1.తే.గీ.సూర్య దేవాలయంబు సంస్తూయమాన
సుప్రభా భాసితంబు సుశ్లోక భరిత
శ్లాఖ్యదంబు, దాని గనిన సమయమందు
జన్మ సఫలమన్ దలతురు జగమునందు.
2.కం. కోణార్క శిల్పి యులి పా
షాణంబుల బుజ్జగించి సరసత మెరయన్
కోణాలెన్నిట జూచిన
ప్రాణంబుల బోసి నింపె బ్రహ్మకు దీటై.
3.కం. ఉలి కోపమూని శిల చెవి
మెలివెట్టుచు కోర్కె దీర మేలిమి శిల్పాల్
మలచెను నర్కుని సాక్షిన్
తరమే శిల్పుల బొగడ! విధాతకు నైనన్.
4.తే.గీ సూర్య తేజానకానాడు స్రుక్కిపోయి
తెల్లమొగముల వేసిరి తెల్లవారు
కొల్లగొట్టుచు శిల్పాల నెల్లవేళ
తస్కరించి రహస్కరు ముష్కరతను.
5.తే.గీ. భాస్కర రహిత కోణార్క భాగమంత
వెల్గుకోల్పోయి చీకటుల్ విస్తరింప
కోరి చేసిరి నైచ్యంబు కూళలగుచు
తుచ్ఛమైనట్టి యాగ్లేయ మ్లేచ్చులకట!.
6.తే.గీ. అంధకారంబు నచ్చట నణచివేసి
శిల్పి చరితను ఘనముగా నిల్పునట్టి
యశపుకాంతులు సతతంబు దిశలునిండె
ఇంత కన్ననుశిల్పుల కేమివలయు?
7.తే.గీ. ఏడుగుఱ్ఱాల రథముపై నెక్కి కరుణ
బ్రోచుచుండెడు నాభానుమూర్తి సతము
తనదు కిరణాల ప్రసరించి ధరణినెల్ల
కోటికాంతుల విరజిమ్ము కోర్కె దీర!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి