చతుర్థాశ్వాసము
1.కం : శ్రీరఘునాథుని సేవయె
పారము జేర్పించు నావ భక్తులకనుచున్
తారకమంత్రంబు సతము
పారాయణ జేయు గ్రామపాలన ధుర్యా!
2. వ : నాజరు తన భార్యను అనారోగ్యకారణంబున "గారపాడు"లో విడచి బాధాతప్త హృదయుండయ్యునుం గర్తవ్యవిముఖుండుం గాక గుండె దిటవుజేసికొని యుండ తదనంతర వృత్తాంతంబు నవధరింపుడు.
3. కం: "జిల్లా"పరిధిని నుండగ
నుల్లంబులు పరవశింప నున్నత విద్యల్
కొల్లగ "నాజరు" నేర్వగ
వెల్లువయై"రాష్ట్రపరిధి" పిలుపును పొందెన్.
4.ఆ.వె: "గరికపాటి వారు"ఘనమైన నేతగా
నాజరు సహజంపు నైపుణి గని
రాష్ట్ర పరిధి నుండ రమ్మనె ప్రేమతో
"కమ్యునిజపు"వ్యాప్తి కాంచగోరి
5.సీ : మానవబంధాల మమతానురాగాల
గౌరవంబులబెంచు "కమ్యునిజము"
ధైర్య సాహసములు దాతృత్వముంబెంచు
ఘనమైన మార్గంబు "కమ్యునిజము"
పేదలు ధనికుల భేదంబులేదంచు
గర్జించు వాదమ్ము "కమ్యునిజము"
బడుగులు సైతము ప్రశ్నింపగలిగెడి
గళముల నాదమ్ము "కమ్యునిజము"
తే.గీ : అట్టి లక్ష్యాల సిద్ధి చేపట్టదలచి
నాజరును వంతలిర్వురు నవ్యరీతి
ఊరి ప్రజలకు సత్కథల్ నూరిపోసి
కామితార్థాల పొందిరి ఖ్యాతి గలుగ
6.కం : "మాభూమి"నాటకంబున
నా భూకామందు నాజరౌచు నటింపన్
స్వాభావిక దూరుడయిన
శోభాకరమై వెలింగె సురుచిరలీలన్.
7. తే.గీ : "అహమదాబాదు" రేడియో యాజమాన్య
మపుడు జానపదులకు మహాద్భుతమన
స్పర్థకాహ్వానమీయంగ "ప్రధమ బహుమ
తి"ని బడసె"నాజరు దళము"ధిషణజూపి.
8. వ : నాజరు బృందంబు నాటకంబులను నటించుచు, జానపద కళలయందు జీవించుచు, నద్భుత నటనాపాటవంబుల ననేక పురస్కారంబులం బడయుచున్నను, కమ్యునిష్టు పార్టీ సభ్యులైన యువతీ యువకులు ప్రేమానురాగంబులం గలసిమెలసియున్నను, వివాహమై సంసార సుఖంబులకున్ దూరమైన నాజరు మానసిక, శారీరక స్థితి దుస్థితిగమారి, ‘‘పార్కిన్ సన్స్ వ్యాధి’’ ప్రారంభమైనది. తద్విషమున డా॥సోమసుందరము గారినడుగ వారు "దీనికి పెండ్లి చేసికొనుటయే మందనిరి . పుచ్చలపల్లి సుందరయ్య గారు" నీ భార్యను ఒప్పించిన పార్టీ పక్షాన వేరొక పెండ్లి చేయుదుమ"ని పలికిరి. దీనికి నాజరు అత్తమామ లంగీకరించలేదు.
9.ఆ.వె. భార్య యుండి సుఖము బడయగ లేనిచో
మనసు చెడును దారి మరలుచుండు
దాని బాగుచేయ ధర్మపత్నికె చెల్లు
భరతభూమి యందు త్వరితగతిని.
10. సీ : మనసును నెంతగా మభ్యపెట్టుదమన్న
ఊరడిల్లదు తా మహోగ్రమగుచు
ఆలోచనల్ నిల్పి యదుపుజేయుదమన్న
కల్లోలకడలిగా కట్టుబడవు
యోగాది విద్యలనోర్పుగా జేయుట
సాధ్యంబుగాదది శాంతిలేక
సంసారమందున సంతోషమీయగా
భార్యయొక్కతె తోడు భర్తకెపుడు
తే.గీ : భరతదేశంపు సద్ధర్మ పరిధి నున్న
జీవనంబున కొంగ్రొత్త చేవగూర్ప
పెండ్లియను నొక్క బంధమున్ ప్రియముతోడ
నుంచిరార్యులు పదునైన యూహజేసి.
11. ఉ : వచ్చిన జబ్బు వైదొలగ "వంద"యె మందని పిల్లతండ్రికిన్
నచ్చగజెప్పికొంచు శరణాగతి గోరుచు వియ్యమంది - మీ
రెచ్చట బల్కరాదనుచు నిమ్ముగ రేయి ప్రయాణమై స్వతం
త్రేచ్ఛగ నాజరాఖ్యుడు సరే యని యా "బెజవాడ"జేరెగా!
12. ఆ.వె : "కొరిటెపాడు"లోన కోరిన పిల్లయే
మారుమనువు కాగ తేరుకొనెను
జన్మధన్యమనుచు సంతసమందెగా
ప్రేమ పంటపండ రామయందు.
13. కం : "పెదపూడి"పాఠశాలను
సదమలమౌ శాస్త్రములను చక్కని కవితల్
పదునగు సత్కవి "శ్రీశ్రీ"
పదబంధములెల్ల నేర్చెబాగుగ"నాజర్".
14. చం : చరితలు శాస్త్రకావ్యములు చక్కని యార్థిక సద్విమర్శలున్
పెరిగెడు రాజకీయములు పెద్దల సుద్దులు గీతమాలికల్
మరిమరి మారుమ్రోగునిట మానితమౌ "పెదపూడి"యందునన్
ఒరపిడి బెట్ట జ్ఞానమును నోర్మిని"నాజరు"పండితుండయెన్.
15. ఉ : పాటలు సీసపద్యములు ప్రాసలు యాసలు కావ్యపద్ధతుల్
మాటల యర్థభేదములు మారిన జానపదంపు సొంపులున్
మేటి యలంకృతుల్ కవులు మెచ్చెడు భావసమున్నతాంశముల్
నాటుకొనెన్ మదిన్ స్థిరత "నాజరు"కా "పెదపూడి"వాడలోన్.
16. సీ : బెంగాలు వరదలే భీకరమ్ముగ సాగ
గ్రామగ్రామంబులే గంగగలసె
కలకత్త వీధులు కశ్మలమ్మైపోయె
పులివిస్తరాకుల ప్రోగువలన
మెతుకు కంటబడిన బ్రతుకు జీవుడనుచు
చెత్తకుప్పలకడ చేరిరంత
పందులు కుక్కలు పక్షులు మానవుల్
దైవప్రార్ధన సల్పె దారిలేక
తే.గీ : ఇట్టి స్థితిలోన నెవరైన నింతయేని
ప్రేమ నందించి యార్ద్రతన్ బిలువనెంచి
బుఱ్ఱకథ వ్రాసి బాధల పొందుపఱచి
సాయమర్థించె నాజరు సంఘమందు.
17. ఆ.వె : విజయవాడ లోన బెంగాలు కరువునున్
బుఱ్ఱకథగ వ్రాసి స్ఫూర్తి దనర
అభ్యుదయ రచయితలందఱు గూడంగ
చెప్పె కరుణరసము చిప్పిలంగ.
18. వ : "బెంగాలు కఱవు"కథ ముగింపు లో పాకిస్తాన్ సమస్యపై రాజీ కుదరక తికమకపడు గాంధీ, జిన్నాలను గురించి నాజరు "గుమ్మమందున యుద్ధరాకాసి, దేశాన కరువు పిశాచి’’ అను ఒక ప్రబోధ గీతము వ్రాసి గాంధీ జిన్నాలు కలువ వలయునని, యెలుగెత్తి చాటె.
19. ఉ : ఆ సభలోని నాయక మహాశయులెల్లరు ప్రేమపూర్ణులై
"వేసములోనెగాదు మన బిడ్డడు చక్కని పాటవ్రాయగా
చేసె పరిశ్రమంబ"నుచు శ్రేయమెలర్పగ సంస్తుతించి రా
వాసిగలట్టి "సుందరయ" "బాపురె!యెంతటి వృద్ధి నీదనెన్"
20. ఉ : మీసముదువ్వుచున్ తనకు మేదిని సాటి యెవండటంచు-బల్
రోసముజూపి "గర్తపురి రుచ్యపు గోగులకూర"యంచు-తా
హాసము జేసినట్టి ఘను "నాంధ్రసభన్"గల "సుబ్బయార్యునిన్"
భాసిత దివ్యతేజునట ప్రార్థనజేయగ భావ్యమౌనుగా.
21. తే.గీ : ప్రముఖ చిత్ర దర్శకమణి పరమగురువు
"గూడవల్లి వంశజుడు"తాగూర్మిబిలచి
సేకరించిన గ్రంథాలు చేతికిచ్చి
నాజరును వ్రాయగోరె పల్నాటి కథను.
22. కం : "బాపట్ల"పాఠశాలకు
నోపిక "బళ్ళారి రాఘవోత్తముడటురాన్
దాపున నాజరు కథవిని
బాపురె! నీవింత ఘనుడ వనుచును మెచ్చెన్.
23. తే.గీ :"యువజన సభ"లో నుండియున్ యోగ్య పీఠ
మును వదలి "రాఘవ"నటుడపూర్వమనగ
వచ్చి నాజరుం బొగడెగా వత్సలతను
వఱద కథనంబు కరిగించ వారి హృదిని.
24. సీ : తల్లి సంస్మృతి సభన్ దగునంచు "బెంగాలు
కథ"ను జెప్పించిన ఘనుడెవండు?
ధనమును బట్టలున్ దండిగ సమకూర్చి
సాయమందించిన సరసుడెవడు?
బళ్ళారి ప్రజలకున్ ప్రళయకాలములందు
మసలురీతులు దెల్పు మాన్యుడెవడు?
చక్కని రచనకు స్పందించి నాజరున్
హత్తుకొనినయట్టి యాప్తుడెవడు?
ఆ.వె : భవ్యచరితుడైన "బళ్ళారి రాఘవ"
కాక యెవ్వడిలను కానబడును?
కళల విలువ నెఱిగి ఖ్యాతిని బెంచంగ
మరల నతడె వలయు మహిని సుమ్మి!
25. ఉ : బందరు మాన్యులెల్లరును పాయని కూరిమి సాయమిచ్చుటన్
"నందము సుబ్బరావ"చట నవ్యముగా సరిగూర్చ శ్రద్ధమై
యందఱు క్రొత్త"తంబుర"ను నాదరమొప్ప సభాంగణమ్మునన్
సందడిగాగ నిచ్చిరటు సన్మతి "నాజరు"కున్ ముదంబుగన్.
26. సీ : "ఆంధ్రా అమరషేక్"గ అబ్బాసు వినుతిచే
ఖ్యాతిగన్నట్టి సత్కళల రాజు
"మాభూమి"నాటకమందు "కమల"పాత్ర
"జమున"కు నేర్పిన జాణకాడు
బుఱ్ఱకథయను నపూర్వాయుధము చేత
బడుగుకథకుల సద్బంధువతడు
ధనిక కులములకు ధర్మాలు బోధించు
కూలీల పాలి సద్గుణుడతండు
తే.గీ : నాజరనువాడు బహుముఖ నటనలోన
నారితేరిన సత్కళా కారుడనగ
పేరువడుటను జనులెల్ల ప్రియముతోడ
సంతసించిరి సతతంబు సన్నుతించి.
27. చం : ప్రజలకు పోరుబాటలకు ప్రజ్జ్వలనాలకు కమ్యునిష్టులే
నిజమగు సంఘశక్తియని నిశ్చలతేజుడు నాజరాఖ్యుడే
భుజబలమయ్యె నయ్యెడ యమోఘపు సాయుధ మూర్తియౌటచే
నజితుల నడ్డుకోదలచినాంక్షల నుంచెను"కాంగిరేసు"యే.
28. చం : గతమున"రామరాజు"కథ కళ్ళకుగట్టుటె నేరమంచనెన్
హితమతిహీనులా పరమ హేయపుటాంగ్ల దరిద్రపాలకుల్
పతనము చేరువౌట తన ప్రాభవ మున్నిట చూపు కోర్కెతో
వెతలను గల్గజేయ సరివేటును వేసెను"నాజరన్న"పై.
29. తే.గీ : ప్రజల డెందాల జెడగొట్టు పార్టి యనుచు
కమ్యునిజము ను ప్రభుతయే కాలరాయు
నట్టి చర్యగ పలు నిషేధాజ్ఞలీయ
బుఱ్ఱకథకుల ముందున్న భుక్తిపోయె.
30 . ఉ : చేరెను నాజరయ్య నవజీవనయాత్రకు"పొన్నెకంటి కిన్"
ఊరకయుండలేక పది యూళులల మెచ్చిన నాటకంబులన్
వారల కోర్కెమేరకును వాచకభేదములాంగికమ్ములున్
తీరగు పాటలంగఱపి తిండికి దెచ్చెను గొంత రొక్కమున్.
31. వ : ఇట్లు దిరుగుచుం దన శైలిలో ఆసాముల, జీతగాండ్ర స్థితిగతులన్ బాటల రూపంబున వ్రాసి పాడుచుండె.
32. కం: పరగడుపు పాచి కూడును
మరి మధ్యాహ్నంబు నందు మాడినకూడున్
కరుణకు నోచని జీవులు
ధర నీడ్చుచునుండి రకట! ధనికుల యిండ్లన్.
33. కం: చాలని జీతము తోడను
కాలంబును వెళ్ళబుచ్చు కర్మము మీకా?
చాలిక యూడిగమిట్లని
యేలికపై తిరుగుబాటు నివ్విధి నేర్పెన్.
34. తే.గీ:తిరుగుబాటును హక్కుగ తెలియజేసి
జీతగాండ్రకు దగినట్టి శ్రేయమలర
నాజరాఖ్యుండు కలిగించె నమ్మకంబు
భావి జీవన పరిథులు బాగుపడగ.
35. తే.గీ:కూలి జనులకు నిరతంబు కొమ్ముగాచి
శ్రామికాళికి గూర్చంగ సంఘమొకటి
చేతనత్వంబు గల్గించి యూతమీయ
మండిపడిరిది విన్న ఖామందులెల్ల.
36. తే.గీ:"మోతడక"గ్రామ ఖామందు ముందు నిలచి
జీతమునుజేయు దౌర్భాగ్య జీవితాలు
దుడుకు చేష్టల హింసించు దొరల తెగువ
పాట రూపాన సృష్టించి పాడియాడ
37. తే.గీ: ఆగ్రహించిన యజమాని యదుపుదప్పి
ఛెళ్ళుమనిపించె నాజరు చెంపనపుడు
మానవత్వంబు నశియించి మహిషమగుచు
నిచ్చవచ్చిన రీతిని నిట్టులనియె.
38. కం: "ఏరా! కమతపు వెధవకు
మారాజుకు బెట్టినట్లు మవ్వపు దిండా?
కూరాకు విలువసేయని
మీరా మము దిట్టిపోయ మీరిన వారల్?
39. తే.గీ: అనగ నాజరు కోపంబు నణచుకొనుచు
"పరుల శక్తికి దగినంత ఫలము నిచ్చి
మానవత్వంబు జూపుట మంచిద"నుచు
బుద్ధి జెప్పెను పెద్దల ముందు నిలచి.
40. కం:దొరలెల్ల గరుణ జూపిన
దొరగారను గారవంబు తోచును మాకున్
కొఱగాని దుష్ట చేష్టల
నరకంబును జూప మీరు నాయకులేనా?
41. కం:శిక్షింప మీరలెవ్వరు?
రక్షింపగ లేని యట్టి రాజసమేలా?
రాక్షస ప్రవృత్తి మానుచు
మా క్షేమము సతము జూడ మాన్యత పెరుగున్.
42. ఆ.వె: పరుల కష్టమెల్ల పరమాన్న మనురీతి
ననుభవింప దగునె ననవరతము?
కష్టఫలము నీయ కల్యాణగుణమౌను
తెలిసికొనుడు మీరు తెలివితోడ.
43. చం: హరిజన ముఖ్యులున్ యువకులాగ్రహమందుచు "పెద్ద రెడ్డి"పై
కొఱకొఱ జూచుచుం "బరమ క్రూరత దూషణ మీకుజెల్లునే?
సరియగు మార్గమెంచుకొని సద్గుణభావము నింపుకొండ"నన్
పొరబడినందు కాతడును మున్ను క్షమాపణవేడె నత్తఱిన్.
44.చం: ప్రజలకు మంచిజెప్పినను రక్షకబృందము భీతిగొల్పగన్
గజమున కొక్కరుండిరట గండ్రతనంబున క్రూరచిత్తులై,
విజయమునందగోరి పలు వీధుల నిక్కుచు వేగిరంబుగా
సజలవిషాద నేత్రముల సాగెను నాజరు భావిదీప్తికై
45. శా : నేరంబేమియు జేయకున్న నెదియో నిందన్నిరూపించుచున్
గారాగారము ద్రోయుచుం జెడుగులై క్రౌర్యంబునం గొట్టుచున్
వీరత్వంబును జూపుచుండిరకటా!వేమార్లు "పోలీసు"లే
" పోరాముల్ యొకదానివెంట నొకటై ప్రోగౌన"నన్ సామెతన్.
46. ఉ : కన్నులు కానరాని నిజకాంతయు గర్భిణి బావిలోపలన్
తిన్నగ చేరలేక కడు దీనత బిందెడు నీరమందగన్
చిన్నగ జారి మెట్లపయి చేరె మహేశుని పాదపద్మముల్
ఎన్నగరాదు కాలమది యెప్పటి కెట్టుల నిర్ణయించునో!
47. తే.గీ : అనుచు నాజరు పరమ దుఃఖార్తుడగుచు
భార్య మరణంబు తనదు దౌర్భాగ్య మనగ
పొన్నెకంటి కి జేరెను ప్రొద్దుమిగుల
అమ్మ యనురాగదేవత యండతోడ.
48 . ఉత్సాహ వృత్తము :
ఇంటిపేరు లేకయుంట నేమికర్మమౌనురా!
కంటిజబ్బు కారణాన కలియలేదు భార్యతో
నొంటరౌచు నీవు నేను నొదిగియుండ న్యాయమా?
జంటకొఱకు మామకూతు చనువునడుగు మనుచు దా
49.
వెంటబడగ తల్లి యపుడు వేగజనెను నాజ రా
గంటలోనె గారపాడు కాదటంచు బల్కకే;
కుంటిసాకు మామ చెప్పి కూతునీయ కాదనెన్
పంటవలతి యాశజూప పరిణయంబుజేసెగా!
నాజరు కొండలలో దాగుట.
50. ఉ : కొందఱు పార్టి నేతలిల క్రూరముగా నొక పెద్ద రైతునే
చిందరవందరై పడగ శీర్షముగాల్చిరి"తుళ్ళురం"దునన్
అందిన వార్తమేరకటు లాగ్రహమందుచు గ్రామసీమకున్
సందులదూరి వచ్చిరటు చయ్యన రక్షక బృందమంతయున్.
51 . ఉ : వారినిజూచి నాజరటు" బ్యారను "లోపల దాగియుండగా
ఘోరతరంబుగా గడలగోడలు,కుండలు, సూర్యచంద్రులున్
తారక లింటి కప్పులుగ దర్శనమిచ్చిన కొంపలోనికిన్
జేరెను బృందమంతయును శీఘ్రముగా బరిశీలనార్థమై.
52 . తే.గీ : గొడ్లచావిడిలో దూరి కుళ్ళు కంపు
పేడతట్టనుశిరము పై బెట్టుకొనుచు
నాజరెవ్వరు కనకుండ నక్కి నక్కి
"మోతడక"కొండ జేరెను మ్రుచ్చువోలె.
53 . ఆ.వె : పెండ్లి జరిగె నేదొ పేరుకుమాత్రమే
సుఖము ననుభవింప శూన్యమయ్యె
కొలది రోజులకును గుట్టుగ కొండలన్
చేరవలసి వచ్చె చింతతోడ.
54 . సీ :" రక్షక బృందంబు "రక్కసిచర్యగా
కందికంప దడులు కాల్చినారు
క్రోధంబు దీరక కుండలు ముంతలు
ముక్కలు జేసిరి మూర్ఖులగుచు
"బ్యారను" పట్టాల పరదాలు చింపుచు
అట్టహాసపు చిందులైరి వారు
పచ్చడి జాడీలు పగులగొట్టుచువారు
"పెట్రోలు" బోసిరి పిచ్చిముదిరి
తే.గీ : ఎంతయో భీతి వణకుచు నెదురు వచ్చు
నాజరువలి తల్లిని జూచి " నాయకుడెట
దాగెనో చెప్పు, లేకున్న తప్పదెపుడు
ముప్ప" నుచు బల్కి సాగిరి ముందుకపుడు.
55 . కం : "మోతడక"కొండ గుహ న
జ్ఞాతమ్ముగ వాసముండి నచ్చిన బాణిన్
ప్రీతిగ పీడిత జనులకు
కైతల నలవోక వ్రాసె కవి నాజరహో!
56 . చం : జరిగిన వాస్తవంబులను జాగ్రతగా నొక "కాంగిరేసు"లో
దిరిగిన కార్యకర్త కడు ధీరత నా "ప్రెసిడెంటు"గారికిన్
మరిమరి జెప్పగా నతడు మందిని గూర్చుచు గోలజేయుచున్
దొరికెను నాజరిక్కడని దూఱుచు బల్లెము గొంచు వచ్చెగా.
57. ఉ : పల్లెకు పెద్దవాడయిన "ఫాదరుబాబు"వివేచనంబుతో
నుల్లము రంజిలం బలికి యూరికి వచ్చిన నయ్యలందఱన్
మెల్లని శాంతివాక్యముల మేలగు సూక్తుల నచ్చజెప్పుచున్
కల్లల నెవ్వరాడిరి "మకామిదె"నాజరుదంచు మీకటన్.
58 .తే.గీ : కొండచుట్టును సైన్యంబు కొలువుదీరి
యున్న కతమున మిత్రుని యునికి మార్చ
"బాబు"యత్నించి "నాజరు"పజ్జజేరి
ప్రేమతోడను నన్నంబు పెట్టి పనిచె.
59. తే.గీ : మారువేషాన తరలెను గారపాడు
ఊరిబయలున యానాది యువకులంత
తనకు సన్మిత్రు లగుటచే తన్మయముగ
హాయినుండగ నాజరున్ హత్తుకొనిరి.
60. ఆ.వె : "గారపాడు"లోని కాంగ్రేసునాయకుల్
వెదకుచుండిరచట వేయికనుల
నాజరెక్కడనుచు నల్దిక్కులందున
నరిగె "కొండవీటి"కతడు మున్నె.
61. ఉ : "తుమ్మలకుంట" ప్రక్కగను ధోవతి దోపుచు నాజరయ్యెడన్
నెమ్మది నెమ్మదిన్ నడచి నెయ్యుడు"తాళ్ళురి రామకోటి"తా
రమ్మని జెప్పకుండగనె రాతిరిరాతిరి దిక్కుతోచకన్
గుమ్మము దట్టెగా తనదు కూరిమి మిత్రుని సాయమందగన్
62. మ : గుహలన్ వాసముజేయుటల్, తినగ నేకూడైన లేకుండుటల్
అహముల్ రాత్రులు నిద్ర లేని మిషతో నారోగ్య భంగంబులున్
కుహనా రక్షకులైన వారి పరుగుల్ గోలల్ మనశ్శాంతినిన్
బహుదూరంబుగ జేయగా మనుగడే ప్రశ్నార్థకంబయ్యెగా!
కాంగ్రేసు కార్యకర్త భీకర శపథము.
63. ఉ : "తంబురమీటు వ్రేల్నఱికి తప్పక నాపగదీర్తునన్న - యా
సంబరమేమి నిల్వకయె స్వర్గముజేర్చెను కార్యకర్త - నా
యంబుజనాభుడే" యనియె అన్నయ "సయ్యదుబాబు," " భ్రాత " తో
పంబిన గర్వమెప్పుడును బ్రాణముదీయును నేరికేనియున్
64. ఉ : "నాజరు ప్రాణముల్నిలిపి నల్వురిలో బడకుండజేతు నీ
రోజున నాదు యుక్తిమెయి లోపల వేసెద"నంచు "ఎస్సయే"
భాజనుడైన పోలిసును బ్రక్కకు బిల్చి"యరెస్టు"జేయగా
నా జనులందరాతనికి హైన్యము జూపిరి క్రూరచిత్తులై.
65. చం : "మిలటరికాంపు"లో నడుగు మెల్లగబెట్టినదాది యందఱున్
గలగల చెంతజేరి తమక్రౌర్యముజూపుచు "పల్లెటూళ్ళ లో
నెలవులు, నాయకాగ్రణుల నీరము భోజన భాజనాదులున్
గలయుచు నిచ్చువారెవరు? క్రన్నన జెప్పుమ"టంచు గొట్టగా
66. చం : "తెలియదు నాకు సామి! కడుదీనుల గాథల, కూలిరైతులన్
బలముగలట్టి కాపులెటు బాధలుపెట్టుచునుందురో, సదా
ఫలితము శూన్యమై కడకు వారల జీవికలెట్లు రాలునో!
లలితపదాల దెల్పి నుతులందుచు నే మనుచుంటి నిత్యమున్"
67. తే.గీ : "బుఱ్ఱకథ"లయ్యె నాకింక భోజనంబు
కతలు లేనట్టి రోజున వెతలె మిగులు"
నని "కలెక్టరు"గారికి నంజలింప
కరుణ జూపిరి వారలు ఖైదులోన.
68. మత్తకోకిల: "మంచి కంఠము నీదిరా యనుమానమించుక లేదురా
దంచిపాడుము నాజరూ! సముదంచితంబగు రీతితోన్
సంచితంబుగ నీకునబ్బెను సంగతుల్ ఘన రాగముల్
పంచుకొందము భోజనంబ"ని పాట కోరిరి సైనికుల్.
69.తే.గీ: తాను నేర్చిన రాగాలు తాళ గతులు
గాన గంధర్వు పగిదిని ఘనముగాను
గురుని కరుణను బాడంగ మురిసి, వారి
భోజనంబును బంచిరి భాజనముగ.
70. మ. కోకిల : "దీన నాజరు పున్నెమో మరి దివ్యతేజుల దీవనో
గానవిద్యను గారవించిరి కాపలాగల సైనికుల్
మేను తన్మయమందగా విని మేలుమేలని బల్కుచున్!"
మానితంబుగ వారలందరు మాటలాడిరి ప్రేమతో
71.వ: "కల్యాణరావ"ను కలెక్టరుగారు మంగళగిరి వచ్చి కమ్యునిష్టు ఖైదీలను కాల్చక
విడుదలచేయ వలయునని ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల ఆజ్ఞయని తెలుపుట.
72 . తే.గీ :"కనగ నీసతి సూత్రాలు గట్టివనుచు"
చంపకుండగ దయతోడ సౌమ్యరీతి
"గర్తపురి"లోన దించెను కాలవశత
మాన్య కల్యాణ రావను మహిత గుణుడు
బుఱ్ఱకథ లకు ప్రాణంబు పోయుమనగ!
73 .వ : ఈ రీతిగా "నాజరు" విడుదలై స్వతంత్ర జీవనమునకు బూనుకొనెను.
ఆశ్వాసాంతము
74 . పంచచామరము : విశేష ప్రేముడిన్ జగాన విస్తృతంపు భావమై
అశేష సుప్రజాళి పావనాంతరంగమై సదా
వశీకృతాత్మతేజ! దివ్య వైభవాది భాసురా!
ప్రశాంత పూర్ణచంద్ర శేఖరా! విశుద్ధ శేముషీ!
75 . కం : కాలము వ్యతిరేకించిన
వీలగు సాయమ్ముజేసి వేదన దీర్పన్
మేలుగ నుండెడు తీరును
పాలనలో జూపు మాన్య!పావన చరితా!
వ : ఇది శ్రీరామ పదారవింద మకరందపానమత్త తుందిలుండును, సుజన సంస్తుత్యమాన మానసుండును, బంధువత్సలుండును, శ్రీవత్సగోత్రజుండైన పొన్నెకంటి పూర్ణచంద్రశేఖర వరప్రసాదరాయాఖ్య తనూజుండును, సుజనవిధేయ సూర్యనారాయణరాయ నామధేయ ప్రణీతంబైన "బుఱ్ఱకథనాజరుచరిత" మందలి చతుర్థాశ్వాసంబు.
📖 📖 📖 📖 📖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి