14, జులై 2019, ఆదివారం

ఉన్న దానిలోనే దానం.

ఉన్నదానిలోనే అన్నదానం.

       సూళ్ళూరుపేటకు షుమారు 60కి.మీ దూరంలో"మల్లాం" గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీవల్లీ,దేవసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ప్రాచీనమైనది. అందు మనోహర శిల్పసౌందర్యం చూపరులను కట్టి పడేస్తుంది.
       ఆలయనిర్వహణాధికారులు భక్తులు దైవదర్శనం చేసుకొనేసమయంలోనే "అయ్యా అందరు స్వామివారి ప్రసాదం తీసుకొనివెళ్ళండి" అని చెప్పటం వారి అన్నదానవ్రతానికి నిదర్శనం. ప్రస్తుతం అన్నదానం మంగళ,ఆదివారాలలో జరుగుతుంది. దాతలు అధికంగా విరాళాలిస్తూ ఉంటే ప్రతిరోజు అన్నదానం నిరతాన్న దానంగా మారుతుంది.

     స్వర్ణ దానంబు లిచ్చును స్వర్గ సుఖము
     వస్త్ర దానంబు ప్రఖ్యాతి వరలజేయు
     భూమిదానంబు వలనను పొందుయశము
     అన్నదానంబు సర్వంబు నమరజేయు.

 మంగళ,ఆదివారాలలో భక్తులు షుమారు200మందివస్తారు. ఆరోజును దృష్టిలో పెట్టుకొని అన్నదాతలు తగిన ద్రవ్యం చెల్లిస్తారు. అన్నము, ఇతరపదార్థములన్నీ సిద్ధమై భక్తులు క్యూలో నిల్చినను వెంటనే భోజనము వడ్డించరు. ఆరోజునకు ద్రవ్యముదానమిచ్చిన దంపతులువచ్చి అన్నమున్న గిన్నెకు (అన్నపూర్ణాదేవికి )హారతిచ్చి అగరువత్తులు వెలిగించి ధ్యానించి వారు ప్రారంభించిన తదుపరే క్యూ లోని వారికి పెడతారు. సాధారణంగా ఈరోజుల్లో ఇలాంటి స్థలాలలో తిని అన్నదానానికి ద్రవ్యం ఇవ్వనివారెవ్వరు ఉండుటలేదు. కారణం "మనం తినే అన్నం ఎవరో ఇచ్చినదే"అనే స్పృహ తప్పక ఉంటుంది. "అన్నం పరబ్రహ్మ స్వరూపం" ఒక్క పదార్థం కూడ వృథాచేయకూడదు. తింటేమనం తినాలి లేకుంటే పేదలకు పంచాలి. మనం తినటానికి తక్కువ ప్రాథాన్యమిచ్చి పేదలు తినటానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.

           దాన గుణమది యుత్కృష్ట ధర్మమెపుడు
           మనము తిన్నది యెంతైన మట్టిపాలు
           పరులకిడునది శక్తి మై భక్తి తోడ
           నధికతరమైన ఫలితంబునందజేయు.

మనమీనాడు ఏదేవాలయానికి వెళ్ళినా అన్నదానం జరుగుతున్నది. అది నిరంతరాయంగా జరగటానికి మనం చేతనయినంత సాయం చేద్దామా? కాదనెందుకంటారు మరి చేయికలపండి...

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...