22, నవంబర్ 2019, శుక్రవారం

తృతీయాశ్వాసము. 4.04.2018

                                 తృతీయాశ్వాసము .

  1. కం: శ్రీపూర్ణచంద్ర నామా!
             మా పాలిటి దివ్య శక్తి మముగావగదే
            పాపాల ద్రుంచి కరుణను
            గోపాలుని రీతి సతము కూరిమి గనుమా!

                                నాజరు కుటుంబ పోషణ.

2. సీ:   బట్టలు గుట్టుచు బ్రతుకును నీడ్చుచు
                             అవమాన భారంబు  నతిగమించి
           పెదనాన్న కొడుకుతో ప్రియమార కలియుచు
                             సంక్రాంతి పర్వాల సంచరించి
           సంగీత విద్యయే సాధనంబనియెంచి
                             ధాన్య సేకరణంబు తగనొనర్చి
           "బ్యారను" పనులేవి భారంబు గావంచు
                             విసుగు లేకయె బొగ్గు వేయుచుండి.
 తే.గీ :  తండ్రిపోయి కుటుంబ బాధ్యతలు పడగ
            చెల్లి పెండిలిసేసి యాశీర్వదించి
            కటిక దారిద్ర్య బాధలం గడపుచున్న 
            మేరునగమౌచు "నాజరు"మెరసెనపుడు.
 3. ఉ : బట్టలుగుట్టుచున్ స్వరము పద్ధతి తప్పని  ధీవిశేషతన్
           పట్టునుజారకుండ కడు ప్రాజ్ఞులు మెచ్చెడు రీతి బాడగా
           గట్టిగ చప్పటించినను గాంచని "నాజరు"తో ననెన్ "ఇదా?
           ఇట్టిదికాదు నీ భవిత యిమ్ముగ మార్తునునేనటంచు దా
           దిట్టతనంబునం బలికె ధీవరుడై "బసవా"ఖ్యుడయ్యెడన్.
 4. ఉ: "నీవుగ నేర్పగావలయు నిర్మలమూర్తిగ గానవిద్యలన్
           భావితరాలు చెప్పుకొనుభాతి స్వరాళి వికాసమూలముల్
           పావని సాక్షిగా నెలకు బత్తెమునిత్తుమ"టంచు బల్కెగా.
           దైవము మారువేషమున దగ్గర జేరుటనంగ నిట్టిదే!

                                సంగీతోపాధ్యాయునిగ బాధ్యతలు.

 5. ఆ.వె : ఉన్నయూరి యందె యుత్తమ సంగీత
               పాఠములను జెప్పు పదవివచ్చె
               ప్రథమ గురువనంగ "బసవయ్యగారింట"
               కాలుమోపి మిగులఖ్యాతినొందె.
 6. సీ : కమలగర్భుని రాణి కచ్ఛపీనాదంబు
                            సరిగమ రూపాన సాగెనెచట?
           నలువరాణి మొలక నవ్వుల సవ్వడుల్
                           జంట స్వరములౌచు జారెనెచట?
           శ్రీలక్ష్మి కోడలి చిన్నారి పలుకులు
                           చిలుకల పలుకులై చెలగెనెచట? 
            వేదమే నిలయమై విజ్ఞాన దీపమై
                           కాంతి పుంజంబులు క్రాలెనెచట? 
  తే.గీ :  అట్టి పుణ్యస్థలియె కలహంస వాహి
            ని యరుణారుణ చరణ వినిర్మలమగు
            "కొమ్మినేని"వారివిమల  కూర్మి గృహము
            భావి సంగీత మేథకు తావియయ్యె.
  7. ఆ.వె."కొమ్మినేని"వారి కూరిమి గురువుగా
            స్థానమందినట్టి సౌమ్యుడైన
            "నాజరాఖ్యు"కళలు నైజంబు గూర్చియు
            పలికిరిట్లు ప్రజలు పరవశించి.
 8. మ : ఎవరో గానసుథాకరుండట! భళీ!యింపారు భావాలతో
            నవచైతన్యవిలాస రూపుడట! సన్మానార్హ తేజుండటే!
            కవనంబున్ మరి నృత్యముంగఱపు సంస్కారాభిలాషుండటే! 
            అవనిన్నాజరె గుర్వనంగదగు నాహా! యెంత సౌభాగ్యమో!
9. తే.గీ: వీధిభాగవతములట, వీరతాళ్ళ
            పాటలట, ఎఱుకలసింగి బాణియంట
            కృష్ణచెంచుల రమణుల నృత్యమంట,
            నాట్యసంగీతయుగళమె "నాజరంట".
10. తే.గీ:అట్టి గురువుల యొద్దనె యమిత భక్తి
           నేర్చుకొనినట్టి విద్యయే నేర్పుదెచ్చు
           భావికాలాన గుర్తింపు పఱగజేయు
           ననుచు "నాజరు" కడజేరి రభ్యసింప.
11. కం: సంగీత చక్రవర్తిగ
            రంగంబును నేలునట్లు రసమయజగతిన్
            సాంగోపాంగత నేర్పెడు
            చెంగావి పటంపు ధారి శ్రీ నాజరెగా.

12.వ: సంగీతోపాధ్యాయునిగా "కొమ్మినేని బసవాఖ్యు" కుటుంబ సభ్యులందఱకున్ సరిగమలు నేర్పుచుండ "నాజరు" నకుం బ్రత్యేక గుర్తింపు వచ్చి గ్రామ గ్రామేతర విద్యార్థులు "కోరిన ధనమిత్తుము, మాకును సంగీతము నేర్పవలసినద"ని కోరుటయుం నాజరు తన్నాటకంబులను వేయుట, వేయించుట, సంగీతపాఠంబులం జెప్పుటలో క్షణము తీరికలేక యుండె. "దామరపల్లి" లో నలుగురు, "ఫణిదరం"కరణముగారి కుమార్తె యొకతె శిష్యులైరి. ఉదయము "పొన్నెకల్లు"లో సంగీత పాఠంబులు చెప్పి, భోజనానంతరము  "దామరపల్లి" లో మరి కొందరకు  చెప్పి, అల్పాహారానంతరంబు  "ఫణిదరముం" జేరి ఒక శిష్యురాలికి  జెప్పి, ఆ రాత్రికచటనే యుండి, ఉదయకార్యక్రమముల యనంతరంబు మరల ఆమెకు పాఠంబు జెప్పి, "దామరపల్లి" వచ్చి పాఠంబులు పూర్తిజేసి, భోజనానంతరంబు  స్వగృహముం జేరుట నాజరునకు నిత్యకృత్యమైనయది.     

                                            నాజరు వివాహము.

 13. చం: సరిగమ లిచ్చుచుండె తగు సంపదలన్ ఘనకీర్తి మాన్యతల్
              జరుపగ పాడియౌ నిపుడు చక్కగ పెండిలియంచు బంధువుల్
              పరిపరి యోచనల్ సలిపి పాయని కూరిమి నిర్ణయించి-రా
              సరియగు మామకూతురని సభ్యులు "నాజరు" కున్ ముదంబునన్.
14.సీ : శిష్యులు ముఖ్యులు స్నేహితులందఱు
                             నాజరు పెండ్లికై నగదుగూర్ప
           గ్రామకరణమైన గంభీరహృదయుండు 
                              "మాధవరాయుండు"మానితముగ
          "శ్రేయంపు తలబ్రాల చీరయు; ద్విశతము
                              ధనమును నిచ్చెను దర్పమలర
           ఆటగుఱ్ఱము, బ్యాండు, హంగుల మేళాలు
                              పెండ్లి సందడి తోడ పేరుమ్రోగ
 తే.గీ : మామకూతురు "కాశింబి"మధుర హృదయ
           పొన్నెకంటి కి కోడలై పుట్టియుంట
            ముద్దులొలుకుచు కుడికాలు మోపెనంత
           లక్ష్మి నారాయణునిజేరు లక్షణముగ.
15. సీ : అత్తగారింటికి నరణపుటల్లుడై
                           "కోండ్రుపాడందు"న కుదురుకొనగ
            మరదలే భార్యయై సరసనజేరంగ
                            మనసుపరవశించె మధురగరిమ
            పంచబాణుడు తన పౌరుషముంజూప
                           పగటి ప్రొద్దు గడుప భారమయ్యె
           రాత్రులందున యనురాగభోగములకై
                            అంతరంగంబున నాత్రమొదవ
 తే.గీ : గువ్వజంటను రీతిగా కూడియుండి
          సకల సుఖములనందగా సాటివారు
          సారసంసారమంచును సహృదయముగ
          దీవనలనీయ "నాజరు" ధీరుడాయె.

                          భారతీయ ధార్మిక వైవాహిక జీవనము.

16. ఉ : భావనలెల్ల పొంగు రస భాషణ సల్పిన, చాకచక్యమున్
            తావుల బంధమై వెలుగు, తన్మయతన్ తను చుట్టుముట్టినన్
            పావన వంశ చంద్రు నిడ ప్రాగ్దిశ భానుని నిచ్చు కైవడిన్
            జీవితమెల్ల సౌఖ్యముల శ్రీనిలయంబగు భార్యయుండినన్.
17. చం : పరమపవిత్ర బంధమిది భారతజాతికి, జీవనాడియై
              స్థిరపడిపోయె నిచ్చట ప్రదీపిత మానవ సంఘమందునన్
              అరమరికల్ కనంగను మహాత్ములు సైతము  చాలరిచ్చటన్
              హరిహరి!కానరావుగద యీ  విలువల్ పరదేశమందునన్.

18.వ : అత్తగారింట అరణపుటల్లుండై మనుగుడుపులు దినుచు  నాటకంబులను ఆయూరి కుఱ్ఱకారునకు నేర్పుచున్న తరుణంబున.

                          గ్రామస్థులకు నాటకములను నేర్పుట.

19. సీ :" కోండ్రుపాడు"న గల కుఱ్ఱకారెల్లను
                 "నాటకమును నేర్పునాజర"నుచు
            వలసిన ధనమది కలసి తామంతయు
                       భరియించు షరతును పల్కిరంత
            రెండువందలు గొప్ప పండుగ యగునట్లు
                       ముందుగనిచ్చిరి మోదమలర
            "కనకతార"యనెడు కమనీయ దృశ్య రూ
                        పకమును పాటల పదునుబెట్టి
 తే.గీ : గ్రామ మందున వేయించ, కాంచినట్టి
          జనులు పరవశించి నిలచి చప్పటులను
          కొట్టి "ఆరువందల"నిచ్చి కోరికోరి
          మరల యాడించిరచ్చట మనసుపడుచు.
20. ఉ : నాటక దర్శకత్వమది నవ్యపరీమళముల్ వెలార్చుచున్
            మేటిగ నుండగా పరమ మిత్రులు బందుగులందఱున్ భళా!
            పోటియె లేదు నీకనుచు పూర్ణమనంబున సంస్తుతింపగా
            కోటివరాలు కోరకయె కూడినయట్లుగ నుబ్బె నాజరున్!
 21.ఆ.వె : పెద్ద నటులతోడ పేరిమి నాజరు
                నటనజేయదగిన ఘటన వచ్చె
               "కృష్ణలీల"యపుడు తృష్ణయె తీరంగ
               ఆడిపాడినారు హ్లాదమొదవ.
22. ఆ.వె : ఒక్కసారి చూచి యోహోహొ యనుచును
                పల్లె పెద్దలంత వల్లెయనుచు
                ఆరువందలిడిరి గౌరవంబొప్పగ
                "కృష్ణలీల"యాట తృష్ణ దీర్ప 
23. తే.గీ : నెలకు వందలు రెండని నిశ్చయించి
                జీతమిచ్చుచు యువకులు చేయికలిపి
                 నాటకముల నాడించిరి పూటకొకటి
                 శ్రమకు ఫలముగ ధనమది సాగి వచ్చె .
24.ఉ : జీవితమంతయున్ కడలి చిందులుద్రొక్కు తరంగరంగమే
           నావను నెక్కి తజ్జనుల నైజము తీరము జేరు కోరికే
            కావుమటంచు ప్రార్ధనలె కంజదళాక్షుని నెల్లవేళలన్
           భావిని మంచిగూర్ప భగవంతునకే యది సాధ్యమౌనుగా.
25. తే.గీ : తాను దలచిన  దొకటైన దైవమొండు
                దలచు నాజరు సతికి  నేత్రాలవ్యాధి
                తిరుగబెట్టెను నత్యంత తీవ్రముగను
                నేత్రశాలయె నిజమైన నిలయమనగ

 26. వ : ఇట్టి దుర్భర స్థితియందు భార్యకు వైద్యంబు, నాజరునకున్ బ్రహ్మచర్యంబత్యవసరంబైనది.  నూతన సంసారపు ప్రథమపాదమందే "బ్రహ్మ" బలవంతపు బ్రహ్మచర్యవ్రతంబు నాకు విధించె"నని మనంబునం గుములుచు మార్గాంతరంబు లేక  నాటకములతో కాలక్షేపంబు జేయుచున్న తఱి కొందఱు కమ్యునిష్టు మిత్రులు పొన్నెకల్లు నుండి "నాజరూ! తుళ్ళూరులో పాటలపోటీలు నిర్వహింపబడుచున్నవి. అందు  నీవు పాల్గొని ప్రథమబహుమతి పొందవలయున"ని  జాబు వ్రాయగా నాటక ప్రదర్శనకు  సంసిద్ధులగుచున్న వారితో "నేను పదిరోజులలోగా వత్తును. మీరు మీ పాత్రోచిత సంభాషణలను వల్లెవేయుడ"ని చెప్పి ఏబది రూప్యములు బయానాగా తీసికొని "తుళ్లూరు"పాటల పోటీకింజనెను.

                          "తుళ్ళూరు"లో పాటల పోటి - విజయము.

27. ఆ.వె : కమ్యునిష్టు వారు కల్పించిరిచ్చట (ఇది అనవసరము)
                పాటలందు పోటి  ప్రథమునరయ
                దోర వయసువారు "తుళ్లూరు"నందున
                 పాలుపంచుకొనగ పంపె లేఖ.
  28.ఆ.వె: "కారుమంచివారి" కమ్మని పద్యాలు...కారుమంచి పూర్తి పేరు వ్రాయాలి.
                  "మోహన, బిళహరు"ల ముద్దుగూర్చి
                   రాగబంధనముల రక్తిని గట్టించ
                   భళిర!నాజరంత ప్రథముడయ్యె.

29. వ : అంతట కొండపనేని బలరాం, వేములపల్లి శ్రీకృష్ణాఖ్యులు పొన్నెకల్లున కేతెంచి " గ్రామ
కమ్యూనిస్టు  సమితి" నేర్పఱచి, "నాజరు"నభినందించుచు "గుంటూరు"తోడ్కొని వచ్చి "తుళ్లూరు"నుండి "వేపూరి రామకోటి"ని, "తెనాలి"నుండి "ముక్కామల పురుషోత్తము"ను 
రప్పించి జానపద కళారూపంబులలో నత్యంత ప్రధానమైన"బుఱ్ఱకథ"ను, అడవిలోని ఉసిరికాయ, సముద్రములోని ఉప్పు కలిపి ఊరగాయ పచ్చడి" యనునట్లు పార్టీవారు రామకోటిని ప్రధాన కథకునిగ, నాజరును హాస్యరస పోషకునిగ, పురుషోత్తమును  రాజకీయ విశ్లేషకుని గా నభ్యాసము చేయించుచు, నెలవేతనము ముప్పది రెండు రూప్యములిచ్చుచు  అందు పదునారు రూప్యములు  వారిభోజన వసతులకు తీసికొనుచుండిరి. 

30. ఆ.వె: అడవిలోన నుసిరి యంబుధి లవణంబు
                కారమింత సరిగ కలసినటుల
                మువురు కలసినారు ముచ్చటమీరంగ
                బుఱ్ఱకథ కళయె అపూర్వమాయె.

                               ప్రప్రథమముగా "ఈమని"లో "బుఱ్ఱకథ" .

31. ఉ : "ఈమని" గ్రామమందు కథనెంతయు గొప్పగ జెప్పిరంచు-బల్
               ప్రేమను బల్కిరందఱును, ప్రేక్షకుడొక్కడు రామకోటి యన్
               సామి, కథావిధిన్ మునిగి సంగతులే గతిదప్పజేయుటల్
               నా  మదికిన్ విశేషముగ నచ్చగలేదని వెల్లడించెగా.
32. చం : ప్రజల మనస్సులందు తన ప్రజ్ఞయు, నాంగిక హావభావముల్
              నిజముగ చాలలేదనుచు నిస్పృహ బల్కెను "రామకోటి"యే 
              "సుజనుల మానసాంబుధిని సుందర రీతిని గెల్వగల్గు నో
              యజితసుధీర!"నాజరయ!"హాయిగ జెప్పుమికన్ వడిన్ కథల్
 33. చం : కళ కళకై జనించె సహకారము జేయుట శ్రేయమౌనుగా
               గలగలలాడు పెద్దలను గౌరవవాక్కుల కాదటంచు దా
               గళమును విప్పె నాజరటు కమ్యునిజంపు నిబంధనమ్ములన్
               కలమున జాలువార్చుచును కార్మిక జీవుల పక్షమై వెసన్.

                                         నాస్తికత్వ ప్రభావము.

 34. ఆ.వె : కమ్యునిష్టు వారి కలయిక బలిమిని
                 నాస్తికత్వమెల్ల నరనరమున
                 ప్రాకి,  నాజరంత దూకి చేరిజనాళి. 
                 చింపివైచె దైవ చిత్రములను.
 35. కం : "జడలమ్మ"లేదు కనగను
               గుడిలోనిది రాతిబొమ్మె కొల్పులవేలా?
               మిడిమిడి జ్ఞానము వదలుడు
              " బడుగుల సేవించుటదియె పరమార్థమగున్."
 36. ఆ.వె: ఇట్టి భావములను గట్టిగ జెప్పంగ
                గ్రామవీథులందు కలయదిరిగి
                జ్ఞానమిడగ జూచె నాజరు బృందంబు
                నాడు జరిగెడు తిరునాళ్ళయందు.

                   నాజరు"ఆర్యసమాజ మతము"నవలంబించుట.

  37. ఉ : నాజరు బృందమంతయును నవ్యవికాస ప్రభావభావులై 
            తేజముపొందగోరుచును దేవుడులేడని గేలిసేయుచున్
            రోజులు సాగదీయుచును తమ "రూక"కు వేషము వేయుచున్ భళా!
            మోజుగ జేరిరందఱును మున్నుగ "నార్యసమాజమందునన్".
 38. ఉ : జందెమువేసినారు, పలుచక్కనిరీతుల నూతనాంశముల్
             పందెములొడ్డి నేర్చి తమ పాండితినెంతయు వృద్ధిజేయుచున్
             మందును, మాంసభక్షణము మానుచుసాత్త్విక జీవనంబుతో
             నందఱి డెందముల్ మురియ నాడిరి పాడిరి క్రొత్తపుంతలన్.
 39. తే.గీ : నాస్తికత్వాన  దిరిగెడి నాజరునకు
                    నాటకంబులు వేయుచు నటనజూప 
                 "రామకథ"యందు"కైకేయి"రమణి పాత్ర
                 తప్పలేదయ్యె నానాడు దైవలీల.
 40. ఆ.వె : "త్రిపురనేని"వారి తీక్ష్ణంపు భావాలు
                  "గోర్కి""అమ్మ"నవల కుదుపులన్ని
                  మనసునందునమర మంచి వక్తగమారి
                   కాలవశత"బుఱ్ఱకథకుడాయె."   
 41. సీ :  తర్కించుభావాలు తనలోన బెరుగగా
                             నాలోచనాశక్తి యధికమాయె
              పౌరాణికములైన పాత్రలు వేయుటన్
                       సునిశిత జ్ఞానంపు చురుకుపెరిగె
             గ్రంథాల పఠనమున్ ఘనముగ జేయుటన్
                              పండితస్థాయిని బరగజొచ్చె
              వాక్చమత్కార  వైభవమింపు సొంపార
                     నవ్వులు పూయించు నటనమబ్బె
 తే.గీ : వాణి కరుణను నాజరు పాటవంబు
         నొంది; యెట్టి కథలనైన సుందరముగ
          చెప్పసాగెను పెద్దల మెప్పు వడయ.
          "కలసివచ్చెడు కాలాన కలలుపండు".

42.వ :బుఱ్ఱకథా కథనమందు  విశేషానుభవముగల "చింతల సూర్యనారాయణ, వెంకట సుబ్బయ,  కాకుమాను సుబ్బరాయాఖ్యుల పర్యవేక్షణలో  కథాకథనము సాగుచుండె. 

                          నాజరు ప్రధాన కథకుడగుట. 

 43.తే.గీ : "సోవియటు" వీరవనితదౌ సుచరితమ్ము
               " తాడికొండ "లో నాజరు దళమువారు
                 బుఱ్ఱకథగను జెప్ప నపూర్వమనుచు
                 పొంగిపోయిరి ప్రజలెల్ల ముచ్చటగను.
 44. ఆ.వె : ‘‘వినగ దొడ్డవరపు వేంకట స్వామియే’’
                 బుఱ్ఱకథను జెప్పె పూర్వమందు
                 మరలవచ్చె నొకడు మనసులదోచంగ
                 "నాజరనెడు"వాడు నటనజూప
 45.ఆ.వె : అనుచుబల్కిరచ్చటారాధ్యభావనన్
                కన్న విన్నయంత ఘనముగాను
                ప్రథమ యత్నమందు  ప్రజ్ఞను జూపింప
                అవధి లేదు ప్రజల హ్లాదమునకు.

 46. వ : నాజరు కథను వినినవారెల్లరును  పరమానందభరితులై పొగడ, చింతల సూర్యనారాయణాఖ్యు బృందము సంగీత సాహిత్య నటనములందలి లోపంబులం దెలుప, సూక్ష్మ గ్రాహియు, నాటకానుభవంబునుం గల  నాజరు తత్ సూచనాళి ననుసరించి సమున్నతశిఖరముల నధిరోహింప సాగె. ఇంతదనుక కథకునకు "తంబుర"   లేదు,  పాదములకు  గజ్జెలు లేవు.  రామకోటి "శ్రుతి లయలే మాతాపితలని, శ్రుతిలేని పాట మతిలేని మాట ఒక్కటి యని,   వానినిం దెప్పింపుడ"ని  పార్టీ పెద్దలకు జెప్పి యొప్పింప, చింతల సూర్య నారాయణ గారు "రామకోటిని,  నాజరును "దావులూరు" తోడ్కొని వెళ్ళి "దొడ్డవరపు వెంకటస్వామి"వర్యుల  తొలినాటి "తంబుర" నిప్పించి, దానిని నాజరు గాత్రంబున కనుకూలంబుగా శ్రుతిచేసి  ప్రధానమైన "ధింత, ధింధింత"దరువున కనుగుణముగా తంబురపై మీటుట నాజరునకలవాటుచేసె. 

 47. మ : శ్రుతికిం దంబుర చాల ముఖ్యమని దా సూచించుచున్ "రామకో
               టి"తగన్ "వేంకటసామి"వర్యు  తొలినాటిన్ వాయిదంబున్ సురా
               గ తతుల్ పల్కగ జేసి శ్రీకరమునౌ గానంబునుం గూర్పగా
              "ధితథిం ధింతత"నాదమే దరువుగా దీపించె నాడెల్లెడన్.
48. కం .  ఆ రామకోటి గురువయి
               శ్రీరాగమ్మొకటె కాదు శ్రేయము గూర్పన్
              ఏరాగ మెచట నిడ
               సింగారమొ నాజరుకు దెల్పి ఘటికుని జేసెన్.
 49. సీ . పరుల సంతోషమే పరమాద్భుతంబను
                             రామకోటి యొకండె రమ్యగుణుడు 
           చేసిన సాయంబు చెడదను మిత్రుండు
                             రామకోటియె యనురాగ ధనుడు 
           హస్యంబుతో చతురాస్యుడై డెందాల
                             లాస్యమాడించు కళాతపస్వి
           సచ్ఛీలముం గల్గి సరస సంభావ్యుడై
                              ఆదర్శమూర్తిగా నలరునతడు
 ఆ.వె. తల్లి దండ్రి గురువు దైవంబు తానెయై
            రామకోటి యొకడె రాగ సుధలు
             పంచె నాజరుకు ప్రపంచాన వేణువై
            ఏపుమీర తానె యూపిరూదె. 
        
             ( కోటి వీరయ్య గురించి  వ్రాయాలి)

  50. చం : కనుగొన వేషభాషలును కమ్మని కంఠము హావభావముల్
                అనితరసాధ్యమై చెలగు నందెలసవ్వడి "కోటి వీరయే"
                తనదగు ముద్రవైచి యల దానవ వీరుల "క్షీరసాగరం
                పు"నినదమున్నొకే "రగడ"ముచ్చటగూర్చ మహాద్భుతంబుగా.
 51. చం : గిరగిర కవ్వమే దిరుగ కేలున బట్టునుదప్పె చూడగా
               జరజర ప్రాకు యత్నమున జారుచునుండె భుజంగరాజదే
               పరుగిడి పట్టబోవు తఱి పాలసముద్రపుటెల్లలందునన్
                తిరిగెనటంచు నా "రగడ"తిన్నగ తత్కథయందు భాసిలెన్.
 52. ఆ.వె : యుద్ధఘట్టమందు నుంచిన "రగడ"లే
                కథకుదగిన గొప్పఖ్యాతిబెంచ
                ఈలవేసి జనులు గోలలుజేయుచు            
                 నీప్సితంబుదెలిపి రింతదనుక.
 53. ఆ.వె : జానపదులబాణి జారిపోనీయక 
                 మణిని పొదిగినట్లు మధుర కథన
                 మందు పొందుపఱుప సంతసంబయ్యదే
                "జనులు మెచ్చు పథమె జానపదము." 
 54. చం : పలువిధ ప్రాంతసంచరణ పార్టికిపట్టును ఖ్యాతి బెంచగా
               దలచిన ముఖ్యులెల్లరును ధర్మ విధంబున  కొంత రొక్కమున్ 
               నెలసరిగాగ నిచ్చిరల నీమము దప్పక నాజరాఖ్యుకున్.
               ప్రళయమువోలె తీవ్రమయె భార్యకు నేత్రపువ్యాధి పిమ్మటన్
55. ఉ :  నాజరు భార్యకప్పుడట నాణెపు వైద్యచికిత్స చేసినన్
              సాజపు చూపురాదనుచు, సంసరణంబును జేయరాదనన్
             తేజముదప్పె నందఱకు దీనత నామెను బుట్టినింటిలో
              బూజిత వైఖరిన్ విడిచి ముందుకు సాగెను దుఃఖమగ్నుడై.

56.వ : వైద్యులు నాజరుంగని "నీవీమెతో గాపురంబు  జేసిన వ్యాధి తీవ్రమై యనతికాలమందె  మరణించున"ను  హృదయ విదారక స్థితిని జెప్ప  ఆమె పుట్టినిల్లయిన "గారపాడు"నన్ విడచి  సంసారసుఖంబునకున్ నోచుకొనక తనపై పార్టీ యుంచిన బాధ్యతలను నిర్వహించుచున్న తఱి.

 57. కం : చిఱునవ్వు మోము వెలయుచు
              గరుణను గురియించి ప్రజలగాచెడు రాజా!
              వరపూర్ణచంద్ర నామా!
              పరమాదర మాన్యమూర్తి!భాస్కరధామా!
 58. ఉత్సాహ : 
                   పొన్నెకంటి వంశ విభవ పూర్ణచంద్రనామ! ఓ 
                   సన్నుతాంతరంగ!పరమ సరళభావ మిత్రమా! 
                   వెన్ను దట్టి సకలజనుల వెతలనెల్ల బాపగా 
                   రమ్ము రమ్ము వేగిరమ్మె  రమ్ము మమ్ముకావగా !

 వ :  ఇది శ్రీరామ పదారవింద మకరందపానమత్త తుందిలుండును, సుజన సంస్తుత్యమాన మానసుండును, బంధువత్సలుండును, శ్రీవత్సగోత్రజుండైన   పొన్నెకంటి పూర్ణచంద్రశేఖర వరప్రసాదరాయాఖ్య తనూజుండును,  సుజనవిధేయ సూర్యనారాయణరాయ నామధేయ ప్రణీతంబైన "బుఱ్ఱకథనాజరుచరిత" మందలి   తృతీయాశ్వాసంబు.  
                       
            


           
              
           




            
                          

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...