అనుబంధం,ఆత్మీయత...మాలకొండయ్య.
కొన్ని అనుబంధాలు ఈ జన్మవి కావేమో అనిపిస్తాయి. అంతగా వారు ఏకమౌతారు. ఆత్మీయత అంటే "తననుతానెంత ప్రేమిస్తాడో ఎదుటివానిని కూడ అంతే ప్రేమగా చూడటం." ఈ రెండు కలగలిసి సనాతన సంప్రదాయ గౌరవమర్యాదలకు ఆలవాలమై, సాహితీ ధురంధరుడై, జ్ఞానవయోవృద్ధుడై, విద్యాదానశీలుడై, నా దక్కిన శమంతకమణే శ్రీ ద్రోణాదుల మాలకొండయ్య గారు. (81సం.లు)
2013వ సంవత్సరములో " భువనేశ్వర్, కాశీ యాత్రలో సహ యాత్రికుడు. సహజంగా సద్గుణశోభితుడు . అలాంటి వ్యక్తి కనబడగనే ఉప్పొంగిపోతాడు, మమేకమై కష్టసుఖాలలో పాలుపంచుకోవాలనుకుంటాడు. తాను సాహితీప్రియుడు కనుక కవిపండితులనభిమానిస్తాడు. ఆనాడు "కాశీయాత్రావిశేషాలను" నేను వ్రాసి గ్రంథస్థం చేయటాని ముఖ్యకారకుడాయనే. ఏమి మాట్లాడినా చివరకు "మాష్టారూ! దానిని ప్రింట్ చేయించుటకు ముందుగా కొంత డబ్బు ఇవ్వమంటారా?" అని అడిగేవారు. తాను పొందిన ఆనందాన్ని అందరకు పంచాలని ఆయన తపన. ఆధ్యాత్మికత భావనలు నిరంతరం సమాజశ్రేయస్సునే కాంక్షిస్తు ఉంటాయి. కనీసం పది రోజులకొకసారైనా నాకు ఫోన్ చేసి "ఎలా ఉన్నారు మీరు, మేడం గారు?"అని మనసారా పలకరించడం ఆయన మంచి మనసునకు నిదర్శనం. మనస్సు నిరంతరం మాధవపాదాక్రాంతమై యుంటుంది. భాగవతంలో పోతనగారు " మందారమకరంద మాధుర్యమునదేలు
మధుపంబువోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికలదూగు
రాయంచచనునే తరంగిణులకు
..........................
అంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేష మత్త
చిత్తమేరీతినతరంబు జేరనేర్చు
వినుతగుణశీలమాటలువేయునేల......అంటారు.
అట్టి గుణశీలుని 24.01.2018 న కలుసుకునే అవకాశం దొరికింది. వారి స్వగ్రామమైన " ఎడ్లూరిపాడు" వెళ్ళాము. మా ఆనందానికవధులు లేవు. మాకు బ్రహ్మ రథం పట్టారు. ఆయన సహజంగా రామభక్తుడు. ఇల్లంతా రామమయం. నా ఆరాధ్యదైవం రాముడే. నేను తెనుగు జేసిన " సూర్యశ్రీరామం" తన డాక్టరు గారిచే గ్రంథముగా తయారుచేయించి తెప్పించుకొని మరీ చదివారు. భోజనాలకుముందు కాసేపు పద్యపఠనం. సాహితీసమరాంగణ సార్వభౌముని "ఆముక్తమాల్యద"నుండి. విష్ణుచిత్తుని అతిథి సేవాఘట్టం. "నాస్తి శాకబహుళా". ఎంతమధురమనోహర ఘట్టం. "అభ్యాగతః స్వయం విష్ణుః" మాలకొండయ్యగారి దృష్టిలో నేను విష్ణువును. భోజనానంతరం మాదంపతులకు, నా సోదరుడు కాళీజగన్నాథ్ కు బట్టలు పెట్టి ఆత్మీయతను చాటుకున్నారు.
మన జీవితంలో ఎందరో కలుస్తారు. వారందరు ఆత్మీయులు కాలేరు. ఆరాధ్యులు కాలేరు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.
తే.గీ.జీవితంబున వెలిగెడి చెలిమికలిమి
సర్వ సౌభాగ్య భోగముల్ సంతరించు
స్నేహదీపంబు వెలిగింప చిత్తమందు
హ్లాదమిచ్చును నిలువెల్ల హాయి గూర్చు.
తే.గీ.మాలకొండయ్య నెయ్యంబు మరువలేను
ఉన్నతంబైన సుగుణమహోన్నతుండు
పుస్తకంబుల పారాడు పురుగనంగ
సార్థకంబౌను సామెత చక్కగాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి