12, జూన్ 2025, గురువారం

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే

    సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా

    భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ‌, సం

    పూజిత దివ్యభవ్యమయి మోదముగూర్చె జగద్థితంబుగన్. 

2. శేముషి మీరె భారతము సింహపురిన్ కవి తిక్కయజ్వచే

    నా మహిమాన్వితంపు పదునైదు సుపర్వపు పాత్రలన్నియున్

    ఆమని వేళ కేకి గణమద్భుత నాట్య విశేష వైఖరిన్

    కోమలమై చనెన్ తెనుగు  కోర్కెలు పండగ వాడవాడలన్.

3. నన్నయ మార్గమున్ సరస నాటకరీతుల తిక్కనార్యునిన్

    చెన్నుగ నొక్కరీతి గని శ్రీ హరివంశపు సాహితీ సుధల్

    పన్నుగ శేషభారతము భావ రసాంచిత నూత్న వైఖరిన్

    మన్నన శంభుదాస వరమై మన తెల్గది వెల్గె దివ్యమై.

4. పోతన భక్తి తత్త్వమున పుస్తకపాణి ముఖావలోకియై

    ‘‘మాతరొ! బాష్పముల్ వలదు, మన్నన గూర్తు కవిత్వకన్నెకున్

    చేతము రంజిలన్ వినుమ! చిన్మయ రూపిణి! ’’యంచు బల్కెగా

    బ్రాతిగ నిచ్చె గౌరవము పచ్చని తెన్గుకు శాశ్వతంబుగన్

   ఆతరిసార్వభౌముని మహత్తర సీసవిలాసదీధితుల్.


5. రాయల కాలమున్ కవులు రమ్యరసాంచిత కావ్యజాలముల్

    వ్రాయగ తెల్గు భారతికి వజ్రకిరీటము వచ్చి చేరుటన్

    పాయని సంతసంబునను పౌరులు పద్యపరీమళంబులన్

    హాయిగ బీల్చి సద్యశము నందుచు  వెల్గెను విశ్వశాంతికై.

                                          సూర్యశ్రీ

                     (పొన్నెకంటి సూర్యనారాయణ రావు.)

                       మల్కాజిగిరి. ఫోన్. 9866675770.

                                      భాగ్యనగరం. 

    

    

10, జూన్ 2025, మంగళవారం

ప్రొఫెసర్ మాధవీలతారెడ్డి.

సీ.  శిలల బరువు వాని శ్రేష్ఠత్వముంగూర్చి

    శోధన సల్పిన సుదతి యెవరు?

    పదునేడు వత్సరాల్ ప్రాజెక్టు చీనాబు

    నిర్మాణ బాధ్యతల్ నెఱపెనెవరు?

    వెంకటరెడ్డికిన్ విమలాన్నపూర్ణకున్

    గుర్తింపు తెచ్చిన కూతురెవరు?

    మైదుకూరున బుట్టి మహిళామణిగ వెల్గు

    బంగారు పతకాల ప్రాజ్ఞి యెవరు?

    బెంగళూర్ సంస్థలో ప్రియమైన ప్రొఫెసరై

    మాన్యతన్ ఉన్నట్టి మహిళ యెవరు?

     మహిళా జియోటెక్ గ మానిత ముకుటమ్ము

    ధరియించి వెల్గిన తరుణి యెవరు?

    అర్ధచంద్రాకృతిన్ ఆశ్చర్యముంగొల్పు

    వారధి నిర్మాణ వనిత యెవరు?

    కాశ్మీర ప్రజలకు కలలపంటగ వచ్చి

    చీనాబు దాటించు చిన్నదెవరు?

తే.గీ. ఎవ్వరెవ్వరో యన్న నే నెఱుక పఱతు

        మోది కనుగొన్న జీయాల్జి ముద్దుబిడ్డ

        విశ్వవిఖ్యాతి బెంచిన వీరనారి

        భరతమాతౄణముం దీర్చు పసిడికొండ

        ‘‘మాధవీలతా రెడ్డి’’ యన్ మాన్యచరిత.

    

    


23, మే 2025, శుక్రవారం

కారముల సీసమాలిక.కవితాచమత్కృతి.

‘‘ శ్రీకార’’మనజెల్లు చెన్నగు  నారంభ‌‌,మునకన్ని పనులందు మోదమంద.1

‘‘ఓంకార’’మునుజెప్ప నుచ్ఛ్వాస నిశ్శ్వాస, క్రమబద్ధమునుజేయ గాంచుశక్తి.2

ఆరాధ్య దైవమే ‘‘ఆకార’’రూపాన, గాంచుటె భక్తుల కామితంబు.3

‘‘సాకార’’సౌందర్య సౌజన్య మూర్తిగా, ప్రార్ధింత్రు భక్తులు రామభద్రు.4

ఆధ్యాత్మికంబుగా నంతరంగముపండ, కలలతలపు ‘‘నిరాకార’’మందె.5

‘‘సత్కార’’మనగను సంగీత సాహిత్య, సర్వకళాభిజ్ఞ సంజ్ఞయగును.6

‘‘మమకార’’మనగను మాతృగర్భము నుండి,ప్రేమబంధమ్మైన ప్రేగుగాదె?.7

మదిలో ‘‘నహంకార’’మలినమ్మునిండిన,ప్రేమబాంధవ్యాలు బెదిరిపోవు.8

పెద్దల దర్శింప ప్రియమైన భావనన్, కైమోడ్పునిడ‘‘నమస్కార’’మగును.9

ఘనకార్యమును జేయ గౌరవాదరముల, కాంచనంబిడ ‘‘పురస్కార’’మగును.10

సజ్జన వర్తనన్ సంఘమున్జూచిన, ‘‘సంస్కార’’మనవచ్చు సంబరాన.11

‘‘వషట్కారంబు’’ హైందవ ఋత్విక్కు , పల్కెడి సచ్ఛబ్ద వాచకంబు.12

అందము మగవాని కతివకు గల్గించి, కనువిందిడున‘దలంకార’’మగును.13

సంఘసేవకునిగా సామాన్యులకునుండ, ‘‘నుపకార’’మయ్యదే ఉత్తమంబు.14

ఆత్మావలోకనన్ ‘‘అపకార’’భావంబు, చేరనీకుండుటే శ్రీకరంబు.15

‘‘ఛీత్కార’’మనగను చేష్టలు చెడుగైన, భ్రష్టరూపంబగు ఫలితమగును.16 

‘‘ఫూత్కార’’మునుజెప్ప పొగరైన ఫణిరాజు, తనుజేర బెదిరించు తత్త్వమగును.17 

‘‘గుణకారము’’ గణిత కోణాన హెచ్చింపు, మార్గమై సంఘాన మాన్యమయ్యె.18

పేదల కష్టాలు పెదరాయుడెప్పుడు, కాంచకున్నను‘‘తృణీకార’’మగును.19

ఎండుమిర్చియు దప్ప నే దినుసులులేని, ఘనమైన పొడి‘‘గొడ్డుకార’’మగును.20

సంకష్టములబెట్ట సహియింపనోపని, కార్యముంగన ‘‘ప్రతీకార’’మగును.21

పెద్దలు చెప్పిన ప్రియమైన సూక్తులన్, కాదన బహు ‘‘తిరస్కార’’మగును.22

భవ్యమందిర శోభ దివ్యమై కాపాడ, ‘‘ప్రాకార’’మందురు ప్రాజ్ఞులిలను.23

కదనరంగములను కాలు శవములను, కనలేని స్థితియె‘‘వికార’’మగును.24

‘‘ప్రకారంబు’’నిన్ ఏవేళ పూజింతు, మన్న మనసు నిల్పు మనియె హరుడు.25

గజరాజు క్రోధాన కానలు కంపింప, ‘‘ఘీంకార’’ముంజేయు కేకపగిది.26

‘‘నుడికార’’మనగ మనోజ్ఞ విశాలమౌ, భావజాలంబది బయలుజేయు.27

‘‘అంధకారం’’బన నజ్ఞాన పూర్ణమౌ, మానవ మానస మందిరమ్ము.28

‘‘ధిక్కార’’మనజెల్లు ధీవర రాజాజ్ఞ, పాటిసేయనియట్టి మేటితనము.29

ఇంతుల మనములావంతైన , తెలియక కౌగిలించిన ‘‘బలాత్కార’’మగును.30

కొక్కురోకోయని కొమరుసామిరథంబు,కంఠంబు సాచి"క్రేంకార"మిచ్చు.31.

టంకారంబుసురుల ఠావులుదప్పింప"ధనుష్టంకార"ప్రధానమయ్యె.32

"వెటకారము"నుజెప్పవెంగలిజేసి జనంబులసరసతనవ్వులాట.33

"హుంకార"మనజెల్లు హుమ్మును బెదిరింపు పశువులు క్రూరులు పైకిరాగ.34

        ఎన్నికారాలు మదిలోన నెఱిగియున్న

        పండితుండు ‘‘చమత్కార’’ పద్యములనె(35)

        గోష్ఠిలోపల సరదాగ కోరుచుండు

        సహజ సద్గుణమయ్యది సరసులార!

        కనుడిదే "సూర్యశ్రీ"మనస్కార కవిత.(36)


కవితాచమత్కృతి ఉత్పలమాలిక


కారమదెక్కువైన మృదుగాత్రము సైతము పొక్కిపోయి- ఘీం

కారపు రావము ల్వెలసి కన్నుల వెంటను నీరుగారు- సం

స్కారయుతంపు సారతర గౌరవ సత్కవితాచమత్కృతుల్

వేరుగజెప్పనేల సుకవీ!రస నిర్భరమై మనోజ్ఞమౌ.

ఏరసమందు జెప్పినను నింపునుసొంపు ముదంబుగూర్చునా

తారలమధ్య వెల్గెడు సుధాకరు చల్లని వెన్నెలంబలెన్

ధీరుని మానసాంబుధిని తీరుగ దాగెడి మౌక్తికంబునాన్

మేరుసుపర్వతంబునకు మించిన సైనికు సాహసంబనన్

కీరము తెన్గు నేర్పబడి కేవలపద్యమె బాడు తీరుగన్

క్రూరపుసింగమున్ జెలిమి కోరల నెంచు శకుంతలాత్మజు

న్నారసి కణ్వుడే మిగుల హాసమునందెడి వైభవంబనన్

భారతభారతీ పరమపావన పాదరజంపు తాకిడిన్

మీరిన బుద్ధివైభవపు మేలగు సత్కవి కావ్యమోయనన్

క్షీరసముద్రముం గసిగ జిల్క ద్వితీయఫలంబు కైవడిన్

కోరిన కోర్కెలందుకొను గోపిక మానస హాసమోయనన్

సారథి శౌరిగాగ కడు శౌర్యము జూపు నరావతారునాన్

దారిని జూపుచున్ పరమధర్మము నాదను ధర్మజుంబలెన్

కీరితికాంత సత్కృపయె గేహమునిండిన గేస్తుమాదిరిన్

హారముమధ్యవెల్గు మణియట్టుల కాంతి విలాసరూపమై

నూరువిధంబులం దనరు నూత్న చమత్కృతి శాశ్వతంబునై.

16, ఏప్రిల్ 2025, బుధవారం

కాకరకాయ

 కం. కాకర కరకర నమలగ., భీకరమగు చేదుగొల్పి బీభత్సంబౌ
       సాకులు జెప్పక తినినను., శ్రీకరుడై తీపిరోగి శ్రేయంబందున్.
 కం. వ్యాకరణంబయి కాకర., ప్రాకటమగు బాధగొల్పు ప్రప్రథమందున్
       తేకువ నిత్యముదిన్నను., నాకరమౌ సౌఖ్యములకు నౌరాయనగా!
 కం.అల్లుడు సరిగా నుండిన., విల్లున సంధించు శరము వేగముబోలున్
      చిల్లలుగ ప్రాకి కాకర., కొల్లలుగా సంతునీను  కూరిమితోడన్.
 కం. పిల్లల నిత్తువు ప్రేమగ., చల్లగ యజమాని కోర్కె సఫలము గాగన్
      చెల్లును నీకే యియ్యది., పొల్లుగ నేనెప్డు బల్క భో!కాకరమా!
 కం. అల్లుని జూపకయుండిన., మెల్లగ నేదైన గోడ మీదుగ దాటన్
       ఉల్లము రంజిల జూతువు., తల్లీ!నీమది చురుకది దండము నీకున్.
 కం. కాకరయు పొట్లపాదును., నేకముగానొక్కచోట నిల్పిన చేటౌ
      కాకరకు కంపు పడదని., లోకులు వచియింత్రుగాదె! లోకమునందున్.

24, ఫిబ్రవరి 2025, సోమవారం

పాంప్లెట్.

                               ఆహ్వానము.

"సూర్యశ్రీరామం"గ్రంథావిష్కరణ సభ.

వేదిక : శ్రీలలితా పరమేశ్వరీ దేవస్ధానం, 1వ ఫ్లోర్. అష్టభుజాదేవి ఆలయం ఎదురు. 

          ఆనంద్ బాగ్. హైదరాబాద్.  

                  ది. 5.03.2025. బుధవారం. సాయంత్రం. గం. 4.లకు. 

ఆవిష్కర్త : 

మాన్యులు, ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం గారు

"అవధానసుధాకర, సభాసంచాలక సార్వభౌమ", దేవీభాగవతమునకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, ప్రతిష్టాత్మక కేంద్రసాహిత్య అకాడమీ "భాషాసమ్మాన్" పురస్కారగ్రహీతలు.

కృతికర్త :

పొన్నెకంటి సూర్యనారాయణ రావు.

విశ్రాంతాంధ్రోపాథ్యాయులు.

అధ్యక్షులు : 

శ్రీ చింతా రామకృష్ణారావు గారు

సుప్రసిద్ధ కవిపండితులు ,  అష్టావధాని , చిత్రకవితా విశారదులు. 

ముఖ్య అతిథులు :

శ్రీ సురభి శంకర శర్మగారు.

అష్టావధాని, అభినవ భర్తృహరి, తెలుగు విశ్వవిద్యాలయపురస్కార గ్రహీత.

శ్రీ జంధ్యాల వెంకటరామ శాస్త్రి గారు.

ఆర్షసాహితీ రత్న ,మధుర వ్యాఖ్యానభారతి , ఆధ్యాత్మిక సాహితీ సుధాకర.

సూచన . కార్యక్రమానంతరం భోజన సదుపాయం కలదు. 



4, ఫిబ్రవరి 2025, మంగళవారం

అంశము: నేటి తెలుగు భాష స్ధితిగతులు.

 జాతీయస్థాయి ఉగాది పద్యాల కవితల పోటి.

జాతీయ తెలుగు పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న 

శ్రీవిశ్వావసు ఉగాదిపోటీలకు ఆహ్వానం. 

అంశము: నేటి తెలుగు భాష స్ధితిగతులు. 

పంపవలసిన చివరి తేది. మార్చి 30.2025.  

వాట్సప్ నం.6362973252


మాతృభాషపట్ల మమకారభావన

న్దెలుగుపలుకుబడులు తేటపఱచి

అక్షరాక్షరంపుటర్థంబులెఱిగించ

మరచిపోయెనేటి మాతృమూర్తి. 1


తెలుగు బాస నేర్వ తెరువులుకఱవని

"ఇంగిలీసు"మీద నీప్సితంబు

పెంచుకొనిరి నేటి పెరజాతిప్రేమికుల్

అదియె శాపమయ్యె నాంధ్రులకును. 2


తల్లిదండ్రు లెపుడు హల్లొ!హాయని బల్క

వందనంబు లనరు వారిసంతు

ఆవు చేనుమేయ నాత్మజగట్టునా?

సాజమౌను నదియె సారమగును. 3


ప్రభుతకూడ కనగ ప్రథమకారణమయ్యె

తెలుగు భాషకంత విలువనిడదు

"దేశభాషలందు తెలుగు లెస్స"నియెను

"కృష్ణరాయ"విభుడు కేలుమోడ్చి. 4


మీడియాలు కొన్ని మిడిమిడి జ్ఞానులన్

తెలుగు మాటలాడ తీసికొనుచు

రూప మొక్కటె యపురూపమటంచును

భావముంచ తెలుగు భ్రష్టుపట్టె. 5


తెలుగు సంస్కృతాల తేజంబుగ్రహియించి

ఇతరదేశవాసులిచ్ఛనేర్వ

భరతమాతసంతు పనివడి కొందరు

మాతృమూర్తి నెపుడు "మమ్మీ"గ బిల్తురే. 6


తెలుగు సంస్కృతాల తిరమైన ప్రజ్ఞతో

కావ్యనాటకాలు కవులువ్రాయ

శ్రీ వధానులెల్ల చిత్రంపువాణులై

తెలుగు పలుకు చుండు వెలుగుచుండె. 7


ప్రక్కరాష్ట్ర ప్రజల పరికించి చూడుమా

ఆంధ్రరాష్ట్ర జీవి!అసలు నిజము

వారిమాతృభాష వారికే వరమంద్రు

తెల్విదెచ్చుకొనుచు తెలుగు పలుకు. 8.


ఈ పద్యములు కేవలము ఈ పోటీ కి నేను 

స్వయముగా వ్రాసినవేయని

హామీ యిచ్చుచున్నాను. 

నా చిరునామా: 

పొన్నెకంటి సూర్యనారాయణ రావు.

   "భాషా ప్రవీణ" ఎం.ఏ., తెలుగు.

మధుశ్రీ తిరుమల అపార్ట్ మెంట్. జి.ఎఫ్.4.

విమలాదేవి నగర్. మల్కాజిగిరి.

హైదరాబాదు. 50047.

ఫోన్: 9866675770.

1, జనవరి 2025, బుధవారం

 2025  ఆంగ్ల వత్సరానికి స్వాగతం.

    జరిగిందేదో జరిగిందని తలచి పాతజ్ఞాపకాలను తవ్వుకోను

    నేనాశా జీవిని .,మానసికంగా నిరంతరం శుభాన్నే కోరతాను

     ఎందుకంటే "ఎద్భావం తద్భవతి" అని , తథాస్తు దేవతలుంటారని 

     అన్నారు పెద్దలు. కనుక ఓ గతించన వత్సరమా! గతంగతః..

     నీకు వీడ్కోలు.

     ఓ నూతన వత్సరమా నీకు స్వాగతం!

         కాలాన్ని కలలపంటగా చేసి అందరికి కన్నులపంట చేయి

 కలాలను కదిపించి కవితలు కావ్యాలు వ్రాయించెయ్యి.

 సామాన్యుల జీవనయానం సంబరమంటేట్లు చేయి.

 రైతుల పంట పుష్కలంగా పండేటట్లుచేసి వారి కండ్లలో కాంతులు నింపు

 రాజకీయనాయకుల చదరంగపు కుయుక్తులకు చెక్ చెప్పు

 చిన్నారుల జీవితాలు కబంధ హస్తాలకు చిక్కనీయకు

 ప్రకృతిలో అశనిపాతాలు అతివర్షపాతాలు తగ్గించి

 కాస్తంత సుఖం కలిగించు.

 అందరికి అడిగినా అడగకపోయినా ఆరోగ్యమివ్వు. 

 భోగభాగ్యాలు వాటంతవే వస్తాయి. 

    ఈ షరతులకు ఒప్పంకుంటేనే గడపలో కాలుపెట్టు. అప్పుడే

      స్వాగతం పలుకుతాను. ....పొన్నెకంటి. 1.1.2025.

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...