2, డిసెంబర్ 2019, సోమవారం

ముందు మాట

                                                                 ముందు మాట

            సంగీతమపి  సాహిత్యమ్  సరస్వత్యా: స్తన ద్వయమ్, ఏక మాపాత మధురం అన్య దాలోచనామృతమ్ . అట్టి ఆలోచనామృత కావ్య సృష్టి కి నన్ను ప్రేరేచిన సాహితీ ప్రియులు, మాన్యులు పట్వర్ధన్ గారికి  హార్దిక             ధన్యవాదములు . ముఖ పుస్తకము ద్వారా పరిచయమైన వారు నాకు స్వయముగా ఫోన్ చేసి అందరును ఒక్కొక్క  ప్రబంధము వ్రాయ సంకల్పించిరి , మీరును తప్పక ఒక ప్రబంధము వ్రాయ వలసినదని చనువుగా , స్నేహ శీలియై ఆదేశించిరి . అంతే నాకేమనుటకు  తోచక , సాధ్యా సాద్యాలాలోచింపక అంగీకరించితిని.  దాని ఫలితమే  ఈ  !! బుఱ్ఱ కథ నాజరు చరితము !! . 
            దృఢ సంకల్పమున్నచో  భగవంతుడు సానుకూల పరిస్థితులు కల్పించునని  నా ప్రగాఢ విశ్వాసము . దానిని రెండవపర్యాయము  భగవంతుడు రుజువు చేసెను  . నా ధృఢసంకల్పబీజము వృక్షమగుటకెందరో పాదుచేసి, నీరు పోసి, ఎరువు వేసి అద్వితీయ ఫలముల నందించారు . అందు బీజము వేసినది మాన్యులు పట్వర్ధన్ గారు. తదభివృధి కి  శ్రీయుతులు  కిరణ్ ప్రభ, జొన్నలగడ్డ జయరామ శర్మ, అంగడాల వెంకట రమణ, షేక్ బాపూజీ గారలు కారకులైరి .
         పద్మశ్రీ షేక్ నాజారు గారి చరితే వ్రాయ వలెనని సంకల్పించుటకు కారణము , మేమిరువురము అంతే వాసులము. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ  అను నట్లు నా జన్మ భూమి ఋణము దీర్చుకొనుటకు వారి చరిత్ర వ్రాయుటే యుచితమనిపించింది . ఉదధిని ఉద్ధరిణె లో బంధించినట్లైనది, నాజారు గారిని ప్రబంధములో బంధించుట . కారణము ప్రబంధము 300 పద్యములు దాటరాదనుటయే . ప్రబంధ లక్షణములకనుగుణముగా వ్రాసినను రస స్థాయి సహృదయ పాఠకుల మనస్సులను రంజింప జేసిన నాడే దాని సార్ధకత. రచయితకు ధన్యత !
ఇందు గల గుణములు నా గురు దేవుల ఆశీ: ప్రసాదములు , దోషములు నా యజ్ఞాన దుష్ఫలములు. బుధులు క్షీర నీర న్యాయ విదులు. కనుక క్షీరమునే గ్రహింప మనవి . దోషములు సూచించిన సవరించుకోగలను.
                                                                                      మీ బుధజన విధేయుడు.
                                                                               పొన్నెకంటి సూర్యనారాయణ రావు . 
               

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...