15, జులై 2019, సోమవారం

బట్టతల నష్టాలు. చింతా వారిని గూర్చి స్పందన, బట్టతల నష్టాలు.

   

చింతా రామకృష్ణారావు గారి పద్యాలకు స్పందన. 9.11.17.

 రాముడు కృష్ణుడుం గలసి రాగవిశేషత రమ్యమూర్తులై
 నామమదొక్కటై వెలసి నవ్యవిభాసిత దివ్యతేజముం
 బ్రేమగ సోదరుండగుచు పెన్నిధియై లభియించియుండుట
 న్నామొగమట్లెతోచు పరమాదరమేదురమాధురీవిధిన్.
        నాకారాముడు సర్వము,
        శ్రీకారముతోడనున్న చెల్వగు శక్తుల్
        ప్రాకారమౌచు నిలచును
        సాకేతవిభుని పదముల శరణనసతమున్
 పూర్వ జన్మల లేశంపు పుణ్యఫలమొ
 సద్గురు విమల బోధల సారతరమొ
 నాదు సన్మిత్రవర్యుల స్వాదుమతియొ
 ప్రేరణంగూర్చెశ్రీరాము బిల్చునటుల.

   పంది,చేప,కోడిపెట్ట,కప్ప.....బ్రహ్మణ భోజనం. దత్తపది.

  ఒక ఆకుపై మరొక ఆకు కప్పి భోజనం తీసికొని వచ్చినపుడు.

   "కప్ప"బడినట్టి ఆకును కడగనుంచి
   పట్టుబట్టుటకూ"పంది"వహ్వయనుచు
   నాప"కోడి పెట్ట"క యేమి నంజుడనుచు 
   "చేప"రిధిచల్లె నీరము శిరమువంచి.

 సందీపశర్మ  మనమున
 సందేహములన్నిదీర్చి సారసపదముల్
 ఛందోబద్ధముజేయగ
 విందుంజేకూర్చిరచట విజ్ఞతమిగులన్.

శారద నాట్యమాడెనట చక్కగ పండితజిహ్వరూపియై
పారెను సాహితీసుధలు భావపరీమళ కంఠసీమలన్
మారెసభాంతరాళముసమాజ్ఞిత హాసవిలాసదీప్తులన్
తీరె విరించిగారికల  తేటతెనుంగవధానసత్కళన్.

 మీసము ద్రిప్పుచున్ మిగులరోసముమీర
                సీసమువ్రాసెడు  చేవమీది
 "మా సములున్నచో మన్నన గూర్తునన్"
                అసమానవినయంపుటంశమీది
 ప్రతినలజేయకే పరమార్థమిదియంచు
               నవ్వులు చిందించునయముమీది
 దోసమొకింతకాదోయియటంచును
                నిమ్మకాయలనిల్పు నేర్పుమీది     
    భళిర! చిత్రకవివతంస!బ్రహ్మతేజ!
    రామకృష్ణుల సద్రూప రమ్యచరిత!   
    దివ్యగుణధామ మానితధీవిశాల!
    చింత వంశంపు రత్నమా! స్నేహశీల!


 "మా సములెవ్వరుండ"రని మండపమందునహంకరించినన్
 మీసముద్రిప్పగావలయు, మిమ్మవమానముజేయజూచిన్
 మీసము మెల్చగావలెను, మీరినబల్కులనేరుబల్కినన్
 మీసముద్రిప్పిరోసమును మిక్కిలి జూపుటె పౌరుషంబహో!!

కృష్ణస్వామి చిత్రానికి స్పందన.

 తల్లారమందునతనలేత కిరణాల
             కబురులాడగవచ్చు కర్మసాక్షి
 పచ్చదనములిల పరచుచు గ్రామాన
              ఉత్సాహమందించు నుద్భిజాళి
 ఎటువైపు జూచిన ఎర్రటి మట్టితో
               కనువిందుగలిగించు కాలిబాట
 ఆలయంబులిచట హ్లాదంబుజేగూర్చ
                ఆధ్యాత్మశోభలనందగించె
   ప్రకృతి సౌందర్య మిచ్చోట పరిఢవిల్ల
   మీదు కుంచియ కదలాడె మించుగరిమ
   కృష్ణ స్వామిరో! మనసున తృష్ణదీర
   దెంత పొగడిన చిత్రంబు ధీవిశాల!.

 బట్టతల గురించి పద్యం.

   సీ..తాతని పిలుచుచు తనవారు పెరవారు
                ఎగతాళి జేయుదురింటబయట
     వరునిగ ప్రకటింప వయ్యారి వధువులే
                పెడమోము జూపింత్రు దడవకుండ
    ఎండకు వానకు నెంత జాగ్రతయున్న
              చురుకుమనుచు, నాని సోషపడును
    కేశాలు మొలిపించ క్లేశంబు తప్పదు
                 లక్ష్యంబు నెరవేర లక్షలగును
 ఆ.వె. వంశలక్షణంబె వయసు చిన్నదనుచు
          ఎన్ని సాక్ష్యములిల యున్నగాని
          బట్టనెత్తియున్న బాధలు తప్పవు
          మన్మథునికినైన మహినిజూడ.

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...