5, డిసెంబర్ 2017, మంగళవారం

నిర్మల్ విహారయాత్రానుభవాలు. జలపాతాల దృశ్యానుభూతులు.

నిర్మల్ విహారయాత్రానుభవాలు. జలపాతాల దృశ్యానుభూతులు.

 నిరంతరం శ్రమపడే మానవ  మేథస్సునకు ప్రకృతి సందర్శనాన్ని మించిన ఆనందం ఉత్తేజం ఏముంటుంది చెప్పండి. అందుకే  నిర్మల్ లోని హస్త కళా సౌందర్యాలు, సమీపంలోని జలపాతాల పరవళ్ళు, అందాలు ఆస్వాదించే కోరికతో ది.2.12.2017.న ఉ.7గం.లకు హైదరాబాద్ లో  మా బావగారైన శ్రీ పులిజాల సత్యనారాయణ(రిటైర్డ్ ఆర్కియాలజీ సూపరింటెండెంట్) గారి ఆధ్వర్యంలో  నేను( పొన్నెకంటి సూర్యనారాయణ రావు) నా శ్రీమతి ఇందిరాదేవి, పెద్దచెల్లి అరుణ, చిన్నచెల్లి పద్మ జారాణి, మేనకోడలు సంథ్యారాణి, పిల్లలు ఆదిత్య,లలిత, మిత్రుడు గోవింద్ తలిదండ్రులు బయలుదేరి(NH44) జాతీయ రహదారిలో  210 కి.మీ. దూరాన ఉన్న నిర్మల్ కు మధ్యాహ్నం చేరి, అచట హోటల్ లో విశ్రాంతి , భోజనానంతరం నిర్మల్ కు 38 కి.మీ. దూరంలో గల పొచ్చెర జలపాత సందర్శనానికి వెళ్ళాము.

   ముందుగా నిర్మల్ బొమ్మలు..కళాకారుల.,తయారీ విషయాలు...

 అత్యంత మృదువుగా, తేలికగా ఉండే "పునికి" కర్రతో చేయబడే ఈ బొమ్మలకు 400సంవత్సరాల చరిత్ర ఉంది. కళాకారులు "నకాషీ" కులానికి చెందిన కళాకారులు. వీరు "మరట్వాడ" ప్రాంతీయులు. నిర్మల్ సంస్థానాధిపతి "నిమ్మనాయుడు" దేశం నలుమూలలనుండి కళాకారులను రప్పించి హస్త కళలను పోషించి వృద్ధిచేశాడు.
                                 తయారీ విధానం.
       ముందుగా చేయదలచుకొన్న బొమ్మకు దగిన ఆకారపు ముక్కలు తీసికొని, చింతగింజలు నానబెట్టి జిగురువచ్చువరకు రుబ్బి  పేస్ట్ చేసుకొని, దానిని కొయ్యపొడిలో కలిపి కావలసిన బొమ్మ చేసి దానిని ఎండబెట్టి నునుపు చేసి తగిన రంగులు వేస్తారు. ఆరంగుల తయారీలో చెట్ల ఆకురసాలు, పూల రసాలు వాడతారు. ఈ రంగులలో బంగారురంగు తయారీకి చాలా ఎక్కువసమయం శ్రమ పడుతుంది. ఈ రంగులు అత్యంత మనోహరంగా, మన్నికగా ఉంటాయి. బొమ్మలన్నీ సజీవకళతో ఉట్టిపడుతుంటాయి. ఈ బొమ్మల కళాకారుల సహకారసంఘం 1955 లో స్థాపించబడినది. ఈ నిర్మల్ పంచపాత్రలకును ప్రఖ్యాతి చెందినది.

     సువర్ణ పుష్పాభిషేకంతో  నిజాం నవాబు, అవాక్కు.

       ఒకసారి నిజాం నవాబు నిర్మల్ పట్టణానికి వచ్చిన సందర్భంగా
వారికి ఇచటి కళాకారుల చేత బంగారు(చెక్క)పూలు చేయించి వాటితో సువర్ణ పుష్పాభిషేకం చేశారు. కొద్ది సేపటికి నిజం తెలుసుకొని నవాబు గారు అవాక్కయ్యారట. ఇది నిజమైన భగవద్దత్తకళ. శిల్పకళవంటిదే దారుకళ. దారువు అంటే కర్ర.

   దారుకళాధురీణా!నిర్మలవాసా! దండంబులందుకోవయ్యా!
     
   1. కడుపునిండిన నిండక కలతపడక
       భరతజాతికి కీర్తికి బాటవేసి
       నలువ రూపంబు ధరియించి నవ్యరూపు
       సృష్టిచేసితివయ్యరో చెలువుమీర

   2. నిర్మల వాసివౌ సత్కళా నిర్మ లాత్మ!
       త్యాగపరిపూర్ణ సద్భావ యోగివర్య!
       వందనంబులు నీకెపుడు వందవేలు
       జాతి మరువదు నీదు విఖ్యాతి యెపుడు.

   3. "పునికి" కర్రకు నిపుణత పురుడుబోసి
        పూర్ణ రూపాలు సృష్టించు పుణ్యులార!
        రంగురంగుల యందాలు రహినినిలుపు
        మీకు శుభములుకలుగుత మిగులశోభ!

                          పొచ్చెర జలపాతం.

    ఎక్కడో పుట్టిన అప్సరసల వంటి నదీ కన్నెలు తమ చెలికత్తెల వంటి ఉపనదులతో గూడి చిలిపి వలపులతో రసికులనూరిస్తూ, చిత్రకారుల కుంచెలకు పనిచెబుతు, కవుల మస్తిష్కాల ఊహలకు ఉయ్యాలలూపుతు, సంగీతజ్ఞుల సరిగమలకు సాయంపడుతూ తమ ప్రత్యేకతలను చాటుకుంటు భూమాతపాదకమలాలను స్పృశించాలని తపనపడేవే జలపాతాలు. మన పౌరాణిక ఆధారాన్ని అనుసరించి భగీరథుని దయ వలన భువికి దిగినదే గంగారూపి జలపాతం. ఇలా ఎన్నో నదులు ఎన్నో దేశాలలో జలపాతాలై మధుర మనోజ్ఞ దరహాస చంద్రికలను, రమణీయ కర్ణపేయ సంగీత నాదాలను వినిపిస్తు ప్రకృతి ప్రియులను అలరిస్తున్నాయి.
       పొచ్చర జలపాతం నిర్మల్ కు 38 కి.మీ. దూరంలో ఉంది.
ఎన్నో ఓషథీ గుణాలను సంతరించుకొని అతి స్వచ్ఛమైన పరవళ్ళు త్రొక్కే నీటితో తన దరిజేరిన వారికి అమితానందాన్నిస్తుంది.
మేము ఆ ఆనందాన్ని ఎంత సేపు అనుభవించామో! రకరకాలుగా ఛాయాచిత్రాలు తీసుకొని పదిలపరచుకున్నాము. ఇచటికి మా బావగారు కూడ రాగలుగుతారనే ఉద్దేశంతో నే ముందుగా దీనికి వచ్చాము. ఇచటి అందాలను వృత్తిపరమైన ఛాయాగ్రాహకులైతే ఎంత ఒడుపుగా బంధిస్తారో! నాకు మదిలో అత్యుత్తమ ఛాయాగ్రాహకుడైన నా బావ మరది కీ.శే. గంగరాజు వాసుదేవమూర్తి మెదిలాడు.

     పొచ్చెర జలపాతంబది
     యచ్చెరువగుగాదె మనకు హ్లాదినియగుచున్
     చెచ్చెరదూకగముందుకు
     చిచ్చరపిడుగయ్యెమనకు సిరులనుగూర్చన్.

      జలపాత దర్శనానంతరం నిర్మల్ బొమ్మల తయారీ, పూర్తిగా తయారయి అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి , ఆయిల్ పెయింటింగ్స్ చూచాము. అవి సజీవ దారు శిల్పాలు. మన భారతీయుల కీర్తి కిరీటాలు. స్వచ్ఛ విజృంభమాణసృజనలు. అభివృద్ధి వారి కళాకౌశలాలలో కనపడుతున్నదే కాని వారి జీవితాలలో కాదని ఆ కళాకారులను చూచినపుడు అవగతమౌతుంది. దానికి మనం స్పందించాల్సిన విధానం ఒక్కటే. వారి వస్తువులను మనం కొని ప్రోత్సహించటం. అందుకే మేము కొన్ని బొమ్మలను కొన్నాము.

         ది.3.12.2017. న.   కుంతాల జలపాతం.

 ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలం "కుంటాల"గ్రామంలో ఉంది. దీని ఎత్తు 147అడుగులు. హైదరాబాద్ నుండి 237కి.మీ. నిర్మల్ నుండి షుమారు35 కి.మీ. వెళ్ళి నేరడిగొండ నుండి కుడివైపునకు తిరిగి 13కి.మీ వెళితే "కుంటాల" జలపాతం వస్తుంది. దుష్యంతుని భార్య శకుంతల ఇచటికి వచ్చి స్నానంచేసి వెళ్ళేదట. ఆమె పేరు మీద ఈ జలపాతానికి "కుంతల"జలపాతం అని పేరు వచ్చిందట. భూమట్టం నుండి క్రిందకు 408 మెట్లు ఉన్నాయి. కాని చాల విశాలంగా ఉండి ఎక్కువ శ్రమలేకుండ దిగి ఎక్కగలిగేలా ఉంటాయి. కొంత మధ్యలో విశ్రాంతి తీసుకుంటు వెళ్ళిరావటం శ్రేయస్కరం. అత్యంత మనోహరదృశ్యం. వర్ణనాతీతం. కాని నీరుపారే ప్రాంతమంతా పాచి ఉండి ప్రమాదానీకి హేతువౌతుంది. మిక్కిలి జాగ్రత్త అవసరం.
 
  కుంతల జలపాతంబిది
  ఎంతయు ఘనమైనలోతు ఏమామలుపుల్
  వింతకు వింతై తోచు,శ
  కుంతలపేరన్ బరగుచు కూర్మిన్ గూర్చున్.

                                  ముఖ్య విషయం.

   అచటికి వెళ్ళేముందే మనం దారిలో మనకోసం ఎంతో ప్రేమగా, ఆశగా ఎదురుచూచే వానరాల కొరకు కొన్ని ఫలాలను తీసికొని వెళ్ళటం మరచిపోరాదు. మనం తిన్నది మట్టిపాలు. పరులకు పెట్టేది పరమాత్మ పాలు. పరమాత్మ అనుగ్రహిస్తే వరాలు. ఆగ్రహిస్తే శాపాలు. మనం జీవకారుణ్యాన్ని పాటించుదాం, తోటివారికి సాయపడదాం.  కళాకారుల జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నం చేద్దాం.  ఇలాంటి కార్యక్రమాలు అక్రమార్జనాపరులు చేస్తే వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అందుకే వారిందులోకి రారేమో!  ప్రభుత్వాలు కూడ కుటీర పరిశ్రమలకు ఎక్కువ చేయూత నివ్వాలి. వారి జీవితాలలో కాంతులు నింపాలి.

              మేరా భారత్ మహాన్.  జై భారత్. జైజై భారత్.




 

 


     
     



5, అక్టోబర్ 2017, గురువారం

న్యూ నాగోల్ సన్మానము. 2.10.2017.

     న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వారి సన్మానము. కృతజ్ఞతలు.

న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యవర్గం  మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా చేసిన సన్మానము. దానికి కృతజ్ఞతతో వ్రాసిన పద్యాలు.

సీ. జాతికి పితయౌచు జాగృతి నేర్పిన , గాంధి మహాత్ముని ఘనజయంతి
    " జై జవానంచును" జగతికి దెలిపిన , శాస్త్రి జీ పుట్టిన స్వాదుదినము
     వృద్ధుల సన్మాన వేదికై వరలిన , సర్వసభ్యులకిల సంతసంబు
     అధికార వర్గాల కాదరంబు గలుగు, సంస్థ గౌరవమంద చాలునిదియ
 తే.గీ.  మంచిపనిజేయ సతతంబు మాన్యులగుచు
           యశము కోరకె యేతెంచు నవనియందు
          శ్రీనివాసుని కరుణను సిరులు విరియు
           క్రొత్త నాగోలు సంస్థకు కూర్మిదనర.

 సీ. నాగోలు బుధులెల్ల నాయందు జూపిన, ఆత్మీయతలకెల్ల అంజలింతు
      సభ్యులందరు గూడి సాధుజీవనులౌచు, వర్తించు తీరుకు ప్రణతులిడుదు
      సాంఘిక కార్యాల సంఘటితంబుగా, కృషిచేయు మీకెప్డు కేలుమోడ్తు
       జాతీయ పండుగల్ జాగృత తేజమున్, జరిపెడి మీకునే జైయనందు
 తే.గీ.మమత సమతల నందరు మధురరీతి
         పంచి పెంచెడి తీరుకు పరవశింతు
         సభ్యులందరు నూరేండ్లు చల్లగాను
         ఆయురారోగ్యములు గల్గ నభిలషింతు.
 సీ. వయసున మీరిన వందనీయులనెల్ల, గారవించెడు మీరు ఘనులనందు
      జ్ఞానుల సాహితీ జ్ఞానుల వృద్ధుల , గారవించెడు మీరు ఘనులనందు
      ఆటపాటలలోన అందెవేసిన వారి , ప్రోత్సాహమిచ్చెడు పుణ్యులందు
      సంగీత పాండిత్య సౌహృదులందరి , నక్కునజేర్చెడి యమరులందు
 తే.గీ. పెధ్ద మనసున్న నాగోలు వృద్ధులకును
          జ్ఞాన విజ్ఞాన సరస విజ్ఞులకును
          మాదు సన్మాన సమయాన మమతతోడ
          వందనాలను నర్పింతు వందవేలు.

 సీ.  అధికార గణముల అండదండలతోడ, అపురూప సౌధంబు నందుకొనిరి
       అధికార గణముల ఆత్మీయతలతోడ, సాంఘిక సేవల సల్పుకొనిరి
       అధికార గణముల ఆదరంబులనంది, ఆరోగ్య రక్షణ నందుకొనిరి
       అధికార గణముల అమృత వాక్కుల , సత్కార్యములనెల్ల సల్పుకొనిరి
 తే.గీ. సర్వ నాగోలు సభ్యులు సౌఖ్యమంద
          ఇందునున్నట్టి యధికార్లు హితమునంద
          సరళ సుగతి నీ సంస్థ స్థాయి నంద
          వేడుకొందును నీశుని వేడ్కతోడ.

 సీ. నాగోలు సంస్థకు నాకును బంధంబు , బిగిసెను మిత్రుల ప్రేమతోడ
      నాగోలు సంస్థకు నాకును బంధంబు ,  సాగెను సాహితీ సరసువలన
      నాగోలు సంస్థకు నాకును బంధంబు , మెండాయె క్రీడల మెరపు వలన
      నాగోలు సంస్థకు నాకును బంధంబు  , పెరిగెను సత్కళా ప్రియుల వలన
 తే.గీ. ఇన్ని బంధాల నిండిన ఇష్టమైన
          సంస్థ సర్వతోముఖముగ సాగిసాగి
          సభ్యులెల్లరు నారోగ్య సౌఖ్యమంది
          భావి జీవిత కాలాన వరలుగాక!

వృద్ధాప్యం వరమా?శాపమా?

వృద్ధాప్యం వరమా?శాపమా?

బాల్యం,యౌవనం,కౌమారం,వృద్ధాప్యం అనేవి అన్ని జీవరాసులకున్నా, ముఖ్యంగా మనం ఎక్కువగా గమనించగలిగేది మానవజన్మలోనే. విచిత్రం ఏమిటంటే మొదటి మూడు దశలలో కష్టాలున్నా  ఎవరో ఒకరు వాటిని వెనుక ఉండి బయట పడేస్తారు. బాల్యం అంతా అజ్ఞాన మిళిత ఆనందం. ఈ ఆనందం బాలుడికి ఏమీ తెలియకుండానే గడచిపోతుంది. అంటే తలిదండ్రులు వారి ఆనందం, హోదా చాటుట కొరకు వారి బాలబాలికల నలంకరించుకొంటారు. ఇక యౌవనంలో కొంతకొంత శారీరక మార్పులకు ప్రాతిపదికలు వేసుకుంటు, భిన్నరుచులు, అభిప్రాయాలకు పునాది ఔతుంది. ఈ వయసుకి కొంత సహకారం ఉంటుంది. కౌమారమంటే ముదిరిన యౌవనం.
ఎక్కువ భాగం మగవారిలో నూనూగుమీసాల స్థాయి దాటి  నాయకత్వ లక్షణాలు, పెద్దగా ఎవరిని లెక్కచేయకపోవటం,ఆడ పిల్లలలో వివేచన,విచక్షణా పూరిత సిగ్గు దొంతరలతోగూడిన ఆడతనం నాట్యం చేస్తుంది. మగవారికన్న రెట్టింపు జ్ఞానం కలిగి ఉంటారు.   ఈవయసే ఉద్యోగం, సంసార, సామాజిక బాధ్యత లను మోస్తుంది. తనంటే ఏమిటో ఋజువుచేసికొని పై మూడు రంగాలలో అద్వితీయ ప్రతిభను చాటుతుంది. అందరికీ ఆదర్శమై, హిమాలయసదృశంగా ఉంటుంది. తాను పదవీ విరమణ చేసేంతవరకు భార్యా సమేతమైన , భర్తృసహితమైన  జీవితం వరమని భావిద్దాం.
       పదవీవిరమణ చేసిన తరువాత ఎక్కువ మంది వారి ప్రతిభా వ్యుత్పత్తులను, వృత్తి నైపుణ్యాలను,వారు చేసిన సేవలను ప్రశంసించి ఇకపై భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావాలతో ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చి భావిజీవితాన్ని గడపమని పెద్దవారు దీవనలు, చిన్నవారు ఆకాంక్షలను  ఇస్తారు. కాని చాలా మంది  మగవారు నిరాశానిస్పృహలతో ఏదో సమస్తం కోల్పోయినట్లు భావించి  పడక కుర్చీకి అంకితమై, సాధారణ వ్యాయామం కూడ చేయక మానసిక, శారీరక వ్యాధిగ్రస్తులై వైద్యుల చుట్టు తిరుగుతుంటారు. బహుశః ఇక్కడి నుండే శాపం ప్రారంభమౌతుందేమో.
       ఎందుకంటే మొదట వివాహితులుగానున్నప్పుడు వారు జంటగా ఒంటరితనమే కోరుకుంటారు. ప్రకృతి సహజమే. ఆనాడది వరమౌతుంది. ఇరువురిలో శారీరక, మానసిక బలాలు ఉంటవి కనుక. అరవై సంవత్సరాల వయసులో , ఆపై వయసులో, రోగాలపాలై  అలా ఇరువురే ఉండి కనీసం వచ్చి చూచే వారుకూడ లేకుంటే....అది శాపం కాక ఏమౌతుంది? వారు సంతానమున్న నిస్సహాయులు.
    ఇక్కడొక సున్నితమైన అంశం ప్రస్తావించాలి.
           కొడుకులు, కూతుళ్ళు ఉంటారు. వారు ఈరోజుల్లో ఎవరి ఉద్యోగాలు, బాధ్యతలు , అభివృద్ధి కార్యక్రమాలు మానుకొని "మాతృదేవోభవ పితృదేవోభవ"అంటు వచ్చి కూర్చోరు. అలా ఈ వృద్ధులు కోరుకొన్నా వారి బిడ్డల అభ్యున్నతికి గొడ్డలి పెట్టు అయినట్లే. ఈస్థితి వరమో శాపమో ఆ పెరుమాళ్ళకెరుక. కొందరికి కొడుకులు గాని, కూతుళ్ళు గాని " రండి నాన్నా మనం కలసి ఉందాం కలిగింది తిందాం, ఈ వయసులో మీకు మేము ఆసరాగా ఉంటాం, అది మా బాధ్యత" అని నోరారా అనగలగటం తలిదండ్రులకు వరమే.
వారు  ప్రేమాభిమానాలతో  మనసార తమ దగ్గరే ఉండమనకపోవటం గాని, అలా వారు అన్నా  ఉండలేకపోవటం గాని, శాపమే. ఈ శాపగ్రస్తులు వారి దగ్గరకు వెళ్ళలేక, వారి పనులు వారు చేసుకోలేక ఒంటరి బ్రతుకులు ఈడుస్తుంటారు విధి వ్రాతకు ఏడుస్తుంటారు.
         ఇంత నావింత సోదికి ఒక 94 సంవత్సరాల చీకు వృద్ధుని దయనీయ గాధే మూలం.
          ఆయనకు కొడుకులు, కూతుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు ఉన్నారు. ( కొందరు దగ్గరలోనే ఉన్నారు )  నిజాయితీ కలిగిన ప్రభుత్వోద్యోగిగా మన్ననలు పొంది విశ్రాంత జీవితం గడుపుతున్నారు. దురదృష్టవశాత్తు భార్యా హీనుడు. ఒక సీనియర్ సిటిజన్ సంస్థలో సన్మానము పొందబోతు " నాకిపుడు సన్మానము జరుగబోతున్నది. అందరికి ఎవరో ఒకరు వచ్చారు. నాకు కూడ మీరెవరైనా వస్తే సంతోషంగా ఉంటుంది. దయచేసి రండి" అని దీనంగా ప్రార్థించటం , ఏ ఒక్కరము రామని చెప్పటం నా మనసుని  కలచివేసింది. ఇపుడు చెప్పండి ఆయనకది వరమా? శాపమా?  మన చిన్నతనంలో మన బుడిబుడి అడుగులకు ఆనందపడుతునే, వాడెక్కడ క్రింద పడతాడో అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూచే వృద్ధ తలిదండ్రులకిచ్చే ఆసరా ఇదేనా?
      ఏదియేమైనా సంతానం పొందటం ఆనందదాయకమే. వారిని సంతోషపెట్టే సత్సంతానమైతే వరమే. దానికి భిన్నమైతే శాపమే కదా. తలిదండ్రుల గుండెల్లో తన్ని మనం ఎదిగామని గుర్తుంచుకొని, వారికి గుండె కోత తెప్పించరాదు. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సుమా!  

16, జులై 2017, ఆదివారం

అమర్నాథ్ యాత్ర...నా అనుభూతి.



  **గోల్డెన్ టెంపుల్ గూర్చి.**

      శిక్కులదేవాలయమది
      అక్కజమౌస్వర్ణమయము హ్లాదముగూర్చెన్.
      మిక్కుటమౌఆజ్యమిళిత
      చక్కని పసదనముదొరికెసంతసమొప్పన్.

   శిక్కులపవిత్ర గ్రంథము
   నిక్కపుభక్తిన్జదువుగ నేనటుగంటిన్భఘృ
   అక్కడి సద్గురువర్యుల
   అక్కరుణామూర్తులకివె అంజలులార్యా!

          ధైర్య సాహసాలు తమసొంతమనురీతి
         చిన్నపెద్ధవృద్ధ చేతులందు
         ఛురికలుండెమనకు చోద్యమలర.
         భరతమాత పుత్ర భవ్యచరిత!

** కురుక్షేత్రం గురించి.**
  గీతాచార్యుని నిలయము
  ప్రాతః స్మరణీయమైన ప్రాంతమునంతా
  చూతము రారండిబుధులు
  చేతమ్మున భక్తినింపి క్షేత్రమ్మునకున్.

   ** వైష్ణవీదేవిని గూర్చి.**

   దర్శన భాగ్యమిచ్చెనిట తాత్త్వికరూపిణి వైష్ణవీసతే
   దర్శితనేత్రముల్ మిగుల ధన్యతనందె పవిత్రమై పున
   ర్దర్శనమెప్పుడో యనెడు ధార్మికజీవుల మస్తకంబులన్
   స్పర్శను జేయుచున్ కరము సంతసమిచ్చె కృపాంతరంగయై.

        అమ్మనుజూడగాదలచి ఆర్తుడనై విలపించుచుండ,రా
        రమ్మని సద్దయన్ బిలచి రమ్యకపర్దిని వైష్ణవమ్మయే
        తెమ్మనె నాదుబృందమును తెల్విగకొండకు ప్రాణనాధునిన్
        అమ్మకుమాటయిచ్చిజవనాశ్వమురూపముదాల్చె శంభుడే.

    రాజు నామానబరగెడు రమ్య హయపు
    శిక్షకుడుహమీదనువాడు చెలిమితోడ
    చతుర భాషణాచణుడౌచు సాగివచ్చి
    అమ్మ పాదాలజేర్చెను హ్లాదమొప్ప.

          తాతపేరున బెరిగిన జాతకుండ
          సూర్యనారాయణాఖ్యుండ ‌సూరిబ్రువుడ
          వారినామంపుఫలమేమొ తేరిచూడ
          అశ్వమెక్కెడి యదృష్టమవనికలిగె.

 భైరవరాక్షసుండు నను భర్తగచేకొనుమంచుకాళికన్
 ఘోరతరంబుగాగ కడు కూళత నీచత వెంబడింపగా
 ధీరత రౌద్రరూపమున దిక్కులు సర్వము పిక్కటిల్లగా
 పోరునుసల్పి వానినటు ముచ్చటజేర్చెను కాలుచెంతకున్.

       తప్పు క్షమియింపగల్గిన తరుణిజూచి
       అమ్మ !నాకిటప్రాముఖ్యమమరునట్లు
       వరము నీయుమ కరుణను వాంఛదీర
       యనుచు గోరగ భైరవుననుమతించె.  

  నిన్ను గాంచిన పిదపనే నిశ్చయముగ
  ముక్తి నందును భక్తాళి మోదమలర
  అనుచు వరమిచ్చె ప్రేమతో వైష్ణవమ్మ
  అమ్మతనమును రూపించె నాదిశక్తి.

            **వైష్ణవోదేవి పాట**

  వైష్ణవిమాత వైభవచరిత వరములనీవమ్మా!
  నీపద సన్నిధి జేరినవారిని నెమ్మదిజూడమ్మా!

  మూడు మూర్తుల మోహనరూపివి లక్ష్మీ వాణీ కాళికవు.
  ముల్లోకంబుల భక్తుల బ్రోచెడు కరుణరసాంచిత పాలితవు.॥వై॥
  అష్టలక్ష్మిగా నమ్మినవారిని అందలమిచ్చి కాచెదవు
  నలువరాణిగా కొలిచినవారికి నాలుకపై నడయాడెదవు.   ॥వై ॥
  నామభేదముల నానారీతుల నెలకొనియున్న ఏకరూపివి
  ఎక్కడక్కడచూపుము నాకని పలుకువారికి నిశ్శబ్ద శక్తివి.   ॥వై॥
   బహువిధ మణుల రత్నరాసులను భారీపూజలు చేసినగాని
  శుద్ధభక్తికే పట్టముగట్టెడి సుందరమూర్తివి నీవమ్మా             ॥వై॥

                  **అమరనాధుని అందాలు**
  శ్రీ అమరనాథుని అందమునంతా చూతమురారండి
  గుహలో వెలసిన మంచులింగమును తలచుచురారండి

      కనులకు శిరమది కనబడకుండును
              హిమసౌందర్యంబున దాగియుండును
      కనులకు గంగయు కనబడకుండును
               ప్రవాహరూపిగ పారుచుండును.           ॥అమర॥

     ఉమకై వెదుకగ నుండదచ్చట
                 ఉన్నది శంభుని కూతమిచ్చుచు
     అగ్నినేత్రము కానరాదులే                
                 ఆరెను ఎప్పడొ ఆచలికి                     ॥అమర॥

     నాగాభరణము నామమాత్రమై        
                 మంచుకణములో మాయమైనది
     శూలము,ఢక్కా సృక్కిపోవుచు
                  సుందర హిమమున కరగిపోయెను ॥అమర॥

    మంజీరంబది మౌనముద్రతో
                 మంచునపొంచెను మరిమరిమ్రోగక
    బసవడు సైతము పరవసించుచు
                  కోటికష్టముల గోటద్రుంచుచు
                రారమ్మంచును రంకెవేసెను.             ॥అమర॥


అమరనాథుని యాత్రలో హ్లాదమొప్ప
  పాలుపంచుక నిరతంబు పారమార్థి
  కంబు నెయ్యంపు సమ్మతిన్ కలసినట్టి
  మాన్యసోదరసోదరీమణులనుతింతు.

       పెద్దల గారవించుచును ప్రేమవినిర్మిత మాతృభావనన్
       ముద్దులుమూటగట్టి కడు మోదముగూర్చెడు పల్కుజిల్కుచున్
       హద్దులుదాటనీని చిరు హాస్యము హాసము పంచుచున్సదా
       నిద్దురదూరమున్సలుపు నిర్మలమూర్తుల కంజలింతునే.

        అమరనాథుని యాత్రలో నాతో ప్రయాణం చేసిన వారి గురించి పాట.

ఓ....సోదర,సాదర భక్తశిఖామణులారా!
సరస సహృదయ సోదరీమణులారా!
   వినరండీ యాత్రాఫలం, కనరండీ జ్ఞాన బలం.

       అమరనాధుని అనుగ్రహముతో అంతా సుఖకరమైనది
       అమ్మపార్వతి అనురాగం తో అంతా సుముఖమయైనది.

  తీర్థయాత్రలో తీయని కష్టం త్రినేత్రుడిచ్చే వరమేలే
  సార్థకంబులై జీవితంబులే సంపదాళితో వరలునులే

    హిమాలయంబులు నదీనదంబులు
    పచ్చని చెట్టు పశుపక్ష్యాదులును
         శంభునిరూపం  శాంభవి తేజం.

  మానవజీవన గమ్యం మమతాసమతల రమ్యం
  మానవత్వమే మాధవు సేవకు సోపానం

       అమరనాధుని యాత్రకువెళ్ళే అన్నార్తులకిల అండగనుంటు
       పంచభక్ష్యముల పంచేవారిని పరమాత్మే దయజూచునులే.

                       జై జవాన్!!!

   మంచుకొండలలోన నించుక వెరువక
                    కావలికాయునా ఘనుడెవండు
   తనవారినందరి త్యాగంబు జేయుచు
                      కొండగుహలలోన నుండునెవడు
   శత్రువులకెప్పుడు శరభమై కనిపించి
                      నిద్దుర రానీని నెయ్యమెవడు
  భరతమాతకునెప్డు బంగరు బిడ్డ గా
                        విఖ్యాతిగన్నట్టి వీరుడెవడు
ఎవడు ఎవడని ఇతరత్ర వెదుకవలదు
జైజవానని సత్కీర్తి శాస్త్రి వలన
పొంది యున్నట్టి యరుదైన ముద్దు బిడ్డ
భారతీయులపాలిటి ప్రాణదాత!!

              అమరనాథుని దర్శనం... నా అనుభూతి.

 అమరనాథునిగంటి ఆత్మీయ భక్తుల
             మీనంపునేత్రాల మెరపులందు
 అమరనాథునివింటి నద్భుతస్వరములన్
             భంభంభోలెయనడు భజనలందు
 అమరనాథుని దరహాసచంద్రికలను
              నింపుకొంటినిహృది నిండుదనుక
  శ్రీహిమాలయమున చిత్తంబు భవుపాద
              పద్మాలకర్పించి ప్రణతులిడితి
     ఎన్ని జన్మల పుణ్యమో ఎరుగలేము
     శివుని ఆజ్ఞగ భావించి చేరవచ్చి
     పారమార్థక చింతనన్ పరవశించి
     ఈశునాశీస్సులందితి నిశ్చయముగ.
     
       


29, జూన్ 2017, గురువారం

పి.యస్.యన్. పద్యాలు.

పి.యస్.యన్. పద్యాలు.

                            వృద్ధాప్యం - కష్ట సుఖాలు.


1. ఉ . కన్నులచూపు మందమయి కాయము  శక్తివిహీనమై చనన్

          దన్నును గోరుచున్న తలిదండ్రులు నిత్యపు జీవనంబునన్

          వెన్నును గాచి యుండక నవీన విదేశపు డాలరొక్కటే

          యున్నతమంచునెంచి సుతులుద్ధతి చాటుట గారవంబొకో !


 2. తే.గీ . చిన్నతనమున కొడుకుల జేయిపట్టి

               జగతి బ్రతుకంగ దగినట్టి జ్ఞానమిడిన

           .   నాన్న మోమున చిరునవ్వు చిన్నవోయె

              కన్ననేరంబు నిరతంబు కలచుచుండె.

3. తే. గీ . పుత్ర జననంబు స్వర్గంపు మూలమనుచు

              తలచు తలిదండ్రులకు పరితాప మిళిత

              జీవితంబెల్ల భారమైపోవుచుండ

              ధర్మదూరుడు తనయుండు దరికిరాడు.

4. కం . వృద్ధాప్యంబున బిడ్డలు

            శ్రద్ధాసక్తిన్ విశేష సౌఖ్యం బీయ

     .      న్నిద్ధాత్రి  వారి మీరిన

           సిద్ధాత్ముల జూడగలమె శ్రీరఘురామా !


5. సీ . మీరటులొంటరై  మితిమీరుకష్టాల

                           పడవద్దురమ్మంచు పజ్జజేర్చి

          ఆస్థులనమ్మించి అనునయ మొప్పార

                            నేజూతుమిమ్మంచు నియతిబల్కి

         సిరులెల్ల తనచెంత జేరినవెంటనే

                            శరణాలయంబున జక్కఁజేర్చి

         అమెరికా మున్నగు నన్యదేశాలకు

                            కులుకుచు పరుగిడు కొడుకులున్న

తే. గీ . తల్లి దండ్రుల  దుర్గతుల్ తలపనేల

           మానసికమైన క్షోభకు మారు పేరు

           కష్ట నష్టాల కడలికి కాపువారు

           కలలు చెదిరిన దీనులు కన్నవారు

6. ఉ.   వేయికి  నొక్కరిద్దరటు  వేరుగ పుత్రులు కల్గవచ్చులే

           స్థాయికిమించు యోచనలు సల్పక తల్లినితండ్రిసద్గురున్

           పాయక ప్రేమ జూచుచును భక్తివిశేష సమాదరంబుచే

        తోయజనాభు సత్కృపను తోరముగా నిల బొందు  సన్మతుల్

జె.జె.యస్.పద్యాలు.


                            జె.జె.యస్. పద్యాలు.
1.చదువ వ్రాయనేర్పి సన్మార్గమున్జూపి
    సంఘమందు మెలగు సరళిదెల్పి
    జ్ఞాననేత్రమొసగి కాపాడుచుండెడి
    విద్యనేర్చు నతడు విజ్ఞుడగును.
2. చదువె విద్యావినయముల సాధకంబు
    గురులె దైవాలు చదువులగుడులె బడులు
    నీతినియమాలు నేర్వంగ నెలవులగుచు
    కామితమ్ములుదీర్చు సర్కారు బడులు.
3. పల్లెప్రాంతమునుండి బడిజేరువారికై
                  బస్సుసౌకర్యముల్ లెస్సగూర్చు
    తరతమభావాలు దరిజేరనీయక
                   ఏకరూపమయిన వేషమొసగు
    చదువులు నేర్వంగ చక్కగా పుస్తకాల్
                   ఉచితమ్ముగానిచ్చు నుచితరీతి
     మధ్యాహ్నవేళలన్ మరలిపోనీయక
                     పౌష్టికాహారాన తుష్టిగూర్చు
     ఇట్టి బహుళార్ధదములందు బట్టువిడక
     చదివి సంస్కారయుతులౌచు సాగిపొండు
     తాతతండ్రులు చదివిన తావు విడచి
     పుట్టగొడుగులవలె నేడు పుట్టుచున్న
     వివిధ సంస్థలజేరంగ వెఱ్ఱితనము
     చేరరారండు! మీరు సర్కారు బడుల.
4. ప్రభుత నడిపెడి సర్కారు బడులజదువ
    బడయనగు సీటు గురుకుల పాఠశాల
    యందు,వాస్తవంబిదిగాన ఆదినుండి
    చేరరారండు!మీరు సర్కారు బడుల.
 5. చక్కగనాడుకోదగ విశాల మనోహర ప్రాంగణమ్మునన్
     రొక్కము కోరకుండగ పురోగతిజూపెడి విద్యబొందగా
     చక్కని బోధనాపటిమ జాటు సుశిక్షితదేశికాళితో
     పెక్కుగనిల్చె నీ ప్రభుత విద్యల నేర్వుడు పాఠశాలలన్


   


         

         



తొలకరి చినుకులు...రైతుల తలపులు.(2)

               తొలకరి చినుకులు..రైతుల తలపులు.

 1.  తొలకరి వానకై పుడమి తోషిత డెందము కందళింపగా
       బలుమరు ప్రార్ధనల్ సలుప భద్రము గూర్పగ నెల్లవారికిన్
       జలజలమంచురాలె చలచల్లని చిన్కులు రైతుబిడ్డకుం
       గలవరమంతబోయి తమ కాంక్షలుదీరెను నున్నతంబుగన్.
   
 2.   రైతుగ నాదుబాధ్యతగ రాగముతో మడిదున్ని నాణ్యతన్
       గోతులబూడ్చియెత్తయిన కుప్పలులాగి సమంబుజేయుచున్
       మాతగ జూచుభూమిని సమాదర రీతినమస్కరించుచుం
       జేతము రంజిలంబడెడు చిన్కుకు స్వాగతమిత్తు ప్రేమమై.

 3.   అన్నదాతగ పేరొంది యలరుచుండి
        చిన్న పెద్దల యనురాగ సిరులబొంది
        భారతావని గర్వించు పౌరుడనగ
        బ్రతుకు సాగించు నుత్తమ మతినినేనె.

 4.   చక్కగ మోసులెత్తు సహజాంకురముల్ నిజతేజరాసులై
       యొక్కటి యైనవీడక మహోన్నత భూమికణంబునుండియున్
       మక్కువ మీరతొల్కరి సమంచిత భంగిని తొంగిచూచినం
       దక్కువ యేమినాకికను దారకు సంతుకు భోగభాగ్యముల్.

 5.  పెండ్లి జేతును ఘనముగ బిల్లకపుడు
      కొడుకు జదివింతు వెజ్జుగ కూర్మితోడ
      ఇంటిదానికి కొనియిత్తు నింద్రమణులు
      పంట నాయింట మితిమీరి పరచుకొనగ.
     
     
     
     
       

18, జూన్ 2017, ఆదివారం

నాన్నా నీమాటే నాబాట.!


నన్ను ప్రభావితము చేసిన మా నాన్నగారి అనుభవపూర్వక అమూల్యామృత వాక్కులు.
1. సమయపాలన.....ఇది చేయకుంటే మనిషిలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆ లోపం చేస్తున్న పనుల మీద చేయబోయే పనుల మీద పడుతుంది. వ్యక్తి గత విలువ ఉండదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరాదని చెప్పారు.
2. పెద్దలను గౌరవించుట. .... దీనివలన సాటివారిలో సాటిలేని గౌరవం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. తద్ద్వారా మనకసాధ్యమైన పనులు నెరవేరతాయి.
3. నిజం చెప్పటం....ఇది అత్యంత కఠినమైన నియమం. చివరకు ధర్మరాజుకు కూడ అపప్రధ తెప్పించినది కూడా ఇదేకదా. అందరు ఇదే చెబుతారు. కాని పాటించేవారు? గో రక్షణ, స్త్రీ పురుష మాన ప్రాణ రక్షణలందు బొంక వచ్చునని మహర్షులు పలికారు. ఆవిషయంలో నాన్నగారిని అనుసరిస్తాను.                 4. నిశిత పరిశీలన..... ఏవిషయమునైనా పరికించి చూడటం కాకుండా పరిశీలించి చూడటం. ఇదే ఎక్కువగా విజ్ఞానాన్ని సంపాదించిపెడుతుందని , బుద్ధి పెరుగుతుందని చెప్పేవారు.పరిశీలనలో ఎదుటివారి మనోభావాలను కూడ తెలిసికొనవచ్చును. ఇదే ఆంగ్లేయులు చెప్పే "ఫేస్ రీడింగ్". ఆయన ఒకనాటి అనుభవాన్ని కూడ(ఒక మోసకారిని పసిగట్టిన విషయం) నాతో పంచుకున్నారు.
5.చిరునవ్వు....... ఏదైన ప్రత్యేక మైన బాధలో ఉంటే తప్ప ఏనాడు ముఖంలో చిరునవ్వు చెరగనీయవద్దు. అందరు అలా ఉండేలా ప్రయత్నం చెయ్యి.
చిరునవ్వు అందరిని ఆకర్షిస్తుంది. అలరిస్తుంది. బంధువులను, స్నేహితులను
చిరు నవ్వుతో పలకరింతమని చెప్పేవారు.
6. ఎదుటివారి మనసు గాయపడకుండ మాట్లాడుట......
     ఇది చాలా అవసరమైనది. నిత్యజీవితంలో ప్రతిక్షణం ఎదుర్కోవలసిన సమస్య. ఆనందంగా మనం ఉంటూ ఎదుటివారు కూడ అలా ఉండేటట్లుగా చూడటం. ఇది మన ఆయువును పెంచుతుంది.
7. అతి సర్వత్ర కూడదు... ఏవిషయంలోనైన అతిగా ప్రవర్తించే వారిని నమ్మరాదని చెప్పేవారు. ప్రేమైనా, ద్వేషమైనా అతి పనికిరాదు.
8. నలుగురితో మంచి..... అందరితోను ఎల్లవేళల మంచిగానే ఉండాలి. మరీ అది అసాధ్యమైతే కనీసం నలుగురితోనైనా మంచిగా ఉండాలి. చివరి మజిలీకి వారే అవసరమౌతారు.
9. నమ్మకం....   క్రొత్తవారిపట్ల నమ్మకం నిశిత పరిశీలనతోనే ఉండాలి. గ్రుడ్డి నమ్మకం పనికిరాదు. స్వభావాన్ని అంతో ఇంతో అంచనా వేసి దానిని బట్టి నమ్మాలి. మెరిసేదంతా బంగారం కాదనేవారు.

        మా నాన్నగారు(సూర్యనారాయణ) నాకు చెప్పగా వాటినే నేను నీకు చెబుతున్నాను.అన్నారు. నేను కూడ ఆ నవ రత్నాలనే అక్షరం తేడా లేకుండా నా కుమారునకు చెబుతున్నాను. నేను వాటిని తు.చ. తప్పక పాటిస్తున్నాను.

     తాతగారికి, నాన్నగారికి కృతజ్ఞతాంజలులు.

30, మే 2017, మంగళవారం

వృద్ధాప్యం . కష్ట సుఖాలు.

                                                వృద్ధాప్యం  . కష్ట  సుఖాలు. 

1. ఉ . కన్నుల చూపు మందమయి కాయము  శక్తి విహీనమై చనన్ 
          దన్నును గోరుచున్న తలిదండ్రులు నిత్యపు జీవనంబునన్ 
          వెన్నును గాచి యుండక నవీన విదేశపు డాలరొక్కటే 
          యున్నతమంచు నెంచి సుతులుద్ధతి చాటుట గారవంబొకో !

2. తే.గీ . చిన్నతనమున కొడుకుల జేయిపట్టి 
            జగతి బ్రతుకంగ దగినట్టి జ్ఞానమిడిన 
            నాన్న మోమున చిరునవ్వు చిన్నవోయె 
            కన్ననేరంబు నిరతంబు కలచుచుండె. 
3. తే. గీ . పుత్ర జననంబు స్వర్గంపు మూలమనుచు 
              తలచు తలిదండ్రులకు పరితాప మిళిత  
              జీవితంబెల్ల భారమై పోవుచుండ 
              ధర్మదూరుడు  తనయుండు దరికిరాడు.
4. కం . వృద్ధాప్యంబున బిడ్డలు 
           శ్రద్ధాసక్తిన్ విశేష సౌఖ్యం బీయ 
           న్నిద్ధాత్రి  వారి మీరిన 
           సిద్ధాత్ముల జూడగలమె శ్రీ రఘు రామా !

5. సీ . మీరటు లొంటరై  మితిమీరు  కష్టాల 

                           పడవద్దు రమ్మంచు పజ్జ జేర్చి 
          ఆస్థుల నమ్మించి అనునయ మొప్పార
                            నేజూతు  మిమ్మంచు నియతి బల్కి  
         సిరులెల్ల తన చెంత జేరిన వెంటనే 
                            శరణాలయంబున జక్కఁజేర్చి 
         అమెరికా మున్నగు నన్య దేశాలకు  
                               కులుకుచు పరుగిడు కొడుకులున్న 
తే. గీ . తల్లి దండ్రుల  దుర్గతుల్ తలపనేల
          మానసికమైన క్షోభకు మారు పేరు 
          కష్ట నష్టాల కడలికి కాపువారు 
          కలలు చెదిరిన దీనులు కన్నవారు  
6. ఉ.   వేయికి  నొక్కరిద్దరటు  వేరుగ పుత్రులు కల్గవచ్చులే 
           స్థాయికి మించు యోచనలు సల్పక తల్లిని  తండ్రి సద్గురున్ 
           పాయక ప్రేమ జూచుచును భక్తి విశేష  సమాదరంబుచే 
           తోయజనాభు సత్కృపను తోరముగా నిల బొందు  సన్మతుల్ 

     

            
            



28, జనవరి 2017, శనివారం

తెలిసి తెలియక...

 తెలిసి తెలియక చేసే పనుల వలన కొన్ని అనర్ధాలు , కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.పాతది పోతే కాని కొత్తది రాదు. నా టాబ్ లో ఉన్న తెలుగు సాఫ్ట్ వేర్ ఎలాగో పోయింది. అందు వలన వెంటనే క్రొత్త సాఫ్ట్ వేర్ నేర్చుకోవాలి అనే పట్టుదలతో ఇలా వ్రాస్తున్నాను.

18, జనవరి 2017, బుధవారం

గంగా సంగమ క్షేత్రం.

              గంగా సంగమ క్షేత్రం.(పాట)
  గంగా సంగమ క్షేత్రం, అది సందర్శనకు పాత్రం.
  1.మకరరాశిలో రవియే చేరగ, మాన్యోదధియే వెనుకకు బాఱును
     పర్వదినంగా ఖ్యాతినందుచు, పారును గంగా ప్రవాహమచట
                                                           గంగా సంగమ క్షేత్రం!!
  2.కపిలమునీంద్రుని కఠోరశాపం, సగరపుత్రుల సమయజేయగ
     అలలతాకిడి మెలమెల్లంగ, అదుపుననుంచి యటుచేరంగ
                                                           గంగా...
  3.భగీరథుండల భక్తిని వీడక, భర్గుని ధ్యానము సేయంగ
      నాకము వీడి జూటముజేరి, నవ్వుల నురుగులు పారంగ
                                                             గంగా...
  4.అరువదివేల భస్మరాసులకు, నానందంగా నమరత్వంబును
     చేర్చికూర్చినది చిర్నగవులతో, చిన్మయరూపిణి శివగంగా
                                                             గంగా....

  5.సంద్రముజేరిన గంగా, మంద్రస్వరాలు వినిపింపంగా
     ఆనందంబును నారోగ్యంబును, సకలసుఖంబులు కలిగింపంగా
                                                               గంగా....

   6.నాగలోకమున నాట్యంజేయుచు, నవజీవనియై తిరుగంగ
     నాగలోకమే నాకలోకమై, పరవశించి తా వెలుగంగ
                                                             గంగా.....
   7.నాకమునుండి నాగము వఱకు, పాపసంచయం తొలగిస్తు
     పుణ్యరాసులను పంచుతు తాను, పవిత్ర నదిగా పరిఢవిల్లెను
                                                              గంగా......
   8.భంగములెన్నో చూచినగాని, భవుని కరుణచే భద్రంగా
      ఈ క్షేత్రంలో సంద్రంజేరెను, సమ్మోదంగా సలలిత గంగా
                                                                గంగా....
  9.ఇంద్రియజయమును పొందినవారు,సామాన్యులు మరి శిష్ఠజనంబులు
    ఇష్టముతోడ పరిపరి మునుగును, ఈశునిప్రేయసిగంగామాయీ
                                                                 గంగా....
 10.కోటిజన్మల కల్మష హరణం, కోరగ గంగా శరణం
       క్రుంకిన జీవన్ముక్తి, కలుగును భక్త్యనురక్తి.
          !!గంగా సంగమ క్షేత్రం, అది సద్గుణపాళికి
          సాథుసంతతికి సంబరమిచ్చెడు క్షేత్రం.!!

   

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...