15, జులై 2019, సోమవారం

సర్కారు బళ్ళు. జెజెయస్., పి.యస్.యన్.

సర్కారు బళ్ళు, చదువుల గుళ్ళు.

1.  పరమ నిర్లక్ష్య వైఖరి న్బరగు బడుల
      పేదసాదల బిడ్డలే ఖేదమోద
      ములను సహియించి భరియించి ముద్దుగూర్చు
     చదువుగుడులంచు భావించి చదువుచుంద్రు.
      2.  పైకప్పులూడుచు పరమభీతినిగొల్ప
                          కట్టించునాధుడు కానరాడు
      కూర్చుండపంతులు కుర్చీలు లేకున్న
                        అడిగెడు వ్యక్తియే యవనిలేడు
      మధ్యాహ్నభోజన మంతయు దిగమ్రింగ
                               ఏదనిప్రశ్నించ నెవడులేడు
      అభివృద్ధి పధకాల నంకెల జూపంగ
                               నిగ్గునుదేల్చగ నెవడు రాడు
      ఇట్టి దుర్దశగల్గిన హేయమైన
      బడులె నిరుపేద విద్యార్థి గుడులుగాగ
      మంత్రివర్యుల యధికార్ల మనసుమార్చ
      రండు జనులార! మేల్కొని దండువోలె.
 3.  బల్లలు లేవులేవుపసిపాపలు కూర్చొని మోదమందగన్
      పల్లముగాన నయ్యెడల వర్షపునీరదె తొంగిచూచెడున్
      తెల్లనిసుద్దముక్కకును తీరని కోరిక పంతులమ్మకున్
      కల్లగసాగుచుండెనధికారుల పాలితపాఠశాలలే.
 4.  తామె పథకాల యమలులో ధర్మకర్మ
       బద్ధులపగిది నిరతంబు పాటబాడి
       బాలబాలురె రేపటి భవితటంచు
       కరుణజూపరు ఘనులు సర్కారుబడుల.
 5.   ఉండవు శౌచశాలలటు లుండవు చాలిన యాటవస్తువుల్
       ఉండవు మంచినీరములటుండవు చక్కని వ్రాతబల్లలున్
       ఉండవు సుద్దముక్కలు మహోన్నత నేతల చిత్రరాజముల్
       ఉండవు పాఠశాలల ప్రభుత్వపు నేతల శ్రద్దలేమిచే.
 6.   కావలె మంత్రివర్యుల వికాసపు జ్ఞాన విశేష దీధితుల్
       కావలె నీతిమంతమగు కమ్మనిపాలన దేశమంతటన్
       కావలె శ్రద్ధ విద్యపయి గాంధిజి కోరిన పాఠశాలలన్
       రావలె మంచిరోజులు వరాలనుజిమ్మగ పేదసాదకున్.

      జె.జె.యస్. పద్యాలు.
1.చదువ వ్రాయనేర్పి సన్మార్గమున్జూపి
    సంఘమందు మెలగు సరళిదెల్పి
    జ్ఞాననేత్రమొసగి కాపాడుచుండెడి
    విద్యనేర్చు నతడు విజ్ఞుడగును.
2. చదువె విద్యావినయముల సాధకంబు
    గురులె దైవాలు చదువులగుడులె బడులు
    నీతినియమాలు నేర్వంగ నెలవులగుచు
    కామితమ్ములుదీర్చు సర్కారు బడులు.
3. పల్లెప్రాంతమునుండి బడిజేరువారికై
                  బస్సుసౌకర్యముల్ లెస్సగూర్చు
    తరతమభావాలు దరిజేరనీయక
                   ఏకరూపమయిన వేషమొసగు
    చదువులు నేర్వంగ చక్కగా పుస్తకాల్
                   ఉచితమ్ముగానిచ్చు నుచితరీతి
     మధ్యాహ్నవేళలన్ మరలిపోనీయక
                     పౌష్టికాహారాన తుష్టిగూర్చు
     ఇట్టి బహుళార్ధదములందు బట్టువిడక
     చదివి సంస్కారయుతులౌచు సాగిపొండు
     తాతతండ్రులు చదివిన తావు విడచి
     పుట్టగొడుగులవలె నేడు పుట్టుచున్న
     వివిధ సంస్థలజేరంగ వెఱ్ఱితనము
     చేరరారండు! మీరు సర్కారు బడుల.
4. ప్రభుత నడిపెడి సర్కారు బడులజదువ
    బడయనగు సీటు గురుకుల పాఠశాల
    యందు,వాస్తవంబిదిగాన ఆదినుండి
    చేరరారండు!మీరు సర్కారు బడుల.
 5. చక్కగనాడుకోదగ విశాల మనోహర ప్రాంగణమ్మునన్
     రొక్కము కోరకుండగ పురోగతిజూపెడి విద్యబొందగా
     చక్కని బోధనాపటిమ జాటు సుశిక్షితదేశికాళితో
     పెక్కుగనిల్చె నీ ప్రభుత విద్యల నేర్వుడు పాఠశాలలన్

                              (జయరాం)
 
      1.  ఉచితమైనవిద్య, ఉత్తమబోధకుల్
           ఉన్న ప్రభుతబడుల నుత్సుకతన
           పేదవారు సతము ప్రియమారజేర్పింత్రు
           చదువుగుడియనంగ సంతసాన. 
 2.   ఉండవు రాజకీయములటుండవుజీవనడాంబికంబులున్
       ఉండవు భారమై యెపుడు నూహకునందని ఫీజులచ్చటన్
       ఉండవు హెచ్చుతగ్గులు, మహోధృత ఠీవులు చెల్లవచ్చటన్
       అండగనుందురందరును హాయి దలిర్పగ పాఠశాలలన్. 
 3.  చదువకోర్కెలున్న సాధింప సిరిలేక
      బాధచెందు వివిధ బాలలకును
      సాయమీయనెంచి సర్కారు బడులునాన్
      అన్నమిడుచు చదువులందజేసె.
 4.   సగటు మానవజీవన సంపదలను
        పెంచిపోషించి జ్ఞానంబు వృద్ధిజేయ
        పాఠశాలల నెలకొల్పె ప్రభుత నేడు
        సకల సౌకర్య మార్గాలు సంతరించి.
5.  చదువుల గుళ్ళలో సతము  సారసమన్విత జ్ఞానపూర్ణమై
      సదమల విద్యనేర్పగల స్వచ్ఛ గుణాంచిత బోధకాగ్రణుల్
      ముదమునుజెంద బాలలకు ముచ్చటగూర్చెడు నాటవస్తువుల్
      అదనుగజేర్చుటం బ్రభుత హ్లాదమునందిరి పేదలందరున్.
 6.  సర్కారు బడిలోన చదివెడు విద్యార్థి 
                              విజ్ఞాన వీధిలో వెల్గులీన
      యాత్రలజేయించు యత్నాన గోరగ
                  పయనంపురాయితీ పరగజేసి
      పాఠ్యగ్రంథచయము బాలలకొరకునై
                పంచుచుండునటుల బాధ్యులగుచు
       సాంకేతికంబుగా చక్కగ నెదుగంగ
                   దర్శనయంత్రాల తామెగూర్చి
        ప్రభుత పాలించుచుండుట పరమవరము
        అట్టి వరమున ప్రజలెల్ల హ్లాదమంది
        మట్టిబుట్టిన రత్నాలు, మణులవోలె
        దేశదేశాల రోచిష ధిషణజూపు.
          (పొన్నెకంటి)

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...