5, సెప్టెంబర్ 2020, శనివారం

గురువు.

                                గురువు.

          ఆ.వె. సర్వెపల్లివారి సద్యశస్ఫూర్తిగా

                   నొజ్జలదినమంచు నోహొయనగ

                   చేసిరైదు తేది సెప్టెంబరందున

                   వర్షవర్షమెల్ల హర్షమొదవ.

మ.  అకలంకంబగు నక్షరంబులను సర్వార్ధ్హార్ధ సిద్ధంబుగాన్ ,

      సుకరంబయ్యెడి రీతిగా  మదికి సంస్తూయాత్మపాండిత్యమున్,

     సకలంబున్ దయజూపి నేర్పిన గురుస్స్వాముల్ విచారింప.నా

     కొకరా యిద్దర ముగ్గురా నలుగురా యున్నార లెందెందరో  .

సీ. క్రమశిక్షణాన్విత గమనంబు నేర్పిన

                      గురువుల మేమెప్డు మరువలేము.

    పాఠ్యాంశముల్గాక పరమాత్మ జూపిన

                      గురువుల మేమెప్డు మరువలేము

    సద్భావసాహిత్య సౌహిత్యమూర్తులౌ

                      గురువుల మేమెప్డు మరువలేము

    పద్యంబునెప్పుడు హృద్యంబుజేసెడు

                      గురువుల మేమెప్డు మరువలేము

    దేశభక్తి మదిని దీపింపజేసిన 

                     గురువుల మేమెప్డు మరువలేము

    పెద్దలబూజించు ప్రేమను నేర్పిన 

                      గురువుల మేమెప్డు మరువలేము

    మహితుల చరితలన్ మదికెక్కజెప్పిన

                       గురువుల మేమెప్డు మరువలేము

    తల్లిదండ్రి గురువు దైవంబులన్నట్టి 

                       గురువుల మేమెప్డు మరువలేము

    మాతృసంస్థనెపుడు మరువరాదనియెడు 

                      గురువుల మేమెప్డు మరువలేము

    తే.గీ:  వివిధ రూపాలనలరెడు వేదమూర్తి

             బాలబాలికలన్నను పరవశించి

             జ్ఞాన దీపాలు పంచు విజ్ఞానమూర్తి

             అర్పణముసేతు నతులను నహరహమ్ము.

  ఆ.వె.    విద్యలన్ని  నేర్పి విజ్ఞత కల్గించు 

             గురుని పాదరజము శిరముదాల్చ

             నంతకన్న ఫలము నవనిని లేదురా 

             వదలకయ్య గురువు పాదములను.

 ఆ.వె.   నిదుర లేచి యెవడు నిస్టాంతరంగుడై 

            గురుని నామ జపము కూర్మి సలుపు 

            నట్టి వాడు పొందు నఖిల సౌఖ్యమ్ములు 

            వదలకయ్య గురువు పాదములను.

  ఆ.వె. శిష్యకోటి మతుల చీకట్లు తొలగించి

          దివ్య బోధనలను దీప్తు లిచ్చి

          ధిషణ జూపు గురువు దేవుని రూపురా

          వదలకయ్య గురువు పాదములను.

  ఆ.వె. బాల బాలికాళి బహువిధ శిలలౌను

           ఊహలెల్ల గురుల ఉలులు సుమ్ము .

           ఉన్నత గురు కృషియె  ఉత్తమ శిల్పాలు

           వదలకయ్య గురువు పాదములను.

   ఆ.వె. దైవ దర్శనంబు దయతోడ చేయించి

           ముక్తి త్రోవజూపు పుణ్యమూర్తి .

           గురువు పేర మనకు గోచరిన్చునుగాదె  

           వదలకయ్య గురువు పాదములను.

  ఆ.వె. ఎరుక కులజుడైన ఏకలవ్యుండు-తా

          గురుని దైవమట్లు  కూర్మి నమ్మి

           విశ్వమందు కరము విఖ్యాతి నార్జించె

          వదలకయ్య గురువు పాదములను.

  ఆ.వె. మైనమట్లు  కరగి మహి కాంతులీనెడు

           గురుని త్యాగ గుణము మరువరాదు .

           అనుసరించి వాని కానన్దమీయరా

           వదలకయ్య గురువు పాదములను. 

 ఆ.వె. తండ్రి పగిది నిన్ను దండించు నొకమారు

          తల్లివోలె ప్రేమ తనుపుచుండు

          విద్య నేర్పు గురుని వింత వేషాలురా

          వదలకయ్య గురువు పాదములను.


భాగ్యనగర వాణికి పట్టాభిషేకం

భాగ్యనగరంలోని కల్చరల్&అసోసియేషన్,రాఘవేంద్రకాలని,  సి,బ్లాక్, కొండాపూర్ వేదికగా, సంస్థ ప్రసిడెంట్ శ్రీ జూపల్లి శ్రీనివాస రావుగారు ది.30.10.2022(ఆదివారం)ఉ.గం.10.00లకు పతాకా విష్కరణ, సభాధ్యక్షత బాధ్యతలను నిర్వహించగా, కార్యదర్శి శ్రీ ఏ. సురేంద్రరెడ్డి గారి విజయోత్సవ తోడ్పాటుతో తడవర్తి బాపయ్య ఉన్నత పాఠశాల, ధూళిపూడి పూర్వవిద్యార్థులు  నూతి సాయి సోదరులు, తదితర ఆత్మీయ విద్యార్థినీ విద్యార్థుల బృంద సంపూర్ణ సహాయ సహకారములతో వారి విశ్రాంతాంధ్రోపాధ్యాయులైన శ్రీయుతులు జొన్నలగడ్డ జయరామ శర్మకు, పొన్నెకంటి సూర్యనారాయణ రావుకు, శ్రీమతి వెలగపూడి నాగమల్లి పుష్పలతకు, ధూళిపూడి 

పూర్వవిద్యార్థి, అష్టావధాని శ్రీయుతులు చింతలపాటి బుచ్చి వెంకటప్పేశ్వర శర్మకు దంపత సమేతముగా ఘన సన్మానములను దుశ్శాలువ, సరస్వతీ మూర్తి తో అనిదంపూర్వముగా నిర్వహించిరి. అచటికి వచ్చిన పూర్వ విద్యార్థుల గుండెలోతులు నిండిన ప్రేమానుభవాలు, సభక్తికముగా ఆనందాశ్రువులతో పొంగిపొర్లిన సంభాషణలు ఆకట్టుకొనినవి. వారి మధురానుభూతులు అనుభవైక వేద్యములే కాని బోధ్యములు కావు. ఈ సంతోష సమయమున ‘‘ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ’’ అని పాఠశాల పూర్వ విద్యార్థులు వఝ గోపాల కృష్ణమూర్తి, కత్తుల వెంకటేశ్వరరావు ప్రభృతులు గ్రామముతోను పాఠశాలతోను ఉపాధ్యాయుల బ‌ృందముతోను గల స్వానుభవములను కవితాత్మకముగా వ్రాసి సభను పంచుకొన్నారు.

ఈ అపూర్వ సన్మానము ‘‘ వాణి పాద మంజీరములకు జరిగినట్లు భావించు చున్నామని సన్మాన గ్రహీతలు తమ ఆనందమును కృతజ్క్షతలను పద్యముల రూపమున వ్యక్తపరచిరి. ఈ రీతిగా మాతృభాషను, ఉపాధ్యాయులను జీవితాంతం మరచిపోకుండ గౌరవించుకొనే సంప్రదాయాన్ని పాటించిన ధూళిపూడి పూర్వ విద్యార్థులు ఎల్లవేళలా అభినందనీయులే, ఆదర్శప్రాయులే.

                శుభం భూయాత్!


ఆశీః పద్యసుమాలు.

ఇంతటి చోద్యంబు నెవ్వారు చేయంగ

           వినలేదు కనలేదు వేదికలను

 ఇంతటి ప్రేమయా? యీఛాత్రులకునెల్ల

           "అమ్మభాష" యనిన నాదరంబు

 ఇంతటి గారవ మింత పీయూషమ్ము

     "తెలుగు"నందని మీరు తెలిసివలచి,

 కొంతలో కొంతగ కొమ్మ పల్కులరాణి

              పాదారవిందాల పట్టుమమ్ము

  "భాగ్యనగరా"న మాకు సౌభాగ్యమలర

   పూర్వ విద్యార్థులెల్లరపూర్వముగ 

   సూత్ర బంధిత కుసుమాల శోభపగిది

   చేరి సత్కరించిరిట ఆశీస్సులివియె.1.

 ఎంత యెదిగిన నొదుగుటే యింగితమని

  ఇట్టి పరమార్ధ మెరుగుచు పట్టుదలను

  మూలములనెల్ల మరువని మూర్తులగుచు

  మీరలుండుట సంతసమిడును మాకు.2.

 మరువలేనట్టి ప్రేమను మాన్యతలను

  "శిష్యగణమె"ల్ల మోదాన చేరి యిచట

   పంచినారలు బుధులెల్ల పరవశింప

   నాయురారోగ్య భాగ్యాల నలరుడయ్య!3.

తల్లి పాలు ద్రావ తరియించు జన్మంబు

   మాతృ భాష పలుక మమతలొలుకు

   నన్న విషయమెరిగి ఆంధ్రభోజుడు నాడు

   తెలుగు లెస్స యనియె ధీరుడగుచు.4.

 వదలక మమతలు మీరలు

   పదిలముగా నుండుడయ్య పరమార్ధమదే

   సదమల భావ పూర్ణపు

   నెదలోపలె నీశుడుండు నెయ్యుడెయగుచున్.

   భాగ్యనగరం.            శుభాశీస్సులతో

    మల్కాజిగిరి      విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు

    30.10.22.   పొన్నెకంటి సూర్యనారాయణ రావు.



కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...