23, మార్చి 2024, శనివారం

శ్రీరామ తత్త్వం.

 శ్రీరామ తత్త్వం.

శరణు గోరిన బద్ధ శత్రువునైనను

               కాపాడి తీరెడు ఘనుడెవండు?

ధర్మంబె జెప్పుచున్ దానవి పాటించి

             ఆదర్శమూర్తియై యలరెనెవడు?

పితృవాక్పాలనన్ ప్రియమారపాటించి

      తండ్రి మాటనుగాచు తనయుడెవడు?

స్త్రీ జాతి నెల్లరన్ శ్రీ మాతృ మూర్తిగా

            భావించి ప్రేమించు భవ్యుడెవడు?

కష్టసు ఖాలెల్ల కాలప్రభావమన్

            సూక్ష్మంబు నెఱిగిన శూరుడెవడు?

మునిమానసంబుల ముద్దుగా నెలకొని

                  పద్మస్థితుండైన ప్రభువెవండు?

ఆగ్రహించినవేళ నఖిల లోకంబుల

             నంతంబు గావించు నార్యుడెవడు?

స్నేహాంతరంగుడై చిరుకాన్క కౌగిలిన్

                        చిరజీవి కిచ్చిన శ్రేష్ఠుడెవడు?

పూర్ణచంద్రుపగిది పున్నమి వెన్నెలల్

మోముపైన జిలుకు మోహనుండు

రాముడొకడె సూ ప రాక్రమవిక్రమ

సూర్యవంశభవుడు సుందరుండు.

పెండ్లి ఆశీస్సులు

 కల్యాణ వాణి...అనూరాధ కుమార్తె.

వధువు:చి.ల.సౌ.ఉజ్జ్వల. వరుడు:చి.వినయ్మణికంఠ రాజా.

సుముహూర్తము: ది.24.03.2024. ఉ.8.03.ని.లకు.

వధూవరులారా!

శ్రీ రఘురాము సత్కృపను శేముషినందుడు మీరలిర్వురున్

సారవిశేష సంసరణ సౌఖ్యములందనివార నందుచున్

కూరిమిబెంచుకొంచు సుమకోమల భావ సమాశ్రయంబునన్

భూరి మహోజ్జ్వల స్థితియె భూషణమైచెలగంగ వంశమున్.1.

      "వినయమణికంఠు"డెందాన విజయకేత

       నంబెగురవేయు"ముజ్జ్వల!" నవ్యరీతి

       భావి సంసార జీవిత పథమదంత

       మూడుపూలారు కాయలై మోదమలరు.2.

పచ్చని మండపాన కడుపావన వేదవిశేష ఘోషలో

నచ్చిన "రాజు"నీ మెడను నాణెపుసూత్రము గట్టుచుండగా

హెచ్చిన రాగభావముల హేలగ పండితదీవనాళిలో

మెచ్చగ బంధువర్గమిట మీరలుసాగుడు జీవనమ్మునన్.3.

         రెండు వంశాల కీర్తులు పండునటుల

         మూడు ముడులున్న బంధాన ముచ్చటలర

         నాల్గు వేదాల సాక్షిగా నవ్యశోభ

         పంచప్రాణాల నొక్కటై పరగుడయ్య!.4

వంశ వృక్షంబు చిగురించి వైభవముగ

ఫలములీయగ మీరలు తలచినటుల

పూర్ణ సంసారజీవిక మోదమగుచు

శతవసంతాలు భద్రాన సాగగలరు.5.

 వధువు.                                             వరుడు

    చి.ల.సౌ. సాయిహర్షిణి.            చి. యశ్వంత్ భరద్వాజ్. 
     ముహూర్తము. ది.22.02.2023.(బుధవారం) 
     రాత్రి గం. 3.21.ని.లకు. తెల్లవారితే గురువారం. 

               శ్రీలకు నాలవాలమగు చిన్మయు శ్రీరఘు రామువేడినన్
               వేలకు వేలపున్నెములు వేగ లభించి మనోహరంబగున్
               జాలము సేయకన్ కరుణ చక్కగజూపెడు దైవసన్నిధిన్
               వ్రాలుమ "సాయిహర్షిణి " సభర్తృక వై సుఖభోగలబ్ధికై.1.

        యాబలూరి వంశ అనురాగవల్లికి
        కొమ్మమూరివంశ కొమరునకును
        బంధనమ్ముగూర్చె వాణీధవుండట
        సప్తపదులు వేయ సౌఖ్యమలర.2.

        క్షీర నీరాల పగిదిని చెలువమీర
        శబ్దమర్ధాల పోలిక సారమలర
        మీరలిరువురు ఒక్కటై మించుప్రేమ
        వంశ సత్కీర్తి నిల్పుడు వైభవముగ. 3. 

        వేదమంత్రాలసారమ్ము విజ్ఞతముల
        దీవనాదులు ఫలియించి దివ్యఫలము
        సంతురూపాన బొందుడో సౌమ్యులార!
        వంశవృక్షంపుచివురులు పరిఢవిల్ల.4.

        గౌతమసగోత్ర సంజాత ఘనచరిత్ర!
        భర్తృ వంశంపు శాఖలు పల్లవింప
        అరుగుచుండెను డెందంబు హ్లాదమొదవ.
        చేరి యాశీర్వ దింపుడో శిష్ఠులార!5.

         ధార్మికంబైన జీవన తత్త్వమెపుడు 
         భావి సౌభాగ్యదమ్మను భావమలర
         మీకు సతతంబు సంఘాన మేలుకలుగు
         రాము పరివార సత్కృపా రశ్మివలన.6. 
  
         పచ్చ పచ్చని యక్షతల్ పైనబడగ
         వెచ్చ వెచ్చని యుచ్ఛ్వాస వెలువరించు
         మచ్చెకంటికి వరునకు మాధవుండు
         రక్షగూర్చుత యిల ననురాగమలర. 7. 
      
            వరుడు.                                                  వధువు
    చి. గంగరాజు శ్రీకాంతు.                   చి.ల.సౌ.సాయిసుధ.
       ముహూర్తము.6.12.19.(శుక్రవారం)ఉ.10.10.లకు.

        శ్రీలకు నాలవాలమగు చిత్తము శ్రీరఘు రామువేడినన్
        వేలకు వేలపాపములు వేగ నశించు స్మరించుమాత్రనన్
        జాలము సేయకన్ కరుణ చక్కగజూపెడు దైవసన్నిధిన్
        వ్రాలుడు దంపతుల్ సతము భవ్యసుఖార్ధులరైచరింపగన్.
               "సాయిసుధ"తోడ ననురాగ సరళిమెలగి
                జీవితాంతము "శ్రీకాంత!"చెలిమిమీర
                భోగభాగ్యాలదేలెడు యోగమంద
                గోరెద సతము శ్రీరాముకూర్మిదయను.
       క్షీరనీరమ్ము పగిదిని చిత్తములను
       మేళవింపు "సుధానాథ!"మేలుజరుగు
       ధర్మదాంపత్యజీవన మర్మమెల్ల
       కన్నులెదుటనె కన్పడు క్రమముగాను.
                 వేదమంత్రాలసారమ్ము విజ్ఞతముల
                 దీవనాదులు ఫలియించి దివ్యఫలము
                 సంతురూపాన బొందుడో సౌమ్యులార!
                 వంశవృక్షంపుచివురులు పరిఢవిల్ల.
       గంగరాజు వంశ ఘనమైన కీర్తిని
       నిల్పుమయ్య నీవు నేర్పుమీర
       తల్లి దండ్రులిలను తపియింత్రు దానికై
       తీర్చుమోయి దాని తీయగాను.
       

                                         నూతి పాణి కుమార్తె.                                      
           వధువు.                       ముహూర్తము:                     వరుడు
     చి.ల.సౌ.రాజావేదవతి. ది.9.12.2020.ఉ.10.01.చి.అనంతకృష్ణతేజ. 
               శ్రీలకు నాలవాలమగు చిన్మయు శ్రీరఘు రామువేడినన్
               వేలకు వేలపాపములు వేగ నశించు స్మరించుమాత్రనన్
               జాలము సేయకన్ కరుణ చక్కగజూపెడు దైవసన్నిధిన్
               వ్రాలుడు దంపతుల్ సతము భవ్యసుఖార్ధులరై చరింపగన్.1.
     "వేదవతి"జూపు విస్తృత ప్రేమవలన
     "కృష్ణతేజమ!" యనురాగ వృష్టిదడిసి
      భోగభాగ్యాలదేలగ యోగమంద
      గోరెద సతము శ్రీరాముకూర్మిదనర.2.
                క్షీరనీరమ్ము పగిదిని చిత్తములను
               "వేదవతికృష్ణతేజ"లు విస్మయముగ
               ధర్మదాంపత్యజీవన మర్మమెరిగి
               కలుపుకొనినను సంఘాన ఖ్యాతి పెరుగు.3.
       వేదమంత్రాలసారమ్ము విజ్ఞతముల
       దీవనాదులు ఫలియించి దివ్యఫలము
       సంతురూపాన బొందుడో సౌమ్యులార!
       వంశవృక్షంపుచివురులు పరిఢవిల్ల.4.
                త్యాగ సంభావ్య సౌశీల్య ధర్మమంత
                వేదవతిగను నీచెంత వెలుగు చుండె
                కంటి వెల్గుగ ఇరువంశ కాంక్షలన్ని
                తీర్చి చూపించుమోయమ్మ! తేజమలర.5.
           

చిరంజీవి హర్షిణి, వెంకటసత్యసాయి ప్రదీప్ లకు
                      వైవాహిక శుభ  ఆశీరక్షతలు
                             
            సుముహూర్తం.ది.4.11.2018.రా.3.58.లకు.
          వేదిక:    ఆర్యవైశ్య కల్యాణ మండపము.       అద్దంకి.

  1. సత్యముధర్మమున్ మరియు సౌమ్య దయార్ద్ర పునీతతత్త్వమే
      నిత్యముశ్రేయమిచ్చునను నీమములన్ గణియించి చెప్పుచున్
      భృత్యులమానసాంబుధిని ప్రీతిని గెల్చెడి"సాయినాథుడే"
      అత్యమలంపు మూర్తులగు"హర్షిణి, సాయిల"కాచుగావుతన్.
   
2.  పచ్చని మండపాన ఘన పండిత వేద స్వరాలఘోషలో
      మెచ్చిన బంధుమిత్రుల యమేయపు సాదర లాలనంబునన్
      స్వచ్ఛపు మానసాన కలశంబున నున్న సుగంగ కైవడిన్
      అచ్చపు ప్రేమపాత్రముగ "హర్షిణి"తోడుత వెల్గుమెప్పుడున్. 

           3.జీవితంబున పెనుమార్పుచేరెనిపుడు,
               వియ్యమనియెడు రూపానవింతగాక
               మమత నిండిన మనసులె మరులుగొల్ప
               వంశవృక్షంపు శాఖలే వరలుచుండు.

            4.అర్హతలతోడ నిర్వురియందు జూడ
               ఒక్కటయ్యెను భావాలు చక్కగాను
               మక్కువెయ్యెడ సతతంబు మరలనీక
               అక్కజంబగు సంతునునందుడయ్య!

            5.తల్లిదండ్రులచిత్తాలు తనివిదీర
               ప్రేమ పండించి నిండించి ప్రియముమీర
              "వే వసంతాలు" ముదమందు విందుతోడ
               మనుడు "పరమేశు దీవనన్" మహితకీర్తి.

                          మంజు కి నిశ్చయ తాంబూలాలు 
                                                              ఆశీస్సులు 
1. తేగీ.  నిశ్చయంబును పల్కిరి యెల్లవారు,అస్తుఅస్తంచు పల్కిరి అమృత ఝరిగ .       
             భావి జీవన సౌఖ్యాలు ప్రభలు నిండ , మనుమ మంజీర విభునితో మహిని నెపుదు. 

2. తే గీ . శుభము శుభమస్తు శుభమస్తు సురుచిరంబు, మంగళంబౌను మామక మానితులకు,
             భావి దాంపత్య సౌఖ్యంబు ఫలితమంది, శ్రీలు గురియును మంజీర చెలునికెపుడు. 
3.తే గీ.   కనులపండువు యగునట్లు కమలనాభు , కృపను మీరెప్దు వృద్ధియై కీర్తినంది,
             మించు సౌభాగ్య సిరులెల్ల మేదినంది, వారలు గావుత ఈ జంట వైభవముగ.  
                                                   పొన్నెకంటి సూర్యనారాయణ రావు . 
అమ్మా, లక్ష్మీ గాయత్రీ!

శ్రీరఘురాము సత్కృపను చిన్మయి భూమిజ రాగమాధురిన్
పేరిమిబంధమేర్పడుచు పెండిలికిన్ రహదారియైచనెన్
నేరుగ కీర్తికాంతుడగు నీ"కిరణున్" హృది జేరుమాయికన్
కోరినకోర్కులెల్ల యొనగూడి శుభంబులు నీకగున్ సదా.1.

ధర్మ బద్ధమైన దాంపత్యజీవిక
భారతీయులకిది పరమవరము
వంశగౌరవంబు వర్ధిల్ల చరియింప
శ్రీలు జేరుమీకు క్షేమమగును.2.

వేదమంత్రాలసారమ్ము విజ్ఞతముల
దీవనాదులు ఫలియించి దివ్యఫలము
సంతురూపాన బొందుడో సౌమ్యులార!
వంశవృక్షంపుచివురులు పరిఢవిల్ల.3.

క్షీరనీరమ్ము పగిదిని చిత్తములను
పదము లందున సద్భావ పథమునెంచి
ధర్మదాంపత్యజీవన మర్మమెరిగి
హాయి మనుడమ్మ సతతంబు రేయిపగలు.4.

తల్లిదండ్రులచిత్తాలు తనివిదీర
ప్రేమ పండించి నిండించి ప్రియముమీర
"వే వసంతాలు" ముదమందు విందుతోడ
మనుడు "పరమేశు దీవనన్" మహితకీర్తి.5.

 భాగ్యనగరం.                   శుభాశీస్సులతో...
 మల్కాజిగిరి.    పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
 9866675770. భాషాప్రవీణ, ఎం.ఏ., తెలుగు.




                                  

20, మార్చి 2024, బుధవారం

డా. రామడుగు, ఆచార్య. బేతవోలు రామబ్రహ్మం . జయరాం, చింతా వార్ల అభినందనలు, సూర్యశ్రీరామం పై.

సూర్యారామం

 డా. రామడుగు వేంకటేశ్వర శర్మ, ప్లాట్ . 201.,సెకండ్ ఫ్లోర్. ఆర్.వి. టవర్స్. శ్రీవేంకటేశ్వర బాలకుటీర్ దగ్గ ర, 2/17బ్రాడీపేట. గుంటూరు. 522002. ఆం.ప్ర. సెల్. 9866944287. 

సీ. రామాయణమెగదా! రాజిల్లు దివ్యమౌ., గాయత్రి మంత్ర ప్రకాశమగుచు రామాయణమెగదా! రాణించును పవిత్ర ., సరసపాత్రల చిత్రశాలయగుచు రామాయణమెగదా! రవణిల్లు రసరమ్య., కర్ణపేశలమైన కవనమగుచు రామాయణమెగదా! రహియించు నైకార్థ., వర్ణాల బింబించు స్ఫటికమగుచు 
 తే. గీ. అరయ రామాయణమెగదా! ఖ్యాతికెక్కు 
 పుడమిలో నిత్య నవ్యతా స్ఫూర్తి నిడుచు
 లోకపుం బోకడల నెల్ల రూపుగొన్న 
 భవ్య రామాయణము గద్యకావ్య రీతి 
 అలరుగాదొకో! ‘‘సూర్య’’ప్రభాత్మమగుచు. 1 
 ఉ. గేయము భావపింఛమయ కేకి యనందగు శ్లోకమే శ్రవః పేయము పుట్టపుట్టు కృతి వెల్గుల నీనెను తెల్గు ‘‘సూర్య నా రాయణు ’’గద్యరూపమవురా! సముదాత్తము గ్రాంథికైక భా షీయముగా పఠింపదగి, శ్రేయమిడున్ దరమే! నుతింపగన్.2
 ఆ.వె. దివ్యమైన ‘‘సాహితీ గవాక్షాం’’ధ్రప్ర భా’’ఖ్య పత్రికన్ ప్రభాత కాంతి స్ఫూర్తిమంతమగుచు‘‘సూర్య"ప్రభ వెలింగె పేర్మితోడ జనుల కూర్మిగొనుచు.3 
 మ. మరువన్ శక్యమె? ఆంజనేయుని సుధీమచ్ఛక్తి, సుగ్రీవు భా స్వరమౌ రాజసభక్తి, ఆ భరతు సౌభ్రాత్రానురక్తి ప్రభల్ వర కైకేయి ప్రయోజనాత్మ భవితవ్య ప్రాభవోద్దీప్తి, యె ల్లరకున్ నిత్యము దర్శనీయమిట ‘‘సూర్యారామ’’కావ్యంబునన్.4 
 ఆ.వె. శిష్ట గాయకుండు, చిత్రకారుండు భా షాప్రవీణ సఖుడు, సరసమూర్తి వ్రాయు రామ కథయె గ్రంథమౌ వేళ ‘‘రా మడుగొ’’సంగు నుతుల నుడుల కడలి. 5

  అభినందన. ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు.

     మిత్రులు శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావుగారు గుంటూరు కె.వి.కె.సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ ఫైనల్ ఇయర్ చదువు 
తున్నప్పుడు నేను ఆ కళాశాలలో లెక్చరర్ గా (1970..71) ఉద్యోగంలో
చేరాను. యేలూరిపాటి అనంతరామయ్యగారు అప్పుడు ప్రిన్స్పాల్. 
క్రొత్తగా చేరిన కుర్ర లెక్చరర్ కి ఫైనల్ ఇయర్ తరగతులు బోధనకు ఇవ్వరు. నాకూ ఇవ్వలేదనే గుర్తు. వీరి తరగతిలో ముద్దా లీలా మోహన రావు, రామడుగు, సూర్యనారాయణ, గుం.శి.కో.రావు, 
ప్రభృతులు ఉండేవారు. వీరి తరగతికి వెళ్లి పాఠాలు చెప్పిన తీపి గుర్తు ఏదీ నాకు లేదు. వీరందరు జ.మా.శ, శ్రీ,శా, కో.సీ.రా, మ.వీ.శ 
(మల్లంపల్లి వీరేశ్వర శర్మ)చెరువు సత్యనారాయణ శాస్త్రిగారు వంటి హేమా హేమీల దగ్గర ఐదేళ్లపాటు విద్యను అభ్యసించారు. 
     వీరందరు నన్ను కూడ గురువుగా సంభావించడం నా పురాక‌ృత శుభాధిక్యం. అంతకన్నా ఇది వీరి ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. అది వీరి గురువుల బోధనలవల్లా వీరి చదువుల వల్లా వీరు చేసిన సాహితీ సాధనల వల్లా వీరికి లభించిందని నా విశ్వాసం. 
     అందున ఈ సూర్యనారాయణరావు గారు శ్రీమద్రామాయణాన్ని ఉపాసించిన భాగ్యశాలి. ఉపాధ్యాయ వృత్తిలో తరించామని సంతృప్తిపడి ఊరుకోకుండా తమ విద్వత్తును అటు సాహిత్యానికి ఇటు సమాజానికి ఉపకారకంగా సద్వినియోగం చేస్తూ గురు ఋణం తీర్చుకొంటున్న సంస్కారవంతులు. నాజరు జీవితచరిత్రను పద్యకావ్యం చెయ్యడం ఒక తరహా సేవకాగా, శ్రీమద్రామాయణాన్ని ఇలా సూర్యశ్రీరామం పేర యథామూలంగా సకల జన సుబోధకంగా ఇతివృత్తానికి తగిన ఉదాత్త వచన రచనాపాటవంతో లోకానికి అందించడం ఋషిరుణ విమోచకమైన పరమపావన సేవ.  
     అందుకని సూర్యనారాయణరావుగారిని మనసారా అభినందిస్తూ వీలుచేసుకొని మరీ ఇలా నాలుగు ముక్కలు రాస్తున్నాను. ఇక్ష్వాకు వంశానికి మూలపురుషుడి పేరు పెట్టుకున్న ఈ సూర్యనారాయణుడు రామనారాయణుడి చరితాన్ని మరీ ముచ్చట గొల్పింది. 
     అలనాడు విశ్వనాథవారన్నట్టు మరల ఇదేల రామాయణం అని ఎవరైనా అడిగితే చెప్పడానికి ఈ సూర్యశ్రీరామాయణంలో చాలా విశేషాలున్నాయి. దృష్టి భేదాన్నిబట్టి ఆయా అనువక్తలు ప్రస్తావించనివీ, అరగొరగా చెప్పినవీ, అన్యథాకరించినవీ, ఇలాంటి విశేషాలెన్నో ఈ వచన రచనలో కనిపిస్తాయి. అనువక్త చాలా జాగరూకుడై భక్తి శ్రద్ధలతో దీన్ని రూపొందించాడు. ఉదాహరణకు ఒకటి మనవి చేస్తాను. 
     గౌతముడు అహల్యను అసలు ఎందుకు శపించాడు?దీన్ని చాలా  
మంది ధైర్యం చాలక దాటవేశారు. అలాగే ఏమని శపించాడు? అనే దానికి కూడా ఎన్నో పాఠాంతరాలు సినిమాలు పాటలును. వాల్మీకి ఆ మహర్షి నోట పలికించిన శాపాన్ని యథాతథంగా మనముందుంచారు ఈ సూర్యనారాయణగారు. కథాపరంగా , సంఘటన పరంగా ఉత్తరకాండతో కలిపి అంతట ఉన్న అనేక విశేషాలను వీరు పాఠకులకు అందించారు. 
    అలాగే   ‘‘పంచోచేల్లోకనాయక;’’ వంటి జ్యోతిశ్శాస్త్ర రహస్యాలనూ,ఆచమనమంటే అర చేతిలో మినపగింజ మునుగునంతటి నీరు తీసికొని త్రాగుట ( మాషమజ్జన పరిమిత శుద్ధోదకాని) వంటి సదాచార విశేషాలనూ, దివ్య వత్సరాలు, మానుష వత్సరాలు వంటి కాల గణన సంప్రదాయాలను అనేకానేకం యథావసరంగా వీరు పొందుపరిచారు. 
     తెలిసిన కథా విశేషమే అయినా , తెలియని కమామిషూలనెన్నింటినో జతగూర్చటం వీరి  ఈ సూర్యశ్రీరామం ఒక విశిష్టతను అవశ్య పఠనీయతను సంతరించుకొంది. ఈ నాటి పాఠకుల తాజా వచన రామాయణాన్ని చదివి చరితార్థులవుతారని ఆశిస్తున్నాను. ఇంతకు మునుపు ఈ రచయిత .. రాయకూడనివి రాసి ఉంటే ఆ దోషం తొలగిపోయి ఈ రామాయణ రచనతో వీరి జన్మ ధన్యమయ్యిందని సంభావిస్తున్నాను. సెలవు. 
                                                                                               మీ బేతవోలు రామబ్రహ్మం.
                                                                                             శ్రీ శోభకృత్తు, కామునిపున్నమి.
                                                                                                     24.03.2024. 

సంకల్ప సిద్ధుడు. జొన్నలగడ్డ జయరామ శర్మ. 

1. శ్రీరామ రామ రామని , నోరారగ సంస్మరింప నుర్వీజనులన్

    చేరును శుభములు కొల్లగ , వారిన్ కాపాడు సతము వైకుంఠుండే.

2. అవని నాదర్శ వర్తన కాటపట్టు , పారమార్ధికమునకును పట్టుగొమ్మ

    శ్రేయదంబౌను జాతికి జీవగఱ్ఱ ,మార్గదర్శక మెపుడు రామాయణమ్ము.!

3.పుణ్యపురుషుల కీభూమి పురిటిగడ్డ, వారి చరితలు జాతికి వన్నెగూర్చు

   పుణ్యభూమిని ధార్మిక బుద్ధి సడల, మారుచుండెను కలియుగ మహిమయేమొ!

4. నీతి మార్గానుసారికి నీడలేదు, మాయదారుల చేష్టలే మన్ననాయె

   పెద్దవారల సుద్దులు పెడకు ద్రోయు, మాయదారుల మార్పు రామాయణమ్ము

5. రామచరితమ్ము నెందరో రమ్యఫణితి, వివిధ సాహిత్య రీతుల వెలయజేయ

   మిన్నకుండక రచియించె ‘‘పొన్నెకంటి’’, ‘‘సూర్యశ్రీరామ’’మను పేర సుకృతమిద్డి.

6. సుఖము శాంతము సౌభాగ్యశోభ దనర, నీతి నియమానుసారాన నెల్లజనులు

    ధర్మమార్గాన వర్తిల్ల దలచి వ్రాసె, రామచరితమ్ము ‘‘సూర్యనారాయణుండు’’.

7. ఆశయాలకు ననువుగా నాదరించి, దయయు సత్యము శౌచము ధర్మబుద్ధి

   వీడకుండగ శ్రీరాము వేడుకొనిన, రామరాజ్యము జగతిని రాకయున్నె?

8. కాలవశమున కాయంబు గాయమైన, వీసమైనను జంకక విసుగులేక

   కౌసలేశుని నామమే శ్వాసగాగ, పూనుకొన్నట్టి రచనను పూర్తిజేసె.

9. ఆదికావ్యాను సరణ పునాది యనుచు, సంయమీంద్రుని పదముల జాడనరసి

   సరళమౌ కథనమ్ము సాగిపోవ, దైవసత్కృప నొందుచు ధన్యుడాయె. 

  నివాసము. కొండాపూర్.                     అభినందనలతో, సాహితీ మిత్రుడు

    చరవాణి.                                             భాషాప్రవీణ, జొన్నలగడ్డ జయరామ శర్మ..

                                                                            విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు. 

మహిత శ్రీసూర్య శ్రీరామమ్.- నవరత్నమాలిక

Inbox


ఓం నమో శ్రీరామాయ.

మహిత శ్రీసూర్య శ్రీరామమ్.

నవరత్నమాలిక.

మిత్రులు శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావుగారు అకుంఠిత దీక్షతో వాల్మీకి రామాయణమును సర్వజనాహ్లాదకరంగా  తెలుఁగు భాషలోనికి సరళమైన శైలిలో అనువదించుట ముదావహము. అవసరమగుచోట కథను కొంచెము వివరించుచు, కథాగమనమును మందగింప చేయునను చోట వర్ణనాదులను తగ్గించి అనువదించి, పండిత పామర రంజకముగానుండుటకై వీరు తీసుకొనిన శ్రమను మనసారా అభినందించుచున్నాను. 


. క్షయమైన మంగళ సమంచిత నామము రామనామమే

రక్షణ సజ్జనాళికని భ్రాంతిననూదిత మాంధ్ర భాషకున్                             

మోక్ష మనోజ్ఞ మార్గముగ పూర్తిగ చేసిరి పొన్నెకంటి స

చ్చిక్షణ మానవాళికిది శ్రీకరమీ కమనీయ కావ్యమౌన్.

 

చ. రుతరమైన సద్గతి ననూదితమైన విధంబు చూడగా

విరిసిన తెల్గు మల్లియసువిస్తర వర్ణన లందు సూక్ష్మతన్,

గురుతర భావనాళికి నకుంఠిత భావ ప్రకల్పనంబునన్,

సురుచిర సుందరాన్వయ సుశోభితమీ యనువాదమెన్నగా.

 

చ. హితులుపామరుల్ కనగ మాన్యతనొప్పెడు సౌమ్యమర్గమున్

సహిత ప్రశంసలందఁదగు చక్కని పద్ధతినాంధ్ర భాష స

న్నిహిత మనోభిరామము వినిర్మితి సత్పరివర్తనోద్ధతిన్,

మహితుఁడు చేసె దీనినిసమంచితరీతిని పొన్నెకంటెయే..

 

. రులై పుట్టిన వారికిన్ దెలియ శ్రీనారాయణుండీ  భువిన్

వరమై రామ కథా నిధానమయి సంవర్ధింపగా జేయఁగా

నిరపేయంబుగ రామనామ సుధనే నిత్యంబు గ్రోలంగ నీ

పరతత్వజ్ఞుఁడు పొన్నెకంటి బుధుడే భక్తిన్ తెనింగించెగా.

 

శా. మోదంబొప్పఁగ జానకీ పరిణయంబున్తెల్గులో నేర్పునన్

శ్రీదంబంచును పొన్నెకంటి మదులం జేరన్ మనోజ్ఞంబుగా

బోధామోదముగాగ వ్రాసిరి మహా పుణ్యంబునే పంచగా

శ్రీ ధాత్రిన్ వరలున్ శుబాకరముగా శ్రీ సూర్య శ్రీరామమై.

 

శా. శ్రీరామాకృతిరామచంద్రుని కృపన్శ్రీరామ వాఙ్నైపుణిన్,

ధీరోదాత్త మహత్ ప్రవృత్తమునుసు స్నేహార్ద్ర సచ్చిత్తమున్,

పారంపర్య మహోజ్వలత్ప్రకృతమున్ భాస్వంత సౌశీల్యమున్

ధారాపాతముగా కవీంద్రుఁడనువాదంబున్ ప్రసాదించిరే!

 

శా. రామా రామ యనంగనే దురితముల్ ప్రక్షళనంబై మహ

త్క్షేమంబున్ గలిగించునిక్క మనుచున్ దేదీప్య మానంబుగా

శ్రీమద్రామ చరిత్ర సద్రచనతో చిత్తస్థ చాంచల్యమున్

ప్రేమన్ బాపగ చూచి వ్రాసి తెలుఁగున్ తేజంబు చొప్పించిరే!

 

. మార్గము రామ పాదములు మాన్యులకంచు పఠించు వారికిన్

స్వర్గ సుఖంబు భూమిపయి శాశ్వితమంచు మనంబు నెంచి యీ

మార్గము నెన్ని సూరకవి మాన్యుఁడు తెల్గున వెల్వరించె దు

ర్మార్గ విదూర మర్గమిదిరామ కథాసుధ గ్రోలుఁడందరున్..

 

చ. మి నుత రామ నామ పరమామృత తత్వ వివేక పూర్ణ సం

క్రమిత మనోజ్ఞ భావ పరికల్ప్య మహాంధ్ర కృతానువాద మీ

ప్రముదిత రామ సచ్చరితప్రస్ఫుటమైన యథార్థ గాథ భా

వముననె దీనిఁ గన్న శుభ వర్ధనమౌన్ శ్రిత మంగళంబగున్..


ఆ సీతారాముల చల్లని చూపులు వీరికి ఎల్లప్పుడు అండగా ఉండుగాక.

చింతా రామకృష్ణారావు.

తే. 08 - 6 - 2017.

భాగ్యనగరము.


                                

2, మార్చి 2024, శనివారం

రచయిత పరిచయము.,

రచయిత పరిచయము.

 

పేరు...పొన్నెకంటి సూర్యనారాయణ రావు..అర్థాంగి...పొన్నెకంటి ఇందిరాదేవి...తల్లిదండ్రులు...అనసూయమ్మ, పూర్ణచంద్ర శేఖర వర ప్రసాదరావు...జన్మస్థలం. తేది...గుంటూరు జిల్లా , పొన్నెకల్లు గ్రామం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం. ది. 2.05.1947...విద్య....ప్రాథమిక విద్యాదాత.-కీ.శే. లక్ష్మీనారాయణ గారు, మాధ్యమిక విద్యాదాత . కీ.శే. కొండా కృష్ణమూర్తి గారు. యస్.యస్.యల్.సి. 1964. , 1966‌‌ ‌‌నుండి 71. గుంటూరు , కొలచల వెంకట కృష్ణమూర్తి సంస్కృత కళాశాలలో ‘‘ భాషాప్రవీణ ’’. ఎం,ఏ.తెలుగు.,వృత్తి.1971 నుండి 2005 వరకు గుంటూరు జిల్లా, నగరం మండలం, ధూళిపూడి గ్రామం లో ఆంధ్రోపాధ్యాయునిగా సాహితీ సేవలు.

ప్రవృత్తి.                        పద్య , గద్య రచనలు, పద్య పఠనము, భువన విజయాది సాహితీ రూపకములలో         

                                      ముక్కు తిమ్మన, భట్టుమూర్తి, శ్రీక‌ృష్ణదేవరాయల పాత్రధారణ., అష్టావధానములలో

                                      పృచ్ఛకపాత్ర వహించుట. 


 గౌరవములు.             పాఠశాల యాజమాన్యముచే 108 రూపాయి నాణెముల  ప్రత్యేక  బహుమతి,  2000 సం.లో

                                       ప్రభుత్వముచే ‘‘ జిల్లా ఉత్తమాంధ్రోపాధ్యాయుడు’’ గౌరవము.  

రచనలు.             

ముద్రితములు.            సుథాకలశము( ఆకాశవాణి కొఱకు వ్రాసిన సమస్యాపూరణలు, దత్తపదులు, వర్ణనలు.)

                                     ధూళిపూడి పూర్వాపరములు ( గ్రామ, గ్రామేతర కవిపండితులు, కళాకారులు, రాజకీయ 

                                      నాయకులను , గూర్చి, గ్రామదేవత తాళ్లమ్మ దేవతా స్తుతి), బాపయార్యు శతకము. (నీతి శతకము)

అముద్రితములు.         శ్రీ వాల్మీకి రామాయణమునకు సంక్షిప్త సులభ వచనము. ‘‘సూర్య శ్రీరామం’’, 

                                      ‘‘  బుర్రకథ నాజరు చరిత్ర ’’( చంపూ కావ్యము) , శ్రీరామ శతకము, కాశీ విశ్వేశ శతకము,

                                       మధురభావ తరంగాలు శతకము. 

చరవాణి.                       9866675770, 6300985169. 

 ప్రస్తుత నివాసము.     భాగ్యనగరము, విమలాదేవి నగర్, మల్కాజిగిరి, హైదరాబాద్. 47.  


 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...