కార్మిక సంక్షేమం.psn.
1. కార్మిక జీవనంబిలను కష్టమటంచును నెంచకే, సదా
ధర్మ నిబద్ధతన్నిలిపి ధైర్యసమంచిత మానసంబునన్
మర్మమొకింతలేక యజమానికి సంపదగూర్చు మా పురా
కర్మఫలంబదేమొ మముగావగ వారికిజేయిరాదొకో!
2. గనులలోతుల బ్రతుకులు గడుపుచుండి
కొండలన్నియు బిండిగ గొట్టుచుండి
మట్టమధ్యాహ్నమైనను మడులుదున్ని
కూర్చవలయును లాభాల గోట్లకొలది.
3. అడవిబుట్టిన కతమున నచటి సిరులు
సేకరించుటె మాపని, చేతివాట
ము సలుపు ప్రబుద్ధు లెందఱో మూగిమమ్ము
దోచుకొందురు నిలువెల్ల దొరలుగాను.
4. రైతు సంక్షేమ పథకాలు రకరకాలు
గనులజనులకు హామీల కరువులేదు.
నీటిపైవ్రాయు నక్షర కోటివోలె
నొక్కటైనను గనరాదు బక్కకెపుడు.
5. ఘర్మజలములుతనువెల్ల గ్రక్కుచుండు
కర్మజీవికి మేలును గలుగజేయ
నుద్యమింపుడు సంక్షేమమూతమిచ్చి
దొరలు ! నిరుపేద రక్తంబుదోచకుండ.
స్వీయ రచన.. పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
భాగ్యనగరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి