23, సెప్టెంబర్ 2019, సోమవారం

గణపతి కి మంగళహారతి.

                          గణపతి కి మంగళహారతి.
   అంబాసుతునకు లంబోదరునకు మంగళమనరే మానినులారా!
   ఆదిపూజ్యుడై యఖిలజగముల హర్షమునింపే యమలమూర్తికి
   విశ్వమునందలి విఘ్నములన్నీ వేడినడుల్చే విఘ్నరాజుకి. "అంబా"
   తల్లిపార్వతి ముఖపద్మంబును వికసనజేసే విష్ణునేత్రునకు
   నెమలివాహనుని నేర్పున గెల్వబుద్ధిబలమునుజూపినవానికి."" .
   గరిక పూజకె ఘనమనితలచి వరములనిచ్చే వక్రతుండునకు
   కుడుములుండ్రాళ్ళు కోరిభుజించి ముదమునుజెందే మోదక
                 ప్రియునకు......."అంబాసుతునకు."

       ఫేస్ బుక్ లో.వృక్షము.ఛాయ..పై స్పందన.

   ఒంటరినన్నభావనయె యోనరుడా యిసుమంతయేనియున్
   కంటికికానరాదెపుడు కమ్మనిపండ్లకునాలవాలమై
   యుంటను సర్వజీవులకు నూర్జితసేవలజేయుచుండుటన్
   మింటిప్రమాణమైయెదిగి మించిన పచ్చదనంబు పంచుటన్.
                              సౌందర్యమంటె ఇది.
  సౌందర్యభరితాలు స్వామి కన్నులుజూడ
                    జగముల కాపాడు జనకుడగుట
  సౌందర్యభరితాలు స్వామి పాదంబులు
                      పతితోద్ధరణులకు భవ్యుడగుట
  సౌందర్యభరితాలు స్వామి హస్తంబులు
                     వరములగురియించు వరదుడగుట
  సౌందర్యభరితాలు స్వామి పల్కులు జూడ
                      అమృతపు సోనలై యలరుకతన
  సౌందర్యభరితాలు స్వామి నవ్వులు జూడ
                      మురిపాల పువ్వులై విరియుకతన
  సౌందర్యభరితాలు స్వామి చేష్టలు జూడ
                      ధర్మంబు కాపాడు తపనవలన
  సౌందర్యభరితాలు స్వామి పుట్టుకలెల్ల
                       భక్తుల రక్షించు బాధ్యుడగుట
  సౌందర్యభరితాలు స్వామి కల్పనలెల్ల
                        సృష్టించి చేపట్టు చేవవలన
    పూర్ణ సౌందర్యమూర్తి  సమ్మోహనుండు
    శ్రీ హరి యొకడె చూడంగ చిత్తమందు
    ధ్యాన మగ్నులు కారండి ధన్యులార!
    అసలు సౌందర్యమన్నను నతనియంశ.

     సీ: పక్షుల కిలకిలల్ పసిపాప నవ్వులు
                         పాడిపంటలసౌరు పల్లెటూళ్ళు
          శిల్పాలు చిత్రాలు చిన్నారి నడకలు
                          కొండలు గుట్టలు కోనలెల్ల
         పచ్చని వృక్షాలు పరువంపు కన్నెలు
                          ప్రకృతియందాలు పాఱునదులు
         అందమై కనిపించి ఆనందమిచ్చుగా
                          మానవాళికెపుడు మనసులోన
 తే.గీ: శాశ్వతంబులు గావవి సంతతంబు
          భ్రమనుగల్పించి యూరించి బాధపెట్టు
          ఒక్క పరమాత్మ భావనన్నొడిసిపట్ట
          అందెయగుపించు సౌందర్యమద్భుతముగ.
             

16, సెప్టెంబర్ 2019, సోమవారం

ఫేస్ బుక్ లోని విషయం . 11... 20.

ఫేస్ బుక్ లోని విషయం .  11... 20. 

11. కం తుప్పల దాగిన సర్పము , చెప్పుల శబ్దంబు తాకి చెంగున నెగురన్ 
           ముప్పని నెఱిగిన శ్రీహరి , తప్పక సమరమును జేయదగుగా నరయన్ . 
12. కం. కప్పము పేరిట ప్రజలను , తిప్పలు బెట్టంగ జూచు తిమ్మిరి రాజున్ 
            ఎప్పగిది జూడ నిరతము , తప్పక సమరమును జేయదగుగా నరయన్ . 
13. కం. తప్పుల తడకలు వ్రాయుచు , చెప్పిన నర్థంబు కాని శిష్యుని భాషన్ 
            గొప్పగ దీర్చగ నొజ్జకు , తప్పక సమరమును జేయదగుగా నరయన్ . 
14. కం. ఒప్పుల తప్పుల దేల్చెడి , నిప్పును న్యాయాధిపతియె నేరముజేయన్ 
            విప్పుచు నాతని చరితము ,తప్పక సమరమును జేయదగుగా నరయన్ . 
15. కం. గొప్పగు కళలను నేర్వగ, మెప్పించుచు సద్యశమ్ము మేలునుబొందన్ 
            అప్పా యేరికి నైనను ,  తప్పక సమరమును జేయదగుగా నరయన్ . 
16. కం. గుప్పెడు మనమును కదలక , నొప్పుగ నుండగజేయు నోర్పది కలుగన్ 
            గొప్పగు సద్గురువైనను , తప్పక సమరమును జేయదగుగా నరయన్ . 
17. కం. నొప్పుల కూర్చిన తరుణి కి , రెప్పలు వాలంగ నపుడు రేయింబవలున్ 
             తిప్పలు మోడలింది రాగా , తప్పక సమరమును జేయదగుగా నరయన్ . 
18. కం. ఎప్పుడు కాలమును బట్టని ,తప్పొప్పులు తెలియరాని తామస గుణికిన్ 
            ముప్పుగా కవితలు వ్రాయగ ,తప్పక సమరమును జేయదగుగా నరయన్ . 
19. కం. చెప్పిన నీతులు వినకను, దెప్పుచు నేనాటి  ఘటనొ తిరిగెడు వానిన్ 
            ఎప్పట్టుననైన నె దురుచు , తప్పక సమరమును జేయదగుగా నరయన్ . 
20. కం. తప్పది  తనపై మోపుచు, ముప్పును కలుగంగజేయు  మేరకు మిత్రున్ 
            ఒప్పు నిరూపింప సతము , తప్పక సమరమును జేయదగుగా నరయన్ . 

ఫేస్ బుక్ లోని విషయం . 15.09.2019 ( 1..10)

ఫేస్ బుక్ లోని విషయం . తప్పక సమరమును జేయఁదగుగా  నరయన్

1. కం. తప్పిన మదితో దూగుచు , ముప్పును గల్గించు చుండి   ముదితలనైనన్ 
          దప్పుగ నిర్దయ దూరిన , తప్పక సమరమును జేయఁదగుగా నరయన్ 
2. కం . కప్పవలె బావి మ్రగ్గుచు ,మెప్పును బొందంగ జూచి మించిన కవులన్ 
            తప్పుల బట్టంగ జూడ , తప్పక సమరమును జేయఁదగుగా నరయన్ 
3. కం .ఎప్పటికప్పుడు తనలో ,దప్పులనెరుగక పదుగురి తప్పులనెంచే 
          దుప్పితల గల్గు పులిపై, తప్పక సమరమును జేయఁదగుగా నరయన్. 
4. కం . అప్పుగొని తీర్చకుండియు , తప్పించుకు తిరుగుచుండి ధన్యుడననుచున్      
          ముప్పే లేదని నీల్గిన ,   తప్పక సమరమును జేయఁదగుగా నరయన్ . 
5. కం . చెప్పుచు నీతులు సతతము , గొప్పగా భావించుచుండి కూళల పగిదిన్ 
           తప్పులజేయగా జూచిన ,  తప్పక సమరమును జేయఁదగుగా నరయన్ . 
6.కం . తప్పుడు మాటల జెప్పుచు , నొప్పుగ స్నేహాన నుండు నున్నత  హితులన్ 
         నిప్పును ముప్పును జేసిన,  తప్పక సమరమును జేయఁదగుగా నరయన్ . 
7. కం. ఎప్పుడు తిప్పలుబెట్టుచు , ముప్పును గల్గించజూచు మేరకు పాకున్ 
          చెప్పున గొట్టుచు ధృతిమై,  తప్పక సమరమును జేయఁదగుగా నరయన్ . 
8. కం . అప్పులు కుప్పలు జేయుచు , ముప్పుగా నేనెంత గొప్పో మేదిని ననెడా 
           అప్పుల రాజునూ కడుగగ ,  తప్పక సమరమును జేయఁదగుగా నరయన్ .. 
9. కం . గొప్పది దేశము నందున , ముప్పేదియు కలుగకుండ మోదము  గూర్పన్ . 
          ఎప్పుడు చూచెడు  భటుడిల, తప్పక సమరమును జేయఁదగుగా నరయన్ .. 
10. కం . కుప్పల ప్లా స్టికు సంచులు , ముప్పును గల్గించు ననిన మేరకు జనులై 
             తప్పును గ్రుడ్డిగ జేసిన, తప్పక సమరమును జేయఁదగుగా నరయన్ .. 

6, సెప్టెంబర్ 2019, శుక్రవారం

పద్య కదంబం

పద్య కదంబం


చేతనైనట్టి సాయమ్ము చేతుమయ్య
    నిర్మలంబైన జీవిక నెట్టుకొఱకు
    బొమ్మ నొకటైన కొందుము పుష్టిగాను
    కళను బ్రతికించి దానికి ఖ్యాతి గూర్ప.

           చంద్రయాన్.2. ప్రయోగం.ది.22.07.2019.

    భారత శాస్త్రవేత్తలిల ప్రజ్ఞను జాటుచు చంద్రయానమున్
    నేరుగబంపి, చందురుని నిర్మలగాంగప్రవాహ ఛాయలన్
    గోరుచు సారమృత్తికల గుంటలలోతుల చిత్రజాలముల్
    తీరుగ పృధ్వికిందెలుప దీక్షను కేతనమెత్తిరెంతయున్.

     చందమామను బరికింప చంద్రయాన
     మనిపె శాస్త్రవిజ్ఞాన సమ్మాన్యవరులు
     దేశమందలి యొనరులం దీర్చిదిద్ది
     ప్రగతి పథమున నిలచిరి భవ్యశోభ!

     చంద్రయానమ్ము రెండును సాగనంపి
     సాటిదేశాల మనఖ్యాతి చాటిజెప్ప
     విజయ శంఖంబు పూరించె వేత్తలౌచు
     జయము మీకెప్డు విజ్ఞాన చతురులార
         బాల కృష్ణుని భావము. నా స్పందన.పొన్నెకంటి.
      నన్ను మించిన మాయలు పన్నుచుండి
      చేయుచుండిరి నరులు దుశ్చేష్టలెన్నొ
      ఎంత చిత్రమొ వర్తనమెంతచేటొ
      మార్పుదేవలె సుంత నా మాయపన్ని.

       యశోద,  కోకతో  కృష్ణుని కట్టివేసిన
         సందర్భంగా... పొన్నెకంటి, స్పందన.

      కట్టివేసితి నమ్మరో కదలకుండ
      కట్టుకోకన చినవాని కటినిబిగియ
      భీతి వదలుడు మీగడ పెరుగువెన్న
      మాయమౌనంచు మీయిండ్ల మగువలార!
   
       ఒంటరిగా తానమాడు చిన్నారి కన్నయ్య
       భావనను గూర్చి, నా భావన.పొన్నెకంటి.

       అమ్మ స్నానంబుచేయించు నదిమిరుద్ది
       నలుపు విరుగుట కొఱకునై ననవరతము
       నీలమేఘశ్యాముడనేను నీలవేణి!
       సహజవర్ణంబు బాప నీ సాధ్యమగునె?

       ఎప్పు డేరీతి స్పందింప నీప్సితంబొ
       అప్పుడారీతి సంతృప్తహావములను
       చూప, పల్కినా విట్టులసోదరుండ!
       "అనుగుణమ్మగు భావనమద్భుతంబు"
        సమస్య: కప్పకు సంపంగినూనె కావలె వింటే.
        నా పూరణ.   పొన్నెకంటి.
       ఒప్పుగ మదవతి పాత్రను
       తప్పక పురుషుండెయైన తా ధరియింపన్
       ఎప్పుడు జూచిన మన వెం
       కప్పకు సంపంగినూనె కావలె వింటే.

       సమస్య: మూడేడుల పిల్లకొక్క పుత్రుడు బుట్టెన్.
         నా పూరణ.  పొన్నెకంటి.
   
       ఈడొచ్చెనిర్వదొకటిగ
       తోడయ్యనుశ్రీను పతిగ తోషణమొప్పన్
       కూడిక సత్ఫలమీయగ
       మూడేడుల పిల్లకొక్క పుత్రుడు బుట్టెన్.
       మాతను తనపతిగగొని యుమాసతి మురిసెన్.
        సమస్య: మాతను తనపతిగగొని యుమాసతి మురిసెన్.
        భూతగణనాథుడీశుడె
        మాతాపితబాంధవుండు మహిమాన్వతుడీ
        భూతలమంతకు, భవుడ
        న్మాతను తన పతిగగొని యుమాసతి మురిసెన్.
                      మీ పొన్నెకంటి.
       అందరికి శ్రావణశుక్రవారపు శుభాకాంక్షలు.

       వరలక్ష్మి కరుణ జూడగ
       ధర కరువే పారిపోయి ధైర్యపు నెలవై
       సిరులింటపొంగి పొర్లును
       నెరవేరునుకోర్కెలెల్ల నిజమిది సుమతీ!

       రారండిలక్ష్మి పూజకు
       రారండిల రమ్యమతిని రమణుల్లారా!
       నేరంబులెన్ని యున్నను
       దూరంబుగ ద్రోచివైచి దుర్దశబాపున్.

      వరదలో వరదుడై లేగను భుజముపైకి ఎత్తుకొని దాటించు
       బాలుని భావనపై నా స్పందన....పొన్నెకంటి.

        ప్రాణమొక్కటె నాకైన పశువుకైన
        వరద నీదగ లేగకు వశముగాదు
        తల్లి పాత్రను దాల్చుట ధర్మమనుచు
        భుజము కెత్తెను నద్దాని ముదముతోడ.

       సమస్య: భామకన్న చిన్నదోమ మిన్న.

        వాంఛలెన్నియైన వయ్యారి భామకు
        తీర్చుచున్న సతము తృప్తిలేక
        గొంతెమవలె నిల్చి కోరుచు హింసించు
        భామకన్న చిన్న దోమ మిన్న.

                       లలిత కళలు

        భావరాసులు రసముల భవ్యరీతి
        తడిసి నానిన ప్రభవించు తావులెన్నొ
        సంఘమందున సజ్జన సంపదనగ
        లలితకళలెల్ల సమ్మోద కలితమోయి!..1.

       కవిత వనితకు పదములు కరము సొబగు
        కల్పనలుజూడ చిత్రంపు క్రాంతులీను
        ఛందసన్నను పాండిత్య సంపదగును
        లలితకళలెల్ల సమ్మోద కలితమోయి!..2.
 
         సరస సాహిత్య సౌహిత్య సాధనాన
         సంఘమందున సద్భావ సౌరులమరి
         దుష్టభావంపు దుర్నీతి తొలగద్రోయు
         లలితకళలెల్ల సమ్మోద కలితమోయి!..3.

         జీవకళనెల్ల చిత్రాల చేర్చుకొఱకు
         చిత్రకారుడ! నీదైన చేతనేమి
         భవుని వరముగ దక్కిన భాగ్యమందు.
         లలితకళలెల్ల సమ్మోద కలితమోయి!..4.

          శిల్ప కళలోన జీవంబు నిల్పనీవు
          భీషణమ్మగు తపము జిగీషతోడ
          చేసినావని నేనెంతు చిత్తమందు
          లలితకళలెల్ల సమ్మోద కలితమోయి!..5.

          గానగంధర్వ!నీసుధా పానమహిమ
          శేష నాగైన ముదమంది శిరమునూచు
          మోరకైనను కనుగవ మోడ్చి వినును
          లలితకళలెల్ల సమ్మోద కలితమోయి!..6.

          నృత్యకారుడ! నటరాజ భృత్యవర్య!
          ఎంత పుణ్యంపు పంటయో సుంత మాకు
          జెప్పి ధన్యతములజేయు చింతదీర
          లలితకళలెల్ల సమ్మోద కలితమోయి!..7.

           నరుడ! మనమున సత్కళా నవ్యశోభ
           బీజమైయున్న దానిని బెంచి పెంచి
           మంచి పాదపమౌనట్లు మలచుకొనుము
           లలితకళలెల్ల సమ్మోద కలితమోయి!..8.

            కళలునేర్చిన మోము సత్కాంతులీను
            సజ్జనాళికి స్తుత్యమై చంద్రుపగిది
            యశము భ్రాజిల్లి సిరులిలనందుచుండు
            లలితకళలెల్ల సమ్మోద కలితమోయి!..9

            ఆయురారోగ్య భాగ్యాల నమరజేసి
            దుష్టమతికెల్ల సద్భావ తోషణమ్ము
            కల్గజేయును సతతమ్ము ఘనముగాను
            లలిత కళలెల్ల సమ్మోద కలితమోయి!.10.

    అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
   
   ప్రాణములెక్కసేయకయె భారతమాతృ కరాళశృంఖలల్
   నాణెపు ధైర్యవీరములె మా సకలాయుధ శ్రేణులంచు, న
   క్షీణ పరాక్రమాన్విత సుకీర్తిసమన్విత వీరవర్యులై
   పూనిక ద్రుంచినా సుగుణభూషితులన్నుతియింతు నే సదా.

   ఎందరు త్యాగమూర్తులయి యేపునజూపు పరాక్రమంబులో
   ఎందరు సారవంత సుకవిత్వపు ప్రేరణ బాణశ్రేణులో
   ఎందరు నాయకాగ్రణుల యీషణపూరిత తైక్ష్ణదృక్కులో
   చిందరవందరంబరచి చీల్చెను నాంగ్లపు పాలనంబునున్.

       వచ్చె నాగష్టు పదిహేను విచ్చెభార
       తాంబ కరముల సంకెళ్ళు సంబరాన
       జనులు స్వాతంత్ర్య జీవులై సాగుచుండె
      మహిత నేతల త్యాగాలమరువగలమె?
                  అనుబంధము..ఆశ
     అధికతరమైన ననుబంధమాశపడగ
     దూరమైచని సర్వత్ర దుఃఖమొదవు
     తామరాకున నీరున్న ధర్మమెరిగి
     నరుడు వర్తించ డెందమానందమొందు.
 
      జీవి కోరినదానినే చిన్మయుండు
      పూర్ణఫలముగ నీయడు మోదమలర
      కర్మఫలముల లెక్కల మర్మములను
      తేల్చి యర్హమౌ వానినే తినగజేయు.

      ఈశుడిచ్చిన దేదైన నిహముపరము
      సంతసంబుగ గ్రహియించ శాంతమబ్బి
      భావిజీవన యానంబు బంగరగుచు
      భోగభాగ్యాలు లభియించు పూర్ణగరిమ.
     సభ్యులెల్లరకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.
                 మీ పొన్నెకంటి.
 
   వేదనాదంబు మురళిన నూదు చుండి
   ఎల్లప్రాణుల డెందాలు కొల్లగొనుచు
   మోక్షమిచ్చెడు దేవకి మోహనుండు
   చిన్ని కన్నయ్య చిర్నవ్వు శ్రేయమగుత!

   సమస్య: మూడు ముందున పదమూడు వెనుక.

    విష్ణు మెడలోన పూమాల వేయుకొరకు
    తులసి పద్మాల వరుసలు తోరమందు
    మూడు ముందున పదమూడు వెనుక
    గాను కూర్చిరి భక్తులు కరము ముదము.
                    ది.26.08.2019.
            "సర్దార్"  సర్వాయి పాపయ్యను గురించి ...
       "భాషాప్రవీణ"పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
                                            యం.ఏ. తెలుగు.
         మల్కాజిగిరి. భాగ్యనగరం. 9866675770.
  సీ. "సర్వమ్మ"గర్భాన శౌర్యంపురాశియై
                          వీరాధివీరుడై వెల్గెనెవడు?
       దైవమ్ము విడనాడి ధర్మాన చరియింప
             స్ఫూర్తి దాతగనున్న   శూరుడెవడు?
       నైజాముప్రభువుల న్యాయపాలనసాగ
                    పట్టుబట్టిన ధీర పౌరుడెవడు?
       సంఘాన యువతకు  చైతన్యదీప్తిని
                  రగులజేసిన గొప్పరాయడెవడు?
 తే.గీ. వాడె సర్వాయి పాపయ్య. వైరికరికి
          సింగమైనట్టి యపురూప చిహ్నమితడు
          తేట తెలగాణబుట్టిన తేజమితడు
          తరతరాలకు నాదర్శ ధర్మమూర్తి.
  సీ. ఉద్యమస్ఫూర్తితో నురకలువేయుచు
                     సైన్యంబుబెంచిన సాధకుండు
       మొగలు రాజులగెల్చి ముదమార రాజ్యంబు
                     స్థాపించి చూపిన చరితుడితడు
       సర్వాయి పాపయ్య సమమెవ్వరంచును
                      మీసంబుద్రిప్పిన మేటియితడు
        కదనరంగమునందు ఖడ్గంబు చేబూని
                      వీరభద్రునివోలె వెల్గెనితడు
 ఆ.వె. కల్లుపాకలోన కల్లును తెగద్రావి
          ధనమునడుగ కాలదన్నినట్టి
          గోలకొండభటుని నేలబడగజేసి
          కాలునరికె. యపరకాలుడితడె.
    💐  మృణ్మయ సుందరాంగునకు స్వాగతం.!💐

   పాంచ భౌతికతత్త్వాల ప్రథమమైన
   పృధ్వియందలి ప్రాణుల ప్రేమతోడ
   కాచి యలరించు పార్వతి కరుణవలన
   నలుగుపిండిన నుదయించె నెలుకరౌతు.1.

   మట్టిగణపయ్య సర్వత్ర మాన్యుడనుచు
   గరిక పోచను సద్భక్తి కనులకద్ది
   పాదపద్మాలనుంచిన భవ్య దివ్య
   వరములంగురియించును వార్షికముగ.2.

   రండి హితులార! వేగమె రాగమతిని
   రంగుహంగులులేనట్టి రమ్యమైన
   శుద్ధసాత్త్విక మృణ్మయ సుందరాంగు
   ప్రేమ స్థాపింప సహృదయ పీఠమందు.3.
                 మీ పొన్నెకంటి.
   పసుపు ముద్దైన మట్టిదౌ ప్రతిమయైన
   రంగులున్నను లేకున్న రమ్యసుగుణ
   ధాముడైనట్టి వెనకయ్య ధర్మబద్ధ
   భక్తి శ్రద్ధలు మాత్రమే ప్రథమమనును.

    ఉపాధ్యా దినోత్సవ సందర్భంగా ధూళిపూడి త.బా.ఉ.  పాఠశాలలో  5.09.2019 న ( 1999-2000 ) పూర్వ విద్యార్థులు ప్రేమతో చేసిన సన్మానసభలో తీపిగురుతులుగా కొన్ని పద్యాలు.

 ముందు సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్మరణ:

 ఆ.వె. సర్వెపల్లివారి సద్యశస్ఫూర్తిగా
          నొజ్జలదినమంచు నోహొయనగ
          చేసిరైదు తేది సెప్టెంబరందున
          వర్షవర్షమెల్ల హర్షమొదవ.

 పాఠశాల వ్యవస్థాపకులు:

 సీ: తడవర్తిబాపయ్య తపమది ఫలియింప
                        విద్యాలయంబది వెలసెనెచట?
      గ్రామస్థులెల్లరు కరములందించగా
                        శ్రేష్ఠంపుగురువులు చెలగిరెచట?
      దేశదేశాలలో ధిషణనుజూపిన
                         విలువైన శిష్యుల వేదికెచట?
      సకలకళాన్విత సౌభాగ్య రాశియై
                        వాణిమువ్వలసౌరువరలెనెచట?
 తే.గీ: ఆప్రదేశంబె సదమల హర్షణీయ
          భావి విజ్ఞాన ధనులకు పాదనంగ
          పేరువడసిన వృక్షంపు పెన్నిధోయి
           తుష్టిపుష్టుల నిలయంబు ధూళిపూడి.

 విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చిరునవ్వుతో జ్ఞాన భిక్ష నిచ్చే
 సుసర్లవారి కానుక " శ్రీవాణి."

  తే.గీ: శ్రీ సుసర్లవారి చెల్వగు శ్రీవాణి
           శిల్పరూపి యగుచు చిర్నగవున
           బాలబాలికాళి బంగరుభవితను
           తీర్చిదిద్ద నిచట కూర్చబడియె.

   ఉపాధ్యాయుల గూర్చి పూర్వ విద్యార్థుల అపూర్వ భావాలు:

 సీ: విద్యనేర్పు కొఱకె విద్యార్థి దండించు
                           గురువుల మేమెప్డు మరువలేము.
      క్రమశిక్షణాన్విత గమనంబు నేర్పిన/ గురువుల..
      పాఠ్యాంశముల్గాక పరమాత్మ జూపిన/ గురువుల..
      సద్భావసాహిత్య సౌహిత్యమూర్తులౌ/ గురువుల..
      పద్యంబునెప్పుడు హృద్యంబుజేసెడు/గురువుల..
      దేశభక్తి మదిని దీపింపజేసిన / గురువుల..
      పెద్దలబూజించు ప్రేమను నేర్పిన / గురువుల..
      మహితుల చరితలన్ మదికెక్కజెప్పిన/ గురువుల..
      తల్లిదండ్రి గురువు దైవంబులన్నట్టి / గురువుల..
      మాతృసంస్థనెపుడు మరువరాదనియెడు /గురువుల..
    తే.గీ: అనుచుబల్కిన పూర్వ విద్యార్థులార!
             మీరపూర్వ విద్యార్థులు, ధీరతములు
             నవ్యభావాలు చిగురించు  నాగరకులు
             ఆశిషంబులగొనుడయ్య!హ్లాదమొప్ప.

       పూర్వవిద్యార్థులకాశీస్సులు:

  తే.గీ: పూర్వవిద్యార్థిగణములపూర్వ ప్రేమ
           పొంది మురిసెను తనువెల్ల పులకరింప
           శుభముగల్గుత! మీకెపుడు సుగుణులార!
           యశమునందుత!భృశము హర్షమొదవ.
 తే.గీ:  మరువబోమయ్య మేమెప్డు మనసులందు
           మీరు చూపిన వినయంపు తీరులన్ని
           కూర్మి చేసిన గారవ గురుతులన్ని
           బాలబాలికలార!విభాసులార!
           పూర్వ విద్యార్థులార! సుబుద్ధులార!
                     పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
                               5.09.2019.

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...