వడ్రంగి పిట్ట 🐦🌳
(దార్వాఘాటము, మ్రానుగోయిల)
ఉ॥ అంగుళియంత లేని పదునైన కుఠారమువంటి ముక్కుతో
చెంగున చెట్టుబోదెపయి జేరుచు ఠక్కున చెక్కిచెక్కి వ
డ్రంగితనమ్మునుట్టిపడ రమ్యతరమ్మగు గూడు దొల్తు వి
బ్భంగి సుకౌశలమ్మెవరి ప్రాపున నేర్చితె మ్రానుగోయిలా!
మ॥ తలనే సమ్మెటజేసి ముక్కు"నులి"గా తాడించుచున్ చెట్టుపై
వలపుల్ పండగజేయు గూటినొకటిన్ వయ్యారమొల్కంగ నీ
చెలియుంబిడ్డలు సౌఖ్యమందుటకునై,చీకాకు లెక్కింపకో
పులుగా!యెట్టుల సృష్టిజేసెదవె నైపుణ్యంబుతో నీవటన్!
ఉ॥ రంపము లేదు,సాయపడ రాడొకడేనియు పక్షిగాడు నే
వంపులనెట్లు జెక్కవలె పాఠముజెప్పెడి వాడు లేడు, నీ
సొంపుల గూడు కట్టుకొను సూత్రముదెల్పడొకండు నైన నీ
వింపుగ నొంటి చేత శ్రమియింతువె నేర్పడ స్వంతగూటికై!
కం॥ ఢక్కాముక్కీల్ దినుచున్
పక్కాయిండ్లు సృజియించు పనిగాడవు, నీ
చొక్కపు నైపుణ్యమునే
మక్కికి మక్కీనరసిరి మానవులిలలో!
శా॥ సర్వేశుండిడినట్టి జాతిగతమౌ చాతుర్యమే తోడుగా
దుర్వారంబగు వంశవృద్ధికొరకై తోడ్పాటునందింపగా
నుర్వీజంబొక దానినెన్నుకొని యే ఊతంబు లేకున్న నో
దార్వాఘాటమ!గూడునేర్పరచి సంతానంబు పోషింతువే!
శా॥ ఇల్లుంబిల్లల కంటిపాపవలెనీయిల్లాలు కాపాడగా
నుల్లాసంబుగ మేతదెచ్చియిడి యేవోయూసులన్ జెప్పుచున్
సల్లాపంబులనాడు భాగ్యమరయన్ సంప్రాప్తమౌనే ధరన్
"విల్లా"లందున వేలకోట్లధనమున్ వెచ్చించు మారాజుకున్!
ఆ.వె॥ తరువులెన్నియొ నరికి తలుపులెన్నియొ జేయు
నరునికన్న నీవె నయముగాదె
ఉన్నచోటనుంచి యుర్వీజమునకింత
కీడుకల్గకుండ గూడుజేయ!
సీ॥ "డబులుబెడ్రూమిండ్ల" కుబలాటమున్ లేక
"ఇందిరమ్మ గృహాల"రంది లేక
"ఇంజనీరు",సిమెంటునిసుకతో పనిలేక
కూలీలు మేస్త్రీల గోలలేక
ఇంటి రుణమునకై ఇరకాటముల్ లేక
నెలనెలాచెల్లించు కలత లేక
నరజాతికున్నట్టి నానావిధాలైన
యావ సుంతయు లేక హాయిగాను
తే.గీ॥ వనములందున ననువైన పాదపమున
చెక్కుకొన్నట్టి గూటిలో చెలువు మీర
పుడకలెన్నియొ పేర్చుచు పడక జేతు
బెంగలంటని దిట్ట "వడ్రంగి పిట్ట"!
🍀🐧🍀🐧🍀🐧🍀🐧🍀🐧🍀
రచన:
ఎస్ సాయిప్రసాద్
9440470774