21, డిసెంబర్ 2013, శనివారం

,పొన్నె కల్లు , హై స్కూల్ కి 21.1 2.1 3.

 గుంటూరు , శ్రీ రామ మామయ్య కార్యక్రమము సందర్భము గ ,పొన్నె కల్లు  , హై స్కూల్ కి 
వెళ్ళినప్పటి చిత్రాలు . 21.1 2.1 3. 
























2, నవంబర్ 2013, శనివారం

దివ్య దీపావళి శుభాకాంక్షలు

     చెడుగు చీకట్ల నిరతంబు చీల్ఛివేయు             3.11.2013.

     వెలుగు రేఖలు జీవన వేల్పులనగ

       మాన వాళి కి లభియించె మహితగతిని

    దీప ఆవళి పేరిట దివ్య వరము. 1. 

    రాక్ష సంబైన పనులకు శిక్ష నునిచి 

    రమ్య ,సౌజన్య భావాలు రాణకెక్క
  
    మహిని నరకుని నరకి మాన్య సత్య 

    కంట కంబును దొలగించె వింటి చేత 2
.
 .            దివ్య దీపావళి శుభాకాంక్షలు 

 దీపమన్దున శ్రీలక్ష్మి దేవి యుండి

 పాప హరణంబు గావించి పరమ పుణ్య


 హేతు వగచును ప్రజలెల్ల హేల మెలగ


 వరము లిచ్చును క్రీగంటి కరుణతోడ 3.        



21, అక్టోబర్ 2013, సోమవారం

మధురాను భూతి .

                                                                       మధురాను భూతి . 20. 10. 13. 


బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి  గారిని ప్రత్యక్షంగా  చూడటమే ఒక మహత్తర దివ్యాను భూతి . వారితో మాట్లాడటం మరువలేని మధురాను భూతి . వారిరువురు ( దంపతులు ) పార్వతీ పరమేశ్వరుల ప్రతి రూపమ్ . నేను వారిని గురించి పద్యాలు వ్రాయటం చాల ఆనంద దాయకం . జన్మ తరించి నట్లుగా భావిస్తాను . వారి పురాణ ప్రవచనమునకు వయస్సు సప్తతి (70. సం .లు ) ఈనాటికి వారి వయస్సు 90 వసన్తాలు. స్వరం ఆనాటికి ఈనాటికి ఏమి తేడా లేదు . సాక్షాత్ వాల్మీకి  , వ్యాస ముని రూపమె. ఈనాడు వారికి  సువర్ణ పుష్ప సహిత రజత కిరీటం ( ప్రభాకరశర్మ, సుధారాణి చేత )అలంకరించటం జరిగిన్ది.  తదనంతరం  వారిని గురించిన పద్యాలు చదివి వినిపించడం , దానికి వారు మహదానంద భరితులు కావడం , ఆ సందర్భం గ వారితో మాట్లాడటం  పురాకృత పుణ్య విశేషంగా భావిస్తాను . 

     ఈ మహత్తర అవకాశం  నాకు చి. ప్రభాకర శర్మ ద్వారా  లభించిన్ది.  ఆనాటి సభానిర్వాహకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు.( సినీ  కవి .)  ప్రధమంగా నా పద్యాలు  వారికి చదివి వినిపించాను.  నేను పద్యాలు వ్రాద్దామని అనుకున్నాను . మీ పద్యాలు విన్నతరువాత అభిప్రాయం మార్చుకొన్నాను మీ పద్యాలు చాలా బాగున్నాయి వానినే అచ్చు వేయించి సమర్పించండి అని చెప్పటం నాకు మహదానందం కలిగించింది  . పద్యాలు చదివిన తరువాత  విభీషణ శర్మ గారు, ( తి . తి .దె . సాహితీ కార్యక్రమ నిర్వాహకులు ) వల్లూరి శంకర శాస్త్రి గారు ( తి . తి .దె . ప్రముఖులు ) చాల మంచిపద్యాలు బాగా చదివారని ఆశీస్సులన్దించటం 
మిగుల ఆనందాన్ని కలిగించిన్ది. ఇంతటి మహనీయుడు పుట్టిన అమరావతి కి ( గుంటూరు జిల్లా) సమీపంలోనే నేను జన్మించడం నా భాగ్యమ్.  

15, అక్టోబర్ 2013, మంగళవారం

అక్షర నీరాజనం 20. 10. 2013

 అభి నవ వ్యాస , సవ్య సాచి . బ్రహ్మశ్రీ  మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి . యల్లాప్రగడ  ప్రభాకర  శర్మ గారి చేత 
 20. 10. 2013 న  సన్మాన కార్య క్రమము . ( సువర్ణ పుష్పసహిత రజత 
 కిరీట ధారణ ) 

                                                       అక్షర నీరాజనం 


1. సి.  కృష్ణా జలంబు లు తృష్ణ దీరగ ద్రావి ,

                  వేద సారము పంచు విజ్ఞు లెవరు 
         వైదిక జ్ఞానియై వాదనన్ గెలువంగ
                  తాత  చైనుల మేధ తరచే నెవరు
          కమ్మని స్వరమున కవితా ఝరులిల
                   ధారలై పొంగించు దాత ఎవరు
 తే . గీ .  వారలెవ్వరొ కాదుసు వసుధ యందు
             చంద్ర శేఖర శాస్త్రి నాన్ చదువులయ్య

             బ్రాహ్మి పుంభావ రూపంబు వాస్తవముగ

             పాద పద్మంబు లర్పించి ప్రణతు లిడుదు 

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

ప్రకృతి పురుషుల ఆరాధనే . వినాయక చతుర్థి. .

ప్రకృతి  పురుషుల ఆరాధనే . వినాయక చతుర్థి. .

ప్రకృతి పురుషులు వేరెవరో కాదు . ( ఆది దంపతు లైన
పార్వతీ పరమేశ్వరులు )
        శ్లో . వాగర్దా వివ  సంపృక్తౌ వాగర్ధ ప్రతి పత్తయే , 
              జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ .

ప్రకృతి, పార్వతి. పురుషుడు పరమశివుడు . ఈ సత్యాన్ని నమ్మిన వాడే మనవినాయక స్వామి. అందుకనే కుమార స్వామి కి తనకి వచ్చిన సేనా నాయకత్వఆధిపత్య పోరులో విజయం కొరకు  అతి సులువైన మార్గాన్ని తన తండ్రి అయినపరమేశ్వరుని ద్వారా తెలిసికొన్నాడు . అదే తల్లి దండ్రులకు సభక్తిక ప్రదక్షిణము.
కుమారస్వామికి తాను స్నానం చేసిన మూడు కోట్ల ఏబది లక్షల నదులలో
తన అన్నగారు ముందుగా స్నానం చేసినట్లు కనిపించాడు . దానికి కారణం
తెలియక విస్తుపోయాడు ,కుమారస్వామి. సూక్ష్మం లో మోక్షం గ తలిదండ్రులకుప్రదక్షిణం చేసి విజయం సాధించి , సర్వ సైన్యాధి పత్యాన్ని , సంపాదించాడు తెలివిగావినాయక స్వామి.  కనుక పార్వతీ పరమేశ్వరుల వంటి తలిదండ్రుల పూజ మహోన్నత మైనదనినిరూపించాడు బొజ్జ గణపతి. సమాజ శ్రేయస్సుకు  ఇంతకన్నా కావలసింది ఏముంటుంది .

     ఇక పత్రీ , పూజా ద్రవ్యాలు గురించి ఆలోచిస్తే . ఆయన కిష్టమైనది ముఖ్యం గ గరిక. దీనితో పూజిస్తే , సమస్త పూజా ద్రవ్యాలతో, పత్రులతో పూజించినట్లే .ఎక్కువ ధనం వెచ్చించకుండా సామాన్యుడుకూడాసులువుగా  పూజించే విధం గ ఏర్పాటు చేసినదే గరిక పూజ.    కాని మనం  సమస్త ఆయుర్వేద శక్తులు దాగి ఉన్న 21 పత్రాలతో పూజిస్తె ఆరోగ్య పరంగా , ఆధ్యాత్మిక పరంగా మంచిదని విజ్ఞులు చెప్పటం వలన ఆయా పత్రాలను సభక్తి కముగా సేకరించి పూజిస్తాము. ఈ విధంగా మనం నిర్మల భక్తి తో పూజ చేస్తే మన హృదయసరోవరంలోనే విహరిస్తాడుబుజ్జి  ( బొజ్జ )  గణపతి .
    ప్రతి పూజలో లౌకికము , పార లౌకికము ఉంటాయి . మట్టి తో చేసిన గణపతికి పూజ చేసి, నిమజ్జనం చేస్తే ,ప్రకృతి , ప్రకృతి లో కలసి పార లౌకికత  సిద్ధిస్తున్ది. కనుక మనమందరం అవకాశం మేరకు మృణ్మయ గణపతినేత్రికరణ శుద్ధిగా పూజ చేసి మనోభీస్టాలను సిద్ధింప జేసుకొందాము .
   శుభం భూయాత్.  సర్వే జనాః సుఖినో భవంతు .

20, ఆగస్టు 2013, మంగళవారం

"అన్నా అంటే నేనున్నా "

శ్రావణ పూర్ణిమ , జంధ్యాల పూర్ణిమ ,   రక్షాబంధన్, రాఖి.                                                                                                                                      
ఈ పేర్లన్నీ  చెల్లికి మానసిక బలాన్నిచ్చే చర్యకి ప్రతి రూపాలె. సృష్టిలో
ప్రేమ పాత్ర ఎంతో  ఎవరికీ  చెప్పనక్కరలేదు . భార్యా భర్తలు, అన్నా. చెల్లెలు. అక్కా,తమ్ముడు ఇలా ఎన్నో సంబంధాలు .
దేనికదే పవిత్రమైనది. విలువైనది. ఆ విలువలు నిలబెట్టుకోవా
లంటే కొన్నిసామాజిక  ధర్మాలు పాటించాలి . అన్నా, లేక తమ్ముని క్షేమం కోరి ఒక చెల్లి ,లేక అక్క బంధనాన్ని చేతికి కట్టడమే రక్షా బంధనం . దాని ద్వారా అన్న ,చెల్లికి అభయమిస్తాడు . మనం ముందుగా రక్తం పంచుకొని పుట్టిన వారికైనా ఇలాంటి రక్షణ కల్పించ గలిగితే ఆ తరువాత" అన్నా" అని పిలిచే ఏ చెల్లి కైనా చేయ గలుగుతాము.  అందుకే ప్రతి ఆడ పిల్ల తనకు పరిచయమైన పరాయి  పెద్ద మగ పిల్లలను అన్నా అని పిలుస్తున్ది. అది మన సంప్రదాయం . దీనిని గుర్తు చేస్తుంది మహా భారతమ్.ద్రౌపది కష్టకాలంలో కృష్ణా , అన్నా అని పిలిచి తన మానాన్ని కాపాడు కొంటుంది  . సమాజంలోని సంబంధాలు బలపడాలి , విదేశీ యులకు మనం ఆదర్శం కావాలి అంటే తప్పక కొన్ని ఉత్తమ ధర్మాలను ఆచరించాలి.   "అన్నా అంటే నేనున్నా " అనే సద్భావన కలిగిస్తూ వ్యక్తిత్వం పెంచు కోవాలి . ఆనాడే మనం అన్ని విజ్ఞాన సౌధాలు ఎక్కినట్లు . ఇవి లేకుంటే అజ్ఞాన అంధకారంలో దిగజారినట్లు . కాదంటారా .  

సత్కార్యాచరణం . సత్ఫలితాలు .

సత్కార్యాచరణం . సత్ఫలితాలు .

"చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ"  . అను సామెత అందరికి తెలిసిందే . చేసుకోవటం అనే పని మన వల్లనే జరుగుతుంది . చేసుకొనుట అనేది క్రియ.ఇది  సత్కార్యం, కావచ్చును దుష్కార్యం కావచ్చును . అలానే క్రియ (మంచి, చెడు ) గత జన్మ, లేక ప్రస్తుత జన్మలోది కావచ్చు , ఫలితాలు మాత్రం అనివార్యమ్. పనులలోకి ఆలోచన కూడా వస్తుంది . చెడ్డ, లేక మంచి ఆలోచన కూడా తగిన ఫలితాలనేఅందిస్తుంది .. కనుకనే విజ్ఞులందరూ సదాలోచనకే గొప్ప ప్రాముఖ్యత నిచ్చారు . సదాలోచన ఫలితమే సత్కార్యాచరణ . సత్కార్యాచరణ ఫలితమే సజ్జన సాంగత్యము . తద్వారా మహనీయత్వము. మనము మంచిని నమ్మి , ఆచరిస్తే , మనలను నమ్మిన వారందరూ దానిని ఆచరిస్తారు. దాని వలన సమాజంలో మంచి , మానవత్వము పెరిగి . అందరి విలువలు పెరుగుతాయి. మనము ముందుగా సాధించ వలసినది మానవతా విలువలు , ఆ తరువాత అవే దైవత్వ ప్రతిపాదితాలై రాక్షస నిర్మూలనం చేస్తాయి .  మనం సర్వే జనాః సుఖినో భవంతు అని భావించినంతకాలం రాక్షస భావాలు మనలో చోటు చేసుకొవు. మనము చేసిన ప్రతి మంచి పని ఇతరులకు కూడా మంచి ఫలితాలనిస్తే అంతకంటే మనకు కావలసినది ఏముంటుంది , అందుకే మనసును మంచి వైపే అను నిత్యం మరలిద్దామ్. దానికి మనవ శక్తి చాలకుంటే దైవశక్తి జోడించుదాం .      శుభం భూయాత్ .   

21, జూన్ 2013, శుక్రవారం

జిజ్ఞాస .

                  జిజ్ఞాసకు నిదర్శనం . డా . యల్లాప్రగడ సుబ్బారావుగారు  .





జ్ఞాతుం  ఇచ్చా జిజ్ఞాస . ఏ విషయ మైన తెలిసికోవాలనే కోరికనే జిజ్ఞాస అంటారు . వీనిలో చాలా పద్ధతులు న్నాయి .  1. మనకు మనం స్వయముగా  ఆలోచించుట .   2. గ్రంధములను చదువుట . 3.అనుభవజ్ఞులైన  వారిని  ( గురువులను ) అడుగుట . 4.  దేశ పర్యటన .   5. స్వాను భవము  ముఖ్యమైనవి.  ఈ సందర్భముగా మనము ఒక మహా కవి శ్లోకమును గుర్తు చేసికొందాము .

శ్లో .   ఆచార్యాత్  పాదమాదత్తే , పాదం  శిష్య స్వమేధయా , 
        పాదం స బ్రహ్మచారిభ్య్హ : , పాదం కాల క్రమేణ చ.

( జ్ఞానము గురువుగారి నుండి  1భాగము, శిష్యుని స్వమేధ వలన 2వ భాగము , తోడి విద్యార్థుల వలన 3వ భాగము , కాలక్రమముగా వచ్చు అనుభవముతో 4వ భాగము వస్తుంది )
                 
        ఏ విషయమైన తెలియ నంత వరకు యెంత కష్టం గ ఉంటుందో , ఆ విషయము తెలిసిన తరువాత అంత సులువు అవుతున్ది." కరతల ఆమలకం" ( చేతిలో నున్న ఉసిరిక పండు ) అవుతున్ది.  తెలిస్తే అది ఆవ గింజ , తెలియకుంటే అది అనంత పర్వతం . ప్రతి విషయము మనకు తెలియటానికి మనం నిరంతర పరిశ్రమ చేయాల్సి ఉంటుంది .  "  కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు " అనే వాక్యం నిత్య సత్యమ్. కృషితో నాస్తి దుర్భిక్షం , జపతో నాస్తి పాతకం . 

      మన మెదడుకి పదును పెట్టి విషయాన్ని మనం కనుక్కుంటే కలిగే ఆనందం అనిర్వచనీయం , అద్భుతం . ఇది మన శక్తికి నిదర్శనం . ఉత్తమం . ఇతరుల వలన తెలిసి కొనుట ఆనంద దాయకం , ద్వితీయ శ్రేణి . విషయగ్రహణా పేక్ష లేక యుండుట అధమం .ఉత్తమ మానవుడు నిరంతరం ఉత్తమ మార్గ గామిగానే ఉండుటకు ప్రయత్నిస్తాడు . ఆతడే సమాజానికి, దేశానికి , మేలు చేయ గలుగుతాడు . మార్గ దర్శకుడు అవుతాడు . ద్వితీయ శ్రేణికి చెందిన వారు మార్గ అనుయాయులుగా అవుతారు . తృతీయ శ్రేణికి చెందినవారు  వారే అధమస్తులు గ ఉండుట వలన సమాజానికి అంతగా ఉపయోగ పడలేరు .

ఇంతటి మహత్తర జ్ఞానము వినమ్ర గుణ భూషితుల దగ్గర ఉంటే సర్వ కాల సర్వావస్థలలో మణి వలే ప్రకాసిస్తున్ది. 


13, జూన్ 2013, గురువారం

వర్ణనలు -1

వర్ణనలు

   6.  పృ :-   కళ్యాణ ప్రభాకర రావు .

         వి. :-  వేంకటేశ్వర  స్వామి స్తుతి.  పదాలు. 1. మల్లి. 2. జాజి. 3. బంతి . 4. కేతకి .  చంపక మాల వృత్తం లో.

        చం .  నిరతమహింస  " మల్లి"యగ నిత్యపు సత్యపు " జాజి " పువ్వు గా
                 పరమ సు నిగ్రహంబు రస భాసురమౌ  ఒక "బంతి "పువ్వుగా
                 నిరుపమ శౌచ  "కేతకి "ని నిశ్చల మిన్ద్రియమన్న మొల్లలున్
                 తిరుపతి వేంకటేశ్వర పదే పదమై రచియింతు మాలికన్ .

  7.    పృ :- బి. వెంకట్ .

              వి. :-  పర దేశం  వెళ్ళిన కొడుకును గురించి తల్లి ఆవేదన .

        తే . గీ. :-  పొరుగు దేశాలలో నున్న పుత్రులెల్ల
                      సౌఖ్య సంతోషముల తోడ  సాగి వచ్చి
                      విజయ విభవైక రీతి జీవింతు రింక
                      రమ్య మాతృకా ప్రేమ శ్రీ రామ రక్ష.

8.      పృ :-   డా . శ్రీమతి , మంగళగిరి ప్రమీలా దేవి .

         వి. :-  వెన్నెల పాటకు పద్యమ్.

    తే . గీ. :- కలువ చంద్రునికై రేయి కలవరించు .
                 కలల చంద్రుని  ప్రేమగా కళ ఫలించు .
                 దూరమే లేదు ప్రేమ సంసార మందు .
                 జగతి ప్రేమించు నా జన్మ సఫలమందు ..
  9.  పృ :- చంద్ర శేఖర శర్మ .

       వి. :- పర బ్రహ్మ తత్త్వమౌ  దక్షిణా మూర్తి , నాగ ఫణి శర్మ గారయి పాడితే  ?   పద్యం .

      తే . గీ. :- దక్షిణా మూర్తి యా మౌన దీక్ష వీడి
                   ధన్య రాగాల గళ మాల తాన మనగ
                   ఉపనిషద్గీత లోకమ్ము లొదుగ పాడు .
                   జ్ఞాన వైరాగ్య మవధాన జ్ఞాన మనగ .

  10. పృ :-  ఆత్రేయ శర్మ .

     
        వి. :-  లైఫ్ ఆఫ్ పై . చిత్రం లో  ఒంటరి కుర్ర వాని మనోభావ తరంగాలు .


     తే . గీ. :- ఇలకు వచ్చిన ప్రతివాని నెంచి చూడ
                  ఒంటరియె  వాడు దేవుని నంట వఱకు .
                  కరుణ ఏకాగ్ర మైన ఏకాకి ఎవరు ?
                  సాగి పై స్థాయి నందు నీ సాగరమున .


               

12, జూన్ 2013, బుధవారం

వర్ణనలు -2

వర్ణనలు - 2

1.     పృ :-  శ్రీ .కె. వి. యస్. ఆచార్య. 
  
         వి.:- కవి గురించి.  పదాలు. 1. రాగము. 2. భొగము. 3.యాగము. 4. త్యాగము. 

        ఉ.:- రాగ ముఖీనుడై రసము రంజిల చేయవలెన్ ఋషీంద్రుడై 
               భోగము సత్కవిత్వ నవ భోగము గాగ శిరంబు లూగగా 
               యాగము కావ్య ధార మహితాద్యముగా శతలోక పూజ్యమై 
               త్యాగము మూలభాగముగ సత్కృప శిష్య శిరంబు పైకనున్ , 

2. పృ :-  శ్రీ మతి .   టి . మీనా కుమారి . 

     వి. :- అమ్మను లలితతో పోలుస్తూ .  పాట . 

    లలితా హృదయమే కదా తల్లి , 
    శ్రీ కరుణా యుత సుధా కల్ప వల్లి ,
    కొడుకు గుచ్చు ముల్లయినా తల్లికి సిరి మల్లి 
    విషము చిందు వాడైనా ఆ ఎదకు పాల వెల్లి 
    ఏ అమ్మయైన అమ్మల గన్నట్టి యమ్మ . 
    ఏ అమ్మయైన కొమ్మల పై తేనె పట్టు చిమ్మిన చిరు  చెమ్మ . !! లలితా హృదయమే !!

3. పృ :-  యం . కృష్ణయ్య గౌడ్ . 

    వి. :- మద్య పాన నిషేధం . 

కం . మద్యము మానుము మానుము ,
        హృదయము మానమ్ము నిచ్చు హృదయము విచ్చున్ .
        సద్యో బలమౌ దేహము  
       విద్యయు జ్ఞానమ్ము ధన వివేకము గలుగున్ . 

4. పృ :-  శ్రీ మతి . ఆర్ . కమల గారు . 
   వి. :- విశ్వనాధ వారిని గురించి. 

  తే . గీ :-  విశ్వ నాధుండు కవి కళా విశ్వనాధ . 
               కవన సామ్రాజ్య నాధుడై గణుతి కెక్కె. 
               తన పొలాన నాటనిది విత్తన మదేది ?
               నాట పండనిడేది ధన్యాకరమ్ము . 

5. పృ :-  సురేష్ బాబు. 

     వి. :-  శివుడికి తల్లిఉండి  ఉంటే  ఆయన హాలాహల భక్షణ సమయంలో ఆమె వేదన . 

     ఆ.వె.  :-   జనని లేదుగాన సరిపోయినదిగాని 
                     తల్లడిల్లి పోవు తల్లి యున్న 
                    మార్చి మార్చి గొంతు మరి మరి తడుముచు 
                     స్పర్శ  తోడ నమృత సారమిచ్చు . 

 ఈ పద్యము చెప్పి నప్పుడు నాగ ఫణి శర్మ గారి స్పందన  వారి మాటల్లోనే . 
 " నేను అవధానాలు చేసేటప్పుడు నా మాతృ దేవత నా దగ్గఱకు వచ్చి గొంతు నొప్పిగా ఉన్నదా నాన్నా ! 
అంటూ నా గొంతు క్రింద స్పృసించేది .  వెంటనే నాకెంతో ఆనందంగా హాయిగా ఉండేది .  అదే తల్లి మనసు. 
ఎన్ని జన్మలెత్తినా తల్లి ఋణము తీర్చుకో గలమా !! 

                                                                  సశేషం .







11, జూన్ 2013, మంగళవారం

దత్తపదులు

దత్తపదులు .  (అవధానిగారికి  4 పదములిచ్చి ,   పృచ్ఛకుని కోరిక మేరకు  విషయమిచ్చి పదములకు వేరే అర్ధము వచ్చునట్లు  పద్యము చెప్పవలసినది గా  కోరడమే దీని ప్రత్యేకత . )


1. పృ :-   చి. మాడుగుల రేణుక .

   వి :-      మహా సరస్వతి  స్తుతి.

.  పదములు . 1. నాగ పల్లవి  2. శ్రావణి 3. లక్ష్మీ  సౌజన్య .4. శుక ప్రియ .

      తే .గీ.    " నాగ పల్లవి"   ఋగ్వేద నాద మొదవ .
                  " శ్రావ\ణీ "    సామ గానమై  సన్నుతింప
                   యాజుషీ     " లక్ష్మి సౌజన్య"మై   ఘటింప
                   వర    "శుకప్రియ"    వేదమై వాని కొలిచె  .

2. పృ :-  శ్రీమతి , కె. విమలా రాణి .

     వి :-  పసిడి గురించి . పదములు 1. అట్లాంటిక్ . 2. ఆర్కిటిక్ . 3. అంటార్కిటిక్ . 4. ఇంటర్ నెట్ .

      తే .గీ.   అతుల" మట్లాంటిక"ము  దాటి అట్లు మీటి
                 పసిడి పది దిక్కుల దాటి పసిమి బెంచి
                "ఆర్కి టిక్కు"ను దాటి "అంటార్కి టిక్కు "
                మించే ఇంటరు నెట్టు తా మేదినందు .

3. పృ :-  శ్రీమతి , కె. గిరిజా కుమారి .

    వి :-  భారతార్ధం . పదములు . 1. చైనా .2. జపాన్ . 3. ఇరాన్ . 4. ఇరాక్ .

  తే .గీ. ఎచటి నుం" చైన" శుభ లాభ మొంద వచ్చు
           శాంతి సు "జపాను "రక్తి తో సరళుడైన
           పో" యిరాను"న్నదింక మహోన్నత దశ
           చే"యి రాకు"న్నె దీవింప వాయుపుత్ర .

4. పృ :-  మాడుగుల శుక ప్రియ .


   వి :-  అమ్మవారి వర్ణన . పదములు . 1. హకూన . 2. మఠాట . 3. తొట్టి మాన్ .

   తే .గీ. శ్రీ  "మఠాట"వీ చరితార్ధ చిత్ర శైల
            దివ్య మంగళ సౌరభ్య దే "హకూన"
            తామరల "తొట్టిమ"న్నించు  ధన్య చింత
           వెలిగి పుంభావ వాణి లో వెలసె నిపుడు .

5.  పృ :-   ?. వి :-   అమ్మవారి వర్ణన .  శ్లోకం

      పదములు. 1. సచిన్ , 2. ధోని . 3. సెహవాగ్ . 4. లక్ష్మణ్

             శ్లో .   వ్యా"స చ్చి"న్వంతి శ్రీ కావ్య వల్లరీషు
                      వ్యర్ధ కై" స్సహవాగు"రాన్  తాన్ విధూయ
                      లక్ష్మణా గ్రజ సత్ కృపామ్ తాం విధృత్య
                      తత్త్వ మేధో నివాసినీం తాం భజామి .

6. పృ :-   ?. వి :- తెలుగును గూర్చి . పదములు . 1. తెగులు .2. తగులు . 3. పగలు . 4. పగులు.


     తే .గీ.  తెగులు   కలవారు తెలుగన్న రాగులుచుంద్రు
               తగులు   నిక భాష పై ప్రేమ తర తరములు
               పగలు    రేలును తెలుగు పై మిగులు వెలుగు
               పగులు   గుండెలు రసవార్ది పయన మందు .

   



     

10, జూన్ 2013, సోమవారం

నిషిద్ధాక్షరి - 1

నిషిద్ధాక్షరి. 1.      31. 05. 13.

1. పృచ్చకులు . పొన్నెకంటి  సూర్య నారాయణ రావు . 

విషయము :-వేద గాయత్రీ అగ్రహారమునకు ఆశీ స్సులు (  సర్వ లఘు కందము  , చివరి గణం లో గురువు రావచ్చు )

            కం . వరములు సిరియయి వెసవెస 
                   సరస ముఖ మనగ జల జల జనముల కొలుపన్ 
                   వర వేదమైన గాయ 
                   త్రి  రమా హితమై సహస్ర రీతుల బ్రోచున్ . 

2.  పృచ్చకులు:- శివశ్రీ శర్మ . 

విషయము :- కాళి  , లక్ష్మి , వాణి . పదములను వాడకుండ  అమ్మవారి వర్ణన . 

   శ్లో .  ఐశ్వర్యామృత వర్షిణీ , మహానందాను సంధాయినీ , 
          వాచీ శ్రీ మధురాత్త ధారిణి , జగజ్జే తృత్వ సంపాదినీ ,
         పద్మాలంబిత నిత్య గేహిని , సదా పద్మాక్ష హృద్వాసినీ , 
         దేవీం త్వాం చ సరస్వతీం , హృది భజే గౌరీం ,రమామ్  సర్వదామ్ . !

3. పృచ్చకులు:- డా . అమళ్ళ దిన్నె వెంకట రమణ ప్రసాద్ . 

 విషయము :- నాగఫణి శర్మ గారి తండ్రిగారిని ( నాగభూషణ శర్మ ) గురించి 

కం .              ఆనందమతియు దాతయు 
                    తానై,  శివుడై,  భజింతు తత్త్వ విదుండై ,
                    ఆ  నాగభూష ణు,  సుశీ
                    లా నుత సఫలైక జన్ము ప్రణుతింతు  మదిన్ . 
4. పృచ్చకులు:- మావుడూరి  సూర్య నారాయణ మూర్తి . 

విషయము :- అ, ప, వర్గ నిషిద్ధం గ .  

కం .             ఆవృత్తి రహిత సుస్థితి
                    ఏ వృత్తుల నున్నవా రికేనిన్ కలుగున్
                   జీవుల కైశ్వర్యములై 
                   తానై నెలకొను నితాంత తాత్విక కళ లై .    

5. పృచ్చకులు:- సత్య ప్రసాద్ గారు . 

విషయము :- తిరుపతి వేంకటేశ్వరుని నిత్య పెండ్లి కొడుకుగా 

కం .            మంగాధీశా ! జనహిత 
                  అంగాంగా నందన రూఢ అక్షత సుఖ లీ 
                  లంగా !కల్యాణ  విభవ
                  మంగళ శ్రీ శ్రీ నివాస మాగోవిందా .                                                                                                                                   
6. పృచ్చకులు:- మాన్య శ్రీ  వసంత గాడ్గిల్ గారు .( హస్తిన నుండి వచ్చిన గొప్ప సంస్కృత పండితులు )

విషయము :-భారతే పాతు  భారతీ  ( ప కార నిషిద్ధం )

శ్లొ.  శ్రీ భారతేషు వసతాం జన మానసేషు ,
      సంస్కార దివ్య విభవా విదధాతు వాణీం 
     మాంగల్య మేవ సతతం బహు లోక రుచ్యమ్ . 

7.  పృచ్చకులు:-  డా . బలదేవానంద సాగరః ( హస్తిన ఆకాశవాణి లో సంస్కృత వార్తలను చిరకాలము గ       చదువుచున్నవారు )

శ్లో .  సిద్ధ్యంతి సర్వ కార్యాణి ,యస్యైవం మతిరన్వహం ,
       శివే శివార్చనే ప్రీతా , ధర్మార్దౌ కామ మోక్షదౌ 
      ధర్మార్ధ కామ మోక్షాశ్చ  యిహంతు  పరయేవ చ 
      యస్య దేవీ వశం చిత్తం తస్య భాన్తి సుసాన్తితః   . 

8. పృచ్చకులు:- ఆర్ . అనంత పద్మ నాభరావు గారు . ( అసిస్టెంట్ డైరెక్టర్ , ఆకాశవాణి , హైదరాబాద్ )

విషయము :- పుత్ర మమకారం  .  ( మ కార నిషిద్ధం )

కం .            కొడుకుపయి ప్రీతి ధారలు ,
                   అడుగడుగున కురియుచుండు నయ్యది సబబే 
                  కొడుకనిన సుశీలామ్బకు 
                  ఎడదను కడు తీపి హెచ్చు  నేను నుతింతున్ .  
                                                                                                                                    సశేషం .                                                                                                                                              



         

9, జూన్ 2013, ఆదివారం

నిషిద్ధాక్షరి - 2

నిషిద్ధాక్షరి  2.

      9.  పృ :-   ఓం ప్రకాష్ .  

          వి :-    అవధాన సరస్వతిని వర్ణించుట . 

         కం .    జయ భారావన గురుమతి , 
                   నయ మేలన సుపధ పద్య నవ్యాంగీ -నీ 
                   దయ వలన పలుకుచుంటిని 
                   జయ ధారా ధారణా ప్రసారా సారా !

    10.  పృ :-  వేదాద్రి చంద్ర శేఖర శాస్త్రి .

           వి :- లేపాక్షి ప్రాశస్త్యము . ( రాముడు, సీత ,లక్ష్మణుడు ,రావణుడు ,జటాయువు పదాలు నిషేధం )

          కం .   ఆపగిది నరణ్యము లో
                   శ్రీపతి కరుణించి చూచి చేరెను పక్షిన్
                  లే పక్షీ యని పిలువన్ ,
                  లేపాక్షిగ పేరు వచ్చెలే  జగమందున్ .

   11.   పృ :-  భాస్కర సీతారామ ప్రసాద్ .

           వి :- శ్రీ కృష్ణ  దేవరాయలు గూర్చి , అష్ట దిగ్గజముల పేర్లు నిషేధం ,

      తే . గీ .  అష్ట దిగ్గజ కవులకు  నిస్టు డగుచు
                  చెలగి సాహిత్య జగతి విశిష్ట్టు  డయ్యె,
                 కృష్ణ రాయలు శ్రీ మత్కవీశుడయ్యె
                 క్రమత సాహిత్య సమరాంగణముల నేలె

   12.  పృ :-  శ్రీ మతి లలితా పరమేశ్వరి .

          వి :-  సరస్వతీ నదీ పుష్కరాలు .

         కం .       పుష్కర హేలార్థ  ధునీ  ,
                      నిష్కార్యారంభ శిఖ వినీయ మతి శ్రీం
                      విష్కంభ నాట కీశో
                      చిష్కేశానుగ్రహబల సిద్ధము  కవితన్ .


  13.    పృ :- కె. రమాదేవి .


           వి :- వామనావతార వర్ణన  (" డ"  నిషేధం )

          కం .     కోరగ పద త్రయంబును
                    శౌరియె  వామనత వచ్చె సాధు  అనంగా
                    ధారాళముగా నిచ్చెను
                    శ్రీ రమ్యము బలివదాన్య శిష్ట  చరిత్రల్ .        


   14.   పృ :-  మరుమాముల దత్తాత్రేయ శర్మ .


          వి :- సరస్వతీ పుష్కరాలు . ( కాళేశ్వర  క్షేత్రం , శివ నామము నిషేధము ..)

         కం .   కాళేశ్వర!  ముక్తీశ్వర !
                 లీలా వైభవము పుష్కరీ రమ్యంబౌ
                 మాలా సరస్వతీ హిత
                 మూలము వాక్ మయము నందు మునుకలు వేయన్ .  

15.  పృ :- డా .  రఘురామ శర్మ .

        వి :- మధ్యమావతి రాగ వర్ణన . ( ఈ రాగం  లో  ద, గ, ఉండక పోవటం దీని విశిష్టత )

       కం . ద ,గ, లేనిది  ఒదిగినదిది
              నిగళంబే కాని రాగ నీతాధ్వర - శో
              భగ మంగళ రస శిఖరము
              భగవానుని పొగడు పగడ పసిడి యిదియగున్ .

16. పృ :- శ్రీమతి ప్రభల జానకి .

      వి :- వేటూరి ప్రభాకర శాస్త్రిగారి 120 వ జయంతి , అన్నమయ్య జయంతి వర్ణన .  అ, న, నిషిద్ధం .

    కం . పద కవితకు పెద తండ్రిగ.
           పద పదముల వేంకటేశ భక్తి పథమ్బై
          పదవీ శ్రీ పతి కొలువై
          సదమల వాక్ మయములందు శాశ్వతుడు కదా .

17.  పృ :- విశ్వనాథ శర్మ .

     వి :- అవధాన వైభవం .  " అవధానపదం "నిషేధం .

    కం . ఏకాగ్ర మనేకాగ్రము ,
           శ్రీ కావ్యాక్షర సుదీక్ష చిర ధారణ గా
           ఆ కోకిల యగు భారతి ,
          శ్రీ కల్పన లాశుగతిని చిత్రించె నిటుల్ .

                                                                                                              సశేషం .

 
   

         


         

8, జూన్ 2013, శనివారం

అవధానిస్తుతి గీతమ్.



అవధాని వర్యులకు  స్తుతి గీతమ్. ..... రచన . పొన్నెకంటి సూర్య నారాయణ రావు .

నాగఫణీ ! మా యనురాగ మణీ ! సుగుణ ధీ మణీ !
అవధానము పారించు అద్వితీయ నాక ధునీ .!!
 
       కరములంటి వాణి ని , సత్పదముల గూర్చుచు
       కరములంటి  నలువను , కమనీయత పంచుచు
       ఆశు కవిత నలవోకగ నవధానిగ గురిపించి
       పద్యమన్నహృద్యమంచు  పలుమారులు రూపించి ...    నాగఫణీ !

తెలు(గు తేట నిండించి ,తెలు(గు పూలు పూయించి
భరత దేశ పరిధి దాటి పలు దేశాల్ విస్తరించి
సౌరభ్యము పెంచినావు స్వారస్యము నుంచినావు
తెలు(గు తోట మాలిగా వెలుగు జ్ఞాన శీలిగా .....                      నాగఫణీ !

      మీ సంస్కృత శ్లోకాలు అత్యున్నత లోకాలు
      విహరించిన పండితాళి వివరించును వేదాలు
     గంధర్వుని దలపించును గాన రాగ మాధుర్యము
     సార్థకంబు మీ జన్మ సరస హృదయ దయామయా ...      నాగఫణీ !

మొక్కవోని మీ ప్రతిభకు మ్రొక్కుచుందు నేనెప్పుడు
అమ్మ పాల మాధుర్యము నణువణువున చూపించి
తెలు(గు వాడి వాడిని నల్దిశలను మెరిపించిన
సార్థకంబు మీ జన్మ సరస హృదయ దయామయా .. ..         నాగఫణీ !


25, మే 2013, శనివారం

నాగఫణి శర్మ గారి అవధానం

అవధాన సరస్వతీ పీఠం, హైదరాబాదు లో విశ్వ శాంతి కొఱకు 30..05. 2013 నుండి3.06.201 3 వఱకు" అవధాన సహస్రఫణి ,బృహత్ ద్వి సహస్రావధాని " బ్రహ్మశ్రీ  డా . మాడుగుల నాగఫణి శర్మగారి ద్వి శతావధానం ( 207 మందితో  ) జరిగినది .  దానికి అవధాన విజయినిగా నామకరణం చేయుట  జరిగింది . నేనాన్ద్ధ్రో పాధ్యాయునిగా  గా పనిచేయుచున్నప్పుడు వారి ద్వి సహస్రావధానంలో పాల్గొని చక్కని అనుభూతి పొన్దాను. మరల నాకి ప్పుడవకాశం కలగటం ఎంతో  అదృష్టము . ఆనాడు, ఈనాడు సమస్యనిచ్చే అవకాశమే వచ్చింది ,మరొక అనుభూతి , నిషిద్ధాక్షరి కూడా యివ్వవలసి రావటం క్రొత్త అనుభవము. నా సమస్య, నిషిద్ధాక్షరి , విషయాలు రెండు  వేద గాయత్రీ అగ్రహార సృష్టికర్త అయిన చి. ప్రభాకర శర్మను గూర్చి,  అభివృద్ధిని గూర్చి అడుగుట జరిగినది, పద్యములు రసస్పోరకముగా ,మనోహరముగా వచ్చినవి.

1. పృచ్చకులు :- పొన్నెకంటి సూర్య నారాయణ రావు .    30.. 3. 2013

    సమస్య :- ఉ:-వేదము రోదనంచు బహు విజ్ఞత బల్కిరి పండితోత్తముల్ .
     పూరణ :-      ఆదిమ కాలమందు శివుడద్భుతరీతి నటిమ్పగా --మహా
                         నాదము లుప్పతిల్లె ,రసనారస సర్వ శరీరమందు --నా
                         సోదిత రోదసీ కుహర సూనృత రోదన పుట్టె  వేదమై ,
                         వేదము రోదనంచు బహు విజ్ఞత బల్కిరి పండితోత్తముల్.
2.  పృచ్చకులు :- --            
     సమస్య :-     విద్య నేర్పువాడు వెఱ్ఱి వాడు .
   పూరణ :-తే.గీ. గుణము నేర్పకుండ గుణశాలి యనకుండ,
                         అదను చూచి బుద్ధి నరయ కుండ ,
                         శాస్త్ర  వాదములను శ్రద్ధతో ననయంబు ,
                         విద్య ............
3.   పృచ్చకులు :- --
      సమస్య :- ( సంస్కృతము ):- కవయః కావ్య తస్కరః
      పూరణ :-   వ్యాస వాల్మీకి కావ్యేషు చామ్శాన్ గృహ్ణన్ తి తే వరాన్ ,
                       తావన్మాత్రేణ కిం కిం తే కవయః కావ్య తస్కరాః

4.  పృచ్చకులు :- రాపాక ఎకామ్బరా చార్యులు గారు .
     సమస్య :-    దారుణ కృష్ణ సర్పము సుధల్ వేలిగ్రక్కుచునుండె చూడరే ,

    పూరణ :-     సార కవిత్వ మద్భుతము సమ్భ్రుత   ధర్మమ కావ్య మర్మమున్
                       ధీర సమాజ పూజితము ధీ వివిధప్రభు సేవితమ్బనన్
                       తీరుగనన్ సుధీవరుడు  తెల్పె  వధాని కవిత్వ రాజ -బృం
                       దారుణ .......                                                                                                  ( సశేషం )
                       
   

10, ఏప్రిల్ 2013, బుధవారం

సర్వేజనాః విజయ వాసంత శుభ కామనః

                                       
            సర్వేజనాః   విజయ    వాసంత           శుభ కామనః 

11. 04. 2013
ప్రతి ఉగాది ప్రకృతి ని కను విందు చేస్తుంది 
                         తన నూతన చేతనత్వంతో ,
ఈ యుగాది విజయ నామ ధారియై , 
                         సకల జీవ రాశులకు  విజయ రహదారియై ,
మందార మకరంద సుధామయ జీవితాలలో . 
                          సుధలు చిలకాలని నాంది పలుకుతుంది .. 
విజయం వినటానికి చాల బాగుంటుంది . ,
                           కఠోర  పరీక్షల విశ్లేషణ లేకుంటే . 
విజయమా అనటానికి బలే బాగుంటుంది , 
                            అప జయాల ఊసులు లేకుంటే ,
విజయం సు వ్యసనమ్ అయితే ,
                             పరాజయలన్నీ దుర్వ్యసనాలే   . 
విజయానికి అలవాటు పడిన ప్రాణి , 
                             ప్రాణం పోయిన అపజయానికి ఒప్పుకోదు . 
వసంతం లోని ప్రతి విజయ చిహ్నమైన , 
                             చివురు వెనుక బలహీనపు పండుటాకు ఉంటుంది ... 
ప్రకృతి తన ధర్మంగా ఒక్కొక్క కాలంలో , 
                             ఒక్కొక్క దానికి ప్రతిభ,వ్యుత్పత్తి ,కాంతుల నిమ్పుతున్ది. 
వసంత ఋతు రాజు  కర్తవ్యమ్ గా చరాచర జగత్తుకు ,
                              ఈనాటి నుండి నూతన శోభలను విజయ   పరమ్పరలనన్దిస్తాడు . 
వసంత లక్ష్మీ శోభాయమాన సదృశ సహృదయులన్దరకు 
                               విజయ, ఆయు రారోగ్య ఐశ్వర్యా లను ప్రకృతి మాత ప్రసాదిస్తుంది . 
మారిన కాలం తో మనం మారి  కల కాలం ధర్మా చరణ తో ,
                                ప్రకృతి మాత పాద పద్మ రజోలేశాలను ,                                         
మన శిరస్సుల ధరిద్దాం , పునీతులమౌదామ్. 

                          

                             । ।  సర్వే జనాః విజయో భవంతు । ।  


1, ఏప్రిల్ 2013, సోమవారం

కీ. శే యల్లా ప్రగడ వెంకట నారాయణ రావు గారు.

            కీర్తి శేషులు యల్లా ప్రగడ వెంకట నారాయణ రావు గారు.




వీరు నామాతా మహులు . వాసుదాసు గారి
( ఆంద్ర వాల్మీకి గా ప్రసిద్ధి గాంచిన ,వావిల కొలను సుబ్బారావు
గారికి ) శిష్యులు . వైష్ణవం స్వీకరించారు .. గుంటూరు జిల్లా నగరం
స్వ గ్రామమ్. యేలేటి పాలెం గ్రామానికి కరణం  గా పని చెసారు.
ఈనాడు వేద గాయత్రి అగ్రహారం నిర్మాత అయిన యల్లాప్రగడ
ప్రభాకర శర్మ గారికి పితామహులు .  శిస్టా చార పరాయణులు .
భారత , భాగవత , రామాయణాది గ్రంధములు వారికి కన్థ స్థ మనిన
అతిశయోక్తి కాదు. పరమ భక్తులు . బహుముఖ ప్రజ్ఞాశాలి .
పోలములను కొలిచే సర్వ్ గొలుసు లేకున్డగానే ఆనాడు తన అంగలతో
పోలములను కొలిచే వారు. అది అందరిని ఆశ్చర్య పరచే విధంగా
చాల ఖచ్చితం గ లెక్క ఉండేది  ఒంటి కాలి మీద నిల్చి ఆదిత్య హృదయం  నలుబది రోజులు పారాయణ చేసి తన అభీష్టాన్ని
( కోర్టులో విజయం ) సంపాదించుకొన్న ఘనులు . నిరంతరం
రామ నామ జపమే ధ్యేయంగా పెట్టుకొన్న రామ భక్తులు.
అందరి చేత  దేవుడు తాతయ్య గా పిలిపించుకోనేవారు .ధన్యజీవులు .
                                                                                             


                                                                                 





                               

13, మార్చి 2013, బుధవారం

తెలుపు భాష . తెలుగు భాష

     తెలుపు భాష . తెలుగు భాష


1.             విశ్వ మంత కాంతి విరజుమ్ము నాభాష ,

               వేద విదులు మెచ్చు   విబుధ  భాష 

               పాల తెల్ల దనము , పసిపాప  నవ్వులు, 
                                                                      
                కలిపి తెలుపు భాష తెలుగు భాష .

2.            తెలుప గల్గు నన్ని తేటతెల్లము గాగ,


               నిలుప గల్గు నిన్ను నింగి కంట ,

              తులువ లెన్ని మనల దుర్భాష లాడిన ,

              తూచ నలవి కాని తూర్పు కొండ .

3..          దాని గుండె తెలుపు , ధర్మసూక్ష్మము లెన్నొ  


,             దాని మోము తెలుపు ధైర్యమెంతొ

              దాని పనులు తెలుపు  దార్శ నికంబని ,  

              తెలుగు భాష యదియె వెలుగు భాష .










  

5, మార్చి 2013, మంగళవారం

సంవత్సర సంతోషం .

                                                 సంవత్సర సంతోషం . కృతఙ్ఞతలు 

    23. 2. 2013. న  హైదరాబాద్ లో, రంగారెడ్డి జిల్లాలోని తుర్క యామ్జల్ లో13 సంవత్సరముల క్రిందట స్తాపింప బడిన  శ్రీ జ్ఞానోదయ విద్యా నికేతన్ లోని  వార్షికోత్సవానికి నాందిగా   జ్యోతి ప్రజ్జ్వలనంచేస్తూ  ముఖ్య అతిధులు, ( బి .వెంకటేశం గారు, ఎం  ,ఇ . ఓ . హీర్యానాయక్ గారు ,ప్రిన్సిపాల్ .                   ( యెన్.పద్మజారాణి  ) సభా సంప్రదాయాన్ని పాటించారు.  .                                                      
 ఈ సందర్భం గానే చిరంజీవి అరుణ్ కిరణ్ ద్వారా  బాల బాలికలలో ,నాయకత్వ లక్షణములను ప్రేరేపించే ఒక కార్య క్రమం , ఊరేగింపు, దానినిగురించి వివరణ జరిగాయి. మానవ జీవితం లో నాయకత్వ లక్షణం ఒక విలక్షణ మైనది . దానిని సద్వినియోగ పరచుకొంటు ముందుకు సాగితే జీవితం సమర్థ వంతం గ , సుఖ వంతం గ సాగుతుంది, దానిని ప్రచారం చెయ్యాలన్న ఒక నాయక లక్షణం ఉన్నవాడే చేయగలుగుతాడు . నాయకుడు సహజంగా జన్మిస్తాడు.( సుభాస్ చంద్ర బోస్ ,అల్లూరి ., మహాత్మా గాంధి జి ,పండిట్ నెహ్రు జి ,లాల్ బహదూర్ శాస్త్రి జీ , టంగుటూరి ప్రకాశం పంతులుగారు , మొదలగువారు యెన్దరో  మహనీయులు )కాని కొంత పరిశ్రమ మీద కూడా కావచ్చు . ఏది ఏమైన, ఈ ప్రయత్నం అభినందనీయం  . ప్రతి విద్యాలయంలో ఇది నిరంతరం కొన సాగాలిసిన్దె. నేటి విద్యార్ధులే రేపటి నాయకులు .. తధాస్తు

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

దేవాలయానికి వెళితే దేవుని దగ్గరకు వెళ్లి నట్లేనా.

 ఉగ్ర వాదుల దుశ్చర్యలకు అమాయకులు బలి అయినందుకు విచారిస్తూ ,22..02.  13 న

చనిపోయిన వారి ఆత్మ శాన్తించాలని మనసార కొరుకొంటున్నాను . వారి వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుకొంటున్నాను .   మానవత్వం మంటకలియకుండా మమ్ములను కాపాడు భగవంతుడా                                                                      
            దేవాలయానికి వెళితే దేవుని దగ్గరకు వెళ్లి నట్లేనా. భగవంతుడిని చూచి తిరిగి యింటికి వచ్చే అదృష్టం మనకు లేదా . మతం ఏదైనా మానవత్వంతో ఆలోచించగలిగే మనసేలేదా . మనుషులు యిలా  మృగాలుగా ఎందుకు మారుతున్నారు . ఉదాహరణకి ,  భర్తృహరి గారి ఒక పద్యం చూద్దాం .

     ఉ.  గ్రాసములేక స్రుక్కిన జరా కృశమైన ,నిశీర్ణ మైన ,సా

          యాసము నైన నష్ట రుచియైన మదేభకుమ్భ  .......

అని సింహము యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తూ .  అది యెంత ఆకలి వేసిన ఏనుగు కుంభ స్థలాన్ని మాత్రమె చీలుస్తుంది ,తింటుంది ,కాని గడ్డి తినదు అంటాడు . కనుక సామాన్యుల మీదకు రావటం అలాంటిదే .                     మృ గాలకున్న నీతి కూ డా మనకు లేదా . ఎంతో విజ్ఞానుల మంటూ అన్ని లోకాలికి వెళ్లి వస్తున్నాం . కాని ఏ విజ్ఞానము మనలను కాపాడలేక పోవటం దురదృష్ట కరం

హైదరాబాదు మనకు ఒక భాగ్యనగరం . అనుకునే పరిస్తితులు లేవా . ఈనాడు జరిగిన మరణ కాండ ,మారణ కాండ, దిల్శుఖ్నగర్లో జరిగిన్ది. దిల్ షుఖ్ మనిషికి పేరులో మాత్రమె మిగిలిన్ది. మరి ఇలాంటి స్తితిలో మన జీవితాలు గాలిలో దీపాలెనా .  విద్యయా వినయా వాప్తిహి  ,సాచేత్  అవినయావాహ , కిం కుర్మః కిం ప్రతి బ్రూమః  గరదాయా స్వమాతరి.  .విద్య వలన వినయాది సద్గుణాలు రావాలిదానికి బదులు దుర్గుణాలు  వస్తే అది స్వయముగా తల్లే విషం పెట్టినట్లు అవుతుంది అనేది దీని అర్థమ్. మనం ఏ స్తితిలో ఉన్నామో ఏమి అర్థం కావటంలేదు .  ఉగ్రవాదుల మనస్సులు సమగ్ర ప్రేమ ,మానవతా భావాలతోనిండి మనమందరం క్షేమంగా ఉండాలని త్రికరణ శుద్ధిగా కొరుకొన్దాము. తధాస్తు. 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...