14, జులై 2019, ఆదివారం

రామాయణం కుడ్య చిత్రాలు

ధర్మవరం.రామాయణ కుడ్యచిత్రాలు.

 ది.26.02.2018. యశ్వంత్ పూర్ నుండి కాచిగూడ యక్స్ ప్రెస్ లో ప్రయాణం. అది బయల్దేరవలసిన సమయానికన్నా(మధ్యాహ్నం2.30,) 1గం. ముందే స్టేషన్ కు చేరాము. రైలు బయల్దేరగా స్టేషన్ లు వరుసగా వెనుకకు వెళ్ళిపోతున్నాయి మాకు వీడ్కోలు పల్కుతు. క్రాసింగ్ కారణం కాబోలు ధర్మవరంలో రైలు ఎక్కువసేపు ఆగింది. చూపులు పరిసరాలను నిశితంగా వెదుకసాగాయి. ఆశ్చర్యంగా కొన్ని కుడ్యచిత్రాలు దూరంగా కనబడ్డాయి. మరి మనం పరిశీలించకుండ ఉండగలమా? గుడ్లుపెద్దవి చేసి చూస్తే గుట్టు బయటపడింది అది రామాయణమని. ఇక మనసు పులకించి కోతిగంతులు వేస్తు ఛందోశాఖలనాశ్రయించి చిత్రభావాలను , చరితమూలపురుషులను నెమరువేసుకొంటు మధురఫల రసాల నాస్వాదించింది. వాటిఫలితమే ఈ పద్యాలు. మీకు కూడ.

    తే.గీ.  ధర్మ వరమును రైలులో దాటుచుండ
              రామసత్కధా పరిపూర్ణ రమ్య కుడ్య
              చిత్రజాలంబు జూచితి చేష్టలుడిగి.
              ధన్యమైనవి కన్నులు తలపులపుడు.

  ఉ. ధర్మమె మారురూపమయి ధర్మమె నిత్యము సాధనంబుగా
       కర్మలనాచరింప ఘన కంటకదూషిత కాననంబులన్
       నిర్మల చిత్తుడైదిరిగి నీతివిదూరుల నేలగూల్చి ఆ
       మర్మము విప్పిజెప్పు పరమాత్ముని శ్రీరఘురాముజూచితిన్.

  ఉ. లంకను జేరనీయనని లంఖిణి భీషణ క్రూరరక్కసై
       బింకముతోడదేహమటు పెంచుచుదూకుచు మ్రింగబోవ ని
       శ్శంకత సూక్ష్మరూపియయి చక్కగ నాస్యములోనికేగి ఆ
       వంకనె వచ్చినట్టిఘనవానర ముఖ్యుని నేనుగాంచితిన్.
   
  తే.గీ. రాముచెంతనె సీతయు రమ్యగుణుడు
          లక్ష్మణుండట భాసిల్లె లక్షణముగ
          ధర్మ వరజన పుణ్యంపు మర్మమేమొ
          నిర్మలంబౌచు సత్కీర్తి నింగినంటె.
       
   తే.గీ.ధర్మబద్ధంపు మనుగడ ధైర్యమిచ్చు
           అర్థ మెక్కువయగుట యనర్ధమగును
           కామమనునది భార్యతో క్షేమమగును
           మూడుత్రోవలు నరునకు మోక్షమిడును.

                శ్రీరామకటాక్షసిద్ధిరస్తు!
 ఇలా అణువణువు రామమయం కావాలని ఆశిస్తు....
                                       మీ "సూర్యశ్రీరామం" (పొన్నెకంటి)
         

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...