2, ఏప్రిల్ 2019, మంగళవారం

రవీంద్రుని భావాలకాంధ్రానువాదం.

గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలకు ఆంధ్రానువాదం.

తే.గీ. దయయు ప్రేమైక గంథముల్ తనివిదీర
         నింటనింపిన బోనేల నీశు దరికి?
         పూజసేయంగ వేవేల పూలతోడ
         భక్తి తత్త్వంబునెఱిగిన ప్రాజ్ఞులకును.
భావము.. ఓ మానవా!దయ, ప్రేమ అనే సుగంధాలను నీ యింటిలో

తే.గీ. మనసునందలి గర్వంబు మచ్చరంపు
         చీకటుల ద్రుంచ యత్నంబు సేయవలయు
         కాంతివంతము నీకది క్రాంతిగూర్చు.
         దీపముంచగబోనేల దివ్యుకడకు ?

తే.గీ. శిరము వంచగ నేటికి శివుని గుడికి
         తోడివారికి వినయాన తోడునిలచి
         తప్పు జరిగిన నిలువెల్ల తాపమంది
         పూర్ణమైనట్టి జ్ఞానివై ముందుకేగు.

తే.గీ. పూనుకొనగను పేదల పుష్టికొఱకు
         యత్నముంజేయ దళితుల హాయిగోరి
         యువత ప్రగతికి సతతంబు నూతమీయ
         గుడికిబోనేల మానవా మడులుగట్టి?

తే.గీ. నీదు కాఠిన్య వచనాల బాధజెంది
         కుములువారిని దరిజేరి కూర్మిదనర
         క్షమనువేడుము సరియగు క్షణమునందు.
         వేడనేలకో శివుని నీ గోడుదెలిపి?

హేవళంబి కాహ్వానం.

  హేవళంబి నామ సంవత్సర ఉగాది ఆహ్వానం. శుభాకాంక్షలు.

   వద్దన్నా కద్దన్నా వదలక వెంటాడేది, తన బలం చూపేది
   ఇతరుల బలహీనతలను సున్నితంగా  తఱచి చెప్పేది
    కవులకైతే కలం, మిగిలిన వారికైతే  కాలం!!
            ఈ రోజునుండి సంవత్సరం దాకా నీపేరు "హేవళంబి"
    చైత్రం నుండి చిత్ర విచిత్రాలు సౌగంధికాలు మొదలై
    నవ ప్రభావిత మావి చివురుల చాటున కోయిలలై
    అర్థవికసిత నవలావణ్య అధరామృతమాను షట్పదములై
    ఊహలకు ఱెక్కలు తొడిగి ఉదయభానుని తాకగలవైన
     భావపరంపరలను భద్రపఱచుకొన్న  సుకవులై...
     కుంచెకు కొంచెం ప్రాణం, మరి కొంచెం త్రాణం అద్ది
     ప్రతి గీతకు గీతంత విలువనిస్తు, రంగుల ప్రపంచాన్ని చ్చే
                      చిత్రకారులై .
     వెలసిందెవరో కాదు. నీవే...
              వేములో చేదును సృజించి, వేయేండ్ల జీవితమిచ్చినా
              క్రొత్త బెల్లంలో తీపి నింపి, భార్యగా పోలిక నిచ్చినా
              ఉప్పులోసముద్రాన్ని, సముద్రంలో ఉప్పు నింపినా
              కారం లో మమకారం కలిపి, కాపురాలు చేయించినా
      మావి పులుపులో , మానవ జీవన చిగురుదొంతరలు దాచినా
              వగరులో కొంచెం పొగరు కలిపి భారతీయునిగా చూపినా
          అదెవరో కాదు. నీవే....
           సహజంగా సామాన్యులు పొగడ్తలకు లొంగుతారు
            నీవీ జాతికి చెందవని తెలుసు, కాని మేమాశాజీవులం.
          గతాన్ని మరచి , వర్తమానాన్ని అనుభవిస్తు , భావి
           జీవితానికి ఎఱ్ఱ తివాచీ పరచే తెల్లని మనసున్న నల్లవాళ్లం.
      హేవళంబీ!
       మేము తెలిసీ తెలియక చేసిన ప్రకృతి విరుద్ధాలను మన్నించి
       వాతావరణ కాలుష్య ఘాతుకాలకు వార్నింగ్ తో వదలి
       మా జీవితాలను ఆధ్యాత్మిక, సాంఘిక, మానవీయతల పట్ల
        మరలించి, ప్రతి ఒక్కరి జీవితం సార్థకం, ఆనందమయం చేయాలని  మనసారా కోరుతు...
                                        పొన్నెకంటి సూర్యనారాయణ రావు.




26, మార్చి 2019, మంగళవారం

పద్య కదంబం.

      పద్దెము మానసాంబుధిని భావసమున్నత వీచికాళిచే
      తద్దయు క్రిందుమీదగుచు తన్మయతల్గలిగించ నించుక
      న్నిద్దురరాదు సభ్యులకు నిర్మలకావ్యఝరీవిలాసతన్
      నొద్దిక దేలియాడు తరి యూహల దేలుట సత్యమేకదా.

      ముద్దుగ జానకీసతికి మోహనరూపుడు రామచంద్రుకున్
      పెద్దల సన్నిధిన్నిచట పెండిలి మేళము మ్రోగుచుండగా
      విద్దెలరాణి సత్కృప కవీశ్వరుపల్కుల శబ్దజాలమే
      మద్దెల మ్రోతలై చెలగ మంగళగీతములివ్వెయౌసదా.
              (  ప్రజ పద్యంవారు సభ్యులకు నిద్దురరాదు అన్నప్పుడు)

   
     నాగలి దున్నగ,న్నగరి నడ్వసజీవపు సాధనమ్మునై
     సాగుచునున్నగాని, పులు, సశ్యమునెంతయు జేరవేసిన్
     త్యాగవిహీనులై నరులధర్మముజూపుటనాదుపాపమౌ
     యోగికి సేవజేయుటయె యోగమునీదని నాదుభావమౌ.

     జాతియదొక్కటైన సమజాతకముండదు బ్రహ్మరాతలన్
     గీతలయందుజూచినను క్రిందటిజన్మలె కారణంబులౌ
     మోతలు దెబ్బలే నొసట నాకిటులుండెపురాకృతంబుగన్
     చేతజువైరిచెంతగల శేముషివీవయ నందిసోదరా!
         పూజనీకు, బడితపూజయె నాకయ్యె
         నాదు పూర్వకర్మ నరునిసేవ
         భవుని పాదధూళి పాయకనందుటన్
         వందవందనములు నందివర్య!(ఎద్దు.నందిఎదుట)

    నేలమీదగాని నింగిమీదనుగాని.,
    తొక్కియెక్కుటదియె తోషణంబు
    మాదువర్తనాన మార్పేమిరాదయా
    మూర్ఖవర్తనంబు మాకుహితము!...పొన్నెకంటి.
     ( విమానంలో వ్రేలాడతు ఎక్కుట గురించి)
 

12, మార్చి 2019, మంగళవారం

కేరళ పర్యటన. మార్చి.1నుండి 10వరకు.13.03.19.

కేరళ పర్యటన.

  

  రమ్మభినందనా!భరత రత్నమ!వీరకిశోరమై తగన్
  దమ్మును జూపి పాకునకు దర్పమడంచిన నుక్కుమానిసీ
  ఇమ్మహి భారతీయుడొకడేకద శాంతియుశౌర్యదర్పముల్
  చిమ్మెడు ధైర్య శాలి,ఘన శ్రేయము గూర్చిన నీవెయాతడౌ.
(శబరి ఎక్స్ప్రెస్ లో ఉండగా అభినందన్  ను పట్టుకొని
మరల విడుదలై భారత్ వస్తున్నాడని తెలసి,దానికి స్పందన.)

 ది.1.03.19న  మ.11.45.కి *శబరి ఎక్స్ప్రెస్ *లో మా కేరళ ప్రయాణం. మహాయోధుడు, భరతమాత ముద్దుబిడ్డ అయిన అభినందన్ స్వదేశానికి చేరుతున్నాడన్న శుభవార్త తో ప్రారంభమై , చేరాడన్న వార్త తో ముగిసింది. ఎంత సంతోషాన్ని అనుభవించింది భరతజాతి!!జై భారత్. !
 ది.2.03.19. :కణ్ణగి(అంబ)ఆలయం,రామాలయం కొడంగలూర్: లోచి చూచి ఆ రాత్రికి గురువాయూర్ లో బసచేశాము.




(కణ్ణగి దేవతయైన కథ: కోవలన్,కణ్ణగి ప్రేయసీ ప్రియులు. కావేరి పట్టణపు ధనికుని కుమారుడు కోవలన్ అందాలరాశియైన కణ్ణగిని ప్రేమించి పెళ్ళిచేసికొని,కొంతకాలానికి మాధవి అనే వేశ్యా వ్యామోహంలో పడి, సర్వంకోల్పోయి మరల భార్యను వెదుకుతు వచ్చి, ఇంటనే ఉంటు వ్యాపారంచేసే నిమిత్తం భార్య ఇష్టప్రకారం
ఆమె ముత్యాల కాలియందె అమ్మే ప్రయత్నం చేయగా, అదే సమయంలో మహారాణి ఒక కాలి (ఇలాంటి దే)పోగా , దానికై వెదకు భటులీతనిని దొంగని భావించి రాజుదగ్గరకు తీసికొని పోగా రాజు ఇతనికి మరణశిక్ష వేస్తాడు. విషయం తెలిసిన వెంటనే కణ్ణగి రాజ సభకేగి తన భర్త నిరపరాధి యని, రాణిగారి అందెకు తన అందెకు కల భేదం నిరూపిస్తుంది. రాజదంపతులవమానభారంతో మరణిస్తారు. కోపోద్రిక్తురాలైన కణ్ణగి తన ఒక స్తనం కోసి మధురై లో విసరి ఆపట్టణం భస్మం కవాలని శపిస్తుంది. వెంటనే దేవతలు దిగి వచ్చి కణ్ణిగిని ఓదార్చి ఆమెను స్వర్గానికి పంపుతారు. ఆమే కొడంగలూర్ లో ఉన్న కణ్ణగి అమ్మవారు.)
 ది.303.19న *గురువాయూర్*లో ఉ.6.00లకు వెళితే మ.1.30.కి దర్శనం అయింది. (కురువాయ్..అనగా సముద్రతీరం, ఊరు, కలసి కురువాయూర్,అయిందని, గురువు బృహస్పతి పాతాళశిలతో ఏర్పడ్డ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని వాయువు సహకారంతో త్రిశూర్ కు 30.కి.మీ దూరంలో గల గురువాయూర్ లో ఉంచారని కధనం, అచట ఉన్నది విష్ణురూపం, కృష్ణుని గా పూజిస్తారు ఆయనే గురువాయూరప్పన్.)






సీనియర్ సిటిజన్స్ కి ఉ.9.నుండి ప్రవేశమున్నది.
మాకావిషయం తెలియక ఆ ప్రయత్నమే చేయలేదు.ఇక నుండి తప్పక ఏ గుడికి వెళ్లినా ఒక చేసంచిలో ఆధార్ , బిస్కెట్లు, మంచి నీళ్ళు తీసుకుని వెళ్ళాలి. వచ్చిన భాషలోనే సెక్యూరిటీని వివరాలడగాలి. ఇది స్వానుభవము.భోజనానంతరం కాలడి, శంకరాచార్యుల పాదుకలున్న స్థలం, కనధారా స్తోత్రము చదివిన స్థలము , లక్ష్మీ దేవాలయము చూచి చోటానిక్కర కు చేరాము. చోటా నిక్కర అను ఊరిలో రాజరాజేశ్వరి దేవిని, భగవతి అమ్మవారిని చూచి, ఇచటే మకాం చేశాము.














  వేదంబు నాదరూపిగ
  ఖేదంబులుబాపుభూమి కేరళయిదియే
  వాదాంతమయ్యెనిచ్చట
  మోదంబంతామాదే మున్నార్ లోనన్.1.
  పేదరాలైన ప్రమదయె ఖేదమంది
   ఉసిరి కాయను భిక్షగా నుంచుమనగ
   నాదిశంకరులంతట నమ్మనడిగి
   స్వర్ణ వర్షమ్ము గురియించె పూర్ణకృపను.4.
ది.4.03.19.మహాశివరాత్రి. ఉ.7.గం.లకు*చోటానిక్కర్ *లో  బయలుదేరి *వైకాం*లోని శివుని దర్శనం చేసుకున్నాము.11.గం.లకు *అలెప్పీ *చేరాము. అచటినుండి *మున్నార్ *కి బయలుదేరి రాత్రి 8కి చేరాము.
ది.5.3.19.ఉ.9.గం.లకు బయలుదేరి తేయాకు తోటలు చూచి  భోజనం చేసి హోటల్ రూంకు వచ్చాము.

















      ఎన్నో సుందర తరువులు
      మిన్నున్  కరమంటజూచు మేల్భళి యనగా
      చెన్నౌ తేయాకుగుబురు
      లెన్నన్ మున్నారునందు నెలవైయుండెన్.2.

 దేవభూమియనెడు ధీరత్వగరిమచే
 మిన్ను నంటజూచు మన్నునుండి
 చిన్న బీజమైన చిగురులుతొడుగునుచె
 కరము ముదముతోడ శరమువోలె.3.
  ది.6.3.19.ఉ.7.గం.లకి మున్నార్ లో బయల్దేరి *ఎట్టుమనూర్* శివాలయం 12.40.కి చేరాము. ఆలయం మూశారు.(మున్నార్ నుండి ఎట్టుమనూర్ 130కి.మీ) సా.5.30.లకు *తిరువనంతపురం*  రాత్రికి 7.15కి చేరి వెంటనే దర్శనం చేసుకున్నాము.

ది.7.3.19.న శ్రీపద్మనాభస్వామి దర్శనం రెండవసారి అయింది.
  పద్మనాభుని దర్శనంబదియొకింత
  పుణ్యమో భవ బంధ విమోచనమ్మొ
  తెలియరాదది యెప్పుడున్ ధీరమతికి
  నైన, పరమవిజ్ఞాని మహాత్ముకైన.5.

 నాభిన సృష్టి కర్త,చరణాబ్జములందుపవిత్రగంగనిన్
 శోభదలిర్పగా సిరిని సుందర డెందమునందునిల్పి సం
 క్షోభములెన్నిరేగినను కోపముజెందని చిద్విలాసతన్
 ప్రాభవముల్వెలార్చుసురవందితునంబుజనాభుగొల్చెదన్.6.

      దైవదూషణంబు,ధనగర్వముండుటన్
      మహిషుడౌను గాదె మానవుండు
      పద్మనాభ! నిన్ను పలుమార్లు ధ్యానింప
      పుణ్యహృదయుడగుచు మోక్షమందు.7.

   పద్మనాభుని దర్శనం రెండవసారి అయిన పిదప ఉ.10.00లకు బయలుదేరాము.మ.1.00కి * పండలమ్ *లో భోజనం పూర్తి అయింది. *అర్నాముల*పార్థసారథి* దేవాలయములో
సా.5.00.లకు కృష్ణ దర్శనం అయింది. *చెంగనూర్*లో సా.6లకు. ఈశ్వర దర్శనం అయినది. ఎట్టుమన్నూర్ లో ,రాత్రికి బస.
ది.8.3.19. ఎట్టుమన్నూర్ లో శివదర్శనమైనది.

 శివశివ యంచునామమును చిత్తము నందనిశంబుదల్చినన్
 భవభవ యంచుపాపములుభగ్గున మండుచుబూదియౌనుగా
 అవనత శీర్షతన్ భవుని హ్లాదముతోడుత నంజలించినన్
 నవవిధ భక్తిభావములనాట్యముజేయుహృదంతరాళముల్.8.

   అమ్మ పార్వతి సద్దయనందుకొనిన
   కమ్మనైనట్టి కైతలు కళలవెన్నొ
   చిమ్ముకొనివచ్చు నిరతంబు చేతమందు
   అమ్మదనమున నున్నదే కమ్మదనము.9.

    విఘ్నరాజైన గణపతి వీక్షసేయ
    సర్వకార్యాలు సిద్ధించి సౌఖ్యమబ్బి
    వాంఛితంబులు ఫలియించి వైభవాన
    మాన నీయుడై వెలుగొందు మానవుండు.10.

    కార్తికేయుని దర్శింప నార్తిదీరి
    సంతు లేదను దుఃఖంబు సమసిపోవు
    పూర్వజన్మంపు కర్మముల్ ముగిసిపోవు
    భావిజీవితమంతయు భవ్యమగును.11.

  ఎట్టుమన్నూరు పరమేశు నెట్టులైన
  కాంచగల్గిన భాగ్యంపు కాంక్షదీరు
  సర్వమంగళ దర్శన సారమనిన
  జన్మ సార్ధక్యమందును జగతిలోన.12.
వడక్కనాథన్ ఆలయం త్రిశూర్ లో సా 6.00.లకు చూచాము.

 

  

19, జనవరి 2019, శనివారం

సామెతలు జీవిత సత్యాలు .

సామెతలు జీవిత సత్యాలు . 






లక్ష్మీదేవి వచ్చేటప్పుడు తాబేలు లాగా,  పోయే టప్పుడు కుందేలు లాగా ఉంటుంది. ఇది  ఒక సామెత. 
  నాకు  ఒకనాడు ఆర్ధికంగా బాగా యిబ్బంది కలిగి మా బంధువు దగ్గరకు వెళ్లి కొద్ది కాలములోనే తిరిగి  వడ్డీ తో సహా చెల్లించే షరతు మీద ఋణము అడిగాను.  ఆ  సందర్భంలో ఆయన డబ్బుకు బదులుగా  ఈ సామెత చెప్పాడు .    అది నాకు స్వానుభవంలోకి వస్తున్నకొలది ఆయన నాకు జ్ఞప్తికి వస్తున్నాడు. అవును లక్ష్మీదేవి చంచలమైనదే . కానీ నా అనుమానం  ఆమె రాక పోకలలో ఎందుకు వ్యత్యాసం ఉండాలి? అని. నాకు కలిగిన భావన ఏమనగా ... ఆమె వస్తుందనే విషయములో మన ఎదురు చూపులు  చాలా ఎక్కువగా ఉంటాయి.  త్వరగా రావాలని పరవళ్లు త్రొక్కుతుంది మనసు. నిరాశ లో ఆమె రాక చాల నిదానంగా ఉన్నట్లు భావిస్తాము.( రాబడి విషయములో కూడా  మనకు చిన్న చిన్న మొత్తాలుగా  మాత్రమే ధనమ్ వస్తుంది ) అందుకని ఆమె రాక తాబేలు లాగా ఉంటుంది   సహజముగా ఎదురు చూపులు లేకుంటే మనసు ప్రశాంతముగా ఉండి   ఎపుడు వచ్చినా  యిబ్బంది లేదులే అని పట్టించుకోము . ఇక ఆమె వెళ్ళేటప్పుడు అనగా మనము ఖర్చు చేసే విషయం లో పెద్ద మొత్తం ఒకేసారి ఖర్చు పెడతాము . అందువలన మన దగ్గరనుండి ఎక్కువ మొత్తము బయటకు వెళుతుంది. మరి వేగముగా వెళ్ళినట్లే కదా .  
      ఇక డబ్బు విషయములోనే కాక వనితా, పుస్తకాలను పరులకు యిచ్చే విషయములో  ఒక మహాకవి  చెప్పిన శ్లోకం ఒకటి గుర్తుకు వస్తున్నది. 
   శ్లో . పుస్తకం వనితా విత్తం పర హస్తం గతం గతః 
        పునరాయాతం చ జీర్ణం, భ్రష్టా చ ఖణ్డశః   .... అని వచించారు. 
భావం. పుస్తకము, వనిత, ధనమును పరులకు , కొంతకాలము ఉపయోగము కొరకు యిస్తే ఆ మూడు వస్తువులు యథా తథముగా తిరిగి రావట. ఒకవేళ వస్తే పుస్తకము జీర్ణమై, వనిత భ్రష్టమై, విత్తము  ముక్కలు ముక్కలుగా వస్తాయట. ఇది కూడా నాకు అనుభవమే అయినది. దానిని పంచుకుందాం. 





 నేను  పీ, ఓ ,యల్( ప్రొఫెషనల్ ఆఫ్  ఓరియంటల్ లెర్ నింగ్ )(విషయము సంస్కృతము, వ్రాత ఆంగ్లము)   పరీక్షకు హాజరు కావలసిన రోజులలో(1973) ప్రశ్నలు సమాధానాలు ఉన్న కాపీలు  రెండు నాదగ్గర ఉన్నాయి . ఒక కాపీని ఒక సుప్రసిద్ధ పండితునకు యిచ్చి అయ్యా దయచేసి దీనిలోని తప్పులను సరిచేసి ఇవ్వండి అని ప్రార్ధించాను. వారు సరేనని దానిని తీసికొని నేను కాళ్ళు అరిగేటట్లు ఎన్నిసారులు తిరిగిన మరల నాకు తిరిగి యివ్వలేదు. వారి సన్నిహితుల ద్వారా నాకు తెలిసిన సమాచారం ఏమిటంటే నా పుస్తకం ఆ పండితుల వారు తమ ప్రియురాలికి ఇచ్చారట.  నాలో సహనం నశించి ఆ మహా పండితునకు  పై శ్లోకం చదివి వినిపించి ,, ఈ శ్లోకమును ఆ కవి మీ బోటి వారి అనుభవం తినే చెప్పి ఉంటారు అని నిర్మొగమాటంగా చెప్పాను.  పుస్తకము విషయములో యిది నా పట్ల గతం గతః  అయినది. చివరకు ఆ కాపీ లేకపోయినా నేను ద్వితీయ శ్రేణిలో కృతార్ధుడనైనాను దైవానుగ్రహం వలన . 

8, జనవరి 2019, మంగళవారం

అమరారామము. అమరేశ్వరస్వామి దర్శనము.ది.8.1.2018.

 పంచారామాలలో మొదటి సుప్రసిద్ధ క్షేత్రం అమరారామం. (అమరావతి.) 2వది,కొమరారామం(కొమరవోలు)3వది, భీమారామం(భీమవరం)4వది,క్షీరారామం(పాలకొల్లు) 5వది,దక్షారామం.
నా జన్మస్థలానికి (పొన్నెకల్లు.)కూతవేటుదూరంలో పవిత్ర కృష్ణానదీతీరంలో ఉన్న అమరావతిలోని అమరేశ్వర స్వామిదర్శనం మా సోదరుని కుటుంబంతో ఈనాడు నాకెంతో పరమానందాన్ని కలిగించింది. నదీ ప్రాధాన్యమే ఉంటే అది తీర్థం,ఆలయ ప్రాధాన్యం ఉంటే క్షేత్రం. రెండు ప్రాధాన్యాల కలయిక  దీనికుంది. ఆ కారణముచేత ఇది తీర్థక్షేత్రం రాజం. కాశీ మున్నగు వానివలె.
      ఈశ్వరో అభిషేక ప్రియః ., విష్ణోః అలంకార ప్రియః ., సూర్యో నమస్కార ప్రియః ., బ్రాహ్మణో బహుజన ప్రియః. 
(భోజనప్రియః కాదు). మాకు ఈశ్వరాభిషేకం చేయించే అవకాశం దొరకలేదు. కాని మానసికంగా అభిషేకం చేసినట్లు భావించి  దర్శించి తత్ఫలాన్ని పొందినట్లు భావింంచాను. శారీరకంగా చేయలేని పనులను మానసికంగా చేసి ఫలితం పొందటం ఒక మార్గం. ఈ మార్గం నిష్కల్మష , భావనాబలంతోనే సాధ్యం. 
     మా అమ్మా, నాన్నగారు సజీవులుగా ఉండగా అంటే షుమారు 50 సంవత్సరముల క్రితం అమరేశ్వరునికి అందరం అభిషేకం స్వయంగా చేసిన జ్ఞాపకాలను నెమరువేసికొన్నాను. ఇది చిరకాల దర్శనం. కాని కృష్ణమ్మ జలాల క్రుంకులిడి , వానితో స్వామినభిషేకించుట ఒక వరమే. ఈనాటి కృష్ణానది స్థితి, కనీసం శిరస్సుపై నీటిని చల్లుకోలేని దుస్థితి. ఆపని కూడ మానసిక చర్యే అయింది. ఏదిఏమైనా సద్యస్కాల సదాలోచనతో పరమేశ్వర దర్శనం ఈనాడు లభ్యమైనది. అచటి ఆంజనేయ స్వామి , బుద్ధుని మహోన్నత విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణలు.  ఈ సందర్భంగా తీసిన కొన్ని చిత్రాలు.

29, డిసెంబర్ 2018, శనివారం

షష్టి పూర్తులు , సహస్ర చంద్ర దర్శనశాంతి హోమాలు అవసరమా? ఆడంబరాలా ?





షష్టి పూర్తులు , సహస్ర చంద్రదర్శన శాంతిహోమాలు అవసరాలా ? ఆడంబరాలా ? 

   ప్రపంచ దేశాలు మన దేశానికి మోకరిల్లేది మన ఆర్ధిక సంపదను చూచి కాదు , ఆధ్యాత్మిక సంపద చూచే . అది మనకు వేద ప్రమాణమైనది. అనంతమైనది. మానవుని ఆనంద  జీవనమునకు రెండు మార్గములున్నవి.             1. సంసార రహితుడై ముని వృత్తి తో మోక్షమును వెదకుట.(ఇది అలౌకికా నందము ) 2. సంసారాపేక్షతో కన్యను వెదకి పాణిగ్రహణము చేసికొని సత్సంతానముతో ఆరారోగ్యభోగ భాగ్యములతోబాటు కష్టనష్టములను అనారోగ్యముల ననుభవించుచు పరమాత్ముని తలచుకొను జీవనము. (ఇదిలౌకికానందము) మనము ఆరోగ్య భోగభాగ్యాలతో నుండవలెనన్న తప్పక దైవబలము మనకు కావలసినదే. టానిక్కులు త్రాగి , వ్యాయామాలు చేస్తే సరిపోయేదానికి ఆ కనపడని దేవుని తో పనే ముంది ? అని అడిగే వారికి  నా శతకోటి నమస్సులు. ఈ చర్చ ప్రస్తుతమప్రస్తుతము. 
     కొందఱు మన సంప్రదాయాలను తక్కువగా చూచి హేళన చేస్తూ షష్టి పూర్తి, సహస్ర చంద్రదర్శన శాంతి హోమము మొదలగు క్రతువులు ఆడంబరమనే అనవచ్చును. కానీ నమ్మిన వారికి  నమ్మినంత మహాదేవ. వాని వలన తప్పక ప్రయోజనము కలదని నా విశ్వాసము . శాస్త్ర వచనము . మనిషి పుట్టినదాది మరణము వరకు తెలిసో , తెలియకో పాపపుణ్యములు చేస్తాడు . పుణ్య ఫలముగా సుఖములు , పాపఫలముగా కష్టముల ననుభవిస్తాడు . పుట్టిన సంవత్సరము  నుండి మరల అదే  సంవత్సరము వరకు 59 యేండ్లు నిండి 60 కి వస్తాడు . అప్పటికి జీవితాన  ఒక ఆవృత్తి పూర్తి  అవుతుంది.  దీనినే  ఉగ్రరథ శాంతి , లేక షష్టి పూర్తి  మహోత్సవమంటారు.  ఈ సమయంలోనే భగవంతునకు కృతఙ్ఞతలు చెప్పి మన పాపముల పరిహారము కొరకు చేసికొను విన్నపములే ఈ శాంతిహోమములు . క్రతువులు. ఈ క్రతువులే చేయనవసరం లేదు. ఏ అనాథ  శరణాలయాలకో , పేదవారిదగ్గర కో  కూడా వెళ్లి వారికి తగిన సహాయమందించినా  పాప పరిహారమే అవుతుంది. కాకుంటే బంధువర్గమంతా కలసియుండుటకు ఇదొక మార్గము.
    ఏకాదశ రుద్రులందరికి తెలిసిన వారే. వీరుకాక రుద్రులు శతాధికముగా ఉన్నారు. రుద్రుడు లయకారుడు. మన పాపములను లయము చేయుమని రుద్రుని కోరుతూ కార్తిక మాసములో ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేస్తాము.  రుద్రులలో కొందరు శాంత, మరి కొందఱు ఉగ్ర స్వభావాలతో ఉందురట. అట్టి వాడే ఉగ్రరథుడను రుద్రుడు. 60. ఏండ్లు నిండిన వారికి ప్రాణాపాయమో , అనారోగ్యమో కలిగించునట .దానికి పరిహారము గా  ఉగ్రరథ  శాంతి అవసరము. అట్లే 70. యేండ్లు నిండిన వారికి భీమరథ శాంతి , 78 ఏండ్లకు విజయరథ శాంతి , 83.యేండ్ల 4 నెలలకు .( 1000  పూర్ణిమలు ) సహస్ర చంద్ర దర్శనమహోత్సవము, 100 సంవత్సరములు నిండిన వారికి పూర్ణ శతాభిషేకము చేయించుకోవాలి. ఈ క్రతువులను కేవలము సంతామే చేయవలసిన అవసరము లేదని, స్వయముగా ఆ దంపతులే చేసికొన వచ్చునని విజ్ఞులు తెలియజేసారు. 
    మానవుడు  దైనందిన కార్యక్రమములలో మునిగి ఆలోచనలో ఉండి ఆచరించలేక పోయిన , దాన ధర్మాది కార్యములు , క్రతువులు ఈ సమయము లో బంధువుల ఆప్యాయతాను రాగముల మధ్యన చేసికొనిన పెద్దల , వేద విదుల, పండితుల దీవనలు లభించి ఆ దంపతులకు మెరుగైన ఆయురారోగ్యములు , భోగ భాగ్యములు చేకూరును. ఆధ్యాత్మిక భావనలు పెరిగి దైవకృప అధికమగును.  చరమాంకమున ఏ ప్రాణికైనను కావలసినది అదేకదా . 
      శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం ... అనగా శరీరమే అన్ని ధర్మ కార్యముల సాధనకు మూలమైనది . దానిని కాపాడుకొనుటకు జాగ్రత్తగా ఔషధ సేవ చేస్తూ తగిన వ్యాయామములు చేయవచ్చు ననుకొనిన, అవి మానవ ప్రయత్నాలే . ప్రతి మానవ ప్రయత్నానికి తప్పక దైవ సంకల్పం కావాలి. దైవిక కార్యక్రమములన్ని ఒక మహోన్నత లక్ష్యముతో ఏర్పాటు చేసినవే నిస్సందేహముగా. 
   ది . 27.12 2018. న నాకత్యంత ప్రియతమాగ్రజుడు , సాహితీప్రియుడు అయిన శ్రీయుతులు పొన్నెకంటి భవానీపతి రావు గారి సహస్ర చంద్ర దర్శన శాంతి హోమమునకు వెళ్ళుట జరిగినది . 84 యేండ్ల వయసులో కూడ ఏంతో  ఓపిక , సహనము, భక్తి భావనాపూరితమైన చిరునవ్వుతో అపర భవానీపతి లాగానే కనిపించాడు. ఇక మా వదిన గారు హనుమాయమ్మగారు. అపర సాహితీమూర్తి , అవ్యాజ ప్రేమమయి, బంధుప్రీతి కల యిల్లాలు. వారి అన్యోన్య జీవన విధానము ఆదర్శప్రాయము. ఆమె పలకరింపులోనే ప్రేమానురాగాలు  తొంగిచూస్తాయి . వారి ప్రథమ పుత్రుడే చిరంజీవి శివ ప్రసాద్. ఆతని సదాలోచనను ఆతని భార్య ,  సోదర సోదరీమణులు, కుటుంబ సభ్యులందరు కలసి ఆమోదించి  సహస్ర రజత కమలములతో వారికి పాద పూజ( రజతములే కాక మామూలు వానితో చేసినను ) చేయుట ఆ దంపతుల పూర్వజన్మ సుకృత ఫలమో, తలిదండ్రులు  శతాధిక వసంతాలు ఆయురారోగ్యాలతో నుండి తమకు వెన్నుదన్నుగా నుండవలెనని సదాశయమో , ఆస్తుల కొరకు కన్న తల్లిదండ్రులనే  కసాయిగా  కడతేర్చు ద్విపాద పశువులకు  కొంత ఆదర్శము గా నుండు కొరకో , తలిదండ్రులపై అవ్యాజ ప్రేమానులాగాలో నిర్ణయించుట కష్టమే. ఏది ఏమైనను భవానీ పతి రావు అన్నయ్య , వదిన గారి వలన సంతానము , సంతానము వలన వారు  ఎంతో అభినందనీయులు. సదాశయము, సత్కార్యాచరణ, భక్తి భావనలు, దానధర్మములొనర్చుట, ధార్మిక జీవనము, సాంఘిక బాధ్యతలు మానవుని మహోన్నతుని చేస్తాయనుటలో సందేహములేదు . మానవ జన్మ సార్ధకతకు ఇంతకన్నా కావలసిన దేముంది?  . ఈ కార్యక్రమ చిత్రములు పైన కలవు  , వీడియోలను తదుపరి  పొందుపరచగలను . శుభం భూయాత్ .         
       

      

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...