13, డిసెంబర్ 2024, శుక్రవారం

కృతజ్ఞతాంజలులు

 కృతజ్ఞతాంజలులు.

  "సూర్యశ్రీరామం" వచనరచనాలోచన నాకు గల్గించిన "శ్రీ సీతారాముల

పాదపద్మములకు మున్ముందు ప్రణామములర్పించుకొనుచున్నాను. 

నేను నా "సూర్యశ్రీరామం" రామాయణ వచన కావ్యమునకు మున్నుడి 

వ్రాయించుకొనుటకు స్వయముగా తమ దగ్గరకు వస్తానని చెప్పిన వేళ

శిష్యవాత్సల్యముతో "ఈ మండుటెండలలో రావలదని ,పుస్తకము పూర్తి

అయిన తరువాత రావచ్చున"ని చెప్పి నిరంతరం సాహితీసేవలో మునిగి

యుంటు నన్నాశీర్వదిస్తు, గ్రంథసమీక్షచేసి వాట్సాప్ ద్వారా పంపిన బహు

గ్రంథకర్త, బహు సన్మానములను కేంద్ర రాష్ట్రములనుండి పొందిన మాన్య

మా గురుదేవులు ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం మాష్టారు గారికి

అనేకానేక కృతజ్ఞతాభివందనములు. "నవరత్నమాలిక" పేరుతో నన్ను నా గ్రంథమును గూర్చి చక్కని చిక్కని శైలితో తొమ్మిది పద్యరత్నములను భ్రాతృ వాత్సల్యముతో వ్రాసియిచ్చిన నా ప్రియతమ సోదరులు చిత్రకవితాసమ్రాట్ శ్రీయుతులు చింతా రామకృష్ణా రావు గారికి ధన్యవాదశతములు. "సూర్యా

రామం" పేరుతో నన్ను నా రామాయణమునభినందించుచు లోతైన భావాలతో

తమ యమూల్యాభిప్రాయమును వ్రాసియిచ్చిన నా సంస్కృత కళాశాల 

సహాధ్యాయి, మధురకవితా విశారదులు , నిరంతర పద్యరచనాసక్తులు 

డా. రామడుగు వేంకటేశ్వర శర్మగారికి ధన్యవాదశతములు. "సంకల్పసిద్ధుడు"

పేరుతో  నన్ను నా రామాయణము నభినందించుచు చక్కని పద్యములను 

వ్రాసియిచ్చిన నా సీనియర్ ఆంధ్రోపాధ్యాయుడు,విషయపరిశీలనలో రచనలో సహాయపడిన మిత్రుడు శ్రీ జొన్నలగడ్డ జయరామ శర్మగారికి ధన్యవాదాలు.

"మరోవాల్మీకం, సూర్యశ్రీరామం"పేరుతో తమ చక్కని చిక్కని సరససుకుమార

భావాలతో ఆంధ్రప్రభ సీనియర్ ఎడిటర్ గా అనుభవాలను రంగరించి విశ్లేషణను సుదీర్ఘంగా అందించిన మా గౌరవనీయ బావగారు"శ్రీవైయస్సారెస్"

గారికి నమోవాకములు. నా సంస్కృతకళాశాల సహాధ్యాయి , భువనవిజయ

సభలలో మంత్రితిమ్మరుగా ఖ్యాతినందిన నా సోదరుడు  నన్ను గురించి నా 

సూర్యశ్రీరామం గురించి విశ్లేషణాత్మక అభిప్రాయము నందించినందులకు 

మనసా ధన్యవాదాలు. చిరకాల సాహితీమిత్రులు ,అష్టావధాని, టి.వి. మాధ్యమంగా నిరంతరం సాహితీసేవ చేస్తూ నాకును అందు అవకాశం కల్పించిన నా సోదరుడు శ్రీ సురభి శంకరశర్మ గారు కోరగనే అభిప్రాయము

వ్రాసిపంపినందులకు ధన్యవాదాలు. 

     నా "సూర్యశ్రీరామం" ఆలోచనల నుండి అక్షరాచరణ రూపం వఱకు, గ్రంథ

రూపం వచ్చుటకు ముఖ్యకారకురాలు నా అర్ధాంగి "శ్రీమతి ఇందిర". నా పలుకులో పలుకై పదములో పదమై భావములో భావమై కథాంశమును టైపు చేయుటలో నిరంతర భాగస్వామి యై సంపూర్ణ గ్రంథనిర్మాణమునకు పూనుకొనినందులకు శుభాభినందనలు శుభాశీస్సులు.  అటులనే నా అల్లుడు

కుమార్తె, కొడుకు, కోడలు, మనుమరాండ్రు, మనుమడు సూర్యశ్రీరామం 

గ్రంథ రూపం ధరించుటకు ఎంతో ఉత్సాహ ప్రోత్సాహములనిచ్చుట ముదావహము. వారెల్లరకు నా శుభాశీస్సులు. 

 నా యీ గ్రంథమును అందముగా ఆకర్షణీయముగా ముద్రించిన చిరంజీవి

నరసింహ కు శుభాశీస్సులు. 


ప్రథమ ముద్రణము....క్రోధి. మార్గశీర్షము. (డిశంబరు 2024)

కాపీలు ..1000.

కాపీ రైట్స్....... చి.ల.సౌ. మాచిరాజు రాధిక. చి. పొన్నెకంటి అరుణ్ కిరణ్.

గ్రంథముల ప్రాప్తి స్ధానము.

ఫోన్. నం. 98666735. 9866675770.


విశ్వకళ్యాణ-"సూర్య-రామాయణ" జ్యోతి.


తే.గీ: శ్రీ"రమాపద్మ"ల హృదయసీమలో -న

        లంకరించు -"శ్రీ కళ్యాణ వేంకటేశ్వ

        రుండు"-దివ్య శేషాద్రి వాసుండు - శుభము

        లొసగి - "సూర్య సత్కవిచంద్రు" నోముగాక!...1

తే.గీ: రమ్యమౌ"తెలుగు కవితారామ"మైన

         భారత సనాతనార్ష సువర్ణ శిఖరి

         "గర్తపురి"ప్రాచ్యవిద్యార్థి ఘనయశుండు

         "సూర్యనారాయణార్యుడు""సుమధురకవి"...2

తే.గీ: "పొన్నెకంటి" వంశసుధాబ్ది - పూర్ణకీర్తి

         చంద్ర - "సూర్యనారాయణు" స్వర్ణ- రామ

         తారకాక్షర"దివ్యమంత్ర జపఫలము-

         భవ్య "సూర్య-రామాయణ" భక్తిసుకృతి....3

తే.గీ:  సద్గురు కరుణాపాత్రులు; సంస్కృతాంధ్ర

         పండితులు; ఆర్ద్రహృదయులు; భక్తిధనులు

        "రామకథ"ను - "శ్రీ సూర్యనారాయణ కవి"

        "తెలుగు వాల్మీకి"యై పల్కె, తీయగాను....4

తే.గీ: "ఒంటిమిట్ట" కళ్యాణమహోత్సవంపు

          మూర్తులైన - "సీతారామ" పూజ్యపాద

          పద్మ పీఠార్పితమగు - కావ్యమ్ము! భక్తి

          అక్షరసుమమ్ము! - "సూర్యరామాయణమ్ము"..5

తే.గీ:  భవ్యవేద పురాణ సద్భావఝరిగ

         సకలకవి, పండిత జనరంజకముగాను

         రమ్య "రామాయణ" సుకృతి - రచనచేయ

         ధరను- "సూర్యకవి" "కలమ్ము"- ధన్యమయ్యె..6

తే.గీ: జనని "గాయత్రి" మంత్రబీజాక్షరయుత 

         సప్తకాండ సమన్విత - స్వర్ణరమ్య

        "సూర్య - రామాయణజ్యోతి" సుకృతి - ప్రతి 

         గృహాన - "కళ్యాణ దీపమై" అలరుగాత!..7

తే.గీ: "కనకదుర్గమ్మ" "మల్లేశు కరుణసుధలు

          యాదగిరి "శ్రీనృసింహ" దృక్చందనాలు;

         "సీతరామచంద్రుల"-పెండ్లి సేసలెపుడు

          భువిని "సూర్యేందిర"ల - సదా బ్రోచుగాక!..8

  కం:  " సూర్య" సుహృదయ శ్రీకృత

         " సూర్య శ్రీరామ" రమ్య సుకృతి సుధలిలన్-

          ఆర్యజన కల్పలతలై 

         " సూర్య"ప్రభలలరుదాక - శుభములొసగెడిన్.9


           1-01-2025.               శుభంభూయాత్!

            హైదరాబాద్.           మీ ఆత్మీయ "కళ్యాణశ్రీ"

                                     జంధ్యాల వేంకటరామశాస్త్రి.

                              "ఆర్ష సాహితీ రత్న".9640321630.   



4, డిసెంబర్ 2024, బుధవారం

వదలకయ్య...శతకము.

 వదలకయ్యగురువు పాదములను. ( ఆటవెలదుల శతకము)

బ్రహ్మవిష్ణుభవుల భాసురతేజంబు

మూర్తిగొన్న రూపు పుడమికాపు

గురుపదమ్మె సుమ్ము! గోప్యంబులేదురా

వదలకయ్య గురువు పాదములను.1

దైవముండు చోటు తాజూచి చూపెడు

సత్యధ‌ర్మపరుడు సౌమ్య గురుడు

సకలసుజన హితుడు సౌజన్యమూర్తిరా....వదలకయ్య2

దైవగణముల నిల తనివార పూజింప

గురువు కరుణ యొకటె తెరువుజూపు

ధరణిలోన ముఖ్యదైవంబె తానురా.....వదలకయ్యగురువు3

కాలగమన మెపుడు గమనించవలెనంచు

జ్ఞానబోధ జేసి కథలజెప్పి

మెదడు పదునుబెట్టి మేల్జూపు మేటిరా....వదలకయ్యగురువు4

జలధి పయనమందు చక్కని చుక్కాని;

చేర్చులక్ష్యములను చింతలేక

అట్టి మార్గదర్శి యాచార్యవర్యుడే........వదలకయ్యగురువు5

ప్రథమగురువు తల్లి ప్రతివ్యక్తి కెయ్యెడన్

శిరమువంచి నతులు సేయవలయు

బడిని నడుగుపెట్ట బంధమ్మె గురువగున్.....వదలకయ్యగురువు6

కాయమిచ్చి తల్లి కార్యశూరుని జేయు

జ్ఞానమిచ్చి గురువు కరుణజూపు

వారి ఋణముదీర్చు భక్తిశ్రద్ధలతోడ............వదలకయ్యగురువు7

గురువు దైవమందు గొప్పవారెవరన

దొడ్డ గురుడె యనెను తులసిదాసు

దైవమనగ నెవరొ తాదెల్పు మూర్తిరా......వదలకయ్యగురువు8

మంచిచెడులజెప్పి మానవత్త్వమునేర్పి

కులమతాలకుళ్ళు కూల్చివైచి

మదిని హత్తుకొనెడు మాన్యుండె గురువురా.....వదలకయ్యగురువు9

ఒక్కశిష్యుచేత నోటమిజెందగ

సతము కోరుచుండు సద్గురుండు

భావి జీవితంపు బంగారు దిక్సూచి..........వదలకయ్యగురువు10


ధనపుటాశలేదు దర్పంబులేదులే

వృత్తి ధర్మమనిన విసుగు లేదు

శిష్యవత్సలతను చిరునవ్వుతోజూపు.....వదలకయ్యగురువు11


శిష్యగణము లోన చేతనత్వమునింప

మదిని నమ్మినట్టి మాన్యతముడు

లోకబాంధవుండు లోతైనవ్యక్తిరా.......వదలకయ్యగురువు12


సత్త్వరజముతమము సహజాతమైనను

ప్రథమగుణమె మనకు పదిలమనుచు

శిష్యతతికి జాటు శ్రీరామచంద్రుడే.....వదలకయ్యగురువు13


గతము, నేడు, భావి కాలంబులందున

నేడు ముఖ్యమనుచు నిర్ణయించి

నిజముబల్కు గురుడు  నిర్మలాత్ముండెరా....వదలకయ్యగురువు14


శిష్యుచేతివ్రాత చీకాకుగల్పింప

అక్షరంపు సొగసులలరజూపి,

నుదుటి వ్రాత మార్చు విదితవిధాతరా.....వదలకయ్యగురువు15.


గద్యపద్యభక్తి కావ్యంబులనెగాక

దేశభక్తి సంఘ దీప్తి నెల్ల

శిష్యకోటి హృదుల చిందించుఘనుడురా....వదలకయ్యగురువు16


త్యాగగుణమె పరమ ధర్మతత్త్వంబంచు

చరితలన్ని జెప్పు సౌమ్యమూర్తి

కనులముందు నిల్చు కారణజన్ముండు......వదలకయ్యగురువు17


తాను నమ్మినట్టి తర్క వేదాంతాలు

పూర్ణమహిత మనుచు మోదమలర

చాటిచెప్పునట్టి శాస్త్రాలపుట్టరా........వదలకయ్యగురువు18


లలితకళలు నరుని లాలిత్యముంబెంచు

ఫలితమదియొ గొప్ప వరమెయనుచు

వాని నాచరించు వర్ధిష్ణువాతడు........వదలకయ్యగురువు19


శిలను చెక్కి చెక్కి శిల్పంబుగామార్చు

నమరశిల్పి జక్కనార్యుపగిది

శిష్యుల హృదయాల జెక్కుచక్కని శిల్పి.....వదలకయ్యగురువు20

ఆదిగురువు శివుడు హ్లాదానమైమర్చి

నాట్యమాడుచుండ నాటి ఘోష

పరమ వేదమయ్యె పావనభారతిన్.......వదలకయ్యగురువు21


వేదనాద మదియె విస్తృత రూపమై

ధన్యు వ్యాసహృదిని ధరణినిలువ

మహిత గురువు పగిది మాన్యత్వమందెరా.....వదలకయ్యగురువు22


అంధకార సూచి ఆ"గు"కారంబగు

తన్నిరోధమది"రు" తనరుచుండు

అక్షరద్వయమది యజ్ఞాననాశంబు......వదలకయ్యగురువు23


తల్లివోలె ప్రేమ తనియజేయుచునుండు

తండ్రిపగిది కరుణ దారిజూపు

గురువు జ్ఞానియగుట గోప్యమున్ విప్పురా.....వదలకయ్యగురువు24


పాఠశాలె తనకు పావిత్ర్య బంధమ్ము

బాలబాలికాళి బంధుగణము

వారివృద్ధి తనకు వైకుంఠమనునురా.....వదలకయ్యగురువు25


తనదు సౌఖ్యమెపుడు తలపులోనుండదు

పరులసేవ యనిన బరుగులెత్తు

స్వార్ధచింతలేని సౌహార్దశీలిరా.......వదలకయ్యగురువు26


ధనము నాశజూప తలవంచడాతండు

పసిడి కాన్కలీయ పట్టువడడు

సతము మనము జూడ  స్వార్ధరాహిత్యమే....వదలకయ్యగురువు27


పాఠ్యవిషయములకె ప్రాధాన్యమీయక

సంఘసేవ కరుణ స్వచ్ఛగుణము

ముఖ్య మంచుదెల్పు పూర్ణ విజ్ఞానిరా........వదలకయ్యగురువు28


శిష్యుడెందమందు చెరగనిదైవమై

స్థిరత నిల్చుమహిని క్షేమకరుడు

గురువునకును నెవరు సరిరారు ధరలోన.....వదలకయ్యగురువు29


శిష్యుచెంతకేగి శిరమును నిమురుచు

కష్టకాలమందు కలసియుండు

మానవోత్తముండు మామంచి గురువురా....వదలకయ్యగురువు30.*

తల్లిదండ్రి మురిసి తనువుప్రసాదింప
గురువు కరుణ జూపి, కొదువలేని
జ్ఞానభిక్ష నిడుచు కలలు నిజముచేయు.....వదలకయ్యగురువు31

తల్లిదండ్రులొసగు ధనమది కరుగును
బంధుగణములిచ్చు పసిడితరుగు
కరుణ గురువులిడెడు జ్ఞానంబునిత్యమౌ.....వదలకయ్యగురువు32

మంత్రికైన ముఖ్యమంత్రికైననుగాని
వైద్యునకును కళలవేత్తకైన
చిన్నతనమునుండి శిష్యత్వమే దిక్కు......వదలకయ్యగురువు33

ఆదిశంకరార్యు డార్షధర్మంబును
కలియుగాన నిల్పె కరుణతోడ
వారివారసుండె వసుధ సద్గురువయ్యె........వదలకయ్యగురువు34

మౌనముద్ర నుండు మహితతేజోరాశి
అత్రిసూతి పరమహంసయైన
దత్త వారసుండు ధన్యుండు గురువురా....వదలకయ్యగురువు35

లౌకికంబు పారలౌకికంబనురెండు
పద్ధతుల గురువులు బరగుచుంద్రు
పారలౌకికమున పరమాత్ముడొక్కడే......వదలకయ్యగురువు36

బ్రహ్మ విష్ణు భవులు బాహ్యరూపములందు
వేరుగ కనిపించు వేరుగాదు
వీరి శక్తులెల్ల తేరిచూడ గురువె.......వదలకయ్యగురువు37.

ప్రకృతి లోన నిశిత పరిశీలనంబున
జీవుల గతులెల్ల చిత్రమగును
వాని జీవనవిధి వరలె గురువుగాను......వదలకయ్యగురువు38

చీమమోయు బరువు సీమనేదాటుచు
రెండుపదుల రెట్లు మెండు శక్తి
అదియె మనకు నెప్పుడాదర్శమౌనుగా.....వదలకయ్యగురువు39

తేనెటీగ పొదుపు తీయనౌ మదుపును
శ్రమయు త్యాగగుణము సంఘటితము
వర్తనాన జూపి వరలెను గురువుగా.........వదలకయ్యగురువు40

వదలనట్టిపట్టు పనివడినేర్పును
నుర్విలోనజీవి ఉడుమనంగ
కార్యసాధనకది ఘనమైనగురువుగా...వదలకయ్యగురువు41*

నంది పట్టుదలను నైతికవిల్వలన్
ఈశుతత్త్వము పరమేశు కరుణ
గుర్తుజేయు మనకు గురువుగా సతతంబు....వదలకయ్యగురువు42

రామసేతు వపుడు రాముని సేవకై
నలుడు కట్టె నాడు నయముగాను
కార్యశూరుడౌచు కనిపించు గురువుగా.....వదలకయ్యగురువు43

సాలెపురుగు స్వీయ శ్రమనంత కరిద్రుంచ
మరల నల్లె భవుని శిరముపైన 
పట్టుదలను నేర్పి పనివడి గురువాయె.....వదలకయ్యగురువు44.

ఎదుగుదలను జాటు నెత్తైనశిఖరంబు
గురుపదంబునందు గుణమునందు
సద్గుణనిధి సారసాక్షుని రూపమే......      వదకయ్య గురువు45*

కరము నుండి నాగు శిరమును దూరంగ
భవుని కొఱకు దాని బలిగనిచ్చె
భక్తితత్త్వమునను భాసిలె గురువుగా.....వదలకయ్యగురువు46

వృక్ష జాతి మనకు వేవేల రీతుల
పాఠములను జెప్పె పచ్చి నిజము
గురువు స్ధానమందు గొప్పగనిల్చెగా ......వదలకయ్యగురువు47

సర్వజీవులకును శ్వాసకు మూలమై 
ప్రాణవాయువు నిడు వసుమతిజము
యోగగురువు పగిది నుత్సాహమింపార....వదలకయ్యగురువు48*

కడలి యలల జూచి కార్యశూరత్వంబు
నేర్వవలయు సతము నిష్ఠతోడ
నాచరించి చూపు నార్యుండె గురువగు....వదలకయ్యగురువు49

గునపములను దింపు క్రూరాత్ముకైనను
పరమకరుణతోడ ఫలితమిచ్చు
పుడమి గురువనంగ మోదంబుగల్గదా....వదలకయ్యగురువు50*

పాత్ర ననుసరించి పరిణామముంజెందు
లౌకికంబు జూపు లక్షణంబు
నేర్పె,  జలము మనకు నిర్మల గురువౌను....వదలకయ్యగురువు51

అగ్ని శక్తిజూడ నసమానమై తోచు
జలధిని బడబాగ్ని కలచివైచు
కానరాని ప్రతిభ గౌరవ గురువుదే....          వదలకయ్యగురువు52

గాలి వలన సతము క్రమమైనరీతిగా
ప్రాణి యనుభవించి బ్రతుకుచుండు
శ్వాసజీవమైన  చక్కని గురువయ్యె........  వదలకయ్యగురువు53

నభము శూన్యమైన నక్షత్రదీప్తంబు
సర్వముండి తాను గర్వపడదు
జ్ఞానధనుడు సతము గౌరవ గురువౌను.....వదలకయ్యగురువు54

ఎదుటనున్న గాని ఎదుట లేకనుగాని
జ్ఞానమిచ్చువాడు ఘనగురుండు
ఉత్తముండు ధర మహోన్నతుండు కనగ.....వదలకయ్యగురువు55

ఏకలవ్యు డొకడహీన సమాసక్తి
శస్త్రవిద్య నేర్చె స్వయముగాను
మనసునందె ద్రోణు మరిమరి పూజించి.....వదలకయ్యగురువు56

గురువు గొప్పదనము కులమందు లేదురా
శిష్యహృదయసీమ చేర; పొందు
కులము మతములన్ని గొప్పకు మాత్రమే....వదలకయ్యగురువు57

తండ్రి తనయుగోరు తనుమించు వానిగా
గురువు శిష్యు గోరు గొప్పగాను
స్వార్థ బుద్ధిలేని సౌమనస్యుడతండు..........వదలకయ్యగురువు58

ముక్తిగోరు నరుడు ముందు సద్గువును 
నెంచుకొనగవలయు నిచ్ఛతోడ
ఆత్మతత్త్వమంత నాతడే చూపురా.........వదలకయ్యగురువు59

గురునిచెంత నేర్వ గొప్ప విద్యేయగు
గురువు లేని విద్య గ్రుడ్డివిద్య
జీవితాన గురువు శ్రీరామ రక్షరా...........వదలకయ్యగురువు60*

అక్షరంబునేర్ప శిక్షణాలయమందు
కఠినమైనగుణము కనగజేయు
గురువు మనసునందు కోపంబు నటనరా....వదలకయ్యగురువు61

అక్షరాలలోని అంతరార్ధములన్ని
విప్పిచెప్పు గురువు  వేదవేత్త
శిష్యవత్సలుండు శ్రేయోభిలాషిరా......     వదలకయ్యగురువు62

లక్షలెన్ని యిచ్చి లౌక్యంబుజూపినా
గురుని కరుణ నీకు కుదురబోదు
భక్తి భావమొకటె భవ్యమంత్రమ్మురా........వదలకయ్యగురువు63

శిష్యవత్సలునిగ క్షేమంకరునిగాగ
మార్గదర్శకత్వ మౌనియనగ
భిన్న వేషధారి భేషైన నటుడురా...........వదలకయ్యగురువు64

మైనమట్లు కరగి మమత సమతలంచు 
కరుణనింపుకొన్న కాంతిరేఖ
దివ్య సాధుభావ దీప్తుండు గురువురా...........వదలకయ్యగురువు65

చిత్తమందు ప్రేమ చిగురించు రీతిగా
విత్తనంబునాటు విబుధుడైన 
కర్షకుండు గురువు హర్షాంతరంగుండు.......వదలకయ్యగురువు66

చేతి వ్రాత మరియు చిత్తంబుమార్చుచు
చిన్ని గుండె లందు చిగురుదొడుగ
జ్ఞానభిక్ష నిడెడు సౌమ్యుండు గురువురా........వదలకయ్యగురువు67

భావిజీవితంబు బంగరుబాటగా
చూడవలదటంచు సూక్తులిడుచు
ముందుచూపు నేర్పు మునిరూపు గురువురా....వదలకయ్యగురువు68

కాలచక్రమందు కరిగినక్షణములు
రావురావటంచు రక్తిదనర
శక్తి కొలదిజెప్పు శాస్తయె గురువురా........వదలకయ్యగురువు69

మహిత లక్ష్యములనె మరిమరి కోరుచు
కలలు గనుచు నీవు కాంచుమనుచు
లక్ష్యసిద్ధిజూపు లౌక్యండు గురువురా........వదలకయ్యగురువు70*

ఈసడించి పలికి యిందీవరాక్షుండు
గురుని శాపమొందె ఘోరముగను
కన్నుగానకెపుడు కలహింపబోకురా......వదలకయ్యగురువు71

గురుని మోసగించి కుపితుని జేయకు
కర్ణుడట్లుజేసి కఠినశాప
మందె; విద్యమరచి యవమానితుండయ్యె.......వదలకయ్యగురువు72

అర్జునుండు పొందె నద్వితీయపుటస్త్ర
విద్యలన్ని భక్తి వినయగరిమ
గురువుద్రోణుమదిని  కోర్కెల దీర్చెను....వదలకయ్యగురువు73

కన్నవారికన్న మిన్నగా జూచును
మనసునిండ ప్రేమ మమతపండ
విశ్వమెల్ల గెల్చు విద్యనేర్పు గురుండు.......వదలకయ్యగురువు74

పారితోషికంబు పనిలేదు నాకని 
పట్టుదలకె గురువు పరవశించి
అక్షరంబు నేర్పు నల్పసంతోషిరా.......వదలకయ్యగురువు75

పాఠములనెకాక పరిపరి విధముల 
అనుభవాలసార మందజేయు
సాంద్రయశుడు గురుడు సాగిలిమ్రొక్కుమా ..వదలకయ్యగురువు76

కష్టమన్న జాలు కరుణాంతరంగుడై
పేదవారికెపుడు పెన్నిధియగు
సంఘసేవకుండు సాక్షాత్తు గురువురా.......వదలకయ్యగురువు77

బ్రహ్మ పగిది నూత్న పథమును సృష్టించు
విష్ణువు వలె దాని విపులపరచు
శివునిరీతి దొసగు చిదుముచుండు గురువు..వదలకయ్యగురువు78

చిక్కుప్రశ్నలెన్ని చిన్నారి వేసినన్
తృప్తిపరచు మదికి తీయగాను
జ్ఞాని ప్రశ్నవేయ జ్ఞానియై వర్తించు........వదలకయ్యగురువు79

విద్య నేర్పు ననువు వేర్వేరు విధముల
పాఠశాల గదిని వాడుకొనెడి
సున్నితత్త్వమున్నశోధకుడుగురువు.....వదలకయ్యగురువు80.*

పాదరసము వంటి ప్రతిభను సతతంబు
దాచుకొనక గురువు తపసివోలె
ప్రేమనంత పంచు ప్రియశిష్యపాళికే.........వదలకయ్యగురువు81

శిష్యగణము గలసి శ్రీగురుభక్తిమై
సర్వెపల్లిరథము సంతసాన
లాగి పరవశించె యోగంబుతమదిగా......వదలకయ్యగురువు82

కాళికాంబపాద కమలార్చనావిధిన్
రామకృష్ణ గురుడు రహినివెలిగి
నవ్యతేజమిడెను భవ్యనరేంద్రకున్...........వదలకయ్యగురువు83

రాగదూరుడైన రామకృష్ణునిజూచి
పిచ్చి వాడెయనిరి పచ్చిగాను
పరమహంసగురువు భావివిజ్ఞానిరా..........వదలకయ్యగురువు84

పుణ్యజలముజేయు బురదనీటినిగూడ
చిల్లగింజదాని చెడునువిరచి
అట్టితత్త్వమెప్పుడాచార్యునకునుండు.........వదలకయ్యగురువు85

కల్మషంబులున్న కటికనీటినిగూడ
పటిక మార్చివేయు స్వచ్ఛముగను
పటికవంటివాడె పరమ గురుండురా!.............వదలకయ్యగురువు86

చిత్తమెపుడు తనదు శిష్యునిపైనుంచి
తలచిన వెనువెంట పలుకువాడు
తలపు తలపునందు తానైనతండ్రిరా...........వదలకయ్యగురువు87

శిష్యుడెప్పుడైన చీకాకుజెందుచు
గురుని నిందసేయు గుఱ్ఱుగాను
కనలిన తన శిష్యు కౌగిలిజేర్చురా..................వదలకయ్యగురువు88

ఇనుమువంటిశిష్యు డెక్కడున్ననుగాని
కర్షణంబుజేసి కౌగిలించు
శుద్ధసత్త్వగురువు సూదంటురాయిరా..............వదలకయ్యగురువు89

డాంబికంబులేదు డాబునులేదులే
ధిషణ యొక్కటున్న తృప్తిపడును
ధిషణగల్గు గురువు దీపస్వరూపుండు.............వదలకయ్యగురువు90*

శ్రుతియె మహిత గురుడు శుద్ధ సంస్కృతి నిల్ప
భరతదేశమందు పండితులకు
పరమపూజ్యమదియె పాటించు జ్ఞానివై..వదలకయ్యగురువు91

గ్రహ సమూహమునకు రవియె రాజైనట్లు
కాలగతిని శిష్యగణమునకును 
క్రాంతిదాత గురుడు ఘనమైనశక్తిరా...వదలకయ్యగురువు92  

బుద్ధి గురువు పగిది పుట్టించుయోచనల్
మనసు దానిత్రోవ మసలుకొనును
ఆత్మశుద్ధి గల్గు నయ్యదె గొప్పదౌ......వదలకయ్యగురువు93

ఆర్ధశాస్త్ర నిపుణుడాత్మీయ గురువైన
శ్రీలుగురిసి మురియు శిష్యులెల్ల
కామధేనువింట కాలూనినట్లెగా..........వదలకయ్యగురువు94

మూడుకన్నులున్న ముక్కంటి కాదులే
నాల్గుమోములున్న నలువకాదు
వేయిశిరములున్న విష్ణుతల్పంబురా....వదలకయ్యగురువు95

కావ్యపరిమళాలు కమ్మగవీచినన్
రససమన్వయంబు రక్తిగొన్న
ఖ్యాతిదెచ్చుదాని కావ్యాత్మ గురువుగా..వదలకయ్యగురువు96

పాలునీరు వేరుపరచంగ శక్తిని
హంస కలిగియుండు నవనియందు
మరలనట్టి ప్రతిభ గురునకే కలదోయి.....వదలకయ్యగురువు97

కలిమహత్తుచేత మలినమ్ము గాకుండ 
ప్రజలగాచుచుండు  పరమ గురువు
పూజ్యపాదుడతడు పుణ్యాలరాశిరా....వదలకయ్యగురువు98

శోకసంద్రమందు సోలినశిష్యుల
గుండెధైర్యమింత  కూడగట్టు
కోటగోడపగిది గురువు రక్షణనిచ్చు.. వదలకయ్యగురువు99

సహనగుణముజూడ సరితూగు గురువుగ
ధర్మజుండు దాని తప్పలేదు
కష్టమెంతయైన కౌరవసభలోన....వదలకయ్యగురువు100*

కన్నుదోయి లోని కమనీయమైనట్టి
కాంతిరేఖ గురువు కనగనిజము
కాంతిలేని కనులు  కడుదుర్భరంబురా........ వదలకయ్య గురువు.101

కన్నులెఱ్ఱజేసి క్రౌర్యంబుజూపుచు
ఆ "కరోన" మనల నావహింప
వైద్యులెల్లమనకు వరదాయిగురువులే............వదలకయ్యగురువు102

అంతరిక్షశాస్త్రమాపోశనముబట్టి
రాష్ట్రపతిగజేసి రాణకెక్కె
అమరగురుడు ప్రియతమాబ్దుల్కలాముండు..వదలకయ్యగురువు103

నీ కుశాగ్రబుద్ధి నిర్మలాత్మ నియతి
గురుకటాక్ష భిక్ష మరువబోకు
జన్మజన్మలకును జాగృతి గురువురా............వదలకయ్యగురువు104

మోక్ష సాధనకిల సాక్షియే గురువయి
నీదు మతిని నిల్పు నిశ్చలగతి
నీకె నిన్నుజూపి నివ్వెరపరచురా...............వదలకయ్యగురువు105

నూరు మార్గములను తీరుగ జూపించు
దివ్యతేజకలిత భవ్యగురువు
నవ్యభావయుతుడు నవనవోన్మేషుండు........వదలకయ్యగురువు106

కన్నుదోయి కరుణ కలిగియుండెడువాడు
గుండెనిండ ప్రేమ కురియువాడు
స్వార్ధరహితజీవి స్వాభిమానుండురా..........వదలకయ్యగురువు107

నీదుగుండెగుడిని నిర్మలాత్ముగురువు
నీరజాక్షుపగిది నిల్పుకొనుము
సద్యశంబు సిరులు సౌఖ్యాలుదక్కులే...........వదలకయ్యగురువు108

ఆర్యభట్టు భారతావనియందున
శూన్యమునకు తగిన మాన్యతనిడి
విశ్వమందువెల్గె విఖ్యాత గురువుగా............వదలకయ్య గురువు.109

కంప్యుటరున ముఖ్య గణనంపుకేంద్రమై
శూన్యమొకటి వెల్గె సుందరముగ
అది గురువయి  దానికంతరాత్మగమారె......వదలకయ్య గురువు110

వివిధ దేశములకు విజ్ఞానదాతలౌ
జ్ఞానవిదులగన్న కర్మభూమి
నాటిగొప్పగురువు నాగార్జునుండెగా........    వదలకయ్య గురువు 111

రామునంతవాని రఘుకులశూరుగ
కనగజేసె నాడు కౌశికుండు
గుట్టుమట్లు తెల్పు గురుదేవుడాతండె........  వదలకయ్య గురువు 112

విక్రమార్క సభను విఖ్యాతి జెందిన
సుందరోపమాన సుకృతి యైన
కాళిదాసు మనకు కవికులగురువురా.........  వదలకయ్య గురువు 11౩

అంకెలాకసమున నసమాన చంద్రుడై
అవని వెల్గిన గణితావధాని
సకలజగతి గురుడు సంజీవరాయడే.......     వదలకయ్యగురువు 114
(లక్కోజు సంజీవరాయశర్మ.పుట్టంధుడు. కడప జిల్లా కల్లూరు.22.11. 1907.. 2.12.1997. ప్రపంచంలో 6 వేల గణితావధానాలు చేసిన 
ఏకైక వ్యక్తి.) 

బ్రహ్మగుప్తనామ భారతీయగణిత
శాస్త్రవేత్త మనకు సద్గురుండు
" పెల్"సమీకరణము పేర కీర్తి బడసె.....      వదలకయ్యగురువు.115
(గణితశాస్త్రంలో సమీకరణ సాధన..డయోఫాంటైన్ సమీకరణాలలో ఒక ప్రత్యేకమైన తరగతి. బ్రహ్మగుప్తుడు సా.శ.628.సమాస పద్ధతిని సాధించాడు.

చక్రవాళ మనెడు చక్కని పద్ధతిన్
గణితమందు జూపె ఘనుడు భాస్క
రుండు సారతర గురుండమల యశుండు..  వదలకయ్యగురువు116.
(భాస్కరాచార్యుడు.సా.శ.1150.చక్రవాళ పద్ధతిని సూచించారు.
ఆధునికకాలంలో  ఈ సమీకరణాల సాధనకు "సతతభిన్నవాదము"ను
వాడుతారు.)

బేతవోలు గురుని ప్రియతమ సూచనన్
ఆటవెలది పాదమందుకొనుచు
శతకమల్లినాను శక్త్యనుసారంబు............ వదలలేదు గురువు .117

అంకితంబు శతకమాచార్యవర్యుకున్
పాదపూజ ప్రథిత పండితునకు
నర్పణంబు మదిని ఆత్మీయగురువుకున్....వదలలేదు గురువు118.







12, సెప్టెంబర్ 2024, గురువారం

అన్యోన్యానురాగం

అన్యోన్యానురాగం 

వాసము పల్లెటూరు పరివారమొ కండును లేని యింటిలో 

మా ; సములెవ్వరంచు పరమాత్ముని నమ్మిన వృద్ధ దంపతుల్ 

గ్రాసము స్వీయ సత్కృషిగ గౌరవ మొప్ప కృషీవలత్వమున్ 

వాసి గలట్టి రీతి' ప్రియ వారణ శీర్షుని పర్వమందునఁన్ ... 

దాసిగ మారి నే పలు విధంబులఁ తీయని వంటకంబులన్ 

గాసులకోర్చి జేసితిని కమ్మని ప్రేమ ప్రపూర్ణ తత్త్వమున్ 

జేసితి నేతి  గారెలను చిన్మయ రూపు  నివేదనార్ధమై 

దోసిలిబట్టు మామ! కడు \తోషణ మందగ తిందువంచనెన్...

బోసిముఖంపు నవ్వులను పూర్తిగ నిండిన పంక హస్తముల్ 

భాసిలఁ జూప భార్య నిజ ప్రాణముగా తినిపించ నాతఁడున్ 

పూసెను రెండు చేతులను బుగ్గలపై తన నిండు ప్రేమతోన్ 

రాసులుగాగ పున్నెమనురాగము పొంగును జీవితమ్ములన్ ... 

హాసము నిత్య సౌఖ్యమయి హాయిని గూర్చును జన్మ జన్మలన్ 

భో! సఖులార! పంచుడిక మోహన రాగ విశేష సంపదల్ 

నాసిరకంపు యోచనలు నైతిక విల్వ ల ద్రుంచివేయు .. స 

న్యాసము కన్నసంసరణ న్యాయముగా సుఖ సాధకంబగున్   

 

 

4, సెప్టెంబర్ 2024, బుధవారం

పాఠాలు..గుణపాఠాలు.

  పాఠాలు..గుణపాఠాలు.

                       నెల్లూరు ప్రయాణం. ది.30.08.2024.(శుక్రవారం)

         పాఠాలు నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా గుణపాఠాలు నేర్వాలి. లేకుంటే ప్రకృతే మనకు నేర్పుతుంది. పాఠాలు నేర్వకపోతే గురువు కోప్పడతాడే గాని ఆగ్రహించడు. కాని ప్రకృతి అలాకాదు. గుణపాఠాలు నేర్చుకోకుంటే తీవ్రంగా ఆగ్రహించి హతమారుస్తుంది. సమయస్ఫూర్తి,  ముందు జాగ్రత్త యీ రెండు ప్రతి విషయంలోను ముఖ్యపాత్ర వహిస్తాయి, ముఖ్యంగా ప్రయాణాలలో.  ఒకచెంప వర్షాకాలం, ఆపై వాతావరణశాఖ భారీ నుండి అతిభారీ వర్షాలు కురువవచ్చునని, ఆ వర్షాలు కూడ ఐదురోజులుండవచ్చునని ప్రకటించింది. మనకు సహజంగా వాతావరణశాఖ అంటే చాల చులకనభావం, చిన్నచూపు ఉన్నది. వారు భారీ వర్షాలని చెబితే తుంపర కూడ పడదని గొడుగు కూడ తీసికొని వెళ్లము. ఎన్నోసార్లు తడిసి ముప్పందుమై వస్తాము. కాని గుణపాఠం నేర్చుకోము. ఇక నా విషయానికి వస్తే వాతావరణశాఖ మాటలను దృష్టిలోనుంచుకొని చలికిబ్బంది లేకుండ హడావుడిగా ‘‘హుడీ’’ వేసుకున్నానేగాని, గొడుగు గాని రైన్ కోటుగాని తీసుకోలేదు మందబుద్ధితో. ఏదైనా అవసరంగాని కష్టంగాని మనకు చెప్పి వస్తుందా? మన అమాయకత్వం, బుద్ధి హీనత కాకుంటే. 

   సికింద్రాబాద్ నుండి సింహపురి ఎక్స్ ప్రెస్ లో నెల్లూరికి 30.08.24  రాత్రి గం.11.లకు బయల్దేరవలసిన బండి 30నిమిషాలు లేటుగా బయల్దేరి నెల్లూరికి ఉ. 9.గం.లకు చేరింది. అచటి మా ప్రోగ్రాం సజావుగనే సాగింది. 31.08.24 న సంతోషంగా మరల సింహపురి నుండి సికింద్రాబాద్ కు సాయంత్రం 7గం.లకు బయల్దేరాము. అప్పటికి ఏ రకమైన భీకరవర్షం లేదు. అందువలన రైళ్లు రాకపోకల నిలుపుదల , ఎక్కువ లేటు లేదు. మేము 

( నేను( సూర్యనారాయణ రావు), నా భార్య, మా వదినగారు , ఆమె గారి కోడలు, మనుమరాలు ) ప్రయాణీకులము. సుమారు రాత్రి గం. 9.లకు టిఫెన్ , మందుల సేవనము తరువాత నిద్రలోనికి జారాము. బండి తనకన్న ముందు వెళ్లవలసిన బండ్లకు బుద్ధిగా  దారి విడుస్తు, నిదానంగా  నిండు గర్భిణిలా ఆగుతు సాగుతున్నది. ఈ బండి ది. 1.09.24న ఉదయం. గం. 5.30.లకు సికింద్రాబాద్ చేరవలసిన షెడ్యూలు. కాని వరుణదేవుని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విశ్వరూపం చూపించింది. మహబూబాబాద్ లో అత్యధిక వర్షపాతం 49 సెంటీమీటర్లు కురిసి మేము ముందుకేగ వలసిన కె.సముద్రం బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం అయిందనే వార్త ముందుగా చేరి అచటనే ట్రైన్ నిలిపివేశారు. ఆగని వర్షం, నిరంతరాయంగా మేఘాలకు చిల్లులు పడినట్లు , మేము చక్కగా ముఖం కడుక్కొని టిఫిన్ వస్తే తిని టాబ్లెట్సు వేసుకుందామని ఎదురు చూస్తున్నాము. ఎవ్వరు అలాంటివి తేలేదు. కొందరు ఆ వానలోనే ఒకటిన్నర కిలోమీటరు దూరంలో గల  షాపులో బ్రడ్, బిస్కట్సు, అరటి పండ్లు ,వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. భారీ వర్షం, గొడుగు లేదు. ట్రైన్ కు ప్లాట్ ఫారం కు మధ్య ఖాళీ. ఎక్కి దిగాలి.  అప్పడు తెలిసింది గొడుగు, రైన్ కోటు విలువ. తెచ్చుకోనందుకు నాకు నేను సిగ్గుపడుతు , చెంపలు వేసుకున్నాను. నా భార్య ధైర్యంగా 

నేను  తడిసినా పరవాలేదు. ఏది యేమైనా కొన్ని బిస్కట్ పాకెట్స్, వాటర్ బాటిల్స్, తేవాలని నిర్ణయించుకొని బయల్దేరి వెళ్లి తెచ్చింది. అవి తిని టాబ్లెట్స్ వేసుకున్నాము.  అప్పుడనిపించింది. ప్రయాణాలలో , అందునా వర్షకాలంలో తప్పక అందరికి  గొడుగు       ( చిన్నది) లేక రైన్ కోటు ఉండాలని. టాబ్లెట్ల సేవనం తరువాత వేరొక విధంగా, ఏదైనా ప్రయాణ సౌకర్యం ఉన్నదేమోనని ఆలోచించాము. అంతట వాగులు , వంకలు పొంగి, రోడ్ మార్గం కూడ బ్లాక్ అయింది. ఆ ఆలోచన విరమించుకున్నాము. మా బంధువులు మమ్ములను గూర్చి కంగారు పడకుండా వాట్సాప్ లో మెసేజ్ లు పెడుతు వారికి ధైర్యం కలిగించాము. షుమారు గం. 11. ల నుండి పరిస్థితులను తెలిసికొనిన సహాయ , సేవా సంఘాలు ఆహారపు పొట్లాలు, బిస్కెట్ పాకెట్సు, ఉప్మాలు, వాటర్ బాటిల్స్, కావలసినన్ని పంచారు. ఇవి తిన్నన్ని తిని కొంత ముందుజాగ్రత్తగా సాయంకాలానికి దాచుకొన్నాము వేడి వేడి పులిహోర పొట్లాలు . మధ్యాహ్నం సుమారు గం. 1 కి శుభ సమాచారం వచ్చింది. బండిని వెనుకకు మళ్లించి తీసికొని వెళ్లి ఎంత సమయానికైని సికింద్రాబాద్ లో దించుతామని. అలా బయల్దేరిన బండి మరల తరువాత స్టేషన్ లో ఆగింది. ఇంకా కొందరు భోజనం చేయలేదని వారు కూడ చేయటానికి ఆపామన్నారు. స్వచ్ఛంద సంస్ధ వారు పెద్ద పెద్ద డేగిశాలతో బిర్యానీ, అన్నం సాంబారు తెచ్చి పెట్టారు. ప్రయాణీకులు వాటిని ఊదిపారేశారు. అదే సమయానికి ఆ స్టేషన్ కి మద్రాసు..బీదరు బండి వచ్చింది, రెండు బండ్ల ప్రయాణీకులు. ఇక చెప్పేదేముంది. కోలాహలమే. ఆ స్టేషన్ ఒక అన్నదాన సత్రంగా భాసించింది. అందరు ‘‘ అన్నదాత సుఖీభవ!’’ అని వారిని దీవించారు. అన్నం పంచుచున్న వారి కన్నులలో ఆనందం వర్ణనాతీతం. ఏది యేమైనా ప్రతి వ్యక్తి సమయం వచ్చినప్పుడన్నా మానవత్వం చూపాలి. తీసుకొనే దానికన్న ఇవ్వటంలోని ఆనందాన్ని అనుభవించాలి. ఎంత సంపాదించినా పిడికెడు మెతుకులు మ్రింగగలడేగాని , ఎవడును మెరుగు బంగారము మ్రింగబోడు. ధన పిశాచమావహించిన కొందఱు మూర్ఖుల కీ విషయం ఎందుకు తెలియదో ఆ భగవంతునకే తెలియాలి. ‘‘ దాన గుణపు గుండె దైవ నిలయమ్మురా, విశ్వనరుడ నీవు వినుము సుంత.’’

   అలా వెనుకకు మరలి ప్రయాణించుచున్న సింహపురి ఎక్స్ ప్రెస్ ది. 2.09.24 ఉ. 5.30. లకు సికింద్రాబాద్ చేరి మాటనిలబెట్టుకుంది. ప్రకృతిని కాపాడుకుంటే అది మనలను కాపాడుతుంది. దానిని నాశనంచేస్తే మనలను సర్వనాశనం చేస్తుంది.  మన చెత్త మనసులను శభ్రం చేసుకొని చెత్తా చెదారాలను నిర్దిష్టమైన ప్రదేశాలలోనే వేసి మానవతను చాటుదాం. ప్రకృతిని ప్రేమించుదాం, కొంచెం ముందుచూపుతో మసలుదాం. నా భావాలు మీకు నచ్చితే సంతోషంగా పాలు పంచుకోండి. ‘‘ సర్వే జనాః సుఖినో భవన్తు!’’

 మల్కాజిగిరి,                  పొన్నెకంటి సూర్యనారాయణరావు. 

భాగ్యనగరం                              9866675770, 6300985169.   

                                                      


3, ఏప్రిల్ 2024, బుధవారం

ఉపనయనాశీస్సులు. నూతి రాజగోపాల కృష్ణమూర్తి. ఉపనయన ఆశీస్సులు.

  నూతి రాజగోపాల కృష్ణమూర్తి. ఉపనయన ఆశీస్సులు. 13.04.25.

ఓంకారమ్మను శబ్దము

ఝంకారము సేయవలయు సతతము మదిలో

హుంకారములెల్ల తొలగి

సంకాశమ్మగును నీకు శౌరి పదమ్ముల్.1

.ద్విజుడవైతివి గాయత్రిదేవి కరుణ

నూతి రాజగోపాలుడా! నూత్నముగను

అమ్మపాదాలు సేవింప నహరహమ్ము

వేదవేదాంత భావాలు విదితమగును. 2.

గాయత్రి మంత్రరాజము

ప్రాయంబున నేర్చుకొనిన ప్రజ్ఞలు పెరుగున్

శ్రేయంబు కోరి వచ్చును 

‘‘ఓయీ గోపాలకృష్ణ ఉత్తమ వటువా! 3.

దైవ బలమును మించిన ధనములేదు

ధర్మ నిష్టను మించిన తపములేదు

మాతృసేవను మించిన మతములేదు

మరువబోకుమ" గోపాల!"మహిత తేజ!.4.

ఉపనయన మను క్రతువు మహోన్నతంబు

జ్ఞానసాధన కది జైత్రయాత్ర

భారతీయార్ష ధర్మంబు సారతరము

చేవను యశము నిచ్చెడి జీవగఱ్ఱ.5.

  చిరంజీవి నాగవేంకట సాయి శ్రీకేయూర్ శర్మకు

శుభాశీస్సులు. ది. 28.03.2024. ఉ. గం.8.20.లకు. 

ఓంకారమ్మను శబ్దము

ఝంకారము సేయవలయు సతతము మదిలో

హుంకారములెల్ల తొలగి

సంకాశమ్మగును నీకు శౌరి పదమ్ముల్.1.

ద్విజుడవైతివి గాయత్రిదేవి కరుణ

"సాయి వేంకట కేయూర శర్మవర్య!

అమ్మ పాదాలు వదలకు ననవరతము

వేదవేదాంతభావాలు విదితమగును.2.

నంబూరి వంశ ద్విజుడవు

కంబుగ్రీవుని కరుణను ఖ్యాతిని గనుమా!

సంబరమందగ సర్వులు

అంబరమును నందుమయ్య అతులిత ప్రజ్ఞన్.3.

గాయత్రి మంత్రరాజము

ప్రాయంబున నేర్చుకొనిన ప్రజ్ఞలు పెరుగున్

శ్రేయంబు కోరి వచ్చును 

ఓయీ కేయూర వటుడ! సాయికుమారా!.4.

తల్లిదండ్రులు తాతలు తనివిజెంద

జ్ఞాన సముపార్జనంబును సలుపుమయ్య

దాని మించిన సంపదల్ ధరణిలేవు

ఓయి!కేయూర!వినుమయ్య సాయితేజ!.5.


       చిరంజీవి నాగ శ్రీకర అద్వైత్ ఉపనయన

 సంస్కార మహోత్సవ సం.న అక్షరాక్షతలు (డి.ఆర్.కె.మనుమడు)

              సుముహూర్తము: 03.04.2024. బుధవారం ఉ: గం.7.44. ని.లకు.

శ్రీల గురియించు చిన్మయ చేతనంబు

నాల్గువేదాల వారాశి నలువరాణి

నిత్య శుభములె వరముగ నిలచునటుల

బ్రోచుగావుత! "శ్రీకరు" ముదముతోడ.

"దుగ్గిరాల"వంశ తోషణకర్తయౌ

 "శ్రీకరుండు" వటుడు చిన్నవాని

 "వేదమాత"సతము విజ్ఞానదీప్తులన్

  మేధకందజేసి మేలుగూర్చు!

మహిత గాయత్రి మంత్రంపు మర్మమెరిగి

నిత్యసాధన జేయుమ!నీమమలర

సకల విజ్ఞాన శాస్త్రాల సారమబ్బి

"శ్రీకరాద్వైత" శుభములు చెలిమిజేయు. 


చిరంజీవి అన్నాప్రగడ ఆస్తీక్ అభిరామ్ శర్మ

ఉపనయన సంస్కార మహోత్సవ శు.స.న

                   శుభాశీస్సులు.

సుముహూర్తము: ది. 12.04.2024.శుక్రవారం

         ఉ. 9.29. ని.లకు.

వేదవేదాంత విద్యలు విశదపఱచి

జ్ఞాన నేత్రమ్ము దెరిపించు జనని నీకు

నిత్య పారాయణమ్మున నిన్ను మెచ్చి

కాచుగావుత!"అభిరామ! కరుణతోడ.1.

గాయత్రి మంత్ర విలువలు

ప్రాయంబున నేర్చుకొన్న బహువిధ విద్యల్

శ్రేయంబుగూర్ప నబ్బును 

ఓయీ!చిరజీవి పౌత్ర! ఉన్నతవంశా!.2.

భరతభూమిన జననంబు పరమవరము

అందు విప్రుని జన్మంబు పొందుటన్న

ఎన్ని జన్మల పున్నెమో యెరుగలేము

దాని సార్ధక్యమొందించు ధర్మనిరతి.3.

దైవ బలమును మించిన ధనములేదు

ధర్మ నిష్టను మించిన తపములేదు

మాతృసేవను మించిన మతములేదు

మరువబోకుమ" ఆస్తీక!"మాన్య వటుడ!.4.

వంశ గౌరవమంతయు వసుధయందు 

తానె సృష్టించుకోవలె తనివిదీర

దాని మూలంబె ధర్మంబు,  తప్పవలదు. 

"ఆస్తికాభిరామ!"వటుడ! అమలహృదయ!.5.

23, మార్చి 2024, శనివారం

శ్రీరామ తత్త్వం.

 శ్రీరామ తత్త్వం.

శరణు గోరిన బద్ధ శత్రువునైనను

               కాపాడి తీరెడు ఘనుడెవండు?

ధర్మంబె జెప్పుచున్ దానవి పాటించి

             ఆదర్శమూర్తియై యలరెనెవడు?

పితృవాక్పాలనన్ ప్రియమారపాటించి

      తండ్రి మాటనుగాచు తనయుడెవడు?

స్త్రీ జాతి నెల్లరన్ శ్రీ మాతృ మూర్తిగా

            భావించి ప్రేమించు భవ్యుడెవడు?

కష్టసు ఖాలెల్ల కాలప్రభావమన్

            సూక్ష్మంబు నెఱిగిన శూరుడెవడు?

మునిమానసంబుల ముద్దుగా నెలకొని

                  పద్మస్థితుండైన ప్రభువెవండు?

ఆగ్రహించినవేళ నఖిల లోకంబుల

             నంతంబు గావించు నార్యుడెవడు?

స్నేహాంతరంగుడై చిరుకాన్క కౌగిలిన్

                        చిరజీవి కిచ్చిన శ్రేష్ఠుడెవడు?

పూర్ణచంద్రుపగిది పున్నమి వెన్నెలల్

మోముపైన జిలుకు మోహనుండు

రాముడొకడె సూ ప రాక్రమవిక్రమ

సూర్యవంశభవుడు సుందరుండు.

పెండ్లి ఆశీస్సులు

 కల్యాణ వాణి...అనూరాధ కుమార్తె.

వధువు:చి.ల.సౌ.ఉజ్జ్వల. వరుడు:చి.వినయ్మణికంఠ రాజా.

సుముహూర్తము: ది.24.03.2024. ఉ.8.03.ని.లకు.

వధూవరులారా!

శ్రీ రఘురాము సత్కృపను శేముషినందుడు మీరలిర్వురున్

సారవిశేష సంసరణ సౌఖ్యములందనివార నందుచున్

కూరిమిబెంచుకొంచు సుమకోమల భావ సమాశ్రయంబునన్

భూరి మహోజ్జ్వల స్థితియె భూషణమైచెలగంగ వంశమున్.1.

      "వినయమణికంఠు"డెందాన విజయకేత

       నంబెగురవేయు"ముజ్జ్వల!" నవ్యరీతి

       భావి సంసార జీవిత పథమదంత

       మూడుపూలారు కాయలై మోదమలరు.2.

పచ్చని మండపాన కడుపావన వేదవిశేష ఘోషలో

నచ్చిన "రాజు"నీ మెడను నాణెపుసూత్రము గట్టుచుండగా

హెచ్చిన రాగభావముల హేలగ పండితదీవనాళిలో

మెచ్చగ బంధువర్గమిట మీరలుసాగుడు జీవనమ్మునన్.3.

         రెండు వంశాల కీర్తులు పండునటుల

         మూడు ముడులున్న బంధాన ముచ్చటలర

         నాల్గు వేదాల సాక్షిగా నవ్యశోభ

         పంచప్రాణాల నొక్కటై పరగుడయ్య!.4

వంశ వృక్షంబు చిగురించి వైభవముగ

ఫలములీయగ మీరలు తలచినటుల

పూర్ణ సంసారజీవిక మోదమగుచు

శతవసంతాలు భద్రాన సాగగలరు.5.

 వధువు.                                             వరుడు

    చి.ల.సౌ. సాయిహర్షిణి.            చి. యశ్వంత్ భరద్వాజ్. 
     ముహూర్తము. ది.22.02.2023.(బుధవారం) 
     రాత్రి గం. 3.21.ని.లకు. తెల్లవారితే గురువారం. 

               శ్రీలకు నాలవాలమగు చిన్మయు శ్రీరఘు రామువేడినన్
               వేలకు వేలపున్నెములు వేగ లభించి మనోహరంబగున్
               జాలము సేయకన్ కరుణ చక్కగజూపెడు దైవసన్నిధిన్
               వ్రాలుమ "సాయిహర్షిణి " సభర్తృక వై సుఖభోగలబ్ధికై.1.

        యాబలూరి వంశ అనురాగవల్లికి
        కొమ్మమూరివంశ కొమరునకును
        బంధనమ్ముగూర్చె వాణీధవుండట
        సప్తపదులు వేయ సౌఖ్యమలర.2.

        క్షీర నీరాల పగిదిని చెలువమీర
        శబ్దమర్ధాల పోలిక సారమలర
        మీరలిరువురు ఒక్కటై మించుప్రేమ
        వంశ సత్కీర్తి నిల్పుడు వైభవముగ. 3. 

        వేదమంత్రాలసారమ్ము విజ్ఞతముల
        దీవనాదులు ఫలియించి దివ్యఫలము
        సంతురూపాన బొందుడో సౌమ్యులార!
        వంశవృక్షంపుచివురులు పరిఢవిల్ల.4.

        గౌతమసగోత్ర సంజాత ఘనచరిత్ర!
        భర్తృ వంశంపు శాఖలు పల్లవింప
        అరుగుచుండెను డెందంబు హ్లాదమొదవ.
        చేరి యాశీర్వ దింపుడో శిష్ఠులార!5.

         ధార్మికంబైన జీవన తత్త్వమెపుడు 
         భావి సౌభాగ్యదమ్మను భావమలర
         మీకు సతతంబు సంఘాన మేలుకలుగు
         రాము పరివార సత్కృపా రశ్మివలన.6. 
  
         పచ్చ పచ్చని యక్షతల్ పైనబడగ
         వెచ్చ వెచ్చని యుచ్ఛ్వాస వెలువరించు
         మచ్చెకంటికి వరునకు మాధవుండు
         రక్షగూర్చుత యిల ననురాగమలర. 7. 
      
            వరుడు.                                                  వధువు
    చి. గంగరాజు శ్రీకాంతు.                   చి.ల.సౌ.సాయిసుధ.
       ముహూర్తము.6.12.19.(శుక్రవారం)ఉ.10.10.లకు.

        శ్రీలకు నాలవాలమగు చిత్తము శ్రీరఘు రామువేడినన్
        వేలకు వేలపాపములు వేగ నశించు స్మరించుమాత్రనన్
        జాలము సేయకన్ కరుణ చక్కగజూపెడు దైవసన్నిధిన్
        వ్రాలుడు దంపతుల్ సతము భవ్యసుఖార్ధులరైచరింపగన్.
               "సాయిసుధ"తోడ ననురాగ సరళిమెలగి
                జీవితాంతము "శ్రీకాంత!"చెలిమిమీర
                భోగభాగ్యాలదేలెడు యోగమంద
                గోరెద సతము శ్రీరాముకూర్మిదయను.
       క్షీరనీరమ్ము పగిదిని చిత్తములను
       మేళవింపు "సుధానాథ!"మేలుజరుగు
       ధర్మదాంపత్యజీవన మర్మమెల్ల
       కన్నులెదుటనె కన్పడు క్రమముగాను.
                 వేదమంత్రాలసారమ్ము విజ్ఞతముల
                 దీవనాదులు ఫలియించి దివ్యఫలము
                 సంతురూపాన బొందుడో సౌమ్యులార!
                 వంశవృక్షంపుచివురులు పరిఢవిల్ల.
       గంగరాజు వంశ ఘనమైన కీర్తిని
       నిల్పుమయ్య నీవు నేర్పుమీర
       తల్లి దండ్రులిలను తపియింత్రు దానికై
       తీర్చుమోయి దాని తీయగాను.
       

                                         నూతి పాణి కుమార్తె.                                      
           వధువు.                       ముహూర్తము:                     వరుడు
     చి.ల.సౌ.రాజావేదవతి. ది.9.12.2020.ఉ.10.01.చి.అనంతకృష్ణతేజ. 
               శ్రీలకు నాలవాలమగు చిన్మయు శ్రీరఘు రామువేడినన్
               వేలకు వేలపాపములు వేగ నశించు స్మరించుమాత్రనన్
               జాలము సేయకన్ కరుణ చక్కగజూపెడు దైవసన్నిధిన్
               వ్రాలుడు దంపతుల్ సతము భవ్యసుఖార్ధులరై చరింపగన్.1.
     "వేదవతి"జూపు విస్తృత ప్రేమవలన
     "కృష్ణతేజమ!" యనురాగ వృష్టిదడిసి
      భోగభాగ్యాలదేలగ యోగమంద
      గోరెద సతము శ్రీరాముకూర్మిదనర.2.
                క్షీరనీరమ్ము పగిదిని చిత్తములను
               "వేదవతికృష్ణతేజ"లు విస్మయముగ
               ధర్మదాంపత్యజీవన మర్మమెరిగి
               కలుపుకొనినను సంఘాన ఖ్యాతి పెరుగు.3.
       వేదమంత్రాలసారమ్ము విజ్ఞతముల
       దీవనాదులు ఫలియించి దివ్యఫలము
       సంతురూపాన బొందుడో సౌమ్యులార!
       వంశవృక్షంపుచివురులు పరిఢవిల్ల.4.
                త్యాగ సంభావ్య సౌశీల్య ధర్మమంత
                వేదవతిగను నీచెంత వెలుగు చుండె
                కంటి వెల్గుగ ఇరువంశ కాంక్షలన్ని
                తీర్చి చూపించుమోయమ్మ! తేజమలర.5.
           

చిరంజీవి హర్షిణి, వెంకటసత్యసాయి ప్రదీప్ లకు
                      వైవాహిక శుభ  ఆశీరక్షతలు
                             
            సుముహూర్తం.ది.4.11.2018.రా.3.58.లకు.
          వేదిక:    ఆర్యవైశ్య కల్యాణ మండపము.       అద్దంకి.

  1. సత్యముధర్మమున్ మరియు సౌమ్య దయార్ద్ర పునీతతత్త్వమే
      నిత్యముశ్రేయమిచ్చునను నీమములన్ గణియించి చెప్పుచున్
      భృత్యులమానసాంబుధిని ప్రీతిని గెల్చెడి"సాయినాథుడే"
      అత్యమలంపు మూర్తులగు"హర్షిణి, సాయిల"కాచుగావుతన్.
   
2.  పచ్చని మండపాన ఘన పండిత వేద స్వరాలఘోషలో
      మెచ్చిన బంధుమిత్రుల యమేయపు సాదర లాలనంబునన్
      స్వచ్ఛపు మానసాన కలశంబున నున్న సుగంగ కైవడిన్
      అచ్చపు ప్రేమపాత్రముగ "హర్షిణి"తోడుత వెల్గుమెప్పుడున్. 

           3.జీవితంబున పెనుమార్పుచేరెనిపుడు,
               వియ్యమనియెడు రూపానవింతగాక
               మమత నిండిన మనసులె మరులుగొల్ప
               వంశవృక్షంపు శాఖలే వరలుచుండు.

            4.అర్హతలతోడ నిర్వురియందు జూడ
               ఒక్కటయ్యెను భావాలు చక్కగాను
               మక్కువెయ్యెడ సతతంబు మరలనీక
               అక్కజంబగు సంతునునందుడయ్య!

            5.తల్లిదండ్రులచిత్తాలు తనివిదీర
               ప్రేమ పండించి నిండించి ప్రియముమీర
              "వే వసంతాలు" ముదమందు విందుతోడ
               మనుడు "పరమేశు దీవనన్" మహితకీర్తి.

                          మంజు కి నిశ్చయ తాంబూలాలు 
                                                              ఆశీస్సులు 
1. తేగీ.  నిశ్చయంబును పల్కిరి యెల్లవారు,అస్తుఅస్తంచు పల్కిరి అమృత ఝరిగ .       
             భావి జీవన సౌఖ్యాలు ప్రభలు నిండ , మనుమ మంజీర విభునితో మహిని నెపుదు. 

2. తే గీ . శుభము శుభమస్తు శుభమస్తు సురుచిరంబు, మంగళంబౌను మామక మానితులకు,
             భావి దాంపత్య సౌఖ్యంబు ఫలితమంది, శ్రీలు గురియును మంజీర చెలునికెపుడు. 
3.తే గీ.   కనులపండువు యగునట్లు కమలనాభు , కృపను మీరెప్దు వృద్ధియై కీర్తినంది,
             మించు సౌభాగ్య సిరులెల్ల మేదినంది, వారలు గావుత ఈ జంట వైభవముగ.  
                                                   పొన్నెకంటి సూర్యనారాయణ రావు . 
అమ్మా, లక్ష్మీ గాయత్రీ!

శ్రీరఘురాము సత్కృపను చిన్మయి భూమిజ రాగమాధురిన్
పేరిమిబంధమేర్పడుచు పెండిలికిన్ రహదారియైచనెన్
నేరుగ కీర్తికాంతుడగు నీ"కిరణున్" హృది జేరుమాయికన్
కోరినకోర్కులెల్ల యొనగూడి శుభంబులు నీకగున్ సదా.1.

ధర్మ బద్ధమైన దాంపత్యజీవిక
భారతీయులకిది పరమవరము
వంశగౌరవంబు వర్ధిల్ల చరియింప
శ్రీలు జేరుమీకు క్షేమమగును.2.

వేదమంత్రాలసారమ్ము విజ్ఞతముల
దీవనాదులు ఫలియించి దివ్యఫలము
సంతురూపాన బొందుడో సౌమ్యులార!
వంశవృక్షంపుచివురులు పరిఢవిల్ల.3.

క్షీరనీరమ్ము పగిదిని చిత్తములను
పదము లందున సద్భావ పథమునెంచి
ధర్మదాంపత్యజీవన మర్మమెరిగి
హాయి మనుడమ్మ సతతంబు రేయిపగలు.4.

తల్లిదండ్రులచిత్తాలు తనివిదీర
ప్రేమ పండించి నిండించి ప్రియముమీర
"వే వసంతాలు" ముదమందు విందుతోడ
మనుడు "పరమేశు దీవనన్" మహితకీర్తి.5.

 భాగ్యనగరం.                   శుభాశీస్సులతో...
 మల్కాజిగిరి.    పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
 9866675770. భాషాప్రవీణ, ఎం.ఏ., తెలుగు.




                                  

20, మార్చి 2024, బుధవారం

డా. రామడుగు, ఆచార్య. బేతవోలు రామబ్రహ్మం . జయరాం, చింతా వార్ల అభినందనలు, సూర్యశ్రీరామం పై.

సూర్యారామం

 డా. రామడుగు వేంకటేశ్వర శర్మ, ప్లాట్ . 201.,సెకండ్ ఫ్లోర్. ఆర్.వి. టవర్స్. శ్రీవేంకటేశ్వర బాలకుటీర్ దగ్గ ర, 2/17బ్రాడీపేట. గుంటూరు. 522002. ఆం.ప్ర. సెల్. 9866944287. 

సీ. రామాయణమెగదా! రాజిల్లు దివ్యమౌ., గాయత్రి మంత్ర ప్రకాశమగుచు రామాయణమెగదా! రాణించును పవిత్ర ., సరసపాత్రల చిత్రశాలయగుచు రామాయణమెగదా! రవణిల్లు రసరమ్య., కర్ణపేశలమైన కవనమగుచు రామాయణమెగదా! రహియించు నైకార్థ., వర్ణాల బింబించు స్ఫటికమగుచు 
 తే. గీ. అరయ రామాయణమెగదా! ఖ్యాతికెక్కు 
 పుడమిలో నిత్య నవ్యతా స్ఫూర్తి నిడుచు
 లోకపుం బోకడల నెల్ల రూపుగొన్న 
 భవ్య రామాయణము గద్యకావ్య రీతి 
 అలరుగాదొకో! ‘‘సూర్య’’ప్రభాత్మమగుచు. 1 
 ఉ. గేయము భావపింఛమయ కేకి యనందగు శ్లోకమే శ్రవః పేయము పుట్టపుట్టు కృతి వెల్గుల నీనెను తెల్గు ‘‘సూర్య నా రాయణు ’’గద్యరూపమవురా! సముదాత్తము గ్రాంథికైక భా షీయముగా పఠింపదగి, శ్రేయమిడున్ దరమే! నుతింపగన్.2
 ఆ.వె. దివ్యమైన ‘‘సాహితీ గవాక్షాం’’ధ్రప్ర భా’’ఖ్య పత్రికన్ ప్రభాత కాంతి స్ఫూర్తిమంతమగుచు‘‘సూర్య"ప్రభ వెలింగె పేర్మితోడ జనుల కూర్మిగొనుచు.3 
 మ. మరువన్ శక్యమె? ఆంజనేయుని సుధీమచ్ఛక్తి, సుగ్రీవు భా స్వరమౌ రాజసభక్తి, ఆ భరతు సౌభ్రాత్రానురక్తి ప్రభల్ వర కైకేయి ప్రయోజనాత్మ భవితవ్య ప్రాభవోద్దీప్తి, యె ల్లరకున్ నిత్యము దర్శనీయమిట ‘‘సూర్యారామ’’కావ్యంబునన్.4 
 ఆ.వె. శిష్ట గాయకుండు, చిత్రకారుండు భా షాప్రవీణ సఖుడు, సరసమూర్తి వ్రాయు రామ కథయె గ్రంథమౌ వేళ ‘‘రా మడుగొ’’సంగు నుతుల నుడుల కడలి. 5

  అభినందన. ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు.

     మిత్రులు శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావుగారు గుంటూరు కె.వి.కె.సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ ఫైనల్ ఇయర్ చదువు 
తున్నప్పుడు నేను ఆ కళాశాలలో లెక్చరర్ గా (1970..71) ఉద్యోగంలో
చేరాను. యేలూరిపాటి అనంతరామయ్యగారు అప్పుడు ప్రిన్స్పాల్. 
క్రొత్తగా చేరిన కుర్ర లెక్చరర్ కి ఫైనల్ ఇయర్ తరగతులు బోధనకు ఇవ్వరు. నాకూ ఇవ్వలేదనే గుర్తు. వీరి తరగతిలో ముద్దా లీలా మోహన రావు, రామడుగు, సూర్యనారాయణ, గుం.శి.కో.రావు, 
ప్రభృతులు ఉండేవారు. వీరి తరగతికి వెళ్లి పాఠాలు చెప్పిన తీపి గుర్తు ఏదీ నాకు లేదు. వీరందరు జ.మా.శ, శ్రీ,శా, కో.సీ.రా, మ.వీ.శ 
(మల్లంపల్లి వీరేశ్వర శర్మ)చెరువు సత్యనారాయణ శాస్త్రిగారు వంటి హేమా హేమీల దగ్గర ఐదేళ్లపాటు విద్యను అభ్యసించారు. 
     వీరందరు నన్ను కూడ గురువుగా సంభావించడం నా పురాక‌ృత శుభాధిక్యం. అంతకన్నా ఇది వీరి ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. అది వీరి గురువుల బోధనలవల్లా వీరి చదువుల వల్లా వీరు చేసిన సాహితీ సాధనల వల్లా వీరికి లభించిందని నా విశ్వాసం. 
     అందున ఈ సూర్యనారాయణరావు గారు శ్రీమద్రామాయణాన్ని ఉపాసించిన భాగ్యశాలి. ఉపాధ్యాయ వృత్తిలో తరించామని సంతృప్తిపడి ఊరుకోకుండా తమ విద్వత్తును అటు సాహిత్యానికి ఇటు సమాజానికి ఉపకారకంగా సద్వినియోగం చేస్తూ గురు ఋణం తీర్చుకొంటున్న సంస్కారవంతులు. నాజరు జీవితచరిత్రను పద్యకావ్యం చెయ్యడం ఒక తరహా సేవకాగా, శ్రీమద్రామాయణాన్ని ఇలా సూర్యశ్రీరామం పేర యథామూలంగా సకల జన సుబోధకంగా ఇతివృత్తానికి తగిన ఉదాత్త వచన రచనాపాటవంతో లోకానికి అందించడం ఋషిరుణ విమోచకమైన పరమపావన సేవ.  
     అందుకని సూర్యనారాయణరావుగారిని మనసారా అభినందిస్తూ వీలుచేసుకొని మరీ ఇలా నాలుగు ముక్కలు రాస్తున్నాను. ఇక్ష్వాకు వంశానికి మూలపురుషుడి పేరు పెట్టుకున్న ఈ సూర్యనారాయణుడు రామనారాయణుడి చరితాన్ని మరీ ముచ్చట గొల్పింది. 
     అలనాడు విశ్వనాథవారన్నట్టు మరల ఇదేల రామాయణం అని ఎవరైనా అడిగితే చెప్పడానికి ఈ సూర్యశ్రీరామాయణంలో చాలా విశేషాలున్నాయి. దృష్టి భేదాన్నిబట్టి ఆయా అనువక్తలు ప్రస్తావించనివీ, అరగొరగా చెప్పినవీ, అన్యథాకరించినవీ, ఇలాంటి విశేషాలెన్నో ఈ వచన రచనలో కనిపిస్తాయి. అనువక్త చాలా జాగరూకుడై భక్తి శ్రద్ధలతో దీన్ని రూపొందించాడు. ఉదాహరణకు ఒకటి మనవి చేస్తాను. 
     గౌతముడు అహల్యను అసలు ఎందుకు శపించాడు?దీన్ని చాలా  
మంది ధైర్యం చాలక దాటవేశారు. అలాగే ఏమని శపించాడు? అనే దానికి కూడా ఎన్నో పాఠాంతరాలు సినిమాలు పాటలును. వాల్మీకి ఆ మహర్షి నోట పలికించిన శాపాన్ని యథాతథంగా మనముందుంచారు ఈ సూర్యనారాయణగారు. కథాపరంగా , సంఘటన పరంగా ఉత్తరకాండతో కలిపి అంతట ఉన్న అనేక విశేషాలను వీరు పాఠకులకు అందించారు. 
    అలాగే   ‘‘పంచోచేల్లోకనాయక;’’ వంటి జ్యోతిశ్శాస్త్ర రహస్యాలనూ,ఆచమనమంటే అర చేతిలో మినపగింజ మునుగునంతటి నీరు తీసికొని త్రాగుట ( మాషమజ్జన పరిమిత శుద్ధోదకాని) వంటి సదాచార విశేషాలనూ, దివ్య వత్సరాలు, మానుష వత్సరాలు వంటి కాల గణన సంప్రదాయాలను అనేకానేకం యథావసరంగా వీరు పొందుపరిచారు. 
     తెలిసిన కథా విశేషమే అయినా , తెలియని కమామిషూలనెన్నింటినో జతగూర్చటం వీరి  ఈ సూర్యశ్రీరామం ఒక విశిష్టతను అవశ్య పఠనీయతను సంతరించుకొంది. ఈ నాటి పాఠకుల తాజా వచన రామాయణాన్ని చదివి చరితార్థులవుతారని ఆశిస్తున్నాను. ఇంతకు మునుపు ఈ రచయిత .. రాయకూడనివి రాసి ఉంటే ఆ దోషం తొలగిపోయి ఈ రామాయణ రచనతో వీరి జన్మ ధన్యమయ్యిందని సంభావిస్తున్నాను. సెలవు. 
                                                                                               మీ బేతవోలు రామబ్రహ్మం.
                                                                                             శ్రీ శోభకృత్తు, కామునిపున్నమి.
                                                                                                     24.03.2024. 

సంకల్ప సిద్ధుడు. జొన్నలగడ్డ జయరామ శర్మ. 

1. శ్రీరామ రామ రామని , నోరారగ సంస్మరింప నుర్వీజనులన్

    చేరును శుభములు కొల్లగ , వారిన్ కాపాడు సతము వైకుంఠుండే.

2. అవని నాదర్శ వర్తన కాటపట్టు , పారమార్ధికమునకును పట్టుగొమ్మ

    శ్రేయదంబౌను జాతికి జీవగఱ్ఱ ,మార్గదర్శక మెపుడు రామాయణమ్ము.!

3.పుణ్యపురుషుల కీభూమి పురిటిగడ్డ, వారి చరితలు జాతికి వన్నెగూర్చు

   పుణ్యభూమిని ధార్మిక బుద్ధి సడల, మారుచుండెను కలియుగ మహిమయేమొ!

4. నీతి మార్గానుసారికి నీడలేదు, మాయదారుల చేష్టలే మన్ననాయె

   పెద్దవారల సుద్దులు పెడకు ద్రోయు, మాయదారుల మార్పు రామాయణమ్ము

5. రామచరితమ్ము నెందరో రమ్యఫణితి, వివిధ సాహిత్య రీతుల వెలయజేయ

   మిన్నకుండక రచియించె ‘‘పొన్నెకంటి’’, ‘‘సూర్యశ్రీరామ’’మను పేర సుకృతమిద్డి.

6. సుఖము శాంతము సౌభాగ్యశోభ దనర, నీతి నియమానుసారాన నెల్లజనులు

    ధర్మమార్గాన వర్తిల్ల దలచి వ్రాసె, రామచరితమ్ము ‘‘సూర్యనారాయణుండు’’.

7. ఆశయాలకు ననువుగా నాదరించి, దయయు సత్యము శౌచము ధర్మబుద్ధి

   వీడకుండగ శ్రీరాము వేడుకొనిన, రామరాజ్యము జగతిని రాకయున్నె?

8. కాలవశమున కాయంబు గాయమైన, వీసమైనను జంకక విసుగులేక

   కౌసలేశుని నామమే శ్వాసగాగ, పూనుకొన్నట్టి రచనను పూర్తిజేసె.

9. ఆదికావ్యాను సరణ పునాది యనుచు, సంయమీంద్రుని పదముల జాడనరసి

   సరళమౌ కథనమ్ము సాగిపోవ, దైవసత్కృప నొందుచు ధన్యుడాయె. 

  నివాసము. కొండాపూర్.                     అభినందనలతో, సాహితీ మిత్రుడు

    చరవాణి.                                             భాషాప్రవీణ, జొన్నలగడ్డ జయరామ శర్మ..

                                                                            విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు. 

మహిత శ్రీసూర్య శ్రీరామమ్.- నవరత్నమాలిక

Inbox


ఓం నమో శ్రీరామాయ.

మహిత శ్రీసూర్య శ్రీరామమ్.

నవరత్నమాలిక.

మిత్రులు శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావుగారు అకుంఠిత దీక్షతో వాల్మీకి రామాయణమును సర్వజనాహ్లాదకరంగా  తెలుఁగు భాషలోనికి సరళమైన శైలిలో అనువదించుట ముదావహము. అవసరమగుచోట కథను కొంచెము వివరించుచు, కథాగమనమును మందగింప చేయునను చోట వర్ణనాదులను తగ్గించి అనువదించి, పండిత పామర రంజకముగానుండుటకై వీరు తీసుకొనిన శ్రమను మనసారా అభినందించుచున్నాను. 


. క్షయమైన మంగళ సమంచిత నామము రామనామమే

రక్షణ సజ్జనాళికని భ్రాంతిననూదిత మాంధ్ర భాషకున్                             

మోక్ష మనోజ్ఞ మార్గముగ పూర్తిగ చేసిరి పొన్నెకంటి స

చ్చిక్షణ మానవాళికిది శ్రీకరమీ కమనీయ కావ్యమౌన్.

 

చ. రుతరమైన సద్గతి ననూదితమైన విధంబు చూడగా

విరిసిన తెల్గు మల్లియసువిస్తర వర్ణన లందు సూక్ష్మతన్,

గురుతర భావనాళికి నకుంఠిత భావ ప్రకల్పనంబునన్,

సురుచిర సుందరాన్వయ సుశోభితమీ యనువాదమెన్నగా.

 

చ. హితులుపామరుల్ కనగ మాన్యతనొప్పెడు సౌమ్యమర్గమున్

సహిత ప్రశంసలందఁదగు చక్కని పద్ధతినాంధ్ర భాష స

న్నిహిత మనోభిరామము వినిర్మితి సత్పరివర్తనోద్ధతిన్,

మహితుఁడు చేసె దీనినిసమంచితరీతిని పొన్నెకంటెయే..

 

. రులై పుట్టిన వారికిన్ దెలియ శ్రీనారాయణుండీ  భువిన్

వరమై రామ కథా నిధానమయి సంవర్ధింపగా జేయఁగా

నిరపేయంబుగ రామనామ సుధనే నిత్యంబు గ్రోలంగ నీ

పరతత్వజ్ఞుఁడు పొన్నెకంటి బుధుడే భక్తిన్ తెనింగించెగా.

 

శా. మోదంబొప్పఁగ జానకీ పరిణయంబున్తెల్గులో నేర్పునన్

శ్రీదంబంచును పొన్నెకంటి మదులం జేరన్ మనోజ్ఞంబుగా

బోధామోదముగాగ వ్రాసిరి మహా పుణ్యంబునే పంచగా

శ్రీ ధాత్రిన్ వరలున్ శుబాకరముగా శ్రీ సూర్య శ్రీరామమై.

 

శా. శ్రీరామాకృతిరామచంద్రుని కృపన్శ్రీరామ వాఙ్నైపుణిన్,

ధీరోదాత్త మహత్ ప్రవృత్తమునుసు స్నేహార్ద్ర సచ్చిత్తమున్,

పారంపర్య మహోజ్వలత్ప్రకృతమున్ భాస్వంత సౌశీల్యమున్

ధారాపాతముగా కవీంద్రుఁడనువాదంబున్ ప్రసాదించిరే!

 

శా. రామా రామ యనంగనే దురితముల్ ప్రక్షళనంబై మహ

త్క్షేమంబున్ గలిగించునిక్క మనుచున్ దేదీప్య మానంబుగా

శ్రీమద్రామ చరిత్ర సద్రచనతో చిత్తస్థ చాంచల్యమున్

ప్రేమన్ బాపగ చూచి వ్రాసి తెలుఁగున్ తేజంబు చొప్పించిరే!

 

. మార్గము రామ పాదములు మాన్యులకంచు పఠించు వారికిన్

స్వర్గ సుఖంబు భూమిపయి శాశ్వితమంచు మనంబు నెంచి యీ

మార్గము నెన్ని సూరకవి మాన్యుఁడు తెల్గున వెల్వరించె దు

ర్మార్గ విదూర మర్గమిదిరామ కథాసుధ గ్రోలుఁడందరున్..

 

చ. మి నుత రామ నామ పరమామృత తత్వ వివేక పూర్ణ సం

క్రమిత మనోజ్ఞ భావ పరికల్ప్య మహాంధ్ర కృతానువాద మీ

ప్రముదిత రామ సచ్చరితప్రస్ఫుటమైన యథార్థ గాథ భా

వముననె దీనిఁ గన్న శుభ వర్ధనమౌన్ శ్రిత మంగళంబగున్..


ఆ సీతారాముల చల్లని చూపులు వీరికి ఎల్లప్పుడు అండగా ఉండుగాక.

చింతా రామకృష్ణారావు.

తే. 08 - 6 - 2017.

భాగ్యనగరము.


                                

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...