనత్వంబు గల్గించి స్నేహ భావ
మమర జేసిన లక్ష్మికి మాధవుండు
జన్మదినమది హర్షాన సాగునటుల
ఆశిషంబుల నిచ్చుత! అహరహంబు.
రవి శశిల పుట్టినరోజు 8.5.83.
ఈశ్వరేచ్ఛగ కవలలై యింపుదనర
రవియు శశియును తమకాంతులవనినింప
పొన్నెకల్లున బుట్టిరపూర్వయశము
పెంచిపోషింప పితరుల ప్రేమదనుప.
కన్నవారల శ్రేయంబు గాంచుకొఱకు
బంధుమిత్రుల లాలన పరగజూడ
లక్ష్యశుద్ధిగ జీవిక రాటుదేల
రాము డెప్పుడు మిముగాచు రమ్యరీతి.
20.04.2020.(చి.ఫణికృష్ణ)కు పుట్టినరోజు
శుభాకాంక్షలు, శుభాశీస్సులు.
సంస్కృతాంధ్రములను చక్కగపఠియించి
యోగవిద్యలోన నుద్యమించి
వీడియోల జేసి విజ్ఞాన ముంబంచు
అనుగు బుత్ర!అందుమాశిషముల.
జన్మ దినోత్సవంబున సకలజనుల
ఆశిషంబుల నొందుమ! హ్లాదమొదవ
ఆయురారోగ్య సంపదలందుకొనగ
రాముడోముత నిన్నెప్డు రక్తిదనర!.
చిరంజీవి శశిధర్ పుట్టినరోజు శుభాకాంక్షలు.
శుభాశీస్సులు.
జీవితంబున నాశయ సిద్ధి కొఱకు
పాటుబడుచున్న కష్టమ్ము వమ్ముకాదు
జయము నిత్యమ్ము ధైర్యంబుచాటునుండు
ముందుకేగుడు జయమంద పూర్ణగరిమ.
మామయ్య గారు,అత్తయ్యగారు.
విజయ పథములు సతతంబు వేదికవగ
నీదు ప్రజ్ఞ ను జూపించి నిలుపుమమ్మ
ప్రథమస్థానంబు దక్కును భద్రమగుచు
మహిత!సత్కార్యభావనల్ మరువకమ్మ!
తాతగారు, బామ్మ.
పల్లవి. పుట్టిన రోజు పండుగ , పున్నమి వెన్నెల నిండగ
చరణం .1. సర్వ జన్మల ఉత్కృష్టంబౌ, సంస్కారంబుల సంతృప్తంబౌ
ఈ నరజన్మము భువిలో వరమై, పుణ్య కర్మముల పునీతసరమై
వచ్చెను మాధవుడిచ్చిన రీతిగా, తెచ్చెను మాతయె తన యొడికి
జగతికి వెలుగుల పంచును , నా సుతుడంచును
తండ్రియె మురియును తన్మయుడై . !! పుట్టిన రోజు పండుగ
2. బందుగులందరు బహు సంతసమున , భవ్యుడు వీడని పొగడగను
మిత్రులు మేలను స్నేహపరంపర , మెలగుట ధర్మము సాధనకు
నిస్స్వార్ధంగా దాన ధర్మములె , కరముల కందము కాదనకు
సమాజ సేవయె ప్రమోదమంటు , సల్పుట జీవన కర్తవ్యమ్
దైవము సైతము దానినె కోరును , తాత్విక చింతన వక్తవ్యమ్!! పుట్టిన రోజు పండుగ
3. ఆరోగ్యంబగు నా యువు పెరుగును , ప్రేమామృతహృదయముతో
దానిని మీరలు పొందగ నిత్యం, సర్వ భోగములందుట సత్యం .
పుట్టిన రోజు సార్ధక మౌచు , పున్నమి వెన్నెల విరియునులే
కుటుంబమంతా కూరిమి నిండి కోర్కెలు మరి మరి పండునులే .
భావిజీవితము బంగారు మయమై , భద్రము మీకిల కలుగునులే!! పుట్టిన రోజు పండుగ .
స్వచ్ఛమైన, నిస్స్వార్ధస్నేహ దీపం ప్రతియొక్కరి గుండెగుడిలో వెలగాలి. అదే సమాజం సుఖంగా సంతోషంగా ముందుకు సాగటానికి దారి చూపుతుంది. నిజానికి స్నేహం రక్త సంబంధాలకన్నా అత్యంత విలువైనదని మనకు అన్ని ప్రామాణిక గ్రంథాలు తెలియజేశాయి. రక్తసంబంధాలబంధాలు జీవనయానంలో తనవారికి కూడ పైసా ఖర్చు చేయాలన్నా లెక్కలు చూచుకొని లాభనష్టాలు తూచుకొని, చూచుకొని లాభసాటిగా ఉంటేనే ఖర్చు చేస్తాయి. నిస్స్వార్ధ స్నేహం అలాంటి బేరీజులు వేసుకోదు. స్నేహితుని లాభ క్షేమాలను మాత్రమే కోరుకుంటుంది. స్నేహితుని శ్రేయస్సును నిరంతరం కోరుతు అతని లోపాలను సున్నితంగా తెలియజేస్తు సన్మార్గగామిగా చేస్తుంది. నిజమైన స్నేహం నిస్స్వార్ధం, నిర్మలం. బలం.
పుట్టినరోజు సందర్భంగా రామయ్య మిత్రునకాశీస్సులు.
చిరునవ్వు వెలయించి చిన్నపెద్దలలోన
స్నేహదీపముబెంచు చెలిమికాడు
సతతంబు సుహృదిన్ సంఘమ్ము దలచుచు
సేవలనందించు చేతనుండు
తేటతెన్గును వాడి తీయని మాటల
భాషను బ్రతికించు భావుకుండు.
పెద్దల దర్శింప పేర్మిని గురువుగా
భావించి సేవించు పావనుండు
అట్టి సద్గుణశీలి రామయ్య సఖుడు
వేవసంతాలు సౌఖ్యాన వెల్గుగాత
శ్రీలు వర్థిల్లి సతతంబు చెలగుగాత
రామభద్రుని కరుణచే రహినినెపుడు.
ఆస్నేహాన్ని మనందరం పంచుకుంటు పెంచుకుందామా! సర్వే జనాః సుఖినో భవంతు!
1. పుట్టినరోజు సంతోషం పదిమందితో పంచుకుని
సార్థకత ఏర్పరచాలని కోరుకుంటు...
2. పుట్టినందుకు మనవాళ్ళనే కాక సమాజాన్ని కూడఆనందంగా
ఉంచేేందుకు ప్రయత్నం చేయాలని కోరుతు..
3. అంగవికలురకు, పేదలకు ఆనందాన్ని పంచటమే
నిజమైన పుట్టినరోజు పండుగ కావాలని కోరుతు..
4. పుట్టుక ఎంత కష్టమో, దానిని సార్థకం చేసుకోవడం
అంతకు మించిన కష్టంగా భావించాలని కోరుతు.
5. తలిదండ్రుల ఆనందం ఇనుమడించాలంటే ప్రతి
ప్రతిపుట్టినరోజున నీవొక మంచిపని చెయ్యాలి.
6. చెప్పేమాటలు వాయులీనమౌతాయి. కాని సత్కార్యాలు
సువర్ణాక్షర లిఖితాలు.సత్కార్యాచరణ కోరుతు...
7. పుట్టినరోజు ను త్యాగానికి కానుగా సమర్పించు. జన్మ
ధన్యం అవుతుంది. త్యాగజీవివి కావాలని కోరుతు..
8. మనం లేని లోటు సమాజానికి కనిపిస్తే నీ జన్మ
సార్థకమైనట్లే. నీ ఉనికిని చాటాలని కోరుతు..
1. గతాన్ని మరచి బుద్ధి ని తరచి భావికాలమంతా చక్కని లక్ష్యాలతో ముందుకు సాగాలని కోరుతు...
2. ధనం కన్నా, విలువైన కాలాన్ని వమ్ముచేయక రాబోవు సంవత్సరం సద్వినియోగం చేసుకోవాలని కోరుతు...
3. కలకాలం నైతికతకు నీరాజనాలు పలుకుతు భావికాలాన్ని
స్వర్ణమయం చేసుకోవాలని కోరుతు...
4. ఆనందానికి మూలం మనసు, దానిని సంతోషంగా ఉంచితే
అంతా ఆనందమే.మీ కుటుంబమంతా ఆనందంగా ఉండాలని
కోరుతు.
5. మంచి స్నేహిలను మించిన సంపదలేదు. అటువంటి
సంపదతో ఆనందం గా ఉండాలని కోరుతు.
6. క్రొత్తసంవత్సరంలో మీరు ఎక్కే ప్రతిమెట్టు విజయానికి
తొలిమెట్టు కావాలని కోరుతు...
7. ఆశలవలయాలను పరిమితం చేసుకుంటు లక్ష్యాన్ని
అపరిమిత స్థాయిలో సాధించాలని కోరుతు.
8. ఊహల్లో తేలక ఉన్నస్థితిగతులకనుగుణంగా మెలిగి
ఆదర్శజీవనం గడపాలని కోరుతు..
9. ఘనకీర్తి కి మూలహేతువు నిస్స్వార్థసేవాభావం. అట్టి
భావాలతో నిరంతరం విలసిల్లాలని కోరుతు.
10. కరుణాపూరిత అంతరంగం అమృతత్త్వానికి ప్రతీక.
అట్టి అమృతహృదయులు మీరు కావాలని కోరుతు.
సీ . ఇంటింట శుభశోభ లింపార వలెనన్న
ప్రమిదల దాల్చిన ప్రమదవలయు
కంటినిండుగ వెల్గు కనజేయవలెనన్న
విమల దీపకళిక వెలుగవలయు
మింటికి మంటికిన్ మేల్జేయ వలెనన్న
అణుబాంబు ప్రేల్చుటలాపవలయు
వింటిని సంధించు వేత్త కావలెనన్న
ధీరసత్యగ నీవు మారవలెను
తే. గీ .అపుడె దివ్యదీపావళి యందగించి
జాతి సుఖసౌఖ్య భోగాల సారమరసి
విశ్వశాంతికి సరియైన వేదికగును
పరమ సంతోషకారక పర్వమగును.
ఉ . తోరణ పద్యదీపములితోధిక రీతి వెలుంగజేయు నీ
కారణజన్ములైన కవిగాయకమండలి కాంతిపుంజముల్
నేరుగ వాణిపాదముల నిశ్చలభక్తి స్పృశించుచుండగా
తీరగు పర్వమై వెలసె ధీవరు భావమహేంద్రచాపమై.
3.11.2013
కవిపండిత మిత్రమండలికి దివ్య దీపావళి శుభాకాంక్షలు.
చెడుగు చీకట్ల నిరతంబు చీల్చివేయు
వెలుగు రేఖలు జీవన వేల్పులనగ
మానవాళి కి లభియించె మహితగతిని
దీప మాలిక పేరిట దివ్య వరము.
రాక్ష సంబైన పనులకు శిక్ష నునిచి
రమ్య ,సౌజన్య భావాలు రాణకెక్క
మహిని నరకుని నరకి మాన్య సత్య;
కంటకంబును దొలగించె వింటి చేత
దీపమన్దున శ్రీలక్ష్మి దేవి యుండి
పాప హరణంబు గావించి పరమ పుణ్య
హేతు వగుచును ప్రజలెల్ల హేల మెలగ
వరము లిచ్చును క్రీగంటి కరుణతోడ
పరమ జ్యోతియె చీకట్ల పారద్రోలు
చీకటనగను పాపాల చింతలేను
అమ్మ కరుణయె దీపమై యవతరించ
జగతికంతట వెల్గులై జయముగూర్చు
నరక రాక్షస తత్త్వంబు నరుడు వదల
దీపకాంతిత హృదియె దేదీప్యమగును
అమ్మ చిరునవ్వె దీపమై యహరహమ్ము
వెల్గుచుండును ప్రతియింట విస్తృతముగ
అసురతత్త్వమె అమవస యందు నేను
మోద సమభావ కరుణలు పున్నమగును
మోము చిరునవ్వు సతతంబు ప్రేమమయము
శుభము గల్గుత!మీయింట ప్రభలునిండి

సీ: తులసీదళమునకె తూగి భక్తియొకటె
సూత్రమ్మటంచును చూపినావు
చీరలు దొంగిలి శృంగారమోహాలు
సారంబుగాదని చాటినావు
అటుకుల కాన్కకే యైశ్వర్య మందించి
స్నేహభావంబదె నిల్పినావు
అన్నాయటంచును నాక్రందనలజేయు
ద్రోవది కష్టంబు తొలచినావు.
తే.గీ:వేదవేదాంతసారమ్ము మోదమలర
గీత రూపాన వెలయించి కృపనుజూపి
ధరణిప్రాణులయందున దాగియున్న
నందనందన శ్రీకృష్ణ !వందనములు.!!
కం: కన్నయ్య దయను బొందగ
నెన్నెన్నో మార్గములను నెంచగవచ్చున్
వెన్నయ్య గృహముజేరగ
చెన్నైన పదములలరుట చిత్రం బయ్యెన్.
ఉ: తలచినతోడనే మనసు తన్మయమందగ భక్తి భావమున్
పిలచినవారి యిండ్లకటు ప్రేమగవచ్చెడు నల్లనయ్య-ఆ
జిలిబిలి పాదయుగ్మముల జేరెను మాదు గృహంబులోనికిన్
కలిగెను సార్థకంబిటుల కన్నయ దర్శనభాగ్యమిచ్చుటన్.
కం: కన్నా యనగను బలుకును
తన్నామము బలుకలేక తలచిన మెచ్చున్
వెన్నన్ మ్రెక్కెడు దేవర!
అన్నా! నీ పాద స్పర్శ యబ్బురమందున్.
భోగిమంటలకాంతులు భువినినిండి,
మాననీయత సరదాలు మదులపండి,
కనుము పశువుల క్షేమంబు కాంచుచుండ,
పెద్ద సంక్రాంతి వచ్చెను ప్రియముతోడ.
ముక్కోటి శుభాకాంక్షలు.
ముక్కోటిపర్వదినమిది
మ్రొక్కుమ పాపాలువోయి మోక్షమునందన్
అక్కజరూపుడుశ్రీహరి
దిక్కగు నిరతంబుమనకు దేదీప్యుండై.
ఘర్షణలేని యోచనల గౌరవమొప్పెడు కార్యసాధనల్
ఆర్షసుసాంప్రదాయముల నడ్డకరమ్మిటు లాంగ్లవర్షమా!
జనవరి పేరపుట్టితివి చక్కగ పెద్దరికంబుజూపగా
అనయము నన్నిమాసములు హాసము సౌఖ్యము సంపదాళినిన్
వినయముతోడనిచ్చికడు విజ్ఞత ప్రాణులుసంతసింపగా
గనుమిక మాసమా పరమ గారవమొందెదవీవు నెయ్యమై.
క్రొత్త వత్సర మన్నను కోర్కెలెన్నొ
తీర గలవంచు జనులెల్ల నోరుదెరచి
చూచుచుందురు వర్షమా సుంతదయను
శ్రావణపున్నమికే రక్షాబంధనం చేసుకోవటం ఒక సంప్రదాయముగ వస్తున్నది. సోదరసోదరీమణులు పరస్పరం రక్షణకోరుతు చేతికి కట్టే సూత్రమే యిది. ప్రేమ మనిషిని మనీషిగా చేస్తుంది. దానిని పెంచి పంచాలి. అలాగే మాతృభాషామతల్లికి కూడా మనమందరం రక్షాబంధన చేయవలసిన దుస్తితి వచ్చింది. ఋణం తీర్చుకోవాలంటే కట్టక తప్పదు. అంటే ఏదో అద్భుతం చేయనవసరం లేదు . వీలైనంత తెలుగులో మాట్లాడి,నాలుగు మాటలు తెలుగులో వ్రాస్తే చాలు సంతోషిస్తుంది మన ఆంధ్రమాత.
తే.గీ. తెలుగుమాటలు నాలుగు పలుకగలను
తెలుగు స్వారస్యమెంతైన తెలుపగలను
తెలుగుదనమును భావాల నిలుపగలను
తెలుగుకవి వారసుండనై వెలుగగలను.
తే.గీ. అమ్మ నీపాద పద్మంబు నహరహంబు
కొలుచుచుందును సదమలకూర్మితోడ
ఆంధ్రభాషామతల్లికి హారతిచ్చి
రక్ష బంధన గూర్తును రమ్య గరిమ
అని అంటే చాలు మన భాషామతల్లి పొంగి పోతుంది.
తెలు(గు వాడు
1. సీ . తిక్కన్న కవితలో తియ్యని మధుధార
తనివిదీరని భంగి ద్రావుచుండ
పోతన్న భక్తిలో పూర్ణత్వమున్బొన్ది
సతతంబు హరిసేవ సల్పుచుండ
పొన్నగంటి వారి చెన్నైన తెను(గులో
అచ్చ తెను(గు కావ్య మలరుచుండ
శ్రీనాథుసీసాల శేషంబునుంచక
గుటగుట త్రాగంగ కోరుచుండ
తే.గీ. తెల్గు వానికి లోటేమి తెల్పుమయ్య
తిక్కనార్యుని, శ్రీనాథు తీరులన్ని
పొన్నగంటితో కలగల్పి పొదివి పొదివి
ముద్దు మురిపాల తెలు(గున మురియగలరు.
2. సీ. గళమెత్తి, కలమెత్తి గంభీర భావాలు
పదిమంది నలరించి పల్కువాడు!
నమ్మిన సత్యంబు నవనిధులిచ్చినా
వదలని ధీరుండు వజ్రసముడు!
ధర్మపాలనమందు దారిద్ర్యమొదవినా
హ్లాదాన జీవంబు నందువాడు!
దేశరక్షణమన్న ధీరతజూపించి
త్యాగంబురూపించు తపనవాడు
తే.గీ. వాడి గల్గిన పలుకుల వరలువాడు
ఒంటి పోరుకు నెదురొడ్డి ఓర్చువాడు
మిన్ను మన్నును లీలగా మెదపువాడు
తెలుపవలెనా! యింకను తెలు(గు వాని! .
తే.గీ. దేశ దేశములందున ధిషణ జూపి
తనదియైనట్టి శైలిన తనరుచుండి
తెలు(గు వెలుగులు విశ్వాన తేట పరచి
కీర్తి కాంతను చేబట్టు మూర్తి యితడు! .
పూర్ణబిందువు లోపల పొదుగబడుచు
అక్షరాక్షర శోభల నలరుచుండి
పదము పదమునసౌలభ్య మొదవుచుండి
పలుకు పలుకున తేనియలొలుకు భాష.1.
దేశభాషలందు తెలుగు లెస్సయనుచు
కృష్ణ నృపునిచేత తృష్ణదీర
పొగడబడినయట్టి ముచ్చటౌ బాసరా
తెలుగు పూలతోట వెలుగు బాట. 2.
అవధాని గళంబందున
వ్యవధానము సుంతలేక వరదగ పద్యాల్
నవరస నిర్భర ధారా
కవనంబున నొదుగు భాష కమ్మని తెలుగే.3.
అమ్మ పాలలోని నద్భుతామృతమెల్ల
దేశ భక్తురుధిర ధీరతనము
భారతీయ మహిళ పావిత్ర్యమంతయు
కలిపి జూడ తెలుగు కానుపించు. 4.
తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు.
తే.గీ : తెలుగుపద్యాలు చదివిన తేనెలూరు
తెలుగుపదములు సర్వదా ధిషణ పెంచు,
తెలుగు భావాలు నిరతంబు ధైర్య మిచ్చు .
తెలుగుతనమది ఆధ్యాత్మ స్థితిని బెంచు.
తే.గీ: తెలుగు వెలుగులు గగనాన వెలుగవలయు.
తెలుగు భాషకు పట్టంబు నిలుపవలయు.
తెలుగు తెలుగంచు ప్రభుతయు మెలగవలయు.
తెలుగున కపుడె గౌరవ తీరు బెరుగు .
తెలుగు కవిత్వం... ఆధునికత..
ఆ.వె: కవిత మదిని సతము కదిలించుటే కాదు
సంఘసేవకూడ సలుపవలయు
గిడుగు వారి సేవ కీర్తించుటేగాక
వ్యావహారికంబు వాడవలయు.
ఆ.వె: తెలుగు భాషలోని తీయందనంబును
తేటతెలుగు కవిత యూట పగిది
పంచవలయు నెపుడు వర్ధిల్ల తరములు
కష్టసుఖములందు కదనుత్రొక్కి.
ఆ.వె: ఏసమస్యనైన నేరీతి తీర్చుటో
యూహచేసి కవితనుంచవలెను
ప్రజలకొఱకు కవిత పరిమళభరితమై
నండనుండవలయు నహరహమ్ము
సీ: మధురపదార్ధాల మాధుర్యమంతయు
కలిపిన సారంబు తెలుగుభాష
బోసినవ్వులలోని పున్నమి వెన్నెలల్
తెఱచి చూపెడుభాష తెలుగుభాష
సంగీత సాహిత్య సౌమనశ్యాలెల్ల
పులుముకొనినది మా తెలుగుభాష
దేశభాషలయందు దేదీప్యమానమై
పలువురు స్తుతియించు తెలుగుభాష
ఆ.వె: పద్యమైనగాని వరగద్యమేగాని
పలుకు పలుకులోన కులుకులొదవి
నవ్యశోభలీని దివ్యత్వముంబంచు
అక్షరాక్షర సుధ లమరు భాష.
తెలుగు భాషామ తల్లిని యావత్ ప్రపంచం కాపాడుకోవాలనే సదుద్దేశం తో . లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధి. న చాల ఘనముగా జరిగినవి. ఎందరో కవితామతల్లులు వతంసులు, దిగ్గజములు , తల్లజులు, కిశోరములు పాల్గొన్నారు. వ్యాసంగం 30గమ్. 30.ని.30 సె. సాగినది. అందరకు అర్హతా పత్రములు, జ్ఞాపికలను యిచ్చి గౌరవించారు. ఈ రీతిగా నరసింహ స్వామీ ప్రసాదం లభించినది. అటువంటి అదృ స్టానికి, నేను(పొన్నె కంటి సూర్యనారాయణ రావు, జొన్నలగడ్డ జయ రామ శర్మ, నోచుకోన్నాము . మరపురాని సాహితీ అనుభవమ్.
.ప్రపంచ తెలుగు కవితోత్సవములు. అక్టో బర్ 17.18. తేదీలు
సర్వులకు శుభము కలుగుగాక! శాంతి కలుగుగాక!
సర్వులకు ఎల్లవేళల స్నేహ, సోదరభావములు కలుగుగాక!
యావత్ప్రపంచ దేశముల మధ్యన
స్నేహభావము కలుగుగాక!
సమస్త మానవాళి మనసులలో
స్నేహభావము కలుగుగాక!
సత్య పరిశీలన, యోగసాధన కలుగుగాక!
ఎల్లకాలములందు స్వయం శిక్షణ,
ఉత్తమ గుణరక్షణ నిలుచునుగాక!
జీవనప్రయాణంలో అపరిచితులమధ్యను కూడ
స్నేహభావం కలుగునుగాక!
త్రికరణశుద్ధిగా ఏడడుగులు నడచి స్నేహం చేస్తే
హృదయాలలో స్థానం ఏర్పడుతుంది.
సమస్తప్రపంచము భారతీయజన
సమైక్యత,సమతలనాదరించుచు
విశ్వశాంతి మార్గమును అనుసరించుగాక!
ఇది సర్వ జనులు ఆమోదించు
క్షేమకర మహాయోగము.
(ప్రక్కన గాయకులు): ॥అలాగే అగుగాక!॥
ఇది సమస్త దేశములామోదించు
విశ్వశాంతి స్వరరాగము!
ఇది సమస్త దేశములామోదించు
శాంతిప్రదమైన ఒక యోగము! ॥ అలాగే అగుగాక!॥
సర్వులకు శాంతి, శుభములు కలుగుగాక!!
తే.గీ. దయయు ప్రేమైక గంథముల్ తనివిదీర
నింటనింపిన బోనేల నీశు దరికి?
పూజసేయంగ వేవేల పూలతోడ
భక్తి తత్త్వంబునెఱిగిన ప్రాజ్ఞులకును.
భావము.. ఓ మానవా!దయ, ప్రేమ అనే సుగంధాలను నీ యింటిలో
తే.గీ. మనసునందలి గర్వంబు మచ్చరంపు
చీకటుల ద్రుంచ యత్నంబు సేయవలయు
కాంతివంతము నీకది క్రాంతిగూర్చు.
దీపముంచగబోనేల దివ్యుకడకు ?
తే.గీ. శిరము వంచగ నేటికి శివుని గుడికి
తోడివారికి వినయాన తోడునిలచి
తప్పు జరిగిన నిలువెల్ల తాపమంది
పూర్ణమైనట్టి జ్ఞానివై ముందుకేగు.
తే.గీ. పూనుకొనగను పేదల పుష్టికొఱకు
యత్నముంజేయ దళితుల హాయిగోరి
యువత ప్రగతికి సతతంబు నూతమీయ
గుడికిబోనేల మానవా మడులుగట్టి?
తే.గీ. నీదు కాఠిన్య వచనాల బాధజెంది
కుములువారిని దరిజేరి కూర్మిదనర
క్షమనువేడుము సరియగు క్షణమునందు.
వేడనేలకో శివుని నీ గోడుదెలిపి?
విశ్వావసు ఉగాది (2025..26) పద్యములు.(తిరుమల
నాదనీరాజనం) 30.03.2025.
సీ|| ప్రాణికోటి మదిని పరమాత్మయై వెల్గు.,
తేజంబు నీవెగా తిరుమలేశ!
సకలంబు భ్రమయైన సంసారబంధాల.,
తీరుమార్చగగల్గు తిరుమలేశ!
కాలగమనరీతి కనిపింప నీయని.,
చిద్విలాసపు హాస! శ్రీనివాస!
భక్తి తత్త్వపు నిజభావనల్ జూపిన.,
అభయంబు నిచ్చెడి యమలతేజ!
తే.గీ. స్వామి! సప్తగిరీశ! “విశ్వావసు”వన.,
నీవె, ఎన్నిజన్మలకైన నిర్ణయాత్మ
కుండవు మహితమూర్తి! వైకుంఠవాస! .,
జగతి గావుమయ్య సతముప్రగతిజూపి..1.
సీ|| ఏడేడు లోకాల నెచ్చట జూచినన్.,
కలిమాయ తప్పించు ఘనుడవీవె.
అలమేలు మంగమ్మ యలుకలు దీర్చుచు.,
నవ్వించి కవ్వించు నటుడవీవె.
భక్తుల హృదయాలు పండించి నిండించి.,
పరవశించెడు ఘనపాఠివీవె.
లడ్డుకంబులనిచ్చి లాలస జూపించి.,
దరిజేర్చు కొనునట్టి హరివి నీవె.
తే.గీ. క్రొత్త పంచాంగ మందున కూర్మితోడ .,
నీదు కరుణనుజూపించి నిర్మలాత్మ!
అన్ని రాసుల వారికి తిన్ననైన.,
కనకవర్షంబు గురియించు కమలనాభ! 2.
సీ|| కొండలలోన పుంస్కోకిలంబులతతి .,
చైత్రమాసపుసౌరు చాటుచుండె
తుమ్మెద రాగాల తోషణ గానాల .,
మల్లెతోటలలోన మారుమ్రోగె
చిత్తజు పదునైన మెత్తని బాణముల్ .,
గుండె లోతులలోన గ్రుచ్చుకొనియె
వాసంత లక్ష్మియే వయ్యారముల్ జూపి .,
చిలిపిప్రకృతితోడ చేయిగలిపె
తే.గీ. ఈ ‘‘యుగాది’’ని నిట్లుగా నీశ్వరయ్య! .,
మార్చివేయుట కీవెగా మంచిగురువు
పరమకారుణ్య సౌజన్య! వరద! మాకు .,‘‘
విశ్వవసువు’’న శుభముల విసరుమయ్య 3.
సీ|| వేంగమాంబాదేవి విష్ణుభక్తికిమెచ్చి .,
అన్నదానమిచట నమలు పరచ
వృద్ధులు పంగులు వికలాంగులెల్లరు .,
శీఘ్ర దర్శనములు చేయుచుండ
గోసేవ జేయుచు గోవులనన్నిటన్ .,
తనివార ప్రేమను దనుపుచుండ
తిరుమల క్షేత్రంబు దేదీప్యమానమై .,
ఘనపు టుగాదిగా కాంతులీనె
తే.గీ. నిత్యకల్యాణమిచ్చట నిర్మలాంగ.,
పచ్చతోరణమైచను
పరమపురుష!
నీదుపాదంబులే సాక్షి నిజము నిజము .,
ధన్యమాయెను మాజన్మ ధరణినాథ! 4.
సీ|| షడ్రసో పేతమై సకలజ నాళికి .,
పలురుచుల్ చూపించు పండుగిదియ
క్రొత్తవస్త్రాలతో కోలాహలమునిండి.,
ప్రతియింట వనలక్ష్మి వరలుచుండ
పంచాంగ పఠనాన భావిని దలచుచు .,
కష్టసుఖంబులు కలలుగనుట
ఆదాయ వ్యయములు సాదాగనుండుటన్ .,
జీర్ణించుకొనలేని జీవితాలు
తే.గీ. మానసికమైన దైహిక మార్పులన్ని .,
నీదు కరుణాంత రంగమే నిశ్చయముగ
నిజము కదటయ్య లోకేశ! నీరజాక్ష! .,
కాక, రుచులును ప్రతిభలు కలుగుటెట్లు?5.
సీ|| నాదనీరాజన వేదసమర్చనల్ .,
నిత్యసంపూజిత నెలవు మీకు
భక్తదర్శనములు పల్లాండు దీవనల్
పరవశంబునుగొల్పుప్రభలు మీకు
మాడవీధులద్రిప్పు మానితసేవలే
నిత్యకల్యాణముల్ నీకునెపుడు
తిరుమల గడపిన దివ్యక్షణంబులే.,
వైకుంఠమునుజేరు వరుసమెట్లు
తే.గీ. మాకు దక్కిన భాగ్యంబు మదనజనక! .,
కలియుగంబున
వెలసిన కైటభారి
ఏడుకొండల మా సామి వేడుకొందు.,
పాదపద్మములంటుచు
ప్రతిదినంబు..6.
సీ|| ఆదిశేషునిపేర యమితకీర్తినిగాంచి.,
“శేషాద్రి”యయ్యెను సేవ కొరకు
నీలాంబరీ దేవి నీలాలనిచ్చుటన్.,
“నీలాద్రి”యైనిల్చె నిన్నుగొల్వ
అంజనాదేవియె ఆత్మనిన్ దలచుచు.,
“అంజనాద్రి”యనగ యలరెనాడు
వృషభాసురుని గర్వ విచ్ఛిత్తి జేయుటన్.,
“వృషాద్రి”యైచనె వినయమొప్ప
నారాయణాఖ్యుడన్ నవవిధ భక్తుడే.,
“నారాయణాద్రి”యై నభముదాకె
గరుడవాహనమది కంజాక్షుసేవింప .,
“గరుడాద్రి”యయ్యెను ఘనముగాను
వివిధపాపంబులన్ వీగగ జేయుటన్.,
“వేంకటాద్రి”గ మారె విభవమొప్ప
తే.గీ. నామజపముల శక్తిమై నడక తోడ .,
ఏడుకొండలు భక్తితోనెక్కి వచ్చి
నిన్ను దర్శించు నరునకు నీరజాక్ష!.,
సప్తజన్మల పాపాలు సమసిపోవు..7
సీ|| తీర్థయాత్రనుజేయ తిరుమలనెంచుటే.,
పూర్వజన్మలలోని పుణ్యఫలము
తలనీలములనిచ్చు ధర్మంబుపాటింప.,
దర్పహీనుండైన దాసుడనుట
కోనేటినీటను గ్రుంకులాడుటయన్న.,
జాహ్నవీతటిలోన స్నానమగును
బాలాజి చెంగటన్ భక్తినుగాదికై.,
అక్షరార్చనసల్ప మోక్షదంబు
తే.గీ. అన్నిగ్రహముల కరుణకు నంజలించి.,
ప్రకృతిశోభకు నిలువెల్ల పరవశించి
మానితావకాశ మిడిన మాన్యులకును.,
వందనమ్ములు శ్రీకర చందనములు..8.
సీ.: శ్రీదేవి తో నీవు చిద్విలాసుడవౌచు
భువియంత దిరుగాడ పులకరించు
పంచబాణుని గురి బ్రహ్మాస్త్రమై తోచి
అనురాగ రాగాలనలర జేయు
పాదపంబులు పూర్ణ పల్లవ శోభలన్
పచ్చదనంబును బరచుకొనును
శృంగార భావముల్ చిత్తాన మొలకెత్తి
సౌంజ్ఞల సరసాల సాగుచుండు
తే.గీ: ఆదిపురుషా ! కమలనాభ! యమలచరిత!
చేతనత్వము నీదివ్య సృష్టి యనుచు
చేసిచూపితివయ్యరో!శ్రీనివాస!
కాలచక్రంపుటాకు నుగాదియనగ..9
సీ: వేపపూతయు నుప్పుబెల్లంబు కారముల్
పులుపు వగరు లెల్ల పొందుపరచి
గా జులచేతితో ఘనమైన ప్రేమతో
నోర్పుగా నొకటిగా నూరినూరి
నళిననేత్రుని ముందు నైవేద్యమిడకున్న
రుచియురాదు మరియు శుచియులేదు
తే.గీ: భక్తి తాత్పర్యభావముల్ రక్తిదనర
వింతలేహ్యంబు విష్ణు నైవేద్యమిడిన
అమృతతుల్యంబు రుచులు మహత్తరములు
శ్రీనివాసుడ!నీలీల చెప్పదరమె?..10
నమస్సులతో....‘‘సూర్యశ్రీ’’
చి.ల.సౌ. దుర్గ 48 వ పెళ్లి రోజు శుభాకాంక్షలు,
శుభాశీస్సులు. ది.12.05.25.
సీ. ఏసీబి క్లబ్బులో నెట్టి కార్యంబైన
ముందంజతో జేయు ముద్దుగుమ్మ!
స్త్రీసాజమైనట్టి చిర్నవ్వు పువ్వులన్
ముఖ్యప్రసంగాల బూయజేయు
కర్తవ్యమెంతటి కష్టంబుగానున్న
లౌక్యంబు జూపించి లాగివేయు
సాహితీమూర్తిగా సమరసభావాల
పరిమళభరితమౌ పాటబాడు
తే.గీ. ఆటపాటలతోటగా నలరజేసి
క్లబ్బు సభ్యులనందరి కదలజేయు
దుర్గ సత్యనారాయణు తోడుగోరి
పంచుకొనె జీవితంబును పరమముదము
ఆయురారోగ్యములసర్వు లరుగాత!
శుభాశీస్సులతో....సూర్య శ్రీ.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు.