18, డిసెంబర్ 2019, బుధవారం

పండుగ జేసికొండి జనుల్.

  పండుగ జేసికొండికను భారతపౌరులు పుణ్యకాలమున్.
  కండలకావరంబునను కన్నులుగానక కామచారులై
  బండగడెందముల్మలచి పాపమునెంతయొ సల్పినట్టి,యా
  గుండెలులేని క్రూరులిక కూలిరి పాపఫలంబు పండగా
  పండగ జేసికొండికను భారతపౌరులు పుణ్యకాలమున్.1.
 
  దండుగమారి జీవనము దారులదోపిడి కర్కశత్వమున్
  మెండుగ మద్యపానములు మీరిన హద్దుల లైంగికంబులున్
  ఖండనజేసిచూపగను క్రన్నన వచ్చెను "సజ్జనారిదే"
  పండుగ జేసికొండికను భారతపౌరులు పుణ్యకాలమున్.2.

  రండిటు క్రూరకర్ములను రాక్షసనీచుల నుత్తరింపగా
  చండికబోలు శౌర్యమున చానలు!సాంఘిక రక్షణంబుకై
  దండనలేనిచోటునె యధర్మము బెర్గును విఱ్ఱవీగుచున్
  పండుగ జేసికొండికను భారతపౌరులు పుణ్యకాలమున్.3.

  నిండుమనంబునన్నగుచు నిర్మల భావసమంచితమ్ముగన్
  అండనుగోరునావనిత నంతటిఘోరకిరాతకమ్ముగా
  మండగజేసినట్టి యల మాహిషులందరు మట్టిజేరెగా
  పండుగ జేసికొండికను భారతపౌరులు పుణ్యకాలమున్.4.

  కొండొక మూర్ఖుడెవ్వడును క్రొవ్వి మదేభమురీతినున్నచో
  గండముతప్పదంచు మన గౌరవరక్షక శ్రేష్ఠులందరున్
  పిండముబెట్టినారిచట పేల్చిన గుండులసాక్షిజూపుచున్
  పండుగ జేసికొండికను భారతపౌరులు పుణ్యకాలమున్.5.

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...