ముఖ పుస్తక కవిపండితులందరు తలా ఒక కావ్యం వ్రాయాలని ప్రకటన ఇచ్చాము. అందరు తలకొకటి వ్రాస్తున్నారు మీరు కూడ ఒక కావ్యం వ్రాయండి "అని (అదేదో చాలా చిన్న పని , అలవోకగా నేను చేయగలిగిన పని అయినట్లు) చాలా ప్రేమపూర్వకముగా నాకు ఫోన్ చేసి చెప్పారు మాన్యులు, సుకవితా విశారదులు, ప్రొఫెసర్ గారైన పట్వర్థన్ గారు. నేను ఆ ఆనందంలో నా స్థాయి మరచి "(తగరు పర్వతమును ఢీకొన యత్నించిన రీతి) ఆత్మవిశ్వాసంతో దేనినైనా సాధింప నగును. అని తలచి తలయూచాను సరేనంటు. రెండు రోజులు ఏమి వ్రాద్దామా ?అని జుట్టు పీక్కుంటున్న తరుణంలో ఒక మెఱుపు ఆలోచన వచ్చింది. అదే నా జన్మస్థలమే తన జన్మ స్థలముగాగల ప్రపంచ ప్రముఖ బుఱ్ఱకథాకళాకారుడు, బుఱ్ఱకథా పితామహుడైన పద్మశ్రీ షేక్ నాజర్ గారి జీవిత చరిత్ర ను పంచాశ్వాసాల కావ్యంగా వ్రాయపూనుకొన్నాను. పూర్తి సమాచారం లేక చింతపడుచున్న తరుణంలో నడిసంద్రంలో నావలాగా యూట్యూబ్ లో మాన్యులు టాక్ షో నిర్వాహకులు, బహుకళాభిజ్ఞులైన కిరణ్ ప్రభగారి "బుఱ్ఱకథ నాజర్ "గురించి కొంత సమాచారం, డా. అంగడాల వెంకట రమణమూర్తి గారి పరిశోధనా గ్రంథం "పింజారి" వలన పూర్తి సమాచారం నా అదృష్టం వలన లభించింది. వారా చరిత్రలో వ్రాసిన విషయాలలో శత సహస్రాంశము కూడ నేను వ్రాయలేకపోయాను. సముద్రములోని నీటిని, చాపిన అరచేతిలోనికి తీసికొని నట్లయినది. దొరికిన వరకే అదృష్టం ."చేసికొన్నవారికి చేసికొన్నంత మహదేవ " ఆకావ్యము లోని మంచిచెడుల ఫలితాలు ఈ నెల(అక్టోబరు 13న ) రాబోతున్నాయి. కావ్యం వ్రాయుటే ఘనముగా భావించిన నాకు బహుమానంతో సంబంధం లేదు. వ్రాసిన 29మంది కవులలో నేను కూడ ఒకడినిగా పాలు పంచుకొనగల్గుటే అపురూపం. సాహితీ సింధువులో నేనొక బిందువును. అందుకే ఈ ఆనందాన్ని అందరితో పంచుకొంటున్నాను, శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గమ్మ పాదరేణువు సాక్షిగా..... నాకీ విషయంలో ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా సహాయపడిన నాజర్ గారి ద్వితీయ కుమారుడు , అద్వితీయ కళాసాహిత్యకారుడు , కళావారసుడు ,అయిన శ్రీ షేక్ బాబూజీ గారికి, పరోక్షంగా సహాయపడిన కిరణ్ ప్రభగారికి , డా. అంగడాల వెంకట రమణగారికి హార్దిక ధన్యవాదాలు. నాకు కలుగబోయే గౌరవములో వీరందరు భాగస్వాములే. నేను ప్రతిరోజు వ్రాసిన పద్యములను నిర్దుష్టము , సారవంతము చేయుచు సాయపడిన నా యనుంగు సోదరుడు జొన్నలగడ్డ జయరామ శర్మకు , అంగడాల వారిని పరిచయం చేసిన యువకవి ముష్టి కృష్ణకిశోర్ కు నా ధన్యవాదాలు. అందరికి దసరా శుభాకాంక్షలు.
ప్రథమమాశ్వాసము:
నాయక(నాజరు)వర్ణన.
వ : అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనర్పంబూనిన "బుఱ్ఱకథ నాజరుచరిత"మను మహా ప్రబంధంబునకు గథానాయకుండెట్టివాడనిన
1. ఉ : శ్రీసతి దూరమై చనిన సిద్ధము నేనని లౌకికంబుగా
‘‘దాసుడనమ్మనీకు వరదానము జేయుమ నల్వరాణిరో!
కాసుల నేను గోరన’’ని కామితము న్వెలిబుచ్చినట్టి సం
వాసిత నాయకుండపర వామనమూర్తియె పొన్నెకంటిలోన్.
2.చం: సురుచిర సుందరంబయిన సూక్ష్మపదంబుల మేళవింపుతో
సరియగు రాగ తాళముల చక్కని చిక్కని భావనాళిచే
మురిపెము గూర్చి పండితుల మోదము నందెడు కల్పనాళిచే
నరవరుడై వెలుంగు ఘన నాయకవీరు నుతింపశక్యమే!
2.చం: సురుచిర సుందరంబయిన సూక్ష్మపదంబుల మేళవింపుతో
సరియగు రాగ తాళముల చక్కని చిక్కని భావనాళిచే
మురిపెము గూర్చి పండితుల మోదము నందెడు కల్పనాళిచే
నరవరుడై వెలుంగు ఘన నాయకవీరు నుతింపశక్యమే!
3.సీ : బెంగాలు కరువుచే పెను బాధలందిన
కర్మజీవుల గూర్చి కథను వ్రాసి
బుఱ్ఱకథగ మార్చి భువి నాల్గుచెఱగులన్
ధీరతంజెప్పిన ధీ విశాలి
"బళ్ళారిరాఘవే" బహు ప్రేమ కొండాడ
జన్మ ధన్యంబైన చరితుడతడు
పట్టుబట్టుటె కాని పరమాత్మ చెప్పినన్
పట్టువీడని యట్టి పంతగాడు
తే.గీ: కళనె దైవంబుగా నెంచి కామితార్థ
ములను సాధింప జాలిన పుణ్యజీవి
సార యశుడసమాన ప్రసాదగుణుడు
నవ్య సద్భావ పరిమళ నాయకుండు.
4. ఉ : శ్రీ తనయింట నొల్లనని జెప్పక జెప్పుచు శీతకన్నుతో
యాతనబెట్టిన న్నగుచు నాగ్రహమందక మాతృప్రేమతో
"నా తలరాత యిద్దియని" "నాజరు" పల్కులరాణికిన్ సదా
జోతలువెట్టుచున్ సతము చూపెను శ్రద్ధను జీవితాంతమున్.
5. చం: క్షణమది వమ్ముసేయకయె కాలము సద్వినియోగపర్చుచున్
గుణగణ శోభలం గుసుమ కోమల మానస ధీ విశేషతన్
మణివలె వెల్గినట్టి జన మాన్యుడు"నాజరు"పండితాళికిన్
రణమున గెల్వరాని రఘురాముడొ యేమొ యనంగ దోచెడిన్.
మస్తాన్, నాజరుల కుటుంబ స్థితి గతులు.
మస్తాన్, నాజరుల కుటుంబ స్థితి గతులు.
6. సీ : రెక్కాడినంగాని డొక్కాడదనియెడు
కూలి కుటుంబమై జాలిగొలుపు
ఉన్నత విద్యల నూసెత్తగా రాని
యసమర్థ యాత్రయై యడలుబ్రతుకు
సజ్జగింజల దెచ్చి సలసల గ్రాగెడు
నీటిలో నుడికించు నిమ్నజాతి
కూలి లేకున్ననా కుండలో "చల్ల"నే
యమృత సమమ్ముగా నందుకొనును
తే.గీ. ఇదియె నాజరు మస్తాన్ల ఇండ్లతీరు
పొన్నెకల్లు న జన్మించి పోరులేక
కళల వారసులౌచును కలసియుండి
జీవనంబుల గడపిరి చిత్తమలర.
7. రుచిర వృత్తము.( జభసజగా...9వ.అ.యతి )
విశేష వీరకథల విస్ఫులింగమై
జగాన బుఱ్ఱకథను జంకులేకయే
కవిత్వ తత్త్వమెఱిగి గజ్జకట్ట-నీ
కె చెల్లు!"నాజరు" ఘనకీర్తి పాత్రుడా!
8. మ: గృహమందెంతయొ లేమి సాగినను సంగీతమ్మునే ధ్యాసగా
మహదౌన్నత్య విధానమున్ సలుపు శ్రీమంతుండు మేధావియున్
సహనం బెన్నడు వీడనట్టి వర ధీశాలుండు తానొక్కడే
అహమున్గెల్చిన"నాజరాహ్వయుడు"రాగాతీత శుభ్రాత్ముడౌ.
9.సీ : "నాజరు మస్తాన్లు"నవ్యరీతులతోడ
సంగీత విద్యలో సమములైరి
ఒక్కొక్క ముఖముగా నొక్కొక్క వాణిగా
సోదరు లిర్వురు పాదుకొనిరి
"చెక్క భజన"కు ప్రసిద్ధుడై "మస్తాను"
మాన్యుండె కాదుసమ్మాన్యుడయ్యె
"షెహనాయి"వాదనన్ బహు మేథనడరిన
"నాజరు"కొంగ్రొత్త నడలునడిచె
తే.గీ. : ఇట్టి సంగీత పాండిత్య ముట్టిపడెడు
అన్నదమ్ములు ప్రేమగ నహరహమ్ము
కలసియుండిరి యొకచోట కాపురాన
"పొన్నెకల్లు"న నద్భుతామోఘ రీతి.
10. తే.గీ : అన్నదమ్ములు సంతోషమందుచుండ
వీరి గాన విజ్ఞానైక విభవములకు
శివుని కన్నుగుట్టినదేమొ చేరబిలువ
అతిథి యయె "నాజర"దె రజతాద్రికకట!
వ. అత్తఱి దుఃఖసాగరంబున మునిగియున్న మస్తాను కుటుంబావస్థను గాంచలేని రవి పశ్చిమాద్రికింజనియె.
సూర్యాస్తమయ వర్ణన.
11. సీ : తన కాంతిరేఖలన్ ధరణీ జనులకెల్ల
వెల్గుల బంచెడు వే వెలుంగు
చిఱు వేడి బ్రసరించి చేతనత్వముబెంచు
ప్రత్యక్ష దైవమౌ భాస్కరుండు
మధ్యాహ్నబింబమై మరికొంత తైక్ష్ణ్యం పు
చేవ చూపించు రోచిష్ణుమూర్తి
సంధ్యాసతీ ఫాలచారు కుంకుమయౌచు
అందాలు చిందునహస్కరుండు
తే.గీ : సృష్టి నియమమున్ దలదాల్చి స్వేచ్ఛ నుడిగి
తూర్పుగొండకు చరచరా దూరమగుచు
మౌన ముద్రను బాటించి మ్లానుడగుచు
బశ్చిమాద్రికి గతిలేక పాఱిపోయె.
12. తే.గీ : తోడబుట్టువు గోల్పోయి దుఃఖితుండు
ఒంటివాడయ్యు భరియించెనోర్మి తోడ
కాలవశమున దినసరి కూలియగుచు
షేకు మస్తాను సాగించె జీవనంబు.
వ: భారతీయుల కర్మసిద్ధాంతమైన పునర్జన్మ ననుసరించి మృతింజెందిన "నాజరు" తన ప్రియ సోదర గర్భసంజాతునిగా రాదలంచి సూర్యోదయంబు పగిది "మస్తాను"గా నుదయాద్రిని ఉదయించెను.
నాజరు జననము.
నాజరు జననము.
13. సీ : జీవిత లక్ష్యమ్ము చేరుకోవలెనంచు
మమతానురాగముల్ మహినిజేరి
సంగీత నాదముల్ సాహితీ భేదముల్
నిత్యాధ్యయనమౌచు నేర్పుమీర
అనితర సాధ్యమౌ వ్యాసంగముంజేసి
యర్థాంతరమ్ముగా నమరులైన
నరులు పునర్జన్మ వరలుదు రనియెడు
విశ్వాసమున సాగు విపుల జగము
తే.గీ : ఘనతగాంచిన"షెహనాయి"కౌశలుండు
"షేకునాజర"నియెడు నా శ్రేష్ఠతముడు
సోదరుని యింట బుట్టెను సుకృతియనగ
సర్వ సత్కళాభానుని సామ్యుడగుచు.
14. తే.గీ : మాన్యు జేయును వట్టి సామాన్యునైన
ధనికు నొనరించు హీను నిర్ధనునినైన
ఆటలాడించి చూచు గెల్పోటములను
కాల మహిమంబు నెవ్వరు కానగలరు?
14. తే.గీ : మాన్యు జేయును వట్టి సామాన్యునైన
ధనికు నొనరించు హీను నిర్ధనునినైన
ఆటలాడించి చూచు గెల్పోటములను
కాల మహిమంబు నెవ్వరు కానగలరు?
15. తే.గీ : ఖేద మొనగూర్చు దైవమే మోదమిచ్చు
నటుల "మస్తాను"గృహమున నడుగుమోపె
శిశువు రూపాన నాజరే చిత్రముగను
పూర్తిచేయంగ లక్ష్యముం బుట్టెనతడు.
16. తే.గీ : అన్నరూపంబు మరువకయున్నకతన
కంటి ముందట మెదలెడు కన్నకొడుకె
అతని పేరును నిలబెట్టునంచుదలచి
నామకరణంబు జేయించె "నాజరనుచు"
17. కం : దూదేకు కులమువారిని
భేదంబుగ జూచి ప్రజలు పింజారులనెన్
ఏదో కానిమ్మంచును
ఆదారినె బోవుచుండి రందఱు క్రమమున్.
18.ఉ : ఏకుట వృత్తిగాగలిగి యింపుగ పింజను పింజనమ్ముతో
దాకుచు దాని నంతటిని దర్పత తల్పము సేయుటంజుమీ
ఆ కులమున్ సదా పిలచిరట్టుల తత్ప్రజలాదరింపగా
బ్రాకట రీతి వారు ఘనులై వెలుగొందిరి వృత్తి విద్యలోన్.
19.తే.గీ: పొట్టకూటికి నొక వృత్తి పూర్ణఫలము
కలుగజేయదులెమ్మను కారణాన
కూలి పనులను సాగించె కులములేక
సభ్యులెల్లరు పొలము నాసామికడను.
20. ఉ : రెక్కలు ముక్కలై చనిన రేపటికుండదు రూకయొక్కటిన్
దక్కిననాడె దక్కునని దైవముపై పెను భారముంచి యే
దిక్కునకేని యేగుచును దిండికి జాలిన సొమ్ముగోరుచున్
చక్కని కాపురంబటుల సల్పెను షేకు కుటుంబమంతయున్.
21.ఉత్సాహ వృత్తము:
పుట్టె చిన్న నాజరయ్య ముద్దు లొలుకు మోముతో
షేకు వంశ కీర్తి బెంచ సిరుల పంట దొరలగా
తల్లి దండ్రి బంధు తతులు తన్మయంబు జెందగా
చందమామ వోలె వరలె సాటివారు మెచ్చగా.
నాజరు బాల్యము - విద్యాభ్యాసము.
22. ఉ : పంచ శరద్వయస్సుననె బాలుని విద్యల నేర్వబంపుటల్
మంచిదటంచు దెల్పిరట మాన్యులు కావున తల్లి దండ్రులే
కొంచెము జాగుసేయకయె కూర్మిని బంపిరి పాఠశాలకున్
సంచిత కర్మలం గలుగు చక్కని యూహలు ప్రోద్బలంబులౌ.
23. తే.గీ : పేద విద్యార్థి గణముల పెన్నిధియగు
ప్రాథమిక పాఠశాల యొప్పారెనొకటి
పొన్నెకంటికి బుణ్యంబు పుచ్చెననగ
అందు జేర్చిరి కొమరుని హ్లాదమొదవ.
24. తే.గీ : రుసుము జెల్లింప మనకడ రూకలేదు
ఇతర సంస్థల జేర్పించు గతియులేదు
ప్రభుతదౌ యీ బడియెమన భాగ్యమనుచు
ముదము జెందెను మస్తాను హృదయమందు.
25. సీ : వయసున బిన్నయై వంకలు జెప్పక
పాఠశాలకునేగు పట్టుదలగ
సాటివారిండ్లకు సహవాసమని యేగి
కాలయాపన లేదు క్షణముగూడ
తోటి విద్యార్థికి తోడుగా నుండును
పఠన పాఠనముల పజ్జజేరి
ఆశుకవితలల్లి యలవోక బాణీల
వినిపించు ప్రజలెల్ల విస్తుపోవ
ఆ.వె : ఆతడెవడొ కాదు హంసవాహినియైన
వాణి దయను భావి వఱలగల్గు
విమల షేకు కులము వేగుచుక్కనదగు
నాజరనెడువాడు నయగుణుండు.
26. సీ : ఏరీతి బాడిన నింపైన రాగమై
శ్రవణ పర్వంబయి సాగిపోవు
ఏరీతి బల్కిన నెంతయో చతురమై
సమయోచితంబౌచు సరసమగును
ఏరీతి చిందైన నేర్చిన నటనమై
సత్కళారూపంపు సౌరునింపు
ఏరీతి నడచిన నెల్లరు ముగ్ధులై
ప్రేమను బంచగా పిలుతురతని
తే.గీ : ఆతడాతడె నాజరాహ్వయుడు నాటి
బాలమేధావి యయ్యె నప్పాఠశాల
కీర్తి కాంతకు బ్రియమైన మూర్తి గాగ
ప్రజల తలలోని నాల్కయై పరిఢవిల్లి.
27. పంచచామరము :
అనేక రీతి గీతులే మహాద్భుతంబులై సదా
జనాళి మెచ్చగన్ స్వరాళి శారదాంబ పల్కగా
మనంబు లెల్ల నుల్లసిల్లి మంగళమ్ము దెల్పగా
దినంబు లట్లు దొర్లసాగె దేవతా ప్రసాదమై.
వ : ఈరీతిగానున్న నత్తరుణంబున నాజరొకనాడు పాఠశాల నుండి వచ్చి
28. సీ : "అమ్మా! బడిముగిసె న్నాకలి రోకలై
కడుపు దంచుచునుండె- కాళ్ళు గడిగి
తిన్ తడిలేకయె, తినవలె సజ్జలు
జొన్నల దేదైన నన్నమిపుడ
నగ, తల్లి "బీబాబి""నాయన! నీతండ్రి
కూలికి బోలేదు కూడులేదు
సజ్జజొన్నలులేవు సల్లనుతాగియే
సదువుకో నీవంచు సాగనంపె"
తే.గీ : కన్నకొడుకటులడిగిన నన్నమిడక
"సల్ల"బోసిన ఘనమైన చరిత నాది
ఏమి సేయగ నెంచెనో ఈశ్వరుండు
తెలియగా రాదదేరికి దెలివియున్న.
29. ఆ.వె : అమ్మ పలుకు వినగ నాశువు రూపమై
కమ్మనైన పాట కదలిరాగ
పాఠశాలకపుడు పరువెత్తి పరువెత్తి
తనదు గళము విప్పె తన్మయముగ.
30. తే.గీ : "సజ్జ జొన్నలు లేవులే సల్లదాగి
సదువుకోవయ్య నాయనా! సల్లగుండు"
మనెడు దానిని రాగాన నాలపించి
"నాజరం"దరి తలలోన నాల్కయయ్యె.
నాజరు నాటక ప్రదర్శనము - ఖాదర్ ఖాన్ చేయూత.
నాజరు నాటక ప్రదర్శనము - ఖాదర్ ఖాన్ చేయూత.
వ : ఇవ్విధంబుగా గాన నటనా చతురుండైన "నాజరు" తన పాఠశాల యందున్ జిన్న జిన్న నాటకంబులలో పాల్గొనుచుండగా నచటనే జరుగబోవు "కనకతార" నాటకంబున "శ్యామల రెడ్డి"గారి ప్రోత్సాహంబునన్ బాత్రధారికాగా తన్నాటకమునకు "హార్మోనియం" కళాకారుండగు "ఖాదర్ సాహెబ్" నాజరు బహుముఖ ప్రజ్ఞకాశ్చర్యంపడి స్వయంబుగా మస్తానును కలసి "నీ కుమారుని నాతో పంపిన నేను సంగీతము నేర్పింతు"ననుచు
31. ఉ : పాటలు పాడుచుండె రసభంగము లేకయె నీ కుమారుడా
బాటనె శిక్షణం గఱుప భావి విశేష మహోన్నతుండగు
న్నాటక చక్రవర్తి యగు నంచును"ఖాదరు"నచ్చజెప్పుచుం (అఖండయతి)
జోటును మార్చె తాను ఘన సోదర పండితులున్న చోటికిన్.
32. ఉ : నాజరు నాటకంబునకు నవ్య పరీమళ శోభలద్దగ
న్నా జనులెల్ల ముగ్ధులయి హార్దిక దీవన లిచ్చుచుండగా
రోజుకురోజుకున్ సుమధురోహలు నిండెను మానసంబునన్(అఖండయతి)
సాజముగాదదేరికిని సద్యశమొందు ఫలంబులందగన్.
33. ఉ : ఖాదరుఖానె స్వాంతమున కౌతుకమొప్పగ నాజరింటికిన్
ఆదరమొప్ప వచ్చి తన యంకిత భావము వెల్వరింపగా
మోదముతోననెన్"మధుర మోహన గాత్రముగల్గు నీ సుతున్
"నాద"రహస్యముల్దెలుపు నాటక సంస్థను నేను జేర్చెదన్."
34.తే.గీ : చిన్నినాన్నను మీచెంత జేర్చుచుంటి
చిల్లిగవ్వైన నీయంగ చేతలేదు
భారమంతయు నీదయ్య భద్రమనుచు
శిరము నిమురుచు కన్నులు చెమ్మగిల్ల
దశ శరత్తులు నిండని తనయునపుడు
పంపె మస్తాను బంగారు భవితకొఱకు.
35. మ : "పెదరావూరు"న "బాలరత్నసభ"లో పేర్జేర్చె విద్యార్థిగా
ఉదయం బస్తమయంబులున్ "సరిగమల్"ఉత్సాహ సంరంభతన్
పదమంచు న్నటనాలయంబునకు నభ్యాసంబు జేయింపగా
మదిలో నాజరు తల్చె నిట్టులని "సమ్మాన్యుండులే ఖాదరే".
వ : ఇట్లు మస్తాను తన యనుంగుబిడ్డండును, సప్తవర్షప్రాయుండునైన "నాజరును" ఖాదరు చేతులలో నిడుచు "అయ్యా! పూటగడచుట కష్టమైన మేము వీనికి చదువును జెప్పింప నసమర్థులము. వాని పూర్వజన్మ సుకృతము వలన స్వర జ్ఞానమబ్బినది. అది మీవంటి పండితుల వలన పండి సత్ఫలములిచ్చిన మాకన్న నదృష్టవంతు లెవరుండరనుచు కుమారుండు గ్రామాంతరంబున కేగుచున్నందులకు దిగులుంజెందుచు తత్ గ్రామంబును "తెనాలి"కి దగ్గఱగానున్న "పెదరావూరు" అయినందులకు గొంత మనంబును సంబాళించుకొని కుమారున కనేకానేక సూక్తులం జెప్పుచు వీడ్కొలిపెనంతట
: ఆశ్వాసాంతము :
36.మ: గరువం బింతయు లేదు నీదరిని సత్కారుణ్య పుణ్యాత్మ! నిన్
శరణంబన్నను గాతువెప్పుడును నిశ్శంకన్ మహాభాగ!మేల్
వరముల్గూర్తువు పేదవారలకు శ్రీవర్థిల్ల శుభ్రాత్ముడా!
నరనారాయణ సేవనాధిషణ! సమ్మానార్హసౌశీల్యమా!
37. కం : ఓపొన్నెకంటి వాసా!
శ్రీపూర్ణమనోజ్ఞకలిత శ్రీవత్సాంకా!
ప్రాపంచిక విషయంబుల
తాపంబులు లేనివాడ! ధాతృ సమానా!
వ : ఇది శ్రీరామ పదారవింద మకరందపానమత్త తుందిలుండును, సుజన సంస్తుత్యమాన మానసుండును, బంధువత్సలుండును, శ్రీవత్సగోత్రజుండైన పొన్నెకంటి పూర్ణచంద్రశేఖర వరప్రసాదరాయాఖ్య తనూజుండును, సుజనవిధేయ సూర్యనారాయణరాయ నామధేయ ప్రణీతంబైన "బుఱ్ఱకథనాజరుచరిత" మందలి
ప్రథమాశ్వాసంబు.
📖 📖 📖
:ద్వితీయాశ్వాసము: బుఱ్ఱకథనాజరుచరిత
1.కం : శ్రీ పూర్ణచంద్రనామా!
పాపాచరణైక కర్మభావ విరహితా!
మాపాలి దైవమనగను
కాపాడుము సంతతంబు కరుణాసింధూ!
📖 📖 📖
:ద్వితీయాశ్వాసము: బుఱ్ఱకథనాజరుచరిత
1.కం : శ్రీ పూర్ణచంద్రనామా!
పాపాచరణైక కర్మభావ విరహితా!
మాపాలి దైవమనగను
కాపాడుము సంతతంబు కరుణాసింధూ!
వ : షేకు మస్తాను తన కుమారునకు వీడ్కోలు పలికిన తదనంతరంబునం బ్రవర్తిత
వృత్తాంతంబు నవధరింపుము.
"బాలరత్న సభ"- సంగీతాభ్యాసము.
2. శా : సంగీతంబును నాట్యమాది కళలన్ శాస్త్రోక్తరీతిన్ విధిన్
సాంగోపాంగముగాగ నేర్పు కతనన్ సంసిద్ధులై ధుర్యతన్
రంగంబందున నాఱితేర నిసువుల్ లక్ష్యంబు సిద్ధింపగా
భంగంబందక వెల్గె తత్సభ యశంబై "పెద్దరావూరు"నన్.
3. శా : రాగంబయ్యది యేదియో తెలియదా రమ్యత్వమాస్వాదనే
వేగంబున్ పద మల్లుటే తెలియులే విజ్ఞాన శూన్యుండయున్
యోగం బొక్కటె వానినంటి తిరిగెన్ యోగ్యుండుగా జేయగన్
సాగెన్ భారతి సత్కృపాజనిత సంస్కారంబు సేమంబుగా.
4.చం: సరిగమ లెల్ల దా గఱచి శ్రావ్య కళాగళమెత్తిపాడగా-
మురియుచు సాటి వారొకటి "మోహన"రాగమటంచు కోరగా-
సరియని పాడి వారలకు సమ్ముద మెంతయు గల్గజేయుచున్-
కరమరుదౌ ప్రకాశమును గాంచెను నాజరు సాటివారిలోన్.
5.చం : నటనను గూర్చి చెప్పగను నాతరమే! నటరాజ తత్త్వమౌ;
పటుతర రాగపూరణము ప్రాజ్ఞులు మెచ్చెడి దివ్య గీతమౌ;
జటిల సమస్య పైకొనిన జాగృతితో తొలగించు నైజమౌ;
అటనట కానుపించు పరియాచకముల్ సహవాసులందునన్.
6.ఆ.వె: "రామకృష్ణశాస్త్రి" రసమయహృదయుండు
వారి సుతుడు "దాసు"బాలురకును
సరస నటన మందు సంగీత మందున
శిక్షణార్థ మొక్క శిబిరముంచె.
7.ఉ : పెట్టిన"బాలరత్నసభ" పేర్మిని జేరిన శిష్య కోటియున్
గట్టిగ రాగ భేదముల కమ్మనిరీతుల నాట్య భంగిమల్
"కొట్టిన పిండి"యౌచు గుణ కోవిదులెల్లరు మెచ్చు తీరుగా
మెట్టిన నెట్టి చోటునను మెల్పున గెల్చిరి వారి దీవనన్.
8.సీ : "మోహన"రాగంబు ముద్దుగా నొకడనన్
గమకము లేవంచు గదుమునొకడు
"శ్రీరాగ"మొక్కండు శిరసూచి పాడంగ
ప్రసృత మటంచును పరిహసించు
"కాంభోజి" పాడంగ కంఠమెత్తగ నొండు
స్వరము లేవి? యటంచు సనుగునొకడు
"గాంథార" రాగమున్ గానంబుజేయగా
చక్కగా లేదని వెక్కిరించు
తే.గీ : గురువు లొకపరి విశ్రాంతి గొనుచునున్న
తరుణ మందున శిష్యులు తఱచి తఱచి
రాగ భేదాల వాదాలు తీగసాగ
స్పర్థ వర్ధిల్ల వర్తిల్లె బాల గణము.
9.తే.గీ:నిద్దుర నటించి బాలుర నియతి జూచి
విద్య నేర్వంగ సరియైన విధమటంచు
ఆత్మతృప్తిగ గురువులాహ్లాదమంది
జన్మసార్థకమైనట్లు చాటుకొనిరి.
10.తే.గీ:ఇట్లు గడచిన వచట రెండేండ్లు, క్షణము
వమ్ముగాక సంగీత సారమ్ము పిండు
కొనగ, నాట్యపద్ధతులెల్ల కోరినేర్వ
దశ వసంతాల నాజరు దశయు మారె.
"రేపల్లె"లో నాటక ప్రదర్శనము.
: ఇట్లు సంగీతాభినయాది విద్యలందాఱితేరుచున్న నాజరునకు "రేపల్లె"లో నొక్క నాటకంబునందభినయించు సదవకాశంబు లభియింప నక్కుమారుని కౌశలంబును స్వయంబుగా గాంచ నుత్సహించిన ‘‘మస్తాను’’ ముందు వరుస సుఖాసీనుడయ్యె. నాటకంబునం దన కుమారుని యభినయ సంగీత కళా ప్రదర్శనంబునకు ముగ్ధులై అందరు ప్రశంసింప, కొందఱాతని ముందు ‘‘నాజరు’’ పలువరుస సరిలేదని విమర్శింప దొడంగె. అంతట మస్తాను మరునాడు కుమారుని బయటకు తీసికొని వెళ్ళి తన జేబులోని చెకుముకిరాయి(నిప్పుపుట్టించుటకు ఉపయోగించునది)తో ముందు పలువరుసను రుద్దనారంభించెను. ఏతద్విషయంబునుంగురించి నాజరు స్వయంబుగా "ఆత్మకథ"యందు "మా నాన్నకు నా యందమును గూర్చి శ్రద్ధ యెక్కువని చమత్కారభరితంబుగా బేర్కొనిరి.
11.కం : "రేపల్లె" నాటకంబున
నో పాత్రకు బాత్రుడయ్యె నొజ్జల చలువ
న్నాపాతమధుర మనగను
ధీపాటవ మొప్ప పాడి తెలిపెన్బ్రజ్ఞన్.
12.ఉ : పద్యము నాలపించు తఱి ప్రాజ్ఞులుభూరి కళాభిమానులున్
హృద్యము లెస్స లెస్సనుచు నృత్యము జేయుచు సంస్తుతించుచున్
సేద్యమదెంతజేసెనొకొ శ్రీకరమై శ్రుతి రంజకంబయెన్.
చోద్యముగాదె!బాలునకు సూక్ష్మ సుసంగతి రాగబంధముల్.
13. మత్తకోకిల: ర స జ జ భ ర...11. యతి.
చిన్నయైనను వీని రాగము చేవగల్గియు నుండుటల్
ఎన్నగా మది హ్లాదమందె మహేశు దీవన లుండుటన్
తిన్నగా మునిపళ్ళు లేవను థికృతాత్ములె యుండినన్
కన్నవారలు ప్రేమతోడుత కౌగిలించకయుందురే!
మురుగుళ్ళ వారి శిష్యరికం.
ఎన్నగా మది హ్లాదమందె మహేశు దీవన లుండుటన్
తిన్నగా మునిపళ్ళు లేవను థికృతాత్ములె యుండినన్
కన్నవారలు ప్రేమతోడుత కౌగిలించకయుందురే!
మురుగుళ్ళ వారి శిష్యరికం.
వ : నాజరునకుం గల సంగీత జిజ్ఞాసను గమనించిన ‘‘ఖాదరుసాహెబు’’ మరికొన్ని సంగీత కళా రహస్యముల గఱపించుటకుం దానెఱింగిన "నరసరావుపేట"లోని "మురుగుళ్ళసీతారామాఖ్యు’’ చెంతకుం దోడ్కొని వెళ్లి ఆయనకు వీరియార్థిక స్థితిగతులన్నియు వివరించె. తదనంతరంబ
14.మ: "మురుగుళ్ళాన్వయు"చెంతజేరె పరమామోదైక సద్భక్తితో
కరముల్ మోడిచి వేడె నాతని మనఃకామ్యమ్ము సిద్ధింపగన్
జరుగుంబాటది లేకయే యడిగె సచ్ఛాత్రున్ ధనంబప్పుడే
కరుణామూర్తికి మూడు రూకలిడె లెక్కన్నాజరే ముందుగా.
15.ఆ.వె : "నరసరావుపేట"నగరి సంగీత వి
ద్యా విశారదుండు తగిన ప్రేమ
జూపి నేర్పుచుండె సులువైన మెలకువల్
నెలకు మూడురూప్యములకె తాను.
16.కం : మురుగుళ్ళవారియింటను
బరగన్ సంగీతమొండె ప్రత్యక్షమగున్
దిరమౌ సంపదలేవియు
నరయంగా కానరావు హంగులతోడన్.
17. ఉ : నాజరుపోషణంబునకు నాకడ రూకలు లేకపోవుటన్
భోజన భాజనాదులవి పుణ్య మనస్కులుదారచిత్తులై
రోజునకొక్కరై యిడిన రూకలబాధ విముక్తిజెందుగా
నీ జగమంతనేలు పరమేశుడె త్రోవను మాకు జూపుతన్.
18.కం : మురుగుళ్ళవారి సతికిని
పరమాత్ముడు చెప్పినట్లు పథమది దొరికెన్
ధరలో యాచన జేయుచు
పరమార్థమునందుకొఱకు ప్రార్థింపదగున్.
19.తే.గీ:మనదు సంఘమ్ము బీదల మనగనీదు
సాయమయ్యది కోర, కసాయిరీతి
అణచివేయుచు దా పరిహాసమాడు
"కళను కాపాడు; సత్కళా కారుడొకడె!" .....ఇంతవరకు పంపాను. 21.07.22
వారములు చేసికొని విద్యనభ్యసించుట.
19. అ. తే.గీ: సాంఘికంబగు స్థితిగతుల్ సమముగావు
పేదలకునిడు చేయూత పెద్దతప్పు
కులము కులమంచు మనసులు క్రుళ్ళిపోయె
కాన, మార్గాంతరంబునుంగాంచదగును.
ఆ. కం: మురుగుళ్ళ రామయార్యుని
కరమందిన యట్టి సుదతి కరుణామయి నాన్
మరిమరి నాజరు గాంచుచు
తిరమొప్పగ మాతృప్రేమ ధీరతజూపెన్.
20.తే.గీ: "జోలె"యొక్కటి తగిలించ "మేలుగూర్చు
నీకు , నడువు నాజరటంచు"నీలవేణి
బియ్యమున్ గొన్ని రూకలు పిడికిలించి
వేశ్యవీధులుచూపించె వింతగొలుప.
21.చం : గురువును నాజరుం గలసి కూర్మిని వేశ్యల యిండ్ల వైపుగా
చరచర యేగి యొక్కటను "చల్లనితల్లిరొ మమ్ముగావవే
కరములుమోడ్తు మీకనగ"కాంతయొకర్తుక గౌరవమ్ముగా
హరిహరి! మీర లిట్లగుట హా!విధి యంచును రాల్చె నశ్రువుల్.
22.తే.గీ : మీకు సాయంబు జేయంగ మాకుదగును
పొందరాదంచు మిమ్ముల బొడుతురకట!
ఇట్టి గొడవలు లేకున్న నెంతకైన
నూతమిత్తుము ప్రాణంబులున్న వరకు.
23.తే.గీ : అనగ భీతిల్లుచున్నట్టి యతివజూచి
గురువు వచియించె నిట్టుల కరుణతోడ
‘‘సాయమందించ బూనుడు, స్వార్థపరులు
బలుకు పలుకులు విననేల? భయమదేల’’?
24.సీ : "మురుగుళ్ళ"చలువ సంపూర్ణ విద్యలనేర్చి
బాలగంధర్వుడై పడసె కీర్తి
గురుపత్ని దీవనన్ గూర్మి జగత్తును
జదువన్ గలుగు నేర్పు సాధ్యమయ్యె
వేశ్యల భిక్షమున్ వేయించుకొనుటచే
సంఘజీవన గతిన్ సౌరుదెలిసె
లక్ష్యశుద్ధి చెలంగ లక్షల కష్టాలు
లేశమాత్రమె యన్న లీలనెఱిగె
తే.గీ : తండ్రి తరువాత తండ్రి యై తపనజెందు
ఖాదరు మననంబు మోదానగ్రాలు నటుల
తల్లిదండ్రుల జన్మలు ధన్యమనగ
ఔర! నాజరు చరియించె నహములేక.
25. సీ : ఏరాగమొప్పుచు నింపును గూర్చునో
సులువుగా గ్రహియించు సూత్రమబ్బె
ఎటువంటి గమకమ్ము లెంతెంత వాడుటో
ఆకళింపయ్యెను నేకముగను
హావభావములను నలవోక జూపించి
నవ్యత చాటుట నైజమయ్యె
సర్వ కళలు "మేము స్వాధీన"మంచును
నాజరు రూపాన నడచిరాగ
తే.గీ : పాదుగామారె బహుమతుల్ పడయుకొఱకు
పెద్దవారల చెంతనుం బేర్మినంద,
తనదు యునికిని దెలుపుచు ధైర్యమలర
ముందు కేగెను సంఘాన ముదముతోడ.
"పొన్నుకల్లు"(బంగారు కొండ) - ఘనత.
26. సీ : భీకర వాయువుల్ పెను మంట లేర్చిన
నిశ్చలంబై యుండు నిండుకొండ
తనను ముక్కలుజేసి దారులేర్పరచిన
నిబ్బరమై యుండు నిండుకొండ
గుహలో వరదరాజు కొలువుండి యుండుట
నియమంబు దప్పని నిలువుకొండ
‘‘జడలమ్మ బావి’’కి జాఱెడు గంగమ్మ
పులకింతకు సతమ్ము పొంగుకొండ
ఆ.వె : పొన్నెకంటి కొండ పొగరైన మా కొండ
కోఱమీసకట్టు కోరి దువ్వు
హితుల హత్తుకొన తలెత్తి రాజిల్లు బం
గారు కొండ మల్లె సౌరుదండ.
27.తే.గీ : ‘‘పొన్నెకల్లు’’ న బుట్టిన బుణ్యుడగుట
వాణి కరుణకు నోచిన వాగ్మి యగుట
సరస గాన సాహిత్య విజ్ఞానమొంది
ఘనత గన్న "నాజరి’’ ట బంగారు కొండ!
28. శా: సంగీతంబున నాట్యశాస్త్రగతులన్ సంపూర్ణధీమాన్యుగా
నంగీకారము దెల్ప నా గురువుగారత్యంత సంతృప్తుడై
రంగంబందున నెచ్చటైన నొకచో రంజిల్ల వేషమ్ము వే
యంగా భావనజేసె‘‘ నాజరి’’ల బ్రహ్మానంద చేతస్కుడై.
29.ఉ : ఇంటికి జేరె నాజరు మహేశుని సత్కృప విద్యలన్నిటిన్
గంటను వత్తిబెట్టుకొను కౌశలమొప్పెడు సాధనంబులన్
ఒంటరి జీవియయ్యు కడునొద్దిక మీరగ సంచరించుచున్
వెంటను నంటియుండి తన విజ్ఞత బెంచిన వారి గొల్చెగా.
విద్యాభ్యాసానంతరము పొన్నెకల్లు జేరుట.
వ : ఇట్లు నాజరు తన పదునైదవయేటనే సంగీతకళాప్రపూర్ణుండై తన గుర్వనుజ్ఞనుంబడసి పొన్నెకల్లునకుం దిరిగివచ్చి తననింతవానిం జేసిన "ఖాదరు"మహాశయునకుం బాదాభివందనం బాచరించి అపారాశిషంబులందుకొనిన యనంతరంబు కుటుంబసభ్యులంగూడియుండగా తన్మాతాపితల భావోద్వేగంబులెట్టివనిన,
లెట్టివనిన.. ఇంతవరకు పంపాను. 23.07.22
30. ఉ : అమ్మను నాన్నను న్విడిచి యన్నము వేళకు నెట్లుదింటివో?
గుమ్మము గుమ్మమున్దిరిగి గుర్వుల సేవయు జేయుచుండి, కా
లమ్మును వమ్ము సేయకయె రాగ సుధారస ధారలన్సదా
నెమ్మది నిల్పుకొన్న నిను నేనిక నెచ్చటికంప "నాజరూ"
31.ఉ : రమ్మని గుండెకద్దుకొని రాగ సమంచిత భావపూర్ణమై
చెమ్మను గొంగుతో దుడిచి చిన్నగ ముద్దుల ముంచుచుండగా
లెమ్మని భార్యతో బలికి లీలగ నాజరు తండ్రి ప్రేమమై
"అమ్మలగన్నయమ్మ పదమంటినవాడిల పండితుండ’’నెన్.
32.ఉ: అన్నయె నీదురూపమయి హ్లాదమునీయగ నాదు గర్భమున్
చెన్నుగ నుద్భవించెనిట క్షేమముగల్గును నీకునాకునున్
కన్న ఫలంబులందెదను ఖ్యాతిని గాంతును సాటివారిలోన్
తిన్నగ సాగు ‘‘నాజరు! విధేయుడవై పరమార్ఢమెంచుచున్.
32. ఆ...కం. మురుగుళ్ల తల్లి చలువను
పరమాద్భుత రీతి వారవనితామణులే
కరమొప్ప జాలిజూపిన
నరహరి! యిదియేమిటనుచు నాజరు తలచెన్.
33. శా: ఎన్నో యున్నత నాటకంబులను నే నిష్ఠంబ్రదర్శించితిన్
నన్నున్ మన్నన జేయుచున్న నటులే నైజంబు జూపించుచున్
"కన్నా"నాటకమందు నీవొకడవే ఖాయంబు లెమ్మంచు, తా
మెన్నంగ న్నిటకేరు రారు కనగా నేనేమి జేతున్శివా!
34.తే.గీ: ఎన్ని విద్యలు నేర్చిన నేమి ఫలము?
పట్టెడన్నము కఱవాయె పొట్ట నిండ
అన్నమిడునట్టి విద్యయే మిన్నయగును.
రూక గడియింతు నేనెట్టి పోకనైన.
కూలి పనులకు వెళ్ళుచు, దర్జీగా పనిచేయుట.
33. శా: ఎన్నో యున్నత నాటకంబులను నే నిష్ఠంబ్రదర్శించితిన్
నన్నున్ మన్నన జేయుచున్న నటులే నైజంబు జూపించుచున్
"కన్నా"నాటకమందు నీవొకడవే ఖాయంబు లెమ్మంచు, తా
మెన్నంగ న్నిటకేరు రారు కనగా నేనేమి జేతున్శివా!
34.తే.గీ: ఎన్ని విద్యలు నేర్చిన నేమి ఫలము?
పట్టెడన్నము కఱవాయె పొట్ట నిండ
అన్నమిడునట్టి విద్యయే మిన్నయగును.
రూక గడియింతు నేనెట్టి పోకనైన.
కూలి పనులకు వెళ్ళుచు, దర్జీగా పనిచేయుట.
35. ఉ : క్రొత్తగ జీవికన్ గడుప కూలిగ మారెను నాజరంతటన్
ప్రత్తిని దీయుటల్, మిరప పంటల మధ్యన చాళ్ళలోపలన్
ఒత్తుగనున్న వ్యర్ధముల నొద్దిక దీయుచు, నీరువోయుటల్,
కత్తిని చేతబట్టి ఘన కంటకము ల్దొలగించివేయుటల్.
36.ఉ: గట్టియుపాధి కోరుచును క్రన్నన"నాజరు"వ్యూహమల్లుచున్
బట్టలుకుట్టుటే బ్రతుకు బాటగనెంచిన పెద్దవారలున్
ఎట్టెటొ సమ్మతింప తనకిచ్చిన బట్టను కుట్టివేయగా
తిట్టులె లభ్యమాయె పనితీరున శిక్షణలేక యుండుటన్
37.ఉ: పట్టుదలన్ సుబోధకము - భారపువిద్య యదేదియైననున్
పట్టునుబట్టి దానినటు వంతును కాంతును కీర్తిచంద్రికల్
తిట్టిన వారలే తిరిగి దీవనలిత్తురటంచుబల్కి, తా
ముట్టిన మట్టినైన ఘన ముత్యము జేసెను నద్భుతంబుగాన్.
వ: ఇట్లనేక విధంబుల ధనార్జనోపాయంబులన్ వెదకి, అందున్ గొంత నైపుణ్యంబు సంపాదించి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుచుండగా నొక్క దుర్దినంబున .
నాజరునకు పితృ వియోగము.
38. ఉ : షోడశ వర్షముల్ ముగియ శోకము జేరెను నాజరాఖ్యుకున్
తోడయి తండ్రి కష్టమును దూరము జేయు ప్రయత్నమెంతయో
కూడగ జేయుచుండ విధి క్రూరముగా బలిజేసె నక్కటా!
మోడయె జీవితంబులిక మోసులువారవటంచు నేడ్చెగా!
39. సీ : ఎంతయేడ్చినగాని యేమేమి జేసినన్
అరిగిన యుసురులు తిరిగిరావు
భవ బంధనమ్ములు బ్రతికియున్నప్పుడే ,
గడపదాటిన నవి గడపదాటు
మంచిచెడ్డలె నిల్చు మానవ జన్మాన
తానుజేసినయట్టి దాని వలన
నాక సుఖంబులు నాన్నకుం గలుగంగ
వర్తింతు నిరతంబు వసుధయందు
తే.గీ : తండ్రికోరిక దీర్చుటె ధర్మ పథము
నేటినుండియు స్థైర్యంబు నింపుకొనుచు
నడతుననియె శపథముగ నాజరపుడు
సాధు సాధువటంచు మెచ్చంగ పరులు.
వ : పితృ మరణ సంజనిత దుర్భర దుఃఖభారము నుండి తేరుకొనజూచు నాజరువలి ఆత్మగతంబున..
40. మందాక్రాంత : మ భ న త త గా....11. యతి. ప్రాస కలదు.
పోరాముల్ చుట్టిన నెదకు నామోదముంగాకయే, ఆ
శ్రీరాముండత్తఱి రణమునుంజేసె దు:ఖార్తుడై, గం
భీరత్వంబన్నదె పథము వేవేల చందంబులన్ నా
పోరాటమ్మెంతయు సలుపుదున్ ముఖ్య కర్తవ్యమౌటన్.
41. శా : ఎన్నో తావుల గౌరవాదరములున్, ఎన్నెన్నొ మర్యాదలున్,
చెన్నారన్ రజతంపు వస్తుతతులున్,సింగారమౌ బంగరుల్
ఇన్నాళ్ళున్ విజయంపు కేతనములై, యీశానుకారుణ్యమై
అన్నంబున్నను లేకపోయినను దివ్యౌన్నత్యముంజేర్చెగా.
బంగారు, వెండి బహుమతులమ్మి
చెల్లి పెండ్లి చేయుట.
42 ఉ : చెల్లికి బెండ్లిచేయదగు చిత్తము దేహము సిద్ధమయ్యె, నా
మల్లియవంటి దానికిక మాన్యుని భర్తగ నెంచగావలెన్
మెల్లగ స్వర్ణకంకణము, మెచ్చుచు నిచ్చిన వెండికప్పులుం
దల్లికి దెల్పి యమ్ముటది ధర్మమటంచును నిశ్చయించెతాన్.
43. తే.గీ : వెండి బంగారు కప్పుల విక్రయించి
బంగరుందల్లి చెల్లికి బహుమతినిడె
భవ్య సద్గుణ రూపుని బావనపుడు
భావి సౌభాగ్య దీప్తులు భగిని పొంద.
44. తే.గీ : చక్కదనమున నాచెల్లి రిక్క నతక
రించు, బావగారెటులైన రేయిరాజె.
కలసిపోయిరి యిర్వురు కాంక్షదీర
చందమామయు వెన్నెల చందమౌచు
45. కం : "దర్జీ"గ మారి నాజరు
"దర్జా"గా కంఠమెత్తి ధారాళముగన్
పర్జన్య గర్జనంబున
నిర్జనముగనున్న యింట నేర్పుగ బాడెన్.
"కొమ్మినేని బసవయ్యగారి"పరిచయ భాగ్యము .
శ్రీరాముండత్తఱి రణమునుంజేసె దు:ఖార్తుడై, గం
భీరత్వంబన్నదె పథము వేవేల చందంబులన్ నా
పోరాటమ్మెంతయు సలుపుదున్ ముఖ్య కర్తవ్యమౌటన్.
41. శా : ఎన్నో తావుల గౌరవాదరములున్, ఎన్నెన్నొ మర్యాదలున్,
చెన్నారన్ రజతంపు వస్తుతతులున్,సింగారమౌ బంగరుల్
ఇన్నాళ్ళున్ విజయంపు కేతనములై, యీశానుకారుణ్యమై
అన్నంబున్నను లేకపోయినను దివ్యౌన్నత్యముంజేర్చెగా.
బంగారు, వెండి బహుమతులమ్మి
చెల్లి పెండ్లి చేయుట.
42 ఉ : చెల్లికి బెండ్లిచేయదగు చిత్తము దేహము సిద్ధమయ్యె, నా
మల్లియవంటి దానికిక మాన్యుని భర్తగ నెంచగావలెన్
మెల్లగ స్వర్ణకంకణము, మెచ్చుచు నిచ్చిన వెండికప్పులుం
దల్లికి దెల్పి యమ్ముటది ధర్మమటంచును నిశ్చయించెతాన్.
43. తే.గీ : వెండి బంగారు కప్పుల విక్రయించి
బంగరుందల్లి చెల్లికి బహుమతినిడె
భవ్య సద్గుణ రూపుని బావనపుడు
భావి సౌభాగ్య దీప్తులు భగిని పొంద.
44. తే.గీ : చక్కదనమున నాచెల్లి రిక్క నతక
రించు, బావగారెటులైన రేయిరాజె.
కలసిపోయిరి యిర్వురు కాంక్షదీర
చందమామయు వెన్నెల చందమౌచు
45. కం : "దర్జీ"గ మారి నాజరు
"దర్జా"గా కంఠమెత్తి ధారాళముగన్
పర్జన్య గర్జనంబున
నిర్జనముగనున్న యింట నేర్పుగ బాడెన్.
"కొమ్మినేని బసవయ్యగారి"పరిచయ భాగ్యము .
46. ఆ.వె: "కొమ్మినేని"వారి కులమున శ్రేష్ఠుండు
"బసవ నామధేయ" ప్రథితుడొకడు
"నాజరు" తలరాత నయముగ నే మార్తు
నంచు శివునివోలె నతడువచ్చి
47.కం : సంగీత కళను బొందియు
నంగీలను గుట్టనేల? హాస్యాస్పదమౌ
బంగారపు నీ భవితకు
సింగారమె యబ్బు మాదు చిన్నికి నేర్పన్.
48. తే.గీ : చిన్నియొక్కతె గాదు మా శీలవతికి
నా కొమరునకు సరిగ పునాదివేసి
విద్యనేర్పంగ నీకిల విలువ బెరిగి
సంపదాదులు గూడును స్వయముగాను.
వ: ఇట్లు దర్జీగా జీవిక గడుపుచున్న "నాజరు"కడకు "ఐశ్వర్యమీశ్వరా దిచ్ఛేత్." అను నానుడి ననుసరించి ఈశ్వరరూపుండైన "కొమ్మినేని బసవయ్య’’నామాఖ్యుడు వచ్చి మా కుటుంబ సభ్యులందఱకును సంగీతమును నేర్పుము. మాకు సంగీత సరస్వతియు, నీ కామె అత్త గారును లభించునని పలుకగా మహదానందభరితుండై నాజరంగీకరించి, విజయవాడ వెళ్ళి నాలుగు "హార్మోనియమ"లను సంగీతసాధనమ్ముల దెచ్చిన యనంతరంబున....
49. ఉ : గ్రామ సహాయకాగ్ర! సమలంకృత సద్గుణ! దీనబాంధవా
సేమము గోరుచున్ గరుణజిందగ పాలనజేయు ధీవరా!
రామ పదారవింద మకరందమనోజ్ఞ రుచిప్రభావ భా
సేమము గోరుచున్ గరుణజిందగ పాలనజేయు ధీవరా!
రామ పదారవింద మకరందమనోజ్ఞ రుచిప్రభావ భా
వామల కీర్తి మూర్తి!జనవందిత భక్తపరాగరేణువా!
50.కం: శుభకర భావాతీతా!
అభయము నిలగూర్చి మాకు నాదరమిమ్మా!
విభవము కోరక నొసగెడి
యభవుని తేజంబుగల్గు నాత్మీయపితా!
50.కం: శుభకర భావాతీతా!
అభయము నిలగూర్చి మాకు నాదరమిమ్మా!
విభవము కోరక నొసగెడి
యభవుని తేజంబుగల్గు నాత్మీయపితా!
వ : ఇది శ్రీరామ పదారవింద మకరందపానమత్త తుందిలుండును, సుజన సంస్తుత్యమాన మానసుండును, బంధువత్సలుండును, శ్రీవత్సగోత్రజుండైన పొన్నెకంటి పూర్ణచంద్రశేఖర వరప్రసాదరాయాఖ్య తనూజుండును, సుజనవిధేయ సూర్యనారాయణరాయ నామధేయ ప్రణీతంబైన "బుఱ్ఱకథనాజరుచరిత" మందలి ద్వితీయాశ్వాసము.
📖 📖 📖