2, డిసెంబర్ 2016, శుక్రవారం

సాహితీ స్రష్ట "సుచంద్ర"

సాహిత్యం అంటేనే హిత సహితం అని అర్థం. హితం ఎవరికి అని ప్రశ్న వేస్తే ..సర్వ జనాళికని చెప్పాలి. సాహిత్య ఆలోచనా లోచనం కలవారు ఒక్కొకరు ఒక్కొక రచనా పద్ధతిని అనుసరిస్తారు. ఛందోబద్ధ పద్య నిర్మాణం, స్వచ్ఛ, స్వేచ్ఛ ,  విశాల భావ వ్యక్తీకరణకనుకూలంగా ఉండే లలిత లలిత భావ నిర్భర పద జాలంతో మనోహర భావనా సాహితీ సామ్రాజ్యము నేర్పరచుకొని తద్ద్వారా రసిక జనులనాకర్షిస్తు, కవిలోక తల్లజునిగా పేరుగాంచుట ఒక వరం. అట్టి భగవద్దత్త వర ప్రసాది కీ.శే.(నమ్మ శక్యం కావటం లేదు.) "సుచంద్ర". సుసర్ల చంద్రశేఖర శాస్త్రి.(వచనమైతే భావ ప్రకటనకు ఎక్కువగా స్వేచ్ఛ ఉంటుంది అని వారు భావించేవారు.)వీరు ఖమ్మం జిల్లా కవులు, మొదలగు గ్రంథాలు, శతాధిక కవితలు, మనోహర వ్యాస విన్యాసాలు ప్రచురించిన కవిచంద్ర "సుచంద్ర".కవితామృతం, సేవించటం, సేవింపజేయటం అలవాటైతే చెప్పేదేముంది? ఆలోకమే వేరు. వేరొకరు తట్టి లేపాల్సిందే.అక్షరం ఉన్నంత కాలం అక్షరాలలో దాగి ఆయన ఉంటారు. కవికి, కవితకి మరణం లేదు.

           ఈయనకున్న లక్షణం తాను భావనా ప్రపంచంలో తేలటమే కాక కవితను, కవులను ప్రోత్సహించి, తనకు కావలసిన విషయాన్ని రాబట్టుకోవడంలో దిట్ట.

          నేను ధూళిపూడి లో పనిచేస్తున్న రోజులలో రక్తసంబంధీకమైన కుటుంబంగా మారింది "సుసర్ణ" వారి కుటుంబం. వారికి గ్రామదేవత తాళ్లమ్మ ఆరాధ్య దేవత, పర దేవత. నేను పాఠశాలలో కొలువు నుండి విరమించబోయే ముందే ఒక నిర్ణయం తీసికొన్నాను. అదే "ధూళిపూడి పూర్వా పర్వాలు.

              నన్ను "సుసర్ల" సోదరులందరు ఆప్యాయతానురాగాలతో, సొంత బావగారి వలెనే ఆదరించి గౌరవిస్తారు, వయోభేదం లేకుండా. ఒక రోజు "సుచంద్ర" గారి నుండి ఒక కోరిక. "బావగారు! నాకు మన గ్రామదేవత తాళ్లమ్మ ను స్తుతిస్తు శతకం కావాలి"అని. దానిని సుగ్రీవాజ్ఞగా భావించి 25 రోజులలో 108 పద్యాలు వ్రాసి చూపించాను. బావగారి కళ్లలో నేను ఆనాడు చూచిన ఆనందానికి అవధులు లేవు. "శహభాష్ బావగారు"అన్న పదం దశ దిశల ప్రతిధ్వనించింది. ఆనాటి నుండి కలిసినప్పుడెల్ల "బావగారు! ఏమైనా వ్రాస్తున్నారా? అనేదే ప్రథమ ప్రశ్న అయింది. ఆ ప్రోత్సాహం నాకొక మహత్తర శక్తిని, భావనా పటిమను ఇచ్చేది. ఏది యేమైనా బావగారు అని అనగనే .....తరువాత పదమైన ఏమైనా వ్రాస్తున్నారా? అని ఆయన అనక పోయినా నాకలా వినిపించేది. దాని ఫలితమే  "వాల్మీకి రామాయణము"నకు నా(తెలుగు సేత అయిన) "సూర్య శ్రీరామ"మేమో!!!

   2016 జూన్ లో జరిగిన ధూళిపూడి శతవసంత శోభలో పాల్గొని పూర్వ విద్యార్థిగా, అపూర్వ భావనిర్భర కవిగా ,విజృంభించారు, ఆరోగ్యం సహకరించకపోయినా.

       ఈ సాహితీ సింధువును  ఇంకా యెంతో తరచ వచ్చు. కాని ఒకే సారి నా వలన కావటం లేదు.
        అశ్రుతర్పణాలతో....అంజలులు సమర్పిస్తు......

3, నవంబర్ 2016, గురువారం

తెలిస్తే ఆవగింజ , తెలియకపోతే పెద్ద గుమ్మడి.

            తెలిస్తే ఆవగింజ , తెలియకపోతే పెద్ద గుమ్మడి.  

  మానవుని మేథస్సునకు ఎప్పుడు ఏదో ఒక పని చెప్పాలి. ఏపని అయినా మనకు మనముగా స్వయముగా చేసుకుంటేనే ఆనందం. ఉదాహరణకు భోజనం ...మనం భోజనం చేస్తేనే రుచి తెలుస్తుంది, కడుపు నిండుతుంది. ఎవరో చేస్తే మన కడుపు నిండదు కదా! ఒకరు ఇంతకుముందు చేసినవే మనం చేస్తున్నాము. ఏదిఅయినా అనుభవైక వేద్యం కావాలి. ఆనాడే మనకు మహదానందం.
       సుఖం మనం సృష్టించుకొంటేనే వస్తుంది. సింహం అంతటిది కూడ వేటాడక పోతే నోట్లోకి ఆహారం రాదు.
      ఈనాడు మనకు తరచూ ప్రయాణాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది చేయటానికి రకరకాలైన మార్గాలున్నాయి. 1.సొంతకారు.2. ఆటోలు.3. స్కూటీలు, హీరోహోండా వగైరాలు. కాని ఈనాడు పోటీ ప్రపంచంలోకి ఓలా, ఊబర్, లాంటి అద్దె కార్లు ఎన్నో అవతరించాయి. అవి మనం బుక్ చేసుకొంటే (ఆన్ లైన్ లో) చాల తక్కువ ఖర్చులో , ఏ.సీలో కూర్చుని హాయిగా గమ్యాన్ని చేరుకో వచ్చును. (మనం సొంత బండి మీద వెళ్లేదానికన్నా క్షేమంగా, సౌఖ్యవంతముగా ఉంటుంది.) ఈపని చేయటానికి ఎంతో పరిజ్ఞానం అక్కరలేదు. కావాల్సిన సామాను. 1.ఒక టచ్ ఫోన్, ఇంటర్నెట్ ఉన్నది.2. కొంచెం ఆంగ్ల పరిజ్ఞానం .(షుమారు 7వ తరగతి వరకు),3.కొంచెం చూపు 4.కొంచెం ముందు చూపు.5.వినకిడి శక్తి.6. క్రొత్త విషయాలు తెలిసికోవాలనే ఆసక్తి.(ఇది చాలా చాలా ముఖ్యం). కాని దురదృష్టమేమిటంటే ఇది చేయగలిగిన శక్తి కలవారు కూడ ,నిర్లిప్తతతో ముందుకు రావటం లేదు. ఆటోల సంగతి అతి దారుణం.....మీటర్ వెయ్యడు. వేసిన మీటర్ రేస్ గుర్రం స్పీడులో పోయేటట్లు చేస్తాడు. విసుక్కుంటాడు. మనం ఏదైనా మరచిపోతే ఇంతే సంగతులు. (ఆటోవాలాలు అందరు అలాంటివారు కాదు. వారిలోను కొందరు నిజాయతీపరులు ఇప్పటికి ఉన్నారు.)ఊబర్ లో ప్రయాణించేటప్పుడు మనం ఎటు వెళుతున్నామో మ్యాప్ చూపుతుంది.
      నా అనుభవం పంచుకొంటాను.
       మా ఇంటినుండి సిటిలో ఎక్కడి వెళ్లాలన్నా చక్కగా ఊబర్ లో బుక్ చేసుకొంటాము. ప్రయాణం కొంచెం ఆలస్యమైనా పరవాలేదనుకొంటే షేర్ బుకింగ్, లేకుంటే మామూలు బుకింగ్. నేనీరోజు స్వయంగా మౌలాలి, (పెన్షన్ ఆఫీసుకి ,లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు)వెళ్లి వచ్చాను. నాకు పోను రాను 160 రూ. అయినవి. అదే ఆటో అయితే 150+150=300.అవుతవి. న్యూ నాగోల్ నుండి మౌలాలి రైల్వే క్వార్టర్స్ వరకు.
 
      కనుక అందరు తప్పక చైతన్యవంతులు కావాలి. ఏదైన తెలియక ముందు గుమ్మడికాయ, తెలిసిన తరువాత ఆవగింజే......డబ్బు తక్కువ సుఖమెక్కువ.
         దీనిని వేరెవరైనా కూడ బుక్ చేసిపెట్టవచ్చు.    చేయూతనివ్వండి..

           క్రొత్తవిషయాలు నేర్చుకోవటం తప్పుగాదు. అపకారం కలిగించేవి, మన సంస్క్రతీ సంప్రదాయాలకు గొడ్డలిపెట్టుగా ఉండేవి నేర్చుకోవడం, ఆచరించడం తప్పు. జై భారత్!!!!!  

24, అక్టోబర్ 2016, సోమవారం

ఆడబోయిన తీర్థము

                  కోదండ రాముని దర్శనం.ది.22.10.2016.

   ఆడబోయిన తీర్థమెదురొచ్చినట్లు,కోరకనే దేవుడు వరమిచ్చినట్లు.....

  "కంటి మొంటిిమిట్ట కనులార యీనాడు
   రాముకరుణ ఝటితి మేము పొంది
   పొత్తమదియ నేడు పూర్ణత్వమొందకే
   రాముపాదమంటె రమ్యముగను.

   రామనామమనగ రసరమ్య భావంబు
   భద్రమిడును నదియె భావియందు
   జిహ్వత్రుప్పుడుల్ల శ్రీరాము చరితము
   చెప్పి పాడుచుండ సేమమగును.

 ఒంటి మిట్ట యందు నొనరంగ కరుణతో
భక్త జనులగావ ప్రభవమంది
దరినిజేరువారు ధన్యత్వమందగ
రక్షసేయువాడె రామ ప్రభువు.


    పలికించరామచంద్రుడె
    పలికితి నేనార్య చిలుక పలుకులవోలెన్
    వెలలేనిసిరుల నిచ్చును
    కలలోననుమరువకండి కల్యాణవిభున్.


 
ఈ రోజెంతో సుదినము. కడప జిల్లాలోని ఒంటిమిట్ట "కోదండరాముని" దర్శన మహాభాగ్యం లభించినది. నేను శ్రీకారంచుట్టిన "సూర్యశ్రీరామం" ( వాల్మీకి రామాయణమునకు స్వేచ్ఛ ఆంధ్రానువాదమును ఉత్తర రామాయణము 3౦ సర్గలు)శ్రీరామ పాదపద్మములచెంత నుంచి , శ్రీవారి ఆశీస్సులు పొంది, అచటి మహోన్నత సాహితీవేత్త,పండిత వర్యులైన శ్రీమాన్ వీణ రాఘవాచార్యుల వారి పరిచయము,ప్రసంగము, ఆశీస్సులతో పులకితమగుట. వారు ఇచట "వాల్మీకి రామాయణమును తెనిగించిన వాసుదాసు గారు, పోతన గార్ల ప్రస్తావన తీసికొని వచ్చి మీరును అటువంటి మహోన్నత కార్యము చేయుచున్నారు కావున ధన్యులని మనసార దీవించుట, త్వరలోనే మిగిలిన భాగమును పూర్తిజేసి స్వామి వారికి సమర్పించి ఇచట నొక సభ ఏర్పాటు నకు ప్రోత్సహించుట నాకు వరము. వారు కొంత తడవు మనకట్టుబాట్లు, మంచి అలవాట్లను గూర్చి ప్రసంగించిరి. వారి ప్రసంగమును, సుమధుర మనోహర సంఘటనను వీడియో రూపముగా భద్రపరచుట జరిగినది.
        ఈ ప్రయత్నములో నా సహాథ్యాయి, "రామాయణ కథా సారము" పరిశోథక గ్రంథకర్త అయిన శ్రీయుతులు తూములూరు దక్షిణామూర్తి గారు నాకు వాల్మీకి రామాయణ మూల గ్రంథముల నిచ్చి వ్రాయ బ్రోత్సహించుట మరువలేను. నా  సహధర్మచారిణి ఇందిరాదేవి వ్రాతప్రతిని కంప్యూటర్ అను యంత్రములో అక్షర బద్ధము చేయుటలోను, నా సహాథ్యాపకుడు జొన్నలగడ్డ జయరామ శర్మ ,విషయమును నిర్దుష్టము చేయుటలోను నిరంతరము శ్రమించున్నారని వారికి తెలుపగా వారమితానందము పొందిరి.
          "ఆడబోయిన తీర్థమెదురొచ్చినట్లు, కోరకనే దేవుడు వర మొసగినట్లు,తెలవారు జాము కల నిజమైనట్లు, 21వ తేదీన నా సోదరీమణి, చరవాణిలో "రేపు ఒంటిమిట్టకు వెళదాము అన్నయ్యా"
అని పిలవటం నిజంగా అమితానందాన్ని కలిగించింది. మధుర మనోహర అనూహ్య సంఘటన."
       ఈ తీర్థయాత్రలోనే పురాతన దేవాలయాలను కొన్నిటిని దర్శించాము. 21న ఒంటిమిట్ట కోదండ రామస్వామి,నందలూరు సౌమ్యనాథుడు,తాళ్లపాక అన్నమయ్య, అత్తిరాల పరశురామాలయము, దేవుని కడప, దర్గా చూచాము.22న పెన్నా నదీ తటమున ఉన్న, రెండవ కాశీగా ప్రసిద్ధి నందిన పుష్పగిరి నిలయుడైన లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి, సంతాన మల్లికార్జున స్వామిని,పోతులూరి వీరబ్రహ్ర్మేంద్ర స్వామి, మహానందీశుని ఆలయాలు దర్శించుట జరిగినది.
      త్వరలో ఒక్కొక్క క్షేత్ర ప్రాశస్త్యము, చూచిన నా అనుభూతి వ్రాస్తాను.

20, అక్టోబర్ 2016, గురువారం

ఎంత దయో దాసుల పై 21.10.2016

మనము జీవితములో అనుకున్నవి , అనుకోనివి , జరుగుతూ ఉంటాయి, ఏది ఎప్పుడు జరుగుతుందో మనకు జరిగేవరకు తెలియదు. సూర్య శ్రీరామాయణం పూర్తి అయినతరువాత ఒంటి మిట్ట వెళ్లి స్వామి దర్శనం చేసికొని వ్రాసిన సూర్య శ్రీరామాయణం రాముని పాదాల చెంత ఉంచి తీసికొని వద్దామని అనుకొన్నాను . కాని  నా మీద దయతో ముందే అనుగ్రహించి రప్పించుకొంటున్నాడు స్వామి ఒంటి మిట్టకి. రామా నీకెంత దయో దాసులపై .... 
   ఈరోజు రాత్రికి బయలుదేరి 22.10.2016 న ఉదయం  స్వామిని దర్శించుకొని అచటి అర్చకాచార్యుల సలహాతో నేను 2014 న ప్రారంభించిన సూర్యశ్రీరామం వ్రాత ప్రతి వారికి చూపి దానిని స్వామి పాదాలచెంత కొంత తడవుంచి అచట ఈ సంఘటన వీడియో తీయించుకొని రావాలని సంకల్పం.
      ఒంటిమిట్ట కోదండరాముడు " ఏరా నాయనా! నా కథ తెలుగులో వ్రాస్తున్నావటగా , ఏదీ ఎలా ఉందో నేనే స్వయంగా చూస్తానిలా రారా! , పూర్తి అయిన తరువాత అప్పుడు మరల చూస్తాలే, నీ పాండిత్యమేపాటిదో చూడాలని, నిన్ను ఆశీర్వదించాలని కుతూహలంగా ఉండి ముందు రమ్మన్నానంతే, భయపడకు! " అని పిలిచినట్లున్నది.

ఓ చిట్టితల్లీ !!

                             🚺 ఓ చిట్టి తల్లీ!🚺

                              ఓ చిట్టి తల్లీ!
 1.కవికి భావమె విలువ, సరసుకందమె కలువ,తగదు వైరిగనిలువ......  ఓ చిట్టితల్లీ!
 2. రవిని ప్రాణులు కొలుచు, శశిని తల్లులు పిలచు,కవిని రాజులు తలచు.                            
   3.భువిని జీవులు నిలచు, నెలత ప్రియతము వలచు, సతము ధర్మమె గెలుచు.
 4.నీట ప్రబ్బలి పెరుగు, నీరు పల్లమునెరుగు, నిజము దైవంబెరుగు.
 5.ఉప్పు నీటనుకరుగు, మంచి యోచనమెరుగు, లోకతత్త్వము నెరుగు.
 6.సుధలు గురియునుకలము, భూమి దున్నునుహలము, కష్టపడినను ఫలము.
 7.అమ్మ మనసది వెన్న, మనదు నదియన పెన్న,మనకు దేశమె మిన్న.
 8.కన్న తండ్రిని మించు,ఉన్న ఖ్యాతినిబెంచు,కష్టముల సహియించు
 9.కలుగ నీకును లోటు,ఆడి తప్పగచేటు,నిలువ యుండదుచోటు,
10.వాణి జ్ఞానము నిచ్చు, లక్ష్మి సంపదదెచ్చు,గౌరి సత్యము మెచ్చు.
11.యశము జూచిన తెలుపు,అపయశంబది నలుపు, మమత జగమున గెలుపు.
12.నేల మీదను మొక్క, నింగి లోనను రిక్క, జీవితముతైతక్క.
13. పగలు రేయన రోజు, మనసు పండిన మోజు, ప్రమద హృదిరేరాజు.
14.పాలు కుడుచును లేగ, పైకి ప్రాకును తీగ,చదువు నేర్వుమ వేగ.
15.నదుల పుట్టుక కొండ,వర్షమున నీరెండ,తలచ దైవమె యండ.
16.మంచి చేయగ కరము,దాని బొందుట వరము, అపుడుకీర్తియె స్థిరము.
17.శివుడు జీవికిరాజు,సింగమడవికి రాజు,సోమరె పోతరాజు.
18.విషపు మనుషుల చెంత,మనుట యెంతయొ చింత,వలదు వలదో కాంత.
19.జ్ఞాన శూన్యము శిలలు,తర్కపూర్ణము తలలు,అలుపు లేనివి యలలు.
20.సుకవి పంచును సుథలు,చదివి సతతము కథలు,మదిని వ్యధలు.
21.అమ్మ పెట్టగ వండి, మితము గలిగిన తిండి,రోగమెక్కడిదండి.
22.రానీకుజ్ఞానపథమును తెలుపు,కష్టమునచెయి గలుపు,మదిని ప్రేమను నిలుపు.
23.అమృతభాండము తెలుగు,త్రావ క్షేమము గలుగు,అదియె నీకగు వెలుగు.
24.ఆదికవినన్నయ్య, సూత్రకవి చిన్నయ్య,దైవమన కన్నయ్య.
25.మనసు తేటగనుంచు,మమత సమతలు పెంచు,మధుర ప్రేమనె పంచు.
26.కుంభకర్ణుని భ్రాత,రావణునితలరాత,మార్చ వచ్చెను సీత.
27.జీవితంబున తెరవు,చూపుచుండును గురువు,దాన బెరుగును పరువు.
28.వర్ణములేబదారు,అచ్చులుగనపదారు.పరుషముల్ సరియారు.
29.కనవిసర్గలు మూడు,హల్లులు ముప్పదేడు, వ్యాకరణముంజూడు.
30.భాషలోనను సంధి,చెప్పకుమ విసంధి, మంచిపేరు సుగంధి.
31.గ్రంథపఠనము మేలు,చేసికొనుమా వీలు,సుఖమగు  జీవితాలు.                 32.గాలిమేడలు కూలు,త్రాగుబోతులె తూలు,సింగ మునకే జూలు.
33. కోపమేశాపంబు,గ్రీష్మమే తాపంబు,నీచమేపాపంబు.
34. చీమ అల్పపు ప్రాణి,తానె కోటకు రాణి,చెల్లదిప్పుడు కాణి.
35. వసుధ పుట్టును చెట్టు,పైకి క్రిందికి మెట్టు, అశ హద్దునబెట్టు.
36. వసువు పుటమును బెట్టు,క్షేత్రములనిలచుట్టు,రాక్షసుల పనిబట్టు.
37.ఇంటి విషయము గుట్టు,మంచిపని తలపెట్టు,దేశమన జైకొట్టు.
38.పాము తోడను చెలిమి, కలిమి తోడను బలిమి, గుండెదరియౌ కొలిమి.
39.నమ్మబోకుమ పరుల,గర్వమందకు సిరుల,నరుకబోకుమ తరుల.
40.మంచి మాటనె చెప్పు, స్త్రీలకందమె కొప్పు,దానగుణమది యొప్పు.
41.వ్రాయగావలె కలము,దున్నుటకునిల హలము,కష్టపడిననె ఫలము.
42.నేల మానవరాజు,నింగినానెలరాజు,స్తుతులకేభట్రాజు.
43.కొమ్మ రెమ్మల పూలు,కదిపినంతనెరాలు,చెలిమికిలజవరాలు.
44.త్రాగు స్వచ్ఛపు నీరు,పారవేయకు నోరు,శాంతమెల్లెడ కోరు.  45.మట్టిదివ్వెల వెలుగు,అంధకారమె మలుగు,శుభము నీకిల కలుగు.
46.పదుగురాడెడు మాట, తాళముండెడు పాట,జగము మెచ్చెడు బాట.
47.దానగుణమది మిన్న,కడప నున్నది పెన్న,అమ్మ మదియే వెన్న.
48.భారతంబున యుక్తి, రామకథలో శక్తి,భాగవతమున భక్తి.
49.డాంబికంబులు వద్దు,హద్దునుండుట ముద్దు,జ్ఞానహీనుడు మొద్దు.
50.సంఘమందలి రీతి,పాటిసేయగ ఖ్యాతి,తప్పబోకుమ నీతి.

విజయ రహస్యం.

                                తుదిపోరు ఫలితం "తెలుగాట". 19.10.2016.

ఈ రోజు తెలుగాట చాల ఉత్కంఠతో సాగింది. వైశాఖ మాసంలో మండుటెండలకు విలవిలలాడుచున్న తరుణంలో వరుణదేవుని కరుణచే  తడిసి ముద్దై పరమానందం కలిగినట్లు మొదటి ఆవృతంలో పూర్ణబిందువుతో దిగాలుగానున్న "లలిత"కు ఒక్కసారే మూడు వెయ్యి గుణాల ప్రశ్నలు , మరి కొన్ని  చిన్న ప్రశ్నలు సరైనవి కావటం వలన మొత్తం గుణాలు 4000.అయినవి. మొదటి నుండే ఆధిక్యంలో నున్న ప్రత్యర్థికి (ఢిల్లీ శ్వరరావు)4100గుణాలు ఉన్నాయి.
      ఇక్కడనుండే పందెపు ఆట ప్రారంభం. లక్ష్మీ దేవి కరుణా కటాక్ష వీక్షణాలు ఎవరి మీద ప్రసరిస్తే వారికే సంపూర్ణ విజయం. చిన్నమ్మ తలుపు తట్టగానే పెద్దమ్మ పారిపోతుంది. చక్కని సమయ స్ఫూర్తితో  ఆలోచనలు రావాలంటే ఆమె చలువ చూపులు, కరుణారస దృష్టి ఉండాల్సిందే. అదే జరిగి పందెంలో "లలిత" 500, గుణాలు, ఢిల్లీ శ్వరరావు గారు 2000గుణాలు పందెం కాయటం జరిగింది. ప్రశ్న " ఈ వాక్యము ఏ ఛందస్సులో ఉన్నది?" ..."శంకరంబాడి సుందరాచారిగారు".(తే.గీ)
అందరికి ఉత్కంఠ...విజయమెవరిదోనని, ఈలోగా వారివారి పాండిత్య ,స్వభావ, సమయస్ఫూర్తుల విశ్లేషణ జరిగాయి.
         మీరు పెట్టిన పందెపు సొమ్ము చూపమన్నారు. ఢిల్లీశ్వరరావుగారు కొంచెం అధిక ఆత్మవిశ్వాసం తో 2000గుణాలు, లలిత ఎందుకొచ్చిన ఇబ్బంది తగ్గి ఉంటే ఎందుకైనా మంచిదని,500, పెట్టారు. మీరు వ్రాసిన సమాధానాలు చూపమన్నారు. నలుగురు తప్పు సమాధానాలు వ్రాశారు. ఇంకేముంది తగ్గి న లలిత 4000-500=3500,గా, ఢిల్లీశ్వరరావు4100-2000=2100గా మిగిలారు. ప్రథమ విజేత లలిత.
         విజయానికి వెనుక విశ్లేషణలను, విశ్లేషించటానికి ఎంతో వివేకం, అనుభవం కావాలి. అది దైవ బలమా, పాండిత్య బలమా, లాభనష్టాల తూనికలో నైపుణ్యమా, మరి ఈ స్థితిలో ఏది పనిచేసిందో....నేనైతే దైవ బలాన్ని నమ్ముతాను. అది ఉంటే సర్వము దాని వెంటే ఉంటాయి.


18, అక్టోబర్ 2016, మంగళవారం

తెలుగాట....జీవన సమరం

                                     జీవన సమరం...తెలుగాట...
ఆట పాటలతో చిన్నతనంలో, ఆటు పోట్లతో మధ్య వయస్సులో, ఆ రెండింటి సమన్వయం కుదరక ఆపోటు ఈపోటుతో వృద్ధాప్యం గడుస్తు నాటక చివరి అంకానికి వచ్చి పాత్ర ముగింపు పలుకుతుంది. ఇదే జీవన సమరం. పుష్కలంగా సిరి సంపదలు ,అనురాగాలు , రాగాలు లభిస్తుంటే సమరం అక్కరలేదు, వాటి మధ్య సమన్వయం కావాలి. నిత్యజీవితావసరాలు కరువై నప్పుడే అసలు సమరం., చూపే త్యాగాలు, సాహసాలు, తెలివి, సమయస్ఫూర్తి అవసరమౌతాయి.
      జన్మ , ఆరాటంతో కూడిన పోరాటం నుండే  ప్రారంభమౌతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఈ ఆరాట పోరాటాలు ముందు జీవితావసరముల కొరకైతే, తదుపరి విలాసాల కొరకు. ఏది యేమైన పోరాటం లేని గెలుపు లేదు. పోరాడకుండ వచ్చే గెలుపు గెలుపు కాదు. అవసరాల మేరకే పోరాట పటిమ ఉంటుంది. పెరుగుతుంది. మన శరీర అవయవాలలో దేనికి ఎక్కువ శ్రమ ఇస్తామో అదే బాగ ఆరోగ్యంగా వృద్ధిచెందుతుంది.

    ఇక తెలుగాట విషయానికి వస్తే......

    తెలుగు భాషాభివృద్ధికి ఇదొక చక్కని మానసిక వికాసాన్ని, దృఢత్వాన్ని కలిగించే ఆట. ఈ ఆట దాదాపు రెండేళ్ల నుండి సాగుతున్నది. దీనిని సిలికానాంధ్ర, టి.వి.9 సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.    ఈ ఆటలో మీట ఉన్నది. మీట సమయానికి నొక్కటంపై ఆధారపడి ఆట ఉన్నది. ( నిర్వాహకులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు) ఆయన ప్రశ్నించిన వెంటనే మీట నొక్కాలి , అప్పుడది కంప్యూటర్ లో నమోదు చేయబడి సభ్యుని పేరు తెలుపుతుంది. వారే సమాధానం చెప్పాలి. మొదటి తిరకాటం, లో ప్రశ్నలకు 100, గుణాలైతే రెండవ తిరకాటంలో 200గా అవుతాయి. చివర పందెం కాచే అంకం. సంపాదించిన గుణాలను పందెంలో పెట్టి తెలివి సమయస్ఫూర్తి నిరూపించుకోవడం. మన పెద్దవాళ్లు మనకు నేర్పింది " న్యాయంగా  సంపాదించు, దానిని సద్వినియోగం చెయ్యి "అని. అది ఈ ఆటలో బాగా పనికి వస్తుంది. ఎంత పందెం కాస్తే అక్కడివారు వారి వద్ద ఉన్న మొత్తం కన్నా మనదే యెక్కువ అవుతుందో అవగాహన కావాలి. అప్పుడే విజయలక్ష్మి మనలను వరిస్తుంది. "ధైర్యే సాహసే లక్ష్మీ" అనే సూక్తి సార్థకం అవుతుంది.
        17.10.2016న జరిగిన ఆట, పందెం పోటీలో  సాహిత్యం, పాండిత్యం కన్నా, సాహసం, తెగింపు, సమయస్ఫూర్తే విజయం సాధించింది.  జయరామశర్శ గారి గుణాలు..4౩00. ప్రత్యర్థి గుణాలు. 2700. (పందెం గెలిస్తే పెట్టిన ధనం రెట్టింపు అవుతుంది.)
     అందరు జయరామశర్శగారిదే విజయమని దృఢంగా నిర్ణయం చుకొన్నారు. అయినా ఆయన స్వభావాన్ని బట్టి, అతి జాగ్రత్త , పొదుపరి కనుక ఎక్కువ పందెం కాయడు అని స్వభావం తెలిసినవారి నిర్ణయం. ప్రత్యర్థికి మరో మార్గం లేదు. విజయమో వీర స్వర్గమో. అందుకే సర్వం పందెంలో ఒడ్డింది.  అందరికీ ఉత్కంఠ.... పందెం ఎవరెంత పెట్టారో సమాధానం తరువాత కాని చెప్పరు. .... అయిపోయింది ....సాహసమే గెలిచింది. పాతాళ భైరవిలో యస్. వి. రంగారావు "సాహసము సేయరా డింభక", "ధైర్యే సాహసే లక్ష్మీ"" అన్నీ ఋజువు చేస్తూ ప్రత్యర్థి గెలిచింది..

          సాహిత్యపు గెలుపు ఒకరిది, సాహసపు గెలుపు మరొకరిది.  తుది గెలుపే లెక్క....

   నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు ఔరా!!!! అనుకున్నారు.

12, అక్టోబర్ 2016, బుధవారం

తెలుగాటది.15 10.1 6 టి.వి. 9. (2)

తెలుగాట  కార్యక్రమమునకువెళ్ళు  సందర్భమున వ్ర్రాసినపద్యాలు.                                 ది.15 10.1 6. వారం వారం  టి.వి. 9. లో
                                       నా పరిచయం   

  నేటి తెలుగాట కెచ్చట 
 పోటీనే లేదు  లేదు భూతలమందున్ 
మాటుగ నాకంబందున 
చోటును గడియించెనేమొ  సూనృత చెపుమా . 1.

ఆటలు సాహిత్యంబున  
మేటిగ మరి వచ్చుచుండ మేదిని మధువై 
ధాటిగ తెనుఁగుం గురియును 
సాటే లేదింక మనకు సౌమ్యానందా                2.

పొన్నెకంటి వంశ పూర్ణ సుధామ్బుధి        
చంద్ర శేఖరాఖ్య సాదు మతికి 
అమృత మూర్తి యైన అనసూయ ముదితకు 
సూర్యనామమున్న సుతుడ నేను.             3. 

ఆనంద నామధేయులు 
తానై సాహిత్య సుధను త్ర్రావుచు నెపుడున్ 
తానానందము నందక 
పానా ర్థులకిచ్చ నిచ్చు పరవశమందన్         4.  


ఆట పాటలతో చిన్నతనంలో, ఆటు పోట్లతో మధ్య వయస్సులో, ఆ రెండింటి సమన్వయం కుదరక ఆపోటు ఈపోటుతో వృద్ధాప్యం గడుస్తు నాటక చివరి అంకానికి వచ్చి పాత్ర ముగింపు పలుకుతుంది. ఇదే జీవన సమరం. పుష్కలంగా సిరి సంపదలు ,అనురాగాలు , రాగాలు లభిస్తుంటే సమరం అక్కరలేదు, వాటి మధ్య సమన్వయం కావాలి. నిత్యజీవితావసరాలు కరువై నప్పుడే అసలు సమరం., చూపే త్యాగాలు, సాహసాలు, తెలివి, సమయస్ఫూర్తి అవసరమౌతాయి.
      జన్మ , ఆరాటంతో కూడిన పోరాటం నుండే  ప్రారంభమౌతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఈ ఆరాట పోరాటాలు ముందు జీవితావసరముల కొరకైతే, తదుపరి విలాసాల కొరకు. ఏది యేమైన పోరాటం లేని గెలుపు లేదు. పోరాడకుండ వచ్చే గెలుపు గెలుపు కాదు. అవసరాల మేరకే పోరాట పటిమ ఉంటుంది. పెరుగుతుంది. మన శరీర అవయవాలలో దేనికి ఎక్కువ శ్రమ ఇస్తామో అదే బాగ ఆరోగ్యంగా వృద్ధిచెందుతుంది.

    ఇక తెలుగాట విషయానికి వస్తే......

    తెలుగు భాషాభివృద్ధికి ఇదొక చక్కని మానసిక వికాసాన్ని, దృఢత్వాన్ని కలిగించే ఆట. ఈ ఆట దాదాపు రెండేళ్ల నుండి సాగుతున్నది. దీనిని సిలికానాంధ్ర, టి.వి.9 సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.    ఈ ఆటలో మీట ఉన్నది. మీట సమయానికి నొక్కటంపై ఆధారపడి ఆట ఉన్నది. ( నిర్వాహకులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు) ఆయన ప్రశ్నించిన వెంటనే మీట నొక్కాలి , అప్పుడది కంప్యూటర్ లో నమోదు చేయబడి సభ్యుని పేరు తెలుపుతుంది. వారే సమాధానం చెప్పాలి. మొదటి తిరకాటం, లో ప్రశ్నలకు 100, గుణాలైతే రెండవ తిరకాటంలో 200గా అవుతాయి. చివర పందెం కాచే అంకం. సంపాదించిన గుణాలను పందెంలో పెట్టి తెలివి సమయస్ఫూర్తి నిరూపించుకోవడం. మన పెద్దవాళ్లు మనకు నేర్పింది " న్యాయంగా  సంపాదించు, దానిని సద్వినియోగం చెయ్యి "అని. అది ఈ ఆటలో బాగా పనికి వస్తుంది. ఎంత పందెం కాస్తే అక్కడివారు వారి వద్ద ఉన్న మొత్తం కన్నా మనదే యెక్కువ అవుతుందో అవగాహన కావాలి. అప్పుడే విజయలక్ష్మి మనలను వరిస్తుంది. "ధైర్యే సాహసే లక్ష్మీ" అనే సూక్తి సార్థకం అవుతుంది.
        17.10.2016న జరిగిన ఆట, పందెం పోటీలో  సాహిత్యం, పాండిత్యం కన్నా, సాహసం, తెగింపు, సమయస్ఫూర్తే విజయం సాధించింది.  జయరామశర్శ గారి గుణాలు..4౩00. ప్రత్యర్థి గుణాలు. 2700. (పందెం గెలిస్తే పెట్టిన ధనం రెట్టింపు అవుతుంది.)
     అందరు జయరామశర్శగారిదే విజయమని దృఢంగా నిర్ణయం చుకొన్నారు. అయినా ఆయన స్వభావాన్ని బట్టి, అతి జాగ్రత్త , పొదుపరి కనుక ఎక్కువ పందెం కాయడు అని స్వభావం తెలిసినవారి నిర్ణయం. ప్రత్యర్థికి మరో మార్గం లేదు. విజయమో వీర స్వర్గమో. అందుకే సర్వం పందెంలో ఒడ్డింది.  అందరికీ ఉత్కంఠ.... పందెం ఎవరెంత పెట్టారో సమాధానం తరువాత కాని చెప్పరు. .... అయిపోయింది ....సాహసమే గెలిచింది. పాతాళ భైరవిలో యస్. వి. రంగారావు "సాహసము సేయరా డింభక", "ధైర్యే సాహసే లక్ష్మీ"" అన్నీ ఋజువు చేస్తూ ప్రత్యర్థి గెలిచింది..

          సాహిత్యపు గెలుపు ఒకరిది, సాహసపు గెలుపు మరొకరిది.  తుది గెలుపే లెక్క....

   నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు ఔరా!!!! అనుకున్నారు.

2, అక్టోబర్ 2016, ఆదివారం

న్యూనాగోల్ సమావేశం.2.10.2016

రఘుప్రసాద్ గారు,జోనల్ కమీషనర్. ముఖ్య అతిథిగా, సింగయ్యగారి అధ్యక్షతన "న్యూనాగోల్ లో సీనియర్ సిటిజన్స్" సమావేశం ది.2.10.2016,న సాయంకాలం 5గం.లకు ఘనంగా జరిగింది. ఆసందర్భంగా ఐదుగురు సీనియర్ సిటిజన్స్ కు సంస్థ తరఫున సన్మానం జరిగింది. రఘుప్రసాద్ గారు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. వారికి సర్వదా కృతజ్ఞతలు.
       ఆ సందర్భంగా సభ్యులకు నేనిలా స్వాగతం పలికాను.

  1. స్వాగతమో వయోగుణ సుసాధిత జ్ఞాన సమృద్దులార! స
      ర్వాగమ ధర్మనిర్మల విరాజిత మానిత ధుర్యులార! మీ
      యాగమనంబుమాకిపుడు హ్లాదముగూర్చును,సంస్థకున్ మహా
      భోగపుహేతువైచనునుపూర్ణమనోజ్ఞత పాదముంచుడీ!
                          సంస్థ స్థాపన.......
 2. రెండువేలపదిన పండిన యోచనన్
     జనవరి నెలలోన జననమందె
     నవ్యసంస్థ యిదియె నాగోలు పేరునన్
     దివ్యశక్తి మతిగ తేజరిల్లె.
 3. స్త్రీలు పురుషులిచట చైతన్యవంతులైకక
      నిలచియుండి తమదు నేర్పుమీర
     సభ్యులైరి కలసి సంస్థ శ్రేయస్సుకై
     వృద్ధి జెందెకీర్తి హృద్యముగను.
            ఈ రోజు ప్రాముఖ్యం.......
 4. ఐక్యరాజ్యసమితి యాధ్వర్యమందున
      విశ్వవృద్ధులకది వేడుకనగ
      జన్మదినమటంచు చాటించె ప్రభుతయె
      అక్టొబరొకటిన మహాద్భుతముగ
 5. ఐదుమంది సభ్యులర్హత గుర్తించి
     వయసులోన దగిన వారిజేర్చి
      గారవంబుసేయు ఘనమైన కార్యమున్
      సలుపుచుంటిమిచట సౌమ్యులార !
             సంస్థ లక్ష్యములు.....
 6. సభ్యులందరిలోన సాంఘిక చేతనన్
                         లాలన గలిగించు లక్ష్యమనగ
     సహకారమందించి సౌమ్యతగురిపింప
                          లాలించురీతులె లక్ష్యమనగ
     పుట్టిన రోజులన్ మోదాన గుర్తించి
                          లఘుగారవంబిడు లక్ష్యమనగ
      ఆటపాటలతోడ నారోగ్యమందించి
                           లౌక్యాన నడిపించు లక్ష్యమనగ
       స్థాపనంబైన చిరకాల సంస్థ మనది
       పెద్దవయసున్న మాన్యులు పేర్మిబొగడ
       నూతనంబైన నాగోలు పూతమవగ
       సద్యశమ్మును నార్జించె సౌమ్యులార!.
 

24, సెప్టెంబర్ 2016, శనివారం

సెల్ఫీ అనర్థాలు.😥😥😥

          😥   సెల్ఫీల అనర్థాలు.😥

  1. మంచిచెడ్డలవియ మనసున రానీదు
      చిత్రములనుదీయు చేష్టబెంచు
      చిన్నపెద్దలందు స్నేహితులందున
      చిన్నవాడ వినుము సెల్ఫి చరిత!
  2. తనదు రూపు మరియు తనవారిచూపులన్
      క్షణములోనెజూడ కాంక్షబెంచు
      నెంతమందియున్న నెవ్వరేమన్నను...చిన్న...
  3. శాస్త్ర విజ్ఞతలను సర్వత్ర సౌఖ్యాల
      నందుకొనగవలెను నదియు నిజమె
      జ్ఞానివగుచునీవు జ్ఞానంబుబెంచుకో...చిన్న...
  4. నేటియువతకెన్ని నీతులజెప్పినా
      నీటిరాతలగును నిజము సుమ్ము
      పెద్దలన్నమాట పెన్నిధి సమమురా...చిన్న...
  5. ఇతరదేశములను నేరీతినిందింతు
      వారికట్టుబాట్లు వారివగును
      మనదు సంప్రదాయ మహిమలనెఱుగుమా...చిన్న.
  6. స్నేహ భావమంచు చిత్రాలదీయుచు
      మనసువిరుగగానె మార్చి తలలు
      పగనుదీర్చుకొనెడు పాపిష్ఠులుందురు.చిన్న...
 7. ఇంజనీరు విద్య యెంతగొప్పదియైన
      నీయలేదువారికింగితంబు
      ఐదుగురును శివుని నైక్యంబునందిరి...చిన్న...
 8. అందమైనకాల్వలందని నదులలో
     నూబులందు ఘనపుటుదధులందు
     సెల్లుఫోనుతోడ చిత్రాలు వద్దురా!..చిన్న...
9. పర్వతాలచెంత పశువులచెంతను
    మరణస్థలము, పరుల మగువచెంత
    చేరి సెల్ఫిదీయ చిక్కులు దెచ్చురా!...చిన్న...
1౦. హాబియంచునీవు హర్షించుచుందువు
     హడలుచుంద్రు నీకునయినవారు.
     వారిశ్రేయమెంచి వారించు "సెల్ఫీ"లు...చిన్న...
😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇

   
   

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

తిరుపతి యాత్ర పద్యాలు. 22.09.2016.

            తిరుమల  శ్రీవేంకటేశ దర్శనమ్.(22.09.3016)

 1.  కంటిని వేంకటేశు ఘన కాంక్షలుదీరగ తన్మయత్వముం
      గంటిని సప్తశైలముల కంజదళాక్షు మహోన్నతత్త్వముం
      గంటిని శ్రీనివాసునల క్రన్ననభక్తులుజేరి మ్రొక్కగం
      గంటిని దివ్యమంగళుని కన్ను లపండువుగాగచేఱువై.
 2.  వింటిని వేయినామములు వీనులవిందుగ పర్వతాగ్రమున్
      వింటిని దేవదేవుకడు వేడుకబాడెడు కీర్తనావళిన్
      వింటిని సత్కథావళులు వేలకువేలుగ నెల్లవారిచేన్
      వింటిని వేదమంత్రముల విశ్వవికాసుని దివ్యలీలలన్.
 3.  ధన్యములాయె చక్షువులు తామరసాక్షుని దర్శనంబునన్
      ధన్యములాయె శ్రోత్రములుదంచితరీతిని కీర్తనాళిచేన్
      ధన్యములాయె హస్తములు తత్పదసేవనుజేయుటన్సదా
      ధన్యపు జీవితంబగును దైవ వినిర్మల నామచింతనన్.

                 వెల్లూరు  శ్రీలక్ష్మీదేవి దర్శనమ్.


 4. శ్రీహరి పాదపద్మముల చిర్నగవుల్మెరయంగ నొత్తుచుం

     దేహములోనిదేవియయి దివ్యమనోహర లక్ష్మి రూపమై
     ఊహకునెన్నరానివిధమున్ తన భక్తజనాళికిన్ సదా
     దాహముదీర్చునట్లుగను దానిలబంచును రత్నరాసులన్.
 5. శ్రీపుర వాసియైబరగి చిన్మయ రూపిగ ఖ్యాతినందియున్
     బాపురె భక్తకోటికిల బంగరు తల్లిగ భద్రవల్లిగా
     ప్రాపునుజేరినన్మరియు పాయనిగూర్మిని జింతజేసినం
     బాపములెల్లడుల్చి నిరపాయముగూర్చుదయాంతరంగయై.
 6. అందిన నీదుపాదరజమా కమలాక్షుని హృన్మనోబ్జరా
     గేందిర!సుందరీమణి! మదీయ శుభాంచిత పుణ్యశాలినై
     బొందెదనమ్మ సౌఖ్యముల మోదముతోడుత విష్ణుపత్నిరో!
     సందియమందనేలనిను చాలగగొల్చిన మోక్షమబ్బదే?

                  కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి


 7. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం

     దావులనింపినావుగద ధన్యతగూర్చుచు కాణిపాకము
     న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ!మూషికాధిపా!
     కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!
 8. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్
     కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్
     స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా
     నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!
 9. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో
     చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో
     భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ
     ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.

10. ఉంచితి నాదుభావనల నూహకు గల్గిన నంతమాత్రముం

       గాంచనగర్భురాణి నను గ్రన్నన గాచి రసాంచితంబుగ
       న్నంచితరీతిబల్కుమని నాజ్ఞయొసంగిన దానిమీరకం
       బంచితి నార్యులార!యిక బ్రాజ్ఞతతో గుణదోషమెంచుడీ!
     


   



   
   

   
   
   
     

      

10, సెప్టెంబర్ 2016, శనివారం

నాగోలు పద్యాలు.

    1.    సీ. సీనియర్ సిటిజన్సు శ్రేయంబు కాంక్షించి
                          నాగోలు ప్రాంతాన జ్ఞానులంత
             ఒకరికినొకరౌచు నొద్దిక మీరంగ
                           సాయంబునందించు సరసులగుచు
             సంగీత సాహిత్య సమ్మేళనంబులన్
                            సత్కళల్ జొనిపించి చక్కబరచి
             ప్రాచీన యోగంబు పరమౌషధమ్మని
                           యమలుజరుపునట్టి యార్యులున్న
            ఇట్టి సంస్థ యెదిగె ఈశుని సత్కృపన్
             ఆరు వత్సరాల యవధిదాటె
             స్వాగ తాంజలులివె సజ్జన వరులార!
             సంస్థ జయముగోరు సౌమ్యులార!

     2.     ఆటల పాటలంగలసి యందరు సభ్యులు బాలబాలురై
              నేటికి షష్టిపూర్తియయి నిశ్చల నిర్భయ దేహకాంతితో
              ధాటిని జూపగోరెదరు ధార్మిక పూర్ణులు సత్యవర్తనుల్
              మేటిగుణాఢ్యులౌ సరస మిత్రులు పల్కెడు స్వాగతంబిదే.

     3.     కొమరు రాజు వారి కూర్మి సాయమునంది
              పరిఢవిల్లె సంస్థ ప్రాభవంబు
              శిరమువంచి వారి శ్రేయంబుగోరుచు
              పలుక వలెను శుభము ప్రాంజలించి.
   
     4.   భారముకాదులే వయసు భక్తిని నింపిన డెందమంతయున్,
           భారముకాదులే మనసు పర్వతమంతటి ఆత్మశక్తితోన్ ,
           భారముకాదులే తనువు బంధిత స్నేహసమావృతంబునన్
           చేరుడి సభ్యులౌచుమన చేరువనున్నవి శాలసంస్థలోన్.

     5.  నాగోలుసభ్యులెల్లరు
          భూగోళపుటెల్లలెల్ల పుష్కల రీతిన్
          క్రీగంటజూడ నేర్చిరి
          వేగంబుగజేరియిచట విజ్ఞులుగారే.
         
           
           
           
     

మడిపల్లి వారి.లక్ష్మీ నృసింహ శతకం

మాన్యులు ,శ్రీ మడిపల్లి భద్రయ్యగారి లక్ష్మీ నృసింహ శతకము గ్రంథావిష్కరణ సందర్భంగా అభినందన పద్యాలు. 30.06.2016.

1.సీ. హస్తినాపురమున నవధానక్షేత్రాన
                       సాహితీ స్నేహంబు సాగెమాకు
         పద్యరచన ఘన పారవశ్యంబున
                       జేయుచునుండగ జెలిమిగలిగె      
         కంఠమెత్తి కవిత గానంబుజేయగా
                       నిండుమనసుతోడ నెయ్యమబ్బె
        నవరస భావాలు నవ్వల జల్లులు
                        పూవులై పూయించ మోదమయ్యె
  తే.గీ.  వారలెవ్వరో కాదు మా భద్రనామ
            యశులు మడిపల్లి ధీరులత్యంత ఘనులు
            నారసింహుని సత్కృపన్ ధారగల్గి
            కావ్యమందించుచున్న సంభావ్య వరులు.

2.సీ. గొంతెత్తి పాడెనా కోకిలమరపించు
                    నవరసంబులజూపి నవ్యఫణితి
         పద్యంబు రచియింప హృద్యంబెయౌనుగా
                     సత్కవుల్ పొగడంగ సభలయందు
         సాహిత్య సంగీత సమ్మేళనంబుల
                       కాలుమోపినజాలు ఘల్లుమనును
          నాటకరంగాన నాణెంపు నటనతో
                        పాత్రలో లీనమై పరవశించు
  తే.గీ. అట్టి మడిపల్లి భద్రయ్య హస్తినపుర
           మందు నాకు మిత్రుడగుట మరువలేను
           నారసింహుడు సతతంబు వారికెపుడు
           కోరుకొనినట్టి వరముల గూర్చుగాత!
   

మనస్సు




                                   మనస్సు....

                                          మనస్సు...

                ( మానవ మానస నవరత్న మాలిక   )
    రచన. పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
                      భాషా ప్రవీణ. యం.ఏ, తెలుగు.
                              ది.22.04.2016.

    సీ.ఎచ్చోట వెదకిన నెంత కష్టించినా
                  కనరాదు యేరికి ఖండితముగ
        ప్రాణికోటి సలుపు పాపపుణ్యాలకు
                  సాక్షిగ నిల్చు నీ  సమ్ముఖమున
        పూర్వజన్మంపు టపూర్వ ఫలితమన
                   సంచరించును నిస్సందియముగ
        కీర్త్యప కీర్తులన్ కేళిగా రావించి
                   నింగిని నేలపై నిల్పుచుండు
            చంచలంబైన చిత్రంపు లంచగొండి
            మరులు గొల్పెడు మధురంపు మాయదారి
            దారి తప్పగ యత్నించు తపన గలది
           "మనసు "గాకున్న నేముండు మాన్యులార!         1.

     సీ.సన్యాస ముంగొని సర్వంబు త్యజియించి
                    అదిమిపట్టగలేని యద్భుతంబు
        ఘోరతర తపము తోరపు నిష్టతో
                    అమలు పరచలేని యద్భుతంబు
        చిన్న పెద్దలలోన చిందులు ద్రొక్కుచు
                     హనుమ రీతి దిరుగు నద్భుతంబు
        పుష్పబాణునిచేతి పూవింటి పగిదిని
                     నమరిన యపురూప మద్భుతంబు
               ఏది యేదని యేదంచు నిహము పరము
               వెదకి జూచిన దొరకునా వింతయైన
             " మనసు" పేరున నొప్పెడు మాన్యమగుచు
               బ్రహ్మకైనను బుట్టించు రిమ్మ తెగులు.           2.
             
       సీ. రావణబ్రహ్మయే రమణి సీతను బట్ట
                                 దోహదపడినట్టి దుర్మనస్సు
            రాజ్యమోహాంధుడౌ రారాజు కప్పుడు
                                 దోహదపడినట్టి దుర్మనస్సు
            భస్మాసురునిచేయి భర్గుని శిరముంచ
                                దోహదపడినట్టి దుర్మనస్సు
            కంసుని ప్రేరేచి కన్నయ్య దునుమాడ
                                దోహదపడినట్టి దుర్మనస్సు
                ఇన్ని ఘోరాలు సలుపుచు నేహ్యమైన
                పాపములకొడిగట్టె నీ పాడు "మనసు"
                జన్మ జన్మాల వీడక జగతి దెచ్చి
                నీడ వోలెను చరియించు నివురుగప్పి.          3.

       సీ. రాముని సైతము రాజ్యంబు బోనాడి
                           మాటనిల్పుమనిన మంచిమనసు
            శిబిచక్రవర్తినే చిఱు పావురమునకై
                            మాంసంబు నిడుమన్న మంచిమనసు
            రామనామము తప్ప రహివేరు లేదని
                           మార్గమ్ము సూచించు మంచిమనసు
            పేద ధనికులన్న భేదాలు లేవని
                           మమతను సూచించు మంచిమనసు
              జగతి పుణ్యాల నెలవుగా జంతుతతికి
              కలుగజేయుచు వేవేల కాంతులీని
              జన్మ ధన్యత గూర్చంగ చక్కగాను
              కారణంబౌను సన్మతి క్రమముగాను.            4.

       సీ. నాప్రభావాననె నాశంబగునుగాదె
                         వంశవృక్షంబెల్ల వరలకుండ
            నాప్రభావాననె నవ్యంపు రీతిలో
                          నవ్యాంకురంబెల్ల నందగించు
            నాప్రభావాననె నవరసాలొలికించు
                           కావ్యాలు ప్రభవించు ఘనముగాను
            నాప్రభావాననె నాట్యావధానముల్
                           మైమరచి సభల మరులుగొల్పు
                నేనె "మనసును" మెదడును నింటనుండి
                కర్తనై , కర్మ బంధాలు కదలుచుండ
                సర్వమున్నరసి జగతి సాగరమును
                నీదుచుంటిని జన్మల నింతదనుక.             5.

        సీ. అదుపులో బెట్టిన నందలమెక్కించి
                           రారాజుగాజేయు రాజు నేను
             ప్రక్కకు దిరుగంగ గ్రక్కునదండింప
                            చక్కనై వర్తించు సాధు నేను
             పగవారి జంపగ పన్నాగమదియేల
                             వారిలో నున్నట్టి పోరు నేను
             జగతిని శాంతిని జరిపింప గోరిన
                            శ్వేతవర్ణంపు కపోతమేను
                   నేను నేనన నేనేను నేనునేను
                   మేన నున్నట్టి సుకుమార మీనునేను
                   ఎట్టి యవతారమైనను మెట్టగలను
                  "మనసు" పేరిట బరగుచు మాన్యనైతి.        6.

        సీ. కానరాకుండుటన్ లేనని యందురా?
                           విష్ణ్వంశ నాయందు విపులతరము
            చలనంబు లేదని ఛాందసముండెనా?
                            వాయువేగముమీరి వాలగలను.
            కరుణ లేదని మీరు కన్నెఱ్ఱ జేతురా?
                            కష్టజీవుల జూచి కరగిపోదు.
            మంచిచెడ్డలు నాకు మరిలేవనందురా?
                            మంచికి మంచిగా మసలుకొందు
                    ఇంత సద్గుణ శోభిత వింతజీవి

                    "మనసు" నాబడు నేగాక మరొకటున్నె?
                    సత్య శోధన జేసిన సర్వమందు
                    ఇదియె నిక్కంబని పరమేశుడనును.         7.

         సీ. శస్త్ర ధారులునను చాకున బాకున
                                 కండలుగాజీల్చ కానరాను.
              బహువిధ మంత్రాలు పఠియించినంగాని
                                 బయటపడగలేను భస్త్రినుండి
              భక్తుల హృదయాన పరమాత్మ రూపాన
                                 దాగియుందును నేను తప్పకుండ
              ధ్యాన యోగములందు ధ్యాసను నిల్పిన
                                 నిశ్చలత్వముగల్గి నిలచియుందు.
                      "మనస"నే నేను సతతంబు మారుచున్న
                       మంచిచెడ్డలు పరికించి మానవులకు
                       సాయమొనరింతు సంసారసాగరాన
                       మన్నన నాకిండు కోరకే మాన్యులార!.        8.

          సీ. ఖడ్గధారలకు నే గాయంబునొందను
                                కఠినంపు మాటకే గాయపడుదు
              విజ్ఞులేమన్నను విలువజేతునుగాని
                                 అజ్ఞాని నిందింప నహముకలుగు
              గురుదేవు నేవేళ కోరిమ్రొక్కుచునుందు
                                  శిష్యుల బ్రియమార  చేరబిలుతు
              ప్రేమతో నెవరేని ప్రియరాగముంజూప
                                   అక్కున కెప్పుడు హత్తుకొందు
                   విశ్వమందలి పరమాత్మ విలువదెలిసి
                  "మనసు" కలిగిన మానవా! మసలుకొనుము
                   మానవాళికి శ్రేయంబు మహిత యశము
                   నన్ను  కాపాడుకొన్నను నాకమబ్బు.              9.

     ఉ. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మనాదు చే
           తమ్మున ప్రేమమై నవసుధారస ధారల గ్రుమ్మరింప- నే
           కిమ్మనకుండ వ్రాసితిని కేలదియాపక "మానసంబు"పై
           నెమ్మది మీ విమర్శలను నే మదిగోరుదు చిత్తగింపుడీ. 1౦.
               

         




         

       









       



               
       





   
‌‌‌‌


               
       





   
‌‌‌‌

వందే గణనాయకమ్.2

   వందే గణనాయకమ్.

1. ప్రథమ తాంబూలమర్పించి ప్రాంజలింతు
    విఘ్నరాజుగ స్తుతియించి వేడుకొందు
    కార్యమేదేని తలపెట్టి ఘనతజెంద
    దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!

2. అమ్మ పార్వతి మలచిన బొమ్మవీవు
    అయ్య కరుణరేఖల వెనకయ్యవీవు
    పందెమందున తమ్ముని ప్రక్కనిడిన ...దొడ్డ.....

3. నిన్ను పరిహాసమాడిన నేరమునకు
    శాపమందెను నిర్దయ చంద్రుడపుడు
    ఘనత మీరగ సతతంబు గారవింతు...దొడ్డ.....

4. మాతపితలను సేవించు మార్గమొకటె
    సకలసౌఖ్యాల గనియంచు చాటినట్టి
    జ్ఞానివీవయ్య  వెనకయ్య!మానితుండ!...దొడ్డ.....

5. ఇర్వదొక్కటి పత్రాల నింపుగాను
    పూజలందుచు భక్తుల మోదమలర
    మోక్షమందించు పరమాత్మ! పుణ్యపురుష!...దొడ్డ...

6. గరికపూజకె ముదమంది దురితములను
    పారద్రోలెడు పరమాత్మ! భవ్యచరిత!
    కార్యసిద్ధిని గూర్చెడు ఘనుడవీవు...దొడ్డ...

7. మోదకంబుల నర్పింప మోదమంది
    వెనుకముందులుజూడక మనుజులకును
    సర్వవిజయాలు గూర్తువు సాధువదన!..దొడ్డ...

8. గర్వపడినట్టి తమ్ముని గర్వమణచి
    వినయశీలంబె సర్వత్ర విజయమంచు
    చాటిచెప్పిన ఘనుడవు మేటివయ్య!..దొడ్డ...

9. సర్వగణములధిపతిగ సాధనాన
    నీవు జూపిన ప్రజ్ఞకు నీరజాక్ష!
    మిగుల నాశ్చర్యమొందెను మిన్ను మన్ను..దొడ్డ...

10.పంటలన్నియు సతతంబు పాడుసేయు
     ఎలుక మీదను నీవుండి యెఱుకగూర్చి
     జ్ఞాననేత్రంబునిచ్చిన జ్ఞానివీవు.
     దొడ్డ గణపయ్య ననుగావు దురిత హరణ!



 

29, జూన్ 2016, బుధవారం

పాఠశాల పూర్వ విద్యార్థుల సన్మానాలు. . 25.06.2016.సన్మానము. పూర్వవిద్యార్థులు,30.12.22..


            ధూళిపూడి పాఠశాల శతవసంతం

 1. ఉల్లముపల్లవించును మహోజ్జ్వల కీర్తికి మారురూపుగా
       చెల్లిన ధూళిపూడి దరిజేరగ వచ్చుచు నుంటినన్న యా
       సల్లలితానుభూతి ఘన  శారద దివ్యమనోజ్ఞ దీవనల్
       వెల్లువ కావలెన్నచట వేడిన నే పసివానికేనియున్.
            2. తపన దీర్చి దిద్ది తనయంత వానిగా
                శిష్య తతిని సతము చెలిమితోడ
                తనను మించిపోవ తన్మయత్వముజెంది
                పరవశించువాడె పరమ గురువు.
3.  తలచు కొనిరి నాటి తమతమ గురువులన్
      శిష్యకోటి యమల చిత్తములను
      అట్టి వారి జూచి యానందమొందితి
      మృదుల ప్రేమ విరియ హృదయమంత.
          4.  పాట పాడి రచట పరవశమందుచు
               కవితలల్లినారు ఘనత జూపి
               మాటలాడినారు మాన్యతదీపింప
               శిష్య గణము నాడు చేతులెత్తి.
5.  దూరము గల్గియుండినను దుష్కర కర్మలు చుట్టుముట్టినన్
       తీరము జేరుకోరికను తీరికజేసుక ధూళిపూడికిన్
       నారిని చేతగొంచు ఘన నవ్యవిలాస  వికాసులై మనో
       హారిత నేగుదెంచిన మహా దృఢ చిత్తుల సంస్తుతింతునే.
          6.  బాపయార్యు ఘనత బాగుగ బొగడుచు
               ప్రణతులిడిరి వారి ఋణముదీర
               కీర్తి శేషుడైన మూర్తియాతడనుచు
               సంస్తుతించిరంత సౌమ్యులగుచు.
 7.  మొదలి,పొక్కునూరి,ముచ్చట పోపూరి
      దూపుగుంట వారి ప్రాపకంబు
      ఎదురు లేని సుకవి ఎక్కటి వారలన్
      స్మరణజేసిరచట సాధుగరిమ.
           8.  మానెపల్లివారి మహిత ప్రబోధనల్
                తెలుగు వెలుగుజూపు ధిషణమణిని
                తలచినారలచట తనువెల్లపొంగంగ
                శిష్యులెల్ల జేరి చివరివరకు.
9.  నాడు వేసిన  ఘనుల పునాదిరాళ్లె
     నేడు మాకవి అద్దాల మేడలయ్యె
     నాటి వారల దీవనల్ మేటి సిరుల
     భోగభాగ్యాల నలరించి పుష్టిగూర్చె.

ప్రియమైన పూర్వ విద్యార్థులకు  
      ఆశీః పద్యసుమాలు.

    "హాయిగా నవ్వటం భోగం, నవ్వించటం యోగం, నవ్వలేక పోవటం రోగం"
     కనుక తాను నవ్వుతు నవ్వులపాలుగాక,ఎవరిని కానీయక, జీవితలక్ష్యాన్ని
     ఎలా శోధించి సాధించాలో మాకు నేర్పిన మార్గదర్శకులైన గురువర్యులకు
     శతధా సహస్రధా మనఃపూర్వక ప్రణామములు.. ఇదివారి బానర్. 

      సీ:  ఇంతటి చోద్యంబు నెవ్వారు చేయంగ
                            వినలేదు కనలేదు వేదికలను
             ఇంతటి ప్రేమయా? యీఛాత్రులకునెల్ల
                        "అమ్మభాష" యనిన నాదరంబు
             ఇంతటి గారవ మింత పీయూషమ్ము
                   "తెలుగు"నందని మీరు తెలిసివలచి,
             కొంతలో కొంతగ కొమ్మ పల్కులరాణి
                            పాదారవిందాల పట్టుమమ్ము
  తే.గీ: "భాగ్యనగరా"న మాకు సౌభాగ్యమలర
           పూర్వ విద్యార్థులెల్లరపూర్వముగ 
           సూత్ర బంధిత కుసుమాల శోభపగిది
           చేరి సత్కరించిరిట ఆశీస్సులివియె.1.

  తే.గీ: ఎంత యెదిగిన నొదుగుటే యింగితమని
          ఇట్టి పరమార్ధ మెరుగుచు పట్టుదలను
          మూలములనెల్ల మరువని మూర్తులగుచు
          మీరలుండుట సంతసమిడును మాకు.2.

   తే.గీ: మరువలేనట్టి ప్రేమను మాన్యతలను
           "శిష్యగణమె"ల్ల మోదాన చేరి యిచట
           పంచినారలు బుధులెల్ల పరవశింప
            నాయురారోగ్య భాగ్యాల నలరుడయ్య!3.

   ఆ.వె: తల్లి పాలు ద్రావ తరియించు జన్మంబు
            మాతృ భాష పలుక మమతలొలుకు
            నన్న విషయమెరిగి ఆంధ్రభోజుడు నాడు
            తెలుగు లెస్స యనియె ధీరుడగుచు.4.

      కం: వదలక మమతలు మీరలు
            పదిలముగా నుండుడయ్య పరమార్ధమదే
            సదమల భావ పూర్ణపు
            నెదలోపలె నీశుడుండు నెయ్యుడెయగుచున్.

    భాగ్యనగరం.            శుభాశీస్సులతో
    మల్కాజిగిరి      విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు
    30.10.22.   పొన్నెకంటి సూర్యనారాయణ రావు.

1975-బాచ్ పూర్వ విద్యార్థుల సన్మానం.

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః1గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః11.గురువు అను పదమే సంతత సన్మానార్షమైనది. అటువంటి గురుదీవనలను కోరుకొనుట సచ్ఛిష్యులందరకు సహజమే. ఆ కోరిక బలవత్తరమైననాడు తానే పరదేశములో నున్నా స్వదేశములోనున్నా మధువునుగ్రోలు మధుపము పద్మములను ఆశ్రయించు విధముగా, శిష్యమధుపములు గురు పాదపద్మముల నాశ్రయించుట ప్రకృతి సహజమే. అటువంటి మధురఘట్టమే నగరం మండల పరిధిలోని తడవర్తి బాపయ్య ఉన్నత పాఠశాలలో 1975-76సంవత్సరాలలో 10వ తరగతి చదువుకొనిన విద్యార్థినీ విద్యార్థులకు తమ గురువులను సన్మానించుకోవాలను సంకల్పము కలిగినది. 
         ధూళిపూడి గ్రామమనగనే అందరి హృదయాలలో మెదిలేది గ్రామదేవత తాళ్ళమ్మ తల్లి, శతవసంత శోభలు సంతరించుకొన్న మహాలక్ష్మమ్మ తల్లి, మహామహోపాథ్యాయుల పాదస్పర్శతో గళ మాధుర్యంతో విజ్ఞాన దీప్తులతో నిరంతర వాణీచరణ కింకిణీనాదములతో సుశోభితమైన తడవర్తి బాపయార్యుని పాఠశాల. అందువలన ముందుగా పూర్వవిద్యార్థులు ప్రశస్తమైన తాళ్ళమ్మ తల్లికి కొబ్బరికాయలు హారతి సమర్పించి  డప్పు వాద్యాలతో తమ ఉపాధ్యాయులను పాఠశాల వరకు ఊరేగింపుగా తీసికొనివెళ్ళి, తాళ్ళమ్మ తల్లికి ప్రదక్షిణలు గావించుట ఒక ప్రత్యేకత గా చేశారు. తదుపరి వారి రెండవ ప్రత్యేకత గజమాలలతో సత్కరించుట. సన్మానితుల బరువు షుమారు 50 కిలోలైతే గజమాల బరువు 150 కిలోలు ఉంటుంది. పూర్వవిద్యార్థులు మా శక్తి నెరిగిన పరేంగితావగాహులు కనుక మాపై అధిక భారము మోపకుండ వారు 90%మోసి మమ్ములను ఆనందపరిచారు. గజమాలను చూచి గజగజ వణకిన మాకు వారు భుజంకాయటం వలన సన్మానంచేయించుకొనే ధైర్యం కొండంత కలిగింది. పూర్వవిద్యార్థులకు మాకు వయసులో  భేదం షుమారు 15,16సంవత్సరాలే. మాకాశ్చర్యం కలిగించిన అంశం ఏమిటంటే "మాష్టారు మీరు మాకంటే ఎంగ్ గా కనబడుతున్నారు. మీ రహస్యం ఏమిటండి?"అని అడగటం.  దానికి మాసమాధానం "ఏమీలేదోయ్!మీ అందరి శక్తి మాలో విద్యుత్తులాగా ప్రవహిస్తున్నది."అని సమాధానం. అందరిలో నవ్వులపువ్వులు. తరువాత యథావిధిగా సన్మాన కార్యక్రమాలు, అందరి వ్యక్తిగత పరిచయాలు, భోజనానంతరం మా పద్యగద్య ఆశీస్సులు సాగాయి. కార్యక్రమం విజయవంతం అయినది. పుత్రాదిచ్ఛేత్ పరాజయం. అలాగే శిష్యాదిచ్ఛేత్ పరాజయం. మా పిల్లలు మాకన్న ఉన్నతస్థాయి పొందారు. వారందరి మాటలు వింటున్న మా ఆనందానికి అవధులు లేవు. ఇలాంటి గౌరవాలు మాకు శ్రీవాణీ పదపద్మరజోలేశము వలననే దక్కినవి. అమ్మకు జేజే,చదువులమ్మకు జేజే. మాకు ససన్మానం చేసిన మా పూర్వవిద్యార్థులందరికి (వచ్చినవారికి రానివారికి), పాఠశాల లో కార్యక్రమాలు జరుపుకొనుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు, ఆశీశ్శతములు. శుభంభూయాత్!...
బాపయార్యుని సంకల్ప బలము వలన
త్యాగధనులైన విజ్ఞుల ధర్మమహిమ
వాణి యిచ్చోట కొలువుండ వరమునిచ్చె
అక్షరజ్ఞాన యజ్ఞంబు నమలుజరుప. 1.

ప్రియశిష్యులారా! మీ గురించి నాయూహ.

బెంచిపై సంచితో బేజారు మోముతో
                 నున్నట్టి మీరూపె యూహగాని
గడ్డాలు మీసాలు ఘన దేహ మార్పులన్
                   గుర్తుపట్టగ గల్గు స్ఫూర్తి లేదు
సూక్తులు సత్కథల్ శ్లోకాలభావాలు
                   తలలూచి విన్నట్టి తలపెగాని
సంఘ శ్రేయస్సుకై సాంద్ర మనస్కులై
             యుండిరో తొలగిరో యూసులేదు
  కలసికొంటిమి మనమంత గర్వపడగ
  వెలువరింపుడు మీదైన వివరములను
  జ్ఞానవిజ్ఞాన పర్వాల కలలపంట
  సత్కుటుంబ సద్విజయ సంచారములను.2. 

మీ సంస్కారం.....

సంకల్ప సిద్ధితో సన్మానమనుచును 
             గురువులగాంచుట గొప్పవరము
అక్షరజ్ఞానంబు నందినచోటనే 
     అందరు కుదురుట యమితముదము
ధనసంపదాళితో ధన్యత్వమెంచక
               గురుదీవనల్ కోర కోటి ఫలము
ప్రేమైక జీవులై ప్రియగురు పాదాల 
        అంజలించుట యది అమరఫలము
  ఎన్ని జన్మల పున్నెమో యేమొగాని
  మాకు దక్కిరి యిటువంటి మాన్య శిష్య
  కోటి ధూళిపూడి న మేము కోరకుండ
  బాపయార్యుని దీవనల్ పరిఢవిల్ల. 3. 

మేము నాటిన విత్తనాలీనాడు వటవృక్షములైనవి.

కొందఱు వైద్యులై మరియు కొందఱు వెజ్జులు శాస్త్రవేత్తలై 
కొందఱు సాఫ్టువేరు యుగ కోవిదులై యజమానులైరహో!
కొందఱు రాజకీయమును కోరిరి ధౌతపురీ నివాసులై. 
అందఱు అందఱే మరియు నందఱు అందఱు అందరందఱే.4. 

ఇలాగే అందరం కలసి....

మధురమధురమైన మహనీయ క్షణముల
తనివిదీర గడపి తన్మయముగ
భావి జీవితంబు బంగారుమయముగా
చేసికొందమయ్య స్థిరముగాను.5. 
     13.03.2023.

1989 బాచ్..కి ఆశీః పద్యాలు. 30.04.23.

గురుదర్శన సద్భాగ్యము
పరమాత్మను గాంచురీతి భద్రంబిడదే?
గురువాక్యశ్రవణంబది
నిరతము శిరసా వహింప నిఖిలము జయమౌ.

గురువును జూడగోరుటదె గొప్పగు భాగ్యము శిష్యకోటికిన్
నిరతము జ్ఞాన సంపదను నేర్పుగ పొంది సులక్షణాత్ములౌ
వర నిజ శిష్యులంగనుటవాంఛిత మోదము మాకు నెప్పుడున్
తరగని ప్రేమభావనల ధన్యత జెందుడు వాణి సత్కృపన్.

ధాన్య సంపత్తి తిండిచే శూన్యమగును
స్వర్ణ సంపత్తి కాలాన చౌకయగును
శిష్య సంపత్తి సత్కీర్తి శిఖరమగును
అట్టి సంపదె మాకు మహార్ణవంబు.

జ్ఞాన వృద్ధితోడ కర్తవ్యదీక్షను
చేసి మీరు మేరు శిఖరము వలె
కీర్తిగాంచుడయ్య కృష్ణయ్య కరుణచే
భుక్తి ముక్తి తోడ భోగమబ్బు.

మేము నాటిన బీజాలు మేలిమగుట
పసిడి పంటలు పండెను బాగుగాను
భావి జీవిత మంతయు తావులొలుకు
జ్ఞాన వృద్ధుల దీవనన్ సాగుడయ్య.









           
           
           

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...