శ్రీరామ తత్త్వం.
శరణు గోరిన బద్ధ శత్రువునైనను
కాపాడి తీరెడు ఘనుడెవండు?
ధర్మంబె జెప్పుచున్ దానవి పాటించి
ఆదర్శమూర్తియై యలరెనెవడు?
పితృవాక్పాలనన్ ప్రియమారపాటించి
తండ్రి మాటనుగాచు తనయుడెవడు?
స్త్రీ జాతి నెల్లరన్ శ్రీ మాతృ మూర్తిగా
భావించి ప్రేమించు భవ్యుడెవడు?
కష్టసు ఖాలెల్ల కాలప్రభావమన్
సూక్ష్మంబు నెఱిగిన శూరుడెవడు?
మునిమానసంబుల ముద్దుగా నెలకొని
పద్మస్థితుండైన ప్రభువెవండు?
ఆగ్రహించినవేళ నఖిల లోకంబుల
నంతంబు గావించు నార్యుడెవడు?
స్నేహాంతరంగుడై చిరుకాన్క కౌగిలిన్
చిరజీవి కిచ్చిన శ్రేష్ఠుడెవడు?
పూర్ణచంద్రుపగిది పున్నమి వెన్నెలల్
మోముపైన జిలుకు మోహనుండు
రాముడొకడె సూ ప రాక్రమవిక్రమ
సూర్యవంశభవుడు సుందరుండు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి