15, జులై 2019, సోమవారం

కార్మిక సంక్షేమం.PSN



    కార్మిక సంక్షేమం.psn.

  1. కార్మిక జీవనంబిలను కష్టమటంచును నెంచకే, సదా
      ధర్మ నిబద్ధతన్నిలిపి ధైర్యసమంచిత మానసంబునన్
      మర్మమొకింతలేక యజమానికి సంపదగూర్చు మా పురా
      కర్మఫలంబదేమొ మముగావగ వారికిజేయిరాదొకో!

  2. గనులలోతుల బ్రతుకులు గడుపుచుండి
      కొండలన్నియు బిండిగ గొట్టుచుండి
      మట్టమధ్యాహ్నమైనను మడులుదున్ని
       కూర్చవలయును లాభాల గోట్లకొలది.

  3.  అడవిబుట్టిన కతమున నచటి సిరులు
       సేకరించుటె మాపని, చేతివాట
       ము సలుపు ప్రబుద్ధు లెందఱో మూగిమమ్ము
       దోచుకొందురు నిలువెల్ల దొరలుగాను.

  4. రైతు సంక్షేమ పథకాలు రకరకాలు
      గనులజనులకు హామీల కరువులేదు.
      నీటిపైవ్రాయు నక్షర కోటివోలె
      నొక్కటైనను గనరాదు బక్కకెపుడు.

  5. ఘర్మజలములుతనువెల్ల గ్రక్కుచుండు
       కర్మజీవికి మేలును గలుగజేయ
       నుద్యమింపుడు సంక్షేమమూతమిచ్చి
      దొరలు ! నిరుపేద రక్తంబుదోచకుండ.

         స్వీయ రచన.. పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
                                   భాగ్యనగరం.

     
     
        

భయం

                                       భయం.

          మనం దేనిని గురించి భయపడతామో
          అది తప్పక మన వెంటే పడుతుంది
          ఏ ప్రాణి కైనా మొదటి భయం చావు
          అది ఎంతకాలానికైనా అనివార్యమే!

      సృష్టి తో సమానంగా పుట్టిందే చావు
      దానికి ఏనాడు భయపడకు నీవు
     చావెక్కడో ఎప్పుడో తెలియదు,అందుకే
     చలాకీగా, ధైర్యంగా చరించు ముందుకే

     బుల్లితనువులో ఆడేశ్వాస, కొల్లగచేయును సంబరం
     అకస్మాత్తుగా ఆగే శ్వాస, మెల్లగచేరును అంబరం
     ఆగబోయే శ్వాసకోసం, అంతరంగపు వ్యధ దుర్భరం
     ఆగటం వింతకాదని చింతలేనటులుండటం మహాద్భుతం

     పిరికితనమే చావంట, ప్రత్యామ్నాయం లేదంట
     చావును నిరతం ప్రక్కకునెట్టే  చక్కని యోగం మనదంట
     జీవితకాలం కష్టసుఖాలు, పరమార్ధపు వరసఖులంట
     మానవజీవన రథచక్రాలు, చావుపుట్టుకల జంటంట.

      మనసును మెల్లగ మారుస్తు ధైర్యం చెంతకు చేరుస్తు
      పిరికితనమే చావంట, ప్రత్యామ్నాయం లేదంట
     చావును నిరతం ప్రక్కకునెట్టే  చక్కని యోగం మనదంట
     జీవితకాలం కష్టసుఖాలు, పరమార్ధపు వరసఖులంట

     మానవజీవన రథచక్రాలు, చావుపుట్టుకల జంటంట.
      చావు పదానికి స్వస్తిని పలికి, లావే మేలని భావిస్తు
      పురోగమించు పురోగమించు పున్నమివెన్నెల పూయించు
      జీవితమంతా శోధించు, సత్ఫలతతినే సాధించు.

సర్కారు బళ్ళు. జెజెయస్., పి.యస్.యన్.

సర్కారు బళ్ళు, చదువుల గుళ్ళు.

1.  పరమ నిర్లక్ష్య వైఖరి న్బరగు బడుల
      పేదసాదల బిడ్డలే ఖేదమోద
      ములను సహియించి భరియించి ముద్దుగూర్చు
     చదువుగుడులంచు భావించి చదువుచుంద్రు.
      2.  పైకప్పులూడుచు పరమభీతినిగొల్ప
                          కట్టించునాధుడు కానరాడు
      కూర్చుండపంతులు కుర్చీలు లేకున్న
                        అడిగెడు వ్యక్తియే యవనిలేడు
      మధ్యాహ్నభోజన మంతయు దిగమ్రింగ
                               ఏదనిప్రశ్నించ నెవడులేడు
      అభివృద్ధి పధకాల నంకెల జూపంగ
                               నిగ్గునుదేల్చగ నెవడు రాడు
      ఇట్టి దుర్దశగల్గిన హేయమైన
      బడులె నిరుపేద విద్యార్థి గుడులుగాగ
      మంత్రివర్యుల యధికార్ల మనసుమార్చ
      రండు జనులార! మేల్కొని దండువోలె.
 3.  బల్లలు లేవులేవుపసిపాపలు కూర్చొని మోదమందగన్
      పల్లముగాన నయ్యెడల వర్షపునీరదె తొంగిచూచెడున్
      తెల్లనిసుద్దముక్కకును తీరని కోరిక పంతులమ్మకున్
      కల్లగసాగుచుండెనధికారుల పాలితపాఠశాలలే.
 4.  తామె పథకాల యమలులో ధర్మకర్మ
       బద్ధులపగిది నిరతంబు పాటబాడి
       బాలబాలురె రేపటి భవితటంచు
       కరుణజూపరు ఘనులు సర్కారుబడుల.
 5.   ఉండవు శౌచశాలలటు లుండవు చాలిన యాటవస్తువుల్
       ఉండవు మంచినీరములటుండవు చక్కని వ్రాతబల్లలున్
       ఉండవు సుద్దముక్కలు మహోన్నత నేతల చిత్రరాజముల్
       ఉండవు పాఠశాలల ప్రభుత్వపు నేతల శ్రద్దలేమిచే.
 6.   కావలె మంత్రివర్యుల వికాసపు జ్ఞాన విశేష దీధితుల్
       కావలె నీతిమంతమగు కమ్మనిపాలన దేశమంతటన్
       కావలె శ్రద్ధ విద్యపయి గాంధిజి కోరిన పాఠశాలలన్
       రావలె మంచిరోజులు వరాలనుజిమ్మగ పేదసాదకున్.

      జె.జె.యస్. పద్యాలు.
1.చదువ వ్రాయనేర్పి సన్మార్గమున్జూపి
    సంఘమందు మెలగు సరళిదెల్పి
    జ్ఞాననేత్రమొసగి కాపాడుచుండెడి
    విద్యనేర్చు నతడు విజ్ఞుడగును.
2. చదువె విద్యావినయముల సాధకంబు
    గురులె దైవాలు చదువులగుడులె బడులు
    నీతినియమాలు నేర్వంగ నెలవులగుచు
    కామితమ్ములుదీర్చు సర్కారు బడులు.
3. పల్లెప్రాంతమునుండి బడిజేరువారికై
                  బస్సుసౌకర్యముల్ లెస్సగూర్చు
    తరతమభావాలు దరిజేరనీయక
                   ఏకరూపమయిన వేషమొసగు
    చదువులు నేర్వంగ చక్కగా పుస్తకాల్
                   ఉచితమ్ముగానిచ్చు నుచితరీతి
     మధ్యాహ్నవేళలన్ మరలిపోనీయక
                     పౌష్టికాహారాన తుష్టిగూర్చు
     ఇట్టి బహుళార్ధదములందు బట్టువిడక
     చదివి సంస్కారయుతులౌచు సాగిపొండు
     తాతతండ్రులు చదివిన తావు విడచి
     పుట్టగొడుగులవలె నేడు పుట్టుచున్న
     వివిధ సంస్థలజేరంగ వెఱ్ఱితనము
     చేరరారండు! మీరు సర్కారు బడుల.
4. ప్రభుత నడిపెడి సర్కారు బడులజదువ
    బడయనగు సీటు గురుకుల పాఠశాల
    యందు,వాస్తవంబిదిగాన ఆదినుండి
    చేరరారండు!మీరు సర్కారు బడుల.
 5. చక్కగనాడుకోదగ విశాల మనోహర ప్రాంగణమ్మునన్
     రొక్కము కోరకుండగ పురోగతిజూపెడి విద్యబొందగా
     చక్కని బోధనాపటిమ జాటు సుశిక్షితదేశికాళితో
     పెక్కుగనిల్చె నీ ప్రభుత విద్యల నేర్వుడు పాఠశాలలన్

                              (జయరాం)
 
      1.  ఉచితమైనవిద్య, ఉత్తమబోధకుల్
           ఉన్న ప్రభుతబడుల నుత్సుకతన
           పేదవారు సతము ప్రియమారజేర్పింత్రు
           చదువుగుడియనంగ సంతసాన. 
 2.   ఉండవు రాజకీయములటుండవుజీవనడాంబికంబులున్
       ఉండవు భారమై యెపుడు నూహకునందని ఫీజులచ్చటన్
       ఉండవు హెచ్చుతగ్గులు, మహోధృత ఠీవులు చెల్లవచ్చటన్
       అండగనుందురందరును హాయి దలిర్పగ పాఠశాలలన్. 
 3.  చదువకోర్కెలున్న సాధింప సిరిలేక
      బాధచెందు వివిధ బాలలకును
      సాయమీయనెంచి సర్కారు బడులునాన్
      అన్నమిడుచు చదువులందజేసె.
 4.   సగటు మానవజీవన సంపదలను
        పెంచిపోషించి జ్ఞానంబు వృద్ధిజేయ
        పాఠశాలల నెలకొల్పె ప్రభుత నేడు
        సకల సౌకర్య మార్గాలు సంతరించి.
5.  చదువుల గుళ్ళలో సతము  సారసమన్విత జ్ఞానపూర్ణమై
      సదమల విద్యనేర్పగల స్వచ్ఛ గుణాంచిత బోధకాగ్రణుల్
      ముదమునుజెంద బాలలకు ముచ్చటగూర్చెడు నాటవస్తువుల్
      అదనుగజేర్చుటం బ్రభుత హ్లాదమునందిరి పేదలందరున్.
 6.  సర్కారు బడిలోన చదివెడు విద్యార్థి 
                              విజ్ఞాన వీధిలో వెల్గులీన
      యాత్రలజేయించు యత్నాన గోరగ
                  పయనంపురాయితీ పరగజేసి
      పాఠ్యగ్రంథచయము బాలలకొరకునై
                పంచుచుండునటుల బాధ్యులగుచు
       సాంకేతికంబుగా చక్కగ నెదుగంగ
                   దర్శనయంత్రాల తామెగూర్చి
        ప్రభుత పాలించుచుండుట పరమవరము
        అట్టి వరమున ప్రజలెల్ల హ్లాదమంది
        మట్టిబుట్టిన రత్నాలు, మణులవోలె
        దేశదేశాల రోచిష ధిషణజూపు.
          (పొన్నెకంటి)

రమణమూర్తి గారికి కృతజ్ఞతలు.

రమణమూర్తి గారికి కృతజ్ఞతలు.

1. ప్రేమమీరంగ శుభములు క్షేమములను
    సాదరంబుగ గోరెడు సన్నిహితుడ!
    అమరనాథుని సత్కృప యాత్రలన్ని
    విజయవంతము జేతు మవిఘ్నముగను.
 2. తల్లి వైష్ణవిమాతను తనివిదీర
     కన్నులంగాంచు పున్నెంబు గల్గుననగ
     మానసిక మైననుద్వేగ మధురిమలను
     తెలుపలేకుంటి పలుకుల ధీవిశాల!
 3. ప్రముఖ కాశ్మీరు ప్రాంతంబు పాఠ్యమవగ
     చెప్పియుంటిని. దానిని గప్పియున్న
     మంచుసోయగమంతయు మరులుగొల్ప
     కాంచు భాగ్యంబు నాకిటు గలిగె హితుడ!
4. ఎప్పుడేమేమి జరుగునో యెరుగలేము
    జన్మమెత్తినదాదిగా జగతియందు
    చేరవచ్చినదానిని చెలిమితోడ
    స్వాగతించుటయొక్కటె సాధ్యమగును.
 5. అనుభవాలను మనసున నణచియుంచి
     చూచి వచ్చిన స్థలముల శోభలన్ని
     అక్షరంబుగ లిఖియింతు హ్లాదమొప్ప
     సుందర రమణుని నెయ్యంపు స్ఫూర్తివలన.

బట్టతల నష్టాలు. చింతా వారిని గూర్చి స్పందన, బట్టతల నష్టాలు.

   

చింతా రామకృష్ణారావు గారి పద్యాలకు స్పందన. 9.11.17.

 రాముడు కృష్ణుడుం గలసి రాగవిశేషత రమ్యమూర్తులై
 నామమదొక్కటై వెలసి నవ్యవిభాసిత దివ్యతేజముం
 బ్రేమగ సోదరుండగుచు పెన్నిధియై లభియించియుండుట
 న్నామొగమట్లెతోచు పరమాదరమేదురమాధురీవిధిన్.
        నాకారాముడు సర్వము,
        శ్రీకారముతోడనున్న చెల్వగు శక్తుల్
        ప్రాకారమౌచు నిలచును
        సాకేతవిభుని పదముల శరణనసతమున్
 పూర్వ జన్మల లేశంపు పుణ్యఫలమొ
 సద్గురు విమల బోధల సారతరమొ
 నాదు సన్మిత్రవర్యుల స్వాదుమతియొ
 ప్రేరణంగూర్చెశ్రీరాము బిల్చునటుల.

   పంది,చేప,కోడిపెట్ట,కప్ప.....బ్రహ్మణ భోజనం. దత్తపది.

  ఒక ఆకుపై మరొక ఆకు కప్పి భోజనం తీసికొని వచ్చినపుడు.

   "కప్ప"బడినట్టి ఆకును కడగనుంచి
   పట్టుబట్టుటకూ"పంది"వహ్వయనుచు
   నాప"కోడి పెట్ట"క యేమి నంజుడనుచు 
   "చేప"రిధిచల్లె నీరము శిరమువంచి.

 సందీపశర్మ  మనమున
 సందేహములన్నిదీర్చి సారసపదముల్
 ఛందోబద్ధముజేయగ
 విందుంజేకూర్చిరచట విజ్ఞతమిగులన్.

శారద నాట్యమాడెనట చక్కగ పండితజిహ్వరూపియై
పారెను సాహితీసుధలు భావపరీమళ కంఠసీమలన్
మారెసభాంతరాళముసమాజ్ఞిత హాసవిలాసదీప్తులన్
తీరె విరించిగారికల  తేటతెనుంగవధానసత్కళన్.

 మీసము ద్రిప్పుచున్ మిగులరోసముమీర
                సీసమువ్రాసెడు  చేవమీది
 "మా సములున్నచో మన్నన గూర్తునన్"
                అసమానవినయంపుటంశమీది
 ప్రతినలజేయకే పరమార్థమిదియంచు
               నవ్వులు చిందించునయముమీది
 దోసమొకింతకాదోయియటంచును
                నిమ్మకాయలనిల్పు నేర్పుమీది     
    భళిర! చిత్రకవివతంస!బ్రహ్మతేజ!
    రామకృష్ణుల సద్రూప రమ్యచరిత!   
    దివ్యగుణధామ మానితధీవిశాల!
    చింత వంశంపు రత్నమా! స్నేహశీల!


 "మా సములెవ్వరుండ"రని మండపమందునహంకరించినన్
 మీసముద్రిప్పగావలయు, మిమ్మవమానముజేయజూచిన్
 మీసము మెల్చగావలెను, మీరినబల్కులనేరుబల్కినన్
 మీసముద్రిప్పిరోసమును మిక్కిలి జూపుటె పౌరుషంబహో!!

కృష్ణస్వామి చిత్రానికి స్పందన.

 తల్లారమందునతనలేత కిరణాల
             కబురులాడగవచ్చు కర్మసాక్షి
 పచ్చదనములిల పరచుచు గ్రామాన
              ఉత్సాహమందించు నుద్భిజాళి
 ఎటువైపు జూచిన ఎర్రటి మట్టితో
               కనువిందుగలిగించు కాలిబాట
 ఆలయంబులిచట హ్లాదంబుజేగూర్చ
                ఆధ్యాత్మశోభలనందగించె
   ప్రకృతి సౌందర్య మిచ్చోట పరిఢవిల్ల
   మీదు కుంచియ కదలాడె మించుగరిమ
   కృష్ణ స్వామిరో! మనసున తృష్ణదీర
   దెంత పొగడిన చిత్రంబు ధీవిశాల!.

 బట్టతల గురించి పద్యం.

   సీ..తాతని పిలుచుచు తనవారు పెరవారు
                ఎగతాళి జేయుదురింటబయట
     వరునిగ ప్రకటింప వయ్యారి వధువులే
                పెడమోము జూపింత్రు దడవకుండ
    ఎండకు వానకు నెంత జాగ్రతయున్న
              చురుకుమనుచు, నాని సోషపడును
    కేశాలు మొలిపించ క్లేశంబు తప్పదు
                 లక్ష్యంబు నెరవేర లక్షలగును
 ఆ.వె. వంశలక్షణంబె వయసు చిన్నదనుచు
          ఎన్ని సాక్ష్యములిల యున్నగాని
          బట్టనెత్తియున్న బాధలు తప్పవు
          మన్మథునికినైన మహినిజూడ.

డా. సర్వా సీతారామ చిదంబర శాస్త్రి

సుహృన్మితృలు డా. సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారికి, (డా.రామడుగు వేంకటేశ్వర శర్మ గారి సహాధ్యాయుడినైన) పొన్నెకంటి సూర్యనారాయణ రావు అనిర్వచనీయ ప్రేమాభిమానాలతో వ్రాయునది....
.
    మీరు గురుభావనతో నన్ను "మీ పదవీ విరమణ" సందర్భంగా ఆహ్వానించారు. కాని అప్పటికే స్థిరీకరింపబడిన నా వ్యక్తిగత కార్యక్రమాల వలన రాలేకపోయినందులకు చాలా బాధపడుచున్నాను. కనీసమీ సమాచారము మీకు తెలియపరచుటకును చరవాణి కాని, అంతర్జాల చిరునామా కాని లభించలేదు.
      ఈరోజు మీరు పంపిన "శ్రీ గాయత్రీ మాతృద్విశతి" అందినది. చదివాను.ప్రతి పద్యమత్యంత భక్తి భావప్రపూరితము, సుశబ్దశోభితమై మనోరంజకముగానున్నది. అమ్మ గాయత్రీ దేవి కరుణకు పాత్రులైన మీరు ధన్యులు.

         అమ్మ గాయత్రి కరుణను నందినారు
         పూర్వజన్మంపుపున్నెంబు ప్రోగుగాగ
         కవన పాండిత్యసద్గుణ భువన రవిగ
         శుభముకలుగుత మీకెప్డు సూరివర్య!

         గాయత్రీజప ఫలితము
         వేయేలవచింపలేము విశ్వంబందున్
         మాయామేయజగంబున
         కాయంబదియుండుదనుక కైమోడ్పెతగున్.
                       శుభం భూయాత్!
                   పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
                             ది.22.12.2017.
          

భద్రాచలం, హేమాచలం.8.01.18.

భద్రాచల యాత్ర.

  హైదరాబాద్ నుండి మణుగూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ లో 8.01.2018న,రా.11.30కు మా బావగారు శేషగిరిరావు గారు, చెల్లి ఉదయ, ఇందిర,నేను బయలదేరి ఉ.7.30కి మణుగూరు చేరాము. 9.01.18న స్టేషన్ నుండి బయలుదేరి అల్పాహారం తరువాత ఆటోలో  "మల్లూరు" " హేమాచల నృసింహస్వామి" దర్శనానికి వెళ్ళాము. (మణుగూరునుండి మల్లూరు 50.కి.మీ.మల్లూరు వెళ్ళేటప్పుడు వీలుచేసుకొని అరటి,జామ మొ.లగు పండ్లు తీసికొని వెళితే వానరాల ఆకలి కొంతవరకు తీర్చవచ్చును)అచట ఆర్చికి కుడివైపున మెట్ల ప్రక్కన కొద్ది దూరంలో స్వయం భవునిగా వెలసిన హనుమ గుడి చెంత  కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానాలు చేయడానికి (స్వల్పరుసుముతో)చక్కని ఏర్పాట్లు చేశారు. ఎంతో అభినందనీయులు. అచటికి వచ్చే నీరు పరమ పవిత్రము, స్వచ్ఛము, అవ్యక్త మూలికాసంస్పర్శిత రోగ నిర్మూలనము,అమృతతుల్యము,సమతులోష్ణము,సజీవగంగావతరణము. ఆ స్నానానంతరము మనజన్మ పునీతమైన అనుభూతి కలుగుతుంది. నేను కూడ అచట స్నానం చేయగలగటం మహద్భాగ్యమే. అక్కడనుండి షుమారు 50సోపానాలు (మెట్లు)దాటితే నరసింహ దర్శనం లభిస్తుంది. స్వామి స్వయం భువుగా చెబుతారు.   
               ఈ స్వామిని దర్శించిన మహమ్మదీయ చక్రవర్తి కొండ, ఆలయము అర్థచంద్రాకృతిలో ఉండుటవలన తమదైవ చిహ్నమని భావించి భక్తి తో కొంత బంగారాన్ని కానుకగా సమర్పించారట. తదుపరి ఆబంగారమును అమ్మి వచ్చిన ధనమును బ్యాంకు లో వేసి వచ్చే వడ్డీ తో అర్చకులు మొ.లగు వారు మనుగడ సాగిస్తున్నారట. ఆ కారణముననే ఆ స్వామి"హేమాచల నృసింహస్వామి" పిలవబడుతున్నాడట.                                               ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఏమిటంటే స్వామికి కంఠం క్రింద భాగమంతా శిల కాక మానవశరీరంలాగా ఉంటుంది. నొక్కి చూస్తే చర్మం లోనికి వెళ్ళి కొద్దిసేపటి పూర్వపుస్థితికి వస్తుంది. పూర్వం త్రవ్వకాల కారణంగా స్వామి నాభి(బొడ్డు)దగ్గర గాయం యేర్పడి అచట రక్తము కారుచున్న కారణంగా అచట చందనం ఉంచుతారు. స్వామి నిజరూపదర్శనం శుక్ర,శని,ఆదివారాలు (మ.12.వరకు) ఉంటుంది. స్వామి వారి నాభిదగ్గర ఉండే చందనాన్ని పాలలో కలుపుకొని త్రాగితే పెండ్లి కాని వారికి వివాహము, సంతాన హీనులకు సంతానము తప్పక కలుగుతుందను నమ్మకం ఇటీవలి కాలంలో ఎక్కువమందికి కలుగుతున్నది. ఈవిషయాన్ని ఫలితం పొందినవారివలన, ఆటోలవారివలన కూడ వినటం జరిగింది. నమ్మకం,ఆత్మ విశ్వాసం ఎన్ని సమస్యలనైనా తీర్చగలవు.ఎంత ఉన్నతినైనా కలిగించగలవు.
         9వతేది మధ్యాహ్నం మణుగూరునుండి బయల్దేరి 2.30.లకు భద్రాచలం లోని "అంబా అన్నసత్రం"లో భోజనంచేసి దగ్గరున్న గదిలో విశ్రాంతి తీసికొని ఆటోలో బయల్దేరి "జటాయువు గుడి,(జటాయువు కాలు తెగిపడినచోటు)(సమీప పొలంలో రెక్క తెగిపడినదని సమాచారం) దుమ్ముగూడెంగ్రామదేవత, సీతారాములపర్ణశాల"(భద్రాచలంనుండి 30.కి.మీ.)చూచి వచ్చాము.
     10వ తేది. ఉ.8.00లకు మేము భద్రాచల రామదర్శనం చేసుకొని, శేషగిరిరావు గారి దంపతులు చేయించుకొనిన       కల్యాణమును కనులారా చూచుకొని, అన్నసత్రములో రామప్రసాదమును స్వీకరించి విశ్రాంతి తరువాత గోదావరి స్నానం ముగించి గదికి చేరాము. సాయంత్రం7.గం. లకు బస్సు లో కొత్తగూడెం చేరి అచట సికింద్రాబాద్ మణుగూరు ఎక్స్ప్రెస్ లో రాత్రి.10.45కి ఎక్కి 11వ తేది ఉ.6.గం.లకు ఇండ్లకు చేరాము.

 కం.హేమాచల నరసింహుని
      నేమానవుడేనిభక్తి నీమముతోడన్
      సేమంబుగోరిమ్రొక్కిన
      కామంబులుదీరితాను కాంచునుసుఖముల్.
కం. మల్లూరు నారసింహుని
      యుల్లంబునవెల్లువెత్తు యుత్సాహమునన్
      కల్లా కపటములెరుగక
      చల్లంగనుమ్రొక్కినాము సౌమ్యతదనరన్.

 కం.ప్రాతఃస్మరణముజేయుచు
      పూతాత్ములభంగిభద్రు ముంగిటవాలన్
      సీతారాముల కరుణయె
      చేతంబులురంజిలంగ చేరెను మాకున్.

14, జులై 2019, ఆదివారం

ఉన్న దానిలోనే దానం.

ఉన్నదానిలోనే అన్నదానం.

       సూళ్ళూరుపేటకు షుమారు 60కి.మీ దూరంలో"మల్లాం" గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీవల్లీ,దేవసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ప్రాచీనమైనది. అందు మనోహర శిల్పసౌందర్యం చూపరులను కట్టి పడేస్తుంది.
       ఆలయనిర్వహణాధికారులు భక్తులు దైవదర్శనం చేసుకొనేసమయంలోనే "అయ్యా అందరు స్వామివారి ప్రసాదం తీసుకొనివెళ్ళండి" అని చెప్పటం వారి అన్నదానవ్రతానికి నిదర్శనం. ప్రస్తుతం అన్నదానం మంగళ,ఆదివారాలలో జరుగుతుంది. దాతలు అధికంగా విరాళాలిస్తూ ఉంటే ప్రతిరోజు అన్నదానం నిరతాన్న దానంగా మారుతుంది.

     స్వర్ణ దానంబు లిచ్చును స్వర్గ సుఖము
     వస్త్ర దానంబు ప్రఖ్యాతి వరలజేయు
     భూమిదానంబు వలనను పొందుయశము
     అన్నదానంబు సర్వంబు నమరజేయు.

 మంగళ,ఆదివారాలలో భక్తులు షుమారు200మందివస్తారు. ఆరోజును దృష్టిలో పెట్టుకొని అన్నదాతలు తగిన ద్రవ్యం చెల్లిస్తారు. అన్నము, ఇతరపదార్థములన్నీ సిద్ధమై భక్తులు క్యూలో నిల్చినను వెంటనే భోజనము వడ్డించరు. ఆరోజునకు ద్రవ్యముదానమిచ్చిన దంపతులువచ్చి అన్నమున్న గిన్నెకు (అన్నపూర్ణాదేవికి )హారతిచ్చి అగరువత్తులు వెలిగించి ధ్యానించి వారు ప్రారంభించిన తదుపరే క్యూ లోని వారికి పెడతారు. సాధారణంగా ఈరోజుల్లో ఇలాంటి స్థలాలలో తిని అన్నదానానికి ద్రవ్యం ఇవ్వనివారెవ్వరు ఉండుటలేదు. కారణం "మనం తినే అన్నం ఎవరో ఇచ్చినదే"అనే స్పృహ తప్పక ఉంటుంది. "అన్నం పరబ్రహ్మ స్వరూపం" ఒక్క పదార్థం కూడ వృథాచేయకూడదు. తింటేమనం తినాలి లేకుంటే పేదలకు పంచాలి. మనం తినటానికి తక్కువ ప్రాథాన్యమిచ్చి పేదలు తినటానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.

           దాన గుణమది యుత్కృష్ట ధర్మమెపుడు
           మనము తిన్నది యెంతైన మట్టిపాలు
           పరులకిడునది శక్తి మై భక్తి తోడ
           నధికతరమైన ఫలితంబునందజేయు.

మనమీనాడు ఏదేవాలయానికి వెళ్ళినా అన్నదానం జరుగుతున్నది. అది నిరంతరాయంగా జరగటానికి మనం చేతనయినంత సాయం చేద్దామా? కాదనెందుకంటారు మరి చేయికలపండి...

మాలకొండయ్య గారి ఆత్మీయత.

అనుబంధం,ఆత్మీయత.

       కొన్ని అనుబంధాలు ఈ జన్మవి కావేమో అనిపిస్తాయి. అంతగా వారు ఏకమౌతారు. ఆత్మీయత అంటే "తననుతానెంత ప్రేమిస్తాడో ఎదుటివానిని కూడ అంతే ప్రేమగా చూడటం." ఈ రెండు కలగలిసి సనాతన సంప్రదాయ గౌరవమర్యాదలకు ఆలవాలమై, సాహితీ ధురంధరుడై, జ్ఞానవయోవృద్ధుడై, విద్యాదానశీలుడై, నా దక్కిన శమంతకమణే శ్రీ ద్రోణాదుల మాలకొండయ్య గారు. (81సం.లు)
       2013వ సంవత్సరములో " భువనేశ్వర్, కాశీ యాత్రలో సహ యాత్రికుడు. సహజంగా సద్గుణశోభితుడు . అలాంటి వ్యక్తి కనబడగనే ఉప్పొంగిపోతాడు, మమేకమై కష్టసుఖాలలో పాలుపంచుకోవాలనుకుంటాడు. తాను సాహితీప్రియుడు కనుక కవిపండితులనభిమానిస్తాడు. ఆనాడు "కాశీయాత్రావిశేషాలను" నేను వ్రాసి గ్రంథస్థం చేయటాని ముఖ్యకారకుడాయనే. ఏమి మాట్లాడినా చివరకు "మాష్టారూ! దానిని ప్రింట్ చేయించుటకు ముందుగా కొంత డబ్బు ఇవ్వమంటారా?" అని అడిగేవారు. తాను పొందిన ఆనందాన్ని అందరకు పంచాలని ఆయన తపన. ఆధ్యాత్మికత భావనలు నిరంతరం సమాజశ్రేయస్సునే కాంక్షిస్తు ఉంటాయి. కనీసం పది రోజులకొకసారైనా నాకు ఫోన్ చేసి "ఎలా ఉన్నారు మీరు, మేడం గారు?"అని మనసారా పలకరించడం ఆయన మంచి మనసునకు నిదర్శనం.  మనస్సు నిరంతరం మాధవపాదాక్రాంతమై యుంటుంది.  భాగవతంలో పోతనగారు  

 "  మందారమకరంద మాధుర్యమునదేలు               
              మధుపంబువోవునే మదనములకు
  నిర్మల మందాకినీవీచికలదూగు
               రాయంచచనునే తరంగిణులకు
..........................
    అంబుజోదర దివ్యపాదారవింద
    చింతనామృతపానవిశేష మత్త
    చిత్తమేరీతినతరంబు జేరనేర్చు
    వినుతగుణశీలమాటలువేయునేల......అంటారు.

           అట్టి గుణశీలుని 24.01.2018 న కలుసుకునే అవకాశం దొరికింది. వారి స్వగ్రామమైన కావలి సమీపంలోని " ఎడ్లూరిపాడు" వెళ్ళాము. మా ఆనందానికవధులు లేవు. మాకు బ్రహ్మ రథం పట్టారు. ఆయన సహజంగా రామభక్తుడు. ఇల్లంతా రామమయం. నా ఆరాధ్యదైవం రాముడే. నేను తెనుగు జేసిన " సూర్యశ్రీరామం" తన డాక్టరు గారిచే గ్రంథముగా తయారుచేయించి తెప్పించుకొని మరీ చదివారు. భోజనాలకుముందు కాసేపు పద్యపఠనం. సాహితీసమరాంగణ సార్వభౌముని "ఆముక్తమాల్యద"నుండి. విష్ణుచిత్తుని అతిథి సేవాఘట్టం. "నాస్తి శాకబహుళా". ఎంతమధురమనోహర ఘట్టం. "అభ్యాగతః స్వయం విష్ణుః" మాలకొండయ్యగారి దృష్టిలో నేను విష్ణువును. భోజనానంతరం మాదంపతులకు, నా సోదరుడు కాళీజగన్నాథ్ కు బట్టలు పెట్టి ఆత్మీయతను చాటుకున్నారు.
          మన జీవితంలో ఎందరో కలుస్తారు. వారందరు ఆత్మీయులు కాలేరు. ఆరాధ్యులు కాలేరు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

   తే.గీ.జీవితంబున వెలిగెడి చెలిమికలిమి
          సర్వ సౌభాగ్య భోగముల్ సంతరించు
          స్నేహదీపంబు వెలిగింప చిత్తమందు
          హ్లాదమిచ్చును నిలువెల్ల హాయి గూర్చు.

    తే.గీ.మాలకొండయ్య నెయ్యంబు మరువలేను
           ఉన్నతంబైన సుగుణమహోన్నతుండు
           పుస్తకంబుల పారాడు పురుగనంగ
           సార్థకంబౌను సామెత చక్కగాను.

    

నేలపట్టు...పక్షులు.

నేలపట్టు. ప్రకృతి నాస్వాదిస్తు కొన్ని చిత్రాలు. ఇతర దేశాలనుండి పక్షులు ఇచటి చెరువు దగ్గరకు వలసవస్తుండేవట. ఇది ఒకరైతు పొలమట. దీనిని ఆనాడు బ్రటీషువారు గమనించి ఆభూమిని ప్రభుత్వం స్వాధీన పరచుకొని వాటి అభివృద్ధికి మరికొన్ని వనరులు కలిగించినదట. అవి ఈప్రాంతానికి వచ్చి చక్కని అనువైన ఆహారాన్ని పొంది సంతానాభివృద్ది చేసుకుని సంతాన సమేతంగా స్వస్థానాలకు చేరుతాయట. ఇచట వాటిని మరింత దగ్గరగా చూచేందుకు "బైనాక్లర్స్" ఇస్తారు. దానిద్వారా ఆ పక్షులను చూస్తే వాటి కూనలతో సహా కనిపించి మైమరపిస్తాయి. మనం ఎన్ని చిత్రాలు తీసినా అసంతృప్తే. మామూలు కెమెరా తో తీసిన చిత్రాలు కొంతకాలానికి కనుమరుగౌతాయి. మన కన్నులనే కెమేరాతో తీసినవి మనం బ్రతికి ఉన్నంతవరకు ఉంటాయి. మధురానుభూతిని కలిగిస్తుంటాయి.

 ప్రకృతి జీవుల కెయ్యడ ప్రాణమగును,   
 ప్రేమ పెంచుచు పంచుచు ప్రియముగూర్చి,                                           
 మధురభావాల నిలయమై మానవాళి,  
 మనసుదోచును సతతంబు మాన్యమగును.

 కరుణరస నిర్భర నరుని
 పరమహృదయమెయ్యెడ గన భాసుర మౌగా
 పరమాత్మ తుల్యమగుచును
 ధరవెల్గును శాశ్వతముగ ధన్యంబగుచున్.

చెట్టు చేమలు ఖేచర జీవతతిని
కావవలయును సతతంబు కరుణతోడ
 మహిత సద్గుణశోభిత మనుజుడెపుడు
పరమపూజిత దైవాంశ వరదుడగును.

రామాయణం కుడ్య చిత్రాలు

ధర్మవరం.రామాయణ కుడ్యచిత్రాలు.

 ది.26.02.2018. యశ్వంత్ పూర్ నుండి కాచిగూడ యక్స్ ప్రెస్ లో ప్రయాణం. అది బయల్దేరవలసిన సమయానికన్నా(మధ్యాహ్నం2.30,) 1గం. ముందే స్టేషన్ కు చేరాము. రైలు బయల్దేరగా స్టేషన్ లు వరుసగా వెనుకకు వెళ్ళిపోతున్నాయి మాకు వీడ్కోలు పల్కుతు. క్రాసింగ్ కారణం కాబోలు ధర్మవరంలో రైలు ఎక్కువసేపు ఆగింది. చూపులు పరిసరాలను నిశితంగా వెదుకసాగాయి. ఆశ్చర్యంగా కొన్ని కుడ్యచిత్రాలు దూరంగా కనబడ్డాయి. మరి మనం పరిశీలించకుండ ఉండగలమా? గుడ్లుపెద్దవి చేసి చూస్తే గుట్టు బయటపడింది అది రామాయణమని. ఇక మనసు పులకించి కోతిగంతులు వేస్తు ఛందోశాఖలనాశ్రయించి చిత్రభావాలను , చరితమూలపురుషులను నెమరువేసుకొంటు మధురఫల రసాల నాస్వాదించింది. వాటిఫలితమే ఈ పద్యాలు. మీకు కూడ.

    తే.గీ.  ధర్మ వరమును రైలులో దాటుచుండ
              రామసత్కధా పరిపూర్ణ రమ్య కుడ్య
              చిత్రజాలంబు జూచితి చేష్టలుడిగి.
              ధన్యమైనవి కన్నులు తలపులపుడు.

  ఉ. ధర్మమె మారురూపమయి ధర్మమె నిత్యము సాధనంబుగా
       కర్మలనాచరింప ఘన కంటకదూషిత కాననంబులన్
       నిర్మల చిత్తుడైదిరిగి నీతివిదూరుల నేలగూల్చి ఆ
       మర్మము విప్పిజెప్పు పరమాత్ముని శ్రీరఘురాముజూచితిన్.

  ఉ. లంకను జేరనీయనని లంఖిణి భీషణ క్రూరరక్కసై
       బింకముతోడదేహమటు పెంచుచుదూకుచు మ్రింగబోవ ని
       శ్శంకత సూక్ష్మరూపియయి చక్కగ నాస్యములోనికేగి ఆ
       వంకనె వచ్చినట్టిఘనవానర ముఖ్యుని నేనుగాంచితిన్.
   
  తే.గీ. రాముచెంతనె సీతయు రమ్యగుణుడు
          లక్ష్మణుండట భాసిల్లె లక్షణముగ
          ధర్మ వరజన పుణ్యంపు మర్మమేమొ
          నిర్మలంబౌచు సత్కీర్తి నింగినంటె.
       
   తే.గీ.ధర్మబద్ధంపు మనుగడ ధైర్యమిచ్చు
           అర్థ మెక్కువయగుట యనర్ధమగును
           కామమనునది భార్యతో క్షేమమగును
           మూడుత్రోవలు నరునకు మోక్షమిడును.

                శ్రీరామకటాక్షసిద్ధిరస్తు!
 ఇలా అణువణువు రామమయం కావాలని ఆశిస్తు....
                                       మీ "సూర్యశ్రీరామం" (పొన్నెకంటి)
         

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి.

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి


 1. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం

     దావులనింపినావుగద ధన్యతగూర్చుచు కాణిపాకము

     న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ!విఘ్నవారణా!

     కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!

 2. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్

     కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్

     స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా

     నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!

3. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో

     చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో

     భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ

     ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.


 వందే గణనాయకమ్.


1. ప్రథమ తాంబూలమర్పించి ప్రాంజలింతు

    విఘ్నరాజుగ స్తుతియించి వేడుకొందు

    కార్యమేదేని తలపెట్టి ఘనతజెంద

    దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!


2. అమ్మ పార్వతి మలచిన బొమ్మవీవు

    అయ్య కరుణరేఖల వెనకయ్యవీవు

    పందెమందున తమ్ముని ప్రక్కనిడిన ...దొడ్డ.....


3. నిన్ను పరిహాసమాడిన నేరమునకు

    శాపమందెను నిర్దయ చంద్రుడపుడు

    ఘనత మీరగ సతతంబు గారవింతు...దొడ్డ.....


4. మాతపితలను సేవించు మార్గమొకటె

    సకలసౌఖ్యాల గనియంచు చాటినట్టి

    జ్ఞానివీవయ్య  వెనకయ్య!మానితుండ!...దొడ్డ.....


5. ఇర్వదొక్కటి పత్రాల నింపుగాను

    పూజలందుచు భక్తుల మోదమలర

    మోక్షమందించు పరమాత్మ! పుణ్యపురుష!...దొడ్డ...


6. గరికపూజకె ముదమంది దురితములను

    పారద్రోలెడు పరమాత్మ! భవ్యచరిత!

    కార్యసిద్ధిని గూర్చెడు ఘనుడవీవు...దొడ్డ...


7. మోదకంబుల నర్పింప మోదమంది

    వెనుకముందులుజూడక మనుజులకును

    సర్వవిజయాలు గూర్తువు సాధువదన!..దొడ్డ...


8. గర్వపడినట్టి తమ్ముని గర్వమణచి

    వినయశీలంబె సర్వత్ర విజయమంచు

    చాటిచెప్పిన ఘనుడవు మేటివయ్య!..దొడ్డ...


9. సర్వ గణనాయకత్వంపు సాధనాన

    నీవు జూపిన ప్రజ్ఞకు నీరజాక్ష!

    మిగుల నాశ్చర్యమొందెను మిన్ను మన్ను..దొడ్డ...


10.పంటలన్నియు సతతంబు పాడుసేయు

     ఎలుక మీదను నీవుండి యెఱుకగూర్చి

     జ్ఞాననేత్రంబునిచ్చిన జ్ఞానివీవు.

     దొడ్డ గణపయ్య ననుగావు దురిత హరణ!
                                 ##

సమస్యా పూరణలు


        
       
       
     
                        
 
      కీ.శే. అటల్ బిహారి వాజ్ పేయి గారికి అశ్రునీరాజనాలు.

      అటలు బీహారి సత్కవి యమరుడయ్యె,
      ఇంద్ర సభలోన కవులెల్ల మంద్రమైన,
      భార విహ్వల హృదయాల పజ్జజేర,
      స్వాగతించిరి సురలెల్ల సభకు నిపుడు.

      సురభిగారికవిత శోభాయమానంబు
      లలిత మధురశబ్ద లాలితంబు
      గళము కలముమించు గమకాలశైలిలో
     అష్టవిధములైన ఆశ యాల.

    తిన్న కుడుములు చాలింక మిన్నకుండు
    మరలి రమ్మిటు నావెంట మంచుకొండ
    నరుల విఘ్నాలు తొలగించి నయముగాను
    వత్తునోయమ్మ గిరిజమ్మ వదలుమ్మ!

  దుర్గమమైన దుఃఖముల దున్ముచు భక్తుల బ్రోచిచూచెడా
  భర్గుని సాముదేహమగు భార్గవి,యంబ,శివాని,శాంభవీ
  దుర్గ,యపర్ణ,పార్వతిగ తోషిత నామములొప్పు మాతయే
  మార్గముజూపుగావుతను మానవజాతికి ముక్తిగాంచగన్.

  సీ. మహిషాసురునినేను మట్టుపెట్టితినంచు
                నీవన నమ్మితి   నీలవేణి
 చిక్షురాసురునల శీర్షము ద్రుంచితి
                నన్న ముదముగల్గె నంచయాన
 చామరదుష్టుని చంపివేసితినన్న
                ఆనందమొందితి నమలనేత్ర!
 భాష్కులరక్కసు భంజించితనుటచే
                భయముదీరితినమ్మ భర్గురాణి
 తే.గీ. చావలేదమ్మ వారలు చారునయన
 భరతమాతకు శోకంపు భారమవగ
 ఆడపడచుల మానంపు హారులనగ
 దిరుగుచుండిరి వారల తరుగుమమ్మ!

 తే.గీ.  అపర మహిషుల శూలాన హతముజేసి
 భారతావని గాపాడు భవవిమోచ!
 మానవత్వంబు కాపాడు మనసులీని
 మమ్ము కరుణను జూడుమ మమతతోడ.
 నీదు పాదములర్చింతు నీశురాణి!!

  సీ. విజయంబు సతతంబు వీక్షింపగోరిన
                   దశమిన కార్యంబు దలచవలయు
 జయమునే కోరెడు జనమెవ్వరైనను
                    దివ్యదశమి
 సద్యశమున్గోరు సజ్జనులెవరైన
                     దశమిరోజునునెంచి తరలవలయు
 సిరులను బొందగ శ్రేయంబు గాంక్షింప
                       శారద రాత్రుల చక్కనమ్మ
 దుర్గ సేవల సద్భక్తి దురిత మెడల
 సల్పుచుండిన నరులెల్ల సాధుగరిమ
 ఇలను సత్కీర్తినంది మహేంద్రుపగిది
 భోగభాగ్యాల సతతంబు పొందగలరు.
     
                     
సమస్య :   ఉద్ధతులమధ్య నిరుపేదనుండగలనె? 

       యుద్ధమనినను కలముమహోద్ధతిగను
       పద్ధతిగ పదవిన్యాస వైభవాల
       శతసహస్రావధానంపు చతురులున్న
       మధుర మంజుల గళమునమమత జాలు
       వార్చెడుసుగుణ మణులు గీర్వాణి రూపు
       దాల్చిన తరుణులున్నట్టి తావు,ప్రథిత
       సురభిళపుపద్యతోరణసూత్రమందు
       చిగురు టాకులు సులువుగ జేరగలవె?

 సమస్య :  పగలోమున్గినవారి పాపచయముల్ భస్మంబులౌనెప్పుడున్.

 పగలంబెంచుచు మానవత్వగుణముల్ భంగంబుగాజూచుచున్
 రగులన్ వర్ణపుభేదముల్ జనులలో రాద్ధాంతముల్బెంచుచున్
 వగపేమాత్రములేని కూళమదిలో భాస్వన్మహద్భక్తి నిం
 పగ, లోమున్గినవారి పాపచయముల్  భస్మంబులౌనెప్పుడున్.
గ.ణ.ప.తి....తేటగీతి....గణేశస్తుతి. 
గజముఖా! పార్వతీముఖకమల రవి!గు
ణవిలసద్భవ్య నాయకా! నాగభూష!
పరమ పావన విఘ్నేశ! పాహిపాహి!
తిరుగులేనట్టి పుణ్యాల సరగునిమ్ము.



         
   


9, జులై 2019, మంగళవారం

ప్రేమ స్వరూప, స్వభావాలు.9.07.19.

                                        ప్రేమ స్వరూప,స్వభావాలు.

        వింత గొల్పు ప్రేమ విశ్వాన దాగెలే 
        బంధనమ్ము వేయ బహుముఖాల
        తల్లి, చెల్లి, భార్య తన బంధువర్గంబు
        మురిసి తనిసి విరియు మోహ వశత!.. 1.

        జీవి ప్రాణ మెచట జీరాడు బంధమున్ 
        ఉద్భవించ నచట నుండు ప్రేమ
        ప్రేమ లేని ప్రాణి ప్రియమేల బొందురా? 
        సత్య మిదియ నలువ చక్ర మందు..... .2.

        ఎప్పు డెక్క డెచట నేర్పడు టన్నది
        ఎఱుగ రాని దదియె మఱు లనంగ
        శ్రేయమునకు మరియు చిక్కుల దిక్కుకై 
        పుట్టు చుండు నయ్య! పుఱ్ఱె లందు......3.

       మాతృ ప్రేమ లోన మానిత త్యాగంబు
       భార్య మమత  లోన బహుళ రుచులు
       చెల్లి, అన్న, వదినె చిత్రంపు ప్రేమలో
       రాగ భావ తాళ రక్తు లుండు..... ..... .4.

       చావు పుట్టుకలకు సరియైన హేతువు
       తనువు మీద నుండు తగని ప్రేమ
       దాని మీద కన్న దైవంబు పైనున్న
       పుణ్య చయము పెరిగి మోక్షమబ్బు.... 5.

      అరయ ప్రేమ యనగ నక్షరంబులు రెండు
      అట్టి దాని శక్తి యణువు మించు
      మనిషి జంతు జాల మవనిని సంతస
       మొంద ప్రేమ వలయు పూర్ణ గతిన... .6.

      స్వార్థ మెక్కువైన సమయును ప్రేమయే
      ప్రేమ లేని జీవి ప్రేత సమము
      నిల్ప వలయు దాని నిజ హృది యందున
      దైవ మగుట కొఱకు తపము జేసి... .. .7.

     గ్రుడ్డి ప్రేమ యెపుడు కూడదు మనిషికి
     చేటు దెచ్చు సర్వ శ్రేష్ఠుకైన
     కౌరవాగ్రజుండు గాంధారి మనముల
     నిట్టి ప్రేమ యుంట నిహము చెడిరి.... .. .8.

     కంట జూత మన్న కనరాదు చిత్రమై
     గుండె గూడు లోన కుదురు కొనును
    చేష్ట లందు మోము చిర్నవ్వు లందున
    స్పష్టమగును దాని సహజగుణము...... .9.

    పేద ప్రజల పట్ల ప్రేమాదరంబుల
    చూపు వారికె మధుసూదనుండు
   శ్రేయ మిచ్చి  సతము సిరులను బెంచును 
    తెలిసి మసలుమయ్య తెలివి గలిగి....... 10.

   సిరులు పంచ తరుగు చిత్రంబు కాదది 
   ఆస్తి పాస్తు లెల్ల యణగిపోవు
   ప్రేమ పంచుకొనగ  పెరుగును మిత్రమా
  కన్న సత్య మదియె కరుణ వినుమ...... 11.

   కసిరి విసిరి చెప్ప కాదందు రెవరైన
   ప్రేమ తోడ జెప్ప ప్రియము గల్గు
  మంచి బెంచ గల్గు మహిమాన్వితంబది
   పాటి సేయుమయ్య ప్రాజ్ఞతముడ!.....  12.

  ప్రేమ లేని పొందు ప్రియపత్నిదైనను
  సార హీన మౌచు నేర మగును
  ప్రియము పల్లవింప ప్రేమ సార్ధకమగు
 తెలసి సాగుమయ్య తెలివిగలిగి...... ... 13.

                  కాకి నేర్పే పాఠాలు.(ఫేస్ బుక్) 7.07.19.

  కాకిగోలటంచు కన్నెఱ్ఱయేలయా,  ప్రేమమీర జాతి పిల్చుటదియ
  మనిషికేది యిట్టి మహనీయ భావంబు?,  కఠిన స్వార్ధపరుడు కనగనరుడె.1.

  నోరులేని కాకి యోరామచంద్రుడా,  కావుకావుమనుచు కరుణబిలుచు
  నమ్మకంబులేని నరుగతిజూడంగ,   కావుమనగలేడు కమలనాభు.  2.

   కాకి సంఘజీవి కనబడు సత్యంబు,  సంఘమందె బలము సర్వముండు
   ననుచు దెల్పు మానవాధములకునెల్ల,  వాయసంబె ఘనము వసుధయందు.3.

    కాకి ముందులేచి కాలమ్ముసూచించి,   నిద్రమత్తు డుల్చు నేర్పుమీర
    చురుకుదనము లేక స్త్యుత్యుడకావంచు,  మానవునకు దెల్పె మహితగతిని.4.

     కాకిపొదగదగిన గారాబుగ్రుడ్లనున్,  క్రిందపడగద్రోచి నందెఫలము
     కోకిలమ్మతనదు కుహనత్వముంజూపె,   కాకి లేనినాడు కోకిలేది? 5.

     శ్రావ్యమైనగొంతు చక్కని రూపంబు, లేకయున్ననేమి కాకికెపుడు
     కంటనొక్కముద్ద కనబడ్డచాలుగా,  బందుగులనుబిల్చు విందుసేయ.6.

                పగను వదిలితేనే శుభం.(ఫేస్ బుక్.8.07.19)

     పగను పెంచుటన్న పామునుబెంచుటే,   వేచియుండు నదియ వేటుకొఱకు
     విషము పగయు రెండు వేర్వేరు కాదయా,  దూరముంచుమయ్య దుష్టగుణము.1.

     శుభముగోరువాడు చూడడు పగవంక,  మంచిమాటలాడి మసలజూచు
     నిప్పువంటి పగను నీలోన దాచకు,  దూరముంచుమయ్య దుష్టగుణము.2.

     కోపమున్న నదియ కొంతయుసహ్యంబు,   దాని వలన కలుగు తామసంబు
     మారరాదుపగగ మనసునందెప్పుడు,   దూరముంచుమయ్య దుష్టగుణము.3.

     బీపి షుగరు స్థాయి  భీకరరీతిలో,   పగలు రేయి యనక రగులజేయు
     పగను నీవు విడువ భద్రంబుజీవంబు,  దూరముంచుమయ్య దుష్టగుణము.4.
   
     పగలు  జంపకున్న పగలె మనలజంపు,   క్రూరమైన పగను కోరవద్దు
     సంఘజీవనాన శాంతియె నీహద్దు,   దూరముంచుమయ్య దుష్టగుణము.5.

     పగను జంపురీతి పగయది కాదులే,  శాంతగుణమె దాని సాధనంబు
     గాంధితాతకిదియె ఘనమైన తత్త్వంబు,  దూరముంచుమయ్య దుష్టగుణము.6.

     పగను రగులకుండ పాండవాగ్రజుడప్డు,  శాంతి మంత్రముననె సాగెసతము
     అందుకాతడయ్యె నాదర్శ మూర్తిగా,  దూరముంచుమయ్య దుష్టగుణము.7.

      మదిని పగనుబెంచ మాన్యత్వముంబోవు,   ప్రియముజూపి మిగుల ప్రేమబంచ
      జగతియందు సతము జయమది నీదెరా,  దూరముంచుమయ్య దుష్టగుణము.8.

       స్వచ్ఛమానసాన సన్మార్గముల్దోచు,   దీర్ఘకోపమందు దిగులెమిగులు
       సంతసంబెనీకు సద్గుణోపాసనౌ,  దూరముంచుమయ్య దుష్టగుణము.9.

        పరమహంస లెల్ల పరమాత్ముసన్నిధి,  చేరుమార్గమొకటె చిత్తమనిరి
        దానినుంచదగును ధర్మంపుమాటున,   దూరముంచుమయ్య దుష్టగుణము.10.
                      మీ పొన్నెకంటి.🙏

బెంగుళూరు.  ప్రజపద్యం. సం.గా.

   కస్తూరి కన్నడన్ కమనీయ గంథముల్
             రాస్తాల ప్రసరించు రమ్యభూమి
   చెట్లనీడలలోన శీతలవాయువుల్ు
              మెల్లగ వీచెడు మేటిభూమి
   పరభాషలకు గూడ బాగైన విలువలన్
               సమకూర్చి కాపాడు సాధుభూమి
    రాయల పాలనన్ రససాహితీతతుల్
               పురుడుపోసికొనిన పుణ్యభూమి
   పెద్ద గణపయ్య నెలవైన బెంగుళూరు
   రంగు రంగులహర్మ్యాల బెంగుళూరు
   వింత వాతావరణముల బెంగుళూరు
   పచ్చదనమున కమనీయ ప్రాంగణమ్ము.

                      సాహిత్య ప్రయోజనం.(10.07.19)

     హితవు బోధపఱచి హేయగుణముబాపి
     ఉన్నతునిగ మార్చి యుదధివంటి
     జ్ఞాన మిచ్చి సతము నాణెంపునడతల
     ఘనుని జేయ గలదె కావ్యమనగ.1.

     వెఱ్ఱివాడు  పూర్ణ వేదాంతియౌజుమీ
     చవటకూడ చదువ సద్గురువగు
     గ్రంథపఠన వలన జ్ఞానంబు పెరుగురా
     అక్షరంబె మనకు రక్షయగును.2.

     మధుర మధురమైన మహనీయభావనల్
     ఏర్చికూర్చి వ్రాసి యింపుగాను
     సంఘహితవుగోరి సాహిత్యకారులై
     కీర్తిగాంచె కవులు స్ఫూర్తి దనర.3.
    
     మహిత ధర్మమార్గ సహితుడౌపురుషుండు
     సంఘమందు మిగుల సద్గుణుండు
     అట్టి గుణములెల్ల యంతరంగంబుండ
     కావ్యపఠనమయ్య కారణంబు.4.

      విభవమెంతయున్న విజ్ఞాని కానిచో
      గౌరవంబులేదు ఘనతరాదు
      సరస సాహితీ రసాస్వాదవిదుడెపో
      చక్రవర్తి మించు చక్రవర్తి.5.

       సంఘజీవనంబు సారస్వతములేక
       సారహీనమగును జనులకెపుడు
       మంచిచెడ్డలందు మరిమరియోచింప
       నమల జ్ఞానధనమె యవసరంబు.5.

        మనసుపరవశింప మహితవిజ్ఞతపెంచ
        సారవంతమైన చదువులెగద
        మూలకారణంబు ముద్దుగనూహింప
        రాజుకైనగాని రజకుకైన.6.
      
        సాగె సుమధుర భావంపు సంపదాళి
        అక్షరార్చిత మౌచును ననువుగాను
        ఫేసుబుక్కున జరిగెడు రేసులోన.
       " సరసమయ్యెను సాహిత్య సౌరభమ్ము."😀😀😀

                    దేశాభివృద్ధిలో నా పాత్ర.(11.07.19)

      దేశసేవయన్న దేహముప్పొంగును
      నేరికైన గాని నిశ్చయముగ
      ధర్మపరుడనగుచు ధార్మికజీవికన్
      నడచుకొనుటయదియె నాదుపాత్ర.1.

      గ్రామసీమలెల్ల ఘనముగానెదుగుటే
      క్రాంతి,వృద్ధియనెను గాంధిజీయె
      వారి కలలు పండ వైభవంబుగ సాగి
      నడచుకొనుట యదియె నాదుపాత్ర.2.

      కవితనాయుధముగ కమ్మని సాహితిన్
      మనముపులకరింప మహితగతిని
      మార్చివేసి జనుల మనుగడ దెల్పుచు
      నడచుకొనుట యదియె నాదుపాత్ర.3.

       స్వార్థపరత సతము చంపును వృద్ధిని
       దేశప్రగతికదియ నాశనమ్ము
       త్యాగబుద్ధి కలుగు తత్వంబు నెలకొల్పి
       నడచుకొనుట యదియె నాదుపాత్ర.4.

       దేశవృద్ధి కొఱకు ధీరత్వమున్నట్టి
       యువత శక్తి యుక్తు లవసరంబు
       అట్టిస్ఫూర్తి బెంచి యంతరంగములందు
       నడచుకొనుట యదియె నాదుపాత్ర.5.

        పొదుపుచేయుచున్న పూర్ణఫలముగల్గు
        అందుముఖ్యమౌను నర్ధమెపుడు
        సర్వ గౌరవాలు సంపదందెయనుచు
        నడచుకొనుటయదియె నాదుపాత్ర.6.

         దేశభక్తి యొకటె దివ్యంపువృద్ధిని 
         కలుగజేయు ననిన కల్లగాదు
         యువతమనమనందు నుత్తేజముంబెంచి
         నడచుకొనుప యదయె నాదుపాత్ర.7.
       
      సమస్య:  కవియొకడు కానరాడు కర్నాటమునన్.
                   నా ప్రయత్నము. పొన్నెకంటి.
          నవరసభావాలంకృత
          కవనంబదెవారి సొత్తు కమనీయముగా
          అవిరళ సాహతి నెఱుగని
          కవియొక్కడు కానరాడు కర్నాటమునన్.

          కవన వనమంత కస్తురి
          నవసౌగంధ్యమ్ములెల్ల నాణ్యతజూపున్
          నవరస విహీన జడుడౌ
          కవియొకడును కానరాడు కర్నాటమునన్.
                     మీ పొన్నెకంటి.

          

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...