అందరికి ఉగాది శుభాకాంక్షలు.
‘‘ శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము!
1. రాజకీయాల రచ్చలే రగులుచుండి., బుద్ధిహీనులు నాగులై బుసలుగొట్ట
సంఘమందున సజ్జనుల్ సమయకుండ., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
2. మానవత్వాలు ప్రేమలు మంటగలసి., దానవత్వాల జృంభణల్ ధరణి బెరిగె.
ధర్మబద్ధపు బంధాల దారిజూపి., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
3. సకల సద్గుణభాసిత సౌమ్యులెల్ల., అణగియుండిరి కొందఱి యాగడాల
సాధువుల గాచు భారమ్ము సరిగనీదె., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
4. వాయుకాలుష్యముంజేయు ప్రల్లదులను., నీటికాలుష్యముంజేయు నీచజనుల
శిక్షపాల్జేసి సంఘాన శ్రేయమలర., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
5. రక్ష గూర్చు మహోన్నత వృక్షములను., ప్రాణ వాయువునిచ్చెడు పాదపాల
గూల్చి సంపదల్ పొందెడు క్రూరజనుల., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
6. రాచరికమైన పోకడల్ రమ్యమనుచు., సాగుచుండిరి పాలకుల్ సాహపాన
ప్రజల స్వేచ్ఛను కాపాడి పాడిసేసి., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
7. న్యాయమార్గాన పయనించు నరుని యునికి., కత్తి మీదను సాముగా మిత్తిజూపు
ధర్మబలమును సమకూర్చు తల్లివౌచు., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
8. అభము శుభముల నెఱుగని యబల భవిత., చిదుము చుండె కామాంధులు సిగ్గుమాలి
వారి యాటలు కట్టించి తీరుమార్చి., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
9. షడ్రసంబుల నొక్కచో సంతరించి., భక్తి భావాన నద్దాని పంచుకొనుచు
ఈ ‘‘యుగాది’’ని హృద్వీధి నింపుగూర్ప., తలచుకొనుచున్న మమ్ముల దయనుజూచి,
శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
10. అన్ని రాశుల ఫలితముల్ హ్లాదమొదవ., రాజ పూజ్యంబె యధికమై రాణకెక్క
భాగ్యలక్ష్మియె సత్కృపన్ పరిఢవిల్ల., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
సర్వే జనా; సుఖినో భవన్తు!
భాగ్యనగరం. పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
మల్కాజ్గిరి. భాషాప్రవీణ, ఎం,ఏ. (తెలుగు)
6300985169. విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు.
క్రోధికాహ్వానం 2024-25.
"శ్రీక్రోధి" వత్సరంబిది
చక్రభ్రమణంబు వలన షష్ఠిన నొకటై
విక్రాంతిగూర్ప పుడమికి
చక్రాయుధు క్రీడవలన చక్కగ వచ్చెన్. 1
నామము "క్రోధి"యైనను, జనైక హితాంతర రాగమూర్తివై
ప్రేమను బంచుమమ్మ!కరరేఖలు మార్చుచు జీవితమ్మునన్
సేమము గూర్చ రమ్మిటకు శ్రీవరదాయినియై శుభంబుగన్
వేమరు ప్రస్తుతింతు నిను విజ్ఞులు మెచ్చ కృతజ్ఞతాంజలుల్.2.
క్రోధము జూపుమమ్మ!మదికూరిమి దప్పిన రక్కసాత్ముపై
క్రోధము జూపుమమ్మ!సుమకోమలి శీల విఘాతనీచుపై
క్రోధము జూపుమమ్మ!పలుఘోరములన్ సృజియించు నేతపై
క్రోధముజూపుమమ్మ! జనఘోషకు కారణమైన వారిపై. 3.
క్రొత్తవత్సరాన కొమ్మలదాగిన
కోయిలమ్మ కూసె క్రోధమెలర
తనను బాలగణము దర్పాన రెట్టింప
మితముగల్గు స్పర్ధ మేలుగాదె!.4.
పేదసాదల హృదయాలు ప్రియముగూర్ప
కవులసౌజన్య సౌహితీ కడలిపొంగ
మమత సమతలు సదమల మానవతులు
ఘనత జనతను పండింప కదలు క్రోధి. 5.
ఆయురారోగ్య భాగ్యాల నమరజేసి
భావి జీవనమందున ప్రగతి నిడుమ!
చింతలేనట్టి యోగంబు నంతజూపి
క్రోధి వత్సర! నినుగొల్తు కూర్మిదనర. 6.