2, డిసెంబర్ 2019, సోమవారం

బుఱ్ఱకథాపితామహ నాజరు.కథ. ముందు మాట - విషయ సూచిక - షష్ట్యంతములు.

                                            నాజరు కావ్యము.

"ముఖ పుస్తక "కవిపండితులందరు తలా ఒక కావ్యం వ్రాయాలని ప్రకటన ఇచ్చాము. అందరు తలకొకటి వ్రాస్తున్నారు మీరు కూడ ఒక కావ్యం వ్రాయండి "అని (అదేదో చాలా చిన్న పని , అలవోకగా నేను చేయగలిగిన పని అయినట్లు) చాలా ప్రేమపూర్వకముగా నాకు ఫోన్ చేసి చెప్పారు మాన్యులు, సుకవితా విశారదులు, ప్రొఫెసర్ గారైన పట్వర్థన్ గారు. నేను ఆ ఆనందంలో నా స్థాయి మరచి "(తగరు పర్వతమును ఢీకొన యత్నించిన రీతి) ఆత్మవిశ్వాసంతో దేనినైనా సాధింప నగును. అని తలచి తలయూచాను సరేనంటు. రెండు రోజులు ఏమి వ్రాద్దామా ?అని జుట్టు పీక్కుంటున్న తరుణంలో ఒక మెఱుపు ఆలోచన వచ్చింది. అదే నా జన్మస్థలమే తన జన్మ స్థలముగాగల ప్రపంచ ప్రముఖ బుఱ్ఱకథాకళాకారుడు, బుఱ్ఱకథా పితామహుడైన పద్మశ్రీ షేక్ నాజర్ గారి జీవిత చరిత్ర ను పంచాశ్వాసాల కావ్యంగా వ్రాయపూనుకొన్నాను. పూర్తి సమాచారం లేక చింతపడుచున్న తరుణంలో నడిసంద్రంలో నావలాగా యూట్యూబ్ లో మాన్యులు టాక్ షో నిర్వాహకులు, బహుకళాభిజ్ఞులైన కిరణ్ ప్రభగారి "బుఱ్ఱకథ నాజర్ "గురించి కొంత సమాచారం, డా. అంగడాల వెంకట రమణమూర్తి గారి పరిశోధనా గ్రంథం "పింజారి" వలన పూర్తి సమాచారం నా అదృష్టం వలన లభించింది. వారా చరిత్రలో వ్రాసిన విషయాలలో శత సహస్రాంశము కూడ నేను వ్రాయలేకపోయాను. సముద్రములోని నీటిని, చాపిన అరచేతిలోనికి తీసికొని నట్లయినది. దొరికిన వరకే అదృష్టం ."చేసికొన్నవారికి చేసికొన్నంత మహదేవ " ఆకావ్యము లోని మంచిచెడుల ఫలితాలు ఈ నెల(అక్టోబరు 13న ) రాబోతున్నాయి. కావ్యం వ్రాయుటే ఘనముగా భావించిన నాకు బహుమానంతో సంబంధం లేదు. వ్రాసిన 29మంది కవులలో నేను కూడ ఒకడినిగా పాలు పంచుకొనగల్గుటే అపురూపం. సాహితీ సింధువులో నేనొక బిందువును. అందుకే ఈ ఆనందాన్ని అందరితో పంచుకొంటున్నాను, శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గమ్మ పాదరేణువు సాక్షిగా..... నాకీ విషయంలో ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా సహాయపడిన నాజర్ గారి ద్వితీయ కుమారుడు , అద్వితీయ కళాసాహిత్యకారుడు , కళావారసుడు ,అయిన శ్రీ షేక్ బాబూజీ గారికి, పరోక్షంగా సహాయపడిన కిరణ్ ప్రభగారికి , డా. అంగడాల వెంకట రమణగారికి హార్దిక ధన్యవాదాలు. నాకు కలుగబోయే గౌరవములో వీరందరు భాగస్వాములే. నేను ప్రతిరోజు వ్రాసిన పద్యములను నిర్దుష్టము , సారవంతము చేయుచు సాయపడిన నా యనుంగు సోదరుడు జొన్నలగడ్డ జయరామ శర్మకు , అంగడాల వారిని పరిచయం చేసిన యువకవి ముష్టి కృష్ణకిశోర్ కు నా ధన్యవాదాలు. అందరికి దసరా శుభాకాంక్షలు.



       

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...