2, ఏప్రిల్ 2019, మంగళవారం

హేవళంబి కాహ్వానం.

  హేవళంబి నామ సంవత్సర ఉగాది ఆహ్వానం. శుభాకాంక్షలు.

   వద్దన్నా కద్దన్నా వదలక వెంటాడేది, తన బలం చూపేది
   ఇతరుల బలహీనతలను సున్నితంగా  తఱచి చెప్పేది
    కవులకైతే కలం, మిగిలిన వారికైతే  కాలం!!
            ఈ రోజునుండి సంవత్సరం దాకా నీపేరు "హేవళంబి"
    చైత్రం నుండి చిత్ర విచిత్రాలు సౌగంధికాలు మొదలై
    నవ ప్రభావిత మావి చివురుల చాటున కోయిలలై
    అర్థవికసిత నవలావణ్య అధరామృతమాను షట్పదములై
    ఊహలకు ఱెక్కలు తొడిగి ఉదయభానుని తాకగలవైన
     భావపరంపరలను భద్రపఱచుకొన్న  సుకవులై...
     కుంచెకు కొంచెం ప్రాణం, మరి కొంచెం త్రాణం అద్ది
     ప్రతి గీతకు గీతంత విలువనిస్తు, రంగుల ప్రపంచాన్ని చ్చే
                      చిత్రకారులై .
     వెలసిందెవరో కాదు. నీవే...
              వేములో చేదును సృజించి, వేయేండ్ల జీవితమిచ్చినా
              క్రొత్త బెల్లంలో తీపి నింపి, భార్యగా పోలిక నిచ్చినా
              ఉప్పులోసముద్రాన్ని, సముద్రంలో ఉప్పు నింపినా
              కారం లో మమకారం కలిపి, కాపురాలు చేయించినా
      మావి పులుపులో , మానవ జీవన చిగురుదొంతరలు దాచినా
              వగరులో కొంచెం పొగరు కలిపి భారతీయునిగా చూపినా
          అదెవరో కాదు. నీవే....
           సహజంగా సామాన్యులు పొగడ్తలకు లొంగుతారు
            నీవీ జాతికి చెందవని తెలుసు, కాని మేమాశాజీవులం.
          గతాన్ని మరచి , వర్తమానాన్ని అనుభవిస్తు , భావి
           జీవితానికి ఎఱ్ఱ తివాచీ పరచే తెల్లని మనసున్న నల్లవాళ్లం.
      హేవళంబీ!
       మేము తెలిసీ తెలియక చేసిన ప్రకృతి విరుద్ధాలను మన్నించి
       వాతావరణ కాలుష్య ఘాతుకాలకు వార్నింగ్ తో వదలి
       మా జీవితాలను ఆధ్యాత్మిక, సాంఘిక, మానవీయతల పట్ల
        మరలించి, ప్రతి ఒక్కరి జీవితం సార్థకం, ఆనందమయం చేయాలని  మనసారా కోరుతు...
                                        పొన్నెకంటి సూర్యనారాయణ రావు.




కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...