

లక్ష్మీదేవి వచ్చేటప్పుడు తాబేలు లాగా, పోయే టప్పుడు కుందేలు లాగా ఉంటుంది. ఇది ఒక సామెత.
నాకు ఒకనాడు ఆర్ధికంగా బాగా యిబ్బంది కలిగి మా బంధువు దగ్గరకు వెళ్లి కొద్ది కాలములోనే తిరిగి వడ్డీ తో సహా చెల్లించే షరతు మీద ఋణము అడిగాను. ఆ సందర్భంలో ఆయన డబ్బుకు బదులుగా ఈ సామెత చెప్పాడు . అది నాకు స్వానుభవంలోకి వస్తున్నకొలది ఆయన నాకు జ్ఞప్తికి వస్తున్నాడు. అవును లక్ష్మీదేవి చంచలమైనదే . కానీ నా అనుమానం ఆమె రాక పోకలలో ఎందుకు వ్యత్యాసం ఉండాలి? అని. నాకు కలిగిన భావన ఏమనగా ... ఆమె వస్తుందనే విషయములో మన ఎదురు చూపులు చాలా ఎక్కువగా ఉంటాయి. త్వరగా రావాలని పరవళ్లు త్రొక్కుతుంది మనసు. నిరాశ లో ఆమె రాక చాల నిదానంగా ఉన్నట్లు భావిస్తాము.( రాబడి విషయములో కూడా మనకు చిన్న చిన్న మొత్తాలుగా మాత్రమే ధనమ్ వస్తుంది ) అందుకని ఆమె రాక తాబేలు లాగా ఉంటుంది సహజముగా ఎదురు చూపులు లేకుంటే మనసు ప్రశాంతముగా ఉండి ఎపుడు వచ్చినా యిబ్బంది లేదులే అని పట్టించుకోము . ఇక ఆమె వెళ్ళేటప్పుడు అనగా మనము ఖర్చు చేసే విషయం లో పెద్ద మొత్తం ఒకేసారి ఖర్చు పెడతాము . అందువలన మన దగ్గరనుండి ఎక్కువ మొత్తము బయటకు వెళుతుంది. మరి వేగముగా వెళ్ళినట్లే కదా .
ఇక డబ్బు విషయములోనే కాక వనితా, పుస్తకాలను పరులకు యిచ్చే విషయములో ఒక మహాకవి చెప్పిన శ్లోకం ఒకటి గుర్తుకు వస్తున్నది.
శ్లో . పుస్తకం వనితా విత్తం పర హస్తం గతం గతః
పునరాయాతం చ జీర్ణం, భ్రష్టా చ ఖణ్డశః .... అని వచించారు.
భావం. పుస్తకము, వనిత, ధనమును పరులకు , కొంతకాలము ఉపయోగము కొరకు యిస్తే ఆ మూడు వస్తువులు యథా తథముగా తిరిగి రావట. ఒకవేళ వస్తే పుస్తకము జీర్ణమై, వనిత భ్రష్టమై, విత్తము ముక్కలు ముక్కలుగా వస్తాయట. ఇది కూడా నాకు అనుభవమే అయినది. దానిని పంచుకుందాం.
నేను పీ, ఓ ,యల్( ప్రొఫెషనల్ ఆఫ్ ఓరియంటల్ లెర్ నింగ్ )(విషయము సంస్కృతము, వ్రాత ఆంగ్లము) పరీక్షకు హాజరు కావలసిన రోజులలో(1973) ప్రశ్నలు సమాధానాలు ఉన్న కాపీలు రెండు నాదగ్గర ఉన్నాయి . ఒక కాపీని ఒక సుప్రసిద్ధ పండితునకు యిచ్చి అయ్యా దయచేసి దీనిలోని తప్పులను సరిచేసి ఇవ్వండి అని ప్రార్ధించాను. వారు సరేనని దానిని తీసికొని నేను కాళ్ళు అరిగేటట్లు ఎన్నిసారులు తిరిగిన మరల నాకు తిరిగి యివ్వలేదు. వారి సన్నిహితుల ద్వారా నాకు తెలిసిన సమాచారం ఏమిటంటే నా పుస్తకం ఆ పండితుల వారు తమ ప్రియురాలికి ఇచ్చారట. నాలో సహనం నశించి ఆ మహా పండితునకు పై శ్లోకం చదివి వినిపించి ,, ఈ శ్లోకమును ఆ కవి మీ బోటి వారి అనుభవం తినే చెప్పి ఉంటారు అని నిర్మొగమాటంగా చెప్పాను. పుస్తకము విషయములో యిది నా పట్ల గతం గతః అయినది. చివరకు ఆ కాపీ లేకపోయినా నేను ద్వితీయ శ్రేణిలో కృతార్ధుడనైనాను దైవానుగ్రహం వలన .