29, జూన్ 2017, గురువారం

పి.యస్.యన్. పద్యాలు.

పి.యస్.యన్. పద్యాలు.

                            వృద్ధాప్యం - కష్ట సుఖాలు.


1. ఉ . కన్నులచూపు మందమయి కాయము  శక్తివిహీనమై చనన్

          దన్నును గోరుచున్న తలిదండ్రులు నిత్యపు జీవనంబునన్

          వెన్నును గాచి యుండక నవీన విదేశపు డాలరొక్కటే

          యున్నతమంచునెంచి సుతులుద్ధతి చాటుట గారవంబొకో !


 2. తే.గీ . చిన్నతనమున కొడుకుల జేయిపట్టి

               జగతి బ్రతుకంగ దగినట్టి జ్ఞానమిడిన

           .   నాన్న మోమున చిరునవ్వు చిన్నవోయె

              కన్ననేరంబు నిరతంబు కలచుచుండె.

3. తే. గీ . పుత్ర జననంబు స్వర్గంపు మూలమనుచు

              తలచు తలిదండ్రులకు పరితాప మిళిత

              జీవితంబెల్ల భారమైపోవుచుండ

              ధర్మదూరుడు తనయుండు దరికిరాడు.

4. కం . వృద్ధాప్యంబున బిడ్డలు

            శ్రద్ధాసక్తిన్ విశేష సౌఖ్యం బీయ

     .      న్నిద్ధాత్రి  వారి మీరిన

           సిద్ధాత్ముల జూడగలమె శ్రీరఘురామా !


5. సీ . మీరటులొంటరై  మితిమీరుకష్టాల

                           పడవద్దురమ్మంచు పజ్జజేర్చి

          ఆస్థులనమ్మించి అనునయ మొప్పార

                            నేజూతుమిమ్మంచు నియతిబల్కి

         సిరులెల్ల తనచెంత జేరినవెంటనే

                            శరణాలయంబున జక్కఁజేర్చి

         అమెరికా మున్నగు నన్యదేశాలకు

                            కులుకుచు పరుగిడు కొడుకులున్న

తే. గీ . తల్లి దండ్రుల  దుర్గతుల్ తలపనేల

           మానసికమైన క్షోభకు మారు పేరు

           కష్ట నష్టాల కడలికి కాపువారు

           కలలు చెదిరిన దీనులు కన్నవారు

6. ఉ.   వేయికి  నొక్కరిద్దరటు  వేరుగ పుత్రులు కల్గవచ్చులే

           స్థాయికిమించు యోచనలు సల్పక తల్లినితండ్రిసద్గురున్

           పాయక ప్రేమ జూచుచును భక్తివిశేష సమాదరంబుచే

        తోయజనాభు సత్కృపను తోరముగా నిల బొందు  సన్మతుల్

జె.జె.యస్.పద్యాలు.


                            జె.జె.యస్. పద్యాలు.
1.చదువ వ్రాయనేర్పి సన్మార్గమున్జూపి
    సంఘమందు మెలగు సరళిదెల్పి
    జ్ఞాననేత్రమొసగి కాపాడుచుండెడి
    విద్యనేర్చు నతడు విజ్ఞుడగును.
2. చదువె విద్యావినయముల సాధకంబు
    గురులె దైవాలు చదువులగుడులె బడులు
    నీతినియమాలు నేర్వంగ నెలవులగుచు
    కామితమ్ములుదీర్చు సర్కారు బడులు.
3. పల్లెప్రాంతమునుండి బడిజేరువారికై
                  బస్సుసౌకర్యముల్ లెస్సగూర్చు
    తరతమభావాలు దరిజేరనీయక
                   ఏకరూపమయిన వేషమొసగు
    చదువులు నేర్వంగ చక్కగా పుస్తకాల్
                   ఉచితమ్ముగానిచ్చు నుచితరీతి
     మధ్యాహ్నవేళలన్ మరలిపోనీయక
                     పౌష్టికాహారాన తుష్టిగూర్చు
     ఇట్టి బహుళార్ధదములందు బట్టువిడక
     చదివి సంస్కారయుతులౌచు సాగిపొండు
     తాతతండ్రులు చదివిన తావు విడచి
     పుట్టగొడుగులవలె నేడు పుట్టుచున్న
     వివిధ సంస్థలజేరంగ వెఱ్ఱితనము
     చేరరారండు! మీరు సర్కారు బడుల.
4. ప్రభుత నడిపెడి సర్కారు బడులజదువ
    బడయనగు సీటు గురుకుల పాఠశాల
    యందు,వాస్తవంబిదిగాన ఆదినుండి
    చేరరారండు!మీరు సర్కారు బడుల.
 5. చక్కగనాడుకోదగ విశాల మనోహర ప్రాంగణమ్మునన్
     రొక్కము కోరకుండగ పురోగతిజూపెడి విద్యబొందగా
     చక్కని బోధనాపటిమ జాటు సుశిక్షితదేశికాళితో
     పెక్కుగనిల్చె నీ ప్రభుత విద్యల నేర్వుడు పాఠశాలలన్


   


         

         



తొలకరి చినుకులు...రైతుల తలపులు.(2)

               తొలకరి చినుకులు..రైతుల తలపులు.

 1.  తొలకరి వానకై పుడమి తోషిత డెందము కందళింపగా
       బలుమరు ప్రార్ధనల్ సలుప భద్రము గూర్పగ నెల్లవారికిన్
       జలజలమంచురాలె చలచల్లని చిన్కులు రైతుబిడ్డకుం
       గలవరమంతబోయి తమ కాంక్షలుదీరెను నున్నతంబుగన్.
   
 2.   రైతుగ నాదుబాధ్యతగ రాగముతో మడిదున్ని నాణ్యతన్
       గోతులబూడ్చియెత్తయిన కుప్పలులాగి సమంబుజేయుచున్
       మాతగ జూచుభూమిని సమాదర రీతినమస్కరించుచుం
       జేతము రంజిలంబడెడు చిన్కుకు స్వాగతమిత్తు ప్రేమమై.

 3.   అన్నదాతగ పేరొంది యలరుచుండి
        చిన్న పెద్దల యనురాగ సిరులబొంది
        భారతావని గర్వించు పౌరుడనగ
        బ్రతుకు సాగించు నుత్తమ మతినినేనె.

 4.   చక్కగ మోసులెత్తు సహజాంకురముల్ నిజతేజరాసులై
       యొక్కటి యైనవీడక మహోన్నత భూమికణంబునుండియున్
       మక్కువ మీరతొల్కరి సమంచిత భంగిని తొంగిచూచినం
       దక్కువ యేమినాకికను దారకు సంతుకు భోగభాగ్యముల్.

 5.  పెండ్లి జేతును ఘనముగ బిల్లకపుడు
      కొడుకు జదివింతు వెజ్జుగ కూర్మితోడ
      ఇంటిదానికి కొనియిత్తు నింద్రమణులు
      పంట నాయింట మితిమీరి పరచుకొనగ.
     
     
     
     
       

18, జూన్ 2017, ఆదివారం

నాన్నా నీమాటే నాబాట.!


నన్ను ప్రభావితము చేసిన మా నాన్నగారి అనుభవపూర్వక అమూల్యామృత వాక్కులు.
1. సమయపాలన.....ఇది చేయకుంటే మనిషిలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆ లోపం చేస్తున్న పనుల మీద చేయబోయే పనుల మీద పడుతుంది. వ్యక్తి గత విలువ ఉండదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరాదని చెప్పారు.
2. పెద్దలను గౌరవించుట. .... దీనివలన సాటివారిలో సాటిలేని గౌరవం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. తద్ద్వారా మనకసాధ్యమైన పనులు నెరవేరతాయి.
3. నిజం చెప్పటం....ఇది అత్యంత కఠినమైన నియమం. చివరకు ధర్మరాజుకు కూడ అపప్రధ తెప్పించినది కూడా ఇదేకదా. అందరు ఇదే చెబుతారు. కాని పాటించేవారు? గో రక్షణ, స్త్రీ పురుష మాన ప్రాణ రక్షణలందు బొంక వచ్చునని మహర్షులు పలికారు. ఆవిషయంలో నాన్నగారిని అనుసరిస్తాను.                 4. నిశిత పరిశీలన..... ఏవిషయమునైనా పరికించి చూడటం కాకుండా పరిశీలించి చూడటం. ఇదే ఎక్కువగా విజ్ఞానాన్ని సంపాదించిపెడుతుందని , బుద్ధి పెరుగుతుందని చెప్పేవారు.పరిశీలనలో ఎదుటివారి మనోభావాలను కూడ తెలిసికొనవచ్చును. ఇదే ఆంగ్లేయులు చెప్పే "ఫేస్ రీడింగ్". ఆయన ఒకనాటి అనుభవాన్ని కూడ(ఒక మోసకారిని పసిగట్టిన విషయం) నాతో పంచుకున్నారు.
5.చిరునవ్వు....... ఏదైన ప్రత్యేక మైన బాధలో ఉంటే తప్ప ఏనాడు ముఖంలో చిరునవ్వు చెరగనీయవద్దు. అందరు అలా ఉండేలా ప్రయత్నం చెయ్యి.
చిరునవ్వు అందరిని ఆకర్షిస్తుంది. అలరిస్తుంది. బంధువులను, స్నేహితులను
చిరు నవ్వుతో పలకరింతమని చెప్పేవారు.
6. ఎదుటివారి మనసు గాయపడకుండ మాట్లాడుట......
     ఇది చాలా అవసరమైనది. నిత్యజీవితంలో ప్రతిక్షణం ఎదుర్కోవలసిన సమస్య. ఆనందంగా మనం ఉంటూ ఎదుటివారు కూడ అలా ఉండేటట్లుగా చూడటం. ఇది మన ఆయువును పెంచుతుంది.
7. అతి సర్వత్ర కూడదు... ఏవిషయంలోనైన అతిగా ప్రవర్తించే వారిని నమ్మరాదని చెప్పేవారు. ప్రేమైనా, ద్వేషమైనా అతి పనికిరాదు.
8. నలుగురితో మంచి..... అందరితోను ఎల్లవేళల మంచిగానే ఉండాలి. మరీ అది అసాధ్యమైతే కనీసం నలుగురితోనైనా మంచిగా ఉండాలి. చివరి మజిలీకి వారే అవసరమౌతారు.
9. నమ్మకం....   క్రొత్తవారిపట్ల నమ్మకం నిశిత పరిశీలనతోనే ఉండాలి. గ్రుడ్డి నమ్మకం పనికిరాదు. స్వభావాన్ని అంతో ఇంతో అంచనా వేసి దానిని బట్టి నమ్మాలి. మెరిసేదంతా బంగారం కాదనేవారు.

        మా నాన్నగారు(సూర్యనారాయణ) నాకు చెప్పగా వాటినే నేను నీకు చెబుతున్నాను.అన్నారు. నేను కూడ ఆ నవ రత్నాలనే అక్షరం తేడా లేకుండా నా కుమారునకు చెబుతున్నాను. నేను వాటిని తు.చ. తప్పక పాటిస్తున్నాను.

     తాతగారికి, నాన్నగారికి కృతజ్ఞతాంజలులు.

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...