ఆ. వె. ఆడు వారి మాట కర్ధాలె వేరుగా
విసుగు నసుగులోనె ప్రేమయుండు
ప్రేమపంటపండ విసురులు తప్పవు
తెలిసి మసలుకొనగ తీయనగును.
నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
ఆ. వె. ఆడు వారి మాట కర్ధాలె వేరుగా
విసుగు నసుగులోనె ప్రేమయుండు
ప్రేమపంటపండ విసురులు తప్పవు
తెలిసి మసలుకొనగ తీయనగును.
కరోన కాషన్స్...మీ పొన్నెకంటి.
ఆ.వె: బయటికేగునపుడు భద్రతకొరకునై
"మాస్కు" మరువవలదు మాన్యతముడ!
"శానిటైజు" నీకు సహజ కవచమౌను
తెలిసి మెలగుమోయి తెలివితోడ!...1
ఆ.వె: తులసి టీలు నీకు తుమ్ములు రానీవు
అల్లముగల నిమ్మ హాయిగూర్చు
ఉదయమందు ద్రావ నుత్తేజముంగూర్చు
తెలిసి మెలగుమోయి తెలివితోడ!...2
ఆ.వె: చల్లనైన వాని సరియని తినవద్దు
వేడి వంటకాలె వాడుమోయి
శీతలాన క్రిములు చెలరేగి పెరుగును
తెలిసి మెలగుమోయి తెలివితోడ!...3
ఆ.వె: బంధుజనము జూడ పర్మిషనడుగుము
ఓకె యన్న పిదప దూకుమచట
ప్రేమకన్నముందు ప్రిన్సిపల్ ముఖ్యంబు.
తెలిసి మెలగుమోయి తెలివితోడ...4
ఆ.వె: బయటి నుండి వచ్చి పరవలేదనుచును
అన్ని తాక వలదు హాని కలుగు
సబ్బు నీట కడుగు చక్కగ చేతులు
తెలిసి మెలగుమోయి తెలివితోడ!...5
ఆ.వె: మాస్కుతాకవలదు మధ్యను ప్రక్కలన్
దానినిండ క్రిములు దాగియుండు
చెవుల త్రాడు పట్టి చిన్నగ తీయుమ
తెలిసి మెలగుమోయి తెలివితోడ! ...6
ఆ.వె: చెక్క యాలకులును చిరువుల్లి పాయలు
పసుపు అల్లమెపుడు వాడుమోయి
వంటయిల్లె మనకు వైద్యశాలౌనురా
తెలిసి మెలగుమోయి తెలివితోడ!...7
ఆ.వె: ఈ కరోన మనల నేమిచేయదనకు
శబ్దమేమిలేక ఛాతిజేరి
శ్వాసకోశ శక్తి సరగున జెరచును
తెలిసి మెలగుమోయి తెలివితోడ!...8
ఆ.వె: రోజు రోజు నీవు రుగ్మతనెదిరింప
ఆత్మశక్తి పెంచుటవసరంబు
నిత్యకృత్యమనగ నేర్పుగ బెంచుట
తెలిసి మెలగుమోయి తెలివితోడ!...9
ఆ.వె: అన్ని రుగ్మతలకు నాత్మవిశ్వాసంబె
ముఖ్యమైన మందు మోదమంద
దైవభక్తితోడ తావచ్చి చేరును
తెలిసి మెలగుమోయి తెలివితోడ!...10.
అభయహస్త పద్యం.
కోవిడు టీకా క్షేమం
బేవిధ మైనట్టి బాధ వేధింపదుగా
చేవను బెంచును తనువును
తావక భయమెల్ల వీడు, తరుణీమణిరో!
రోగముతో జచ్చె పో కరోనా తుదకున్
మూగుట లేదిట జనములు
బాగుగ ధరియించుచుండ్రి బహువిధ చిక్కాల్
ఏగతియని మానసికపు
రోగముతో జచ్చె పో కరోనా తుదకున్.
ప్రక్కనే ఉన్న క్రూరమృగం...కరోనా.
సీ: కంటికి కనబడ దింటికిచేరువౌ
కారోన దెయ్యంబు కరుణమాని
బంధువులందఱి బహుదూరమంచును
దానితప్పుకొనగ దయనుమాలి
తనకౌగిలందున దాచగా యత్నించు
కపట పేమనుజూపి కన్నుగీటి
దాని వగలగని దరిజేర మోక్షంబె
తెలివితోడ బ్రతుకు తెలుగువాడ!
ఒకసారి వచ్చినన్ ఇకరాదు నాకంచు
బరవాస వద్దురా భద్రముండు
తే.గీ: నేటి దుస్థితి జూడంగ నీచమాయె
మాస్కు పెట్టిన నెగతాళి మాటలాయె
అట్టి శుంఠలమాటల మట్టుబెట్టి
జ్ఞానవంతుల మాదిరి చనుడు జనులు!
మీపొన్నెకంటి. 9.4.21.
1. గాయత్రీ దేవిగా ఈనాడు దుర్గాదేవి.. స్తుతి.
శా: కారుణ్యామృత చింతనావృత విధిన్ గాయత్రి చిద్రూపివై
సారాసారవిచార మంత్ర నిధివై సౌందర్యవారాశివై
ఘోరాజ్ఞానపుటంధకార జగతిన్ కూర్మిన్విదారించుచున్
శ్రీరంజిల్లెడు వెల్గులిమ్ము సతమున్ క్షేమంకరీ!యీశ్వరీ!
2. శరన్నవరాత్రుల లో. దుర్గామాత, అన్నపూర్ణ గా...
శా: ఆహారంబును జీవకోటి కిడి యాహ్లాదంబు గల్పించుచున్
మోహాంధత్వముబారద్రోలి కరుణన్ ముద్దార దీపించునా
సౌహార్దాది మహోన్నతంపు గుణియౌ శాకంబరీదేవి సు
స్నేహానందవరాన్నపూర్ణ మనలన్ చిద్రూపియై కాచుతన్.
3. వాణిగా ..దుర్గాదేవి. శ్రీవాణ్యై నమః
తే.గీ: పలుకుపలుకున మధువులు చిలుకజేయ
జ్ఞానశక్తియు విజ్ఞాన శక్తులీన
వేదశాస్త్రాల సారాలు వెలికిదీయ
వాణి కరుణించి నా జిహ్వ వరలుగాత!
శా: భావావేశ విలాస సంపదలు సంప్రాప్తంబులై యుండుటల్
ప్రావీణ్యంబున సత్కళావిజయముల్ పండించి మెప్పించుటల్
తావుల్జిమ్మెడు కావ్యసంపుటులు సద్ధర్మార్ధ వేదాంతముల్
నీవాల్లభ్యముగాదె వాణి! జగతిన్నేజ్ఞానికైనన్ సదా!
శరన్నవరాత్రుల లో దుర్గాదేవి.
దుర్గాదేవ్యై నమః....స్తవము.మీపొన్నెకంటి
భర్గుని వామభాగమయి భవ్యసురార్చిత కల్పవల్లివై
నిర్గుణ నిర్మలాత్మ కమనీయరసాంచిత స్వాదుమూర్తివై
దుర్గగ"నింద్రకీలమున దుస్తరపాపవిదూరశక్తివై
మార్గవివేచనన్ సలిపి మమ్ములగావుమ! తల్లిశాంభవీ!
4. దుర్గాదేవి లలితా త్రిపుర సుందరిగా....
చం లలిత మనోజ్ఞభావనలు లాలిత సత్కవితావిభూతులన్
కలరవ గాత్రమాధురులు కమ్మని కావ్యవివేచనారుచుల్
సలలిత భక్తి తత్త్వములు చక్కని గ్రంథవిలాసబంధముల్
వెలయగజేయ శక్తినిడ వేడెద శ్రీలలితాంబనెప్పుడున్.
5. దుర్గాదేవి మహాలక్ష్మి గా...
ఉ . పాలసముద్రరాజ సుతవై సురకోటి సుపూజితాత్మవై
శ్రీలకునాలవాలమయి చెన్నలరారెడు విష్ణుపత్నివై
హేలగచిద్విలాసత మహీతలమేలు కృపాంబురాశి! మా
పాలిట మాతృవత్సలత భాసురరీతిని జూపుగావుతన్.!
స,తీ,దే,వి. ఆటవెలదిలో.. లక్ష్మీ దేవి స్తుతి.
సరసిజాక్షి!కమల!సౌందర్యవారాశి
తీర్చు మమ్మ వెతలు తిరముగాను
దేవి! నీదు కరుణ దేదీప్యమానంబు
విష్ణు హృన్నివాసి! వేలనతులు.
నవమి రోజు..సిద్ధధాత్రి రూపం.,మహిషాసుర మర్దిని.
అమ్మకు వందనములతో..మీపొన్నెకంటి.
సిద్ధ ధాత్రిగ నీరూపు శ్రీలగూర్చు
నవమి రోజున నీదివ్య జవముజూపి
దుష్టసంహారివైనావు తోయజాక్షి
రాజరాజేశ్వరీ!మాకు రక్షనిమ్ము!
మహిష రూపాన మత్తిల్లి మగువయనెడు
చుల్కనైనట్టి భావాన సుందరాంగి
శాంభవిని గోర రణమున సమయజేసె
అట్టి విజయ దుర్గాదేవి నాశ్రయింతు.
అందరికి విజయదశమి శుభాకాంక్షలు.
సీ: నవవిధరూపాల నవ్యాంతరంగాల
మహిషునిజంపిన మాత!వీవు!
పదునాల్గులోకాలు భయముననిండగ
రక్షగల్పించిన రమణివీవు!
లలితలావణ్య విలాసినే కాదంచు
స్త్రీశక్తి జూపిన చెండివీవు!
దుష్టుల దునుమాడి శిష్టుల గాపాడి
తోషంబుగూర్చిన దుర్గవీవు!
విజయదశమిన ఘనమైన విజయమంది
ధర్మ వర్తనె విజయంపు మర్మమనెడు
సూక్తి చాటిన లోకైక శోభనాంగి!
అమ్మ నీకివె హారతులందుకొనుమ!
పచ్చి నేతిబీర భాగ్యనగరు.
ఆ. వె. మాటకోటదాటు మన్నింప సిరిలేదు
ఎన్నికలలలోన నెన్ని హొయలొ
శేషుడైన గూడ శీర్షాలు వంచును
పచ్చి నేతిబీర భాగ్యనగరు!...1.
ఆ.వె. స్వర్ణ మయపు నగరు సాధించితిమి మేము
కీచకాధములకు రాచబాట
బిడ్డ బయటికేగ ప్రేతగమారును
పచ్చి నేతిబీర భాగ్యనగరు....2.
ఆ.వె. అధిక వర్షమైన నపురూప సంద్రమై
యలలు రేగుచుండు నందమొదవ
పడవ వలయు నాడు పయనంబు సేయగా
పచ్చి నేతిబీర భాగ్యనగరు....3
ఆ. వె. వైద్యశాలల పని వర్ణింపతరమౌనె
చిన్న కారణాన జేరనచట
ఉన్నపొలములిండ్లు నొక్కబిల్లుకె చెల్లు
పచ్చి నేతిబీర భాగ్యనగరు....4.
ఆ. వె. బంగరుతెలగాణ పలుకులందు ఘనము
పుత్తడి పయిపూత పొలుపుగాను
స్వంతపాలనమ్ము స్వర్గమ్ము మనదన
పచ్చి నేతిబీర భాగ్యనగరు....5.
సముద్రము...స్వేచ్ఛా ఛందస్సు.
ఉదధిని నతుల రత్నమ్ము లొదిగియుండు
నటులె క్రూర జలచరము లందెగలవు
రత్నసాధన కొఱకుగా రాటుదేలి
యత్నమొనరింప సమకూరు రత్నతతులు.
1. నేటి అంశం "బమ్మెరపోతనామాత్యుడు".
సీ: శ్రీరామదర్శన సిద్ధినిబొందిన
పుణ్యాత్ముడైనట్టి భూరిగుణుడు
వాణికన్నీటిని వారించి కావ్యమ్ము
రామునకిడినట్టి రమ్యగుణుడు
భాగవతంబున ప్రత్యక్షరంబును
భక్తిని నింపిన భవ్యగుణుడు
సహజకవియనెడు చక్కని బిరుదంబు
పొందిన రసరమ్య పుణ్యగుణుడు
ఆ. వె. బమ్మెరాన్వయుండు బహుపూర్వ పుణ్యుండు
పోతనాఖ్యుడైన భూసురుండు
భరతసత్కవిమణి భాగ్యంపువారాశి
సాటిలేని విమల సారయశుడు.
... తేటగీతిలో పోతనగారు.
తన్మయత్వాన శ్రీరాము తత్త్వమంత
భారతీయుల హృదయాల భద్రపఱచె
భాగవతమను పేరను భవ్యచరిత
పుణ్యచరితుండు భక్తుడా పోతరాజు...1
హలము బలమున పండించె నైహికంబు
కలము చేతను సృజియించె కవనఫలము
రెంట జాలిన పోతన మింటికెదిగి
రామ రసమును బంచెను రసనతనియ.2
నవ్య మధువున భావాలు నానబెట్టి
భక్తిరసమును బూయుచు పద్యరచన
చేయకుండిన యంతటి చిద్విలాస
పూర్ణ సాహిత్య మొదవునె పోతనార్య?.3.
2. గురజాడ.
సీ: సాంఘిక శ్రేయమ్ము సమకూర్చవలెనంచు
పాటుబడినయట్టి పండితుండు
గ్రాంథికవాదులౌ కవులను మెప్పించి
ప్రజలభాషను బెంచు పండితుండు
హేతువాదిగ మారి హిమవన్నగమ్ముగా
భావాలు పంచిన పండితుండు
"కవిశేఖరుండన్న" కమ్మని బిరుదమ్ము
భద్రమై వెలుగొందు పండితుండు
తే.గీ: వేసె సాహిత్య రంగాన భిన్నమైన
నడుగు లెన్నెన్నొ వీరుడై హ్లాదమొదవ
వారి జాడలె మనకెప్డు దారిజూపు
భావి సంస్కారపూర్ణత్వ పరిధిపంచు.
3. కవికోకిల" జాషువా గారి జయంతి .సం.గా...
తే. గీ . కులము మతనెడు క్రుళ్ళును కూల్చివేయ
అక్షరాయుధంబునుబట్టి యనవరతము
సాహితీరణ రంగాన సాగి ప్రజల
డెందముల్గెల్చిన సుకవీ! వందనములు.
తే.జీ . రాజు సుకవుల చావు బేరీజు వేసి
సుకవి ఘనుడంచు బల్కిన సూరివీవు
ప్రజల గుండెల నిండెడు భావచయము
నీదు సొంతము జాషువా! నిజమునిజము
4. అంశం..గాంధీజీ....
ఉ . ఆయుధమింతలేక పరమాద్భుత శాంతి కి మారురూపమై
గాయము రక్తపాతములు కర్కశఖడ్గవిహారశూన్యమై
దాయగునింగిలీసుప్రభుతన్హడలంగను నెట్లుజేసితో
ఓయి మహాత్మ! జాతిపిత! యున్నత భారతమాతబిడ్డరో!
5. పొట్టి శ్రీరాములు...ఆంధ్ర రాష్ట్రావతరణ:
ఆ.వె. కలసిరాష్ట్రమున్న కష్టాలకడలంచు
పొట్టివంశజుండు పోరిపోరి
ఆంధ్రులకును స్వేచ్ఛ నందించు యజ్ఞాన
తనువు సమిధజేసె త్యాగమూర్తి.
ఆదర్శ నేత...
తాను చేయు పనుల ధర్మంబు తప్పని
స్వార్ధమెఱుగనట్టి సజ్జనుండు
లలితహృదయుడైన లాల్బహదూర్వంటి
నేత దొరకగలడె నెమకిచూడ!
వాగ్గేయకారుడు... త్యాగరాజు.
సరళ సంగీత సాహిత్య సార కీర్త
నాళి రచియించి రాగాలనాలపించి
యయ్యె వాగ్గేయకారుడు త్యాగరాజు.
పూర్వజన్మంపు పుణ్యంబు ప్రోదిగాగ.
గురువు.
ఆ.వె. సర్వెపల్లివారి సద్యశస్ఫూర్తిగా
నొజ్జలదినమంచు నోహొయనగ
చేసిరైదు తేది సెప్టెంబరందున
వర్షవర్షమెల్ల హర్షమొదవ.
మ. అకలంకంబగు నక్షరంబులను సర్వార్ధ్హార్ధ సిద్ధంబుగాన్ ,
సుకరంబయ్యెడి రీతిగా మదికి సంస్తూయాత్మపాండిత్యమున్,
సకలంబున్ దయజూపి నేర్పిన గురుస్స్వాముల్ విచారింప.నా
కొకరా యిద్దర ముగ్గురా నలుగురా యున్నార లెందెందరో .
సీ. క్రమశిక్షణాన్విత గమనంబు నేర్పిన
గురువుల మేమెప్డు మరువలేము.
పాఠ్యాంశముల్గాక పరమాత్మ జూపిన
గురువుల మేమెప్డు మరువలేము
సద్భావసాహిత్య సౌహిత్యమూర్తులౌ
గురువుల మేమెప్డు మరువలేము
పద్యంబునెప్పుడు హృద్యంబుజేసెడు
గురువుల మేమెప్డు మరువలేము
దేశభక్తి మదిని దీపింపజేసిన
గురువుల మేమెప్డు మరువలేము
పెద్దలబూజించు ప్రేమను నేర్పిన
గురువుల మేమెప్డు మరువలేము
మహితుల చరితలన్ మదికెక్కజెప్పిన
గురువుల మేమెప్డు మరువలేము
తల్లిదండ్రి గురువు దైవంబులన్నట్టి
గురువుల మేమెప్డు మరువలేము
మాతృసంస్థనెపుడు మరువరాదనియెడు
గురువుల మేమెప్డు మరువలేము
తే.గీ: వివిధ రూపాలనలరెడు వేదమూర్తి
బాలబాలికలన్నను పరవశించి
జ్ఞాన దీపాలు పంచు విజ్ఞానమూర్తి
అర్పణముసేతు నతులను నహరహమ్ము.
ఆ.వె. విద్యలన్ని నేర్పి విజ్ఞత కల్గించు
గురుని పాదరజము శిరముదాల్చ
నంతకన్న ఫలము నవనిని లేదురా
వదలకయ్య గురువు పాదములను.
ఆ.వె. నిదుర లేచి యెవడు నిస్టాంతరంగుడై
గురుని నామ జపము కూర్మి సలుపు
నట్టి వాడు పొందు నఖిల సౌఖ్యమ్ములు
వదలకయ్య గురువు పాదములను.
ఆ.వె. శిష్యకోటి మతుల చీకట్లు తొలగించి
దివ్య బోధనలను దీప్తు లిచ్చి
ధిషణ జూపు గురువు దేవుని రూపురా
వదలకయ్య గురువు పాదములను.
ఆ.వె. బాల బాలికాళి బహువిధ శిలలౌను
ఊహలెల్ల గురుల ఉలులు సుమ్ము .
ఉన్నత గురు కృషియె ఉత్తమ శిల్పాలు
వదలకయ్య గురువు పాదములను.
ఆ.వె. దైవ దర్శనంబు దయతోడ చేయించి
ముక్తి త్రోవజూపు పుణ్యమూర్తి .
గురువు పేర మనకు గోచరిన్చునుగాదె
వదలకయ్య గురువు పాదములను.
ఆ.వె. ఎరుక కులజుడైన ఏకలవ్యుండు-తా
గురుని దైవమట్లు కూర్మి నమ్మి
విశ్వమందు కరము విఖ్యాతి నార్జించె
వదలకయ్య గురువు పాదములను.
ఆ.వె. మైనమట్లు కరగి మహి కాంతులీనెడు
గురుని త్యాగ గుణము మరువరాదు .
అనుసరించి వాని కానన్దమీయరా
వదలకయ్య గురువు పాదములను.
ఆ.వె. తండ్రి పగిది నిన్ను దండించు నొకమారు
తల్లివోలె ప్రేమ తనుపుచుండు
విద్య నేర్పు గురుని వింత వేషాలురా
వదలకయ్య గురువు పాదములను.
భాగ్యనగర వాణికి పట్టాభిషేకం
భాగ్యనగరంలోని కల్చరల్&అసోసియేషన్,రాఘవేంద్రకాలని, సి,బ్లాక్, కొండాపూర్ వేదికగా, సంస్థ ప్రసిడెంట్ శ్రీ జూపల్లి శ్రీనివాస రావుగారు ది.30.10.2022(ఆదివారం)ఉ.గం.10.00లకు పతాకా విష్కరణ, సభాధ్యక్షత బాధ్యతలను నిర్వహించగా, కార్యదర్శి శ్రీ ఏ. సురేంద్రరెడ్డి గారి విజయోత్సవ తోడ్పాటుతో తడవర్తి బాపయ్య ఉన్నత పాఠశాల, ధూళిపూడి పూర్వవిద్యార్థులు నూతి సాయి సోదరులు, తదితర ఆత్మీయ విద్యార్థినీ విద్యార్థుల బృంద సంపూర్ణ సహాయ సహకారములతో వారి విశ్రాంతాంధ్రోపాధ్యాయులైన శ్రీయుతులు జొన్నలగడ్డ జయరామ శర్మకు, పొన్నెకంటి సూర్యనారాయణ రావుకు, శ్రీమతి వెలగపూడి నాగమల్లి పుష్పలతకు, ధూళిపూడి
పూర్వవిద్యార్థి, అష్టావధాని శ్రీయుతులు చింతలపాటి బుచ్చి వెంకటప్పేశ్వర శర్మకు దంపత సమేతముగా ఘన సన్మానములను దుశ్శాలువ, సరస్వతీ మూర్తి తో అనిదంపూర్వముగా నిర్వహించిరి. అచటికి వచ్చిన పూర్వ విద్యార్థుల గుండెలోతులు నిండిన ప్రేమానుభవాలు, సభక్తికముగా ఆనందాశ్రువులతో పొంగిపొర్లిన సంభాషణలు ఆకట్టుకొనినవి. వారి మధురానుభూతులు అనుభవైక వేద్యములే కాని బోధ్యములు కావు. ఈ సంతోష సమయమున ‘‘ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ’’ అని పాఠశాల పూర్వ విద్యార్థులు వఝ గోపాల కృష్ణమూర్తి, కత్తుల వెంకటేశ్వరరావు ప్రభృతులు గ్రామముతోను పాఠశాలతోను ఉపాధ్యాయుల బృందముతోను గల స్వానుభవములను కవితాత్మకముగా వ్రాసి సభను పంచుకొన్నారు.
ఈ అపూర్వ సన్మానము ‘‘ వాణి పాద మంజీరములకు జరిగినట్లు భావించు చున్నామని సన్మాన గ్రహీతలు తమ ఆనందమును కృతజ్క్షతలను పద్యముల రూపమున వ్యక్తపరచిరి. ఈ రీతిగా మాతృభాషను, ఉపాధ్యాయులను జీవితాంతం మరచిపోకుండ గౌరవించుకొనే సంప్రదాయాన్ని పాటించిన ధూళిపూడి పూర్వ విద్యార్థులు ఎల్లవేళలా అభినందనీయులే, ఆదర్శప్రాయులే.
శుభం భూయాత్!
ఆశీః పద్యసుమాలు.
ఇంతటి చోద్యంబు నెవ్వారు చేయంగ
వినలేదు కనలేదు వేదికలను
ఇంతటి ప్రేమయా? యీఛాత్రులకునెల్ల
"అమ్మభాష" యనిన నాదరంబు
ఇంతటి గారవ మింత పీయూషమ్ము
"తెలుగు"నందని మీరు తెలిసివలచి,
కొంతలో కొంతగ కొమ్మ పల్కులరాణి
పాదారవిందాల పట్టుమమ్ము
"భాగ్యనగరా"న మాకు సౌభాగ్యమలర
పూర్వ విద్యార్థులెల్లరపూర్వముగ
సూత్ర బంధిత కుసుమాల శోభపగిది
చేరి సత్కరించిరిట ఆశీస్సులివియె.1.
ఎంత యెదిగిన నొదుగుటే యింగితమని
ఇట్టి పరమార్ధ మెరుగుచు పట్టుదలను
మూలములనెల్ల మరువని మూర్తులగుచు
మీరలుండుట సంతసమిడును మాకు.2.
మరువలేనట్టి ప్రేమను మాన్యతలను
"శిష్యగణమె"ల్ల మోదాన చేరి యిచట
పంచినారలు బుధులెల్ల పరవశింప
నాయురారోగ్య భాగ్యాల నలరుడయ్య!3.
తల్లి పాలు ద్రావ తరియించు జన్మంబు
మాతృ భాష పలుక మమతలొలుకు
నన్న విషయమెరిగి ఆంధ్రభోజుడు నాడు
తెలుగు లెస్స యనియె ధీరుడగుచు.4.
వదలక మమతలు మీరలు
పదిలముగా నుండుడయ్య పరమార్ధమదే
సదమల భావ పూర్ణపు
నెదలోపలె నీశుడుండు నెయ్యుడెయగుచున్.
భాగ్యనగరం. శుభాశీస్సులతో
మల్కాజిగిరి విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు
30.10.22. పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
శార్వరి నామ ఉగాది శుభకామనలు..25.03.2020.
@పద్యవర్షం. 11. విక్రమ. బలము,తెలివి,ఎదుగుదల.
ఉ:సార వివేచన్గవిత సౌరభముల్ వెదజల్లు సత్కవుల్
చేరగ మోక్షమార్గమును శ్రీహరి కీర్తనజేయు భక్తులన్
ధీరత వీర విక్రమత దేశముగాచెడు త్యాగమూర్తులన్
వారల భక్తి శౌర్యముల బాడగ సంతసమొప్పు నెప్పుడున్.
ఉ:అందము జూచి కొందరికి, హాసవిలాస విశేషమోహమౌ
చందముజూచి కొందరికి, సారసలోచన యోరచూపు సం
బంధము జూచి కొందరికి, బంగరుసొమ్ములు దాల్పగా మహా
నందము జిహ్వకో రుచియనంగను మానవనైజమేకదా!
సీ:పరమాత్మ ధ్యానంబె పావిత్ర్యమనియెంచి
యానందమందుదురందులోన
గ్రంథపఠనమదె గౌరవంబనియెంచి
యానందమందుదురందులోన
సత్కళోపాసనం జరియించి తరియించి
నానందమందుదురందులోన
షడ్రసోపేతమౌ చవులూరు తిండియం
దానందమందుదురందులోన
జిహ్వ జిహ్వకు రుచివేరె చెల్లునటులె
పుఱ్ఱె పుఱ్ఱెకు పుట్టెడు బుద్ధి వేరు
ఏది కాదనినను నెవ్వరొప్పరిలను
ఎవరి సంతసమెచ్చటో యెరుగలేము.
@ పద్యవర్షం..21.ధాత.
ఉ:చేతలలోన చేతుల విచిత్రపు జాడ్యము దాగియుండి తా
మూతులు మూయువారికడ మోదముతో దరిజేరకన్ సదా
కోతిని మించిపై కెగిరి క్రుంగగదీయుచు నుండె నిద్ధరన్
"ధాత"గమారి కన్గొనుమ దానికి మందును భారతీయుడా!
ఉ:భూతలమందు జీవులకు పూర్వపు కర్మఫలావశేషమే
రాతలు భిన్నమై వరలి రమ్యవినోదులు కొందరైనచో
వేతన జీవులై మనుచు వేదనజెందెడు కొందరుందు రా
"ధాత"విలేఖనా సుకృతి ధర్మము నేరికి దాటశక్యమౌ?
ఉ:"ధాతవు" గమ్ము సత్కవన ధారల కావ్యమనోజ్ఞ సృష్టి-సం
"ధాతవు" గమ్ము దుర్జనుల దారిమరల్చుచు జ్ఞానదాయివై
"ధాతవు" గమ్ము పేదలకు ధైర్యమనోబల శ్రేయమీయగన్
"ధాతవు" గమ్ము సజ్జనుల ధార్మిక జీవనయానమందున్.
తే.గీ:"ధాత"నామంబు దలచిన ధైర్యముడుగు
భీకరంబైన కరువున బెద్ద సంఖ్య
భరతదేశాన ప్రజలను పట్టిమ్రింగి
త్రేన్చినట్టిది మరువము దీనినెపుడు.
తే.గీ:ధర్మ సృష్ఠికి నీవిల "ధాత"వగుము
తరణమొనరింప పేదల "ధాత"వగుము
కళల జీవమువోయు సం"ధాత"వగుము
తుష్ఠి పుష్టి గూర్చ శుభ వి"ధాత"వీవె.
@ పద్యవర్షం.22. ప్రమోది
ఉ:జీవుడు కష్టనష్టముల చిత్రముగా విధి నిర్ణయంబుగా
నావ ప్రయాణముంగడపు నావికు రీతిని జేయుచుండుగా
కావగ శ్రీహరే కరుణ క్రన్నన జూప విభాసమానుడై
యే వగలేకయున్ సతమహీన సుశాంత ప్రమోదియైచనున్.
ఉ:వచ్చె ప్రమోది వత్సరము వందనముల్ దగ సల్పగావలెన్
తెచ్చెను శాంతిసౌఖ్యములు తీయని హాసవిలాసభావముల్
నచ్చిన రీతిగా మనము నైతికజీవన సాహచర్యముల్
అచ్చపు జుంటితేనియల నానినతీరున హాయినుందుమా!
తే.గీ:ఈ ప్రమోది సంవత్సర మీవసంత
లక్ష్మి సర్వజనాళికి రమ్యభావ
నిర్భర సుఖపరంపర నియతిగూర్చి
రక్షసేయుత! సతతంబు రమ్య గరిమ.
@పద్యవర్షం..23.విరోధి.
ఉ:చక్కని స్నేహభావనలు సౌమ్యమనస్కత బంధుతత్త్వముల్
పెక్కురతోడి స్వచ్ఛమగు ప్రేమసమన్విత భాషణంబులున్
నిక్కపుమార్గదర్శనము నీమముతోడి చరించుచుండుటల్
దిక్కులనింపు సద్యశము ధీనిధియైన "విరోధి" కెట్లగున్?
ఉ:మనము గ్రహించియున్సుగుణమాన్యుల భాసురజీవితంబులన్
దినమొకరీతిగా చెరచి తీరని చింతల చిచ్చువెట్టు నా
కణకణమన్ "విరోధి" గని గ్రన్నన మార్చిన శాంతిమార్గమున్
వినయము ప్రేమతత్త్వములు విస్తృతమౌను జగమ్ముమెచ్చగన్.
కం:నీవే "విరోధి" వైనను
దావేమియు నీయమయ్య,తామసగుణముల్
కావేవి హితకరమ్ములు
కావుమ! స్నేహాన మమ్ము కాలవిభాసా!
తే.గీ:శరణు వేడ "విరోధి" నేన్ పరమప్రేమ
నభయమిచ్చెడు తత్త్వంబు శుభమటంచు
వేదశాస్త్రాలు ఘోషిల్లె విస్తృతముగ
భరతదేశపు విఖ్యాతి పరిఢవిల్ల.
ఉ:దూర విరోధు లెవ్వరును దుష్కృతముల్సలుపంగ లేరెటన్
పారములేని వార్ధి బడబాగ్నులెయౌ మన లోనిశత్రువుల్
పోరున రూపుమాపి భువి పుణ్యచరిత్రుడవై మెలంగనన్
తీరును గష్టనష్టములు దీప్తములౌగద కీర్తి చంద్రికల్.
@పద్యవర్షం..24. సాధారణ.
శా:ఈ "సాధారణ"వత్సరంబికను సుశ్శ్రీకార భాస్వంతమౌ
వాసంతంబుగ నిల్చుగాక! నిలలో వైక్లబ్య రాహిత్యమై
ఆసాంతంబగు సౌఖ్యమిచ్చి మది భవ్యంబైన హ్లాదంబునన్
ధీసర్వంబునుభక్తి పూర్ణమయమై తేజంబు గల్పించెడిన్.
క్షయమును జేసికొమ్మికను కామమదోత్కట దుర్గుణమ్ములన్
క్షయమును జేసికొమ్మికను క్రౌర్యవిదార మహాపకారముల్
జయమిడునట్టి వర్తనము శాంతిని దాంతినిగూర్చునిచ్చలున్.
ఆ.వె:ప్రథమవత్సరంబు ప్రభవయై ప్రభవించె
రెండనంగ విభవ పండెసిరులు
చివరిక్షయము గూర్చిచింతించ వలదులే
క్షయము సల్పుదుష్ట కర్మతతిని.
ఆ.వె:ప్రభవ మందుటెటుల పరమాత్ము సత్కృపో
క్షయముకూడ వాని కరుణవలనె
పుట్టిగిట్టుటలవి పుణ్యపాప ఫలాలు
తరిగిపోవుదనుక తిరుగుచుండు.
@పద్యవర్షం..26. స్వభాను.
ఉ:ఏపని జేయబూనినను నీశుడె సర్వముచూచునంచు తా
దాపునకైన నేగక సదా కృపగోరుచు మందబుద్ధితో
కోపముజూపగా దగదకుంఠిత దీక్షను కార్యదక్షుడై
ఆపరమాత్మసాక్షిగమహత్కృషి చేయ స్వభానుతేజమౌ.
కం:నమ్మిన స్వభాను తేజము
కమ్మనిభాగ్యంబులబ్బి కమనీయంబౌ
ఇమ్మహి పరబలమేదియు
వమ్మయి సాఫల్యమిడదు వంతలదెచ్చున్.
@పద్యవర్షం..27. శుక్ల.
స్వచ్ఛత, తెల్లదనము, పారదర్శకత.
ఉ:తెల్లని దేహకాంతులును తెల్లని మేడలు కొల్లయౌ సిరుల్
ఉల్లము సంతసంబడని యున్నత శ్రేణులు వమ్ముసోదరా!
తెల్లని మానసంబులును తేటగుమాటల ప్రేమభావముల్
ఎల్లరు మెత్తురయ్య పరమేశుని సత్కృప దక్కునెప్పుడున్.
తే.గీ:శుక్ల వర్ణాననుండును చూడకొంగ
శుక్ల వర్ణంబె హంసయు సూరివర్య!
క్షీరముంద్రావి హంస తా నీరముంచు
మించు నటనల బకమది మీలదినును.
@పద్యవర్షం..28.సౌమ్య.
నెమ్మదితనము,బుద్ధిమంతుడు,సహృదయత.
ఉ: పేదల పెన్నిధై నిలచి ప్రేమగ వారల జీవితాలలో
మోదము నింపి సంపదలు పూర్ణవిభాసిత సద్గుణంబులన్
సాధనగూర్చువాడెగద సౌమ్యమనస్కుడు. సంఘసేవలన్
వేదనలన్నియున్ పరమ విజ్ఞత దాటుచు కీర్తిగాంచుగా.
కం:నెమ్మదితనమది శ్రేయము
కమ్మని ఫలితంబులీను కార్యములందున్
అమ్మయు నాన్నయు నిరతము
సమ్ముదమున గఱపుచుంద్రు సంతుకునెపుడున్.
తే.గీ:బుద్ధిమంతుండు యోచించు సిద్ధికొరకు
బుద్ధిహీనుండు పరకాంత పొందుగోరు
జన్మజన్మల కర్మానుసారముగను
పుట్టి యనుభవింత్రు నరులు గిట్టుదనుక.
తే.గీ:అభము శుభములు తెలియని యతివలనక
కన్నుగప్పిన కామాన తెన్నుదప్పి
మానవాకార మృగములై మసవబోక
సౌమ్య హృదయతన్ మెలగ దుశ్చర్యలడగు.
తే.గీ:సౌమ్యమైనట్టి మనసున్న సాధుజనుల
సత్త్వహీనులుగానెంచి చౌకసేయ
జమ్మిచెట్టున దాగిన జ్వాలవోలె
విక్రమింతురు వారె బెంబేలుపడ
తే.గీ:ప్రజల జీవనయానంబు పరిఢవిల్ల
ఆయురారోగ్య భాగ్యాల నతిశయింప
ప్రభుత సన్మార్గవర్తియై వరలుచుండ
శుక్ల వత్సర మిడుగాత! శోభలెల్ల.
@పద్యవర్షం..29.సర్వజిత్
అందరిని గెల్చిన వాడు, అంతశ్శత్రువులను గెల్చినవాడు.
కోర్కెలు జయించిన వాడు , ఏదైనా సాధించగలవాడు.
ఉ:కామము లోభక్రోధములు కర్కశమై మనమందుదాగి, యా
ప్రేమను పొంగనీవుగద భేద విలోకన దుష్టభావనన్
సేమము గాదటంచునవి చిత్తమునం దొలగించి వేయుచున్
నీమము పాటిసేయు గణనీయుడు మాన్యుడు "సర్వజిత్త"గున్.
చం:సతతము పేదసాదలకు చక్కని సాయములందజేయుచున్
మతమను భేదభావములు మానసమందున జేరనీయకన్
వెతలను డుల్చివేయుచును విజ్ఞతనొప్పెడు వాడె"సర్వజిత్"
శతముసహస్ర వర్షములు సంస్తుతి నందును నెల్లవారిచేన్.
పద్యవర్షం@30.దుందుభి.
చం. జనకుని సత్సభన్ దరిసి శంభుని వింటినిబట్టగోరి , యా
ముని కనుసైగకున్ నిలిచి పూర్ణయనుజ్ఞను బొంది వేగమై
వినయము భక్తి శౌర్యముల విజ్ఞతజూపుచు ద్రుంచివేయగా
ఘనముగ దుందుభుల్ మొరసె కంజదళాక్షుని బ్రస్తుతించుచున్.
ఉ:రాముడు దుందుభిన్ కరము లాఘవమొప్పగ పాదతాడనన్
తామసభావమొక్కెడను దర్శనమీయని తాత్త్వికత్వమున్
కోమలతన్ సుదూరముగ గూలగద్రోసి పరాక్రమంబునున్
నీమముతోడజూపి స్తవనీయుడె యయ్యెను నద్వితీయుడై.
1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...