5, అక్టోబర్ 2017, గురువారం

న్యూ నాగోల్ సన్మానము. 2.10.2017.

     న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వారి సన్మానము. కృతజ్ఞతలు.

న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యవర్గం  మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా చేసిన సన్మానము. దానికి కృతజ్ఞతతో వ్రాసిన పద్యాలు.

సీ. జాతికి పితయౌచు జాగృతి నేర్పిన , గాంధి మహాత్ముని ఘనజయంతి
    " జై జవానంచును" జగతికి దెలిపిన , శాస్త్రి జీ పుట్టిన స్వాదుదినము
     వృద్ధుల సన్మాన వేదికై వరలిన , సర్వసభ్యులకిల సంతసంబు
     అధికార వర్గాల కాదరంబు గలుగు, సంస్థ గౌరవమంద చాలునిదియ
 తే.గీ.  మంచిపనిజేయ సతతంబు మాన్యులగుచు
           యశము కోరకె యేతెంచు నవనియందు
          శ్రీనివాసుని కరుణను సిరులు విరియు
           క్రొత్త నాగోలు సంస్థకు కూర్మిదనర.

 సీ. నాగోలు బుధులెల్ల నాయందు జూపిన, ఆత్మీయతలకెల్ల అంజలింతు
      సభ్యులందరు గూడి సాధుజీవనులౌచు, వర్తించు తీరుకు ప్రణతులిడుదు
      సాంఘిక కార్యాల సంఘటితంబుగా, కృషిచేయు మీకెప్డు కేలుమోడ్తు
       జాతీయ పండుగల్ జాగృత తేజమున్, జరిపెడి మీకునే జైయనందు
 తే.గీ.మమత సమతల నందరు మధురరీతి
         పంచి పెంచెడి తీరుకు పరవశింతు
         సభ్యులందరు నూరేండ్లు చల్లగాను
         ఆయురారోగ్యములు గల్గ నభిలషింతు.
 సీ. వయసున మీరిన వందనీయులనెల్ల, గారవించెడు మీరు ఘనులనందు
      జ్ఞానుల సాహితీ జ్ఞానుల వృద్ధుల , గారవించెడు మీరు ఘనులనందు
      ఆటపాటలలోన అందెవేసిన వారి , ప్రోత్సాహమిచ్చెడు పుణ్యులందు
      సంగీత పాండిత్య సౌహృదులందరి , నక్కునజేర్చెడి యమరులందు
 తే.గీ. పెధ్ద మనసున్న నాగోలు వృద్ధులకును
          జ్ఞాన విజ్ఞాన సరస విజ్ఞులకును
          మాదు సన్మాన సమయాన మమతతోడ
          వందనాలను నర్పింతు వందవేలు.

 సీ.  అధికార గణముల అండదండలతోడ, అపురూప సౌధంబు నందుకొనిరి
       అధికార గణముల ఆత్మీయతలతోడ, సాంఘిక సేవల సల్పుకొనిరి
       అధికార గణముల ఆదరంబులనంది, ఆరోగ్య రక్షణ నందుకొనిరి
       అధికార గణముల అమృత వాక్కుల , సత్కార్యములనెల్ల సల్పుకొనిరి
 తే.గీ. సర్వ నాగోలు సభ్యులు సౌఖ్యమంద
          ఇందునున్నట్టి యధికార్లు హితమునంద
          సరళ సుగతి నీ సంస్థ స్థాయి నంద
          వేడుకొందును నీశుని వేడ్కతోడ.

 సీ. నాగోలు సంస్థకు నాకును బంధంబు , బిగిసెను మిత్రుల ప్రేమతోడ
      నాగోలు సంస్థకు నాకును బంధంబు ,  సాగెను సాహితీ సరసువలన
      నాగోలు సంస్థకు నాకును బంధంబు , మెండాయె క్రీడల మెరపు వలన
      నాగోలు సంస్థకు నాకును బంధంబు  , పెరిగెను సత్కళా ప్రియుల వలన
 తే.గీ. ఇన్ని బంధాల నిండిన ఇష్టమైన
          సంస్థ సర్వతోముఖముగ సాగిసాగి
          సభ్యులెల్లరు నారోగ్య సౌఖ్యమంది
          భావి జీవిత కాలాన వరలుగాక!

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...