5, అక్టోబర్ 2017, గురువారం

న్యూ నాగోల్ సన్మానము. 2.10.2017.

     న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వారి సన్మానము. కృతజ్ఞతలు.

న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యవర్గం  మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా చేసిన సన్మానము. దానికి కృతజ్ఞతతో వ్రాసిన పద్యాలు.

సీ. జాతికి పితయౌచు జాగృతి నేర్పిన , గాంధి మహాత్ముని ఘనజయంతి
    " జై జవానంచును" జగతికి దెలిపిన , శాస్త్రి జీ పుట్టిన స్వాదుదినము
     వృద్ధుల సన్మాన వేదికై వరలిన , సర్వసభ్యులకిల సంతసంబు
     అధికార వర్గాల కాదరంబు గలుగు, సంస్థ గౌరవమంద చాలునిదియ
 తే.గీ.  మంచిపనిజేయ సతతంబు మాన్యులగుచు
           యశము కోరకె యేతెంచు నవనియందు
          శ్రీనివాసుని కరుణను సిరులు విరియు
           క్రొత్త నాగోలు సంస్థకు కూర్మిదనర.

 సీ. నాగోలు బుధులెల్ల నాయందు జూపిన, ఆత్మీయతలకెల్ల అంజలింతు
      సభ్యులందరు గూడి సాధుజీవనులౌచు, వర్తించు తీరుకు ప్రణతులిడుదు
      సాంఘిక కార్యాల సంఘటితంబుగా, కృషిచేయు మీకెప్డు కేలుమోడ్తు
       జాతీయ పండుగల్ జాగృత తేజమున్, జరిపెడి మీకునే జైయనందు
 తే.గీ.మమత సమతల నందరు మధురరీతి
         పంచి పెంచెడి తీరుకు పరవశింతు
         సభ్యులందరు నూరేండ్లు చల్లగాను
         ఆయురారోగ్యములు గల్గ నభిలషింతు.
 సీ. వయసున మీరిన వందనీయులనెల్ల, గారవించెడు మీరు ఘనులనందు
      జ్ఞానుల సాహితీ జ్ఞానుల వృద్ధుల , గారవించెడు మీరు ఘనులనందు
      ఆటపాటలలోన అందెవేసిన వారి , ప్రోత్సాహమిచ్చెడు పుణ్యులందు
      సంగీత పాండిత్య సౌహృదులందరి , నక్కునజేర్చెడి యమరులందు
 తే.గీ. పెధ్ద మనసున్న నాగోలు వృద్ధులకును
          జ్ఞాన విజ్ఞాన సరస విజ్ఞులకును
          మాదు సన్మాన సమయాన మమతతోడ
          వందనాలను నర్పింతు వందవేలు.

 సీ.  అధికార గణముల అండదండలతోడ, అపురూప సౌధంబు నందుకొనిరి
       అధికార గణముల ఆత్మీయతలతోడ, సాంఘిక సేవల సల్పుకొనిరి
       అధికార గణముల ఆదరంబులనంది, ఆరోగ్య రక్షణ నందుకొనిరి
       అధికార గణముల అమృత వాక్కుల , సత్కార్యములనెల్ల సల్పుకొనిరి
 తే.గీ. సర్వ నాగోలు సభ్యులు సౌఖ్యమంద
          ఇందునున్నట్టి యధికార్లు హితమునంద
          సరళ సుగతి నీ సంస్థ స్థాయి నంద
          వేడుకొందును నీశుని వేడ్కతోడ.

 సీ. నాగోలు సంస్థకు నాకును బంధంబు , బిగిసెను మిత్రుల ప్రేమతోడ
      నాగోలు సంస్థకు నాకును బంధంబు ,  సాగెను సాహితీ సరసువలన
      నాగోలు సంస్థకు నాకును బంధంబు , మెండాయె క్రీడల మెరపు వలన
      నాగోలు సంస్థకు నాకును బంధంబు  , పెరిగెను సత్కళా ప్రియుల వలన
 తే.గీ. ఇన్ని బంధాల నిండిన ఇష్టమైన
          సంస్థ సర్వతోముఖముగ సాగిసాగి
          సభ్యులెల్లరు నారోగ్య సౌఖ్యమంది
          భావి జీవిత కాలాన వరలుగాక!

వృద్ధాప్యం వరమా?శాపమా?

వృద్ధాప్యం వరమా?శాపమా?

బాల్యం,యౌవనం,కౌమారం,వృద్ధాప్యం అనేవి అన్ని జీవరాసులకున్నా, ముఖ్యంగా మనం ఎక్కువగా గమనించగలిగేది మానవజన్మలోనే. విచిత్రం ఏమిటంటే మొదటి మూడు దశలలో కష్టాలున్నా  ఎవరో ఒకరు వాటిని వెనుక ఉండి బయట పడేస్తారు. బాల్యం అంతా అజ్ఞాన మిళిత ఆనందం. ఈ ఆనందం బాలుడికి ఏమీ తెలియకుండానే గడచిపోతుంది. అంటే తలిదండ్రులు వారి ఆనందం, హోదా చాటుట కొరకు వారి బాలబాలికల నలంకరించుకొంటారు. ఇక యౌవనంలో కొంతకొంత శారీరక మార్పులకు ప్రాతిపదికలు వేసుకుంటు, భిన్నరుచులు, అభిప్రాయాలకు పునాది ఔతుంది. ఈ వయసుకి కొంత సహకారం ఉంటుంది. కౌమారమంటే ముదిరిన యౌవనం.
ఎక్కువ భాగం మగవారిలో నూనూగుమీసాల స్థాయి దాటి  నాయకత్వ లక్షణాలు, పెద్దగా ఎవరిని లెక్కచేయకపోవటం,ఆడ పిల్లలలో వివేచన,విచక్షణా పూరిత సిగ్గు దొంతరలతోగూడిన ఆడతనం నాట్యం చేస్తుంది. మగవారికన్న రెట్టింపు జ్ఞానం కలిగి ఉంటారు.   ఈవయసే ఉద్యోగం, సంసార, సామాజిక బాధ్యత లను మోస్తుంది. తనంటే ఏమిటో ఋజువుచేసికొని పై మూడు రంగాలలో అద్వితీయ ప్రతిభను చాటుతుంది. అందరికీ ఆదర్శమై, హిమాలయసదృశంగా ఉంటుంది. తాను పదవీ విరమణ చేసేంతవరకు భార్యా సమేతమైన , భర్తృసహితమైన  జీవితం వరమని భావిద్దాం.
       పదవీవిరమణ చేసిన తరువాత ఎక్కువ మంది వారి ప్రతిభా వ్యుత్పత్తులను, వృత్తి నైపుణ్యాలను,వారు చేసిన సేవలను ప్రశంసించి ఇకపై భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావాలతో ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చి భావిజీవితాన్ని గడపమని పెద్దవారు దీవనలు, చిన్నవారు ఆకాంక్షలను  ఇస్తారు. కాని చాలా మంది  మగవారు నిరాశానిస్పృహలతో ఏదో సమస్తం కోల్పోయినట్లు భావించి  పడక కుర్చీకి అంకితమై, సాధారణ వ్యాయామం కూడ చేయక మానసిక, శారీరక వ్యాధిగ్రస్తులై వైద్యుల చుట్టు తిరుగుతుంటారు. బహుశః ఇక్కడి నుండే శాపం ప్రారంభమౌతుందేమో.
       ఎందుకంటే మొదట వివాహితులుగానున్నప్పుడు వారు జంటగా ఒంటరితనమే కోరుకుంటారు. ప్రకృతి సహజమే. ఆనాడది వరమౌతుంది. ఇరువురిలో శారీరక, మానసిక బలాలు ఉంటవి కనుక. అరవై సంవత్సరాల వయసులో , ఆపై వయసులో, రోగాలపాలై  అలా ఇరువురే ఉండి కనీసం వచ్చి చూచే వారుకూడ లేకుంటే....అది శాపం కాక ఏమౌతుంది? వారు సంతానమున్న నిస్సహాయులు.
    ఇక్కడొక సున్నితమైన అంశం ప్రస్తావించాలి.
           కొడుకులు, కూతుళ్ళు ఉంటారు. వారు ఈరోజుల్లో ఎవరి ఉద్యోగాలు, బాధ్యతలు , అభివృద్ధి కార్యక్రమాలు మానుకొని "మాతృదేవోభవ పితృదేవోభవ"అంటు వచ్చి కూర్చోరు. అలా ఈ వృద్ధులు కోరుకొన్నా వారి బిడ్డల అభ్యున్నతికి గొడ్డలి పెట్టు అయినట్లే. ఈస్థితి వరమో శాపమో ఆ పెరుమాళ్ళకెరుక. కొందరికి కొడుకులు గాని, కూతుళ్ళు గాని " రండి నాన్నా మనం కలసి ఉందాం కలిగింది తిందాం, ఈ వయసులో మీకు మేము ఆసరాగా ఉంటాం, అది మా బాధ్యత" అని నోరారా అనగలగటం తలిదండ్రులకు వరమే.
వారు  ప్రేమాభిమానాలతో  మనసార తమ దగ్గరే ఉండమనకపోవటం గాని, అలా వారు అన్నా  ఉండలేకపోవటం గాని, శాపమే. ఈ శాపగ్రస్తులు వారి దగ్గరకు వెళ్ళలేక, వారి పనులు వారు చేసుకోలేక ఒంటరి బ్రతుకులు ఈడుస్తుంటారు విధి వ్రాతకు ఏడుస్తుంటారు.
         ఇంత నావింత సోదికి ఒక 94 సంవత్సరాల చీకు వృద్ధుని దయనీయ గాధే మూలం.
          ఆయనకు కొడుకులు, కూతుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు ఉన్నారు. ( కొందరు దగ్గరలోనే ఉన్నారు )  నిజాయితీ కలిగిన ప్రభుత్వోద్యోగిగా మన్ననలు పొంది విశ్రాంత జీవితం గడుపుతున్నారు. దురదృష్టవశాత్తు భార్యా హీనుడు. ఒక సీనియర్ సిటిజన్ సంస్థలో సన్మానము పొందబోతు " నాకిపుడు సన్మానము జరుగబోతున్నది. అందరికి ఎవరో ఒకరు వచ్చారు. నాకు కూడ మీరెవరైనా వస్తే సంతోషంగా ఉంటుంది. దయచేసి రండి" అని దీనంగా ప్రార్థించటం , ఏ ఒక్కరము రామని చెప్పటం నా మనసుని  కలచివేసింది. ఇపుడు చెప్పండి ఆయనకది వరమా? శాపమా?  మన చిన్నతనంలో మన బుడిబుడి అడుగులకు ఆనందపడుతునే, వాడెక్కడ క్రింద పడతాడో అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూచే వృద్ధ తలిదండ్రులకిచ్చే ఆసరా ఇదేనా?
      ఏదియేమైనా సంతానం పొందటం ఆనందదాయకమే. వారిని సంతోషపెట్టే సత్సంతానమైతే వరమే. దానికి భిన్నమైతే శాపమే కదా. తలిదండ్రుల గుండెల్లో తన్ని మనం ఎదిగామని గుర్తుంచుకొని, వారికి గుండె కోత తెప్పించరాదు. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సుమా!  

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...